రెండవ అధ్యాయం

మానవత్వం మొర ఆలకించబడిన వేళ

మానవ మహోపకారి (స) · మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి

దైవప్రవక్తగా నియుక్తులయ్యే రోజులు సమీపిస్తున్న కొద్దీ ఆయనలో ఏకాంత ప్రియత్వం పెరగసాగింది. ఆయన తరచూ కొంచెం సత్తు, నీళ్లు వెంటబెట్టుకొని మక్కాకు వెలుపల కొన్ని కోసుల దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి వెళ్ళేవారు. అక్కడ హిరా కొండ గుహలో కూర్చొని దైవారాధనలో కాలం గడిపేవారు. ఈ ఆరాధనలో ఆయన అల్లాహ్‌ను స్మరించేవారు. సృష్టిని, సృష్టికర్తను గురించి యోచన చేసేవారు. వెంట తీసుకెళ్లిన నీళ్లు, సత్తు అయిపోయేవరకు ఇంటికి తిరిగి వచ్చేవారుకాదు. ఆ తరువాత కొంత కాలానికి ఆయన(స)కు కలలు రావటం మొదలయ్యాయి. అతి త్వరలోనే ఆ కలలు నిజమయ్యేవి. రాత్రి కలగన్న విషయాలు పగలు అచ్చం అలాగే జరుగుతున్నట్టు అనిపించేవి. అలవాటు ప్రకారం ఆయన(స) ఒకరోజు హిరా గుహలో దైవధ్యానంలో ఉండగా ఆయన ముందు ఓ దైవదూత ప్రత్యక్షమయ్యాడు. “చదువు” అని అతను ఆయన్ని (స) కోరాడు. తనకు చదవటం రాదన్నారు ఆయన(స). ఆ దైవదూత ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని వదలిపెట్టాడు. ఆ కౌగిలి బంధనానికి జవసత్వాలు నశించినట్లనిపించింది ఆయనకు. దైవదూత మళ్లీ చదవమన్నాడు. తాను చదువుకున్న వాణ్ణి కాదని ఆయన(స) అన్నారు. ఈసారి అతను మరింత బలంగా ఆయన్ని కౌగిలించుకొని వదలిపెట్టాడు. ఆ తరువాత ‘చదువు’ అన్నాడు. ఆయన(స) తనకు చదవటం రాదనే అన్నారు. దైవదూత ఈసారి ఇంకా గట్టిగా కౌగిలించుకొని చదవమని పురమాయించాడు. అప్పుడు కూడా ఆయన అదే జవాబు చెప్పారు. ఆ సందర్భంగా దైవదూత ఈ క్రింది వాక్యాలు పఠించి వినిపించాడు:

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ఈ సంఘటన జరిగిన తరువాత ఆయన(స) కంగారుపడుతూ ఇంటికి వచ్చి పడుకున్నారు. వణుకు పుట్టిస్తున్న భయానికి తట్టుకోలేక తనపై దుప్పటి కప్పేయమని భార్యతో అన్నారు. కాసేపటికి మనసు కుదుటపడ్డాక తనకు ఇలాంటి దృశ్యాలు కనబడుతున్నాయని, చచ్చిపోతానేమోనని భయంగా ఉందని సతీమణితో చెప్పారు. అది విని ఖదీజా (రజి అన్‌హా) “భయమెందుకండీ, మీరు బంధువులను ఆదరిస్తారు. ఎల్లప్పుడూ సత్యం పలుకుతారు. వితంతువులు, అనాధలు, నిరాశ్రయుల్ని ఆదుకుంటారు. అతిథులను గౌరవిస్తారు. కష్టాల్లో ఉన్నవారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తారు. అట్లాంటి మిమ్మల్ని దేవుడు ఎన్నటికీ దుఃఖాల పాల్జేయడు” అంటూ భర్తకు ధైర్యం చెప్పారు. పైకి తెలపకపోయినా ఖదీజా (రజి అన్‌హా) మనసులో కూడా ఈ సంఘటన గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఆమె భర్తను తన బాబాయి కుమారుడైన వరఖా బిన్ నౌఫిల్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. ఆయనకు హిబ్రూ భాషలో మంచి ప్రావీణ్యముండేది. తౌరాత్, ఇంజీల్ గ్రంథపండితుడు. హజ్రత్ ఖదీజా (రజి అన్‌హా) కోరిక మేరకు ఆయన(స) తన దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చిన సంగతిని గురించి వరఖా బిన్ నౌఫిల్‌కు తెలియజేశారు. అది విని వరఖా ఒక్కసారిగా “ఇతను మూసా (అలైహి)పై అవతరించిన దైవదూతే” ‘నేను కూడా యువకుడినై, ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే కాలం వరకూ బ్రతికి ఉంటే ఎంత బాగుండేది’ అని అన్నారు. దైవప్రవక్త(స) ఆశ్చర్యపోతూ, “ప్రజలు నన్ను బహిష్కరిస్తారా?” అని అడిగారు. దానికి సమాధానమిస్తూ “ఔను. ప్రపంచంలో ఇలాంటి సత్యబోధన చేసిన వారందరికీ ప్రారంభంలో ప్రజల నుండి శత్రుత్వాన్నే ఎదుర్కోవలసి వచ్చింది. నాకు మీరు మక్కా నుండి వలసపోయే రోజు వరకు బ్రతికి ఉండి మీకు చేతనయినంత సేవ చేసుకోవాలని ఉంది” అని అన్నారు వరఖా బిన్ నౌఫిల్.1

ఒకరోజు పరిశుద్ధాత్మ (జిబ్రయీల్) దైవప్రవక్త(స)ను ఓ కొండ ప్రాంతానికి తీసుకువచ్చి ఆయన(స) ముందు తాను వుజూ చేసుకొని చూపించారు. అది చూసి ఆయన(స) కూడా వుజూ చేశారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి నమాజ్ చేశారు. పరిశుద్ధాత్మ ఆ నమాజ్‌కు సారధ్యం వహించారు.2

ఇస్లాం సందేశ ప్రచారం

దైవప్రవక్త(స) తన సందేశాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అందరికన్నా ముందు తన సతీమణి ఖదీజా, ఎనిమిదేళ్ళ సోదరుడు అలీ, మిత్రులు అబూబక్ర్, ఇంకా తన ద్వారా స్వేచ్ఛనొసగబడిన బానిస జైద్ బిన్ హారిసాలు ఇస్లాం స్వీకరించారు. ఈ ప్రభృతులకు దైవప్రవక్త నలభైయేళ్ళ జీవితంలోని ప్రతి కదలిక గురించీ తెలుసు. దైవప్రవక్తతో అతి సన్నిహితంగా మెలిగిన వారు వీరు. కాబట్టి వారి ఇస్లాం స్వీకరణ ఆయన(స) గారి గొప్ప సత్యసంధతకు, సన్మార్గ గమనానికి ప్రబల నిదర్శనం. మరికొన్ని రోజులకు బిలాల్, అమ్ర్ బిన్ అబసా, ఖాలిద్ బిన్ సాద్ బిన్ ఆస్ కూడా ముస్లింలయిపోయారు. అబూబక్ర్ (రజి) గొప్ప ధనవంతులు, వ్యాపారం చేసేవారు. మక్కాలో ఆయనకు దుకాణం ఉండేది. అంచేత ప్రజలతో ఆయనకు విస్తృత స్థాయిలో సంబంధాలుండేవి. ఆయన నడవడికకు, ప్రచారానికి ప్రభావితులై ఉస్మాన్ గనీ, జుబైర్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, తల్హా, సాద్ బిన్ అబూ వఖ్ఖాస్‌లు కూడా ముస్లింలయ్యారు. ఆ తరువాత అబూ ఉబైదా ఆమిర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ జర్రాహ్ (తరువాతి కాలంలో ఈయన ‘అమీనుల్ ఉమ్మత్’ అనే బిరుదాంకితులయ్యారు). అబ్దుల్ అసద్ బిన్ బిలాల్, ఉస్మాన్ బిన్ మజ్‌ఊన్, ఆమిర్ బిన్ ఫుహైరా అజ్‌దీ, అబూహుజైఫా బిన్ ఉత్‌బా, సాయిబ్ బిన్ ఉస్మాన్ బిన్ మజ్‌ఊన్, అర్ఖమ్ తదితరులు ఇస్లాం స్వీకరించారు. స్త్రీలలో విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఖదీజా (రజి అన్‌హా) తరువాత, దైవప్రవక్త(స) బాబాయి భార్య అయిన ఉమ్ముల్ ఫజ్ల్, అస్మాబిన్తె ఉమైస్, అస్మా బిన్తె అబూబక్ర్. ఉమర్ ఫారూఖ్ చెల్లెలు ఫాతిమా (రజి అన్‌హా)లు ఇస్లాం స్వీకరించారు.3

ఆ రోజుల్లో ముస్లింలు పర్వత లోయల్లోకి వెళ్ళి ఎవరికీ కనపడకుండా భయపడుతూ నమాజ్ చేసేవారు. ఒకసారి దైవప్రవక్త(స) అలీ(రజి)ని వెంటబెట్టుకొని ఓ కనుమ సందులో నమాజ్ చేస్తుండగా ఆయన(స) బాబాయి అబూతాలిబ్ అటుగా వచ్చారు. ఆయనకు ఈ వింత ఆరాధనా విధానం ఆశ్చర్యం కలిగించింది. అక్కడే నిలబడి వారు చేస్తున్న పనిని పరిశీలించసాగారు. నమాజ్ అయిపోయిన తరువాత ‘ఇదేం ధర్మం?’ అని వారిని అడిగారు. దానికి సమాధానమిస్తూ ఆయన(స) “మన పూర్వీకులయిన ఇబ్రాహీం గారిది కూడా ఈ ధర్మమే” అని అన్నారు. అది విని అబూతాలిబ్ “నేను దీన్ని అవలంబించలేను గాని మీరు మాత్రం దీనిని మీయిష్ట ప్రకారం ఆచరించుకోండి. నా బొందిలో ప్రాణముండగా మిమ్మల్నెవరూ ఆపలేరు” అని చెప్పి వెళ్ళిపోయారు.4

ఆ విధంగా మూడు సంవత్సరాల వరకూ ఆయన(స) ఎంతో రహస్యంగా ధర్మ ప్రచార విధిని నిర్వర్తించారు. దైవదౌత్య కిరణాలు అన్ని చోట్లా విస్తరించాయి. అప్పుడు “నీకు ఆజ్ఞాపించబడిన విషయాలను (ప్రజల ముందు) వెల్లడించు”. ‘నీ సన్నిహిత బంధువులను హెచ్చరించు’ అనే దివ్యఖురాన్ వాక్యాలు అవతరించాయి.5

ఒకరోజు విందుకు ఏర్పాట్లు చేయమని ఆయన(స) అలీ(రజి)ని ఆదేశించారు. ఆయన(స) బహిరంగంగా ఇస్లాం ప్రచారానికి పూనుకున్న తొలి సందర్భం ఇదే. అబ్దుల్ ముత్తలిబ్ వంశీయులందర్నీ ఆ విందు భోజనానికి ఆహ్వానించారు. విందుకు హమ్జా, అబూతాలిబ్, అబ్బాస్ ప్రభృతులు కూడా వచ్చారు. భోజనాలయ్యాక ఆయన(స) నిలబడి. “నేను ఇహపరాల మోక్షానికి దోహదం చేసే సందేశాన్ని తీసుకొని వచ్చాను. ఈ కర్తవ్య నిర్వహణలో నాకు సహకరించేవారెవరు?” అని అడిగారు. ఆ మాట వినగానే సమావేశంలో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. కాసేపటికి హజ్రత్ అలీ(రజి) దిగ్గున లేచి, “నా కళ్లకు వ్యాధి సోకింది. నేను బక్క పలచగా ఉన్నాను. ఇంకా నేనందరికన్నా చిన్నవాణ్ణి. అయినా ఫర్వాలేదు. ఈ పనిలో నేను మీకు తోడుంటాను” అని నిండు సభలో చెప్పారు. ఆ దృశ్యం చూసిన ఖురైషులు ఆశ్చర్య చకితులయ్యారు. ఇద్దరు సామాన్యులు (అందునా ఒకడు కుర్రకుంక) తోడయి ప్రపంచ గమనాన్ని నిర్దేశించాలనుకుంటున్నారు. అక్కడున్న వారంతా ఫకాలున నవ్వేశారు. కాని భవిష్యత్తులో అదే అక్షరాలా నిజమయింది.6

ఒకరోజు దైవప్రవక్త(స) సఫాకొండపైకెక్కి ప్రజలను కేకపెట్టి పిలిచారు. ప్రజలంతా అక్కడికి చేరుకున్న తరువాత, “ప్రజలారా! మీరే చెప్పండి, నేను నిజం చెప్పేవాడినా? లేక అబద్ధాలు చెప్పేవాడినా?” అని ప్రశ్నించారు. దానికి అక్కడున్న వారంతా ముక్తకంఠంతో, “ఓ ముహమ్మద్! నువ్వు అబద్ధం చెబుతుండగా గాని, పనికిమాలిన మాటలు మాట్లాడుతుండగా గాని మేమెప్పుడు వినలేదు. నువ్వు నిజాయితీపరుడవని, నిజమే చెబుతావని మాకు గట్టి నమ్మకముంది” అని సమాధానమిచ్చారు.

ఆ తరువాత దైవప్రవక్త(స) వారితో, “చూడండి, నేను కొండ శిఖరంపై నించొని ఉన్నాను. మీరు భూమ్మీద ఉన్నారు. నేను ఇక్కడి నుంచి ఇటువైపు ఏముందో, కొండకు అటువైపు ఏముందో కూడా చూడగలుగుతున్నాను. మరి నేను కొండకు ఆవలి వైపు నుంచి సాయుధులైన దోపిడిదొంగల ముఠా ఒకటి మక్కాపై దాడి చేయటానికి వస్తోందని మీకు చెబితే మీరు నా మాట నమ్ముతారా?” అని అడిగారు.

“తప్పకుండా నమ్ముతాం. నీలాంటి సత్యవంతుణ్ణి నమ్మకపోవటమా? అసంభవం. అదీగాక నువ్వు పై నుండి కొండకిరుప్రక్కలా చూడగలుగుతున్నావాయె!” అని అన్నారు అక్కడికొచ్చిన ప్రజలు. ప్రజల నుండి ఈ సమాధానం వినగానే దైవప్రవక్త(స),

“ప్రజలారా! ఇవన్నీ నేను మీకు అర్థం కావటం కోసం చెప్పిన మాటలే. ఇప్పుడు అసలు సంగతి చెబుతున్నాను వినండి. మరణం మీ తలలపై వ్రేలాడుతున్నది. మరణించిన తరువాత మీరు దైవసన్నిధిలో నిలదీయబడతారు. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో అలాగే నాకు పరలోకం ఎంతో సమీపంలో ఉన్నట్లు కనబడుతోంది” అంటూ ప్రజలకు ఉపదేశించారు.

ప్రపంచంలో చాలామంది పరలోక జీవితాన్ని విస్మరించి జీవితం గడుపుతుంటారు. కాని విశ్వాసులకు మాత్రం పరలోకం సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్నే దైవప్రవక్త(స) ప్రజల హృదయాలకు హత్తుకునేలా సోదాహరణంగా వివరించారు.7

బహుదైవారాధకుల ఆగడాలు

అప్పటికే నలభైమందికి పైగా ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు. ఆ కాలంలోనే దైవప్రవక్త(స) కాబా గృహంలోకి వెళ్ళి ధైర్యంగా దేవుడు ఒక్కడేనని ప్రకటించారు. బహుదైవారాధకులు ఈ ప్రకటనను తమ విగ్రహాల కీర్తికే కళంకమని తలపోశారు. దాంతో మక్కాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ ప్రకటన చేయగానే బహుదైవారాధకులు కత్తులు, కటారాలతో ఆయన మీద దాడి చేశారు. ఈ సంగతి హజ్రత్ ఖదీజా గారి మాజీ భర్త కుమారులైన హారిస్ ఇబ్నె అబీ హాలాకు తెలిసింది. అప్పుడు ఆయన తన ఇంట్లో ఉన్నారు. దైవప్రవక్తను కాపాడటానికి ఆయన ఇంటి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చారు. అయితే బహుదైవారాధకుల ఖడ్గాలు ఆయన మీదికి తిరగబడటంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ విధంగా హారిస్ ఇస్లాం కోసం ప్రాణత్యాగం చేసిన తొలివీరుడయ్యారు.8

దైవప్రవక్త(స) ఆ తరువాత జనసామాన్యంలో ధర్మ ప్రచారం మొదలెట్టారు. మక్కాలో, ఇతర చుట్టు ప్రక్కల గ్రామాల్లో జరిగే సంతలకు వెళ్ళి ప్రజలకు ఇస్లాం సందేశం వినిపించేవారు. వీధి వీధి తిరిగి జనానికి దేవుడు ఒక్కడేనన్న విషయాన్ని బోధించేవారు. చెట్టూ, పుట్ట, రాయీ రప్పల పూజ నుండి ప్రజల్ని వారించేవారు. దేవుడనే వాడిలో ఎలాంటి లోపాలుండవనీ, ప్రజలు కల్పిస్తున్న దైవత్వ భాగస్వామ్యానికి ఆయన అతీతుడనీ, భూమ్యాకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినవాడు ఆయనేననీ, యావత్తు సృష్టి ఆయనపైనే ఆధారపడి ఉందనీ బాధితుల మొరలను ఆలకించేవాడు, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు, ప్రజల కోరికలను తీర్చేవాడూ ఆయనేననీ, ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరూ ఏమీ చేయలేరని, ఆఖరికి దైవదూతలు దైవప్రవక్తలు కూడా ఆయన ఆజ్ఞల్ని ఉల్లంఘించలేరని ప్రజలకు బోధించేవారు. ఉకాజ్, ఉయైనా జిల్‌మజాజ్‌లు అరబ్ దేశంలో ప్రసిద్ధి చెందిన తిరునాళ్లు, వాటి కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు. దైవప్రవక్త (స) అక్కడికి వచ్చేవారందరికీ ఇస్లాం గురించి, ఒకే దేవుణ్ణి పూజించటం గురించి బోధించేవారు.9

దైవప్రవక్త(స) బహిరంగంగా విగ్రహారాధనను ఖండించటం మొదలు పెట్టినప్పుడు కొంతమంది ఖురైష్ పెద్దలు ఆయన(స) గురించి అబూతాలిబ్‌కు ఫిర్యాదు చేశారు. అబూతాలిబ్ మొదటిసారి వారికి ఎలాగో నచ్చజెప్పి వారిని త్రిప్పి పంపించారు. అయితే గొడవ మాత్రం సద్దుమణగలేదు. ఆయన(స) తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ అబూతాలిబ్ దగ్గరికి ఫిర్యాదు వచ్చింది. ఈ సారి ఉత్బా బిన్ రబీయా, షైబా, అబూ సుఫ్యాన్, ఆస్ బిన్ హిషామ్, అబూజహల్, వలీద్ బిన్ ముగీరా, ఆస్ బిన్ వాయిల్ తదితర ఖురైష్ పెద్దలంతా కలిసి అబూతాలిబ్ దగ్గరికి వచ్చారు. “అబూతాలిబ్! చూశారా! మీ సోదర పుత్రుడు మా దేవుళ్ళను అవమానపరుస్తున్నాడు. మా తాత ముత్తాతల్ని మార్గభ్రష్టులంటున్నాడు. మమ్మల్ని మూర్ఖుల క్రింద జమకడుతున్నాడు. కాబట్టి మీరు మధ్య నుంచి తప్పుకోండి లేదా మీరు కూడా యుద్ధానికి సిద్ధం కండి. మీరో మేమో తేల్చుకుందాం” అని అన్నారు. అబూతాలిబ్ ఆలోచనలో పడిపోయారు. ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఖురైషులు ఇక సహించలేరని గ్రహించారు. కాని తాను ఒంటరిగా ఖురైషులందరితో పోరాడలేరు. అంచేత ఆయన (సఅసం)ను పిలిచి ప్రేమపూర్వకంగా ‘నాయనా! నాపై మరీ అంత ఎక్కువ భారం వేయకు. నేను మోయలేను’ అని అన్నారు.

దైవప్రవక్త (స)కు ఈ లోకంలో కొండంత అండగా ఉంది ఒక్క అబూతాలిబ్ మాత్రమే. ఇప్పుడు ఆ కొండలో కూడా కదలిక కనిపిస్తుంది. ఆయన(స) కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. అశ్రుపూరిత నయనాలతోనే ఆయన(స) “దైవసాక్షి! ఈ బహుదైవారాధకులు నాకు ఒక చేతిలో సూర్యుణ్ణి, మరోచేతిలో చంద్రుణ్ణి తెచ్చి పెట్టినా సరే నేను నా కర్తవ్యాన్ని మానుకోను. దేవుడు ఈ ధర్మాన్ని సంపూర్ణం చెయ్యాలి లేదా నేను దీని కోసం ఆత్మార్పణం చేసుకోవాలి” అని కరాకండీగా చెప్పేశారు. ఆయన(స) ఆత్మ బలానికి అబూతాలిబ్ ప్రభావితులయ్యారు. ఆయన దైవప్రవక్త(స)తో “సరే. నీ పని నీవు చేసుకుంటూ పో. ఎవడూ నిన్నేమీ చేయలేడు” అని ధైర్యం చెప్పారు.10

దైవప్రవక్త(స) ఇస్లాం ధర్మ సందేశ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఖురైషులు ఆయన్ని చంపలేకపోయినప్పటికీ నానా విధాలుగా ఆయన్ని హింసించేవారు. ఆయన నడిచే దారిలో ముళ్ళు పరిచి ఉంచేవారు. నమాజ్ చేస్తున్నప్పుడు ఒంటిపై కసువు, చెత్తాచెదారం వేసేవారు. అనరాని మాటలు అనేవారు.11

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) తాను కళ్ళారా చూసిన సంఘటనను ఇలా వివరిస్తున్నారు: ఒక రోజు దైవప్రవక్త(స) కాబా ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నారు. అంతలో ఉఖబాబిన్ అబూ ముయీత్ వచ్చి తన దగ్గరున్న దుప్పటిని త్రాడులా తయారు చేశాడు. దైవప్రవక్త(స) సజ్దాలోకి వెళ్ళినప్పుడు ఆ దుప్పటిని ఆయన(స) మెడకు చుట్టి గొంతు పిసకసాగాడు. ఆయన(స) గొంతు బాగా బిగుసుకుపోయింది. అయినా ఆయన(స) ఏ మాత్రం చలించకుండా సాష్టాంగ ప్రణామంలోనే లీనమై ఉన్నారు. అంతలో అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబాను తోసేస్తూ ఈ సూక్తి చదివి వినిపించారు.

దాంతో ఆ తుంటరులు అబూబక్ర్(రజి) మీద తిరగబడి ఆయన్ని తీవ్రంగా కొట్టారు.12

ఇంకోసారి జరిగిన సంఘటన. దైవప్రవక్త(స) కాబా గృహంలో నమాజ్ చేస్తుండగా ఖురైషులు కాబా ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు. వారిలో అబూజహల్ మాట్లాడుతూ, “ఈ రోజు నగరంలో ఫలానా చోట ఒంటెను కోశారు. అక్కడ దాని పొట్ట పడి ఉంది. ఎవరైనా వెళ్ళి అది తీసుకొని వచ్చి ఇతని (దైవప్రవక్త)పై వెయ్యండి” అంటూ అక్కడున్న వారిని ఉసిగొల్పాడు. అతని మాటలు విని మూర్ఖుడైన ఉఖబా దిగ్గున లేచాడు. అపరిశుద్ధంగా ఉన్న ఆ జీర్ణాశయాన్ని తీసుకొచ్చి దైవప్రవక్త(స) సజ్దాలో ఉన్నప్పుడు ఆయన(స) వీపుమీద పెట్టేశాడు. ఆయన(స) దైవధ్యానంలో ఉన్నారు. ఈ సంగతేమీ ఆయనకు పట్టలేదు. అవిశ్వాసులు ఒకరి మీద ఒకరు పడిపోతూ పగలబడి నవ్వుతున్నారు. అక్కడ దైవప్రవక్త (స) సహచరులు ఇబ్నెమస్‌ఊద్(రజి) కూడా ఉన్నారు. కాని అవిశ్వాసుల ముఠాను చూసి ఆయన ధైర్యం చేయలేకపోయారు. అంతలో దైవప్రవక్త(స) కూతురు, చిన్నపిల్ల హజ్రత్ ఫాతిమా (రజి అన్‌హా) వచ్చి తండ్రి వీపుపై నుంచి జీర్ణాశయాన్ని తొలగించింది. అక్కడున్న అవిశ్వాసుల్ని కసురుకుంది కూడా.13

మక్కా నగరానికి బయటి నుంచి వచ్చే వారిని ముహమ్మద్(స)కు దూరంగా ఉంచాలని, ఆయన మాటలు వినకుండా చేయాలని అవిశ్వాసులు నిశ్చయించుకున్నారు. దానికోసం మార్గాలు అన్వేషించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒకడు ముహమ్మద్ జ్యోతిష్యుడని చెబుదాం అని అన్నాడు. దానికి కురువృద్ధుడైన వలీద్ బిన్ ముగీరా “నేను చాలామంది జ్యోతిష్యుల్ని చూశాను. కాని జ్యోతిష్యుల కల్లబొల్లి మాటలకు, ముహమ్మద్ సత్యవచనాలకు ఎలాంటి పొంతనా లేదు. కాబట్టి ఆ మాట చెబితే అరబ్బు తెగలవారు మేము అబద్ధం చెబుతున్నామనుకుంటారు” అని అన్నాడు. మరొకడు “ముహమ్మద్ పిచ్చివాడని చెబుదాం” అన్నాడు. దానికి వలీద్ ముహమ్మద్ పిచ్చివాడంటే ఎవరు నమ్ముతారు అని అన్నాడు. “మరయితే అతను కవిత్వం అల్లుతున్నాడని చెబుదాం” అని ఇంకొకడు సలహా ఇచ్చాడు. దానికి వలీద్ ‘కవిత్వం గురించి మనకు బాగా తెలుసు. కవితలల్లే తీరుతెన్నులన్నీ గ్రహించగలిగేవాళ్ళం మనం. ముహమ్మద్ చెబుతున్న మాటలకు కవిత్వంతో ఎలాంటి పోలిక లేదు’ అని అన్నాడు. “మరయితే ముహమ్మద్ మాంత్రికుడని ప్రచారం మొదలెడదామా!” అన్నాడు ఇంకొకడు.

‘అదీ అసంభవమే. ముహమ్మద్ పాటించే పవిత్రత, పరిశుద్ధతలు మాంత్రికులలో మనమెప్పుడయినా చూశామా? మాంత్రికుల పాలిపోయిన మొహాలు, నీచమైన అలవాట్లు మనకు తెలియనివి కావు’ అన్నాడు వలీద్‌బిన్ ముగీరా. చివరికి వారంతా “పెదనాన్నా! మరేం చెయ్యాలో మీరే చెప్పాలి?” అని అన్నారు వలిద్‌తో. అప్పుడు వలీద్ వారికి ఇలా సూచించాడు: నిజం చెప్పాలంటే ముహమ్మద్ చెప్పే వాక్యాల్లో ఏదో అనిర్వచనీయమైన మాధుర్యం ఉన్నట్లు అనిపిస్తుంది. అతని సంభాషణ రసవంతంగా ఉంటుంది. కాబట్టి ఒకటే మార్గం. అతని మాటలు తండ్రీ కొడుకుల్ని వేరు చేస్తాయని, భార్యాభర్తల మధ్య యెడబాటుని సృష్టిస్తాయని మనం ప్రజల్ని నమ్మించాలి. వలీద్ బిన్ ముగీరా సూచించిన సలహా అందరికీ నచ్చింది. అప్పటి నుండి అవిశ్వాసులు మక్కా దారుల్లో బైఠాయించి నగరంలోకి వచ్చే వారిని ముహమ్మద్(సల్లం) గురించి హెచ్చరించటం మొదలుపెట్టారు.14

ఉత్బాతో భేటి

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ముహమ్మద్ (సల్లం) ఇస్లాం ధర్మ ప్రచారం మానుకోకపోవటంతో అవిశ్వాసులంతా మళ్ళీ ఒక చోట చేరి దైవప్రవక్త(స)కు డబ్బు ఎర చూపెడదామని, అప్పటికీ తన పని మానుకోకపోతే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిద్దామని నిశ్చయించుకున్నారు. అప్పుడు మక్కాలో ప్రముఖ సర్దారు అయిన ఉత్‌బా తాను ముహమ్మద్ (సల్లం) సంగతి తేల్చుకొని వస్తానని ఛాలెంజీ చేశాడు. ఆ తరువాత దైవప్రవక్త(స) దగ్గరికి వచ్చి ఇలా ఉపన్యాసం మొదలెట్టాడు.

‘నాయనా ముహమ్మద్! నువ్వీ పని చేయటంలోని ఉద్దేశ్యం ఏమిటి? దీని ద్వారా సిరిసంపదలు కూడ బెట్టుకోవాలనుకుంటున్నావా? అలాగయితే చెప్పు. మేమే స్వయంగా నీకు కావలసినంత ధనం ఇస్తాం. ఒకవేళ నువ్వు సమాజంలో పరువు ప్రతిష్ఠల కోసం ఈ పని చేస్తున్నట్లయితే మేము నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటాము. అధికారాన్ని కోరుకుంటున్నావా? అలాగయితే నిన్ను అరబ్బు దేశానికే అధిపతిగా చేసుకుంటాం. నువ్వు కోరుకున్నదల్లా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాని నువ్వు మాత్రం నీ పద్ధతిని మార్చుకో. లేదా నీ మెదడుకేదయినా రోగం వచ్చిందేమో చెప్పు. దానికి చికిత్స చేయిస్తాం’.

అంతా విన్న తరువాత దైవప్రవక్త(స) అతనితో “ఇప్పటి వరకూ నువ్వు నాతో అన్న మాటల్లో కొంచెం కూడా యదార్థం లేదు. సిరిసంపదలు, పరువు ప్రతిష్ఠలు నాకక్కర్లేదు. నేను అధికారాన్ని కోరుకోవటం లేదు. నా మెదడుకు ఎలాంటి రోగమూ లేదు. దివ్యఖురాన్‌లోని ఈ వాక్యాలు విను. నా సందేశంలోని వాస్తవికత ఏమిటో నీకే తెలుస్తుంది” అంటూ దివ్యఖురాన్ పారాయణం మొదలుపెట్టారు.

ఆ వాక్యాలకు ఉత్‌బా దిమ్మదిరిగిపోయాడు. అరచేతిని నేలకు ఆనించి తల భుజంపై పెట్టుకొని దైవప్రవక్త(స) నోటి నుంచి వెలువడుతున్న దివ్యఖురాన్ సూక్తుల్ని తన్మయుడై వినసాగాడు. అంతా విన్న తరువాత మారుమాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల క్రితం దైవప్రవక్త(స) దగ్గరికి వెళ్ళిన ఉత్‌బా తిరిగి వచ్చేటప్పటికి మారిపోయాడు. ఖురైష్ సర్దారులు ఉత్‌బా రంగు మారిపోయింది అనడం మొదలుపెట్టారు. “ఏం జరిగింది? అని ఆతురతతో అడిగారు. దానికి ఉత్‌బా సమాధానమిస్తూ, “ఖురైషీయుల్లారా! నేనో అద్భుతమైన వాణిని విని వచ్చాను. అది కవిత్వం కాదు, చేతబడి అంతకన్నా కాదు. మంత్రజాలం అసలే కాదు. మీరు నా మాట వినండి. ముహమ్మద్‌ను అతని మానాన అతన్ని వదిలేయండి” అని అన్నాడు. అది విని అవిశ్వాసులు “ముహమ్మద్ ఉత్‌బాకు కూడా తన మాటల్తో చేతబడి చేసేశాడు” అంటూ చిందులు వేశారు.15

ఖురైష్ సర్దారులతో ముఖాముఖి

ఈ వైఫల్యం తరువాత అవిశ్వాసులకు ఎటూ పాలుపోలేదు. ముహమ్మద్ (స)ను ప్రజలందరి ముందుకు తీసుకువచ్చి నచ్చజెప్పాలని అనుకున్నారు. ఖురైషులు ఈ విషయంలో సమాలోచన జరుపుకున్న తరువాత “సర్దారులు మీతో మాట్లాడాలనుకుంటున్నారు వారు, కాబా గృహంలో సమావేశమై ఉన్నారని” దైవప్రవక్త (సల్లం)కు కబురు పంపారు. సర్దారులు ఎప్పటికయినా తన ధర్మాన్ని విశ్వసిస్తారన్న ఆశ దైవప్రవక్త(స)కు ఉండేది. వారు పిలుస్తున్నారని చెప్పగానే ఆయన(స) సంతోషంగా అక్కడికి వచ్చారు. అప్పుడు ఖురైషులు సంభాషణను ఈ విధంగా మొదలు పెట్టారు.

“ఓ ముహమ్మద్! మేము నీతో మాట్లాడటం కోసం నిన్ను ఇక్కడికి పిలిపించాం. నీ వల్ల వచ్చినన్ని కష్టాలు మన జాతికి మునుపెన్నడూ రాలేదు. నీ వల్ల మన జాతికి కలగని నష్టమంటూ లేదు. ఇప్పుడు చెప్పు. నువ్వు ఈ కొత్త ధర్మం ద్వారా సిరిసంపదలు కూడబెట్టుకోవాలనుకున్నట్లయితే మేము నీకు కావలసినంత ధనం సమకూరుస్తాం. పరువు ప్రతిష్ఠల్ని కోరుకుంటున్నట్లయితే నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటాం. అధికారం కావాలనుకుంటే నిన్ను మా దేశానికే రాజుగా అంగీకరిస్తాం. లేకపోతే ఏ భూతమైనా నిన్ను లోబరుచుకుందేమో చెప్పు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినాసరే భూత వైద్యం చేయించి తిరిగి నువ్వు మామూలు మనిషి అయ్యేటట్లు చేస్తాం. లేదా. వికలాంగుడి క్రింద లెక్కగడతాం. దానికి దైవప్రవక్త(స), ‘మీరు అనుకుంటున్నదేదీ నిజం కాదు. సిరిసంపదలు కూడబెట్టు కోవడానికి గాని, పరువు ప్రతిష్ఠలు కోరుకొనిగాని, అధికార వ్యామోహంతో గాని నేనీ ప్రచారానికి పూనుకోలేదు. వాస్తవం ఏమిటంటే, దేవుడు నన్ను మీ దగ్గరికి ప్రవక్తగా నియమించి పంపాడు. నాపై గ్రంథాన్ని అవతరింప జేశాడు. నన్ను శుభవార్తలు అందజేసేవాడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాడు. నేను మీ ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు బోధించాను. మీరు నా బోధనల్ని స్వీకరిస్తే ఇహపరాల సాఫల్యం మీ పాదాక్రాంతమవుతుంది. మీరు గనక వాటిని నిరాకరిస్తే ఇక ఆ తర్వాత నేను దేవుని నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన-నాకూ మీకూ మధ్య ఏం తీర్పు చెబుతాడో చూద్దాం’ అని సమాధానమిచ్చారు.

దానికి ఖురైషులు, “సరే ముహమ్మద్! మేము చెప్పేదాన్ని నువ్వు ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు. ఒక్క విషయం విను, మనం ఎలాంటి కరువు కాటకాల్ని ఎదుర్కొంటున్నామో నీకు తెలుసు. మన దగ్గర నీటి వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. రోజులు గడవటమే గగనమైపోయింది. కాబట్టి నువ్వు మనముందున్న ఈ పర్వతాల్ని తొలగించి నగరాన్ని విశాలవంతం చేయమని దేవుణ్ణి ప్రార్థించి. సిరియా, ఇరాక్ దేశాల్లోలాగా మన దగ్గర కూడా కాలువలు ప్రవహించాలని వేడుకో. మా తాతముత్తాతల్ని తిరిగి బ్రతికించమని చెప్పు. తిరిగి బ్రతికే వారిలో ఖుసీ బిన్ కిలాబ్ తప్పకుండా ఉండాలి సుమా! ఎందుకంటే ఒకప్పుడు అతను మా నాయకుడు. అతను నిజం చెబుతాడు. మేము అతణ్ణి నీ గురించి అడుగుతాం. అతను నీ మాటలు నిజమని ధృవీకరిస్తే, ఆ తరువాత నీవు మా కోరికలన్నీ నెరవేరిస్తే, అప్పుడు మేము నువ్వు సత్యవంతుడవనీ, దేవుని దగ్గర నీకు ఓ స్థానమంటూ ఉందని, నువ్వు చెబుతున్నట్లుగా దేవుడు నిన్ను ప్రవక్తగా నియమించి పంపాడని నమ్ముతాం” అని అన్నారు.

“ఈ పనులు చేసి పెట్టడానికి నేను ప్రవక్తగా రాలేదు. నేను మీకు సత్య సందేశాన్ని వినిపించటానికి ప్రవక్తగా పంపబడ్డాను. దేవుని సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక మీరు దాన్ని స్వీకరిస్తే దానివల్ల ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మీకే ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ నిరాకరిస్తే నేను దైవాజ్ఞ కోసం ఎదురుచూస్తాను. ఆ దేవుడే మీకూ-నాకూ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరిస్తాడు” అని చెప్పారు దైవప్రవక్త(స).

దానికి ఖురైషీయులు, “మా కోసం ప్రార్థించకపోయినా ఫర్వాలేదు. కనీసం నీ కోసమన్నా ప్రార్థించుకో. దేవుడికి నీ వెంట ఒక దూతను నియమించమని చెప్పు. అతను నిన్ను ధృవీకరిస్తూ, నిన్ను వ్యతిరేకించే వారిని వారిస్తూ నీ వెంట తిరుగుతుంటాడు. ఇంకో విషయం, అందమైన ఉద్యానవనాలు, ఎత్తైన భవనాలు, వెండి, బంగారపు నిల్వలు కూడా కావాలని కోరుకో. ఇప్పటి దాకా నీకు బజారుల వెంబడి తిరిగి ఉపాధిని వెతుక్కోవాల్సి వచ్చేది కదా! అవి వచ్చేస్తే ఇక నీకు ఈ కష్టాలేమీ ఉండవు. ఇవన్నీ జరిగిపోయినప్పుడే మేము నీ ఔన్నత్యాన్ని గుర్తిస్తాం” అని అన్నారు.

“నాకు అవేవీ అక్కర్లేదు. నేనెన్నటికీ వాటిని ప్రసాదించమని దేవుణ్ణి కోరను. నేనొచ్చిన పనితో వాటికి ఎలాంటి సంబంధమూ లేదు. దేవుడు నన్ను విశ్వాసులకు శుభవార్తలు అందజేసేవాడిగా, అవిశ్వాసుల్ని హెచ్చరించే వాడిగా చేసి పంపాడు. మీరు విశ్వసిస్తే ఇహపరాల్లోనూ మీకు మేలు కలుగుతుంది. ఒకవేళ మీరు నిరాకరించినా ఫర్వాలేదు. నేను దైవాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటాను”.

“దేవుడు తలచుకుంటే ఏమైనా చేయగలడని చెబుతున్నావుగా! మరయితే మాపై ఆకాశం విరుచుకుపడేలా చెయ్యి చూద్దాం. నువ్వు ఇలా చేసి చూపించేదాకా మేము నిన్ను విశ్వసించం” అన్నారు ఖురైషులు

“ఆ విషయం దేవుని అధీనంలో ఉంది. తాను తలచుకుంటే అదీ చేయగలడు” – సమాధానమిచ్చారు మహాప్రవక్త(స).

“ముహమ్మద్ (స)! మేము నిన్ను పిలుస్తామని, ఇలాంటి ప్రశ్నలు వేస్తామని, ఈ కోరికలు కోరుతామని, మా ప్రశ్నలకు జవాబులు ఇలా ఉండాలని, తాను ఇలా చేయాలనుకుంటున్నానని దేవుడు నీకు ముందే చెప్పలేదా? చెప్పలేదు. కాబట్టి మేము విన్నది నిజమేనని తేలిపోయింది. యమామా ప్రాంతంలో రహ్మాన్ అనే వ్యక్తి ఉన్నాడు. బహుశా అతనే నీకు ఈ బోధనలు నేర్పి ఉంటాడు. మేము ఆ రహ్మాన్‌ని ఎన్నటికీ విశ్వసించం. చూడు ముహమ్మద్! మేము నిన్ను ఎందుకు విశ్వసించటం లేదో ఈ రోజు నీకు చెప్పేశాం. కాబట్టి నీ ముందే ప్రమాణం చేసి చెబుతున్నాం. మేము బ్రతికుండగా నిన్ను ఈ ప్రచారం చెయ్యనివ్వము. ఆఖరికి నువ్వో మేమో తేల్చుకోవాల్సి వచ్చినా సరే.

సంభాషణ ఇక్కడి వరకూ వచ్చిన తరువాత ఒకడు లేచి “మేము దేవుని కుమార్తెలయిన దైవదూతల్ని పూజించేవాళ్ళం” అని అన్నాడు. ఇంకొకడు “దేవుడు, దైవదూతలు మా కళ్ళ ముందుకు వచ్చే వరకు మేము నీ మాటల్ని నమ్మం” అన్నాడు.

ఆ చివరి గొంతు విని దైవప్రవక్త(స) లేచి నిలబడ్డారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ అబూ ఉమయ్యా బిన్ ముగీరా కూడా లేచాడు. ఇతడు దైవప్రవక్త(స) మేనత్త అయిన ఆతికా కొడుకు. అతను దైవప్రవక్త(స) వెళుతుంటే ఇలా అన్నాడు:

‘ముహమ్మద్! నీ జాతి ప్రజలు నీ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. కాని నువ్వు వాటిని ఒప్పుకోలేదు. ఆ తరువాత వారు నీ గొప్పదనానికి ప్రతీకగా ఏవయినా స్పష్టమైన నిదర్శనాలు చూపించమని కోరారు. నువ్వు దానికీ అంగీకరించలేదు. తరువాత నువ్వు భయపెడుతున్న శిక్ష వచ్చిపడేలా చెయ్యమన్నారు. నువ్వు అది కూడా చెయ్యలేకపోయావు. కాబట్టి ఇక నేను నిన్ను ఎన్నటికీ విశ్వసించను. నువ్వు నా కళ్ళ ముందు నిచ్చెన సాయంతో ఆకాశం పైకెక్కి అక్కడి నుంచి నలుగురు దైవదూతల్ని వెంట తీసుకొని వచ్చినా, ఆ దైవదూతలు నువ్వు నిజంగా ప్రవక్తవని సాక్ష్యమిచ్చినా సరే నేను నిన్ను విశ్వసించను గాక విశ్వసించను.’16

వారి మాటలకు దైవప్రవక్త(స) ఏ మాత్రం తొణకలేదు. ఎంతమంది తిరస్కరించినా, ఎన్ని వ్యతిరేక పవనాలు వీచినా ఖురైషులకు ఇస్లాం గురించి బోధించటం మాత్రం వదలిపెట్టలేదు. మీరడగుతున్న విషయాలన్నీ నా బోధనల్లోనే నిగూఢమై ఉన్నాయని చెప్పేవారు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి, దైవప్రవక్త(స) విధానాన్ని ఆచరించిన బుద్ధిజీవులు, అప్పుడు అవిశ్వాసులు కోరిన మహిమల కన్నా గొప్ప అద్భుతాల్ని వీక్షించిన అనుభూతిని పొందారు.

ముస్లింలపై ఖురైషుల దురాగతాలు

దైవప్రవక్త(స) ప్రచారాన్ని నిలువరించటం తమ వల్ల కాదని ఖురైషులు తెలుసుకున్నారు. అందుకని ఇస్లాం స్వీకరించే నిరుపేద ముస్లింపై తమ ప్రతాపాన్ని చూపటం మొదలెట్టారు. అరబ్బు దేశంలోని ఎండ తీవ్రతకు అక్కడి ఇసుక నేల అట్లపెనంలా సలసలకాలిపోతూ ఉండేది. ఖురైషులు మిట్ట మధ్యాహ్నం వేళ నిరుపేద ముస్లింలను ఆ ఇసుక నేలపై నగ్నంగా పడుకోబెట్టేవారు. అటూఇటూ కదలటానికి కూడా వీలులేకుండా ఛాతీ మీద పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచేవారు. శరీరంపై కాలుతున్న ఇసుక పోసేవారు. ఇనుప చువ్వలను ఎర్రగా కాల్చి వాతలు పెట్టేవారు. నీళ్లలో ముంచి ఊపిరాడనీయకుండా చేసేవారు.

ఇలాంటి దౌష్ట్యాలు నిరుపేద ముస్లింలందరిపై జరిగేవి. అయితే ఖురైషుల కసాయితనానికి అతి ఎక్కువగా గురయిన అభాగ్య ముస్లింలు వీరు:17

ఖబ్బాబ్ బిన్ అరత్: ఈయన తమీమ్ తెగకు చెందినవారు. అజ్ఞాన కాలంలో బానిసగా అమ్ముడుపోయారు. ఉమ్మె అన్మార్ ఈయన్ని కొనుక్కుంది. దైవప్రవక్త(స) అర్ఖమ్(రజి) ఇంట్లో నివాసమున్నప్పుడు కేవలం ఆరు లేక ఏడుగురు మాత్రమే ఇస్లాం స్వీకరించారు. వారిలో ఖబ్బాబ్ (రజి) కూడా ఉన్నారు. ఖురైషులు ఈయన్ని నానా యాతనలకు గురి చేశారు. ఒకరోజు బొగ్గులు కాల్చి నేలపై పరచి ఈయన్ని వాటిపై వెల్లకిలా పడుకోబెట్టారు. ఒకడు ఆయన కదలకుండా ఛాతీపై కాలుపెట్టి వత్తసాగాడు. ఆ విధంగా ఆయన వీపుక్రింద వున్న బొగ్గులు కూడా చల్లారిపోయాయి.18

హజ్రత్ ఖబ్బాబ్(రజి) చాలా కాలం తరువాత హజ్రత్ ఉమర్ (రజి) ముందు ఈ సంఘటన వినిపించినప్పుడు వీపు మీది ఆచ్ఛాదనం తొలగించి చూపించారు. అప్పుడు ఆయన వీపుపై బొల్లి వ్యాధిలా తెల్లని మచ్చలు కనిపించాయి.

హజ్రత్ ఖబ్బాబ్ (రజి) ఇస్లాంకు పూర్వం కంసాలి పనిచేసే వారు. అప్పుడు ఆయనకు కొంతమంది నుంచి అప్పులు రావలసి ఉండేవి. ఆయన ఇస్లాం స్వీకరించిన తరువాత రుణగ్రస్తులు రుణాన్ని తిరిగి ఇవ్వటానికి నిరాకరించారు. పైగా నువ్వు ముహమ్మద్‌ను తిరస్కరించే వరకు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వముపో అనేవారు. దానికి ఖబ్బాబ్ (రజి), “మీరు చచ్చి బ్రతికినా సరే మీరు కోరుతున్నది జరగదు” అని జవాబు చెప్పేవారు.19

హజ్రత్ బిలాల్ (రజి)

ఇస్లాంలో తొలి ‘ముఅజ్జిన్’ (‘అజాన్’ ఇచ్చే వ్యక్తి) గా బిరుదాంకితులైన బిలాలే ఈయన. అబిసీనియా (ఇథియోపియా) నీగ్రో జాతికి చెందినవారు. ఉమయ్యా బిన్ ఖల్ఫ్ దగ్గర బానిస జీవితం గడిపేవారు. మిట్టమధ్యాహ్నం వేళ ఉమయ్యా ఆయన్ని మలమలా మాడే ఇసుక నేలపై పడుకోబెట్టేవాడు. ఒక పెద్ద బండరాయి ఆయన ఛాతీపై ఉంచేవాడు. దాంతో ఆయనకు కదలటానికి కూడా వీలుండేది కాదు. ఆ తరువాత ఉమయ్యా ఆయనతో, ‘ఆ ధర్మం నుండి మరలిపో, లేకపోతే ఇలాగే మూలిగి, ముక్కి ఛస్తావ్’అని బెదిరించేవాడు. ఆ సమయంలో కూడా ఆయన నోటి నుండి “అహద్ అహద్” (దేవుడు ఒక్కడే) అన్న మాటలే వెలువడేవి. ఎంత శిక్షించినా బెదరకపోవటంతో ఉమయ్యా రెచ్చిపోయి ఆయన మెడకు తాడుకట్టి ఆకతాయి కుర్రవాళ్ళకు అప్పగించేవాడు. వాళ్ళు ఆయన్ని నగరం ఈ వైపునుంచి ఆ వైపుదాకా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళేవారు. అప్పటికీ ఆయన అధరాలు ‘అహద్, అహద్’ అన్న పలుకుల్నే ఆలాపించేవి.20

హజ్రత్ అమ్మార్ (రజి): ఈయన యమన్ దేశస్థులు. ఈయన తండ్రి యాసిర్ (రజి) ఒకప్పుడు మక్కా వచ్చారు. అబూహుజైఫా మఖ్‌జూమి ఆయనకు తన బానిసరాలయిన సుమయ్యాతో వివాహం జరిపించాడు. ఆ పుణ్య దంపతుల కడుపున పుట్టినవారే అమ్మార్ (రజి). ఈయన తొలినాళ్ళలోనే ఇస్లాం స్వీకరించారు. ఈయన కంటే ముందు ఇస్లాం స్వీకరించింది ముగ్గురే. ఖురైషులు ఈయన్ని మండుతున్న ఇసుకనేలపై పడుకోబెట్టి చితక బాదేవారు. దాంతో ఆయన స్పృహ తప్పి పడిపోయేవారు. ఆయన తల్లిదండ్రుల పట్ల కూడా ఇలాగే ప్రవర్తించేవారు.21

హజ్రత్ సుమయ్యా (రజి అన్‌హా): హజ్రత్ అమ్మార్ (రజి) గారి తల్లి. ఇస్లాం స్వీకరించిందన్న నేరంపై అబూజహల్ ఆమెను ఈటెతో చంపాడు. దాంతో ఆమె అక్కడి కక్కడే నేలకొరిగి వీరమరణం పొందారు. ఇస్లాం కోసం ప్రాణార్పణం చేసిన తొలి మహిళామణి సుమయ్యా (రజి అన్‌హా).22

హజ్రత్ యాసిర్ (రజి): ఈయన అమ్మార్(రజి) గారి తండ్రి. ఈయన కూడా అవిశ్వాసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తూ అమరగతి నొందారు.

సుహైబ్ రూమి(రజి): దైవప్రవక్త(స) ఇస్లాం సందేశ ప్రచారం మొదలు పెట్టినప్పుడు సుహైబ్ రూమి మరియు అమ్మార్‌లు ఆయన(స) దగ్గరికి వచ్చారు. దైవప్రవక్త(స) బోధకు ప్రభావితులై ఇస్లాం స్వీకరించారు. అందుకని ఖురైషులు ఈయనకు స్పృహ తప్పిపోయే వరకు చిత్రహింసలు పెట్టేవారు. ఈయన మదీనాకు వలస వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఖురైషులు ఈయన్ని అడ్డుకొని తన సంపదనంతా ఇక్కడే వదలి పెట్టి వెళ్ళాలని పట్టుబట్టారు. సుహైబ్(రజి) దానికి సంతోషంతో ఒప్పుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) నమాజులో క్షతగాత్రులయినప్పుడు ప్రజల నమాజ్‌కు సారధ్యం వహించమని ఆయన సుహైబ్(రజి)నే పురమాయించారు.23

అబూఫుకైహా (రజి): ఈయన సఫ్‌వాన్ బిన్ ఉమయ్యా బానిస. బిలాల్ (రజి)తో పాటు ఇస్లాం స్వీకరించారు. ఉమయ్యాకు ఈ విషయం తెలిసినప్పుడు అతను ఈయన్ని కాళ్ళకు త్రాడుకట్టి ఈడ్చుకుంటూ వెళ్ళండని, కాలుతున్న ఇసుకపై పడుకోబెట్టండని జనానికి అప్పగించాడు. దారిలో ఒక గొంగళి పురుగు కనబడితే, “నీ దేవుడు ఇతనేననుకుంటా” అని అన్నాడు. దానికి ఫుకైహా (రజి), “నీకూ, నాకూ ఇద్దరికీ దేవుడు అల్లాహ్ మాత్రమే” అని అన్నారు. ఆ మాటకు రెచ్చిపోయిన ఉమయ్యా ఆయన మీద పడి గొంతు పిసకటం మొదలుపెట్టాడు. అది చూసిన జనం ఫుకైహా(రజి) ప్రాణాలు పోయి ఉంటాయని అనుకున్నారు. ఒకరోజు ఆయన ఛాతీపై బరువైన వస్తువు ఏదో ఉంచాడు. దాంతో ఫుకైహా నాలుక బయటికి వచ్చింది.24

హజ్రత్ లుబైనా (రజి అన్‌హా): ఈమె కూడా ఒక బానిసరాలు. హజ్రత్ ఉమర్ ఈమెను కొట్టి కొట్టి అలసిపోయినప్పుడు, “నేను నీపై దయజూపి వదలిపెట్టడం లేదు. కొట్టి కొట్టి అలసిపోయాను. అందుకే వదలి పెడుతున్నాను” అనేవారు. ఆ సమయంలో కూడా ఆ వీరవనిత ఎంతో స్థయిర్యాన్ని కనబరుస్తూ, “ఉమర్! నువ్వు గనక ఇస్లాం స్వీకరించకపోతే దేవుడు దీని ప్రతీకారం తీర్చుకుంటాడు” అని చెప్పేది25

జన్నీరా (రజి అన్‌హా): హజ్రత్ ఉమర్(రజి) కుటుంబానికి చెందిన బానిస స్త్రీ. అందుకని ఉమర్ (రజి) తాను ఇస్లాం స్వీకరించక ముందు ఈమెను తనివితీరా బాధలు పెట్టేవారు. అబూజహల్ ఈమెను కొట్టి కొట్టి కళ్ళు లొట్ట పోయేలా చేశాడు.26

నహ్‌దియ్యా మరియు ఉమ్మె ఉబైస్ (రజి అన్‌హా): వీరిద్దరు కూడా బానిస స్త్రీలే. ఇస్లాం స్వీకరించిన నేరానికి వీళ్ళు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు.27

ఈ సందర్భంగా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) దాతృత్వాన్ని గురించి చెప్పుకోవాలి. ఆయన ఈ బాధితుల్లో ఎంతోమంది ప్రాణాలను రక్షించారు. బిలాల్, ఆమిర్ బిన్ ఫుహైరా, లుబైనా, జన్నీరా, ఉమ్మెఉబైస్- వీళ్ళందరినీ ఆయన భారీ మూల్యాలను చెల్లించి బానిసత్వ బంధనాల నుంచి విడిపించారు.28 ఖురైషులు బలహీన వర్గాల వారినే కాదు. ఉన్నత వర్గాల వారిలో ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారిని కూడా హింసించకుండా వదలిపెట్టేవారు కాదు. ఈ కోవకు చెందిన వారిలో ప్రముఖులు వీరు:

ఉస్మాన్ (రజి): ఈయన వయోజనుడు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన ఇస్లాం స్వీకరించినప్పుడు ఇతరులెవరో కాదు. సొంతబాబాయే ఈయన్ని త్రాళ్ళతో కట్టి హింసించాడు.29

అబూజర్ర్ (రజి): ఇస్లాం స్వీకరించిన వారిలో ఏడవ వ్యక్తి. ఈయన తాను ముస్లిం అయిన సంగతి కాబా గృహంలో ప్రకటించినప్పుడు ఖురైషులు ఈయన్ని చితకబాదారు.30

జుబైర్ బిన్ అవ్వామ్ (రజి): ఇస్లాం స్వీకరించిన వారిలో ఈయన ఐదవ వ్యక్తి. ఇస్లాం స్వీకరించినందుకు ఈయన బాబాయి ఈయన్ని చాపలో చుట్టి, ముక్కుకి పొగబెట్టి ఊపిరాడకుండా చేసేవాడు.31

ఉమర్(రజి) గారి పినతండ్రి కొడుకు సయీద్‌బిన్ జైద్ (రజి) ఇస్లాం స్వీకరించినప్పుడు ఉమర్ ఆయన్ని త్రాళ్ళతోకట్టేశారు.32

ఈరాన్ విజేత సాద్ బిన్ అబూవఖ్ఖాస్ (రజి): ఈయన చాలా గొప్ప వ్యక్తి. తన తెగవారిలో పరపతి గల మనిషి. అయినప్పటికీ అవిశ్వాసుల ఆగడాల నుండి ఈయన కూడా సురక్షితంగా ఉండలేకపోయారు. ఇస్లాం స్వీకరించిన నేరానికి అసద్ తెగవారు ఈయన్ని చాలా కఠినంగా శిక్షించారు. అప్పటి వరకు కాబా గృహంలో బిగ్గరగా ఖురాన్ పఠించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కాని ఇబ్నెమస్‌వూద్ (రజి) ఇస్లాం స్వీకరించినప్పుడు తాను ఈ విధిని నిర్వర్తించి తీరుతానని ప్రతినబూనారు. ప్రజలు వద్దని ఎంత చెప్పినా వినలేదు. కాబా ప్రాంగణంలోకి ప్రవేశించి ‘ముఖామె ఇబ్రాహీం’ దగ్గర నిలబడి రహ్మాన్ సూరా పారాయణం మొదలుపెట్టారు. అది విని అవిశ్వాసులు ఆయనపై దాడి చేసి మొహం మీద కొట్టసాగారు. కాని ఆయన ఖురాన్ పారాయణాన్ని మాత్రం ఆపలేదు. ముఖమంతా గాయాలతో తిరిగి వెళ్ళారు.33

అబూబక్ర్(రజి) పట్ల అవిశ్వాసుల వైఖరి

హజ్రత్ అబూబక్ర్(రజి) మక్కా నగరంలో గౌరవోన్నతులు గల వారిలో ఒకరు. కాని ఇస్లాం స్వీకరించిన తరువాత ఆయనకు కూడా అవిశ్వాసుల చిత్రహింసలు తప్పలేదు. ఒకరోజు ప్రజలు ఆయన్ని క్రిందపడేసి తొక్కారు. విపరీతంగా కొట్టారు. ఉత్‌బా బిన్ రబీయా ఆయన్ని తోళ్ళ ముక్కలు అంటించివున్న చెప్పులతో కొట్టాడు. అవిశ్వాసుల దెబ్బలకు ఆయన ముఖం వాచిపోయింది. కాళ్లు చేతులు నుజ్జు నుజ్జయిపోయాయి. ఆయన తెగవారు ఆయన్ని ఒక వస్త్రంలో చుట్టి ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో అప్పజెప్పారు. అబూబక్ర్ బ్రతికి బయటపడతారని ఎవరూ అనుకోలేదు. సాయంత్రానికి గాని నోట మాట రాలేదు. నోరు విప్పడంతోనే ‘దైవప్రవక్త(స) క్షేమమేనా!’ అని అడిగారు. ఇంత జరిగినా నీకు దైవప్రవక్త చింత వదల్లేదా? అని ఇంట్లో వాళ్లు ఆయన్ని మందలించారు. జనమంతా వెళ్ళిపోయిన తరువాత ఆయన తన తల్లితో మళ్ళీ దైవప్రవక్త(స) క్షేమసమాచారం దర్యాప్తు చేశారు. “ఆ విషయాలేవీ నాకు తెలియవు” అని ఆమె అన్నది. ఆయన ఉమ్మె జమీల్‌ను అడిగి రమ్మని కోరారు. అంతలో ఉమ్మెజమిల్ ఆయన్ని పరామర్శించటానికి వచ్చారు. ఆయన పరిస్థితి చూసి ఆమె, ఉద్రేకంతో, “మీ పట్ల ఇలా ప్రవర్తించిన వారు దుష్టులు. దైవ విరోధులు. దేవుడు వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడని నాకు గట్టి నమ్మకముంది” అన్నారు. “దైవప్రవక్త(స) క్షేమమే కదా!” అని అబూబక్ర్ (రజి) అడిగారు. ‘ఆయన(స) క్షేమంగానే ఉన్నారు’ అని చెప్పారామె. ‘ఇప్పుడాయన(స) ఎక్కడున్నారు?’ అబూబక్ర్(రజి) ఎంతో ఆతురతతో అడిగారు. ప్రస్తుతం ఆయన(స) ఇబ్నె అర్ఖమ్ గారి ఇంట్లో ఉన్నారని అందామె. “దైవప్రవక్త(స)ను చూడనంతవరకు నేను అన్నపానీయాలు ముట్టను” అని అబూబక్ర్ (రజి) పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత, బయట జనసంచారం తగ్గిపోయి అంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఆయన తల్లి, ఉమ్మె జమిల్ ఇద్దరూ ఆయన్ని దైవప్రవక్త (సఅసం) సన్నిధికి తీసుకొని వెళ్ళారు. దైవప్రవక్తను కలుసుకున్న తరువాతగాని ఆయన మనసు కుదుటపడలేదు.34

ఇథియోపియాకు ముస్లింల వలస

అవిశ్వాసుల ఆగడాలకు అడ్డూ అయిపూ లేకుండా పోయింది. బలహీన ముస్లింలపై బహుదైవారాధకుల హింసాకాండ ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు వారు తమ విశ్వాసాన్ని, ప్రాణాలను కాపాడుకోవటానికి ఇథియోపియా దేశం వెళ్ళవచ్చని దైవప్రవక్త(స) అనుమతినిచ్చారు.

దైవప్రవక్త(స) అనుమతిని పొంది పదకొండుమంది పురుషులు, నలుగురు స్త్రీలతో కూడిన ఒక బృందం రేచీకటిలో ఇథియోపియాకు బయలుదేరింది. వారంతా షయీబా రేవు నుండి పడవ ద్వారా ప్రయాణించి ఇథియోపియాకు చేరుకున్నారు.35

ఈ చిన్న బృందానికి నాయకులుగా ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రజి) నియమితులయ్యారు. ఆయన వెంట దైవప్రవక్త(స) కుమార్తె రుఖయా (రజి.అన్‌హ) కూడా ఉన్నారు. దైవప్రవక్త(స) వారిని సాగనంపుతూ, “ఇబ్రాహీం (అలైహి) తరువాత దైవ మార్గంలో ప్రస్థానం చేస్తున్న తొలిదంపతులు వీరే”నని అన్నారు.36

వారి వెనుక ఇంకొంతమంది ముస్లింలు (83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు) మక్కా నుండి ఇథియోపియాకు బయలుదేరారు. వారిలో దైవప్రవక్త(స) పినతండ్రి కుమారుడు జాఫర్ తయ్యార్(రజి) కూడా ఉన్నారు. ఖురైషులు సముద్రం వరకు వారిని వెంటాడారు. కాని వారు అప్పటికే పడవల్లో ఎక్కి బహుదైవారాధకులకు చిక్కకుండా ప్రయాణం కొనసాగించారు.37

ఇథియోపియా రాజు క్రైస్తవుడు. మక్కా అవిశ్వాసులు ముస్లింలను అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదలచుకోలేదు. రాజుకు విలువైన కానుకలు, పారితోషికాలు సమర్పించుకొని తమ దేశం నుండి పారిపోయి వచ్చిన వారిని తమకు అప్పగించవలసిందిగా రాజుని కోరారు. రాజు ముస్లింలను దర్బారులోకి పిలిపించాడు. ఆ సందర్భంగా దైవప్రవక్త పినతండ్రి కుమారుడు జాఫర్ తయ్యార్(రజి) రాజ దర్బారులో ఈ విధంగా ప్రసంగించారు:

“రాజా! ఒకప్పుడు మేము అజ్ఞానులుగా బతికేవాళ్ళం. విగ్రహాలను పూజించేవాళ్ళం. మృత జంతువుల మాంసాన్ని తింటూ అపరిశుభ్రంగా ఉండేవాళ్ళం. అబద్ధాలు చెప్పేవాళ్ళం. మాలో మానవత్వం, మంచితనం మచ్చుకైనా ఉండేవి కావు. తోటివారి పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదు. నీతి నియమంలేని జీవితం గడిపేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో దేవుడు మా దగ్గరికి ఓ పుణ్యాత్ముణ్ణి ప్రవక్తగా పంపించాడు. ఆయన వంశం, కుటుంబం గురించి ఆయన నిజాయితీ తత్పరత గురించి, దైవభక్తి, ధర్మపరాయణతల గురించి మాకు బాగా తెలుసు. ఆయన మాకు ఒకే దేవుణ్ణి పూజించమని పిలుపు ఇచ్చాడు. దేవునికి ఇతరుల్ని సాటి కల్పించకూడదని బోధించాడు. రాయిరప్పల పూజ నుండి మమ్మల్ని వారించాడు. సత్యం పలకమని, వాగ్దానాలను నెరవేర్చమని, చెడులకు దూరంగా ఉండమని, పాపాల నుండి రక్షించుకోమని బోధించాడు. నమాజ్ చెయ్యమనీ, దానధర్మాలు ఇవ్వమనీ, ఉపవాసాలు పాటించమని ఆదేశించాడు. మేమాయన చెప్పిన మాటల్ని నమ్మినందుకు మా జాతివారు మాపై శత్రుత్వాన్ని పెంచుకున్నారు. కసితీరా హింసించారు. ఒకే దేవుణ్ణి వదలిపెట్టి కొయ్యబొమ్మల్ని, రాతి విగ్రహాలను పూజించమని బలవంతపెట్టారు. మేము వీళ్ళ చేతుల్లో నానాయాతనలు అనుభవించాం. చివరకు గత్యంతరం లేక మీ రాజ్యంలో మాకు రక్షణ లభిస్తుందన్న ఆశతో వచ్చాం”.

రాజు ప్రసంగమంతా విన్న తరువాత తనకు ఖురాన్ పఠించి వినిపించమని కోరాడు. అప్పుడు జాఫర్ తయ్యార్ (రజి) అతనికి మర్యమ్ సూరాలోని వాక్యాలను పఠించి వినిపించారు. రాజు ఆ వాక్యాలకు ప్రభావితుడై కంటతడిపెట్టాడు. “నిస్సందేహంగా యేసుక్రీస్తు తన తరువాత వస్తారని చెప్పిన ప్రవక్త ఈ ముహమ్మదే. ఈ ప్రవక్త కాలంలో నేను బ్రతికి ఉన్నందుకు దైవానికి కృతజ్ఞతలు” అని అన్నాడు. ఆ తరువాత మక్కా అవిశ్వాసుల్ని తన దర్బారు నుండి తరిమేశాడు.

మరునాడు అమ్ర్ బిన్ ఆస్ మళ్ళీ దర్బారుకు వెళ్ళి నజాషీతో మాట్లాడుతూ “రాజా! ఈసా ప్రవక్త విషయంలో వీళ్ళ విశ్వాసం ఏమిటో తెలుసుకున్నారా?” అని అడిగారు. నజాషీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటం కోసం ముస్లింలను మళ్ళీ దర్బారుకు పిలిపించాడు. నజాషీ క్రైస్తవుడు. ఈసా (అలైహి) దేవుని కుమారుడు కారని చెబితే అతనికి కోపం వస్తుందేమోనని ముస్లింలు ముందు నిజం చెప్పటానికి తటపటాయించారు. కాని హజ్రత్ జాఫర్(రజి), “ఏమైనా సరే. మనం నిజం చెబుదాం” అని అన్నారు.

ఆ తరువాత ముస్లింలు దర్బారుకు హాజరయ్యారు. నజాషీ వారిని, “ఈసా (ఏసుక్రీస్తు) ప్రవక్త విషయంలో మీ విశ్వాసం ఏమిటి?” అని ప్రశ్నించాడు. దానికి సమాధానమిస్తూ “ఈసా దేవుని దాసుడు, దైవప్రవక్త, ఇంకా ఆయన దేవుని వచనమని మా ప్రవక్త చెప్పారు” అని హజ్రత్ జాఫర్ (రజి) అన్నారు. ఆ మాట విని నజాషీ ఆ నేలపై నుంచి ఓ పుల్లను ఎత్తి చూపుతూ, “దైవసాక్షి! ఈసా (ఏసుక్రీస్తు) విషయంలో మీరు చెప్పినది వాస్తవం. దీనికి మించి ఇతరత్రా వాటికి ఈ పూచిక పుల్లంత విలువ కూడా లేదు” అని అన్నాడు. రాజు ఆ మాట అనగానే దర్బారులో వున్న క్రైస్తవమత పెద్దలు ఆగ్రహోదగ్రులయ్యారు. కోపంతో వారి ముక్కుపుటాలు అదిరిపోయాయి. కాని నజాషీ వారి కోపాన్ని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. ఖురైష్ దూతలు ఒట్టి చేతులతో మక్కాకు తిరిగి వచ్చారు.38

హమ్జా (రజి) ఇస్లాం స్వీకరణ

హజ్రత్ హమ్జా (రజి) దైవప్రవక్త (స)కు స్వయాన బాబాయి. దైవప్రవక్త(స) అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం, వాత్సల్యం. దైవప్రవక్త(స) కన్నా వయసులో రెండుమూడేళ్ళు పెద్ద. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇద్దరూ ‘సౌబియా’ దగ్గర పాలు తాగారు. అందువల్ల పరస్పరం పాల సోదరులు కూడా అవుతారు. అప్పటికింకా ఇస్లాం స్వీకరించకపోయినప్పటికీ దైవప్రవక్త(స) చేసే ప్రతి పనినీ ఆయన గౌరవభావంతో చూసేవారు. విలువిద్య నేర్చుకోవటం, జంతువుల్ని వేటాడటమంటే ఆయనకు ఎంతో యిష్టం. పెందలాడే నిద్రలేచి, ధనుర్బాణాలు వెంటబెట్టుకొని వెళ్ళి పగలంతా వేటాడటంలోనే గడిపేవారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చినప్పుడు ముందు కాబా గృహానికి వెళ్ళి, అక్కడ కాబా చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఆ కాలంలో ఖురైష్ సర్దారులు కాబా ప్రాంగణంలో గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. హమ్జా(రజి) వారికి అభివాదం చేసి, అప్పుడప్పుడూ తాను కూడా వారితో కలిసి కాలక్షేపం చేసేవారు. ఆ విధంగా ఆయనకు అందరితోనూ స్నేహ సంబంధాలుండేవి. ఖురైషులు కూడా ఆయనకు మర్యాద ఇచ్చేవారు.

దైవప్రవక్త(స) పట్ల అవిశ్వాసులు వ్యవహరించే కఠిన వైఖరిని చూసి బయటివారు కూడా సహించలేకపోయేవారు. ఒకరోజు అబూజహల్ ఆయన(స) పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు. ఒక బానిసరాలు ఇదంతా చూసి, సాయంత్రం హమ్జా వేట నుంచి తిరిగొచ్చిన తరువాత జరిగినదంతా ఆయన ముందు ఏకరువు పెట్టింది. అది విని హమ్జా కోపోద్రిక్తులయ్యారు. ధనుర్బాణాలతో సహా కాబా దగ్గరికి వెళ్ళి అబూజహల్‌తో “నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకోపో” అని గర్జించారు.39

ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన సంఘటన

ఆయన(స) దైవప్రవక్తగా నియుక్తులయ్యే నాటికి ఉమర్(రజి)కు ఇరవై ఏడేళ్ళు. ఆయన వంశంలో జైద్ ఇస్లాం స్వీకరించి ఉండటం వల్ల ఒకే దేవుణ్ణి ఆరాధించాలన్న మాట ఆయనకు క్రొత్తేమీ కాదు. ముందుగా ఆయన వంశానికి చెందినవారిలో జైద్ కుమారులు సయీద్ ఇస్లాం స్వీకరించారు. సయీద్ భార్య ఫాతిమా ఉమర్ (రజి)చెల్లెలు. ఆ విధంగా భార్యా భర్తలిద్దరూ ముస్లింలయ్యారు. కాని ఉమర్ (రజి) అప్పటికింకా ఇస్లాం స్వీకరించలేదు. తొలినాళ్ళలో ఆయన ఇస్లాం గురించి విని చాలా మండిపడ్డారు. అంతేకాదు, తన వంశంలో ఇస్లాం స్వీకరించిన వారికి విరోధులయ్యారు. ఆయన కుటుంబానికే చెందిన లుబైనా అనే బానిసరాలు ఇస్లాం స్వీకరించింది. దాంతో ఆయన ఆమెను కొట్టి కొట్టి అలసిపోయి, ‘కాస్త ఓపికరాని మళ్ళీ కొడతాను’ అని అనేవారు. ఒక్క లుబైనానే కాదు, వీలుచిక్కిన ముస్లింలందర్నీ చితగ్గొట్టేవారు. కాని ప్రజల్లో ఎవరయినా ఒకసారి ఇస్లాం మాధుర్యాన్ని ఆస్వాదిస్తే చాలు, లోకమంతా ఏకమైనా వారు దాన్నుంచి వేరయ్యేవారు కారు. ఉమర్ కూడా ముస్లింలను వేధించి ఒక్కర్ని కూడా ఇస్లాం నుండి మరల్చలేకపోయారు. ఆఖరికి ఇస్లాం ధర్మాన్ని రూపుమాపాలంటే దైవప్రవక్త(స)ను హతమార్చడం ఒక్కటే మార్గమని తలంచారు.

ఒకరోజు ఖడ్గాన్ని చేబూని దైవప్రవక్త(స)ను హతమార్చాలన్న ఉద్దేశ్యంతో ఆయన(సల్లం) ఉండేచోటుకి బయలుదేరారు. దారిలో నుఐమ్ బిన్ అబ్దుల్లాహ్ ఎదురయ్యారు. ఉమర్ ఆగ్రహావేశాన్ని చూసి ఆయన “ఉమర్! క్షేమమే కదా! ఎక్కడికి బయలుదేరావ్?” అని అడిగారు. ‘ముహమ్మద్ సంగతి తేల్చుకోవటానికి వెళుతున్నాను’ అని అన్నారు ఉమర్ ఆవేశంతో ఊగిపోతూ. ‘ముందు నీ ఇంట్లోవాళ్ళ పరిస్థితి ఏమిటో చూసుకో. స్వయానా నీ చెల్లెలు, నీ బావ ఇస్లాం స్వీకరించారు’ అని అన్నారు నుఐమ్. ఆ మాట వినగానే ఉమర్ (రజి) వెనక్కి తిరిగి చెల్లెలి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఖురాన్ పారాయణం చేస్తోంది. అన్నయ్య వచ్చాడని గ్రహించి పారాయణం ఆపేసింది. ఖురాన్ ప్రతులు దాటిపెట్టింది.

కాని ఆమె ఖురాన్ చదువుతున్న శబ్దం ఆయన బయటి నుంచే విన్నారు. “ఇందాక నువ్వు చదువుతున్నది ఏమిటి?” అని గద్దిస్తూ అడిగారు. “అబ్బే ఏం లేదు” – భయపడుతూనే జవాబు చెప్పింది చెల్లెలు.

“కాదు, నేనా శబ్దం విన్నాను. మీరిద్దరూ మతభ్రష్టులయిపోయారం”టూ బావ చొక్కా పట్టుకొని ఎడాపెడా వాయించటం మొదలుపెట్టారు. ఆయన్ని కాపాడటానికి అడ్డు వచ్చిన చెల్లెల్ని కూడా వదల్లేదు. ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. కాని ఆమెలోని విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. “ఉమర్ నువ్వు మా ప్రాణాలు తీసినా సరే. మేము ఇస్లాం ధర్మాన్ని వదలిపెట్టం” అన్నది చెల్లెలు ఉద్వేగంతో.

ఆ మాటలకు ఉమర్ హృదయం ఒక్కసారిగా చలించింది. చెల్లెలి వంక ప్రేమ నిండిన చూపులతో చూశారు. ఆమె ఒళ్ళంతా గాయాలే. ఆ దృశ్యం చూసి ఆయన పూర్తిగా చల్లబడిపోయారు. తరువాత మృదువైన స్వరంతో “మీరు చదువుతున్న గ్రంథం. కాస్త నాక్కూడా చూపిస్తారా! ముహమ్మద్ సందేశం ఏమిటో తెలుసుకుంటాను” అన్నారు.

“నువ్వు ఈ గ్రంథం పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తావేమోనని మాకు భయంగా ఉంది” అని ఆమె అన్నది.

“లేదమ్మా. నా దేవుళ్ళ మీద ఒట్టేసి చెబుతున్నాను. ఒక్కసారి చదివి తిరిగి నీకే ఇచ్చేస్తాను” అన్నారాయన ఎంతో సౌమ్యంగా. ఆ మాట వినగానే ఆమె, ఉమర్ కూడా సన్మార్గం పొందే శుభఘడియ వచ్చిందని గ్రహించింది.

“నువ్వు బహుదైవారాధకుడివి, అపవిత్రుడువి. ఈ గ్రంథాన్ని పవిత్రులు మాత్రమే ముట్టుకోవాలి. ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా” అందామె.

ఉమర్ స్నానం చేసి వచ్చారు. అప్పుడు చెల్లెలు ఆయనకు ఖురాన్ ప్రతులిచ్చింది. ఆ ప్రతుల్లో ఆయనకు ముందుగా ‘తాహా’ సూరా కనిపించింది. ఆయన మొదటినుంచి కొన్ని వాక్యాల వరకు చదివి అప్రయత్నంగానే “ఆహా… ఈ గ్రంథం ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఉంది!” అని అన్నారు. ఉమర్ నోటి నుండి ఆ మాట వెలువడగానే ఆయన వస్తున్నారని భయపడి ఓ మూలన నక్కి కూర్చున్న ఖబ్బాబ్(రజి) బయటికి వచ్చి, “ఉమర్! దేవుడు తన ప్రవక్త కోరికను మన్నించినట్లుంది. నిన్న దైవప్రవక్త(స), “దేవా! అబూజహల్ ద్వారా గాని, ఉమర్ ద్వారా గాని ఈ ధర్మానికి సహాయమందించు” అని ప్రార్థిస్తుండగా విన్నాను. కనుక “ఉమర్! ఈ అవకాశాన్ని చేజారనివ్వకు” అని అన్నారు.

“ఖబ్బాబ్! దైవప్రవక్త(సఅసం) ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్లాం స్వీకరిస్తాను” అని అన్నారు ఉమర్(రజి).

ఖబ్బాబ్ ఆయనకు దైవప్రవక్త(స) ఉండేచోటు తెలియజేశారు.

ఆ సమయంలో దైవప్రవక్త(స) అర్ఖమ్ (రజి) ఇంట్లో ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) ఆయన ఆస్థానానికి చేరుకొని తలుపుతట్టారు. ఉమర్ చేతిలో ఖడ్గాన్ని చూసి దైవప్రవక్త (స) సహచరులు భయపడ్డారు. అప్పుడు హమ్జా (రజి), “అతణ్ణి రానివ్వండి, అతను మంచి ఉద్దేశ్యంతో వస్తే సరేసరి; లేకపోతే అతని ఖడ్గంతోనే అతని తల నరికేస్తాను” అన్నారు. కాని ఉమర్ (రజి) లోపల అడుగుపెట్టగానే దైవప్రవక్త(స) స్వయంగా వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని, “ఉమర్! ఏ ఉద్దేశ్యంతో వచ్చావ్?” అని అడిగారు. దైవప్రవక్త(స) గంభీర స్వరానికి ఆయన గజగజ వణకిపోయారు.

“ఇస్లాం స్వీకరించడానికి” – కడు వినయంగా సమాధానమిచ్చారు ఉమర్ (రజి). ఆ సమాధానం వినగానే దైవప్రవక్త(స) ‘అల్లాహు అక్బర్’! అని నినదించారు. ఆయన సహచరులు కూడా ‘అల్లాహు అక్బర్!’ అంటూ నినదించటం మొదలుపెట్టారు. ఆ నినాదాలకు చుట్టుప్రక్కల ఉన్న పర్వతాలు ప్రతిధ్వనించాయి.40

హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించటంతో ఇస్లామీయ చరిత్రలో ఓ క్రొత్త అధ్యాయం మొదలయింది. ఆయనకు ముందు నలభై యాభైమంది ఇస్లాం స్వీకరించారు. వారిలో హమ్జా (రజి) లాంటి గొప్ప పరాక్రమవంతులు కూడా ఉన్నారు. కాని అప్పటి వరకు ముస్లింలు తమ విధులను బహిరంగంగా నిర్వర్తించలేకపోయేవారు. కాబా గృహంలో నమాజ్ చెయ్యడమంటే మరీ కష్టం. కాని ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన తరువాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆయన బహిరంగంగానే ప్రజల ముందు తాను ఇస్లాం స్వీకరించానని ప్రకటించారు. ఈ ప్రకటనతో మొదట్లో అవిశ్వాసుల తరపు నుండి ఆయనపై కష్టాల కొండలు విరుచుకుపడ్డాయి. కాని ఆయన ఏ మాత్రం తొణకలేదు. అసామాన్య సహనస్థయిర్యాలను ప్రదర్శిస్తూ అవిశ్వాసులతో పోరాడారు. ఆయన ప్రోద్బలంతోనే ముస్లింలు కాబా గృహంలో సామూహికంగా నమాజ్ చేయగలిగారు.41

ఇథియోపియాకు వలసవెళ్ళిన యనభై మూడు మంది ముస్లింలు అక్కడ కొంత కాలం పాటు ప్రశాంతంగానే జీవితం గడిపారు. కాని ఆ తరువాత వారికి మక్కా అవిశ్వాసులు కూడా ఇస్లాం స్వీకరించారన్న సమాచారం అందింది. దాంతో అనేకమంది ముస్లింలు మక్కాకు తిరుగు ప్రయాణమయ్యారు. మక్కా సమీపానికి చేరుకున్న తరువాత ఆ సంగతి నిజం కాదని తెలిసింది. అంచేత కొంతమంది తిరిగి ఇథియోపియాకు వెళ్ళిపోయారు. అయితే చాలామంది రహస్యంగా మక్కా నగరానికి వచ్చేశారు.42

ఉస్మాన్ బిన్ మజ్‌వూన్ మక్కా రాకతో ఆయనపై అవిశ్వాసుల దౌర్జన్యకాండ

ఈ వదంతి మూలంగా మక్కాకు తిరిగి వచ్చిన వారిలో ఉస్మాన్ బిన్ మజ్‌వూన్ (రజి) కూడా ఉన్నారు. ఆయన అరబ్బుల ఆచారానికనుగుణంగా వలీద్ బిన్ ముగీరా దగ్గర శరణు పొందారు. కాని ముస్లింలలో తనకు తప్ప ఎవరికీ ఖురైష్ సర్దారుల రక్షణ లేదు. పైగా ముస్లింలు ఖురైషుల ఆగడాలకు గురౌతున్నారు. ఉస్మాన్ తనకు వలీద్ రక్షణ ఉండటం చేత స్వేచ్ఛగా తిరగగలిగేవారు. ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. కాని ఒకవైపు తోటిముస్లింలపై ఖురైషులు దౌర్జన్యానికి పాల్పడుతుంటే తాను ఖురైష్ సర్దారు, బహుదైవారాధకుడు అయిన వలీద్ రక్షణలో ఉండటానికి ఆయన యిష్టపడలేదు. తాను సాటి ముస్లింల కష్టాల్లో పాలుపంచుకోవటం లేదని, ఇది తన విశ్వాస బలహీనత అని ఆయన మనస్సాక్షి లోలోపలి నుంచి హెచ్చరించసాగింది. అంచేత ఆయన వలీద్ దగ్గరికి వెళ్ళి, “ఇంతవరకు మీరు మీ రక్షణ బాధ్యతను నెరవేర్చారు. కాని ఇక నుంచి నేను మీ సంరక్షణలో ఉండదలచుకోలేదు. ఇకనుంచి మీరు నాకు ఎలాంటి బాధ్యత వహించనక్కర్లేదు” అని నిర్ద్వంద్వంగా చెప్పేశారు.

ఆ మాటకు వలీద్ “బాబూ! నా తెగవారు నీకేమయినా కీడు తలపెట్టారా ఏమిటి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ ఉస్మాన్ (రజి) “లేదండి నేనే స్వయంగా ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు ఇక దేవుని ఆశ్రయం తప్ప మరెవరి ఆశ్రయమూ అవసరం లేదు” అన్నారు. “అలాగయితే కాబా గృహం దగ్గరికి వెళ్ళి ఇక నుంచి నువ్వు నా రక్షణలో ఉండటం లేదని ప్రకటించు. నా బాధ్యత కూడా తీరిపోతుంది” అన్నాడు వలీద్.

ఆ తరువాత ఇద్దరూ కాబా గృహం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వలీద్ అందరి ముందు నిలబడి “ప్రజలారా! ఉస్మాన్ నా రక్షణలో నుంచి తొలగిపోతున్నాడు” అని చాటాడు. ఆ తరువాత ఉస్మాన్ (రజి) “ఔను, నిజంగానే నేను ఈయన రక్షణ నుండి తొలగిపోతున్నాను. ఈయన తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. తన బాధ్యత నిర్వహణలో ఎలాంటి లోటూ రానివ్వలేదు. కాని ఇక నుంచి నేను దేవుని రక్షణలో తప్ప మరెవరి రక్షణలోనూ ఉండకూడదని నిశ్చయించుకున్నాను” అన్నారు.

ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళుతుండగా ఒకచోట ఖురైషుల కవితాగోష్ఠి జరుగుతోంది. అరబ్బు ప్రఖ్యాత కవి లబీద్ ఆ గోష్ఠిలో ప్రజల ముందు తాను రాసిన ఓ పద్యం చదివి వినిపిస్తున్నాడు. అతను ఆ పద్యంలోని మొదటి చరణం చదివి వినిపించాడు. ‘దేవుడు తప్ప సృష్టిలోని ప్రతి వస్తువూ నశించిపోయేదే’ అన్నది దాని భావం. ఉస్మాన్(రజి) ఆ చరణం విని ‘నిజమే’ అని అన్నారు. ఆ తరువాత లబీద్ “సుఖాలన్నీ ఏదో ఒకనాడు అంతమయ్యేవే” అంటూ పద్యంలోని రెండో చరణం చదివాడు. వెంటనే ఉస్మాన్ (రజి) కల్పించుకొని “ఇది అబద్ధం. స్వర్గసుఖాలు ఎన్నటికీ అంతం కావు” అన్నారు. సాధారణంగా అరబ్బులెవరూ అతని కవితల్ని ఖండించేవారు కారు. లబీద్ బిత్తరపోయి, “ఖురైష్ సర్దారుల్లారా! మీ సమావేశాల్లో ఇంతకు ముందెన్నడూ ఇలా జరిగేది కాదు. మీలో ఈ విధంగా ముఖం మీదే ఖండించేవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు?” అన్నాడు. అంతలో ఒక వ్యక్తి లేచి, “ఇటీవల కొంత మంది అమాయకుల వర్గం ఒకటి ఏర్పడింది. వారు తమ తాతముత్తాతల మతాన్ని వదలిపెట్టి క్రొత్తమతాన్ని సృష్టించుకున్నారు. దయచేసి మీరేమీ అనుకోకండి” అని విన్నవించుకున్నాడు. కాని ఉస్మాన్ (రజి) ఆ విషయాన్ని కూడా ఖండించారు. అక్కడున్న ఖురైషులు ఆయనతో గొడవ పడ్డారు. ఒకతను ఆయన ముఖంపై గట్టిగా ఓ దెబ్బ కొట్టాడు. దాంతో ఆయన ఒక కన్ను లొట్టపోయింది. అక్కడే కూర్చొని అంతా గమనిస్తున్న వలీద్ ఉస్మాన్ (రజి)తో, “బాబూ! నువ్వు అనవసరంగా నా రక్షణ నుండి తొలగిపోయావు. నా రక్షణలోనే ఉండిపోయినట్లయితే నీకీ పరిస్థితి దాపురించేది కాదు గదా!” అన్నాడు. దానికి సమాధానమిస్తూ ఉస్మాన్ (రజి), “నా రెండవ కన్ను మొదటి కన్నుపై ఈర్ష్య చెందుతోంది. దానికి కూడా లొట్టపోవాలని ఉంది” అని అన్నారు. “ఇప్పటికయినా మించిపోయింది లేదు. నువ్వు మళ్ళీ నా రక్షణలోకి వచ్చెయ్యి” అంటూ వలీద్ ఉస్మాన్‌ను ఊరించాడు. కాని ఆయన అందుకు ససేమిరా అన్నారు.43

హాషిం తెగకు సంఘ బహిష్కరణ శిక్ష

ఇస్లాం ధర్మ పరిధి రోజురోజుకి విస్తరిస్తోంది. ఉమర్, హమ్జా లాంటి పరాక్రమవంతులు కూడా ఇస్లాం స్వీకరించారు. మరోవైపు నజాషీ రాజు ముస్లింలకు తన రాజ్యంలో రక్షణ కల్పించాడు. ఖురైషులు పంపిన దూతలు ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ముస్లింల సంఖ్య దినదిన ప్రవర్థమాన మవుతోంది. ఖురైషులు ఇదంతా గమనించి దైవప్రవక్తను, ఆయన వంశం వారిని సంఘం నుంచి బహిష్కరించాలని నిశ్చయించుకున్నారు. ఇతర తెగల వారందరూ కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం మక్కాలో ఎవరూ హాషిం తెగవారితో సంబంధాలు పెట్టుకోకూడదు. వారితో ఎలాంటి లావాదేవీలు జరుపకూడదు. వారిని కలుసుకోకూడదు. వారికి అన్నపానీయాలు అందకుండా చెయ్యాలి. వారు దైవప్రవక్త(స)ను హతమార్చమని మాకు అప్పజెప్పనంతవరకు వారితో ఇలాగే వ్యవహరించాలి. ఖురైషులు ఈ ఒప్పంద పత్రాన్ని కాబా గృహ గుమ్మానికి వ్రేలాడదీశారు.44

అబూతాలిబ్ గత్యంతరం లేక-తన తెగవారందరినీ వెంటబెట్టుకొని ‘షీబె అబూతాలిబ్’ అనే కనుమలో తలదాచుకున్నారు. హాషిం వంశీయులంతా మూడు సంవత్సరాల వరకు ఈ కనుమలోనే గడిపారు. ఆ సమయంలో వారు తలహ్ చెట్టు ఆకులు తిని బ్రతికేవారు. హదీసుల్లో దైవప్రవక్త సహచరులు తాము తలహ్ చెట్టు ఆకులు తిని బతికేవాళ్ళమని ఉల్లేఖించారు. ఈ ఉల్లేఖనాలన్నీ ‘షీబె అబూతాలిబ్’ సంఘటన జరిగిన కాలం నాటివే.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ ఇలా తెలియజేస్తున్నారు: ఒక రోజు రాత్రి నాకు ఎండిపోయిన తోలు దొరికింది. దాన్ని నేను నీటితో కడిగి సాతాళించాను. ఆ తరువాత దాంట్లో నీళ్ళు కలిపి తినేశాను. ఇబ్నెసాద్ ఉల్లేఖనం ఇలా ఉంది: పసిపిల్లలు ఆకలితో ఏడ్చేవారు. ఆ ఏడ్పుల శబ్దం విని ఖురైషులు ఆనందించేవారు. అయితే కొంతమంది జాలిపడేవారు కూడా.45

ఒకరోజు హజ్రత్ ఖదీజా (రజి అన్‌హా) సోదరుని కుమారుడైన హకీమ్‌బిన్ హిజామ్ తన సేవకుని ద్వారా ఖదీజాకు కాసిన్ని గోధుమలు పంపించారు. దారిలో అబూజహల్ చూసి లాక్కోవాలని ప్రయత్నించాడు. అంతలో అబుల్ బుహ్‌తరీ అక్కడికి వచ్చాడు. అతను అవిశ్వాసే అయినప్పటికీ ముస్లింల దయనీయ పరిస్థితికి జాలిపడి, “ఒక వ్యక్తి తన మేనత్తకు ఏదయినా తినే వస్తువు పంపించుకుంటుంటే మధ్యలో ఆపటానికి నువ్వెవడివి?” అని అన్నాడు.46

ఒప్పంద విరమణ

దైవప్రవక్త(స), ఆయన వంశం వారందరూ వరుసగా మూడేళ్ళ పాటు ఈ బాధలు అనుభవించారు. ఆఖరికి శత్రువులే జాలిపడ్డారు. ఈ అమానుషమైన ఒప్పందాన్ని ఎత్తివేయాలనే ఉద్యమం కూడా వారి నుంచే మొదలయ్యింది. హిషామ్ మఖ్‌జూమి అనునతను హాషిం తెగవారికి సన్నిహిత బంధువు. తన వంశంలో పలుకుబడి గల వ్యక్తి. అతను రహస్య మార్గాల ద్వారా హాషిం తెగవారికి ధాన్యం, గింజలు తదితర వస్తువులు పంపించేవాడు. ఒకరోజు అతను అబ్దుల్ ముత్తలిబ్ మనువడైన జుబైర్ దగ్గరికి వెళ్ళి, “జుబైర్! ఒకవైపు నీ అమ్మమ్మ తరపు బంధువులు పట్టెడన్నం కోసం పడిగాపులు పడుతుంటే నువ్వు హాయిగా తింటూ, త్రాగుతూ మజాలు చేయటం ఏమైనా బాగుందా?” అని అన్నాడు. దానికి సమాధానమిస్తూ, “ఏం చెయ్యమంటావ్, ఒక్కడయినా నాకు సహకరిస్తే ఈ అమానుషమైన ఒప్పందాన్ని చించి పారేయాలని ఉంది నాకు” అన్నాడు జుబైర్. ‘నేనున్నానుగా’ అన్నాడు హిషామ్. ఇద్దరూ కలిసి ముత్‌యిమ్ బిన్ అదీ దగ్గరికి వెళ్ళారు. బుహ్‌తరీ ఇబ్నె హిషామ్, జమ్‌ఆ బిన్ అస్వద్‌లు కూడా వీరికి సహకరించారు.

మరునాడు అంతా కలిసి పవిత్ర కాబా దగ్గరికి వెళ్ళారు. అక్కడ జుబైర్ ప్రజలతో మాట్లాడుతూ, ‘మక్కా వాసులారా! మనం హాయిగా బ్రతుకుతూ హాషిం తెగవారికి అన్నపానీయాలు లేకుండా చేయటం న్యాయమేనా! దైవసాక్షి! ఈ అమానుష ఒప్పందాన్ని నేను చించి పారేస్తాను’ అని అన్నాడు. కాని అబూజహల్ మాత్రం, “ఆ ఒప్పంద పత్రాన్ని ముట్టుకున్నా జనం ఊరుకోరు” అని హెచ్చరిస్తూ మాట్లాడాడు. అంతలో జమ్‌ఆ కల్పించుకొని, “నువ్వు అబద్ధం చెబుతున్నావు. మొదటి నుంచే మేము ఆ ఒప్పందానికి సముఖంగా లేము” అని అన్నాడు.47 అంతకుముందే దైవప్రవక్త(సఅసం) ఆ ఒప్పంద పత్రానికి చెదలు పట్టిందని అబూతాలిబ్‌కు చెప్పారు. ప్రజలు వెళ్ళి చూస్తే నిజంగానే దాన్ని చెదపురుగులు తినేశాయి. అందులో కేవలం ‘దేవా! నీ పేరుతో ప్రారంభిస్తున్నాం’ అన్న వాక్యం మాత్రమే మిగిలి ఉంది.48

అబూబక్ర్(రజి) పట్ల ఖురైషుల వైఖరి

అవిశ్వాసుల దౌర్జన్యాలు నిరుపేద, బలహీన ముస్లింలకే పరిమితం కాలేదు. ఆ తరువాత వారు ఉన్నత వర్గాల వారిని కూడా వేధించటం మొదలు పెట్టారు. అబూబక్ర్ (రజి) గారి తెగ మక్కా నగరంలో ఓ ఉన్నతమైన, బలమైన తెగగా పరిగణించబడేది. వారికి మద్దతుదారులు చాలామందే ఉన్నారు. కాని అలాంటి అబూబక్ర్ (రజి)కూడా అవిశ్వాసుల ఆగడాలకు విసిగిపోయి ఇథియోపియాకు వలస వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. మక్కా నుండి యమన్ వైపు ఐదు రోజులు ప్రయాణిస్తే ఒరకుల్ గిమాద్ అనే ప్రాంతం వస్తుంది. అబూబక్ర్ ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ ఆయనకు ఖారా తెగ నాయకుడైన ఇబ్నుద్దుగున్నా కలిశాడు. అతను అబూబక్ర్ (రజి)ని ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగాడు. “నా జాతివారు నన్ను మననీయటం లేదు. అందుకే వేరే ప్రాంతానికి వెళ్ళి దైవారాధన చేసుకుంటూ బ్రతకాలనుకుంటున్నాను” అని సమాధానమిచ్చారు అబూబక్ర్ (రజి). దానికి ఇబ్నుద్దుగున్నా, “మీలాంటి వారు మక్కా వదలి వెళ్ళటమా! మీకేం భయంలేదు. మీరు నా రక్షణలో ఉందురుగాని” అని చెప్పి ఆయన్ని మక్కా తీసుకువచ్చాడు. మక్కాలో ఖురైష్ సర్దారులందరినీ సమావేశపరచి, “ఈయన అతిథులకు మర్యాద చేస్తాడు, నిరుపేదలకు సహాయం చేస్తాడు. బంధువుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటాడు. అలాంటి మహానుభావుణ్ణి మీరు మక్కా నుండి గెంటివేస్తారా” అని చీవాట్లు పెట్టాడు. దానికి ఖురైష్ సర్దారులు “అబూబక్ర్ మక్కాలో ఉండాలంటే ఒక నియమాన్ని పాటించాలి. ఆయన్ని నమాజుల్లో మెల్లిగా ఏమయినా చదువుకోమనండి. కాని బిగ్గరగా మాత్రం చదువకూడదు. ఆయన బిగ్గరగా ఖురాన్ పఠిస్తే మా స్త్రీలపై, పిల్లలపై దాని ప్రభావం పడుతుంది” అని అన్నారు.

అబూబక్ర్(రజి) కొన్ని రోజుల వరకు వారు చెప్పిన నియమాన్ని పాటించారు. కాని ఆ తరువాత ఆయన తన ఇంటి దగ్గరే ఓ మస్జిద్ నిర్మించుకొని అందులో భక్తిశ్రద్ధలతో బిగ్గరగా ఖురాన్ పారాయణం చేసేవారు. స్వాభావికంగా ఆయన చాలా సున్నిత మనస్కులు. ఖురాన్ పారాయణం చేసినప్పుడు ఆయన తీవ్రమైన భావోద్రేకాలకు లోనై విలపించటం మొదలుపెట్టేవారు. స్త్రీలు, చిన్నపిల్లలు ఆయన్ని చూసి చాలా ప్రభావితులయ్యేవారు. అంచేత ఖురైషులు ఈ విషయం గురించి ఇబ్నుద్దుగున్నాకు ఫిర్యాదు చేశారు. అతను అబూబక్ర్‌తో “ఇక నేను మీకు ఎలాంటి బాధ్యతను వహించలేను” అన్నాడు. దానికి అబూబక్ర్(రజి) “నాకు దేవుని శరణు చాలు. నేను నీ రక్షణ నుండి వైదొలగిపోతున్నాను” అని అన్నారు.

ఒకరోజు దైవప్రవక్త(స) కాబా గృహం దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ బహుదైవారాధకుల సర్దారులు కూర్చొని ఉన్నారు. అబూజహల్ దైవప్రవక్త(స)ను చూసి “అబ్దెమునాఫ్ వంశస్థులారా! అదిగో మీ ప్రవక్త వచ్చాడు” అన్నాడు వెటకారంగా మాట్లాడుతూ.

అంతలో ఉఖబా బిన్ రబీయా అందుకొని, “అయితే మమ్మల్నేం చెయ్యమంటావ్. ఒకడు దైవప్రవక్తనని అంటాడు. ఇంకొకడు తాను దైవదూత అంటాడు” అని పరిహసించాడు. దైవప్రవక్త(సఅసం) వారి మాటలు విని వెనక్కి మళ్ళారు. వారి దగ్గరికి వచ్చి ముందు ఉఖబాతో, “ఉఖబా! నువ్వు దేవుణ్ణి, దైవప్రవక్తను ఎన్నడూ సమర్థించలేదు. ఎప్పుడూ నీ పంతమే నెగ్గాలంటావ్” అని అన్నారు. ఆ తరువాత అబూజహల్‌నుద్దేశించి “త్వరలోనే నువ్వు తక్కువగా నవ్వుతావు. ఎక్కువగా ఏడుస్తావు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు” అని హెచ్చరించారు.

ఆ తరువాత ఖురైషులతో, “అతి త్వరలోనే మీరు ఇప్పుడు నిరాకరిస్తున్న ధర్మంలోకి చేరిపోనున్నారు” అని చెప్పారు.

పాఠకులు ఈ పుస్తకంలోనే దైవప్రవక్త (సఅసం) చెప్పిన మాటలు ఎలా నిజమయ్యాయో గ్రహిస్తారు.49

అబూతాలిబ్, ఖదీజా (రజి అన్‌హా)ల మరణం

దైవప్రవక్త(స)కు ప్రవక్త బాధ్యత లభించిన పదవ యేట ఆయన(స) బాబాయి అబూతాలిబ్ కూడా మరణించారు. ఈయన హజ్రత్ అలీ (రజి) గారి కన్నతండ్రి.50

అబూతాలిబ్ దైవప్రవక్త (సఅసం)ను బాల్యం నుంచి పెంచి పోషించారు. పెద్దవారయ్యాక ఆయన(స) ఇస్లాం ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన(స)కు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చారు. అంచేత అబూతాలిబ్ మరణంతో ఆయన(స) తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు.51

అబూతాలిబ్ మరణానికి మూడురోజుల ముందు ఆయన(సఅసం) ప్రియసతీమణి ఖదీజా (రజి అన్‌హా) మరణించారు.52 దైవప్రవక్త(స) ప్రసన్నత కోసం తన సిరిసంపదలన్నింటినీ దైవమార్గంలో ఖర్చు పెట్టిన త్యాగమయి ఈమె. అందరికన్నా ముందు ఇస్లాం స్వీకరించారు. జిబ్రయీల్ (అలైహి) ఈమెకు ‘దేవుని సలాం’ అందించారు. ఈమె మరణించినప్పుడు దైవప్రవక్త (సఅసం) అమితంగా దుఃఖించారు.53

దైవప్రవక్త(సఅసం) ఒంటరివారవటంతో ఖురైషులు ఆయన్ని మరింత ఎక్కువగా హింసించటం మొదలు పెట్టారు. ఒకసారి ఓ ఆకతాయి వ్యక్తి ఆయన(సఅసం) తలపై బురద పారబోశాడు. ఆయన (సఅసం) అలాగే ఇంట్లోకి వెళ్ళారు. ఆయన (సఅసం) కూతురు తండ్రి తలకు అంటిన బురదను కడుగుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు ఆయన(స) తన కూతురిని సముదాయిస్తూ “చిట్టి తల్లీ! ఏడుస్తావెందుకు? నీ తండ్రిని ఆ దేవుడే కాపాడతాడు” అని అన్నారు.54

ఇప్పటి వరకు తనకు అడుగడుగునా పరోక్షంగా సహాయమందిస్తూ వచ్చిన అబూతాలిబ్ మరణించినా, జీవితాంతం తన కష్టాల్లో పాలుపంచుకొని, తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రియ సతీమణి హజ్రత్ ఖదీజా మరణించినా ఆయన ఏ మాత్రం నిరాశా నిస్పృహలకు లోను కాలేదు. మరింత ఉత్సాహంతో ధర్మ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు-సల్లల్లాహు అలైహి వ సల్లం.

తాయెఫ్ వీధుల్లో తుంటరితనం

దైవప్రవక్త (సఅసం) కొన్నాళ్ళ తరువాత ప్రజలకు ధర్మ సందేశం అందజేసే ఉద్దేశ్యంతో తాయెఫ్‌కు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో జైద్ బిన్ హారిసా (రజి) కూడా ఆయనకు తోడుగా వెళ్ళారు. మక్కా-తాయెఫ్‌ల మధ్య ఉన్న తెగలవారందరికీ హితబోధ చేస్తూ, ఒకే దేవుణ్ణి పూజించటం గురించి ప్రబోధిస్తూ కాలినడకన తాయెఫ్ చేరుకున్నారు. తాయెఫ్‌లో బనూ సఖీఫ్ తెగవారు నివసించేవారు. భౌగోళికంగా తాయెఫ్ సస్యశ్యామలమైన, శీతల కొండ ప్రాంతమయినందువల్ల అక్కడి ప్రజల గర్వానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

అబ్ద్ లేక లైల్, మస్‌వూద్, హబీబ్ – ఈ ముగ్గురు అన్నదమ్ములు ఆ ప్రాంతానికి సర్దారులు, దైవప్రవక్త (స) అందరికన్నా ముందు వారినే కలుసుకొని వారికి ఇస్లాం గురించి బోధించారు. అప్పుడు వారిలో ఒకడు, “దేవుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడన్న మాటే నిజమయితే నేను కాబా ముందు గడ్డం గొరిగించుకుంటాను” అని సవాలు చేశాడు. “నీ దగ్గర ఒక్క వాహనమన్నా లేదు. దేవుడికి నీలాంటి గతిలేనివాడే దొరికాడా… ప్రవక్తగా చెయ్యటానికి!? దేవుడు తలచుకుంటే మాలాంటి నాయకుల్ని, సర్దారుల్ని ప్రవక్తలుగా చేసి ఉండేవాడే!” అని రెండవవాడు ఎగతాళి చేశాడు. “నేనసలు నీతో మాట్లాడనే మాట్లాడను. ఎందుకంటావా? నువ్వు నిజంగానే దైవప్రవక్తవై ఉండి, నేను నీ మాటల్ని తిరస్కరిస్తే అది నాకే ప్రమాదకరం. అలాగాక నువ్వు అబద్ధం చెబుతున్నట్లయితే అటువంటప్పుడు నీతో మాట్లాడటం నాకు ఏ విధంగానూ శోభాయమానం కాదు” అని మూడోవాడు అన్నాడు.

అప్పుడు దైవప్రవక్త (సల్లం), “దయచేసి ప్రజల ముందు ఇలా మాట్లాడకండి. లేకపోతే ప్రజలు కూడా నా హితబోధను తృణీకరించే ప్రమాదముంది” అని ఆ ముగ్గురు సర్దారులనూ ప్రాధేయపడ్డారు.

కాని బనూ సఖీఫ్ సర్దారులు ఆయన మాటల్ని ఖాతరు చెయ్యలేదు. దైవప్రవక్త(స) ప్రజల ముందు హితబోధ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు తమ బానిసలను, నగరంలోని ఆకతాయి కుర్రవాళ్ళను ఆయన మీదికి ఉసిగొల్పారు. ఆయన హితబోధ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆయనపై రాళ్ళు రువ్వటం ప్రారంభించారు. ఆయన ఒళ్ళంతా గాయాలయ్యాయి. శరీరం నుండి రక్తం కారి పాదుకల్లో గడ్డకట్టుకుపోయింది. దాంతో వుజూ చేసేటప్పుడు కాళ్ళ నుండి చెప్పులు విడవటం కూడా కష్టమైపోయింది.

ఒకసారి తుంటరులు కొందరు ఆయన్ని విపరీతంగా తిట్టారు. గేలి చేస్తూ చప్పట్లు చరిచారు. దగ్గరికొచ్చి గావుకేకలు పెట్టసాగారు. ఆయన (సల్లం) చేసేది లేక ఒక ఇంటి ప్రాంగణంలో తలదాచుకున్నారు. ఆ ఇల్లు రబీయా కొడుకులైన ఉత్బా, షైబాలది. వాళ్ళు దూరం నుంచి దైవప్రవక్తను చూసి ఆయన దయనీయ స్థితికి జాలిపడ్డారు. తమ బానిస అయిన అద్దాస్‌ను పిలిచి ఒక పళ్లెంలో ద్రాక్ష పండ్లు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చి రమ్మని పంపారు. ఆ బానిస దైవప్రవక్త (సల్లం) ముందు ద్రాక్షపండ్లు తెచ్చి పెట్టాడు. ఆయన పళ్లెంలో నుంచి ద్రాక్షపండ్లు తీసుకొని ‘బిస్మిల్లాహ్’ అంటూ తినటం ప్రారంభించారు.

అద్దాస్ దైవప్రవక్త వైపు గుడ్లప్పగించి చూస్తూ, “మీరు పఠించిందేమిటి? ఇక్కడి వాళ్ళెవరూ అలా పఠించరే!” ఆశ్చర్యపడిపోతూ అడిగాడు.

“నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి? నీ మతం ఏది?”

“నేను క్రైస్తవుణ్ణి. నైనవా ప్రాంతం వాడిని”

“ఓహో! పుణ్యపురుషుడయిన యూనుస్ బిన్ ముత్తా నగరం వాడివా?”

“యూనుస్ బిన్ ముత్తా ఎవరో, ఎట్లాంటివారో మీకెలా తెలుసు?”

“ఆయన నా సోదరుడు. ఆయన ఒక దైవప్రవక్త. నేనూ దైవప్రవక్తనే”

ఆ మాట వినగానే అద్దాస్ క్రిందికి వంగి దైవప్రవక్త(సల్లం) ముఖాన్ని, కాళ్ళూ, చేతుల్ని చుంబించటం మొదలుపెట్టాడు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్న ఉత్బా, షైబాలకు మండిపోయింది. బానిస తమ అదుపు తప్పిపోయాడని అనుకున్నారు. అద్దాస్ తిరిగొచ్చిన తరువాత వాళ్ళు అతన్ని, “ఏమయింద్రా వెర్రి వెధవా నీకు. అతని కాళ్ళు ముద్దెట్టుకుంటున్నావు” అని గద్దించారు.

“ప్రభూ! ఈ రోజు భూమండలంపై ఆయనకన్నా పునీతుడు ఇంకొకడు లేడు. ఆయన నాకో విషయం తెలిపారు. దైవప్రవక్తలు మాత్రమే అలాంటి విషయాలు తెలుపగలరు” అన్నాడు అద్దాస్ ఎంతో సౌమ్యంగా.

వాళ్ళకు అరికాలిమంట నెత్తికెక్కింది. “ఒరేయ్! అతని మాటల్లో పడి నీ ధర్మాన్ని వదలిపెట్టేవు జాగ్రత్త! అతని ధర్మం కన్నా నీ ధర్మమే నయం” అంటూ వాళ్ళు అద్దాస్‌ను హెచ్చరించారు.

ఆ ప్రాంతంలోనే దైవప్రవక్త(సల్లం) ఒకసారి హితబోధ చేస్తుంటే తిరస్కారులు ఆయన్ని స్పృహ తప్పేంతవరకు తీవ్రంగా కొట్టారు. జైద్ (రజి) ఆయన్ని తన వీపుమీద మోసుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత ముఖం మీద నీళ్లు చల్లినప్పుడు గాని ఆయనకు స్పృహ రాలేదు.

ఈ ప్రయాణంలో ఇన్ని కష్టాలు ఎదురైనా, ఇన్ని బాధలు భరించినా ఒక్కడూ ఇస్లాం స్వీకరించకపోవటంతో దైవప్రవక్త మనసు ఆవేదనతో తల్లడిల్లిపోయింది. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం నిరాశా నిస్పృహలకు లోను కాలేదు. అప్పటికే ఆయన హృదయం దేవుని ఔన్నత్యం, ఆయన పట్ల అపార ప్రేమాభిమానాలతో నిండి ఉంది. ఆ సమయంలో ఆయన (సల్లం) నోటి నుండి వెలువడిన వేడుకోలు వచనాలు ఇవి:

“దేవా! నేను నా బలహీనతను, చేతకానితనాన్ని, ప్రజల ముందు చులకన అయిపోవటాన్ని గురించి నీ సన్నిధిలో ఫిర్యాదు చేసుకుంటున్నాను. నువ్వు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడవు. కష్టాల్లో చిక్కుకున్న బలహీనుల యజమానివి నీవే. నా స్వామివి కూడా నీవే. దేవా! నీవు నన్ను ఎవరి పరం చేస్తున్నావు? బుద్ధిహీనులైన అపరిచితుల, నాపై అధికారం కలిగి వున్న శత్రువులపరం చేస్తున్నావా ప్రభూ! నా యెడల నువ్వు అప్రసన్నుడవు కాకుండా ఉంటే చాలు. నేను నాపై వచ్చే కష్టాలన్నిటినీ భరిస్తాను. నీ రక్షే నాకు సర్వస్వం. నీ ఆగ్రహ బారి నుండి, నా గురించి నీవు కినుక వహించటం నుండి నేను నీ అస్తిత్వ జ్యోతి శరణు వేడుతున్నాను. ఆ జ్యోతి మూలంగానే ప్రపంచంలో అంధకారాలన్నీ పటాపంచలై వెలుతురు విరజిమ్ముతుంది. దాని ద్వారానే ఇహపరాల కార్యాలు చక్కదిద్దబడతాయి. దేవా! నాకు నీ ప్రసన్నత, నీ సంతోషం కావాలి. మంచి పనులుచేసే, చెడు పనుల నుండి కాపాడుకునే శక్తి నాకు నీ ద్వారానే ప్రాప్తిస్తుంది”.

దైవప్రవక్త (సల్లం) తాయెఫ్ నుండి తిరిగి వెళుతూ, “నేను ఈ నగర ప్రజల్ని శపించినా ప్రయోజనమేముంటుంది? వీళ్ళు దేవుణ్ణి విశ్వసించక పోయినా కనీసం వీళ్ళ తరువాతి తరాల వారైనా దేవుణ్ణి విశ్వసించే వారవుతారేమో!” అని అన్నారు.55

అరబ్బు తెగలకు ఇస్లాం సందేశం

మక్కాకు తిరిగి వచ్చిన తరువాత దైవప్రవక్త (సల్లం) పలు తెగల వారు నివసించే ప్రాంతాలకు వెళ్ళి వారికి ఇస్లాం సందేశం అందజేయటం మొదలెట్టారు. కొన్నిసార్లు మక్కా వెలుపల కనిపించిన బాటసారినల్లా పలకరించి విశ్వాసం గురించి, దైవభక్తి గురించి బోధించేవారు.56

ఆ రోజుల్లోనే దైవప్రవక్త(సల్లం) ‘బనూకిందా’ తెగవారి దగ్గరికి వెళ్ళారు. మలీహ్ అనే వ్యక్తి ఈ తెగకు నాయకుడు. తరువాత బనూ అబ్దుల్లాహ్ దగ్గరికి వెళ్ళి “అబ్దుల్లాహ్ వంశీయులారా! మీ తండ్రి పేరు అబ్దుల్లాహ్. అంటే దేవుని దాసుడని అర్థం. కనుక మీరు దేవునికి నిజమైన దాసులయి మీ జీవితాలను సార్థకం చేసుకోండి” అని బోధించారు. ఆ తరువాత బనూ హనీఫా తెగ దగ్గరికి వెళ్ళి ఇస్లాం సందేశాన్ని వినిపించారు. కాని వారు అరబ్బులందరిలో చాలా నీచంగా దైవప్రవక్తను తిరస్కరించారు. అలాగే బనూ ఆమిర్ బిన్ సాసా తెగ దగ్గరికి వెళితే, ఆ తెగనాయకుడు బుహైరా బిన్ ఫిరాస్ ఇస్లాం సందేశం విని, దైవప్రవక్తతో, “సరే, నువ్వు చెప్పినట్లే ఇస్లాం స్వీకరిస్తాను. కాని ఒకవేళ అవిశ్వాసులపై నువ్వు విజయం సాధిస్తే నీ తదనంతరం ఈ పదవి నాకిస్తావా?” అని అన్నాడు. దానికి సమాధానమిస్తూ దైవప్రవక్త(సల్లం), “అది అల్లాహ్ చేతుల్లో ఉంది. ఆయన తాను కోరిన వారికి నా తదనంతరం ఈ బాధ్యతను అప్పగిస్తాడు” అని అన్నారు. దానికి బుహైరా, “అంటే ఇప్పుడు మేము అరబ్బుల్ని ఎదిరించి పోరాడాలి. తీరా నీ పని పూర్తయ్యాక ఫలితం ఇంకెవడో అనుభవిస్తాడు. బాగుంది! వెళ్ళవయ్యా వెళ్ళు. అసలు నీతో మాట్లాడటమే అనవసరం” అన్నాడు, కోపంతో మండిపడుతూ. ఈ ప్రయాణాల్లో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) ఆయనకు తోడుగా వెళ్ళారు.57

ఆ రోజుల్లోనే దైవప్రవక్త (సల్లం)కు సువైద్ బిన్ సామిత్ అనే వ్యక్తి తారసపడ్డాడు. అతనికి తన తెగవారిలో ‘కామిల్’ అనే బిరుదు ఉండేది. దైవప్రవక్త (సల్లం) అతనికి ఇస్లాం సందేశం వినిపించారు. దానికతను ‘బహుశా నా దగ్గరున్న జ్ఞానమూ, మీ సందేశమూ ఒకటేననుకుంటాను’ అని అన్నాడు. “నీ దగ్గరేముంది?” అడిగారు దైవప్రవక్త (సల్లం). లుఖ్మాన్ వివేచనా జ్ఞానం ఉందని చెప్పాడతను. దైవప్రవక్త (సల్లం) అది తనకు వినిపించమన్నారు. అతను కొన్ని అద్భుతమైన కవితలు చదివి వినిపించాడు. అవి విని దైవప్రవక్త (సల్లం) “నీ కవితలు చాలా బాగున్నాయి. కాని నా దగ్గర ఖురాన్ ఉంది. అది నీ దగ్గరున్న కవితల కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. సన్మార్గం వైపుకు నడిపిస్తుంది. మన జీవితాల్లో వెలుగు నింపుతుంది” అని చెప్పి అతనికి ఖురాన్ పారాయణం చేసి వినిపించారు. అతను అద్భుతమైన ఖురాన్ పారాయణానికి ప్రభావితుడై, ఏ మాత్రం తటపటాయించకుండా ఇస్లాం స్వీకరించాడు. ఆ తరువాత యస్రిబ్ నగరానికి తిరిగి రాగా ఖజ్‌రజ్ తెగవారు అతన్ని హత్య చేశారు.58

ఆ కాలంలోనే అబుల్ హైసర్ అనస్ బిన్ రాఫె మక్కా వచ్చాడు. అతనితోపాటు అబ్దుల్ అష్‌హల్ తెగకు చెందిన మరికొందరు యువకులు కూడా వచ్చారు. వారిలో అయాస్‌బిన్ ముఆజ్ కూడా ఉన్నాడు. వీళ్ళు తమ ఖజ్‌రజ్ జాతివారి తరపు నుండి ఖురైషులతో ఒప్పందం చేసుకోవటానికి వచ్చారు. దైవప్రవక్త (సఅసం) వారి దగ్గరికి వెళ్ళి, “నా దగ్గర మీ అందరి మోక్షానికి దోహదపడే సందేశముంది. తెలియజేయమంటారా?!” అని అడిగారు.

“ఏమిటా సందేశం?” కాస్త ఆతురతతోనే ప్రశ్నించారు వాళ్ళు.

“నేను దైవప్రవక్తను. దేవుడు నన్ను మానవాళి సన్మార్గం కోసం పంపించాడు. ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజించమని, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించవద్దనీ నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. దేవుడు నాపై గ్రంథాన్ని అవతరింపజేశాడు” అంటూ దైవప్రవక్త (సల్లం) వారికి ఇస్లాం ధర్మసూత్రాలు విడమరచి చెప్పారు. ఖురాన్ పారాయణం కూడా చేసి వినిపించారు.

అయాస్ బిన్ ముఆజ్ నవయువకుడు. దైవప్రవక్త(సల్లం) మాటలు విని చివాలున లేచి, “ఓ నా జాతి ప్రజలారా! దైవంతోడు, మీరు ఇక్కడికి వచ్చిన పనికన్నా ఈ ధర్మం ఎంతో గొప్పది” అని అన్నాడు.

అతని మాటలకు అనస్ బిన్ రాఫె ఉగ్రుడయిపోయాడు. చేతినిండా కంకరరాళ్ళు తీసుకొని అయాస్ మొహం మీద విసరికొట్టి, “నోర్ముయ్, మేమొచ్చింది ఈ పని కోసం కాదు” అని మందలించాడు. దైవప్రవక్త(సల్లం) అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఔస్-ఖజ్‌రజ్‌ల మధ్య జరిగిన బుఆస్ యుద్ధానికి పూర్వం జరిగిన సంఘటన ఇది. అయాస్ మక్కా నుండి తిరిగి వెళ్ళిన కొంత కాలానికే చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు అతని నోటివెంట దేవుని స్తోత్రవచనాలు వెలువడసాగాయి. నిజం చెప్పాలంటే అయాస్ దైవప్రవక్త (సల్లం) హితబోధ విన్ననాడే అతని హృదయంలో ఇస్లాం బీజం నాటుకుంది. ఆఖరికి మరణ సమయంలో అది ఫలించింది.59

ఆ రోజుల్లోనే జిమాద్ అజ్‌దీ మక్కా వచ్చాడు. ఇతను యమన్ వాసి. యావత్తు అరేబియాలోనే పేరుగాంచిన ఇంద్రజాలికుడు. ముహమ్మద్ (సల్లం)కు దెయ్యాలు పట్టుకున్నాయని విని అతను ఖురైషులతో, “నేను నా మంత్రశక్తితో ముహమ్మద్‌కు పట్టిన దయ్యాన్ని వదలిస్తాను” అన్నాడు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి, “ముహమ్మద్! ఇలా రా! నీకు మంత్రం వినిపిస్తాను” అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లం) ఆ ఇంద్రజాలకునితో ‘ముందు నా మంత్రం విను’ అంటూ ఈ క్రింది వాక్యాలు పఠించటం మొదలుపెట్టారు:

“అల్‌హమ్దు లిల్లాహి నహ్‌మదుహూ వ నస్తయీనుహూ
మన్ య్యహ్‌దిహిల్లాహు ఫలా ముజిల్ల లహూ, వమన్
యుజ్‌లిల్‌హు ఫలా హాదియ లహూ, వ అష్‌హదు
అల్లా యిలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక
లహూ, వ అష్‌హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ
వ రసూలుహూ, అమ్మాబాద్…”

‘ప్రశంసలూ, పొగడ్తలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. మేము ఆయన ప్రసాదించిన అనుగ్రహాలకు గాను కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాం. సహాయం కోసం ఆయన్నే అర్థిస్తున్నాం. (యదార్థమేమిటంటే) దేవుడు సన్మార్గం చూపిన వ్యక్తిని ఎవరూ మార్గం నుండి తప్పించలేరు. దేవుడు భ్రష్టుపట్టించిన వాణ్ణి ఎవరూ సన్మార్గంపైకి తీసుకురాలేరు. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు మరెవ్వడూ లేడని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సహవర్తులెవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్ దేవుని దాసుడు, ప్రవక్త అని ప్రకటిస్తున్నాను. ఆ తరువాత…’

జిమాద్ ఇక్కడి వరకు విన్న తరువాత మధ్యలో ఆపి ఆ వాక్యాలు మరోమారు చదివి వినిపించమని కోరాడు. అలా రెండు మూడు సార్లు ఆ వాక్యాలు విని, “నేను గొప్ప గొప్ప జ్యోతిష్యుల్ని చూశాను, చేయి తిరిగిన ఇంద్రజాలికులను చూశాను, ఎందరో మహా కవుల కవితలు విన్నాను. కాని ఇలాంటి వచనాలు మాత్రం నేను మునుపెన్నడూ వినలేదు. ఈ వాక్యాల్లో భావసముద్రాలు ఇమిడి ఉన్నాయి. ముహమ్మద్ దయచేసి మీ చెయ్యి అందించండి. నేను మీ చేతిలో చెయ్యేసి ఇస్లాం స్వీకరిస్తానని మాటిస్తాను” అన్నాడు.60

ఆ రోజుల్లోనే తుఫైల్ బిన్ అమ్ర్ మక్కా వచ్చాడు. ఈయన దౌస్ తెగ నాయకుడు. యమన్ శివార్లలో ఈయన వంశీయుల్లో నాయకత్వ పాలన ఉండేది. తుఫైల్ స్వయాన కవి, గొప్ప మేధావి. మక్కావాసులు నగరం నుండి బయటికి వచ్చి ఈయనకు ఘనస్వాగతం పలికారు. మక్కాకు తీసుకొని వచ్చి రాచమర్యాదలు చేశారు. అలాంటి గొప్ప మేధావి అయిన తుఫైల్ ఇలా అంటున్నాడు:

“నేను మక్కా చేరుకోగానే ఖురైషులు నన్ను ముహమ్మద్ (సల్లం) గురించి భయపెట్టటం మొదలుపెట్టారు. ‘తుఫైల్! మాలో ఓ క్రొత్త వ్యక్తి పుట్టాడు. అతనికి కాస్త దూరంగా ఉండు. అతనికి జాల విద్యలు తెలుసు. అతను చేతబడి చేసి తండ్రీ కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య యెడబాటుని సృష్టిస్తాడు. అతను మా జాతి ఐకమత్యాన్ని ఛిన్నాభిన్నం చేసేశాడు. మా పనుల్ని చెడగొట్టాడు. మాలాగే మీ జాతి వారు కూడా కష్టాల్లో చిక్కుకోవటం మాకిష్టం లేదు. అందుకే మీ మేలు కోరి చెబుతున్నాం. మీరు అతని దగ్గరికి వెళ్ళకండి, అతని మాటలు వినకండి, అసలు అతనితో మాట్లాడకండి” అని హెచ్చరించారు.

“ఖురైషులు చెప్పిన మాటలకు నేనెంతగా భయపడిపోయానంటే నేను కాబా గృహంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ముహమ్మద్ (సల్లం) మాటలు నా చెవిలో పడకుండా ఉండాలని చెవుల్లో దూది పెట్టుకొని వెళ్ళేవాడ్ని. ఒకరోజు ఉదయం నేను కాబా గృహంలోకి వెళ్ళాను. ఆ సమయంలో దైవప్రవక్త(సల్లం) నమాజ్ చేస్తున్నారు. ఆయన పలుకులు నా చెవులకు వినపడాలని దేవుడు రాసి పెట్టాడేమో! ఆయన నోట జాలువారుతున్న అద్భుతవాణి విన్నాను. అప్పుడు నన్ను నేను నిందించుకోవటం మొదలుపెట్టాను. నేను స్వయంగా కవిని, పండితుడ్ని. మంచీ చెబ్బరల గురించి తెలిసినవాడ్ని. అటువంటప్పుడు నేనాయన మాటల్ని ఎందుకు వినకూడదు? మంచి మాట అయితే స్వీకరిద్దాం. లేకపోతే వదిలేద్దాం” అని అనుకొని అక్కడే నిలబడ్డాను. దైవప్రవక్త(సల్లం) ఇంటికి తిరిగి వెళుతుంటే నేను కూడా ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళాను. చివరికి ఆయనింటికి చేరుకొని నేను మక్కా వచ్చిన సంగతి, ప్రజలు నన్ను భయపెట్టిన సంగతి, ఈ రోజు ఆయన నోటి ద్వారా దివ్యవాణి విన్న సంగతి అంతా ఆయనకు వివరించాను. ఆ తరువాత నాకు ఇస్లాం గురించి బోధించమని ఆయన్ని కోరాను. అప్పుడు దైవప్రవక్త(సల్లం) నాకు ఖురాన్ చదివి వినిపించారు. దైవసాక్షి! మాటిమాటికీ సత్కార్యం, న్యాయం గురించి వక్కాణించే అంతటి పవిత్రమైన వాణి నేను అంతకు ముందెన్నడూ వినలేదు”.

తుఫైల్ అప్పటికప్పుడే ఇస్లాం స్వీకరించారు. ఖురైషులు మాటిమాటికీ పూజ్యుడా! ఆరాధ్యుడా! అని పిలుచుకునే తుఫైల్ ఇప్పుడు ముహమ్మద్ (సల్లం)కు అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడయిపోయాడు. తుఫైల్ ఇస్లాం స్వీకరించాడన్న సమాచారం ఖురైషులకు మింగుడుపడలేదు.

హజ్రత్ అబూజర్ర్ యస్రిబ్‌లో ఉన్నప్పుడు ఆ నోట ఈ నోట దైవప్రవక్త ప్రస్తావన విని నువ్వు మక్కా వెళ్లి ఆ దైవప్రవక్తను గురించి వాకబు చేసి రమ్మని తన సోదరుణ్ణి పంపించారు.

అబూజర్ర్ సోదరుడైన ఉనైస్ పేరు గాంచిన కవి. మంచి మాటకారి. అతను మక్కా వెళ్ళి దైవప్రవక్తను కలుసుకున్నాడు. ఆ తరువాత తిరిగొచ్చి ముహమ్మద్ (సల్లం) మంచి పనులు చెయ్యమని, చెడుపనుల నుండి రక్షించుకోమని బోధిస్తున్నారని అబూజర్ర్‌తో చెప్పాడు.

అబూజర్ర్ తన సోదరుడు తెచ్చిన సమాచారంతో సంతృప్తి చెందలేదు. తానే స్వయంగా కాలినడకన మక్కా చేరుకున్నారు. ఆయనకు దైవప్రవక్త (సల్లం) ఎలా ఉంటారో తెలియదు. ఎవరినన్నా అడిగి తెలుసుకుందామన్నా అందుకు ఆయన మనసొప్పలేదు. జమ్‌జమ్ నీళ్ళు త్రాగి కాబా గృహంలోనే పడుకున్నారు. అంతలోనే అలీ (రజి) అటుగా వచ్చారు. దగ్గరికి వెళ్ళి కాస్త బిగ్గరగానే ‘ఈయనెవరో బాటసారిలాగున్నాడు’ అన్నారు. దానికి అబూజర్ర్ ఔనన్నారు. ‘అయితే మా ఇంటికి పదండి’ అంటూ హజ్రత్ అలీ (రజి) ఆయన్ని తన వెంట తీసుకొని వెళ్ళారు.

అబూజర్ర్ ఆ రోజు రాత్రి అలీ దగ్గరే ఉన్నారు. కాని అలీ (రజి) ఆయన్ని ఏమీ అడగలేదు. ఆయన కూడా తన గురించి ఏమీ చెప్పలేదు. తెల్లారిన తరువాత మళ్ళీ కాబా గృహానికి వచ్చేశారు. ఆయన మనసు దైవప్రవక్త(సల్లం)ను వెతుకుతోంది. కాని ఆయన(సల్లం) గురించి ఎవరినీ అడగలేకపోతున్నారు. మరునాడు హజ్రత్ అలీ మళ్ళీ కాబా గృహం వైపు వచ్చారు. అబూజర్ర్ అక్కడే ఉండటం చూసి, ‘బహుశా మీకు ఉండటానికి ఎక్కడా ఇల్లు దొరకలేదేమో! మా ఇంటికి వెళదాం పదండి’ అంటూ మళ్ళీ ఆయన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఈసారి మాత్రం హజ్రత్ అలీ(రజి) ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో “మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పని మీద వచ్చారు?” అని అడిగారు. తాను చెప్పేది రహస్యంగా ఉంచుతానని మాటిస్తే చెబుతాను అన్నారు అబూజర్ర్. హజ్రత్ అలీ రహస్యంగానే ఉంచుతానని మాటిచ్చారు.

“ఈ నగరంలో ఎవరో ఒకతను తాను దైవప్రవక్తనని చెబుతున్నాడని విన్నాను. ఆయన గురించి తెలుసుకు రమ్మని నా సోదరుణ్ణి ఇక్కడికి పంపించాను. కాని అతను ఇచ్చిన సమాచారం నాకు సంతృప్తికరంగా తోచలేదు. అంచేత స్వయంగా నేనే వచ్చాను” అన్నారు.

“చాలా మంచిపని చేశారు. అదృష్టం బాగుండి మీరు నన్ను కలుసుకున్నారు. నేనిప్పుడు ఆయన దగ్గరికే వెళుతున్నాను. మీరు కూడా నాతో రండి. నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేకపోతే నేను చెప్పులు సర్దుకుంటున్నట్టు నటిస్తూ గోడకు అనుకొని నించుంటాను” అన్నారు హజ్రత్ అలీ (రజి).

చివరకు అబూజర్ర్ ఎలాగో తంటాలు పడి హజ్రత్ అలీతో పాటు దైవప్రవక్త(సల్లం) సన్నిధికి వెళ్ళి తనకు ఇస్లాం ధర్మం గురించి బోధించమని ఆయన్ని కోరారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లం), “అబూజర్ర్! నువ్వు ఇస్లాం స్వీకరించావన్న సంగతిని రహస్యంగానే ఉంచు. ప్రస్తుతానికి మీ దేశం వెళ్ళిపో. మేము విజయం సాధించామన్న విషయం తెలిసినప్పుడు తిరిగి మా దగ్గరికి రా” అన్నారు. కాని అబూజర్ర్ (రజి) “దైవసాక్షి! నేను శత్రువుల మధ్య నించొని ఇస్లాం స్వీకరించానని ప్రకటిస్తాను” అంటూ కాబా వైపు బయలుదేరారు. అక్కడ ఖురైషులు సమావేశమై ఉన్నారు. ఆయన అందరికీ వినపడేలా బిగ్గరగా దేవుడు ఒక్కడేనని, ముహమ్మద్ (సల్లం) దైవప్రవక్త అని ప్రకటించారు. ఈ ప్రకటన వినగానే ఖురైషులు ‘ఈ మతభ్రష్టుణ్ణి కొట్టండి’ అంటూ ఆయన మీద విరుచుకుపడి చావుదెబ్బలు కొట్టసాగారు. అంతలో అబ్బాస్ (రజి) అక్కడికి వచ్చారు. ఆయన అబూజర్ర్‌ను గుర్తుపట్టి, “మూర్ఖులారా! ఇతనెవరో తెలుసా? గిఫార్ తెగకు చెందిన వ్యక్తి. మీరు వ్యాపారానికి వెళ్ళేది, ఖర్జూర పండ్లు కొనుగోలు చేసి తెచ్చేది ఆ తెగ ప్రాంతం నుంచే” అంటూ ఖురైషుల్ని మందలించారు. అప్పుడు గాని ప్రజలు ఆయన్ని వదల్లేదు. రెండో రోజు అబూజర్ర్(రజి) మళ్లీ అందరికీ వినపడేలా అదే ప్రకటన చేశారు. అప్పుడు కూడా ప్రజలు ఆయన్ని కొడ్తుంటే అబ్బాసే వచ్చి విడిపించారు. ఆ తరువాత అబూజర్ర్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.61

ఉఖబా ఒప్పందం

దైవదౌత్యం లభించిన పదకొండవ యేట హజ్‌యాత్ర జరుగుతున్న కాలంలో మక్కా నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ‘ఉఖబా’ అనే చోట కొంతమంది చీకట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు విని దైవప్రవక్త (సల్లం) కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ యస్రిబ్‌కు చెందిన ఆరుగురు సమావేశమై ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) వారి ముందు దేవుని ఔన్నత్యాన్ని, ఆయన గొప్పదనాన్ని వివరించారు. దైవంపట్ల ప్రేమాభిమానాలు కల్గివుండమని బోధించారు. విగ్రహ పూజను త్యజించమని చెప్పారు. భక్తి విశ్వాసాలను గురించి బోధించి, చెడుల నుండి, నీతి బాహ్యతల నుండి వారించారు. దివ్య ఖురాన్ పారాయణం చేసి వారి హృదయాలను జ్యోతిర్మయం చేశారు. వాళ్ళు బహుదైవారాధకులైనప్పటికీ అతి త్వరలోనే ఒక దైవప్రవక్త రానున్నాడని తమ నగరంలో యూదులు చెబుతుండగా అనేకసార్లు విని ఉన్నారు. అంచేత వాళ్ళు అప్పటికప్పుడే ఇస్లాం స్వీకరించారు. ఆ తరువాత తమ నగరానికి వెళ్ళి సత్య ధర్మాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు.62

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆ దైవప్రవక్త వచ్చేశాడు అని వాళ్ళు ప్రతి ఒక్కరికీ శుభవార్తను అందజేసేవారు. “మేము మా చెవులతో ఆయన సందేశం విన్నాం. ఆయన్ని కళ్ళారా చూశాం. ఆయన మమ్మల్ని సజీవుడైన దేవునితో అనుసంధానం చేశాడు. ఆ సంతోషం ముందు ప్రపంచంలోని జీవన్మరణాలకు ఎలాంటి విలువా లేదు” అని చెప్పుకుంటూ తిరిగేవారు.63

వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేయటం మూలంగా యస్రిబ్‌లో ఇంటింటా దైవప్రవక్త (సల్లం) పేరు మార్మోగసాగింది. మరుసటి సంవత్సరమే ఆయన (సల్లం) దైవప్రవక్త అయిన పన్నెండవ యేట యస్రిబ్ వాసులు కొంతమంది మక్కాకు వచ్చి దైవప్రవక్త చేతుల మీదుగా ఈమాన్ భాగ్యాన్ని పొందారు.

ఆ సందర్భంగా వాళ్ళు తాము ఈ పనులు నెరవేరుస్తామని దైవప్రవక్త (సల్లం)కు ప్రమాణం చేశారు:

  1. 1) మేము ఒకే దేవుణ్ణి పూజిస్తాం. ఇతరులెవ్వరినీ ఆయనకు భాగస్వామ్యం కల్పించం.
  2. 2) దొంగతనానికి, వ్యభిచారానికి దూరంగా ఉంటాం.
  3. 3) ఆడపిల్లల్ని వధించే పశుప్రవృత్తిని మానుకుంటాం.
  4. 4) ఎవరిపైనా నీలాపనిందలు మోపము, ఒకరి వీపు వెనుక చాడీలు చెప్పము.
  5. 5) ప్రతి మంచి విషయంలోనూ మేము దైవప్రవక్త (సల్లం)కు విధేయత చూపుతాం.64

యస్రిబ్ వాసులు తిరిగి వెళుతున్నప్పుడు దైవప్రవక్త(సల్లం) వారికి ధర్మోపదేశాలు చేయటానికి ముస్‌అబ్ బిన్ ఉమైర్ (రజి)ను వారి వెంట పంపారు. ముస్‌అబ్ (రజి) గొప్ప ధనవంతుల కుటుంబంలో ఎంతో గారాబంగా పెరిగిన వ్యక్తి. ఆయన గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ముందూ వెనుక సేవకులు ఆయన వెంట నడిచేవారు. ఆయన ఎల్లప్పుడూ ఎంతో ఖరీదైన బట్టలు తొడిగేవారు. కాని ఇస్లాం స్వీకరించిన తరువాత లభించిన ఆధ్యాత్మిక ఆనందాలను ఆస్వాదించి ఈ భౌతిక విలాసాలన్నింటినీ వదలి పెట్టేశారాయన. ఆయన మదీనాలో ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాలంలో ఆయన ఒంటిపై చిన్న గొంగళి మాత్రమే ఉండేది. దాన్ని ఆయన భుజం మీద చుట్టుకొని దానికి పిన్నీసులు పెట్టుకునేవారు.65

హజ్రత్ ముస్‌అబ్(రజి) మదీనా (యస్రిబ్)లో అస్‌అద్ బిన్ జురారా ఇంట్లో బస చేశారు. మదీనావాసులు ఆయన్ని ముఖ్రి (గురువు) అని పిలిచేవారు. ఒకరోజు ముస్‌అబ్, అస్‌అద్, ఇంకా కొంతమంది ముస్లింలు మరఖ్ అనే బావి దగ్గర సమావేశమై అబ్దుల్ అష్‌హల్, బనీజఫర్ తెగలవారికి ఇస్లాం సందేశం అందజేసే విషయమై సమాలోచనలు జరుపసాగారు.

సాద్ బిన్ ముఆజ్, ఉసైద్ బిన్ హుజైర్‌లు ఆ రెండు తెగలకు నాయకులు. వీళ్ళిద్దరూ అప్పటికింకా ఇస్లాం స్వీకరించలేదు. ముస్లింలు సమావేశమైన సంగతి తెలుసుకొని సాద్ బిన్ ముఆజ్ ఉసైద్‌తో మాట్లాడుతూ, “మీరు ఏ లోకంలో ఉన్నారు. చూడండి! ముస్‌అబ్, అస్‌అద్‌లు మన ఇళ్ళకు వచ్చి అమాయక జనాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరెళ్ళి వాళ్ళని మందలించండి. మా వీధుల దరిదాపులకు కూడా రావద్దని చెప్పండి. ఈ పని స్వయంగా నేనే చేసేవాణ్ణి. అస్‌అద్ నా పిన్ని కుమారుడు. అందుకే ఊరుకోవాల్సి వస్తోంది” అన్నాడు.

ఆ మాటలు వినగానే ఉసైద్‌కు కోపం కట్టలు త్రెంచుకుంది. సాయుధుడై ముస్‌అబ్, అస్‌అద్‌లు ఉన్నచోటుకి బయలుదేరాడు. ఉసైద్ రాకను గమనించిన అస్‌అద్, ముస్‌అబ్(రజి) నుద్దేశించి, “అదిగో ఆ వస్తున్నతనే ఈ తెగకు నాయకుడు. దైవకృప వల్ల అతను మీ మాటలు విని ఒప్పుకుంటే సరి” అన్నారు. “అతనొచ్చి నా ముందు కూర్చుంటే నేను తప్పకుండా అతనితో మాట్లాడతాను” అన్నారు ముస్‌అబ్ బిన్ ఉమైర్ (రజి). అంతలో ఉసైద్ అక్కడికి చేరుకున్నాడు. వచ్చీ రాగానే నిలబడి తిట్ల పురాణం మొదలెట్టాడు. నువ్వు మా అమాయక ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావంటూ ముస్‌అబ్ (రజి)ను నానా మాటలన్నాడు.

ముస్‌అబ్(రజి) అతనితో, “మీరు కాస్త ప్రశాంతంగా కూర్చొని మా మాటలు వినండి. నచ్చితే నమ్మండి. లేదనుకుంటే వదలిపెట్టండి” అని అన్నారు ఎంత సౌమ్యంగా. వింటే నష్టం ఏమొచ్చిందిలే అనుకొని ఉసైద్ ఆయన ముందు కూర్చున్నాడు. ముస్‌అబ్ (రజి) అతనికి ఇస్లాం సందేశం ఏమిటో బోధించారు. ఆ తరువాత దివ్య ఖురాన్ పారాయణం చేశారు. ఉసైద్ అంతా శ్రద్ధగా విన్న తరువాత, “సరే గాని, ఎవరైనా క్రొత్తగా మీ ధర్మంలోకి చేరాలంటే ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

“మేము అలాంటి వ్యక్తికి స్నానం చేయించి, పరిశుభ్రమైన బట్టలు తొడిగించి ‘షహాదత్’ (సాక్ష్య) వచనాలు చదివిస్తాం. ఆ తరువాత రెండు రకాతుల నఫిల్ నమాజ్ చేయిస్తాం” అని సమాధానమిచ్చారు ముస్‌అబ్ (రజి). అది విన్న వెంటనే ఉసైద్ లేచి వెళ్ళి బట్టలు ఉతుక్కొని, స్నానం చేసి షహాదత్ వచనాలు పఠించాడు. (దేవుడు ఒక్కడేనని ముహమ్మద్(సల్లం) దేవుని ప్రవక్త అని సాక్ష్యం చెప్పాడు). ఆ తరువాత రెండు రకాతుల నఫిల్ నమాజ్ చేసి, “నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇంకొకడున్నాడు. అతను కూడా ఇస్లాం స్వీకరిస్తే ఇక ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఎదిరించేవాడే ఉండడు. నేనిప్పుడే వెళ్ళి అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.

మరోవైపు సాద్ బిన్ ముఆజ్ ఉసైద్ కోసం తీవ్రంగా ఎదురు చూడసాగాడు. అంతలో ఉసైద్ అక్కడికి వస్తున్నట్లు కనిపించింది. సాద్ దూరం నుంచే ఆయన ముఖ కవళికల్ని పసిగట్టి “ఉసైద్ మొహంలో ఏదో మార్పు కన్పిస్తుంది” అన్నాడు. ఉసైద్ దగ్గరికి వచ్చి కూర్చున్న తరువాత ఎంతో ఆత్రుతతో ‘ఏం జరిగింది?’ అని అడిగాడు.

“నేనెళ్ళి వాళ్ళకు బాగానే బుద్ధి చెప్పాను. వాళ్ళు మన అభీష్టానికి వ్యతిరేకమైన పనులేవీ చేయమంటున్నారు. ఆ సంగతేమోగాని అక్కడ ఇంకో ఘోరం జరిగిపోతోంది. నేను వెళ్ళేటప్పటికి బనూహారిసా తెగవాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు నీ పిన్నికొడుకైన అస్‌అద్ బిన్ జురారాను హత్య చేయాలని చూస్తున్నారు” అని చెప్పాడు ఉసైద్. ఆ మాట వినగానే సాద్ బిన్ ముఆజ్ భగ్గుమన్నాడు. ఆయుధం చేతిలోకి తీసుకొని రివ్వున లేచాడు. బనూహారిసా తెగవాళ్ళు తన సోదరుణ్ణి హత్య చేసి ఉంటారేమోనని అతని హృదయం భయంతో కంపించి పోయింది. వెళ్తూ వెళ్తూ తన సోదరుణ్ణి కాపాడకుండా తిరిగొచ్చినందుకు ఉసైద్‌పై నిప్పులు చెరిగాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ముస్‌అబ్(రజి), అస్‌అద్‌లు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఇది తనకు వీళ్ళ మాటలు వినిపించటానికి ఉసైద్ వేసిన ఎత్తుగడ అని సాద్‌కు అర్ధమయిపోయింది. దగ్గరికి వెళ్ళి వాళ్ళను చెడమడా తిట్టసాగాడు. అస్‌అద్(రజి)ను పట్టుకొని, “మీకూ-మాకూ మధ్య బంధుత్వమే లేకపోయినట్లయితే నిన్ను మా ఇండ్ల దరిదాపులకు కూడా రానిచ్చేవాణ్ణి కాను” అని హూంకరించాడు. అస్‌అద్ (రజి), ఏ మాత్రం తొణకలేదు. పైగా ఆయన ముస్‌అబ్‌తో “ఈయన చాలా గొప్ప నాయకులు. మీరు గనుక ఈయన్ని ముస్లింగా మార్చేస్తే ఇక మీకెవరూ ఎదురు చెప్పేవారు ఉండరు” అన్నారు. ముస్‌అబ్ (రజి) సాద్‌ను ఎంతో ఆప్యాయంగా, ప్రేమనిండిన స్వరంతో, “రండి, కూర్చొండి. ముందు మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. మా మాటలు మీకు నచ్చితే ఒప్పుకోండి, లేకపోతే వదలిపెట్టండి” అంటూ ఆహ్వానించారు. సాద్ మంచులా కరిగిపోయాడు. ఆయుధం క్రిందపడేసి ఆయన ముందు కూర్చున్నాడు. ముస్‌అబ్(రజి) అతనికి ఇస్లాం వాస్తవికతను గురించి బోధించారు. దివ్యఖురాన్‌ను చదివి వినిపించారు. అంతా విన్న తరువాత సాద్ కూడా ఉసైద్ అడిగిన ప్రశ్నే అడిగాడు. అక్కడి నుంచి లేచివెళ్ళి స్నానం చేసి షహాదత్ వచనాలు పఠించాడు. రెండు రకాతుల నఫిల్ నమాజ్ కూడా చేశాడు. తరువాత ఇంటికి వెళ్ళి వెంటనే తన తెగ వాళ్ళందరినీ సమావేశపరచి “అబ్దుల్ అష్‌హల్ వంశీయులారా! నా గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాడు.

దానికి తెగవాళ్ళందరూ, “మీరు మా నాయకులు. మీ ఆదేశం మాకు శిరోధార్యం. మీ అన్వేషణ మాకందరికీ శ్రేయోదాయకం” అన్నారు.

“మరయితే వినండి. మీలో ప్రతి ఆడది, ప్రతి మగాడు ఇస్లాం స్వీకరించనంతవరకూ నేను వారితో మాట్లాడకూడదనుకుంటున్నాను” అన్నారు సాద్(రజి).

ఆయన ఆ మాట అనగానే సాయంత్రానికల్లా ఆయన తెగవారిలో ఒక్కడూ అవిశ్వాసిగా మిగల్లేదు. అందరూ ఇస్లాం స్వీకరించి ముస్లింలయిపోయారు.

రెండవ ఉఖబా ఒప్పందం

హజ్రత్ ముస్‌అబ్(రజి) శిక్షణ మూలంగా అన్సార్ తెగలన్నీ ఇస్లాం ధర్మాన్ని తెలుసుకున్నాయి. ఫలితంగా మరుసటి సంవత్సరం (దైవదౌత్యపు పదమూడవ యేట) యస్రిబ్ నుండి ఎనభై మూడు మంది పురుషులు, ఇద్దరు స్త్రీలతో కూడిన ఒక బృందం మక్కాకు వచ్చింది. దైవప్రవక్త (సల్లం)ను మదీనాకు ఆహ్వానించమని, దాని కోసం ఆయన్ని ఎలాగైనా ఒప్పించి తీరాలని యస్రిబ్‌లోని ముస్లింలు వాళ్ళకు చెప్పి పంపించారు.

ఈ సత్యపథగాముల బృందం కూడా-గడిచిన రెండేళ్ళ నుంచి యస్రిబ్ నగర సత్యాన్వేషకులు సమావేశమవుతూ వస్తున్న ఉఖబా ప్రాంతంలోనే సమావేశమయ్యింది. దైవప్రవక్త (సల్లం) కూడా తన బాబాయి అబ్బాస్‌ను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు.

హజ్రత్ అబ్బాస్ అప్పటికింకా ఇస్లాం స్వీకరించకపోయినప్పటికీ ఆ సమావేశంలో ఆయన ఒక మంచి మాట చెప్పారు. యస్రిబ్ వాళ్ళనుద్ద్యేశించి ఆయన, “యస్రిబ్ నగర వాసులారా! మక్కాలోని ఖురైషులు ముహమ్మద్‌కు ప్రాణ శత్రువులన్న సంగతి మీకు తెలుసు. కనుక ముహమ్మద్‌తో ఒప్పందం కుదుర్చుకోవటమంటే మాటలు కాదు. ఆయనతో ఒప్పందం చేసుకోవటమంటే కయ్యాన్ని కొనితెచ్చుకోవటమే. ఏం చేయదలచుకున్నా ఆచితూచి అడుగు ముందుకు వేయండి. లేకపోతే మీ ప్రయత్నాలు మానుకోవటమే మంచిది” అని హెచ్చరించారు.

దానికి వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. తమకు ఏదయినా ఉపదేశించమని దైవప్రవక్త (సల్లం)ను కోరారు.

దైవప్రవక్త(సల్లం) వారికి దైవవాణి చదివి వినిపించారు. దివ్య గ్రంథ పారాయణం విని వాళ్ళు తన్మయులై భక్తివిశ్వాసాలలో ఓలలాడారు.

“దైవప్రవక్తా(సల్లం) తమరు మా నగరానికి వచ్చి స్థిరపడాలి. మీ బోధనలతో మాకు పూర్తి ప్రయోజనాన్ని చేకూర్చాలి” అని వాళ్లు పట్టుబట్టారు.

అప్పుడు దైవప్రవక్త(సల్లం) వారిని ఇలా ప్రశ్నించారు:

  1. 1. సత్యధర్మ ప్రచారంలో మీరు నాకు పూర్తిగా సహకరిస్తారా?
  2. 2. నేను మీ నగరంలోకి వచ్చి స్థిరపడితే మీరు నాకూ, నా అనుచరులకు సొంత ఆత్మీయుల్లాగా సహాయం చేస్తారా?

‘ఒకవేళ మేము అలా చేస్తే దానివల్ల మాకు ప్రయోజనమేమిటి?’

“మీకు పరలోకంలో స్వర్గం లభిస్తుంది”.

“మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కాని మీరు కూడా మమ్మల్ని ఎన్నటికీ వదలిపెట్టమని మాటివ్వాలి”.

“అలాగే మాటిస్తున్నాను. నేను బ్రతికినా, చచ్చినా మీ వెంటే ఉంటాను…”

దైవప్రవక్త నోట ఆ చివరి మాట వినగానే వాళ్ళు సత్యధర్మ మకరందాన్ని ఆస్వాదించిన తేనెటీగల్లా దైవప్రవక్త చేతి మీద ప్రమాణం చెయ్యటానికి ముందుకొచ్చారు. ఆ రోజు రాత్రి దైవప్రవక్త(సల్లం) చెప్పిన మాటల్ని అనుసరిస్తానని ఆయన చేతిమీద అందరికన్నా ముందు ప్రమాణం చేసిన మహానుభావుడు బరాబిన్ మారూర్ (రజి).

అంతలో ఒక దుర్మార్గుడు కొండ శిఖరంపై నుండి ఇదంతా గమనించి “ప్రజలారా! రండి, చూడండి. ముహమ్మద్, అతని అనుచరులంతా కలిసి మీతో యుద్ధం చేయటానికి సమాలోచనలు జరుపుకుంటున్నారు” అంటూ మక్కా వాళ్ళను బిగ్గరగా కేకవేసి పిలవసాగాడు.

‘మీరు అతని మాటలేవీ పట్టించుకోకండి’ అన్నారు దైవప్రవక్త(స). “దైవప్రవక్తా! మీరు అనుమతిస్తే రేపే ఈ మక్కా వాళ్ళకు మా ఖడ్గం రుచిని చూపిస్తాం” – అబ్బాస్ బిన్ ఉబాదా ఆవేశపడిపోతూ అన్నారు. దానికి దైవప్రవక్త(స) “వద్దు! దేవుడు నాకింకా యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వలేదు” అన్నారు. ఆ తరువాత ఆయన వారిలో పన్నెండుమందిని ఎన్నుకొని వారికి ‘నఖీబ్’లని పేరు పెట్టారు. ‘ఈసా ప్రవక్త తన అనుచరుల్లో పన్నెండు మందిని ఎన్నుకున్నారు. అలాగే నేనూ మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. మీరెళ్ళి యస్రిబ్ నగరవాసుల్లో ధర్మప్రచారం మొదలెట్టండి. మక్కాలో ఆ పని స్వయంగా నేనే చేస్తాను’ అన్నారు వారితో.

నాయకులుగా ఎన్నికయిన వారి పేర్లు

ఆ విధంగా నఖీబ్‌లుగా ఎన్నికయిన వారిలో ఖజ్‌రజ్ తెగకు చెందినవారు తొమ్మిదిమంది ఉన్నారు. వారు: అస్‌అద్ బిన్ జురారా, రాఫె బిన్ మాలిక్, ఉబాదా బిన్ సామిత్ (వీళ్ళు ముగ్గురూ మొదటి ఉఖబా ఒప్పందంలోనూ ఉన్నారు) సాద్ బిన్ రబీ, ముంజిర్ బిన్ అమ్ర్, అబ్దుల్లాహ్ బిన్ రవాహా, బరా బిన్ మారూర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ హరామ్, సాద్ బిన్ ఉబాదా.

మిగతా ముగ్గురు ఔస్ తెగకు చెందినవాళ్ళు. ఉసైద్ బిన్ హుజైర్, సాద్ బిన్ ఖైసమా, అబుల్ హైసమ్ బిన్ తీహాన్.66

తెల్లవారిన తరువాత గాని ఖురైషులకు రాత్రి జరిగిన ఒప్పందం గురించి తెలీలేదు. విషయం తెలిసిన వెంటనే ఖురైషులు యస్రిబ్ వాళ్ళను వెంబడించారు. కాని అప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. సాద్‌బిన్ ఉబాదా, ముంజిర్ బిన్ అమ్ర్ వెనుకబడిపోవడంతో వాళ్ళను పట్టుకోవటానికి ప్రయత్నించారు. ముంజిర్ (రజి) ఎలాగో తప్పించుకొని పారిపోయారు. కాని సాద్ బిన్ ఉబాదా మాత్రం పట్టుబడిపోయారు. ఖురైషులు ఆయన వాహనం పగ్గాలు విప్పదీసి ఆయన దగ్గరున్న నీళ్ళతిత్తులు లాక్కున్నారు. మక్కాకు తీసుకొచ్చి విపరీతంగా కొట్టారు. ఆయన తలపై ఉన్న పొడువాటి జుట్టుని పట్టుకొని లాగేవారు. దైవప్రవక్త (స) ఎన్నుకున్న పన్నెండుమంది నఖీబ్‌లలో సాద్ బిన్ ఉబాదా కూడా ఉన్నారు. ఖురైషుల చేతుల్లో తాను అనుభవించిన యాతనల గురించి ఆయన ఇలా వివరిస్తున్నారు.

“ఖురైషులు నన్ను కొడ్తున్నప్పుడు ఎర్రగా బుర్రగా ఉండి, తెల్లని దుస్తులు ధరించి వున్న ఒక వ్యక్తి ఎవరో నావైపు వస్తున్నట్లు కనిపించాడు. అతన్ని చూసి నేను, ఖురైషుల్లో ఎవరైనా మంచివాడనే వాడు ఉంటే, ఇతనే అయి ఉంటాడనుకున్నాను. అతను నా దగ్గరికి వచ్చి నా చెంప ఛెళ్ళుమనేలా గట్టిగా కొట్టాడు. ఇంక ఇలాంటి క్రూరుల నుండి మంచిని ఆశించటం వ్యర్థమనుకున్నాను మనసులో. అంతలో ఇంకో వ్యక్తి వచ్చాడు. అతను నన్ను చూసి జాలిపడి, “ఖురైషుల్లో నీకు తెలిసినవారు, గతంలో నీచేత సహాయం పొందినవారు ఎవరూ లేరా?” అని అడిగాడు. దానికి నేను “ఉన్నారు, అబ్దెమునాఫ్ మనవళ్ళయిన జుబైర్ బిన్ ముత్‌యిమ్, హారిస్ బిన్ హార్బ్ వ్యాపార నిమిత్తం మా దగ్గరికొచ్చేవాళ్ళు. నేను చాలా సార్లు వాళ్ళను రక్షించాను” అని చెప్పాను. “అలాగయితే ఖురైషులు నిన్ను కొట్టినప్పుడు నువ్వు వాళ్ళిద్దరినీ సహాయం కోసం అర్థించు. నువ్వు వాళ్ళకు చేసిన ఉపకారమేమిటో గట్టిగా అందరికీ వినబడేలా చెప్పు” అన్నాడా వ్యక్తి. నేను అతను చెప్పినట్లే చేశాను. ఆ తరువాత అతనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, “ఖజ్‌రజ్ తెగకు చెందిన ఒక వ్యక్తిని ఖురైషులు చిత్రహింసలు పెడుతున్నారు. అతను మీరిద్దరి పేర్లు తీసుకొని సహాయం చెయ్యమని అరుస్తున్నాడ’ని వాళ్ళతో చెప్పాడు.

‘ఎవరతను?’ అని అడిగారు వాళ్ళు.

“సాద్ బిన్ ఉబాదా అట”

‘ఔనౌను, అతను మాకు చాలా ఉపకారం చేసి ఉన్నాడు” అని ధృవీకరించారు.

తరువాత వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ఖురైషుల చెర నుండి కాపాడారు. నేను యస్రిబ్‌కు తిరిగి వెళ్ళిపోయాను.67

ఫుట్‌నోట్‌లు

  1. 1ఈ సంఘటన వివరాలన్నీ సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని వహీ అవతరణ ప్రారంభ అధ్యాయాల్లో ఉన్నాయి. అప్పుడు ఆయన(స) వయస్సు నలభై సంవత్సరాలు అని కూడా అందులో ప్రస్తావించబడింది.
  2. 2అల్‌అన్‌సాబ్ లిల్‌బలాజరీ మొదటి సంపుటిలో 111వ పుట.
  3. 3సహీహ్ బుఖారీ, సుననె తిర్మిజీ, ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్, ముస్తద్రక్ హాకిమ్, ముసన్నఫ్ ఇబ్నె అబీ షైబా తదితర గ్రంథాల ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా వీరు ముందుగా ఇస్లాం స్వీకరించిన వారని తెలుస్తోంది.
  4. 4సీరతున్నబీ మొదటి సంపుటి 206వ పుట.
  5. 5సీరతున్నబీ మొదటి సంపుటి 210వ పుట.
  6. 6సీరతున్నబీ మొదటి సంపుటి 210వ పుట. తబ్రీ తాను రాసిన చారిత్రక గ్రంథంలోనూ, వ్యాఖ్యానంలోనూ ఆ తరువాత అల్లామా షిబ్లీ (రహ్మలై) కూడా ఈ ఉల్లేఖనంలో ఎంతో కొంత బలహీనత లేకపోలేదని అన్నారు. ఇమామ్ అహ్మద్ ముస్నద్‌లో, ఇబ్నెకసీర్ తన వ్యాఖ్యానంలో, ఇబ్నెసాద్ తబఖాత్‌లో ఇంకా ఇతర చరిత్రకారులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఉల్లేఖనాలన్నింటిలో ఎంతోకొంత బలహీనత లేకపోలేదు.
  7. 7ఈ సంఘటనకు సంబంధించిన ఉల్లేఖనాలు బుఖారీ – ముస్లింలలో సంక్షిప్తంగా ప్రస్తావించబడ్డాయి.
  8. 8ఇబ్నె హజర్ గారి ‘అల్‌ఇసాబా’ గ్రంథంలో హారిస్‌బిన్ అబూహాలా ప్రస్తావన ఉంది.
  9. 9ఇమామ్ తిర్మిజీ తన సునన్ గ్రంథంలో, హాకిమ్ ముస్తద్రక్‌లో, ఇమామ్ అహ్మద్ తన ముస్నద్ గ్రంథంలో ఇంకా ఇతర చరిత్రకారులు కూడా తమ గ్రంథాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ జహబీలు ఈ ఉల్లేఖనాలన్నింటినీ దృఢమైనవిగా ఖరారు చేశారు.
  10. 10జహబీగారి అస్సీరతున్నబవియ్యా గ్రంథం 86,87, ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 577వ పుట.
  11. 11సీరతున్నబీ మొదటి సంపుటి 221వ పుట.
  12. 12సహీహ్ బుఖారీలోని కాబా నిర్మాణ ప్రకరణం
  13. 13సహీహ్ బుఖారీలోని కాబా నిర్మాణ ప్రకరణం
  14. 14జహబీగారి అస్సీరతున్నబవియ్యా 89, 90వ పుటలు
  15. 15అస్సీరతుల్ హల్బియ్యా మొదటి సంపుటి 486, 487 పుటలు. ముసన్నఫ్ ఇబ్నె అబీషైబా పధ్నాలుగవ సంపుటి 295వ పుట. జహబీగారి అస్సీరతున్న బవియ్యాలో 91-92 పుటలు.
  16. 16అస్సీరతుల్‌హల్బియ్యా మొదటి సంపుటి-49వ పుట
  17. 17అల్లామా షిబ్లీ నూమానీగారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటిలో 228 నుండి 231 పుటలు
  18. 18ఇబ్నుల్ అసీర్ గారి ‘అల్‌కామిల్’ గ్రంథం రెండవ సంపుటి 67వ పుట
  19. 19సహీహ్ బుఖారీలోని బాడుగల ప్రకరణం
  20. 20ముస్తద్రక్ హకిమ్ మూడవ సంపుటిలో 284వ పుట. ముస్నదె అహ్మద్ మొదటి సంపుటిలో 404వ పుట.
  21. 21సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటిలో 319వ పుట.
  22. 22అల్‌కామిల్ రెండవ సంపుటిలో 27వ పుట.
  23. 23ముస్తద్రక్ హాకింలో సుహైబ్ మహిమోన్నతలు. మూడవ సంపుటి:449వ పుట.
  24. 24అల్‌కామిల్ రెండవ సంపుటిలో 69వ పుట.
  25. 25అల్‌కామిల్ రెండవ సంపుటిలో 69వ పుట.
  26. 26అల్ కామిల్ రెండవ సంపుటి 69-70 పుటలు.
  27. 27అల్ కామిల్ రెండవ సంపుటి 69-70 పుటలు.
  28. 28ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 284వ పుట. ముసన్నఫ్ ఇబ్నె అబీ షైబా 10-12 బిలాల్ (రజి)ని విడిపించిన సంఘటన బుఖారీలో కూడా ఉంది.
  29. 29ఖాజీ సులైమాన్ మన్సూర్‌పూరిగారి గ్రంథం రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 55వ పుట.
  30. 30సహీహ్ బుఖారీలో అబూజర్ర్(రజి) ఇస్లాం స్వీకరించిన సంఘటన.
  31. 31అల్లామా షిబ్లీ నూమానీగారి సీరతున్నబీ గ్రంథం, ‘రియాజున్నజ్‌రా’ సౌజన్యంతో
  32. 32సహీహ్ బుఖారీలోని బలాత్కార ప్రకరణం
  33. 33సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 314వ పుట. అసదుల్ గాబా మూడవ సంపుటి 282వ పుట.
  34. 34అల్‌ఇసాబా మొదటి సంపుటి 42వ పుట
  35. 35ఇబ్నె హజర్‌గారి ఫత్‌హుల్ బారీ ఏడవ సంపుటి 188-189వ పుట
  36. 36ఇబ్నెసాద్ గారి తబఖాత్ గ్రంథం మొదటి సంపుటి 203వ పుట
  37. 37ఫత్‌హుల్ బారి ఏడవ సంపుటి 189
  38. 38సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 335-336వ పుటలు. ముస్నదె అహ్మద్ మొదటి సంపుటిలో 202వ పుట, ఐదవ సంపుటిలో 290వ పుట.
  39. 39జహబీగారి అస్సీరతున్నబవియ్యా 101వ పుట ముస్తద్రక్ హకిం మూడవ సంపుటిలో 213వ పుట.
  40. 40జహబీగారి అస్సీరతున్నబవియ్యా గ్రంథం 102-103 పుటలు. సహీహ్‌బుఖారీలోని కాబా నిర్మాణ ప్రకరణం.
  41. 41తబఖాత్ ఇబ్నెసాద్ మూడవ సంపుటి 370వ పుట
  42. 42జహబీగారి అస్సీరతున్నబవియ్యా గ్రంథం 113వ పుట.
  43. 43సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 370వ పుట.
  44. 44జాదుల్ మఆద్ మూడవ సంపుటి 29వ పుట.
  45. 45అర్రౌజుల్ ఆనిఫ్ మొదటి సంపుటి 220వ పుట.
  46. 46సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 354వ పుట. జహబీ గారి సీరత్ గ్రంథం, 142వ పుట.
  47. 47సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 374, 375, 376 పుటలు.
  48. 48జాదుల్ మఆద్ మూడవ సంపుటి 30వ పుట. సహీహ్ బుఖారీ
  49. 49రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 65వ పుట తారీఖెతబ్రీ సౌజన్యంతో
  50. 50ఫత్‌హుల్ బారీ: ఏడవ సంపుటి 194వ పుట.
  51. 51బుఖారీ, ముస్లిం
  52. 52ఫత్‌హుల్ బారీ ఏడవ సంపుటి 224వ పుట.
  53. 53సహీహ్ బుఖారీలోని అన్సార్ ముస్లింల మహిమోన్నతల ప్రకరణం.
  54. 54సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 416వ పుట.
  55. 55ఈ సంఘటనను ఇమామ్ బుఖారీ (రహ్మలై) తన ‘సహీహ్’ గ్రంథంలో సంక్షిప్తంగా పేర్కొన్నారు. ఇమామ్ జహబీగారు అస్సీరతున్నబవియ్యాలో 185 నుండి 188 పుటల వరకు, ఇబ్నె హిషామ్ అస్సీరతున్న బవియ్యా మొదటి సంపుటి 419 నుండి 421 వరకు, ఈ సంఘటనను విపులంగా పేర్కొన్నారు. ఇమామ్ హైషమీ మజ్‌మవుజ్జవాయిద్ ఆరవ సంపుటి 35వ పుటలో దీనిని ప్రస్తావించారు. ఇమామ్ తబ్రానీ కూడా దృఢమైన ఆధారంతో ఈ సంఘటనను పొందుపరిచారు.
  56. 56ముఖ్‌రీజి గారి అమ్‌తావుల్ అస్మా మొదటి సంపుటి 30వ పుట.
  57. 57సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 424-425 పుటలు.
  58. 58సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 426-427 పుటలు.
  59. 59సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 427-428 పుటలు. ముస్నదె అహ్మద్ ఐదవ సంపుటి 427వ పుట. ఇబ్నె హజర్ దీని ప్రామాణికతను సమర్థించారు. అల్ ఇసాబా గ్రంథం మొదటి సంపుటి 146వ పుట.
  60. 60సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం.
  61. 61సహీహ్ బుఖారీలోని అన్సార్ల మహిమోన్నతల ప్రకరణం; సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతల ప్రకరణం.
  62. 62సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 428-429 పుటలు.
  63. 63సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 428-429 పుటలు.
  64. 64సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం. ఇబ్నెహిషామ్ తన ‘సీరత్’ గ్రంథంలో ప్రామాణికమైన ఆధారాలతో ఈ సంఘటనను పొందుపరిచారు. సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 431 నుండి 434 పుటల వరకు.
  65. 65అసదుల్ గాబా నాల్గో సంపుటి 406వ పుట.
  66. 66ముస్నదె అహ్మద్ మూడవ సంపుటి 322 నుండి 339 పుటల వరకు. ముస్తద్రక్ హాకిమ్ రెండవ సంపుటి 624, 625 పుటలు. ఇమామ్ జహబీ హాకిమ్ ఉల్లేఖనాలను ప్రామాణికమైనవిగా ఖరారు చేశారు. మరిన్ని వివరాల కోసం సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 438 నుండి 448 పుటల వరకు, ఫత్‌హుల్ బారీ ఏడవ సంపుటి 219 నుండి 223 పుటల వరకు చూడగలరు.
  67. 67సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 449-450 పుటలు. రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 82వ పుట.