తొమ్మిదవ అధ్యాయం

మక్కా విజయం

మానవ మహోపకారి (స) · మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి

హి.శ ఆరవ యేట ముస్లింలు-ఖురైషులు కుదుర్చుకున్న హుదైబియా ఒప్పందంలోని ఒక షరతు ప్రకారం ఇరుపక్షాలవారు పది సంవత్సరాల వరకు పరస్పరం దాడికి దిగకూడదు. ఇరుపక్షాల వాళ్ళు తమకిష్టమొచ్చిన తెగతో సంబంధాలు పెట్టుకోవచ్చు.

దాని ప్రకారం బనూ ఖుజాఆ తెగవారు దైవప్రవక్త (సల్లం) తరపున చేరారు. బనూ బక్ర్ తెగవారు ఖురైషులతో చేతులు కలిపారు. ఒప్పందం జరిగి రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే బనూబక్ర్ తెగ బనూఖుజాఆ తెగపై దాడిచేసింది. ఈ దాడి వెనుక ఖురైషుల హస్తం ఉంది. వారే దాడిచేయమని బనూబక్ర్ తెగకు ఆయుధాలు సరఫరా చేశారు. అబూజహల్ కొడుకు ఇక్రిమా, ఒప్పంద పత్రంపై సంతకం చేసిన సుహైల్ బిన్ అమ్ర్, ప్రముఖ ఖురైష్ సర్దారు సఫ్వాన్ బిన్ ఉమయ్యా లాంటివాళ్ళు తెరవెనుక ఉండి తమ అనుంగు అనుచరుల చేత ఈ దాడి చేయించారు.

నిస్సహాయులైన బనూఖుజాఆ తెగవారు తమను హింసించవద్దని ప్రాధేయపడ్డారు. ఆఖరికి పవిత్ర కాబాగృహంలోకి వెళ్ళి దాక్కున్నారు. కాని ఖురైషులు వారిని ఎక్కడా వదల్లేదు. దొరికిన వారిని దొరికిన చోటల్లా నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపారు. బనూఖుజాఆ బాధితులు “దైవం కోసం మమ్మల్ని వదలిపెట్టండి” అని ప్రాధేయపడ్డారు. దానికి సమాధానంగా ఆ దుర్మార్గులు ‘ఈ రోజు దేవుడన్న మాటే లేదు’ అంటూ మరింత హింసకు పాల్పడేవారు.1

ఆ దుర్మార్గుల హింసా దౌర్జన్యాల నుండి బ్రతికి బయటపడిన నలభైమంది మక్కానుండి పారిపోయి మదీనాకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి తమపై జరిగిన అత్యాచారం గురించి దైవప్రవక్త సన్నిధిలో మొరపెట్టుకున్నారు. అమ్ర్ బిన్ సాలిమ్ ఖుజాయీ అనే ఆయన దుర్మార్గులు తమపై జరిపిన అత్యాచారాలను ఆవేదనాభరితమైన గేయరూపంలో పూసగ్రుచ్చినట్లు వివరించారు. ఆ గేయ అనువాదం ఇలా ఉంటుంది:

“దైవప్రవక్తా! ఖురైషులు ప్రమాణభంగానికి పాల్పడ్డారు. వారు మీతో చేసిన పటిష్టమైన ఒప్పందాన్ని భగ్నం చేసేశారు. ‘కదా’ ప్రాంతంలో దారుణ మారణకాండను సృష్టించారు. మాకు సహాయం చేసేవారెవ్వరూ లేరని, మమ్మల్ని నీచులుగా, అల్పసంఖ్యాకులుగా భావించి మాపై దాడిచేశారు. మేము రాత్రిపూట పడుకున్నప్పుడు, నమాజ్ స్థితిలో రుకూ, సజ్దాల్లో ఉన్నప్పుడు పట్టుకొని ఊచకోత మొదలుపెట్టారు”.

ఒప్పంద గౌరవాన్ని కాపాడటానికి, బాధితవర్గ రక్షణకోసం భవిష్యత్తులో మిత్రవర్గాల భద్రత దృష్ట్యా దైవప్రవక్త (సల్లం) వెంటనే మక్కాకు ప్రయాణమయ్యారు. ఆయన వెంట పదివేల సైన్యం బయలుదేరింది.2 కొంతదూరం వెళ్ళగానే దారిలో ఆయనకు అబూసుఫ్యాన్ బిన్ హారిస్, అబ్దుల్లాహ్ బిన్ అబూ ఉమయ్యాలు దొరికారు.

వీళ్ళు దైవప్రవక్త (సల్లం)ను నానా రకాలుగా హింసించిన వాళ్ళు. సదా ఇస్లాంను తుడిచిపెట్టడానికి కృషిచేస్తుండినవాళ్ళు. వారిని చూడగానే దైవప్రవక్త (సల్లం) అసహ్యంతో మొహం త్రిప్పుకున్నారు. ఆ సమయంలో విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సలమా వారిపై దయతలచి దైవప్రవక్త (సల్లం)కు సిఫారసు చేయసాగారు.

“దైవప్రవక్తా! అబూసుఫ్యాన్ మీ సొంత బాబాయి కొడుకు. అబ్దుల్లాహ్ మీ మేనత్త ఆతికా కొడుకు. అంత దగ్గరి బంధువుల్ని క్షమించకపోవటం భావ్యం కాదు” అన్నారు.3

ఆ తర్వాత హజ్రత్ అలీ వారిద్దరికీ ఒక ఉపాయాన్ని సూచిస్తూ యూసుఫ్ ప్రవక్త సోదరులు యూసుఫ్‌ను క్షమించమని కోరిన విధంగా వీళ్లు దైవప్రవక్త (సల్లం)ను క్షమాభిక్ష పెట్టమని కోరితే ఆయన తప్పకుండా క్షమిస్తారని చెప్పారు.

అప్పుడు వారిరువురు దైవప్రవక్త (సల్లం) దగ్గరికివెళ్ళి దివ్యఖురాన్‌లోని ఈ సూక్తి పఠించారు.

“అల్లాహ్ తోడు! అల్లాహ్ మాకంటే మీకు ఎక్కువ ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మేము నిజంగానే దోషులం.”

దానికి సమాధానంగా దైవప్రవక్త (సల్లం) ఈ సూక్తి పఠించారు.

“ఈ రోజు మిమ్మల్ని నిందించటం జరగదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక. ఆయన అందరికంటే అధికంగా కరుణించేవాడు.”4

ఆ సమయంలో అబూసుఫ్యాన్ బిన్ హారిస్ తీవ్రభావోద్రేకాలకు లోనయి ఒక కవిత పఠించారు. దాని అనువాదం ఇలా ఉంటుంది.

“ఒకప్పుడు నేను లాత్ విగ్రహసైన్యం ముహమ్మద్ సైన్యంపై ఆధిక్యతను సాధించాలన్న ఉద్దేశ్యంతో యుద్ధపతాకం ఎత్తేవాణ్ణి. అప్పుడు నేను చీకటిలో ఎదురు దెబ్బలు తినే ముళ్ళపందిలా వ్యవహరించాను. కాని ఇప్పుడు నాకు సన్మార్గంపై నడిచే భాగ్యం లభించింది. నాకు నా మనసు కాదు. సన్మార్గాన్ని ప్రసాదించేవాడే సన్మార్గం చూపించాడు! నేను ధిక్కరించి, తృణీకరించిన వాడే నాకు దైవమార్గం చూపించాడు.”

దానికి దైవప్రవక్త (సల్లం), “ఔను మీరు నన్ను ఎల్లప్పుడూ తృణీకరిస్తూనే వచ్చారు” అని అన్నారు.5

దైవప్రవక్త (సల్లం) మక్కావాసులకు తమరాక గురించి తెలియకుండా ఉండాలని భావించారు. అలాగే జరిగింది! దైవప్రవక్త (సల్లం) మక్కా పొలిమేరలకు చేరుకొనే వరకు ఈ విషయం మక్కావారికి తెలియలేదు. అక్కడ గుడారాలు ఏర్పాటుచేసుకొని అగ్ని గుండాలను రగిలించమని దైవప్రవక్త (సల్లం) సహచరుల్ని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం అగ్ని గుండాల్ని రగిలించటం జరిగింది. అదే సమయంలో అబూసుఫ్యాన్ బిన్ హర్బ్ మక్కా పరిస్థితుల్ని బేరీజు వేసుకునే ఉద్దేశ్యంతో అటుగా వచ్చారు. అక్కడ మోహరించబడిఉన్న సైన్యాన్ని చూసి భయకంపితులవుతూ అప్రయత్నంగానే అంతటి వైభవోపేతమైన సైన్యం, అంతటి వెలుగు తను అంతకుముందెన్నడూ చూడలేదన్నాడు.

హజ్రత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అంతకుముందే మదీనాకు వలసవెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ సైన్యంలో తను కూడా ఉన్నారు. అబూసుఫ్యాన్ గొంతుని పసిగట్టి ఆయన్ని దగ్గరికి లాక్కొని, ‘చూడు, దైవప్రవక్త (సల్లం) ఇక్కడే ఉన్నారు. రేపు ఖురైషుల స్థితి ఎంతో దయనీయంగా ఉండబోతోంది. కనుక నువ్వు ఇప్పుడే ముస్లిం అయిపో’ అన్నారు. ఇతర ముస్లింలెవరయినా అబూసుఫ్యాన్‌ను వదలిపెట్టరు. అందుకని ఆయన్ని తన కటారు సాయంతో కాపాడుతూ దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని వెళ్ళారు. దైవప్రవక్త (సల్లం) అబూసుఫ్యాన్‌ని చూడగానే, “అబూ సుఫ్యాన్ నీకు మేలు జరుగుగాక! దేవుడు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని విశ్వసించే సమయం నీకింకా ఆసన్నం కాలేదా?” అన్నారు.

దానికి జవాబుగా అబూసుఫ్యాన్. “దైవప్రవక్తా! నా తల్లిదండ్రుల్ని మీకోసం అర్పింతునుగాక! మీరు దయార్ద్ర హృదయులు! విశాల హృదయులు! ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరించటంలో ఎవరూ మిమ్మల్ని మించిపోలేరు. దేవుడు తప్ప మరొక ఆరాధ్య దైవమే ఉండి ఉంటే నాకీ గతి పట్టి ఉండేదికాదు” అన్నారు ఎంతో పశ్చాత్తాపభావంతో.

“అబూ సుఫ్యాన్! దేవుడు నీకు సద్బుద్ధినొసగుగాక! నేను దైవప్రవక్తనని విశ్వసించే సమయం నీకింకా ఆసన్నం కాలేదా?” దైవప్రవక్త (సల్లం) మళ్ళీ అడిగారు.

“దైవప్రవక్తా! నా తల్లిదండ్రుల్ని మీకై అర్పింతునుగాక! మీరు ఎంతో దయార్ద్ర హృదయులు! విశాల హృదయులు! ప్రజలపట్ల ఉత్తమంగా వ్యవహరించటంలో మిమ్మల్ని మించినవారెవరూ ఉండరు. ఇకపోతే మీరడిగిన విషయంలో మాత్రం నాకింకా కొంచెం సందేహంగానే ఉంది” అని చెప్పారు అబూసుఫ్యాన్.

అబూసుఫ్యాన్ మాటవిని అబ్బాస్ మండిపడుతూ, “మహానుభావా! ముస్లింల ఖడ్గాలు నీ తలను వేరుచేయకముందే ఇస్లాం స్వీకరించు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లం) దైవప్రవక్త అని విశ్వసించు” అంటూ ఆయన్ని గదిమారు.

అప్పుడు అబూసుఫ్యాన్ కూడా విశ్వసించి ముస్లింలలో చేరిపోయారు.6

అందరికీ క్షమాభిక్ష

ఆ రోజు దైవప్రవక్త (సల్లం)గారి మృదుత్వం, మన్నింపుల వైఖరి మునుపెన్నడూ లేని విధంగా విస్తృతమయిపోయింది. బహుశా జీవితం పట్ల విరక్తి చెంది శాంతి సౌమనస్యాలను తృణీకరించిన దౌర్భాగ్యుడే ఆ రోజు ముస్లింల ఖడ్గాలకు బలి అయి ఉంటాడు. సైన్యసమేతంగా మక్కాలోకి ప్రవేశించగానే దైవప్రవక్త (సల్లం) అబూసుఫ్యాన్ ఇంట్లో దాక్కున్న వారికి, ఇండ్లలోనే ఉండి తలుపులు మూసుకున్నవారికి, కాబాగృహంలో శరణుజొచ్చినవారికి ముస్లిం సేనల వల్ల ఎలాంటి హాని జరగదని అభయమిచ్చారు. తమ దారికి అడ్డొచ్చిన వారిపై, తమకు ఆటంకం కలిగించేవారిపై మాత్రమే చెయ్యెత్తాలని, మక్కావాసుల ఆస్తులకు ఎలాంటి హాని తలపెట్టకూడదని, నిష్కారణంగా ఎవరినీ హతమార్చరాదని దైవప్రవక్త (సల్లం) తన సైన్యానికి ఉపదేశించారు.7

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) అబ్బాస్‌తో అబూసుఫ్యాన్‌ను తీసుకెళ్ళి ముస్లిం సేనావాహిని దర్శనం చేయించమని చెప్పారు. ముస్లిం సేనలు ఎగిసిపడుతున్న సముద్రకెరటాల్లాగా విజయానందాలతో కదం తొక్కుతూ ముందుకు వెళుతున్నారు. పలు తెగలు పలురకాల జెండాలు పట్టుకొని ఉన్నాయి. ఒకటి తర్వాత మరొకటి వివిధ తెగలు తమ ముందు నుంచి నడచివెళ్తుంటే అబూసుఫ్యాన్ అబ్బాస్‌తో ఆ తెగలపేర్లు అడిగి తెలుసుకునేవారు. ఆయన పేరు చెప్పగానే ఆ తెగలతో తనకెలాంటి సంబంధం లేదని అనేవారు.8

ఆ తర్వాత స్వయంగా దైవప్రవక్త (సల్లం) నిండుగా ఆయుధాలు ధరించివున్న ఒకసైనికదళంతో పాటు వారి ముందు నుంచి వెళ్ళారు. ఆ సైనిక దళం పచ్చరంగు దుస్తుల్లో కళ్ళు మాత్రమే కనపడే విధంగా ముసుగులు ధరించి ఉంది. వారిని చూసి అబూసుఫ్యాన్ అబ్బాస్‌తో ఆ సైనికపటాలం ఎవరిదని అడిగారు. దానికి అబ్బాస్, “అది దైవప్రవక్త (సల్లం) రక్షక దళం. ఆయన చుట్టూ ఉన్నది ముహాజిర్, అన్సార్ అనుచరులు” అని చెప్పారు. ఆ మాట వినగానే అబూసుఫ్యాన్ గుండె గతుక్కుమన్నది. ఆయన మనసు ఇస్లాం ఔన్నత్యాన్ని గుర్తించింది. అప్రయత్నంగానే ఆయన నోటి వెంట. “దైవసాక్షి! వీరిలో ఎవరికీ ఇంతకుముందు ఇంతటి శక్తిసామర్థ్యాలు, ఇంతటి వైభవం ఉండేదికాదు. అబ్బాస్! నీ సోదరకుమారుడు ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడయ్యా!” అన్న మాటలు వెలువడ్డాయి.

దానికి అబ్బాస్, “అబూ సుఫ్యాన్ ఇది దైవదౌత్యపు మహిమ” అని అన్నారు.

ఆ తర్వాత అబూసుఫ్యాన్, ఎలుగెత్తి, “ఖురైషులారా! ఈ రోజు ముహమ్మద్ (సల్లం) మీరు ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనంతటి సైన్యంతో, శక్తిసామర్థ్యాలతో వచ్చారు. కాబట్టి మీరు లొంగిపోవటమే మంచిది. నా ఇంటికొచ్చినవారికి శరణులభిస్తుంది” అని ప్రకటించారు.

ఆ ప్రకటన విని ప్రజలు ఆశ్చర్యపోయారు. జనుల్లో గుసగుసలు మొదలయ్యాయి. కొందరు, “నీ ఇల్లు పాడుగాను! నువ్వు నిన్నటిదాకా ముహమ్మద్‌ను హింసించావు. అలాంటిది, ఈ రోజు నీ ఇంటికొస్తే మాకు శరణు లభిస్తుందా?” అన్నారు.

అబూసుఫ్యాన్ మళ్ళీ ప్రకటించారు. “తమ ఇండ్లల్లోనే ఉండి తలుపులు మూసుకున్నవారికి శరణు లభిస్తుంది. కాబాగృహంలో శరణు జొచ్చిన వారికి కూడా శరణు లభిస్తుంది.”

ప్రజలు చెల్లాచెదరయిపోయారు. కొంతమంది తమ ఇళ్ళల్లోనే ఉండి తలుపులు వేసుకున్నారు. మరికొంతమంది కాబాగృహంలో శరణు తీసుకున్నారు.9

యావత్తు మక్కానగరం తన పాదాక్రాంతమయిన తరువాత కూడా దైవప్రవక్త (సల్లం) అత్యంత నమ్రతతో, అణకువతో శిరస్సు వంచుకొని నగరంలోకి ప్రవేశించారు. చుబుకం ఒంటె అంబారీకి తగిలేటంత క్రిందికి వంగి పోయారు దైవప్రవక్త (సల్లం)10, ఆ సమయంలో ఆయన దివ్యఖురాన్‌లోని ‘ఫత్‌హ్’ సూరా పారాయణం చేస్తూ నగరంలోకి ప్రవేశించారు.11

మక్కా నగరం యావత్తు అరబ్బు ద్వీపానికి ఆధ్యాత్మిక, రాజకీయ కేంద్రం. అటువంటి మహానగరాన్ని జయించినప్పుడు కూడా దైవప్రవక్త (సల్లం) అడుగడుగునా నిరుపమాన వినయవినమ్రతల్ని ప్రదర్శించారు. ఈ లోకంలో సత్యం సమానత్వాలకు ఆయువుపట్టు అయిన ధర్మం ఇస్లాం ఒక్కటేనని క్రియాత్మకంగా నిరూపించారు. తనచేత స్వేచ్ఛ నొసగబడిన ఒక బానిస కుమారుణ్ణి తన వెంట ఒంటెమీద కూర్చోబెట్టుకున్నారు. మరి చూడబోతే ఖురైష్, బనూ హాషిం తెగలకు చెందిన అతిరథ, మహారథులు కూడా ఆ సమయంలో ఆయన వెంట ఉన్నారు. కాని వారిలో ఎవ్వరికీ ఆ భాగ్యం లభించలేదు.12

మక్కా విజయం నాడు ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)తో భయంతో వణుకుతూ మాట్లాడసాగాడు. ఆయన అతనికి ధైర్యం చెబుతూ, “భయపడుతున్నావెందుకు? నిబ్బరంగా మాట్లాడు. నేను రాజునేమీ కాను. నేను ఎండుమాంసపు ముక్కలు తిని బ్రతికిన ఓ సామాన్య ఖురైష్ తల్లి కుమారుణ్ణి మాత్రమే” అని అన్నారు.13

కక్ష, కార్పణ్యాల రోజుకాదు, కరుణాకటాక్షాల దినం

అన్సార్ల సైనికదళానికి అధిపతిగా ఉన్న సాద్ బిన్ ఉబాదా అబూసుఫ్యాన్ ముందు నుంచి వెళ్తూ “ఈ రోజు నెత్తురు ప్రవహించే రోజు. ఇవాళ కాబా గృహంలో ఏం చేసినా ధర్మసమ్మతమే. దేవుడు ఖురైషులను ఈ రోజు పరాభవం పాలు చేశాడు” అంటూ అబూ సుఫ్యాన్‌ను రెచ్చగొడుతూ మాట్లాడారు.

కాసేపటికి దైవప్రవక్త (సల్లం) ఓ చిన్న సైనికదళంతోపాటు అటుగా వెళుతున్నారు. అప్పుడు అబూసుఫ్యాన్ ఆయన దగ్గరికి సాద్ బిన్ ఉబాదా గురించి ఫిర్యాదు చేస్తూ, “దైవప్రవక్తా! సాద్ ఏమన్నాడో మీరు విన్నారా?” అని అడిగారు.

‘ఏమన్నాడు?’ ఆయనేమన్నాడో తను వినలేదని దైవప్రవక్త (సల్లం) చెప్పారు.

సాద్ ఖురైషుల్ని రెచ్చగొడుతూ మాట్లాడిన సంగతిని అబూసుఫ్యాన్ దైవప్రవక్త (సల్లం)కు తెలియపరచారు. ఆయన సాద్ అన్న మాటకు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలపంకిస్తూ, “కాదు, ఈ రోజు కారుణ్యం కురిసేరోజు. ఈ రోజు దేవుడు ఖురైషులకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు. కాబా గృహ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తాడు” అని ఎలుగెత్తి ప్రకటించారు.

ఆ తర్వాత ఆయన సాద్ బిన్ ఉబాదాను పిలిపించారు. ఆయన దగ్గర్నుంచి యుద్ధపతాకం వాపసు తీసుకొని ఆయన కుమారుడైన ఖైస్‌కు దాన్ని ప్రదానం చేశారు.14 దైవప్రవక్త (సల్లం) తన దగ్గర్నుంచి యుద్ధపతాకం లాక్కున్నారని సాద్ నిరాశానిస్పృహలకు లోనుకాకుండా ఉండాలనే ఆయన అలా చేశారు.

ఒకవైపు సాద్‌బిన్ ఉబాదా “ఈ రోజు నెత్తురు ప్రవహించే రోజు” అంటూ రెచ్చగొట్టే నినాదాలతో ఖురైషుల గుండెల్ని గాయపరిస్తే మరోవైపు దైవప్రవక్త (సల్లం), “ఈ రోజు కారుణ్యం కురిసే రోజు” లాంటి ప్రకటనలతో ఖురైషుల హృదయాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఒకవైపు అబూసుఫ్యాన్‌ను ఊరించటంతోపాటు మరోవైపు సాద్‌బిన్ ఉబాదా నిరాశా నిస్పృహలకు లోనుగాకుండా జాగ్రత్తపడ్డారు. సాద్‌ను తగిన విధంగా శిక్షించకపోతే క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన అబూసుఫ్యాన్ మనస్సు శాంతించదు. మరోవైపు సాద్ నుండి యుద్ధపతాకాన్ని లాక్కొని ఆయన్ని పదవీచ్యుతుణ్ణి చేస్తే అప్పటివరకు ఇస్లాం కోసం ఆయన చేసిన సేవల్ని ఉపేక్షించినట్లవుతుంది. దాని వల్ల ఆయన నిరాశానిస్పృహలకు, లోనుకావచ్చు. ‘తినమంటె కప్పకు కోపం, వదలమంటె పాముకు కోపం’ అన్నట్టు తయారయింది సమస్య. అలాంటి సున్నిత పరిస్థితిలో దైవప్రవక్త (సల్లం) యుద్ధపతాకాన్ని సాద్ కుమారుడయిన ఖైస్‌కు ఇప్పించి ఇరువర్గాలూ శాంతించేటట్లు ఎంతో చాకచక్యంగా సమస్యను అధిగమించారు. ఈసంఘటన ఆయన అసామాన్య విజ్ఞతా వివేచనలకు, దైవదౌత్యపదవికే ప్రబల నిదర్శనం.

చెదురుమదురు సంఘటనలు

ఆ సందర్భంగా సఫ్‌వాన్ బిన్ ఉమయ్యా. ఇక్రిమా, సుహైల్ బిన్ అమ్ర్ ఇంకా కొంతమంది ఖురైషులు తిరుగుబాటు చేయటంతో వారికీ, ఖాలిద్ బిన్ వలీద్ సహచరులకు మధ్య స్వల్పంగా ఘర్షణలు జరిగాయి. ఆ పొట్లాటల్లో దాదాపు డజనుమంది బహుదైవారాధకులు వధించబడ్డారు. ఆ తర్వాత వారే స్వయంగా ఓటమిని అంగీకరించారు.15 దైవప్రవక్త (సల్లం) మక్కాలోకి ప్రవేశించినప్పుడు తమపై తిరుగుబాటు చేసినవారిపైనే చెయ్యెత్తాలని ముస్లిం సైన్యాధిపతులకు హితోపదేశం చేశారు. అందుకని ఆ చెదురుమదురు కోట్లాటల తర్వాత నగరమంతా ప్రశాంత వాతావరణం నెలకొంది.

కాబాగృహం నుండి విగ్రహాల ప్రక్షాళన

నగరమంతా ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత దైవప్రవక్త (సల్లం) కాబా గృహంవైపు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి కాబాగృహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ సమయంలో ఆయన చేతిలో ఒక ధనస్సు ఉంది. కాబాగృహం లోపల మూడొందల అరవై విగ్రహాలుండేవి. దైవప్రవక్త (సల్లం) తనచేతిలోని వింటితో విగ్రహాలను తొలగిస్తూ దివ్యఖురాన్‌లోని ఈ సూక్తిని పఠించసాగారు.

విగ్రహాలన్నీ ఒక్కొక్కటీ కూలిపోసాగాయి.

కాబా గృహంలో కొన్ని చిత్రాలు, పటాలు కూడా ఉండేవి. దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞతో వాటిని కూడా తొలగించటం జరిగింది.16

కాబా గృహం తాళం చెవులు ఉస్మాన్ బిన్ తల్హా దగ్గరుండేవి. దైవగృహ ప్రదక్షిణలు చేసిన తర్వాత దైవప్రవక్త (సల్లం) ఆయన్ని పిలిపించి కాబా గృహ తలుపులు తెరవమని ఆదేశించారు.17 కాని ఆయన తలుపులు తెరవటానికి నిరాకరించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఉస్మాన్ బిన్ తల్హాను హెచ్చరిస్తూ, “మంచిది! చూసుకో, ఏదో ఒకరోజు ఆ తాళంచెవులు నా దగ్గరికొస్తాయి. అప్పుడు నేను వాటిని నాకిష్టమయిన వాళ్ళకి ఇచ్చుకుంటాను” అన్నారు.

దానికి ఉస్మాన్ పౌరుషం వెలిబుచ్చుతూ, “అప్పటికి ఖురైషు పురుషులందరూ అవమానం పాలై నాశనమయిపోతారా?” అన్నారు.

దానికి దైవప్రవక్త (సల్లం) ఎంతో నిదానంగా సమాధానమిస్తూ, “లేదు, మరింత గౌరవ మర్యాదలతో జీవిస్తుంటారు” అన్నారు.18

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఆయన దగ్గర్నుంచి తాళం చెవులు తీసుకొని కాబా గృహ ద్వారం తెరిచారు. లోపలికి వెళ్ళి దైవ గృహ మూలలన్నీ మార్మోగేలా “అల్లాహు అక్బర్” గీతాల్ని ఆలాపించారు. కృతజ్ఞతా పూర్వకంగా నమాజ్ చేశారు. కడు వినయ వినమ్రతలతో, తమ నిస్సహాయతను, దీనత్వాన్ని వ్యక్తపరుస్తూ నొసలు నేలకు ఆన్చి పరమప్రభువు సన్నిధిలో సాష్టాంగపడ్డారు.19

మానవులందరికోసం కారుణ్యమూర్తిగా ఈ లోకానికి పంపబడిన దైవప్రవక్త దైవారాధన ముగించుకొని కాబాగృహం నుండి బయటికి రాగానే ఆయన బాబాయి అయిన అబ్బాస్ కాబాగృహం తాళం చెవులు బనూహాషిం తెగవారికి ఇవ్వమని కోరారు.20

కాని దైవప్రవక్త (సల్లం) “ఈ రోజు ఉపకారభావంతో వ్యవహరించే రోజు. మాటను నిలబెట్టుకునే రోజు” అంటూ ఉస్మాన్ బిన్ తల్హాను పిలిచి తాళం చెవులు ఆయనకే అప్పగించారు. పైగా “ఈయన దగ్గర్నుంచి తాళం చెవులు లాక్కునేవాడు దుర్మార్గుడు” అన్నారు.21

ఆ కాలంలో అరబ్ దేశంలో ఒకరు ఇంకొకర్ని హత్యచేస్తే దానికి ప్రతీకారం తీర్చుకోవటాన్ని వంశబాధ్యతగా తలపోసేవారు. సమయానికి ఆ హంతకుడు చేతికి చిక్కకుండా పారిపోయినా అతని పేరును తమ వంశ జాబితాలో నమోదు చేసుకునేవారు. నూరేళ్ళు గడిచిన తర్వాత అయినా సరే హంతకుడిపై పగ తీర్చుకునేవారు. ఒకవేళ హంతకుడు చనిపోతే అతని కుటుంబం లేదా వంశానికి చెందినవారిలో ఎవరినయినా ప్రతీకారంగా హత్యచేసేవారు. అదే విధంగా తాత హత్యచేస్తే రక్తపరిహారం ఇవ్వమని తండ్రిని డిమాండ్ చేసేవారు. ఆ విధంగా ప్రతీకారం తీర్చుకోవటాన్ని అరబ్బులు గొప్పగా భావించేవారు. అలాంటివి ఎన్నో దురాచారాలు, దుష్టపోకడలు అరబ్ దేశంలో ఉండేవి. ఇస్లాం ధర్మం అలాంటి దుష్టపోకడల్ని రూపుమాపటానికే వచ్చింది. అంచేత అజ్ఞానకాలపు ప్రతీకార పోకడలు, దుష్టాచారాలను ప్రస్తావిస్తూ దైవప్రవక్త (సల్లం) “వాటినన్నిటినీ నేను నా కాళ్ళతో తొక్కి నలిపేశాను” అన్నారు.22

అరబ్బు దేశాల్లోనేకాక ప్రపంచంలోని ఇతర దేశాల్లోకూడా జాతి, కులం, వర్గం, వర్ణాల ప్రాతిపదికపై మానవుల మధ్య కులీనులు కులహీనులున్న భేదభావం ఏర్పడింది. ఉదాహరణకు భారతదేశంలో వర్ణవ్యవస్థ అమల్లో ఉండేది. ఆ వ్యవస్థలో శూద్ర వర్గాన్ని పశువుల కన్నా హీనంగా చూశారు. సంఘంలో వారు పైకి రాకుండా త్రొక్కిపెట్టారు.

అటువంటి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మం ప్రపంచానికి సమానత్వం, సౌభ్రాతృత్వ భావాలను నేర్పి మహోపకారం చేసింది. అరబ్బు-అరబ్బేతరుడు, కులీనుడు -కులహీనుడు అనే అడ్డుగీతల్ని తుడిచేసింది. సృష్టి ధర్మం రీత్యా ప్రతి మానవుడూ ఈ లోకంలో అత్యున్నత ప్రగతి శిఖరాలను అధిరోహించగలడని ప్రబోధించింది. అందుకే ఆ సందర్భంగా దైవప్రవక్త (సల్లం) దానికి సంబంధించిన దివ్యఖురాన్ సూక్తిని ప్రజల ముందు పఠించి వివరిస్తూ “మీరందరూ ఆదం పుత్రులే. ఆదం మట్టితో పుట్టించబడ్డారు. కాబట్టి మీలో ఎవరికీ ఎవరిపైనా ప్రాధాన్యత లేదు” అన్నారు.23

ఉపన్యాసం తరువాత దైవప్రవక్త(సల్లం) ప్రజల వైపు తిరిగి చూశారు. ఆయన ముందు ఖురైష్ తలబిరుసులు సిగ్గుతో తలలు వంచుకొని నిలబడి ఉన్నారు. వారిలో నిత్యం ఇస్లాంను తుడిచి పెట్టటానికి ప్రయత్నించిన ధీరులున్నారు, దైవప్రవక్త (సల్లం)ను దూషించిన దుర్మార్గులున్నారు, దైవప్రవక్త (సల్లం)ను పరాభవించిన పాపాత్ములున్నారు. ఆయన నడిచే దారిలో ముళ్ళకంపలు పరిచిన వనితలూ ఉన్నారు. ఆయన ప్రజలకు హితబోధ చేయాలని వెళితే ఆయన పాదాలు రక్తసిక్తమయ్యేలా కొట్టి హింసించిన కఠినాత్ములూ ఉన్నారు, అదను దొరికితే దైవప్రవక్త నెత్తురు తాగాలని పరితపించిన పిశాచాలూ ఉన్నారు, చీటికి, మాటికి మదీనాపై దాడులు చేసి శాంతికి విఘాతం కలిగించిన అరాచకులూ ఉన్నారు, బలహీన ముస్లింలపై దారుణ మారణకాండను సృష్టించిన దుష్టులూ ఉన్నారు.

దైవప్రవక్త (సల్లం) వారందరి వైపు తీక్షణంగా చూస్తూ గంభీర స్వరంతో, “ఇప్పుడు మిమ్మల్ని నేనేం చేస్తానో తెలుసా?” అని గద్దించారు.

దైవప్రవక్త (సల్లం) సన్నిధిలో తలలు వంచుకొని నించున్న ఖురైషులు దుర్మార్గులే. మూర్ఖులే. కాని దైవప్రవక్త కారుణ్య స్వభావం గురించి తెలియని వారు మాత్రం కారు. అందుకే బిగ్గరగా విలపిస్తూ, “దైవప్రవక్తా! తమరు పెద్ద మనసున్న అన్నయ్య లాంటివారు, విశాల హృదయులైన భ్రాతృజుల్లాంటివారు” అన్నారు.

ఖురైషుల నుండి ఆ మాట వినగానే దైవప్రవక్త కారుణ్య స్వభావం కట్టలు త్రెంచుకుంది. ఆయన శుభ అధరాలు కదలాడాయి.

“ఈ రోజు మిమ్మల్ని నిందించటం జరగదు. పొండి, మీరందరూ స్వేచ్ఛాజీవులై బ్రతకవచ్చు”24 అన్నారు.

ఆ ప్రకటన వినగానే ఖురైషుల పాషాణ హృదయాలు మెత్తబడి అప్రయత్నంగానే ఇస్లాం వైపుకు మ్రొగ్గాయి. మక్కా నుండి వలసపోయిన ముస్లింల ఆస్తుల్ని అవిశ్వాసులు కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు అవిశ్వాసులు ముస్లింల ఆస్తుల్ని ముస్లింలకు వాపసు చేయవలసి వచ్చింది. కాని దైవప్రవక్త (సల్లం) పరోపకార భావంతో తమ ఆస్తుల్ని వదలుకోవాలని ముస్లింలను ఆదేశించారు.

అంతలో నమాజ్‌కు వేళ అయింది. బిలాల్ (రజి) కాబా కప్పుపైకెక్కి అజాన్ ఇవ్వసాగారు. ఒక నీగ్రోజాతి వ్యక్తి దైవగృహంపై నించొని అజాన్ ఇచ్చే దృశ్యాన్ని చూడగానే కొద్ది క్షణాల క్రితం మెత్తబడిన ఖురైషుల హృదయాల్లో మళ్ళీ జాత్యహంకారం పెల్లుబికింది. అత్తాబ్ బిన్ ఉసైద్ అవమాన భారంతో కృంగిపోతూ, “దేవుడు మా నాన్న గౌరవాన్ని కాపాడాడు. ఈ నీచుని గొంతు వినకుండా ముందే ఆయన్ని పైకి లేపుకున్నాడు” అని అన్నాడు. “ఇక మా బతుకులు బుగ్గిపాలే” అన్నాడు ఇంకో ఖురైష్ వ్యక్తి.25

దైవప్రవక్త (సల్లం) సఫా కొండప్రాంతంలో ఓ ఎత్తైన చోట ఆసీనులయ్యారు. ఇస్లాం స్వీకరించాలనుకున్నవారు అక్కడికి వచ్చి ఆయన చేతిమీద ప్రమాణం చేసేవారు. పురుషుల ప్రమాణ కార్యక్రమం ముగిసిన తర్వాత స్త్రీల వంతు వచ్చింది. స్త్రీల నుండి ఎలా ప్రమాణం తీసుకునేవారంటే-ముందుగా ఇస్లాం ధర్మాంశాలు, నైతికతను అనుసరించే విషయంలో వారి నుండి ప్రమాణం తీసుకునేవారు. ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఒక పాత్రనిండా నీళ్ళు తెప్పించి అందులో తన చెయ్యి ముంచి తీసేవారు. ఆ తర్వాత స్త్రీలు ఆ పాత్రలో తమ చేతులు ముంచేవారు. ఆ విధంగా వారి ప్రమాణం పూర్తయిపోయినట్లుగా భావించటం జరిగేది.26

పదిమంది ఖురైష్ అతిరథులు యావత్తు అరబ్బుదేశంలోనే ప్రముఖ నాయకులుగా పరిగణించబడేవారు. వారిలో ఒకరైన సఫ్‌వాన్ బిన్ ఉమయ్యా జెద్దాకు పారిపోయారు. ఉమైర్ బిన్ వహబ్ దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళి అరబ్బు నాయకుడంతటి వాడు మక్కా నుండి పారిపోయాడని చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆయన మక్కాకు తిరిగివస్తే రక్షణ కల్పిస్తానని మాటిచ్చారు. దానికి సూచనగా తన తలపాగాను కూడా ఇచ్చి పంపారు. ఉమైర్ జిద్దా వెళ్ళి సఫ్‌వాన్ బిన్ ఉమయ్యాను తిరిగి మక్కాకు తీసుకొని వచ్చారు. హునైన్ యుద్ధం వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు.27

అబ్దుల్లాహ్ బిన్ జుబీరా అనే ప్రముఖ అరబ్బు కవి మక్కా విజయానికి ముందు తన కవితల ద్వారా దైవప్రవక్త (సల్లం)ను తూలనాడేవాడు. దివ్యఖురాన్‌పై విమర్శనాస్త్రాలు సంధించేవాడు. కాని మక్కా విజయం జరిగినప్పుడు అతను భయపడి నజరాన్‌కు పారిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగొచ్చి ఇస్లాం స్వీకరించాడు.28

హారిస్ బిన్ హిషామ్ కూతురు ఉమ్మె హకీమ్ ఇక్రిమా భార్య. మక్కా విజయం నాడు ఆమె ఇస్లాం స్వీకరించింది. కాని ఆమె భర్త ఇక్రిమా మాత్రం ఇస్లాం స్వీకరించకుండా ఎమన్‌కు పారిపోయారు. అప్పుడు ఉమ్మె హకీమ్ స్వయంగా ఎమన్ వెళ్ళి తన భర్తను ఇస్లాం వైపుకు ఆహ్వానించారు. ఎట్టకేలకు ఆయన ఇస్లాం స్వీకరించి ముస్లిం అయ్యారు. ఆ తర్వాత దంపతులిరువురూ మక్కాకు తిరిగి వచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఆయన్ని చూడగానే పట్టరాని సంతోషంతో లేచి నిలబడ్డారు. వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నుండి ప్రమాణం తీసుకున్నారు. ఆ సమయంలో తన ఒంటిపై దుప్పటి లేదన్న సంగతి కూడా ఆయనకు గుర్తు రాలేదు.29

హజ్రత్ హమ్జాను వెన్నుపోటు పొడిచి చంపి ఆ తర్వాత ఆయన భౌతికకాయం పట్ల పశువులా ప్రవర్తించిన నీగ్రో బానిస వహ్‌షీకు కూడా ఆ రోజు క్షమాభిక్ష లభించింది.30

మక్కా విజయం తర్వాత రెండోరోజు దైవప్రవక్త (సల్లం) కాబాగృహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అదే సమయంలో పుజాలా బిన్ ఉమైర్ అదను చూసి దైవప్రవక్త (సల్లం)ను హత్య చేయాలని నిశ్చయించుకొని దగ్గరికి రాగానే దైవప్రవక్త (సల్లం) వెనక్కిమళ్ళి “పుజాలా వస్తున్నావా…?” అన్నారు.

“ఆ… వస్తున్నాను!” పుజాలాకు తనేం సమాధానం చెప్పాడో తనకే అర్థం కాలేదు.

“ఇందాక నువ్వు మనసులో ఏమని నిర్ణయం చేసుకున్నావు?” దైవప్రవక్త (సల్లం) సూటిగా అడిగారు.

“అబ్బే… ఏం నిర్ణయం చేసుకున్నాను. నేను ఇందాకట్నుంచి అల్లాహ్ అల్లాహ్ అంటూ జపం చేసుకుంటున్నాను” తడుముకుంటూనే సమాధానం చెప్పారు పుజాలా.

దానికి దైవప్రవక్త (సల్లం) దరహాసం చిందిస్తూ, “సరే, నువ్వు మనసులోనే మన్నించమని దేవుణ్ణి వేడుకో” అని ఆయన రొమ్ము భాగంపై తన చెయ్యి ఉంచారు.

పుజాలా ఇలా అంటున్నారు. దైవప్రవక్త (సల్లం) నా ఛాతీపై చెయ్యి ఉంచగానే నా హృదయం నెమ్మదించింది. నాలో దైవప్రవక్త మీద విపరీతమైన ప్రేమాభిమానాలు పుట్టాయి. అప్పట్నుంచి ఆయన నాకు అందరికన్నా ప్రియతములై పోయారు.

నేను అక్కణ్ణుంచి ఇంటికి బయలుదేరాను. దారిలో నా ప్రియురాలు కనిపించింది. నేను రోజూ ఆమె దగ్గర కూర్చొని కాలక్షేపం చేసేవాణ్ణి. ఆమె నన్ను చూడగానే, “పుజాలా! ఒక మాట చెబుతాను ఇట్రా” అంది. నేనందుకు నిరాకరిస్తూ, “దేవుడు, దైవప్రవక్త అలాంటి మాటల నుండి వారిస్తున్నారు” అని అన్నాను.31

ఫుట్‌నోట్‌లు

  1. 1సీరత్ ఇబ్నె హిషామ్ రెండోసంపుటి 390వ పుట. తారీఖె తబ్రీ రెండో సంపుటి 153వ పుట.
  2. 2సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  3. 3సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 400వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 46వ పుట.
  4. 4జాదుల్ మఆద్ మూడో సంపుటి 400వ పుట.
  5. 5సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 401వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 46వ పుట.
  6. 6సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 402, 403 పుటలు. జాదుల్ మఆద్ మూడో సంపుటి 398,401,402వ పుటలు.
  7. 7జాదుల్ మఆద్ మూడో సంపుటి 403 వ పుట.
  8. 8సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  9. 9సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 404, 405 పుటలు. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
  10. 10సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 405వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 50వ పుట.
  11. 11సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  12. 12సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  13. 13ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 50వ పుట.
  14. 14సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  15. 15సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 408వ పుట.
  16. 16సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  17. 17సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  18. 18తబఖాత్ ఇబ్నె సాద్ రెండో సంపుటి 136, 137 పుటల.
  19. 19రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 119 120 పుటలు.
  20. 20హదాయిఖుల్ అన్వార్ గ్రంథం రెండో సంపుటి 673వ పుట.
  21. 21సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 412వ పుట.
  22. 22సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 412వ పుట, సుననె అబూదావూద్‌లోని రక్తపరిహారాల ప్రకరణం.
  23. 23సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 412వ పుట. సుననె అబూదావూద్‌లోని రక్తపరిహారాల ప్రకరణం.
  24. 24సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 412వ పుట. ముస్నదె అహ్మద్‌లోని ఐదో సంపుటి 135వ పుట.
  25. 25సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 413వ పుట.
  26. 26రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 120, 121 పుటలు.
  27. 27సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 417, 418వ పుటలు.
  28. 28సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 418, 419 పుటలు. దలాయిలున్నుబువ్వా గ్రంథం 99వ పుట.
  29. 29బైహఖీగారి దలాయిలున్నుబువ్వా గ్రంథం ఐదవ సంపుటి 95వ పుట.
  30. 30రహ్మతుల్లిల్ ఆలమీన్ గ్రంథం మొదటి సంపుటి 122వ పుట.
  31. 31సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 417వ పుట.