పన్నెండవ అధ్యాయం
అంతిమ హజ్
దైవ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం సమంజసం. కాని ఇక్కడ కృతజ్ఞతల ప్రస్తావన రాలేదు. దైవస్తోత్రం చేయమనీ, క్షమాపణ కోసం వేడుకోమనీ ఉపదేశించబడింది. ఏమిటీ, ఈ ఉపదేశంలోని మర్మం?
ఈ విషయంపై ప్రవక్త ప్రియ సహచరుల మధ్య ఒకసారి తర్జన భర్జన జరిగింది. ఈ పలుకుల్లోని పరమార్థం ఏమిటి? అని హజ్రత్ ఉమర్ (రజి) అడిగారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆఖరికి అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) వైపు చూశారు హజ్రత్ ఉమర్ (రజి). ఈయన పిన్న వయస్కులు. అందుకే పెద్దల ముందు సమాధానం చెప్పడానికి మొహమాట పడ్డారు. ఎట్టకేలకు హజ్రత్ ఉమర్ (రజి) ప్రోద్బలంపై ఇలా అన్నారు: “ఇది దైవప్రవక్త (సఅసం) వారి మరణ కాలం సమీపించిందనటానికి సూచన. మరణానికి ముందు దైవ సన్నిధిలో మన్నింపుకై వేడుకోవటం అవసరం అన్నది ఈ పలుకుల్లోని ఆంతర్యం.”1
ఈ సూరా అవతరించినప్పుడే, తాను మహాప్రస్థానం చేయవలసిన సమయం సమీపిస్తోందని ఆయన(స)కు అర్థమై పోయింది. కాబట్టి లోకానికి షరీయతు సూత్రాలను చాటి చెప్పవలసిన, నైతిక నియమాలను విస్తృత స్థాయిలో అందరికీ సుస్పష్టం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. హిజ్రత్ చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా దైవప్రవక్త (స)కు హజ్ ధర్మాన్ని నిర్వర్తించే వీలు చిక్కలేదు.2
ఒక సుదీర్ఘ కాలం కురైషులను ప్రతిఘటించడానికే సరిపోయింది. హుదైబియా ఒప్పందం తరువాత హజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ సందేశ ప్రధానమైన కార్యక్రమాలలో తలమునకలై ఉండటం వల్ల హజ్ కోసం బయలు దేరలేకపోయారు.
మొత్తానికి జీఖఅద నెలలో దైవప్రవక్త (స) హజ్ సంకల్పం చేసుకున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ వార్త నలువైపులా వ్యాపించింది. దైవప్రవక్త (స)తో కలసి హజ్ చేయాలన్న కాంక్ష అందరిలో బలపడింది.3 జీఖ అద నెల 26వ తేదీ శనివారం నాడు ఆయన(స) స్నానం చేసి ఒక దుప్పటిని నడుముకు కట్టుకున్నారు. మరో దుప్పటిని కప్పుకున్నారు. జుహ్రా నమాజు అనంతరం మదీనా నుండి వెడలారు.4 తన సతీమణులందరూ హజ్‌కు రావాలని ఆదేశించారు.5 మదీనాకు 6 మైళ్ల దూరంలో ‘జుల్ హలీఫా’ అనే స్థలం ఒకటుంది. అది మదీనా వాసుల 6‘మీఖాత్’. అక్కడకు చేరుకుని రాత్రిపూట అక్కడే విడిది చేశారు. మరునాడు మళ్లీ స్నానం చేసి, రెండు రకాతుల నమాజు చేశారు. ఆ తరువాత ‘ఖస్వా’ అనే తన వాహనంపై కూర్చొని ‘ఇహ్రామ్’ దీక్షబూనారు. అప్పుడే బిగ్గరగా ఇలా ఆలాపించారు.
లబ్బై కల్లాహుమ్మ లబ్బైక్. లబ్బైక్ లా షరీక లక లబ్బైక్. ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్ లా షరీకలక్.
(హాజరయ్యాము దేవా! మేము హాజరయ్యాము. మేము నీ సన్నిధానంలో హాజరయ్యాము. సహవర్తులెవరూ లేని స్వామీ మేము హాజరయ్యాము. ప్రశంసలు నీకే శోభిస్తాయి. అనుగ్రహాలన్నీ నీవు వొసగినవే. సార్వభౌమత్వం కూడా నీదే. ఇందులో నీకు భాగస్వాములెవరూ లేరు.)
ఈ హదీసును ఉల్లేఖించిన హజ్రత్ జాబిర్ (రజి) ఇలా అంటున్నారు: నేను అటూ యిటూ దృష్టి సారించాను. ముందు వెనుకా కుడి వైపునా, ఎడమవైపునా జనారణ్యం కనిపిస్తోంది. దైవప్రవక్త (స), “లబ్బైక్…” పలికినప్పుడల్లా నలువైపులా అందరి అధరాలు అదే స్తుతి గీతికను ఆలాపించేవి. దాంతో పరిసరాలు మిన్నంటేవి. చుట్టు ప్రక్కల వున్న పర్వతాల్లో ఆ ధ్వని ప్రతిధ్వనించేది.7
మక్కా విజయం సందర్భంగా దైవప్రవక్త (స) నమాజు చేసిన చోటల్లా జనులు శుభ స్థలంగా భావించి మస్జిదులు నిర్మించుకున్నారు. అలాంటి మస్జిదులు దారిలో ఎక్కడ కనిపించినా, దైవప్రవక్త (స) అక్కడ కాస్సేపు ఆగి నమాజు చేసి ముందుకు సాగేవారు. అయితే ఆఖరి మజిలీకి చేరిన తరువాతే స్నానం చేశారు. మరునాడు (ఆదివారం జిల్ హజ్జ్ 4వ తేదీ ఉదయం పూట) పవిత్ర మక్కాలో ప్రవేశించారు. మదీనా నుండి బయలుదేరి మక్కాకు చేరుకోవడానికి తొమ్మిది రోజులు పట్టింది.8 హాషిమ్ వంశస్థులకు ఈ సంగతి తెలియగానే వారి పిల్లలు సంతోషాతిశయంతో పరుగులు తీస్తూ వచ్చారు. ప్రేమానురాగాలు పొంగి పొరలగా ఆయన (స) కొంతమంది పిల్లలను ఒంటెపై తనకు ముందు వెనుకా కూర్చోబెట్టుకున్నారు.9 ‘కాబా’పై దృష్టి పడగానే “దేవా! ఈ గృహానికి మరిన్ని గౌరవోన్నతుల్ని ప్రసాదించు” అని ప్రార్థించారు.10 అనంతరం కాబా గృహ ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ పూర్తి కాగానే ‘మఖామె ఇబ్రాహీం’ వద్దకు వెళ్ళి రెండు రకతుల నమాజు చేశారు. ఈ సందర్భంగా ఆయన(స) వత్త ఖిజూ మిమ్మఖామి ఇబ్రాహీమ ముసల్లా (మఖామె ఇబ్రాహీమును సాష్టాంగ స్థలంగా చేసుకోండి) అనే ఆయతును పఠించారు.
సఫా కొండ వద్దకు చేరుకోగానే ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ ష ఆయిరిల్లాహ్ (నిస్సందేహంగా సఫా-మర్వా పర్వతాలు అల్లాహ్ చిహ్నాలలోనివి) అనే వచనాన్ని పఠించారు. అక్కడి నుంచి కాబా గృహాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన నోట వెలువడిన పలుకులివి:
“అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే తగును. జీవన్మరణాల ప్రదాత కూడా ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. ఆయన ఏకేశ్వరుడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన దాసునికి తోడ్పడ్డాడు. ఆయన ఒక్కడే తెగలన్నింటినీ జయించాడు”11
‘సఫా’ పర్వతంపై నుంచి దిగి ‘మర్వా’ పర్వతంపైకి వచ్చారు. ఇక్కడ కూడా ప్రార్థనలు చేశారు. ఆ రోజుల్లో హజ్ సందర్భంగా ‘ఉమ్రహ్’ చేయటం నిషిద్ధమని జనులు అనుకునేవారు. తమ వెంట ఖుర్బానీ పశువులు తెచ్చుకోనివారు ‘ఉమ్రహ్’ పూర్తి చేసుకుని ఇహ్రామ్ దీక్షను విరమించుకొమ్మని ఆయన (స) ఆజ్ఞాపించారు.12 కొంతమంది సహచరులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ ఆదేశాన్ని పాలించటానికి తటపటాయించారు. “ఒకవేళ నా దగ్గర ఖుర్బానీ పశువులు లేకుండా ఉంటే నేను కూడా ఇలాగే చేసి ఉండేవాణ్ణి”13 అన్నారు ఆయన(స). ఈ హజ్‌యాత్రకు కొన్ని రోజుల క్రితమే హజ్రత్ అలీ (రజి) యమన్‌కు పంపబడ్డారు. ఆయన యమన్ నుంచి హజ్ యాత్రీకులను వెంటబెట్టుకుని మక్కా వచ్చారు. వారి వెంట ఖుర్బానీ పశువులు కూడా ఉండటం వల్ల వారు ఇహ్రామ్ వస్త్రాలను విడువలేదు. గురువారం నాడు-జిల్‌హజ్ 8వ తేదీన-ఆయన ముస్లింలందరినీ వెంటబెట్టుకుని ‘మినా’ చేరుకుని అక్కడ విడిది చేశారు. మరునాడు (9వ తేదీన) శుక్రవారం ఫజ్ర్ నమాజ్ చేసుకుని మినా నుండి బయలుదేరారు.14
హజ్ కోసం మక్కానుండి బయలుదేరినప్పుడు ‘అరఫాత్’ కు వెళ్ళకుండా ‘ముజ్దలిఫా’ ప్రదేశంలో ఆగటం ఖురైషుల ఆచారంగా ఉండేది. ఎందుకంటే ఇది పవిత్ర క్షేత్రం ‘పరిధి’లో ఉండేది. ఈ పరిధిని దాటి వేరొకచోట విడిదిచేయటం ఖురైషుల స్థాయికి తగదని వాళ్ళనుకునేవారు. అయితే ఇది ఇస్లాం సమానత్వ భావానికి విరుద్ధమైన విషయం. అందుకే “మీరు కూడా సాధారణ ముస్లింల వలెనే అరఫాత్కు రండి” అని దైవాదేశమయింది.15
ఇంకా ఈ విధంగా ప్రకటన గావించబడింది-
“మీరు మీ పవిత్ర స్థలాలలో ఆగి ఉండండి. మీరు మీ పితామహుడైన ఇబ్రాహీము(అలైహిస్సలాం)కు వారసులు”16
అంటే అరఫాత్ మైదానం హాజీల విడిది స్థలం. అది హజ్రత్ ఇబ్రాహీము (అలైహిస్సలాం) స్మారక స్థలం. ఆయనే ఈ ప్రదేశాన్ని ఇందు నిమిత్తం ప్రత్యేకించారు. అరఫాత్ ప్రదేశంలో ‘నమ్రా’ అనే ఒక స్థలం ఉంది. అక్కడాయన(స) కంబలితో వేయబడిన శిబిరంలో విడిది చేశారు. మధ్యాహ్నం పొద్దువాలిన పిదప ఒంటెపై స్వారీ అయి అరఫాత్ మైదానం నడిబొడ్డుకు చేరుకున్నారు. అక్కడే-ఒంటెపై నుంచే-ఉపన్యసించారు.17
ఈ రోజు ఇస్లాం తన వైభవంతో సహా ప్రస్ఫుటమయింది. అజ్ఞానకాలపు అపసవ్యమైన ఆచారాలన్నింటినీ నిర్మూలించింది. అందుకే ఆయన(స) ఇలా పలికారు
“అవును. అజ్ఞానకాలపు అహంభావాలన్నీ నా పాదాల క్రింద ఉన్నాయి.”18
మనిషిని మానవునిగా మలిచే మార్గంలో అన్నిటికన్నా పెద్ద అవరోధం ఈ మానవ అసమానతలే. ప్రపంచ జాతులు, ప్రపంచ మతాలు, ప్రపంచ దేశాలు ఏదో ఒక పేరుతో, ఏదో ఒక రూపులో, ఏదో ఒక స్థాయిలో మనిషీ – మనిషికీ మధ్య ఈ ‘అసమానతలను’ పాటించేవారు. ఈ నిమ్నోన్నతా భేదభావాలకు, జాతివివక్షకు ప్రభుత్వాలు, రాజరికాలు సయితం అండగా నిలిచేవి. ఈ కృత్రిమ భావనలపై, కుహనా ప్రతిష్ఠలపై ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండేది కాదు. మానవ సమానత్వం గురించి మత పీష్వాలతో చర్చించే అనుమతి సామాన్యులకు లభించేది కాదు. ‘కులీనులు’ కులహీనుల కన్నా ఎంతో ఉన్నతులుగా, మర్యాదస్తులుగా పరిగణింపబడేవారు. బానిసలు తమ యజమానుల సరసన నిలబడలేరు.
ఈ రోజు ఈ నిమ్నోన్నతా భేదభావాలు, ఈ ప్రత్యేకతలు, కుహనా కట్టుబాట్లు అన్నీ ఒక్కసారిగా తునాతునకలైపోయాయి.
“అరబ్బుకు అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపైగానీ ఎలాంటి ఆధిక్యతను, శ్రేష్ఠతకు ఆస్కారం లేదు. మీరంతా ఆదము బిడ్డలే. ఆదము మట్టితో సృజించబడ్డారు.”19
అరేబియాలో ఎవరయిన ఒకరిని హత్య చేస్తే హతుని తరపున ప్రతీకారం తీర్చుకోవటం అతని కుటుంబీకుల విధిగా భావించబడేది. అనేక సంవత్సరాలు గడచిపోయినాసరే ఆ ప్రతీకార వాంఛ అలాగే ఉండేది. ఈ కారణంగానే వర్గ తెగల మధ్య ఎడతెగని పోరాటాలు జరుగుతూ ఉండేవి. అరేబియా గడ్డ నిరంతరం రక్తంతో తడిసి ముద్దయి పోయేది. ఈ రోజు ఈ పాత ఆచారం, గర్వాహంకారంతో కూడుకున్న ప్రతీకారచర్య నిర్మూలించబడుతోంది. దీని కోసం దైవప్రవక్త(స) స్వయంగా ముందుకు వచ్చి అందరి ముందూ ఒక ఆదర్శాన్ని, ఉపమానాన్ని నెలకొల్పారు.
“అజ్ఞానకాలపు ప్రతీకార వాంఛలు మిథ్యగా ప్రకటించబడుతున్నాయి. అందరి కన్నా ముందు నేను (నా వంశానికి బాకీగా ఉన్న రక్తాన్ని) రబీయ బిన్ హారిస్ కుమారుని రక్తాన్ని మాఫీ చేస్తున్నాను”20
ఆనాడు అరేబియా అంతటా వడ్డీ వ్యాపారం ఒక విష వలయంగా తయారై ఉండేది. బీదవర్గాల అణువణువూ ఈ వడ్డీ వ్యాపారుల అధీనంలో ఉండేది. అప్పులు చెల్లించలేని ఎంతో మంది పేదవారు వడ్డీ మా రాజులకు బానిసలుగా మారిపోయేవారు. ఈ విష వలయాన్ని ఛేదించి, దాని వాతన పడిన పీడితులకు హాయి నొసగే రోజు వచ్చేసింది.
“అజ్ఞానకాలం నాటి వడ్డీ వ్యాపారం లావాదేవీలన్నీ అధర్మంగా ఖరారయ్యాయి. అన్నిటి కన్నా ముందు నేను నా కుటుంబీకుల వడ్డీని-అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వడ్డీని – నిషిద్ధంగా ఖరారు చేస్తున్నాను.”21
ఆనాటి వరకూ ఆడది ఒక విలాస వస్తువుగా, నోటిమాటగా క్రయవిక్రయాలు జరుపబడే ఆట బొమ్మగా పరిగణించబడేది. తాగుబోతులు సారాయి కోసం ఆమెను అమ్ముకునేవారు. జూదానికి బానిసలుగా మారిన ఆసాములు ఆలినే తాకట్టుగా పెట్టేసేవారు. ఈ కలకంఠి కన్నీరును తుడిచే, ఈ కోమలాంగి కష్టాలను తీర్చే, ఈ గృహరాణికి గౌరవప్రదమైన కిరీటం తొడిగించే రోజు వచ్చేసింది. సెలవీయబడింది:
“స్త్రీల విషయంలో దైవానికి భయపడండి.”22
ఆనాడు అరేబియాలో ధన ప్రాణాలకు విలువే ఉండేది కాదు. ఒకరింకొకరిని అకారణంగా, అన్యాయంగా చంపేసేవారు. ఒకరి ఆస్తిపాస్తులను ఇంకొకరు బలవంతంగా కబళించేవారు. అయితే ఈనాడు శాంతిదూత సమస్త ప్రపంచానికీ తన శాంతి సందేశాన్ని వినిపిస్తున్నాడు.
“ఈ రోజు, ఈనెల, ఈ నగరం మీకోసం పవిత్రం గావించబడినట్లే, మీ రక్తం, మీ సంపద ప్రళయ దినం వరకూ పవిత్రం గావించబడింది.”23
ఇస్లాంకు పూర్వం ప్రపంచంలో పెద్ద పెద్ద మతాలు ఉద్భవించాయి. కాని వాటి పునాది ఆ మతస్థాపకుల లిఖితపూర్వక ధార్మిక సూత్రాలపై నెలకొనలేదు. దేవుని తరపున లభించిన మార్గదర్శక సూత్రాలను ఆయా మతాధిపతులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మార్చుకోవటమో లేదా వాటి వాస్తవితకతను, ప్రాధాన్యతను తగ్గించేటమో చేశారు. అయితే శాశ్వత మతానికి పైగంబరుగా పంపబడిన ఈ మహోపకారి (స) దైవాదేశాలను, తన ఆదర్శాలను తన అనుచరుల పరంచేస్తూ వాటిని నిరంతరం హృదయానికి హత్తుకోవాలనీ, వాటిలో మార్పులు చేర్పులు చేయరాదని తాకీదు చేశాడు.
“నేను మీ మధ్య ఒక వస్తువును వదలి వెళుతున్నాను. మీరు దానిని గట్టిగా పట్టుకుని ఉన్నంత కాలం మీరు దారి తప్పరు. అదేమిటీ? అదే దైవగ్రంథం.”24
“దైవ సమక్షంలో నా గురించి మీరు ప్రశ్నించబడినపుడు ఏమని సమాధానమిస్తారు?”
“మీరు దైవసందేశాన్ని అందజేశారనీ, మీ బాధ్యతను మీరు సజావుగా నిర్వర్తించారని సమాధానమిస్తాం” అన్నారు ప్రియ సహచరులు. అప్పుడు ఆయన (సఅసం) ఆకాశం వైపు చూపుడు వ్రేలును ఎత్తి “అల్లాహ్! ఈ విషయానికి నువ్వే సాక్షివి” అని మూడుసార్లు పలికారు.25
సరిగ్గా ఆ సమయంలోనే ఈ దైవవచనం అవతరించింది26:
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ హృదయాల విజేత (స) లక్షలాది మంది భక్తుల మధ్య ఈ శాసనాలను జారీ చేస్తున్నప్పుడు ఒంటెపై ఆయన(స) ఆసీనులై ఉన్న గద్దె అతికష్టమ్మీద ఒక రూపాయికన్నా ఎక్కువ విలువైనది కాదు.27
ప్రసంగాన్ని ముగించగానే ఆయన(స) అజాన్ యివ్వమని హజ్రత్ బిలాల్ (రజి)ను ఆదేశించారు. అజాన్ తరువాత జుహ్ర్ అస్ర్ నమాజులను కలిపి ఒకేసారి చేశారు. అనంతరం ఒంటెపై స్వారీ అయి తన విడిది వద్దకు చేరుకున్నారు. ఖిబ్లా దిశకు తిరిగి చాలాసేపు దుఆ (వేడుకోలు) చేస్తూ ఉండిపోయారు.28 సూర్యాస్తమయం జరుగుతుండగా అక్కణ్ణుంచి బయలుదేరారు. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి)ను ఒంటెపై తన వెనుక కూర్చోబెట్టుకున్నారు.29 ఆయన (స) ఒంటె పగ్గాలను బాగా లాగి పట్టుకోవటం వల్ల దాని మెడ ఒక్కోసారి తాను కూర్చున్న గద్దెకు తగిలేది. అశేష జనవాహిని మూలంగా కించిత్ ఇబ్బంది కూడా కలిగేది.30 జనులకు చేత్తో సైగ చేస్తూ ‘కాస్త నెమ్మదిగా నడవండి’ అనేవారు. “ప్రజలారా! నిదానం, ప్రజలారా! నిదానం”31 అనే మాటలు కూడా ఆ సందర్భంగా ఆయన నోట వెలువడ్డాయి.
ఈ మార్గంలోనే ఆయన(స) ఒకచోట కాలకృత్యాలు తీర్చుకున్నారు. “దైవప్రవక్త! నమాజ్ వేళ దాటిపోతోంది” అని ఉసామా (రజి) గుర్తు చేయగా, నమాజు చేయవలసిన చోటు రానున్నది అని బదులిచ్చారు. కొద్ది సేపట్లోనే ఆయన(స) సహచరులందరితో కలసి ‘ముజ్దలిఫా’ చేరుకున్నారు. అక్కడ ఆయన(స) తొలుత మగ్రిబ్ నమాజు చేశారు. జనులు గబగబా తమ సామాను సర్దుకుంటూ ఉండగా ఇషా నమాజు కోసం ‘తక్బీర్’ పలకబడింది.32 నమాజు చేసిన తరువాత ఆయన విశ్రమించారు. తెల్లవారే వరకూ నిదురించారు. ఎప్పటిలాగా ఆయన ఆ రోజు రాత్రి లేవలేదు. ఆయన (సఅసం) తహజ్జుద్ నమాజు కోసం లేవని రాత్రి అంటూ ఉంటే ఆ ఒక్కరాత్రేనని హదీసువేత్తలు వ్రాశారు. తెలతెలవారుతుండగా లేచి, అందరితో కలసి ఫజ్ర్ నమాజు చేశారు.33 కురైష్ అవిశ్వాసులు సూర్యోదయం అవుతున్నప్పుడు ముజ్దలిఫా నుండి బయలుదేరేవారు. ప్రభాకరుని లేకిరణాలు పడి పర్వత శిఖరాలు నిగనిగలాడేవి. అది చూసి “షబ్బీర్ పర్వతమా! ఎండతో మెరిసిపో” అని నినదిస్తూ వెళ్ళిపోయేవారు. దైవప్రవక్త (స) ఈ ఆనవాయితీని భంగపరుస్తూ సూర్యోదయం కాకమునుపే అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు.34 అది జిల్ హజ్ 10వ తేదీ శనివారం.
హజ్రత్ ఫజల్ బిన్ అబ్బాస్ (రజి) ఆయన వెనుక ఒంటెపై కూర్చున్నారు. హజ్ యాత్రీకులు కుడి వైపు నుంచి, ఎడమవైపు నుంచీ, ధర్మ సందేహాలు అడుగుతున్నారు. ఆయన (స) అందరి సందేహాలూ తీరుస్తున్నారు.35 హజ్ క్రియల గురించి బిగ్గరగా సూచనలు అందజేయసాగారు. ముహస్సర్ లోయగుండా ఆయన(స) ‘జమ్రా’ వద్దకు చేరుకున్నారు. పిన్నవయస్కులైన అబ్బాస్ నుద్దేశించి తనకు కంకరరాళ్ళు ఇవ్వమన్నారు. కంకర రాళ్లను చేతికివ్వగా రాళ్లురువ్వారు. ఆ సందర్భంగా ఆయన(స) జనులనుద్దేశించి,
“ధర్మంలో అతిశయిల్లకండి. అతివాదానికి దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు పూర్వం గతించిన జాతులు ఈ ‘అతి’ మూలంగానే నాశనమయ్యాయి”36 అని అన్నారు.
ఈ సందర్భంగానే ఆయన(స) ఈ విధంగా కూడా పలికారు.
“హజ్ క్రియలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోండి. దీని తరువాత మళ్లీ నాకు హజ్ చేసే అవకాశం లభించక పోవచ్చు.”37
“జమ్రా’ పూర్తయిన తరువాత ఆయన(స) ‘మినా’ మైదానంలోకి వచ్చారు. ఆయనకు ముందూ వెనుకా, కుడివైపునా ఎడమవైపునా సుమారు లక్షమంది వరకూ ఉన్నారు. ముహాజిర్లు కుడి వైపునా, అన్సార్లు ఎడమవైపునా, మధ్యలో ఇతర ముస్లింలున్నారు. ఆయన(స) మాత్రం ఒంటెపై కూర్చుని ఉన్నారు. ఒంటె పగ్గాలు హజ్రత్ బిలాల్ (రజి) చేతిలో ఉన్నాయి. హజ్రత్ ఉసామ (రజి) ఆయన (స) వెనుకే కూర్చుని వస్త్రాన్ని లాగిపట్టుకుని నీడ కల్పిస్తున్నారు. ఆయన(స) ఓ సారి కన్నెత్తి అశేష జనవాహిని వంక చూశారు. 23 సంవత్సరాల అవిరళ దైవదౌత్య కృషి ఫలితం ఆయన కళ్ల ముందు ఒక్కసారిగా కదలాడింది. సత్యామృతాన్ని ఆస్వాదించిన ధన్యజీవుల సమూహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దైవదౌత్య పరంపరపై ‘పరిసమాప్తి’ అనే ముద్రపడబోతోంది. ప్రపంచం పుట్టి లక్షలాది సంవత్సరాలు గడచిపోయాక ప్రప్రథమంగా సహజధర్మం-ప్రకృతిధర్మం-పరిపూర్ణతను సంతరించుకుందన్న శుభవార్తను పరిసర ప్రాంతాల్లోని ఒక్కో రేణువూ ఆలకిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి అధరాల నుండి జాలువారిన ఈ పలుకులు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. -ఎందుకంటే ఇప్పుడు ఒక నూతన జీవనవ్యవస్థకు, నూతన షరీయతుకు, నూతన అధ్యాయానికి పునాది పడింది.38
“ఆదిలో దేవుడు ఏ బిందువుపై భూమ్యాకాశాలను సృజించాడో, కాలచక్రం తిరిగి తిరిగి సరిగ్గా ఆ బిందువుపైకే వచ్చింది.”39
దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) స్థాపించిన హజ్ విధానంపై అరాచకపు కారు మేఘాలు కమ్ముకున్నాయి. రక్తపాతం నిషేధించబడిన గడ్డపై అరబ్బులు రక్తాన్ని చిందించి హజ్ మాసానికి ఉన్న పవిత్రతను మంట గలిపేశారు. హజ్ క్రియలలో కొత్తపుంతలు తొక్కి సంప్రదాయాలకు మసిపూసారు. ఇప్పుడు ఈ అజ్ఞానపు దురాగతాలకు కాలం చెల్లింది. అశేష జనవాహిని సాక్షిగా ‘హజ్‌కు సంబంధించి ఓ నూతన సంవిధానం ఆమోదించ బడింది. అందుకే కారుణ్యమూర్తి (సఅసం) ఇలా వక్కాణించారు.
“ఏడాదిలో 12 మాసాలుండగా 4 మాసాలు గౌరవప్రదం గావించబడ్డాయి. వాటిలో మూడు మాసాలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. జీఖ అద, జిల్‌హజ్, ముహర్రమ్, నాల్గవ మాసం రజబ్ మాసం. అది జమాదివుస్సానీ-షాబాన్ మాసాల మధ్యన ఉంటుంది.”40
ప్రపంచంలో న్యాయం ధర్మాలు విలసిల్లినా అన్యాయం అక్రమాలు రాజ్యమేలినా-అవి మూడు వస్తువుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. 1) ప్రాణం 2) ధనం, 3) మానమర్యాదలు. దైవప్రవక్త (సఅసం) నిన్నటి ప్రసంగంలో వీటి గురించి నొక్కి పలికినప్పటికీ తరతరాలుగా అరబ్బులలో పేరుకుపోయివున్న ఈ తుప్పును తొలగించటానికి మరోసారి ఈ విషయాన్ని నొక్కివక్కాణించవలసిన ఆవశ్యకత ఉందని భావించి ఉంటారు. అందుకే ఆయన(స) అనుపమమైన తన శైలిలో ఇలా ప్రసంగించారు:
“ఈ వాళ ఏం రోజు?”
“దైవం మరియు దైవప్రవక్త (స)కే బాగా తెలుసు” అని ప్రజలు జవాబిచ్చారు.
చాలాసేపు ఆయన (స) మౌనం వహించారు.
బహుశా ఆయన(స) ఆ రోజుకు కొత్త నామకరణం చేస్తారేమోనని అందరూ అనుకోసాగారు.
“ఈ రోజు ఖుర్బానీ ఇచ్చే రోజు కాదా?” అని ఆయన ప్రశ్నించారు.
“నిస్సందేహంగా ఖుర్బానీ రోజే”-ప్రజలంతా జవాబిచ్చారు.
“ఇది ఏ మాసం?” ప్రశ్నించబడింది.
ప్రజలు అదే రీతిలో బదులిచ్చారు.
ఆయన(స) చాలాసేపు మౌనం వహించారు. “ఇది జిల్ హజ్ మాసం కాదా?!” ఆయనే(స) స్వయంగా అడిగారు.
“నిస్సందేహంగా జిల్‌హజ్జ్ మాసమే” జవాబిచ్చారు సహచరులు.
“ఇది ఏ నగరం?” -మళ్లీ ప్రశ్న.
ప్రజల నుంచి మళ్లీ అదే జవాబు
“ఇది పవిత్ర నగరం కాదా?” అని ఆయన(స) ప్రశ్నించారు.
“ముమ్మాటికీ” అని బదులిచ్చారు సహచరులు.
ఈ రోజు, ఈ మాసం, ఈ నగరం-మూడూ పవిత్రమైన వన్న సంగతి అప్పటికే ప్రజల ఆంతర్యాల్లో నాటుకుంది. అంటే ఈ రోజునగానీ, ఈ మాసంలోగానీ, ఈ నగరంలోగానీ యుద్ధం చేయటం, రక్తపాతం సృష్టించటం ధర్మ సమ్మతం కాదు.
“ఈ రోజు, ఈ నెల, ఈ నగరం పవిత్రమైనట్లే మీ రక్తం, మీ ధనం, మీ మానమర్యాదలు (ప్రళయదినం వరకూ) పవిత్రం గావించబడ్డాయి.”41
జాతుల పతనంలో, దివాలా కోరుతనంలో నిరంతర యుద్ధాలు, రక్తపాతాలే ముఖ్య కారణాలుగా నిలిచాయి. అందుకే ప్రళయదినం వరకూ సచేతనంగా ఉండే జాతికి మూలస్థాపకుడుగా వచ్చిన ప్రవక్త (స) తన అనుయాయులనుద్దేశించి ఇలా ఎలుగెత్తి ప్రకటించాడు-
“వినండి! నా తదనంతరం ఒండొకరి మెడలు నరుక్కునే వారిలా అపమార్గం పాలు కాకండి. మీరంతా దైవ సమక్షంలో హాజరుకావలసి ఉన్నది. ఆయన మీ నుండి లెక్క తీసుకుంటాడు సుమా!”42
అన్యాయం, దౌర్జన్యం పరాకాష్ఠకు చేరుకున్న గడ్డు కాలమది. ఒక వంశంలో ఏ వ్యక్తయినా ఒక తప్పుచేస్తే ఆ వంశంలోని వ్యక్తులంతా దోషులుగా, పాపాత్ములుగా పరిగణించబడేవారు. నేరం చేసిన నేరస్థులు పలాయనం చిత్తగిస్తే, పరిపాలకులు ఆ నేరస్థుని అన్నెం పున్నెం ఎరుగని వంశస్థులను, కుటుంబీకులను పట్టుకుని శిక్షించేవారు. తండ్రిచేసిన నేరానికి కొడుకు ఉరికంభం ఎక్కాల్సి వచ్చేది. కొడుకు చేసిన పాపానికి ఫలితం తండ్రి అనుభవించాల్సి వచ్చేది. అత్యంత అమానుషమైన ఈ చట్టం అనాదిగా కొనసాగుతూ వచ్చేది. దివ్యఖుర్ఆన్ ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ప్రకటన చేసినప్పటికీ వినూత్న రాజకీయ వ్యవస్థకు నడుం బిగించిన ప్రవక్త(స) ఈ నేపథ్యంలో స్పష్టమైన ఫర్మానాను జారీచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
“వినండి!! ఎవరు చేసిన నేరానికి వారే బాధ్యులు. తండ్రి చేసిన నేరం కొడుకుపై మోపబడదు. కొడుకు చేసిన అపరాధానికి తండ్రి బాధ్యుడు కాడు.”43
ఆనాడు అరేబియాలో నెలకొని ఉన్న అశాంతి అలజడులకు, అరాచకం అవ్యవస్థలకు మూలకారణం అక్కడి వ్యక్తుల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ్యతా రాహిత్య ధోరణే. ప్రతి ఒక్కడూ తన్ను తాను అందరికన్నా పెద్దవాడిగా ఊహించుకునేవాడు. తననొక పాలకుడుగా తలపోసేవాడే తప్ప పాలితునిగా ఉండటానికి సుతరామూ సహించేవాడు కాడు. ఈ అహంభావాన్ని తునాతునకలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
“వినండి! ఒక నల్లని నీగ్రో అయినా, చెవి తెగిన బానిస అయినాసరే మీ నాయకునిగా ఎంపికైతే-అతడు దైవాజ్ఞల కనుగుణంగా మిమ్మల్ని నడిపిస్తున్నంత వరకూ-మీరతనికి విధేయులై ఉండాల్సిందే”44
అరేబియా ఎడారిలోని అణువణువూ ఇస్లాంతో పులకించింది. కాబా గృహం శాశ్వత ప్రాతిపదికపై ఇబ్రాహీము (అలైహిస్సలాం) అనుచర సమాజం కేంద్రంగా మారిపోయింది. కల్లోల జనకులు కుప్పకూలి పోయారు. మిథ్యావాదులు మట్టికరచారు. అందుకే ఆయన(స) ఇలా సెలవిచ్చారు:
“మీ ఈ నగరంలో తన పూజ ఇక మీదట ప్రళయ దినం వరకూ జరగదన్న విషయం గ్రహించిన షైతాన్ నిరాశకు గురయ్యాడు. అయితే మీరు చిన్న చిన్న విషయాలలో వాడి అడుగులకు మడుగులొత్తుతారు. దాన్ని చూసి వాడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు”.45
ఆఖరిలో ఆయన (స) ఇస్లాం యొక్క మొదటి విధ్యుక్త ధర్మాన్ని జ్ఞాపకం చేశారు:
“మీరు మీ ప్రభువును ఆరాధించండి. ఐదువేళలా నమాజు చేయండి. (రమజాన్) మాసపు ఉపవాసం పాటించండి. నా ఆజ్ఞలను అనుసరించండి. దేవుని స్వర్గంలో ప్రవేశిస్తారు.”46
ఈ విధంగా ఉపదేశించిన మీదట ఆయన(స) జన సముద్రం వైపు సంజ్ఞ చేస్తూ “నేను దైవసందేశాన్ని అందజేశానా? లేదా?” అని ప్రశ్నించారు.
“అవును. అందజేశారు”-అని అందరూ సాక్ష్యమిచ్చారు.
“దేవా! నీవు దీనికి సాక్షిగా ఉండాలి” అని ఆయన(స) పలికారు.
తరువాత ఆయన(స) ప్రజలవైపు తిరిగి “ఇక్కడున్నవారు ఇక్కడలేనివారికి ఈ సందేశాన్ని వినిపించాలి” అని చెప్పారు.47
ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన(స) ముస్లింలందరికీ వీడ్కోలు చెప్పారు.
ఆ తరువాత ఆయన(స) ఖుర్బానీ యిచ్చే క్షేత్రానికి వెళ్ళారు. “ఖుర్బానీ యివ్వడానికి ‘మినా’లో ఏదేని ఒక స్థలమంటూ ప్రత్యేకంగా నిర్ధారించబడలేదు. మినా మరియు మక్కా నగరంలోని వీధి వీధినా, వాడవాడనా ఖుర్బానీ యివ్వవచ్చు” అని ఆయన(స) ఉద్బోధించారు. ఆయన(స) ముందర నూరు ఒంటెలు ఖుర్బానీ కోసం నిలబడి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ఆయన(స) జిబహ్ చేశారు. మిగిలిన వాటిని జిబహ్ చేసే బాధ్యతను హజ్రత్ అలీ (రజి)కి అప్పజెప్పారు.48 వాటి మాంసాదులను దానం చేయవలసిందిగా ఆదేశించారు. కసాయి వానికివ్వవలసిన వేతనం ఆ మాంసంలో నుంచి ఇవ్వరాదనీ, వేతనాన్ని వేరుగా చెల్లించాలనీ పురమాయించారు.49
ఖుర్బానీ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాత ఆయన(స) మాముర్ బిన్ అబ్దుల్లాహ్‌ను పిలిపించి, శిరోముండనం చేయించుకున్నారు.50 ప్రేమకొద్దీ తన కేశాలను తన స్వహస్తాలతో అబూతల్హా అన్సారీకి, ఆయన భార్య ఉమ్మె సులైమాకి, తనకు సమీపంలో కూర్చుని ఉన్న శిష్యగణానికి ఇచ్చారు. మిగిలిన తలవెంట్రుకలను అబూతల్హా (రజి) ముస్లింల మధ్య తలా ఒక్కోటి, రెండేసి చొప్పున పంచిపెట్టారు.51 అనంతరం ఆయన(స) మక్కాలోనికి ప్రవేశించారు. కాబా గృహ ప్రదక్షిణ చేసి, జమ్జమ్ జలం ఉన్న బావి వద్దకు వెళ్ళారు.
జమ్జమ్ బావి నుండి హజ్ యాత్రీకులకు నీరు త్రాపించే బాధ్యతను అబ్దుల్ ముత్తలిబ్ వంశస్థులే నిర్వర్తించేవారు. బావి దగ్గర నిలబడి ఆయన(స) ఇలా అన్నారు: “ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతతివారలారా! నేను స్వయంగా నీళ్లు తోడుకుని త్రాగటం చూసి, జనులు ఈ బాధ్యతను మీ నుండి లాక్కుంటారనే భయమే గనక నాకు లేకపోతే నేను ఖుద్దుగా నీళ్లు తోడుకునే వాణ్ణి.”52 అప్పుడు హజ్రత్ అబ్బాస్ (రజి) బొక్కెనతో నీళ్లుతోడి ఆయన (స)కు సమర్పించారు. ఆయన(స) ఖిబ్లా దిశలో నిలబడి నీళ్లు త్రాగారు.53 అక్కణ్ణుంచి తిరిగి మినా వెళ్ళారు. జుహ్ర్ నమాజు అక్కడే చేశారు.54 ఆ రోజునుంచీ జిల్‌హజ్ 12వ తేదీ వరకూ ఆయన ‘మినా’లోనే మకాం వేశారు. ప్రతిరోజూ పొద్దువాలినపుడు జమ్రా కోసం వెడలేవారు.55 జిల్‌హజ్ 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం అక్కడి నుంచి మకాం మార్చి ముహస్సబ్ లోయలో ఆగారు. రాత్రి అక్కడే గడిపారు.56 ఆఖరి జామున లేచి మక్కాకు చేరుకున్నారు. కాబా గృహ అంతిమ ప్రదక్షిణ చేసి అక్కడే ఫజ్ర్ నమాజ్ కూడా చేశారు.57 ఆ తరువాత వివిధ తెగలు తమతమ ప్రాంతాలకు తిరుగు ముఖం పట్టాయి. మహాప్రవక్త (స) తమ ముహాజిర్, అన్సార్ సహచరులతో కలసి మదీనా వైపుకు సాగిపోయారు. మదీనా సమీపంలో జుల్హులైఫా స్థలానికి చేరుకుని అక్కడ ఒక రాత్రి గడిపారు. ఉదయం సూర్యోదయం అవుతున్న సమయానికల్లా ప్రవక్త బృందం మదీనా నగరంలోకి ప్రవేశించింది. మదీనా నగరంపై దృష్టిపడగానే ఆయన(స) నోట వెలువడిన వాక్యాలివి:
“అల్లాహ్ గొప్పవాడు, ఘనాఘనుడు. ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. రాజ్యాధికారం ఆయనదే. సర్వస్తోత్రాలు, ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి. ఆయన అన్నింటినీ చేయగల సమర్థుడు. మేము మరలివస్తున్నాము. పశ్చాత్తాపం చెందుతూ వస్తున్నాము. దైవదాస్య భావంతో, సాష్టాంగ పడుతూ, మా ప్రభువు స్తుతి స్తోత్రాలలో నిమగ్నులమై వస్తున్నాము. దేవుడు తన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. తన దాసునికి అండగా నిలిచాడు. వ్యతిరేక శక్తులన్నింటినీ తానొక్కడే ఓడించాడు”58
ఫుట్నోట్లు
- 1సహీహ్ బుఖారీ: కితాబుత్తఫ్‌సీర్
- 2సహీహ్ బుఖారీ: హజ్జతుల్ విదా అధ్యాయం
- 3సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్ – బాబు హజ్జతున్నబీ (స)
- 4జాదుల్ మఆద్ – 2: 102
- 5సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 6సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 7సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 8సీరతున్నబీ – 2: 252
- 9సుననె నసాయి: కితాబుల్ మనాసిక్
- 10సుననె బైహఖీ – 5:73.
- 11సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 12సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ హజ్జతుల్ విదా అధ్యాయం; సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్ బాబు హజ్జతుల్ విదా.
- 13సహీహ్ బుఖారీ: కితాబుల్ మనాసిక్,
- 14సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 15సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 16సుననె తిర్మిజీ: కితాబుల్ హజ్
- 17సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్ – ప్రవక్త (స) హజ్ అధ్యాయం
- 18సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 19అల్ అఖీదుల్ ఫరీద్ – 2: 149.
- 20సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 21సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 22సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 23సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ; సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 24సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 25సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్ – బాబు హజ్జతున్నబీ
- 26సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 27సీరతున్నబీ – అల్లామా షిబ్లీ నూమానీ – 2: 154-159
- 28జాదుల్ మఆద్ – 2: 234
- 29సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 30జాదుల్ మఆద్ – 2: 246
- 31సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 32సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 33సీరతున్నబీ – 2: 120
- 34సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 35సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ – బాబు హజ్జతుల్ విదా
- 36సుననె నసాయి: కితాబుల్ మనాసిక్
- 37సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 38సీరతున్నబీ – 2: 161.
- 39సహీహ్ బుఖారీ – కితాబుల్ మగాజీ; సహీహ్ ముస్లిం: కితాబుల్ ఖుసామ
- 40సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ – బాబు హజ్జతుల్ విదా
- 41సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 42సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 43సుననె తిర్మిజీ: కితాబుల్ ఫితన్; సునన్ ఇబ్నుమాజా: కితాబుల్ మనాసిక్
- 44సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 45తిర్మిజీ: కితాబుల్ ఫితన్
- 46సుననె తిర్మిజీ: కితాబుస్సలాత్
- 47సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 48జాదుల్ మఆద్ – 2: 59
- 49సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 50ముస్నదె అహ్మద్ – 6: 100
- 51సహీహ్ బుఖారీ: కితాబుల్ వుజూ; సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 52సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్.
- 53సహీహ్ బుఖారీ: పానీయాల ప్రకరణం
- 54సహీహ్ ముస్లిం: కితాబుల్ హజ్
- 55జాదుల్ మఆద్ – 2: 290
- 56సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్ – బాబు తవాఫుల్ విదా
- 57సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 58సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్