ఏడవ అధ్యాయం
హుదైబియా ఒప్పందం
హి.శ. ఆరవయేట ఒకరోజు దైవప్రవక్త (సల్లం) తనకు వచ్చిన కల గురించి అనుచరులకు వివరించారు. ఆ కలలో తాను ముస్లింలతో పాటు మక్కా వెళ్లి అక్కడ కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పారు. ఆ కల గురించి వినగానే మక్కా వాసులైన ముస్లింలలో దేశభక్తి పొంగిపొర్లింది. వారి కళ్ళల్లో కాబా చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తీపారవశ్యపు మధురస్మృతులు మెదిలాయి. అంచేత వాళ్ళు ఆ సంవత్సరమే కాబాయాత్ర కోసం వెళ్ళాలని దైవప్రవక్త (సల్లం)ను పట్టుబట్టారు.1
ముహాజిర్లతో పాటు అన్సార్లలో కూడా చాలామందికి కాబా గృహ ప్రదక్షిణ చేసే భాగ్యానికి నోచుకోవాలన్న ప్రగాఢ కాంక్ష ఉండేది. ఈ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లం) వెంట పద్నాలుగు వందల మంది అనుచరులు బయలుదేరారు. జుల్ హులైఫా ప్రాంతం చేరుకున్నాక ఖుర్బానీ సన్నాహాలు మొదలయ్యాయి. ఖుర్బానీ ఒంటెల్ని తోడుతీసుకెళ్ళటం, అవి ఖుర్బానీ జంతువులన్న దానికి గుర్తుగా వాటి మెడల్లో చెప్పుల దండలు వేలాడదీయటం మొదలగు ఆచారాలన్నీ పూర్తయ్యాయి.2
ఖురైషుల పథకాల గురించి సమాచారం తెలుసుకోవటానికి ముందు జాగ్రత్తగా ముస్లింలు ఖుజాఆ తెగకు చెందిన ఒక ముస్లిం వ్యక్తిని మక్కాకు పంపించారు. అయితే అతను ముస్లిం అయిపోయాడన్న సంగతి మక్కా అవిశ్వాసులకు తెలియదు. యాత్రికుల బృందం ఉస్ఫాన్ ప్రాంతానికి చేరుకుంటున్నప్పుడు ఖుజాఆ వ్యక్తి వచ్చి ఖురైషులు తెగల నాయకులందరినీ ఒకచోట సమావేశపరచి ముహమ్మద్ (సల్లం)ను మక్కాలోకి రానీయకుండా చెయ్యాలని కుట్రలు పన్నుతున్నారని తెలియజేశాడు.3
ఖురైషులు ముస్లింలను ఎదుర్కోవటానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు మొదలెట్టారు. తమతో చేతులు కలిపిన తెగలవారందరికీ సైన్యాలను వెంటబెట్టుకొని తమ దగ్గరికి రావాలని కబురంపారు. మక్కా వెలుపల బల్దహ్ అనే ప్రాంతంలో సైన్యాలను మోహరించారు. ఖాలిద్ బిన్ వలీద్ (ఆయన అప్పటికింకా ఇస్లాం స్వీకరించలేదు) రెండొందల మంది రౌతుల్ని వెంటబెట్టుకొని సైన్యానికి సారథ్యం వహిస్తూ ముందుకు నడిచారు. ఆ రెండొందల మంది రౌతుల్లో అబూజహల్ కొడుకు ఇక్రిమా కూడా ఉన్నాడు. ఖాలిద్ బిన్ వలీద్ సారథ్యంలో ఆ రౌతు దళం గుమైమ్ ప్రాంతానికి చేరుకుంది.4
దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలిసింది. ఆయన తన అనుచరులతో, “ఖురైషులు ఖాలిద్ బిన్ వలీద్ ను గూఢచారిగా నియమించి పంపారు. అతను గుమైమ్ దాకా వచ్చాడు. అందుకని మనం అతనికి కనపడకుండా కుడిప్రక్కగుండా వెళ్ళాలి” అన్నారు.
ముస్లింలు గుమైమ్ పొలిమేరలు దాటివెళుతుండగా ఖాలిద్ బిన్ వలీద్‌కు అటువైపు గుర్రాలవల్ల దుమ్మురేగుతూ కనిపించింది. అప్పుడాయన తన గుర్రంపై వాయువేగంతో మక్కావెళ్ళి ముస్లింల సైన్యం గుమైమ్ దాకా వచ్చేసిందని తెలియజేశారు.
దైవప్రవక్త (సల్లం) ఇంకాస్త ముందుకు వెళ్ళి హుదైబియా అనే ప్రాంతంలో ఆగారు. కాని ఆ ప్రాంతంలో నీళ్ళకొరత ఉండేది. దగ్గర్లో ఓ బావి కనిపిస్తే అందులోని నీళ్ళు ఉపయోగించు కోవచ్చనుకున్నారు. కాని ఒక్కసారికే ఆ బావిలోనినీళ్ళు కూడా అయిపోయాయి. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) మహిమతో ఆ బావి మళ్లీ నిండిపోయింది. ముస్లింలు పుష్కలంగా ఆ నీటిని ఉపయోగించుకున్నారు.5
ఖుజాఆ తెగవారు అప్పటివరకు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని రహస్యంగా ఇస్లాంకు సహాయ సహకారాలు అందించేవారు. ఖురైషులు, అవిశ్వాసులు ఇస్లాంకు వ్యతిరేకంగా వేసే పథకాల గురించి దైవప్రవక్త (సల్లం)కు తెలియపరిచేవారు. బుదైల్ బిన్ వరఖా ఈ తెగకు నాయకుడు. దైవప్రవక్త (సల్లం) రాక గురించి తెలియగానే ఆయన కొంతమందితో కలసి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళి, ‘ఖురైషుల సైనిక వాహిని ఇటువైపే వస్తోంది. వాళ్ళు మిమ్మల్ని కాబా గృహం దగ్గరికి వెళ్ళనివ్వరు’ అని చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆయనతో ఇలా అన్నారు:
“మీరెళ్ళి ఖురైషులతో చెప్పండి. మేము యుద్ధం చేసే ఉద్దేశ్యంతో రాలేదు. ఉమ్రా యాత్ర కోసం వచ్చాం. ఇంతకుముందు జరిగిన యుద్ధాల్లో ఖురైషులు దారుణంగా దెబ్బతిని ఉన్నారు. వారికి ఆ యుద్ధాల్లో చాలా నష్టం కలిగింది. కనుక వారు ఓ నిర్ణీత కాలంపాటు మాతో శాంతి ఒప్పందం చేసుకొని మమ్మల్ని మా మానాన వదిలేయటం మంచిది. దైవసాక్షిగా చెబుతున్నాను. వారు దీనికి కూడా ఒప్పుకోకపోతే నా శిరస్సు ఖండించబడే వరకు నేను వారితో పోరాడుతూనే ఉంటాను. ఆఖరికి దేవుడే మన మధ్య ఏదో ఒక తీర్పు చేయాలి”.
బుదైల్ ఖురైషుల దగ్గరికి వెళ్ళి, “నేను ముహమ్మద్ దగ్గర్నుండి చాలా ముఖ్య సందేశం తీసుకొని వచ్చాను. అనుమతి ఇస్తే తెలియపరుద్దామనుకుంటున్నాను” అన్నారు. ముహమ్మద్ (స) సందేశమనగానే కొంతమంది తుంటరులు కస్సుబుస్సుమన్నారు. కాని సౌమ్యులైన అవిశ్వాసులు మాత్రం ఆయనకు చెప్పటానికి అనుమతినిచ్చారు. అప్పుడు బుదైల్ వారికి దైవప్రవక్త (సల్లం) చేసిన ప్రతిపాదనలు వినిపించారు. ఆ ప్రతిపాదనలు విని ఉర్వా బిన్ మస్‌వూద్ సఖఫీ లేచి నిలబడి.
“ఖురైషులారా నేను మీ తండ్రిలాంటి వాణ్ణి. మీరంతా నా పిల్లలతో సమానం. ఔనా? అన్నాడు.
ఖురైషులందరూ ఒక్కసారిగా ఔనన్నట్టు తలలూపారు.
“మీకు నా గురించి దురభిప్రాయమయితే లేదు కదా?” -ఉర్వా మళ్ళీ అడిగాడు.
“లేదు”- అందరూ ముక్త కంఠంతో సమాధానమిచ్చారు.
“మరయితే నాకు అనుమతి ఇవ్వండి. నేను స్వయంగా వెళ్ళి ముహమ్మద్‌తో మాట్లాడి వస్తాను. అతను చేసిన ప్రతిపాదనలు సముచితంగానే ఉన్నాయి” అని చెప్పి ఖురైషుల అనుమతి తీసుకొని ఉర్వా దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాడు. ఆయన (సల్లం)కు ఖురైషుల సందేశం వినిపించి,
“ముహమ్మద్! నువ్వు ఖురైషుల్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నావా? అసలు తన జాతివారినే నాశనం చేసే మూర్ఖుడు ఇప్పటి వరకు ఈ భూమ్మీద పుట్టాడంటావా? ఇప్పుడు మేము తలచుకుంటే నిన్నూ, నీతోపాటు ఉన్న ఈ కొద్దిమందిని మట్టిలో కలిపేయగలం తెలుసా?” ఉర్వా దైవప్రవక్త (సల్లం)ను గద్దిస్తూ మాట్లాడాడు.
ఉర్వా కూతలు విన్న అబూబక్ర్ (రజి)కు ఆవేశం కట్టలు త్రెంచుకుంది. అతన్ని తిడుతూ, “మేము ముహమ్మద్(స)ను విడిచిపెట్టి పారిపోయే వాళ్ళమనుకున్నావా?” అన్నారాయన.
ఉర్వా చటుక్కున ముఖం త్రిప్పి
“ఎవడు వీడు?” అని అడిగాడు
“అబూ బక్ర్” -దైవప్రవక్తే సమాధానమిచ్చారు.
“నేను ఇతని కరకు మాటలకు ఇక్కడే తగిన విధంగా బుద్ధి చెప్పేవాణ్ణి. కాని ఇతను నాకు ఒకప్పుడు ఉపకారం చేశాడు. నేనిప్పటివరకు దాని బదులు తీర్చుకోలేకపోయాను. అందుకే వదలిపెడుతున్నాను” అన్నాడు ఉర్వా.6
ఉర్వా దైవప్రవక్త (సల్లం)తో ఎంతో చనువుగా మాట్లాడసాగాడు. అరబ్బులు మాట్లాడినప్పుడు మాటిమాటికీ ఎదుటివ్యక్తి గడ్డం పట్టుకొని మాట్లాడేవారు. అలాగే ఉర్వా కూడా మాటి మాటికి దైవప్రవక్త (సల్లం) గడ్డం వెంట్రుకలు పట్టుకోసాగాడు. ఆ సమయంలో ఆయన వీపు వెనుక ఆయుధాలు ధరించి నుంచున్న ముగీరా బిన్ షోబాకు ఉర్వా చనువును చూసి ఒళ్ళు మండింది. “కాస్త వెనక్కి జరిగి మాట్లాడు. లేదా నా చెయ్యి లేసిందంటే ఇక వెనక్కి తగ్గేది ఉండదు” -ఆయన ఉర్వాను గద్దించారు.
ఉర్వా ముగీరాను గుర్తుపట్టి, “ఓరి ద్రోహీ! నువ్వా నన్ను గదమాయిస్తూ మాట్లాడుతున్నది. నువ్వు చేసిన ద్రోహానికి నేను ఫలితం అనుభవించాను గుర్తుందా?” -ముగీరా వైపు ఉరిమి చూశాడు. (ముగీరా ఇస్లాం స్వీకరించక ముందు కొంతమందిని హత్య చేస్తే దాని రక్తపరిహారం ఉర్వా చెల్లించాడు).7
దైవప్రవక్త (సల్లం) పట్ల ఆయన అనుచరులు ప్రదర్శిస్తున్న నిరుపమాన ప్రేమాభిమానాలను చూసి ఉర్వా ఎంతగానో ప్రభావితుడయ్యాడు. మక్కాకు తిరిగివెళ్ళి ఖురైషులతో ఇలా చెప్పాడు.
“నేను ఖైసర్, కిస్రా, నజాషీ చక్రవర్తుల దర్బారులు చూశాను. కాని ప్రజలు తమ నాయకునిపై ఇంతటి ప్రేమాభిమానాలు కురిపించటం నేనెక్కడా చూడలేదు. ముహమ్మద్ మాట్లాడటం మొదలు పెట్టారంటే నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఎవరూ ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడు. ఆయన వుజూ చేసుకున్న నీళ్ళను దోసిళ్ళతో పట్టుకోవటానికి ఆయన అనుచరులు ఎగబడతారు. అభిమానులు ఆయన ఉమ్మిని కూడా క్రిందపడనీయకుండా చేతుల్లో పట్టుకొని మొహానికి, చేతులకు పూసుకుంటున్నారు.”8
వ్యవహారం అసంపూర్తిగా మిగిలిపోవడంతో దైవప్రవక్త (సల్లం) ఖిరాష్ బిన్ ఉమయ్యాను ఖురైషుల దగ్గరికి పంపించారు. కాని ఖురైషులు ఆయన ఒంటెను చంపేశారు. విశేషమేమిటంటే దైవప్రవక్త (సల్లం) తన ప్రయాణం కోసం ప్రత్యేకంగా ఉపయోగించే ఒంటె అది. ఖురైషులు ఖిరాష్ను కూడా చంపబోయారు. కాని ఇతర తెగవాళ్ళు అడ్డుకొని ఆయన్ని రక్షించారు. ఆయన ఎలాగో అక్కణ్ణుంచి తప్పించుకొని పారిపోయి వచ్చారు.9
ఆ తరువాత ఖురైషులు ముస్లింలపై దాడిచేసే ఉద్ద్యేశంతో ఒక సైనిక పటాలాన్ని పంపారు. విధివశాత్తూ దాడిచేయటానికి వచ్చి వాళ్ళే స్వయంగా ముస్లింలకు పట్టుబడ్డారు. ఇది ఖురైషులు పాల్పడిన మహా కిరాతక చర్యే అయినా దైవప్రవక్త (సల్లం) విశాల హృదయంతో వారిని క్షమించి వదలిపెట్టేశారు.10 దివ్యఖురాన్లోని ఈ సూక్తి ఆ సంఘటననే సూచిస్తోంది:
బైతె రిజ్వాన్
దైవప్రవక్త (సల్లం) మక్కాలోని ఖురైషులతో ఒప్పందం గురించి మాట్లాడిరావటానికి హజ్రత్ ఉమర్ (రజి)ను ఎంపిక చేశారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) అందుకు సిద్ధం కాలేదు. ఖురైషులు తనకు బద్ధ శత్రువులని, మక్కాలో తనను రక్షించేవాడెవడూ లేడని చెప్పి దైవప్రవక్త (సల్లం) ఆదేశాన్ని సున్నితంగా నిరాకరించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆ పనికోసం హజ్రత్ ఉస్మాన్ (రజి)ను ఎంపిక చేశారు. ఆయన తన మిత్రుడైన అబాన్ బిన్ సయీద్ సంరక్షణలో మక్కా వెళ్ళారు. అక్కడ ఖురైషులకు దైవప్రవక్త (సల్లం) సందేశం అందజేశారు. కాని ఖురైషులు నమ్మకద్రోహానికి పాల్పడి హజ్రత్ ఉస్మాన్‌ను బంధించి చీకటికొట్టులో పడవేశారు. అంతలో అటు ముస్లింలలో ఉస్మాన్ హత్య చేయబడ్డారన్న వదంతి వ్యాపించింది.11 దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియగానే ఆయన ‘ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవటం ముస్లింల కర్తవ్యం’ అని ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఓ తుమ్మ చెట్టుక్రింద కూర్చొని దానికోసం ప్రాణాలైనా అర్పించటానికి సిద్ధంగా ఉండాలని తన అనుచరుల నుండి ప్రమాణం తీసుకున్నారు. ఆ సమయంలో స్త్రీ పురుష సహచరులందరూ ఎంతో ఉద్రేకంతో తాము ప్రాణ త్యాగానికయినా సిద్ధమేనంటూ దైవప్రవక్త (సల్లం) చేతిపై ప్రమాణం చేశారు. ఇస్లామీయ చరిత్రలో ఈ సంఘటనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ప్రమాణాన్ని “బైతుర్రిజ్వాన్” అని అంటారు. దివ్యఖురాన్లోని ఫత్హ్ సూరాలో ఆ సంఘటనతోపాటు ఆ చెట్టు ప్రస్తావన కూడా ఉంది.
ఇదంతా జరిగాక హజ్రత్ ఉస్మాన్ హత్యచేయబడ్డారన్న సంగతి నిజం కాదని తెలిసింది.12
ఒప్పంద వివరాలు
ఖురైషులు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి సుహైల్ బిన్ అమ్ర్ను రాయబారిగా పంపారు. సుహైల్ గొప్ప వాక్చాతుర్యం గల మనిషి. అందుకే ప్రజలు ఆయన్ని “ఖురైషుల వక్త” అనే బిరుదుతో గౌరవించేవారు.13 ముహమ్మద్(స) ఈ యేడు ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళిపోతేనే తాము ముస్లింలతో ఒప్పందం చేసుకుంటామని ఖురైషులు సుహైల్‌కు చెప్పి పంపించారు.
సుహైల్ దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒప్పందానికి సంబంధించిన షరతులను గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆఖరికి కొన్ని షరతులపై ఇరువురూ ఏకాభిప్రాయానికొచ్చారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అలీని పిలిచి ఒప్పందాన్ని ఒక పత్రంపై వ్రాయమని చెప్పారు. హజ్రత్ అలీ ఒప్పంద పత్రంపై అగ్రభాగాన “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం” అని రాశారు. అరబ్బులు ప్రాచీన కాలం నుంచి లేఖలు, ఒప్పంద పత్రాల ఆరంభంలో “బిస్మిక అల్లాహుమ్మ” అని వ్రాసేవారు.
వారికి “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం” అన్న వాక్యం విచిత్రంగా అనిపించింది. అంచేత సుహైల్ తాము వ్యవహరించే వాక్యమే వ్రాయాలని డిమాండ్ చేశారు. దైవప్రవక్త (సల్లం) అందుకు అంగీకరించారు. ఆ తరువాత “ఇది దైవప్రవక్త ముహమ్మద్ అంగీకరించిన ఒప్పందం” అని వ్రాయించారు. ఆ వాక్యం చూసి సుహైల్ మళ్ళీ అడ్డు తగిలారు.
“మీరు దైవప్రవక్త అన్న సంగతిని మేము అంగీకరిస్తే ఇక ఈ గొడవలన్నీ ఎందుకు? మీరు మీపేరూ, మీ తండ్రిపేరూ వ్రాయండి చాలు” అన్నాడు ఖచ్చితంగా మాట్లాడుతూ.
దైవప్రవక్త (సల్లం) సుహైల్‌ను ఉద్ద్యేశించి, “మీరు తిరస్కరిస్తున్నారు సరే, దైవసాక్షిగా చెబుతున్నాను. నిస్సందేహంగా నేను దైవప్రవక్తను” అన్నారు. ఆ తరువాత హజ్రత్ అలీని కేవలం తన పేరు మాత్రమే వ్రాసి ‘దైవప్రవక్త’ అనే పదాన్ని చెరిపేయమని ఆదేశించారు. దైవప్రవక్త (సల్లం) పట్ల హజ్రత్ అలీకు ఉన్న వినయవిధేయతల గురించి, ఆయన ఆజ్ఞాపాలన గురించి లోకమంతటికీ తెలుసు. కాని ఆ సమయంలో దైవప్రవక్త ఆజ్ఞను అంగీకరించటం కన్నా తిరస్కరించటమే సముచితం అనిపించిందాయనకు. దైవప్రవక్త పేరును చెరపటానికి ఆయన సుతరామూ ఒప్పుకోలేదు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆ పదం ఎక్కడుందో తనకు చూపించమని కోరారు. హజ్రత్ అలీ వేలు పెట్టి చూపించగా తనే స్వయంగా ‘దైవప్రవక్త’ అన్న పదాన్ని చెరిపేశారు.
ఒప్పందంలోని షరతులు
- 1) ముస్లింలు ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోవాలి.
- 2) వచ్చే సంవత్సరం మక్కాకు రావచ్చుగాని మూడ్రోజులుండి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి.
- 3) ఆయుధాలు ధరించి రాకూడదు. ఒక్క ఖడ్గం మాత్రం వెంట తెచ్చుకోవచ్చు. అది కూడా ఒరలోనే ఉండాలి. ఒరల్ని ఏదైనా సంచిలో పెట్టుకొని రావాలి.
- 4) ముందునుంచి మక్కాలో ఉంటున్న ముస్లింలను తమ వెంట తీసుకెళ్ళకూడదు. ఇక మదీనా నుంచి వచ్చే ముస్లింలలో ఎవరైనా మక్కాలో ఉండిపోదలచుకుంటే వారిని ఆపకూడదు.
- 5) మక్కావాసుల్లో ఎవరైనా మదీనాకు వస్తే వారిని వెనక్కి పంపించాలి. కాని అదే ఏ ముస్లిం అయినా మక్కాకు వస్తే అతన్ని మాత్రం త్రిప్పి పంపటం జరగదు.
- 6) ఇతర తెగలవారు ఈ ఒప్పందం విషయంలో ఇరుపక్షాల్లో ఎవరినయినా సమర్థించవచ్చు.14
ముస్లింల సహనానికి పరీక్ష
ఈ ఒప్పందంలోని షరతులు ముస్లింలను కించపరిచే విధంగా ఉన్నాయి. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల తరపున సంతకాలు జరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో సుహైల్ కుమారుడు అబూ జందల్ అక్కడికి వచ్చారు. ఆయన కాళ్ళకు బేడీలున్నాయి. ఇస్లాం స్వీకరించిన పాపాన అవిశ్వాసులు ఆయన్ని సంకెళ్ళతో బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆయన ఎలాగో శత్రువుల నుండి తప్పించుకొని వచ్చి ముస్లింల శరణు కోరారు. ఆయన్ని చూడగానే సుహైల్ కనుబొమ్మలెగరేస్తూ,
“ముహమ్మద్! మన ఒప్పందంపై అమలులో ఎదురవుతున్న తొలి సందర్భం ఇది. ఒప్పంద షరతుల ప్రకారం అబూజందల్ను నాకప్పగించండి” అన్నాడు.
అబూ జందల్ను చూడగానే దైవప్రవక్త (సల్లం)కు అమితమైన జాలి కలిగింది.
“ఒప్పందం ఇంకా మొదలు కాలేదు” అన్నారు. ఆయన మాటల్లో ఎలాగైనా అబూ జందల్ను రక్షించుకోవాలన్న ఆశ తొణికిసలాడింది.
“అలాగయితే మాకు ఈ ఒప్పందం కూడా అవసరం లేదు” సుహైల్ మొండికేశాడు. ఈ అవకాశంతో ముస్లింల మెడలు వంచాలన్న దుర్బుద్ధి అతనిలో నిలువెల్లా ఆవహించి ఉంది.
“ఇతన్ని మాతోపాటే ఉండనివ్వండి” -దైవప్రవక్త (స) విన్నవించుకునే ధోరణిలో అడిగారు.
కాని సుహైల్ ససేమిరా అన్నాడు. దైవప్రవక్త (సల్లం) ఎంతగానో బ్రతిమాలారు. కాని సుహైల్ ఎంతకీ ఒప్పుకోకపోవటంతో దైవప్రవక్త (సల్లం) గత్యంతరం లేక ఒప్పందానికి శిరసావహించవలసి వచ్చింది.
అబూజందల్ను అవిశ్వాసులు విపరీతంగా కొట్టారు. ఆయన ఒళ్ళంతా గాయాలతో, వాతలతో పచ్చిపుండులా తయారయింది. అందరి ముందు చొక్కా విప్పి ఒంటిపైనున్న గాయాలు చూపెడుతూ ఏడుపు ముహంతో ఆయన, “ముస్లిం సోదరులారా! మీరు నన్ను ఇదే స్థితిలో వదలిపెడతారా? నేను ఇస్లాం స్వీకరించాను. నన్ను మళ్ళీ ఈ అవిశ్వాసులకే అప్పజెప్పి వెళ్ళిపోతారా?” అంటూ ఒక్కొక్క ముస్లింని బ్రతిమాలసాగారు.
ఆయన స్థితిని చూడగానే ముస్లింల గుండెలు తరుక్కుపోయాయి. హజ్రత్ ఉమర్ అయితే అసలు ఉండబట్టలేకపోయారు. దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళి ఆవేశంలో
“దైవప్రవక్తా! మీరు నిజంగా దైవప్రవక్తేనా?” అని అడిగారు.
“ఔను దైవప్రవక్తనే” సమాధానమిచ్చారాయన.
“మనం సత్యంపైనే ఉన్నాం కదా!?
“అవును”
“మరి ధర్మంలో మనకు ఇన్ని అవమానాలెందుకు?
“ఉమర్! నిస్సందేహంగా నేను దైవప్రవక్తను. దైవాజ్ఞను నేను ఉల్లంఘించ లేను. దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు.”
“మనం కాబా ప్రదక్షిణ చేస్తామని చెప్పలేదా మీరు?”
“కాని ఈ యేడే చేస్తామని చెప్పలేదుగా”.
దైవప్రవక్త (సల్లం) నోట ఆ చివరిమాట విన్న తరువాత హజ్రత్ ఉమర్ అక్కడి నుండి లేచి అబూబక్ర్ దగ్గరికి వెళ్ళి అలాగే మాట్లాడారు. దానికి అబూబకర్ సమాధానమిస్తూ, “ఆయన దైవప్రవక్త. ఏది చేసినా దైవాజ్ఞకు అనుగుణంగానే చేస్తారు” అని చెప్పారు.15
దైవప్రవక్త (సల్లం)తో అలా దురుసుగా మాట్లాడి నందుకు హజ్రత్ ఉమర్ (రజి) ఆ తరువాత జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోయేవారు. తన వల్ల అప్రయత్నంగా జరిగిపోయిన ఆ నేరానికి పరిహారంగా ఆయన ఎన్నో నమాజులు చేశారు, ఉపవాసాలు పాటించారు. దానధర్మాలు చేశారు. బానిసల్ని విడిపించారు. సహీహ్ బుఖారీలో దీని ప్రస్తావన సంక్షిప్తంగా ఉంది. ఇబ్నె ఇస్హాఖ్ మాత్రం ఈ విషయాన్ని సవివరంగా ప్రస్తావించారు.16
ఆ స్థితిలో సహనం వహించటం విశ్వాసుల విధేయతా వినమ్రతలకు పరీక్ష. ఒకవైపు ఇస్లాంను కించపరచటం జరుగుతోంది. అబూ జందల్ సంకెళ్ళు వ్రేలాడుతున్న చేతులెత్తి తనను ఆదుకోమని పధ్నాలుగు వందల ముస్లింలను వేడుకొంటున్నారు. ముస్లింలందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. దైవప్రవక్త (సల్లం) ఒక్క సైగచేస్తే చాలు తమ ఖడ్గాలతో శత్రువులకు బాగా బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు. కాని మరోవైపు ఒప్పంద పత్రంపై సంతకాలు అయిపోయాయి. ఇక ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఇరుపక్షాలపై ఉంది. దైవప్రవక్త (సల్లం) అబూ జందల్ వైపు జాలిగా చూస్తూ ఇలా ఓదార్చారు.
“అబూ జందల్! కాస్త ఓర్చుకో. పుణ్యాన్ని ఆశించు. దేవుడు నీకు నీలాంటి బాధితులకు తప్పకుండా ఏదో ఒక మార్గం చూపెడతాడు. ఒప్పందం కుదిరింది. మనం వేళ్ళతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలి”17
దైవప్రవక్త (సల్లం) తన సహచరుల్ని అక్కడే జంతువుల్ని ఖుర్బానీ ఇవ్వమని ఆజ్ఞాపించారు. కాని అనుచరులు నిరాశానిస్పృహలకు లోనై ఉండటం చేత ఒక్కడూ లేవలేదు. దైవప్రవక్త (సల్లం) మూడుసార్లు ఆజ్ఞాపించారు. కాని అనుచరుల్లో అలుకూ లేదు పలుకూలేదు.18 దైవప్రవక్త (సల్లం) చిరాకుతో ఇంట్లోకెళ్ళి తన సతీమణి హజ్రత్ ఉమ్మెసలమాను విచారించారు.
“మీరు ఎవరితోనూ ఏమి అనకండి. తిన్నగా బయటికి వెళ్ళి ఖుర్బానీ ఇవ్వండి. క్షవరం చేయించుకొని ఇహ్రాం దీక్షను విరమించండి” అని సలహా ఇచ్చారామె.
దైవప్రవక్త (సల్లం) అలాగే బయటికి వచ్చి తనే ముందుగా ఖుర్బానీ ఇచ్చారు. శిరోముండనం చేయించుకున్నారు. అది చూసి ఇక దైవప్రవక్త (సల్లం) నిర్ణయంలో మార్పు ఉండదని గ్రహించిన సహచరులందరూ కూడా పశువుల్ని జిబహ్ చేసి ఇహ్రాం దీక్షను విరమించారు.19
పరాభవ పవనాలు కాదు, విజయ వీచికలు
ఒప్పందం జరిగిన తరువాత మూడ్రోజుల వరకు దైవప్రవక్త (సల్లం) హుదైబియా ప్రాంతంలోనే ఆగారు. ఆ పిదప అక్కడి నుండి మదీనాకు బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఈ దైవసూక్తి అవతరించింది.
ఏ స్థితినయితే ముస్లింలందరూ పరాభవంగా అవమానకరంగా భావించారో ఆ స్థితినే దేవుడు విజయంగా చిత్రించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) హజ్రత్ ఉమర్‌ను పిలిచి ఈ సూక్తి అవతరించిందని చెప్పారు. దానికి హజ్రత్ ఉమర్ విపరీతంగా ఆశ్చర్యపోతూ, “దైవప్రవక్తా! ఇది విజయమా?” అని అడిగారు. ‘ఔను, విజయమే’ అన్నారు దైవప్రవక్త (సల్లం). అప్పటి వరకూ పరాభవాన్ని తలచుకుంటూ ఉడికిపోతున్న ఉమర్ హృదయం దైవప్రవక్త (సల్లం) ద్వారా విజయ సువార్త విన్న తరువాతగాని కుదుటపడలేదు.20 వాస్తవానికి హుదైబియా ఒప్పందంలోని షరతులు ముస్లింల పాలిట విజయవీచికలే కాని పరాభవ పవనాలు కావని కాలమే తేల్చి చెప్పింది.
అప్పటి వరకు మక్కాలోని ముస్లింలకు మదీనాలోని ముస్లింలను కలుసుకునే అవకాశాలుండేవి కావు. కాని ఈ ఒప్పందం జరిగిన తరువాత ముస్లింల మధ్య రాకపోకలు, సంబంధాలు మొదలయ్యాయి. వ్యాపార సంబంధాలు పునరుద్ధరించబడటంతో మక్కా అవిశ్వాసులు వ్యాపార విషయాల నిమిత్తం మదీనా వెళ్ళి అక్కడే కొన్ని నెలలపాటు విడిది చేసేవారు. ఆ సమయాల్లో వారు ముస్లింలతోపాటు కలిసి తిరిగేవారు. పరస్పరం మాట్లాడుకున్నప్పుడు ఇస్లాం ధర్మ ప్రస్తావన వచ్చేది. వారు ఇస్లామీయ ఉత్తమ జీవనశైలి గూర్చి చర్చించుకునేవారు. దానికి తోడు ముస్లింల చిత్తశుద్ధి, వ్యవహారశైలి, సదాచరణ, సభ్యతాసంస్కారాలను చూసి అవిశ్వాసులు ఎంతగానో ప్రభావితులయ్యేవారు. అప్రయత్నంగానే వారి హృదయాలు ఇస్లాం వైపుకు మ్రొగ్గేవి.21 హుదైబియా ఒప్పందం మొదలుకుని మక్కా విజయం వరకు మునుపటి కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇస్లాం స్వీకరించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.22 సిరియా విజేత హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్, ఈజిప్ట్ విజేత హజ్రత్ అమ్ర్ బిన్అస్(రజి)లు ఈ కాలంలో ఇస్లాం స్వీకరించినవారే.23
ఒప్పందంలోని ఒక షరతు ప్రకారం మక్కా నుండి ఏ ముస్లిం అయినా మదీనాకు వెళితే అతన్ని తిరిగి మక్కాకు పంపేయాలి. అయితే ఈ షరతు కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీల విషయంలో ప్రత్యేకంగా ఈ దైవసూక్తి అవతరించింది.24
మక్కాలో ఉండిపోయిన ముస్లింలను అవిశ్వాసులు రకరకాలుగా వేధించేవారు. అంచేత వారు తప్పించుకొని మదీనాకు పారిపోయేవారు. ఆ విధంగా అందరికన్నా ముందు ఉత్బా బిన్ ఉసైద్ మదీనాకు పారిపోయారు. దైవప్రవక్త (సల్లం) ఉత్బాను మక్కాకు తిరిగి వెళ్ళిపోమని ఆదేశించారు. అప్పుడాయన తన దీనావస్థను వెలిబుచ్చుతూ,
“దైవప్రవక్తా! మీరు నన్ను ఇస్లాంను వదలిపెట్టమని బలవంతం చేస్తున్న ఆ దైవద్రోహుల వద్దకే తిరిగి వెళ్ళి పోమంటున్నారా?” అన్నారు.
“దేవుడు దానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు.”
దైవప్రవక్త (సల్లం) ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గత్యంతరం లేక ఉత్బా ఇద్దరు అవిశ్వాసుల వెంట మక్కాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలో ఒకడ్ని హత్య చేశారు. రెండో వాడు తప్పించుకొని మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు దీని గురించి ఫిర్యాదు చేశాడు. అంతలోనే అబూబుసైర్ (ఉత్బా) అక్కడికి చేరుకొని,
‘దైవప్రవక్తా! ఒప్పంద షరతు ప్రకారం మీరు నన్ను మక్కాకు త్రిప్పి పంపించారు. ఆ తరువాత ఇక మీపై ఎలాంటి బాధ్యతా ఉండదు’ అని చెప్పి మదీనా నుండి బయలుదేరారు. ‘జూమిర్రా’ అనే ప్రాంతంలో సాగర తీరాన ‘ఐస్’ అనే చోట నివసించసాగారు. మక్కాలోని బాధిత, నిరాధార ముస్లింలకు తృతీయ ప్రపంచం నెలకొంటుందని తెలియగానే మెల్లగా ఒక్కొక్కరు మక్కానుండి పారిపోయి అక్కడికి చేరుకోసాగారు. కొంతకాలానికి అక్కడ కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఒక ముస్లిం సమూహం ఏర్పడింది. వాళ్ళంతా సంఘటితులై సిరియావెళ్ళే ఖురైషుల వర్తక బిడారాలను నిలువరించేవారు. దాని ద్వారా వచ్చే ధనాన్ని తమ అవసరాల నిమిత్తం వాడుకునేవారు.
ఖురైషులు చేసేది లేక తాము ఒప్పందంలోని ఈ షరతును మినహాయిస్తున్నామని, ఇకపై ఏ ముస్లిం అయినా మదీనా వెళ్ళి స్థిరపడవచ్చునని, తాము దానికి ఎలాంటి అభ్యంతరం తెలుపబోమని దైవప్రవక్త (సల్లం)కు లేఖవ్రాశారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) సంచారజీవులై తిరుగుతున్న ముస్లింలకు మదీనా వచ్చేయమని కబురు పంపారు. దాంతో అబూజందల్, ఆయన మిత్రులు మదీనాకు వచ్చి స్థిరపడ్డారు. ఖురైషుల వర్తక మార్గం కూడా సుగమం అయింది.25
స్త్రీలలో మక్కా నాయకుడు ఉఖబా బిన్ అబూ మయీత్ కూతురు ఉమ్మెకుల్సూమ్ (రజి అన్హా) ఇస్లాం స్వీకరించి ఉండటం చేత ఆమె కూడా మదీనాకు వలసవెళ్ళారు. అయితే ఆమెతోపాటు ఆమెగారి ఇద్దరు సోదరులు అమారా, వలీద్లు కూడా వెళ్ళారు. వారు దైవప్రవక్త (సల్లం)ను తమ సోదరిని మక్కాకు పంపించమని కోరారు. కాని దైవప్రవక్త (సల్లం) మాత్రం అందుకు నిరాకరించారు.26 దైవప్రవక్త సహచరుల భార్యలు కొందరు ఇస్లాం స్వీకరించకుండా మక్కాలోనే ఉండిపోయారు. అంచేత సహచరులు వారికి విడాకులిచ్చేశారు.27
హుదైబియా ఒప్పందాన్ని దేవుడు విజయంగా చిత్రించాడు. కాని ఈ విజయం శరీరాల విజయం కాదు. హృదయాల విజయం. ఇస్లాం ప్రచారానికి కావలసిన శాంతి సౌహార్దాల వాతావరణం ఈ ఒప్పందం వల్లనే లభించింది. ఈ ఒప్పందం ముస్లింల పాలిట నిజంగానే విజయమని స్వయంగా శత్రువులు కూడా అంగీకరించారు. అప్పటి వరకు ముస్లింల – ఖురైషుల మధ్య జరిగిన యుద్ధాల్లో ఖాలిద్ బిన్ వలీద్ తలమానిక సైన్యాధిపతిగా వ్యవహరించారు. అజ్ఞాన కాలంలో ఖురైషుల సైనిక పటాలాలకు ఆయనే నాయకత్వం వహించేవారు. ఉహుద్ యుద్ధంలో ఖురైషులను ఓటమి అంచుల నుండి కాపాడింది ఆయనే. హుదైబియా ఒప్పంద సందర్భంలోనూ ఆయనే ఖురైషుల దళపతిగా వ్యవహరించారు. చివరికి ఆ ఖురైషు దళపతి కూడా ఇస్లామీయ ఆధ్యాత్మిక ప్రభావం నుండి తప్పించుకోలేకపోయాడు.28
హుదైబియా ఒప్పందం తరువాత ఒకసారి హజ్రత్ ఖాలిద్ మక్కా నుండి బయలుదేరి మదీనా వెళుతున్నారు. దారిలో అమ్ర్ బిన్ ఆస్ ఎదురయి ఎక్కడికి వెళుతున్నారని అడిగారు. ఇస్లాం స్వీకరించడానికి వెళుతున్నానని చెప్పారు ఖాలిద్ బిన్ వలీద్. తాను కూడా ఇస్లాం స్వీకరిస్తానని అన్నారు అమ్ర్ బిన్ ఆస్. ఇద్దరూ కలిసి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళి ఇస్లాం స్వీకరించి సౌభాగ్యులయ్యారు.29 అప్పటి వరకు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉపయోగించిన తమ శక్తి సామర్థ్యాలను ఇకపై ఇస్లాం అభ్యున్నతి కోసం ఉపయోగించటం మొదలుపెట్టారు.
మక్కా విజయం సందర్భంగా ఖాలిద్ ఒక ముస్లిం సైనికదళానికి అధిపతిగా ఉండి దైవప్రవక్త (సల్లం) ముందు నుంచి వెళ్ళారు. దైవప్రవక్త (సల్లం) ప్రజల చేత చెప్పించే ఉద్దేశ్యంతో, “ఎవరీయన?” అని అడిగారు. ప్రజలు ‘ఖాలిద్’ అని చెప్పగానే ఆయన “ఖాలిద్, దేవుని కరవాలం” అన్నారు.30
మౌతా యుద్ధంలో జాఫర్, జైద్ బిన్ హారిసా, అబ్దుల్లాహ్ బిన్ రవాహా లాంటి సైన్యాధిపతులు వీరోచితంగా పోరాడుతూ అమరగతి నొందిన తరువాత హజ్రత్ ఖాలిద్ యుద్ధపతాకాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముస్లింలను ప్రమాదం నుండి గట్టెక్కించారు.
ఖిలాఫత్ కాలంలో ఖాలిద్ రోము చక్రవర్తి నుండి సిరియాను వశపరచుకోగా అమ్ర్ బిన్ ఆస్ ఈజిప్ట్‌లో ఇస్లామీయ విజయపతాకాన్ని ఎగురవేశారు.31
రాజులు, చక్రవర్తులకు ఇస్లాం సందేశం
హి.శ. ఏడవ యేట ముహర్రమ్ మాసం ఒకటో తేదీన దైవప్రవక్త (సల్లం) ప్రపంచ చక్రవర్తులు, రాజులకు ఇస్లాం సందేశం అందజేసే నిమిత్తం రాయబారుల ద్వారా వారికి ఉత్తరాలు వ్రాసి పంపటం మొదలుపెట్టారు. ప్రతి రాయబారి తాను వెళ్ళబోయే దేశంలో మాట్లాడే భాష తెలిసినవాడయి ఉండేవాడు. కనుక అతను ఆ దేశంలో చక్కగా ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేయగలిగేవాడు.32
అప్పటి వరకు దైవప్రవక్త (సల్లం) ఎలాంటి రాచముద్రికలు తయారు చేయించుకోలేదు. కాని ఇప్పుడు రాజులకు లేఖలు వ్రాయవలసి వచ్చినప్పుడు తనకు కూడా ఒక రాచముద్రిక అవసరమనిపించింది. అంచేత ఆయన ఒక వెండి ఉంగరాన్ని తయారు చేయించుకున్నారు. ఆ ఉంగరం ముద్రభాగంలో “ముహమ్మదుర్రసూలుల్లాహ్” అని మూడువరుసల్లో వ్రాసి ఉండేది.33
అప్పట్లో దైవప్రవక్త (సల్లం) వ్రాయించిన లేఖలను పరిశీలించగా బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే క్రైస్తవ రాజులకు వ్రాసిన లేఖల్లో ముఖ్యంగా ఈ సూక్తిని పొందుపరచేవారు.
ఆ లేఖల్లో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం.
అబిసీనియా రాజు నజాషీకి లేఖ
ఆ కాలంలో అబిసీనియారాజు అస్హమ్ బిన్ అబ్జర్. నజాషీ అతని బిరుదు. అమ్ర్ బిన్ ఉమయ్యా జమ్రీ అతని దగ్గరికి రాయబారిగా వెళ్ళి అతనికి దైవప్రవక్త (సల్లం) లేఖను అందజేశారు. ఇతను క్రైస్తవుడు.34 తారీఖె తబ్రీ నుండి సేకరించిన ఆ లేఖ అనువాదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.
బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం:
ఈ లేఖ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) తరపునుండి అబిసీనియా చక్రవర్తి అస్హమ్ నజాషీకి వ్రాయబడుతోంది. నీకు శాంతికల్గుగాక! ముందుగా నేను దైవాన్ని స్తుతిస్తున్నాను. ఆయన విశ్వ సామ్రాట్టు. పరిశుద్ధుడు, శాంతిప్రదాత, సంరక్షకుడు.
మర్యమ్ కుమారుడైన హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) దేవుని సృష్టి అనీ, కుమారి శీలవతి అయిన హజ్రత్ మర్యమ్ వైపునకు పంపబడిన ఒక ఆజ్ఞ అనీ నేను స్పష్టం చేస్తున్నాను. ఆ ఆజ్ఞతోనే ఆమె ఈసాకు గర్భం దాల్చింది. ఏ విధంగానైతే దేవుడు హజ్రత్ ఆదంను తన చేత్తో, తన శ్వాసతో పుట్టించాడో అదే విధంగా ఈసాను తన ఆత్మతో, తన శ్వాసతో పుట్టించాడు.
ఇక నేనిచ్చే సందేశమేమిటంటే నువ్వు, ఒక్కడూ తనకు మరెవ్వరూ సాటిలేని దైవాన్ని విశ్వసించు. నిత్యం ఆయనకు విధేయుడవై ఉండు. నన్ను అనుసరించు. చిత్తశుద్ధితో నా బోధనల్ని అంగీకరించు ఎందుకంటే నేను దైవప్రవక్తను.
“నేను ఇంతకు ముందు నీ రాజ్యానికి నా పినతండ్రి కుమారుడు జాఫర్‌తోపాటు కొంతమంది ముస్లింలను పంపాను. వారిని నీ రాజ్యంలో సుఖంగా ఉంచుకో. నజాషీ! నువ్వు అహంకారాన్ని వదలిపెట్టు. నేను నిన్నూ, నీ ఆస్థానంలోని వారిని దైవం వైపునకు ఆహ్వానిస్తున్నాను. నేను మీకు దైవసందేశాన్ని అందజేసి, బాగా అర్థమయ్యేలా వివరించాను. ఇక మీరు నా హితవును అంగీకరించటమే మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. సన్మార్గగాములకు శాంతి కల్గుగాక!”35
నజాషీ చక్రవర్తి ఆ లేఖను చూసి ముస్లిం అయిపోయాడు. జవాబుగా ఈ ఉత్తరం వ్రాశాడు:
బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం
“ఈ ఉత్తరం నజాషీ చక్రవర్తి అస్హమ్ బిన్ అబ్జర్ తరపునుండి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) సన్నిధికి వ్రాయబడుతోంది. ఓ దైవప్రవక్తా! మీపై దేవుని శాంతి కల్గుగాక! ఆయన కారుణ్యాలు, శుభాలు మీపై కురియుగాక! ఆయన తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయనే నాకు ఇస్లాం భాగ్యాన్ని ప్రసాదించాడు.
ముఖ్యంగా వ్రాయునది ఏమనగా తమరి లేఖను అందుకున్నాను. భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా చెబుతున్నాను. ఈసా-అలైహి-కు మీరు వ్రాసిన దానికంటే అణుమాత్రమయినా ఎక్కువ విలువ లేదు. మీరు వ్రాసినట్లుగా ఆయనకున్న విలువ అంతే! మేము మీ బోధనల్ని నేర్చుకున్నాం. మీ పినతండ్రికుమారుడు, ఇతర ముస్లింలు మా రాజ్యంలో సుఖంగా ఉన్నారు. మీరు దైవప్రవక్త అని నేను ధృవీకరిస్తున్నాను. మీరు సత్యసంధులు. సత్యవంతుల సత్యాన్ని ప్రకటించేవారు. నేను మీతో ప్రమాణం చేస్తున్నాను-నేను మీ పినతండ్రి కుమారుడు జాఫర్ చేతిపై కూడా ప్రమాణం చేశాను. దైవానికి విధేయుడనై ఉంటానని మాటిచ్చాను. ఇప్పుడు నేను నా కుమారుడు అరహాను మీ దగ్గరికి పంపుతున్నాను. నాకు కేవలం నా మీద అధికారం ఉంది (ఇతరుల హృదయాలపై అధికారం లేదు). మీరు కోరుకుంటే మీ సేవ చేయటానికి నేను తప్పకుండా హాజరవుతాను. ఎందుకంటే మీరు ఏది చెప్పినా సత్యమే చెబుతారని నేను నమ్ముతున్నాను. ఓ దైవప్రవక్తా! మీపై శాంతి కల్గుగాక!”36
బహ్రాయిన్ రాజుకి లేఖ
బహ్రైన్ రాజు ముంజిర్ బిన్ సావీ. ఇతను పారశీక చక్రవర్తికి సామంతుడు. అలా బిన్ హజ్రమీ (రజి) ఇతని దగ్గరికి రాయబారిగా వెళ్ళారు. ఇతను దైవప్రవక్త (సల్లం) లేఖ చదివి ఇస్లాం స్వీకరించాడు. అంతేకాదు అతని ప్రజల్లో కూడా అత్యధిక మంది ఇస్లాం స్వీకరించారు. ఇతను జవాబుగా దైవప్రవక్త (సల్లం)కు లేఖ వ్రాశాడు. తన రాజ్యంలో కొంతమంది ఇస్లాంను అమితంగా ఇష్టపడ్డారనీ, మరికొంత మంది అయిష్టత వ్యక్తం చేశారని, ఇంకా కొందరయితే ఇస్లాం స్వీకరించటానికి నిరాకరించారని, తన రాజ్యంలో యూదులు, అగ్ని పూజారులు ఎక్కువగా ఉన్నారని వ్రాస్తూ వారి విషయంలో ఏదయినా ఆదేశం ఇవ్వవలసిందిగా కోరాడు. దానికి జవాబుగా దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా వ్రాసి పంపారు.
“హితవును గ్రహించినవాడు తన మంచికోసమే గ్రహిస్తాడు. కాని ఎవరయినా యూదత్వాన్ని లేదా అగ్నిపూజ మతాన్నే అంటిపెట్టుకొని ఉండాలనుకుంటే అతను ‘జిజ్యా’ (రక్షణ రుసుము) చెల్లించవలసి ఉంటుంది.”37
అమ్మాన్ రాజుకి లేఖ
అమ్మాన్ రాజ్యానికి జులందీ రాజు. జైఫర్, అబ్ద్ అనేవారు అతని కుమారులు. వారి దగ్గరికీ దైవప్రవక్త (సల్లం) తరపు నుండి రాయబారిగా హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ పంపబడ్డారు. హజ్రత్ అమ్ర్ ఇలా అంటున్నారు. నేను అమ్మాన్ రాజ్యం చేరుకున్న తరువాత మొట్టమొదట అబ్ద్ను కలుసుకున్నాను. ఇతను తన రాజ్యంలో ప్రముఖ సర్దారు. తన సోదరుడు జైఫర్ కన్నా చాలా నెమ్మదస్తుడు. నేనతనితో మాట్లాడి, నేను దైవప్రవక్త (సల్లం) తరపు నుండి మీ అన్నదమ్ముల దగ్గరికి రాయబారిగా వచ్చానని చెప్పాను.
దానికి అబ్ద్, “నా అన్న వయసులో నాకంటే పెద్దవాడు. ఈ దేశానికి ఏకైక రాజూ అతనే. నేను మిమ్మల్ని అతని దర్బారుకు తీసుకువెళతాను. అసలు మీరిచ్చే సందేశమేమిటో ముందు నాకు చెప్పండి” అన్నాడు.
“ఒకే ఒక్కడూ, తనకు ఎవ్వరూ సాటిలేని దేవుని వైపుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ముహమ్మద్ (సల్లం) దేవుని దాసుడు, ఆయన ప్రవక్త అన్న విషయాన్ని విశ్వసించమని కోరుతున్నాం”-అమ్ర్ బిన్ ఆస్ క్లుప్తంగా సమాధానమిచ్చారు.
అది విన్న అబ్ద్కు ఏదో అభ్యంతరం కలిగింది. “అమ్ర్! మీరు మీ జాతి నాయకుని కుమారులు కదా! మీ తండ్రి ఈ విషయాన్ని అంగీకరించారా? అంగీకరిస్తే చెప్పండి మేమూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాం” తటపటాయిస్తూనే అడిగాడు అబ్ద్.
“ఆయన ఇస్లాం స్వీకరించకుండానే చనిపోయారు. ఆయన ఇస్లాం స్వీకరించి, ముహమ్మద్ (సల్లం) దైవప్రవక్త అన్న సంగతి సత్యమని ధృవీకరించి ఉంటే బాగుండేది. నేను కూడా నా తండ్రి ధర్మాన్నే అనుసరించేవాణ్ణి. కాని ఆ తరువాత దేవుడు నాకు ముహమ్మద్ (సల్లం)ను విశ్వసించే భాగ్యాన్ని ప్రసాదించాడు”. ఏ మాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు అమ్ర్.
అబ్ద్: నువ్వు ఎప్పట్నుంచి ముహమ్మద్‌ను అనుసరిస్తున్నావ్?
అమ్ర్: ఇటీవల నుంచే
అబ్ద్: ఇస్లాం ఎక్కడ స్వీకరించావు?
అమ్ర్: నజాషీ చక్రవర్తి దర్బారులో, నజాషీ చక్రవర్తి కూడా ఇస్లాం స్వీకరించాడు.
అబ్ద్: ఆ తరువాత అక్కడి ప్రజలు నజాషీ పట్ల ఎలా ప్రవర్తించారు?
అమ్ర్: యధాప్రకారం అతన్ని చక్రవర్తిగానే ఉండనిచ్చారు. పైగా ప్రజలు కూడా ఇస్లాం స్వీకరించారు.
అబ్ద్: (ఆశ్చర్యంగా) క్రైస్తవమత పండితులు కూడా ఇస్లాం స్వీకరించారా?
అమ్ర్: అవును
అబ్ద్: చూడు అమ్ర్. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? అబద్ధం చెప్పటం మహాపాపమని తెలుసుకదా!
అమ్ర్: నేను అబద్ధం చెప్పటం లేదు. అబద్ధం చెప్పటానికి ఇస్లాం ధర్మం సుతరామూ అనుమతించదు.
అబ్ద్: మరి హెరిక్లస్ ఏం చేశాడు? నజాషీ ముస్లిం అయిపోయాడన్న సంగతి అతనికి తెలుసా?
అమ్ర్: తెలుసు!
అబ్ద్: తెలుసని మీరెలా చెప్పగలరు?
అమ్ర్: నజాషీ హెరిక్లస్కు కప్పం చెల్లించేవాడు. కాని అతను ఇస్లాం స్వీకరించిన తరువాత ఇకపై చిల్లిగవ్వ అడిగినా ఇవ్వనని ప్రకటించేశాడు.
హెరిక్లస్కు ఈ విషయం తెలిసింది. అతని సోదరుడు యన్నాఖ్ విపరీతంగా మండిపడ్డాడు.
“అన్నయ్యా! నీ బానిస అయిన ఆ నజాషీ మనకు కప్పం చెల్లించటానికి నిరాకరించాడు. మన మతాన్ని కూడా వదలిపెట్టి ఇంకేదో క్రొత్త మతాన్ని అవలంబిస్తున్నాడు” అంటూ నజాషీకు బుద్ధిచెప్పమని కోరాడు.
కాని హెరిక్లస్ అతన్ని మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. పైగా ఎంతో నెమ్మదిగా ‘అతనికి ఆ మతం నచ్చింది. అతను దాన్ని అవలంబిస్తున్నాడు. అందులో మనకు అభ్యంతరం దేనికి? దైవసాక్షి. నాకు ఈ సామ్రాజ్య చింత లేకపోయినట్లయితే నేనూ ఆ పనే చేసేవాణ్ణి’ అన్నాడు.
అబ్ద్: అమ్ర్, ఏమిటి మీరు మాట్లాడుతున్నది?
అమ్ర్: దైవసాక్షి! నేను నిజం చెబుతున్నాను.
అబ్ద్: సరేగాని మీ ప్రవక్త ఏ పనులు చేయాలని ఆదేశిస్తున్నారో, మరేపనులు చేయకూడదని అంటున్నారో చెబుతారా?
అమ్ర్: ఆయన దేవునికి విధేయత చూపాలని ఆదేశిస్తారు. దైవం పట్ల అవిధేయతకు పాల్పడటం నుంచి వారిస్తారు. తాగుడు, జూదం, వ్యభిచారం అధర్మమైన పనులనీ, విగ్రహాలను, శిలువలను పూజించకూడదని అంటారు.
అబ్ద్: ఆయన ఇస్తున్న ఆదేశాలు చాలా బాగున్నాయ్! మా అన్నయ్య కూడా నా మాట వింటే బాగుండు! ఇద్దరం దైవప్రవక్త (స) సన్నిధికి వెళ్ళి ఇస్లాం స్వీకరిస్తాం.
ఒకవేళ మా అన్నయ్య ఈ సందేశాన్ని తిరస్కరించి ప్రాపంచిక జీవితానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే దానివల్ల ఈ రాజ్యానికే నష్టం వాటిల్లుతుందని నేననుకుంటున్నాను.
అమ్ర్: ఒకవేళ మీ అన్నయ్య ఇస్లాం స్వీకరించినా ఇక్కడి రాజుగా దైవప్రవక్త (సల్లం) ఆయన్నే కొనసాగనిస్తారు. ఈ దేశంలోని ధనికుల నుండి ‘సదఖాలు’ వసూలు చేసి ఇక్కడి నిరుపేదలకే పంచిపెడతారు
అబ్ద్: మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అయితే నాకు తెలియక అడుగుతాను. అసలు ‘సదఖా’ అంటే ఏమిటి?
అమ్ర్ బిన్ ఆస్ అప్పుడతనికి జకాత్ ఆదేశాల గురించి వివరించారు. ఆయన ఆ విధంగా వివరిస్తూ ఒంటెలపై కూడా జకాత్ చెల్లించాలని చెప్పగానే అబ్ద్ ఆశ్చర్యపోతూ, “ఏమిటి, పశువులపై కూడా పన్ను చెల్లించాలా? పశువులు స్వయం పోషకాలు. అవి చెట్ల ఆకులు, అలములు తిని, నీళ్లు త్రాగి బతుకుతాయి. వాటిమీద పన్ను చెల్లించడమేమిటి?” అన్నాడు.
“ఔను, మేము పశువుల మీద కూడా జకాత్ వసూలు చేస్తాం” అన్నారు అమ్ర్ బిన్ ఆస్.
“మా జాతి ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సుదూర ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నారు. నాకు వారు ఈ ఆజ్ఞను అంగీకరిస్తారన్న నమ్మకం లేదు” అన్నాడు అబ్ద్.
మొత్తానికి హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ కొన్ని రోజుల పాటు అక్కడే ఆగారు. అబ్ద్ రోజూ తాము మాట్లాడుకునే మాటలు తన అన్నకు చేరవేసేవాడు. ఒకరోజు రాజు అమ్ర్ను తన దర్బారుకు పిలిపించాడు. భటులు ఆయన్ని పెడరెక్కలు విరిచిపెట్టుకొని రాజదర్బారులో హాజరుపరచారు. రాజు ఆయన్ని వదలి పెట్టమని సైగచేయగానే భటులు ఆయన్ని వదలిపెట్టి ఓ ప్రక్క నించున్నారు. ఆయన రాజు ముందు కూర్చోబోతుంటే భటులు మళ్ళీ ఆయన్ని పట్టుకొని నించోబెట్టారు. అమ్ర్ రాజు వంక చూశారు.
“చెప్పు, నువ్వు వచ్చిన పని ఏమిటి?”
అమ్ర్ ఏమీ మాట్లాడకుండా దైవప్రవక్త (సల్లం) ముద్ర అంటించి వున్న ఒక లేఖను రాజు చేతికి అందించారు.
జైఫర్ ఆ ఉత్తరం తెరచి చూశాడు. ఉత్తరం మొత్తం ఒకసారి చదువుకొని తమ్ముడికిచ్చాడు. అతని తమ్ముడు కూడా ఆ ఉత్తరం చదివాడు.
ఆ తరువాత రాజు ఖురైషులు ఎలా ఉన్నారని అడిగాడు. అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా దైవప్రవక్త (సల్లం) విధేయతనే ఎంచుకున్నారని చెప్పారు అమ్ర్ బిన్ ఆస్.
రాజు: ముహమ్మద్‌ను అనుసరించేవారు ఎలాంటివారు?
అమ్ర్: మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించినవారు. అన్నింటినీ వదలుకొని దైవప్రవక్త (సల్లం)నే ఎంచుకున్నారు. వారు ఎన్నో అనుభవాల తరువాత బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజు అమ్ర్బిన్ ఆస్తో మళ్ళీ రేపు తనను కలవమన్నాడు. అమ్ర్ మరునాడు రాజు తమ్ముణ్ణి కలుసుకున్నారు. తమ రాజ్యానికి ఎలాంటి హాని లేదనుకుంటే రాజు తప్పకుండా ఇస్లాం స్వీకరిస్తాడని హామీ ఇచ్చాడతను.
అమ్ర్ బిన్ ఆస్ మరునాడు రాజుని కలుసుకున్నారు. రాజు ఎంతో నెమ్మదిగా మాట్లాడసాగాడు.
“నేను ఈ విషయం గురించి బాగా ఆలోచించాను. చూడు, మీ ప్రవక్త సైన్యం మా రాజ్యం దరిదాపులకు కూడా రాలేదు. అలాంటి వ్యక్తికి నేను తలొగ్గితే అరబ్బు రాజులందరికీ నేను చులకన అయిపోతాను. వాస్తవానికి ఏ దేశమయినా నా మీదకు దండెత్తి వస్తే నేను మీరు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా వారిని చిత్తుగా ఓడిస్తాను. అంత బలం ఉంది నా దగ్గర.”
“సరే, అయితే నేను రేపే మా దేశం వెళ్ళిపోతాను” అన్నారు అమ్ర్.
రాజు రేపు ఉండమని చెప్పాడు.
మరునాడు రాజు ఓ మనిషిని పంపి ఆయన్ని తన వద్దకు పిలిపించాడు. ఆయన సమక్షంలోనే రాజు, అతని సోదరుడు ఇరువురూ ఇస్లాం స్వీకరించారు. ప్రజల్లో కూడా చాలా మంది ఇస్లాం స్వీకరించారు.38
డెమాస్కస్, ఎమన్ పాలకులకు లేఖలు
డెమాస్కస్ రాజు ముంజిర్ బిన్ హారిస్ బిన్ అబూ షిమ్ర్. అతను సిరియా ప్రాంతానికి గవర్నరుగా కూడా వ్యవహరించేవాడు. షుజా బిన్ వహబ్ అసదీ అతని వద్దకు రాయబారిగా వెళ్ళారు. అతను దైవప్రవక్త (సల్లం) పంపిన లేఖ చదివి కోపంతో చిందులు వేశాడు. తనే ముందుగా మదీనాపై దండెత్తుతానని ప్రగల్భాలు పలికాడు. రాయబారిని గౌరవ మర్యాదలతో పంపాడు కాని తాను మాత్రం ఇస్లాం స్వీకరించలేదు.39
ఆ కాలంలో ఎమన్ పాలకుడు హెజాబిన్ అలీ. అతను క్రైస్తవుడు. సలీత్ బిన్ అమ్ర్ అతని దగ్గరికి దైవప్రవక్త (సల్లం) తరపున రాయబారిగా పంపబడ్డారు. దైవప్రవక్త (సల్లం) సందేశం విని ఆ మూర్ఖుడు ఇస్లామీయ రాజ్యంలో తనకు సగం వాటా లభిస్తే తానూ ముస్లిం అయిపోతానని ఎకసెక్కంగా మాట్లాడాడు. ఆ మాట అన్న తరువాత కొన్నిరోజులకే అతను చనిపోయాడు.40
అలెగ్జాండ్రియా రాజుకు లేఖ
ఆ కాలంలో అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ దేశాలను జురైహ్ బిన్ ముత్తా ముఖవ్వఖస్ అనే బిరుదుతో పరిపాలిస్తున్నాడు. అతను క్రైస్తవుడు. హాతిబ్ బిన్ అబూ బుల్తఆ అతని దగ్గరికి రాయబారిగా వెళ్ళారు. అతనికి వ్రాసిన ఉత్తరంలో దైవప్రవక్త (సల్లం) చివరిలో ఒకవేళ తను ఇస్లాం స్వీకరించకపోతే ఈజిప్ట్ వాసులందరి పాపం తన మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు.
రాయబారి అతనికి దైవప్రవక్త (సల్లం) లేఖను అందజేయటంతో పాటు అతనికి ఈ విధంగా బోధించారు:
“రాజా! ఈ దేశంలోనే మీకన్నా ముందు ఓ రాజు గతించాడు. అతను తాను ప్రజలకు మహాదేవుణ్ణని చెప్పుకునేవాడు. చివరికి దేవుడు ఇహపరాల్లోనూ అతన్ని పరాభవం పాల్జేశాడు. దైవశిక్ష విరుచుకుపడి అతని రాజ్యమదాంధకారాన్ని అణచివేసింది. కనుక నువ్వు ఇతరుల్ని చూసి గుణపాఠం నేర్చుకో. లేదా ఇతరులే నిన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.”
దానికి రాజు, “ప్రస్తుతం మేము ఒక మతాన్ని అవలంబిస్తున్నాం. దానికన్నా శ్రేష్టమైన మతాన్ని పొందనంతవరకు మేము దాన్ని వదలిపెట్టలేము” అన్నాడు.
రాజు మాట విని హాతిబ్ అతనికి విషయం అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించసాగారు.
“నేను మిమ్మల్ని అన్ని మతాలకన్నా శ్రేష్టమైన మతం వైపునకే ఆహ్వానిస్తున్నాను.”
“దైవప్రవక్త (సల్లం) ఇస్లాం సందేశం అందరికీ ఇచ్చారు. కాని ఖురైషులు దాన్ని వ్యతిరేకించారు. యూదులు ఇస్లాంతో వైరం పెంచుకున్నారు. అయితే ఇస్లాం పట్ల అతి ఎక్కువగా ప్రేమ కనబరచిన వారు, ఇస్లాంను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినవారు ఒక్క క్రైస్తవులే. దైవసాక్షి! మూసా ప్రవక్త ఈసా రాక గురించి శుభవార్తను తెలిపినట్లే ఈసా ప్రవక్త ముహమ్మద్ (సల్లం) రాక గురించి శుభవార్తను అందజేశారు. మీరు యూదుల్ని బైబిల్ వైపుకు ఎలా ఆహ్వానిస్తున్నారో అలాగే మేము కూడా మిమ్మల్ని ఖురాన్ వైపునకు ఆహ్వానిస్తున్నాం” హాతిబ్ చెప్పుకుపోతున్నారు.
ఏదయినా జాతి వైపునకు ఒక ప్రవక్త పంపబడితే ఆ జాతి ఆయన ‘ఉమ్మత్’ (సమాజం)గా పరిగణింపబడుతుంది. ఒక ప్రవక్త కాలంలో మీరు బ్రతికిఉంటే ఆయన్ని అనుసరించటం మీ విధి. ఒక విధంగా చెప్పాలంటే మేము మిమ్మల్ని మీ ప్రవక్త ఈసా మతం వైపునకే ఆహ్వానిస్తున్నామని భావించండి. దానికి జవాబుగా ముఖవ్వఖస్ ఇలా అన్నాడు.
“నేను ఈ ప్రవక్త గురించి బాగా ఆలోచించాను. ఆయన మంచి విషయాల నుండి మాత్రం వారించటం లేదు. అయినప్పటికీ నేనింకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. నాకు తెలుసు. ఆయన ప్రజలకు కీడు తలపెట్టే ఇంద్రజాలికుడు కాడు. మాయ మాటలు చెప్పే జ్యోతిష్యుడూ కాడు. పైగా ఆయనలో ప్రవక్త లక్షణాలే కనబడుతున్నాయి. సరే; ఈ విషయం గురించి ఇంకా బాగా ఆలోచించిన తరువాత నా నిర్ణయమేమిటో చెబుతాను”.
ఆ తరువాత ముఖవ్వఖస్ దైవప్రవక్త (సల్లం) లేఖను ఏనుగుదంతాలతో చేసిన ఓ పెట్టెలో ఉంచి, పెట్టెకు రాజముద్రను అంటించి కోశాగారంలో భద్రపరచాడు. దైవప్రవక్త (సల్లం)కు ఎన్నో కానుకలు పంపించాడు. జవాబుగా ఒక లేఖ కూడా వ్రాస్తూ అందులో “ఒక ప్రవక్త రానున్నాడన్న విషయం నాక్కూడా తెలుసు. కాని నేను ఆ ప్రవక్త సిరియాలో ఉదయిస్తాడని అనుకునేవాణ్ణి” అని చెప్పాడు.
ప్రసిద్ధి చెందిన ‘దుల్ దుల్’ కంచర గాడిద ఇతను కానుకగా పంపినదే.41
హెరిక్లిస్కు లేఖ
కానిస్టాంటిలోపుల్ లేక రోమ్నగర్ తూర్పు భాగంలోని రాజ్యానికి చక్రవర్తి హెరిక్లిస్. అతను కూడా క్రైస్తవుడే. హజ్రత్ దిహ్యా బిన్ ఖలీఫా కల్బీ అతని వద్దకు రాయబారిగా వెళ్ళారు. దిహ్యా బైతుల్ మఖ్దిస్ ప్రాంతంలో హెరిక్లిస్ చక్రవర్తిని కలుసుకున్నారు. ఈ చక్రవర్తి దైవప్రవక్త రాయబారికి ఘనంగా స్వాగతం పలికాడు. ఆయన గౌరవార్థం ప్రత్యేక దర్బారును నెలకొల్పాడు. దైవప్రవక్త (సల్లం) గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నాడు.
ఆ తరువాత హెరిక్లిస్ దైవప్రవక్త (సల్లం) గురించి మరిన్ని వివరాలు అడగాలనుకున్నాడు. మక్కా నుండి ఎవరయినా తన రాజ్యానికి వస్తే వారిని తన దర్బారులో హాజరుపరచమని ఆదేశించాడు.
కాకతాళీయంగా ఆ రోజుల్లోనే అబూసుఫ్యాన్ అతని మిత్రబృందం వ్యాపార నిమిత్తం సిరియా వచ్చి ఉన్నారు. భటులు వారిని గుర్తించి రాజదర్బారులో హాజరుపరచారు. రాజు అబూసుఫ్యాన్ మిత్రులను ఉద్దేశించి, “నేను మా మిత్రుడు అబూసుఫ్యాన్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పటంలో అతను గనక అబద్ధమాడితే మీరు నాకు నిజం ఏమిటో చెప్పాలి” అన్నాడు.
ఆ రోజుల్లో అబూసుఫ్యాన్కు దైవప్రవక్త (సల్లం)తో విపరీతమైన శత్రుత్వం ఉండేది. తాను ఇస్లాం స్వీకరించిన తరువాత, ఆ సంఘటన గురించి అబూ సుఫ్యాన్ స్వయంగా ఇలా తెలియజేశారు:
“ఆ రోజు నా మిత్రులు నన్ను అడ్డుకుంటారేమోనన్న భయం లేకుండినట్లయితే నేను దైవప్రవక్త (సల్లం) గురించి ఆ రాజుకు ఎన్నో అబద్ధాలు చెప్పి ఉండేవాణ్ణి. కాని ఆ రాజదర్బారులో నాకు నిజమే చెప్పాల్సి వచ్చింది.”
అబూ సుఫ్యాన్కు-రోము చక్రవర్తి (కైసర్)కీ మధ్య జరిగిన సంభాషణ ఇది.
కైసర్: ముహమ్మద్ వంశం ఎలాంటిది?
అబూసుఫ్యాన్: మర్యాదస్తుల వంశం
ఆ జవాబు విని హెరక్లియస్ “నిజమే. ప్రవక్తలు ఉన్నత కుటుంబాలకు చెందినవారే అయివుంటారు. దానివల్ల ప్రజలు ప్రవక్తల్ని అనుసరించటంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది” అన్నాడు.
కైసర్: ముహమ్మద్ కన్నా ముందు మీ అరబ్బుదేశంలో ఎవరయినా తాను దైవప్రవక్తనని దావా చేశాడా?
అబూ: “లేదు.”
“ఎవరైనా దావాచేసివుంటే ముహమ్మద్ అతన్ని అనుసరిస్తున్నాడనో లేక పోటీచేస్తున్నాడనో అనుకునేవాడ్ని” హెరక్లియస్ తల పంకిస్తూ అన్నాడు.
కైసర్: ముహమ్మద్ ప్రవక్త కాక ముందు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? అతను అబద్ధాలు చెబుతాడనే నిందారోపణ ఎన్నడన్నా జరిగిందా?
అబూ: లేదు
“ప్రజలతో అబద్ధం పలకని వ్యక్తి దేవుని విషయంలో అబద్ధం చెప్పగలడా”? అన్నాడు హెరక్లియస్.
కైసర్: అతని పూర్వీకుల్లో రాజులైనవారు ఎవరైనా ఉన్నారా?
అబూ: “లేరు”
దానికి హెరక్లియస్, “ఒకవేళ ఉన్నట్లయితే ఈయన ఈ ప్రవక్త పదవి ముసుగులో తన పూర్వీకుల రాజ్యాధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అనుకునేవాణ్ణి” అన్నాడు. తను ఆశించిన సమాధానాలే లభిస్తున్నాయి అతనికి.
కైసర్: ముహమ్మద్‌ను అనుసరించే వారిలో నిరుపేదలు, నిస్సహాయులు, ఎక్కువగా ఉన్నారా లేక ధనమంతులు, బలవంతులు ఎక్కువగా ఉన్నారా?
అబూ: నిరుపేదలు, నిస్సహాయులే ఎక్కువగా ఉన్నారు.
“ప్రవక్తల్ని ముందుగా అభాగ్యులు, నిరుపేదలే అనుసరిస్తారు” హెరక్లియస్ మళ్ళీ ధృవీకరించాడు.
కైసర్: ముహమ్మద్‌ను అనుసరించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదా లేక తరుగుతున్నదా?
అబూ: పెరుగుతున్నది.
“విశ్వాసం ప్రత్యేకత అదే. అది దినదిన ప్రవర్ధమానమవుతూ పరిపూర్ణతకు చేరుకుంటుంది” హెరక్లియస్ ముఖారవిందం విప్పారుతోంది.
కైసర్: ఇస్లాం స్వీకరించిన తరువాత ఎవరైనా వెనక్కి మళ్ళిపోయాడా?
అబూ: ‘లేదు’.
హెరక్లియస్ నవ్వుతూ అన్నాడు. “విశ్వాస మాధుర్య ప్రభావం అదేమరి. ఒకసారి విశ్వాసం మనిషి మనసులోకి ప్రవేశించి ఆత్మను ప్రభావితం చేయగలిగిందంటే ఇక అది వీడిపోయే ప్రసక్తే ఉండదు”.
కైసర్: ముహమ్మద్ ఎప్పుడన్నా ఒప్పందం చేసుకొని దాన్ని భంగపరిచాడా?
అబూ: ఇప్పటి వరకయితే అలాంటిదేమీ జరగలేదు. కాని ఈ యేడు ఆయనతో మాకు ఓ ఒప్పందం జరిగింది. దాని పరిణామం ఎలా ఉంటుందో చూడాలి.
అబూ సుఫ్యాన్ ఇలా తెలియజేశారు. “నేను కైసర్తో చేసిన సంభాషణలో ఈ ఒక్కమాట మాత్రం ఎక్కువ మాట్లాడగలిగాను. అయినా కైసర్ దాన్ని కూడా పట్టించుకోలేదు. పైగా “ప్రవక్తలు ప్రమాణ భంగానికి పాల్పడరు. ప్రాపంచిక సుఖసౌఖ్యాలకోసం జీవించేవారే అలాంటి పనిచేస్తారు. ప్రవక్తలు ప్రాపంచిక సుఖసౌఖ్యాల్ని కోరుకోరు అంటూ ముహమ్మద్ (సల్లం)నే సమర్థించాడు.”
కైసర్: మీరెప్పుడయినా అతనితో యుద్ధం చేశారా?
అబూ: “చేశాం”
కైసర్: ఎవరు గెలిచారు?
అబూ: “ఒకసారి వారు గెలిచారు, మరోసారి మేము గెలిచాం”.
హెరక్లియస్ మళ్ళీ ముహమ్మద్ (సల్లం)నే సమర్థిస్తూ, “దైవప్రవక్తల విషయంలో ఇలాగే జరుగుతుంది. యుద్ధాల్లో దైవ సహాయం, విజయం చివరికి వారికే ప్రాప్తిస్తాయి” అన్నాడు.
కైసర్: అసలు ఆయన ఇచ్చే సందేశం ఏమిటి?
అబూ: ఒకే దేవుణ్ణి పూజించాలి. పూర్వీకుల బహుదైవారాధనా మతాన్ని విడిచిపెట్టి, నమాజ్, ఉపవాసాలు పాటించాలి. ఎల్లప్పుడూ సత్యం పలకాలి. సౌశీల్యవంతమైన జీవితం గడపాలి, బంధువుల పట్ల సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇదే ఆయన ఇచ్చే సందేశం.
ఆ సమాధానం విని హెరక్లియస్, “ఈసా తరువాత రాబోయే ప్రవక్త గురించి చెప్పబడిన లక్షణాలన్నీ ముహమ్మద్‌లో ఉన్నాయి. ఒక ప్రవక్త రానున్నాడని నాక్కూడా తెలుసు. కాని ఆ ప్రవక్త అరబ్ దేశంలో ఉదయిస్తాడని నేనెన్నడూ అనుకోలేదు. అబూ సుఫ్యాన్! నువ్వు చెప్పిన సమాధానాలన్నీ నిజమే అయితే ఏదో ఒక రోజు ఆయన ప్రస్తుతం నేను కూర్చొని ఉన్న (సిరియా, బైతుల్ మఖ్దిస్) ప్రాంతాలను కూడా జయిస్తాడు. నాకు ఆయన దగ్గరికెళ్ళి, ఆయన కాళ్ళు కడగాలనిపిస్తోంది” అన్నాడు.
అబూ సుఫ్యాన్ ఇలా తెలియజేశారు: ఆ తర్వాత నిండుసభలో దైవప్రవక్త (సల్లం) పంపిన లేఖ చదివి వినిపించటం జరిగింది. అది వినగానే అతని ఆస్థాన సభ్యులందరూ గోలచేయటం మొదలుపెట్టారు. మమ్మల్ని దర్బారు నుండి బయటికి పంపించేశారు. ఆ రోజే నాకు, ఎప్పటికయినా నేను అవమానం పాలవుతానని, దైవప్రవక్తే విజయం సాధిస్తారన్న నమ్మకం కలిగింది.42
ఈరాన్ చక్రవర్తికి లేఖ
ఖుస్రూ పర్వేజ్ కిస్రా ఈరాన్ చక్రవర్తి. అబ్దుల్లాహ్ బిన్ హుజాఫా అతని దగ్గరికి రాయబారిగా దైవప్రవక్త (సల్లం) లేఖ తీసుకొనివెళ్ళారు. ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది:
“దైవప్రవక్త ముహమ్మద్ తరపు నుండి పారశీకపెద్ద కిస్రాకు ఈ లేఖ. సన్మార్గంపై నడిచే వానిపై, దేవుడు, దైవప్రవక్తను విశ్వసించిన వానిపై, దేవుడు తప్ప వేరొక ఆరాధ్యుడులేడని, ముహమ్మద్ దైవప్రవక్త అని సాక్ష్యం చెప్పేవానిపై శాంతి కల్గుగాక! నేను నిన్ను దైవ సందేశం వైపునకు ఆహ్వానిస్తున్నాను. నేను దైవప్రవక్తను. మానవులందరి కోసం నేను పంపబడ్డాను. నేను బ్రతికున్న వారికి దైవశిక్ష గురించి భయపెడతాను. ఇక ఎవరైనా తిరస్కరించినా అతనిపై దేవుని బాధ్యత మాత్రం తీరిపోతుంది. నువ్వు ఇస్లాం స్వీకరిస్తే ప్రశాంతంగా ఉంటావు. లేదా నీ ప్రజల్లో అగ్నిపూజ చేసేవారందరి పాపం నీ నెత్తిమీదే పడుతుంది.”
ఖుస్రూ ఆ ఉత్తరం చదవగానే దాన్ని చించిపారేశాడు. ఆగ్రహంతో హూంకరిస్తూ, “నా పాలిత ప్రజల్లోని ఒక నీచుడు నాకే ఉత్తరం వ్రాసి నాపేరు కంటే ముందు తనపేరు రాసుకుంటాడా?” అంటూ పళ్లు పటపటా కొరికాడు.
ఖుస్రూ బాజాన్ అనేవాడు ఎమన్ దేశంలో ఖుస్రూ చక్రవర్తికి ప్రతినిధి (వైస్రాయ్)గా ఉండేవాడు. అరబ్బు దేశమంతా అతని ఆధీనంలోనే ఉండేది. ఖుస్రూ చక్రవర్తి ఆ ప్రవక్తను తన వద్దకు బంధించి తీసుకొని రమ్మని తన ప్రతినిధికి ఉత్తర్వు ఇచ్చాడు.
బాజాన్ ఆ పని కోసం ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సైనికదళ అధిపతి పేరు ఖుర్ఖుస్రహ్. బాజాన్ దైవప్రవక్త (సల్లం)ను పట్టుకురావటం కోసం బాబ్వేహ్ అనే ఓ అధికారిని కూడా నియమించాడు. ముఖ్యంగా బాబ్వేహ్తో దైవప్రవక్త (సల్లం)పై గట్టి నిఘా ఏర్పాటు చేయమని, ఆయన్ని కిస్రా చక్రవర్తికి అప్పగించమని, ఒకవేళ ఆయన వెంట రావటానికి నిరాకరిస్తే వెంటనే తనకు కబురుచేయమని చెప్పి పంపించాడు.
ఆ అధికారి మదీనాచేరుకొని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాడు. ఆయన అతన్ని మరునాడు రమ్మని చెప్పి పంపించాడు. మరునాడు అతను మళ్ళీ దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) అతనితో, “దేవుడు రాత్రి మీరాజుని చంపేశాడు. కావాలంటే వెళ్ళి కనుక్కో” అన్నారు. అధికారి ఆ మాట విని వెంటనే ఎమన్‌కు వెళ్ళాడు. అప్పటికే ఎమన్ వైస్రాయ్‌కు అధికారికంగా యువరాజు షేర్వేహ్ రాజు ఖుస్రూను హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడన్న వార్త అందింది.
ఇక అప్పటి నుండి ఎమన్ వైస్రాయ్ అయిన బాజాన్ దైవప్రవక్త (సల్లం) నీతి నడవడికలు, హితోపదేశాల గురించి దర్యాప్తు మొదలుపెట్టాడు. పూర్తి వివరాలు సేకరించిన తరువాత ఇస్లాం సత్యధర్మమని గ్రహించి ముస్లిం అయిపోయాడు. అతని రాజ్యంలోని చాలామంది ప్రజలు కూడా ఇస్లాం స్వీకరించారు.43
దైవప్రవక్త (సల్లం) తరపున పంపబడిన రాయబారి తిరిగొచ్చి ఈరాన్ చక్రవర్తి దైవప్రవక్త లేఖను ముక్కలుముక్కలుగా చించివేశాడని చెప్పారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం), “నిజానికి అతను తన రాజ్యాన్నే ముక్కలు చేసుకున్నాడు” అన్నారు.44
బుధజనులారా! ఈ సంఘటనకు నాలుగైదు వేల సంవత్సరాల ముందు నుంచీ ఈరాన్ దేశం దాదాపు సగం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఆ కాలంలో ఈరాన్ రాజ్యం సాధించిన విజయాలు రోమ్, గ్రీకు రాజ్యాల విజయాలను తలదన్నేలా ఉండేవి. కాని ఒక్కసారి దైవప్రవక్త (సల్లం) ఈరాన్ గురించి పలికిన పలుకులను పురస్కరించుకొని ఆ తరువాతి పధ్నాలుగు వందల సంవత్సరాల చరిత్రను పరిశీలించండి. ఇప్పుడు దాని నామరూపాలైనా కానవస్తున్నాయా!?
ఫుట్నోట్లు
- 1సీరత్ హుల్బియా రెండో సంపుటి 688వ పుట.
- 2సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 3సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 4సీరతున్నబీ మొదటి సంపుటి 449వ పుట.
- 5సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 6సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం
- 7సహీహ్ బుఖారీ షరతుల ప్రకరణం.
- 8సహీహ్ బుఖారీ షరతుల ప్రకరణం.
- 9సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 314వ పుట. ముస్నదె అహ్మద్ నాల్గో సంపుటి 324వ పుట.
- 10సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 11ముస్నదె అహ్మద్ నాల్గో సంపుటి 324వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 314, 315 పుటలు.
- 12సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 315, 316 పుటలు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలో కూడా సంక్షిప్తంగా దీని ప్రస్తావన ఉంది.
- 13జుర్ఖానీ రెండో సంపుటి 223వ పుట.
- 14సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
- 15సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 16సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 317వ పుట.
- 17ముస్నదె అహ్మద్ నాల్గో సంపుటి 325వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 318వ పుట.
- 18సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 19సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 20సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం, సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం.
- 21జాదుల్ మఆద్ మూడో సంపుటి 309 వ పుట.
- 22దలాయిలున్నుబువ్వా నాల్గో సంపుటి 160వ పుట.
- 23సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 459వ పుట.
- 24సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 25సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 26సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 27సహీహ్ బుఖారీలోని షరతుల ప్రకరణం.
- 28సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 473వ పుట.
- 29అల్ ఇసాబా మొదటి సంపుటి 418వ పుట.
- 30సుననె తిర్మిజీ మహిమెన్నతల అధ్యాయాలు
- 31సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 474వ పుట.
- 32తబఖాత్ ఇబ్నెసాద్ రెండో సంపుటి 23వ పుట.
- 33సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం.
- 34జాదుల్ మఆద్ మూడో సంపుటి 689వ పుట.
- 35తారీఖె తబ్రీ రెండో సంపుటి 131, 132 పుటలు. జాదుల్ మఆద్ మూడో సంపుటి 689వ పుట.
- 36తారీఖె తబ్రీ రెండో సంపుటి 232వ పుట. జాదుల్ మఆద్ మూడో సంపుటి 690వ పుట. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణంలో క్లుప్తంగా ఉంది.
- 37జాదుల్ మఆద్ మూడో సంపుటి 693వ పుట. ఉయూనుల్ ఆసిర్ రెండో సంపుటి 266వ పుట.
- 38జాదుల్ మఆద్ మూడో సంపుటి 693 నుండి 696 పుటల వరకు. నస్బుర్రాయా నాల్గో సంపుటి 423, 424 పుటలు. ఉయూనుల్ ఆసిర్ రెండో సంపుటి 267 నుండి 269 పుటల వరకు.
- 39జాదుల్ మఆద్ మూడో సంపుటి 697వ పుట.
- 40జాదుల్ మఆద్ మూడో సంపుటి 696వ పుట. ఉయూనుల్ ఆసిర్ రెండో సంపుటి 269వ పుట.
- 41జాదుల్ మఆద్ మూడో సంపుటి 691వ పుట. నస్బుర్రాయ నాల్గో సంపుటి 421, 422 పుటలు. ఉయూనుల్ ఆసిర్ రెండో సంపుటి 665, 666 పుటలు.
- 42సహీహ్ బుఖారీలోని వహీ అవతరణ ప్రారంభ ప్రకరణం సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
- 43తారీఖె తబ్రీ రెండో సంపుటి 133వ పుట.
- 44సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.