నాలుగవ అధ్యాయం

బద్ర్ సంఘటన

మానవ మహోపకారి (స) · మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి

ముస్లింలు మక్కానుండి వలసవెళ్ళగానే ఖురైషులు మదీనాపై దాడి జరపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. “ముహమ్మద్‌ను హతమార్చండి, లేదంటే మేమొచ్చి అతనితో సహా మీ అందరి పని పడతాం” అని వారు మదీనాలో ఉన్న అబ్దుల్లాహ్ బిన్ ఉబైకు లేఖ రాశారు.1 ఖురైషులు చిన్న చిన్న సమూహాలుగా వచ్చి మదీనా శివారు ప్రాంతాల్లో గస్తీ చేసేవాళ్ళు. కుర్జ్ ఫహ్‌రీ అనేవాడు మదీనావాసుల పచ్చికబయళ్ళదాకా వచ్చి అక్కడ విధ్వంసం సృష్టించేవాడు. ముస్లింలపై దాడిచేయాలంటే దానికోసం ఆయుధాలు కావాలి కనుక మక్కావాసులు ఖురైషు వర్తక బిడారులు సిరియా వెళ్తున్నప్పుడు అక్కడినుండి ఆయుధాలు కొనుగోలు చేసుకొని రమ్మని తమ దగ్గరున్న ధనమంతా సిరియా వెళ్ళే వ్యాపారులకిచ్చేశారు. ఆఖరికి స్త్రీలు కూడా ఆయుధాల కొనుగోలు కోసం ధనం ఇచ్చారు. ఆ వర్తక బృందం సిరియా నుండి బయలుదేరకముందే హజ్రమీ అనే అవిశ్వాసి ముస్లింలచేత వధింపబడ్డాడు. దాంతో ఖురైషుల కోపం కట్టలు త్రెంచుకుంది. అంతలోనే ముస్లింలు వారి వర్తక బిడారులను దోచుకోవాలని చూస్తున్నారనే వదంతి మక్కాలో మళ్ళీ వ్యాపించింది. ఇక దాంతో ఖురైషుల ఆగ్రహం ఆకాశాన్నంటింది.2

దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియగానే ఆయన తన అనుచరులందర్నీ సమావేశపరచి పరిస్థితిని వివరించారు. ఈ సంఘటన మదీనా నుండి బయలుదేరిన తరువాత జరిగిందన్న విషయం గమనార్హం. మదీనా నుండి దైవప్రవక్త(సల్లం) అబూసుఫ్యాన్ వర్తక బిడారును నిలువరించడానికి బయలుదేరారు. ప్రామాణికమైన హదీసుల ద్వారా బోధపడే విషయం ఏమిటంటే మదీనా నుండి బయలుదేరి వచ్చిన తరువాత హఠాత్తుగా ఖురైషుల సైన్యం ఎదురుదాడి చేయటానికి వస్తోందని తెలిసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో పరిస్థితుల గురించి సమాలోచనలు జరిపారు… ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది: దైవప్రవక్త (సల్లం) అబూ సుఫ్యాన్ వర్తక బిడారును నిలువరించటానికి బయలుదేరటానికి కారణం ఖురైషులు మదీనాపై దాడి జరపటానికి కుట్రలు పన్నుతున్నారని వార్తలు అందటమే. దాన్ని అడ్డుకోవటం కోసమే దైవప్రవక్త (సల్లం) అబూసుఫ్యాన్ వర్తక బిడారును వెంబడించారు. ఖురైషులు ఈ వర్తక బిడారును ఆయుధాలు కొనుగోలు చేసుకొని రావటం కోసమే పంపారని చారిత్రక ఉల్లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయంలో హజ్రత్ అబూబక్ర్ తదితరులు ఉద్వేగభరితమైన ఉపన్యాసాలిచ్చారు. కాని దైవప్రవక్త (సల్లం) మాత్రం అన్సార్లవైపే చూడసాగారు. ఎందుకంటే ఉఖబా ఒప్పందంలో అన్సార్లు దైవప్రవక్త (సల్లం)ను మదీనాలో ఉన్నప్పుడు రక్షిస్తామని మాత్రమే ప్రమాణం చేశారు. అంచేత ఆయనకు ఇప్పుడు అన్సార్లు యుద్ధానికి సన్నద్ధులౌతారో లేదో నన్న సంశయం కలిగింది. ఆయన మళ్ళీ మళ్ళీ అనుచరుల సలహా కోరసాగారు. దాంతో దైవప్రవక్త తమ జవాబుకోసం వేచివున్నారని అన్సార్లకు అర్ధమయిపోయింది. సాద్ బిన్ ముఆజ్ (రజి) తటాలున లేచి, “అన్సార్లు మదీనా వెలుపలికి వచ్చి సహాయం చేస్తారో లేదోనని బహుశా దైవ ప్రవక్త సంశయంలో పడినట్లున్నారు. అన్సార్లందరి తరపు నుండి నేను చెబుతున్నాను. మేము ఎట్టిపరిస్థితుల్లోనయినా సరే దైవప్రవక్తకు తోడ్పడతాం. మీరు మీకిష్టమైన వారితో ఒప్పందం చేసుకోవచ్చు. ఎవరితోనయినా యుద్ధానికి దిగవచ్చు. మేము మీతోపాటే ఉంటాం. మా సిరిసంపదలన్నీ మీకు సమర్పించుకోవటానికి మేము సదా సిద్ధమే. మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం. మీరు మా ధనం స్వీకరిస్తే మాకెంతో ఆనందం కలుగుతుంది. మీరు గిమాద్ కాలువ దాకా వెళ్ళాలన్నా మేము మీ వెంట వస్తాం. సముద్రంలో దూకమన్నా దూకేస్తాం.3 అంతలోనే హజ్రత్ మిఖ్‌దాద్ అందుకొని, “దైవప్రవక్తా! మేము మూసా జాతివారి లాంటి వాళ్ళం కాము. వారు తమ ప్రవక్తతో ‘మీరూ, మీ ప్రభువు వెళ్ళి యుద్ధం చెయ్యండి. మేమిక్కడే కూర్చొని ఉంటాం’ అన్నారు. కాని మేము దైవప్రవక్తను కుడి నుండి, ఎడమ నుండి, వెనుకనుంచి ముందునుంచి రక్షిస్తాం” అన్నారు. ఆయన మాట వినగానే దైవప్రవక్త (సల్లం) ముఖారవిందం కాంతివంతమయింది.4

రణరంగానికి…

హి.శ. రెండవ యేట రమజాన్ మాసం పన్నెండో తేదీన దైవప్రవక్త (సల్లం) సుమారు మూడొందల మంది తన ప్రాణ సహచరుల్ని వెంటబెట్టుకొని మదీనా నగరం నుండి బయలుదేరారు. ఒక మైలుదూరం వెళ్ళిన తరువాత సైన్యాన్ని పరిశీలించారు. సైన్యం వెంట వచ్చిన చిన్న పిల్లల్ని వెనక్కి పంపించారు. ఆ సమయంలో ఉమైర్ బిన్ వఖ్ఖాస్ అనే బాలుణ్ణి ఇంటికి వెళ్ళిపొమ్మని అంటే అతను ఏడ్వసాగాడు. అతని ఏడ్పు చూసి దైవప్రవక్త(సల్లం) అతనికి యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతినిచ్చారు. ఉమైర్ అన్న అయిన సాద్‌బిన్ అబూవఖ్ఖాస్ (రజి) ఆ చిన్ని సిపాయి మెడలో ఖడ్గం వ్రేలాడదీశారు. ఆఖరికి సైన్యంలో మొత్తం మూడువందల పదమూడు మంది మిగిలారు. వారిలో అరవైమంది ముహాజిర్లు. మిగతావారంతా అన్సార్ సహచరులే.5 అంతపెద్ద సైన్యంలో రెండే రెండు గుర్రాలున్నాయి. జుబైర్ (రజి) దగ్గర ఒకటి, మిఖ్‌దాద్ బిన్ అస్వద్ దగ్గర ఒకటి. ఒంటెలు మొత్తం డెబ్బై ఉన్నాయి. ఒక్కొక్క ఒంటెపై ఇద్దరుగాని, ముగ్గురుగాని వంతులవారీగా కూర్చొని ప్రయాణించేవారు. స్వయంగా దైవప్రవక్త (సల్లం), అలీ, ముర్సద్ గన్‌వీ ముగ్గురూ ఒకే ఒంటెపై వంతులవారీగా కూర్చొని ప్రయాణించారు.6

మరోవైపు ఖురైషులు మక్కానుండి సకల సన్నాహాలతో బయలుదేరారు. వెయ్యిమంది సైనికులు. వాహనాలపై గుంపులు గుంపులుగా బయలుదేరారు. ఒక్కొక్క గుంపులో నూరు వాహనాలు. ఖురైష్ సర్దారులందరూ యుద్ధానికి బయలుదేరారు. అబూలహబ్ మాత్రం ఏదో అనివార్య కారణం వల్ల రాలేకపోయాడు. అయితే వేరొకర్ని తన ప్రతినిధిగా నియమించి సైన్యం వెంట పంపించాడు. ఖురైష్ సర్దారులైన అబ్బాస్, ఉత్బాబిన్ రబీయా, హర్స్ బిన్ ఆమిర్, నజర్ బిన్ హారిస్, అబూజహల్, ఉమయ్యా తదితరులు వంతుల వారీగా ప్రతిరోజూ పదేసి ఒంటెల్ని కోసి సైన్యానికి, వెంట వచ్చిన జనానికి తినిపించేవారు. ఖురైషుల్లో అందరికన్నా గొప్ప సర్దారు అయిన ఉత్బాబిన్ రబీయా సైన్యానికి సారథ్యం వహించాడు.7

బద్ర్ మైదానం సమీపానికి చేరుకున్న తరువాత అబూసుఫ్యాన్ వర్తక బృందం అపాయం నుండి తప్పించుకొని మక్కాకు వస్తుందని ఖురైషులకు తెలిసింది. జుహ్‌రా, అదీ తెగల వాళ్ళు, “ఇక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళిపోదాం పదండి” అన్నారు. కాని అబూజహల్ మాత్రం ససేమిరా అన్నాడు. జుహ్‌రా, అదీ తెగలవాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మిగతాసైన్యం ముందుకు నడిచింది.8

ఖురైషులు యుద్ధభూమికి ముందుగా వెళ్ళి అనువైన చోట్లను కైవసం చేసుకున్నారు. ముస్లిం సైన్యాలు ఆగినచోట ఒక్క బావి అయినా లేదు. ఇసుక నేల అవటంచేత ఒంటెలకాళ్ళు ఇసుకలో దిగబడిపోయేవి. సైన్యం ఆగిన చోటు వహీ (దైవవాణి) ద్వారా తెలుపబడినదా లేక యుద్ధ తంత్రమా?” అని హుబాబ్ బిన్ ముంజిర్ దైవప్రవక్త (సల్లం)ను అడిగారు. దీని గురించి వహీ ఏమీ అవతరించలేదని దైవప్రవక్త(సల్లం) అన్నారు. అలాగయితే మనం కాస్త ముందుకువెళ్ళి ఆ కాలువను కైవసం చేసుకొని సమీపంలో ఉన్న బావుల్ని శత్రువులు ఉపయోగించుకోకుండా చేద్దామన్నారు హుబాబ్(రజి). దైవప్రవక్త (సల్లం)కు ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. ఆయన చెప్పినట్టుగానే ముస్లిం సైన్యాలు ముందుకు వెళ్ళి కాలువను కైవసం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ వర్షం కురవటంతో ముస్లిం సైన్యం ఆగిన ఇసుకనేల తడిసి గట్టిపడింది. చిన్న చిన్న గుంటలు త్రవ్వుకొని వర్షపునీటిని నిల్వ చేసుకున్నారు – ఆ నీళ్ళు వుజూలకు, స్నానాలకు పనికొస్తాయని! ఈ మహోపకారం గురించి దివ్యఖురాన్‌లో ఇలా సెలవీయబడింది.

నీటి కొలనులపై ముస్లింల ఆధిపత్యం ఉన్నప్పటికీ దైవ ప్రవక్త (సల్లం) శత్రువులకు కూడా అక్కడినుండి నీళ్లు తీసుకోనిచ్చేవారు.9

అనుచర ముస్లింలందరూ ఆయుధాలు ప్రక్కనపెట్టి రాత్రంతా హాయిగా నిద్రపోయారు. కాని ఆయన (సల్లం) మాత్రం తెల్లవారేదాకా మేల్కొని ఉండి ప్రార్థనలో నిమగ్నులై ఉన్నారు. తెల్లారిన తరువాత ప్రజలను నమాజ్ కోసం మేల్కొలిపారు. నమాజ్ తరువాత ‘జిహాద్’ గురించి ఉపన్యాసమిచ్చారు.10

యుద్ధ సన్నాహాలు

ఖురైషులు యుద్ధం చేయటానికి తహతహలాడుతున్నారు. అయితే వారిలో కొందరు దయార్ద్ర హృదయులూ లేకపోలేదు. జరగనున్న దారుణ మారణకాండను తలచుకొని వారి హృదయాలు కంపించిపోయేవి. అలాంటి వారిలో హకీమ్ బిన్ హిజామ్ ఒకరు. ఈయన మున్ముందు ఇస్లాం స్వీకరిస్తారు. ఈయన సైన్యాధిపతి అయిన ఉత్బా దగ్గరికి వెళ్ళి, “మీరు కోరుకుంటే ఈ రోజు మీకు చరిత్రలోనే గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టగలదు” అన్నారు.

‘అదెలా సాధ్యం’ అడిగాడు ఉత్బా.

‘ఖురైషులకు కావలసింది హజ్రమీ రక్తపరిహారమే కదా! అతనితో మీకు ఒప్పందం ఉంది. కాబట్టి ఆ రక్తపరిహారం మీరు చెల్లించండి. పెద్ద యుద్ధం తప్పిపోతుంది” అని వివరించారు హకీమ్ బిన్ హిజామ్.

ఉత్బా స్వాభావికంగా మంచివాడవటంచేత హకీమ్ చెప్పిన మాటల్ని ఎంతో సంతోషంతో ఒప్పుకున్నాడు. అయితే దానికోసం కూడా అబూజహల్ అంగీకారం అవసరమే. హకీమ్ ఉత్బా సందేశాన్ని తీసుకొని అబూజహల్ దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో అతను అంబులపాదినుండి బాణం తీసి సరిచేసుకుంటున్నాడు. ఉత్బా సందేశం విని అబూజహల్ ఒక్కసారిగా

‘ఉత్బా పిరికివాడైపోయాడు’ అన్నాడు.

ఉత్బా కుమారుడు అబూహుజైఫా (రజి) అప్పటికి ఇస్లాం స్వీకరించి ఉన్నారు. దైవప్రవక్త సేనల వెంట ఆయన కూడా యుద్ధానికి వచ్చారు. అందుకని తన కొడుక్కి ఎక్కడ హాని జరుగుతుందోనన్న భయంతో ఉత్బా యుద్ధం నుండి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నాడని అబూజహల్ అనుకున్నాడు. ఆ తరువాత అతను హజ్రమి సోదరుడైన ఆమిర్‌ను పిలిచి, “చూశావా, నీ కళ్ళ ముందే నీ సోదరుని రక్తపరిహారాన్ని తప్పించాలని చూస్తున్నారు” అన్నాడు. దాంతో ఆమిర్ అరబ్బుల ఆచారం ప్రకారం బట్టలు చించుకొని దుమ్ము రేపుతూ, ‘అయ్యో అమర్! అయ్యో అమర్! అని విలపించటం మొదలుపెట్టాడు. దాంతో సైనికులందరిలో ప్రతీకార వాంఛ పెల్లుబికింది.

అబూజహల్ తనను దెప్పిపొడిచాడని తెలుసుకొని ఉత్బా విపరీతంగా మండిపడ్డాడు. ‘మగతనం ఎవరికి లేదో యుద్ధభూమిలో తేలిపోతుంది’ అంటూ తనకు శిరస్త్రాణాన్ని తొడిగించమని అనుచరుల్ని కోరాడు. కాని అతని తల చాలా పెద్దది కావటం చేత ఏ శిరస్త్రాణమూ అతనికి సరిపోలేదు. ఆఖరికి తలకు గుడ్డచుట్టుకొని ఆయుధాలు ధరించాడు.11

దైవప్రవక్త (సల్లం)కు తన చేతుల్ని రక్తసిక్తం చేసుకోవటం ఇష్టంలేదు. సహచరులు ఆయనకోసం యుద్ధభూమికి అవతల ఓ చిన్న పాక తయారుచేశారు. శత్రువులెవరూ అటువైపు రాకుండా ఉండేందుకు సాద్‌బిన్ ముఆజ్ (రజి) దాని ద్వారం వద్ద చేతిలో ఖడ్గం పుచ్చుకొని నించున్నారు.12

ఈ యుద్ధంలో ముస్లింలే విజయం సాధిస్తారని దేవుడు ముందుగానే తెలియజేశాడు. సృష్టిరాశులన్నీ ముస్లిం సైన్యాలకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాయి. దివినుండి దైవదూతల సైన్యం కూడా భువికి దిగివచ్చింది. కాని ఈ ప్రపంచంలో ఏది జరిగినా హేతుబద్ధంగా జరుగుతుంది కాబట్టి దైవప్రవక్త(సల్లం) సైన్యాన్ని యుద్ధతంత్రం ప్రకారం నించోబెట్టారు. ముహాజిర్లు, ఔస్, ఖజ్‌రజ్ అనే మూడు సైనికపటాలాలుగా సైన్యాన్ని విభజించారు. ముహాజిర్ల యుద్ధపతాకం ముస్‌అబ్ బిన్ ఉమైర్ చేతికిచ్చారు. ఖజ్‌రజ్ యుద్ధపతాకం హుబాబ్ బిన్ ముంజిర్‌కు లభించింది. సాద్‌బిన్ ముఆజ్ ఔస్ సైనికదళానికి సారథ్యం వహించారు.

తెల్లవారగానే దైవప్రవక్త (సల్లం) సైనికుల పంక్తుల్ని తీర్చిదిద్దటం మొదలుపెట్టారు. చేతిలో ఒక బాణం తీసుకొని సైనికులు ఒక్క అంగుళమయినా ముందుకుగాని, వెనక్కిగాని జరగకుండా పంక్తులు తిన్నగా ఉండేటట్లు చేసేవారు. యుద్ధంలో అరవటం, గోల చేయటమనేది సాధారణంగా జరిగేదే. కాని దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని నోటినుండి చిన్న శబ్దం కూడా రాకూడదని ఆదేశించారు.13

ముస్లింల శత్రువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి సమయంలో ముస్లింలలో ఏ ఒక్కడు వచ్చి చేరినా అది ముస్లిం సైన్యానికి ఎంతో కొంత ఊరటను కలిగిస్తుంది. అబూహుజైఫా బిన్ యమాన్, అబూహుసైల్ అనే ఇరువురు ముస్లింలు మక్కానుండి బయలుదేరి వస్తుండగా వీరు ముహమ్మద్ (సల్లం)కు సహాయం చేయటానికి వెళుతున్నారేమోనని అవిశ్వాసులు వారిని అడ్డుకున్నారు. ఆ ఇరువురు ముస్లింలు తాము వెళుతున్నది అందుకోసం కాదని చెప్పి, తాము ముహమ్మద్ (సల్లం) సైన్యంలో చేరబోమని వాగ్దానం చేశారు. తరువాత వారు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి తమకు ఎదురైన పరిస్థితిని గురించి వివరించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం). “మనం ఎట్టిపరిస్థితిలోనయినా వాగ్దానాన్ని నెరవేర్చాలి. కనుక మీరు యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదు. మనకు దైవసహాయం చాలు” అన్నారు.14

ఇక ఇరుపక్షాలూ పోరుకు సిద్ధంగా ఉన్నాయి.

“పరస్పరం తలపడే ఇరుపక్షాల్లో మీకు సూచనలున్నాయి. వారిలో ఒక వర్గం దైవమార్గంలో యుద్ధం చేస్తోంది. రెండవది దైవాన్ని తిరస్కరిస్తోంది.”

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత విశాలమైన ప్రపంచంలో ఒకే దేవుణ్ణి ఆరాధించే సిద్ధాంతం కేవలం అతికొద్దిమంది ప్రాణాలపైనే ఆధారపడి ఉంది. సహీహ్ ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది: యుద్ధానికి ముందు దైవప్రవక్త (సల్లం) దేవుని సన్నిధిలో చేతులెత్తి, “దేవా! నువ్వు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు” అంటూ కడుదీనంగా వేడుకునేవారు. ప్రార్థనలో తన్మయులై ఉండటంచేత భుజాలపై నుండి దుప్పటి జారిపోయినా ఆయనకి పట్టేది కాదు. ఒక్కోసారి సాష్టాంగపడి, “దేవా! ఈ రోజు ఈ గుప్పెడుమంది ప్రాణాలు కోల్పోతే ఇక భూమిపై నిన్ను ఆరాధించేవాడే మిగలడు” అని వేడుకునేవారు.

దైవప్రవక్త (సల్లం) ఇలా దీనంగా వేడుకోవటం చూసి ఆయన అనుచరుల గుండెలు కరిగిపోయాయి. “దైవప్రవక్తా! దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు” అంటూ ఆయన్ని సముదాయించసాగారు. హజ్రత్ అబూబక్ర్(రజి).15 ఆఖరికి “శత్రుసైన్యాన్ని ఓటమికి గురిచేయటం జరుగుతుంది. వారు వెన్నుచూపి పారిపోతారు” అన్న దైవసూక్తి అవతరించిన మీద ఆయన మనసు కుదుటపడింది. ఆయన శుభ ఆధారాల నుండి గెలుపు సువార్త వెలువడింది.16

ఖురైషుల సైన్యాలు ఇప్పుడు ఇంకా దగ్గరయ్యాయి. దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని ముందుకు వెళ్ళకుండా, శత్రువులు దగ్గరికొచ్చినప్పుడు బాణాలు విసిరి వారిని నిరోధించమని ఆదేశించారు.

ఆ సమయంలో ఆయన ముస్లిం సైన్యాలకు సహన స్థయిర్యాలను గురించి, దైవసహాయం గురించి ఉపదేశించారు. ఈ యుద్ధం ద్వారా ఇహలోకంలో విజయం లభిస్తుందనీ, పరలోకంలో పుణ్యం ప్రాప్తిస్తుందని గుర్తు చేశారు. దైవమార్గంలో అమరగతినొందిన వ్యక్తికోసం దేవుడు స్వర్గాన్ని వ్రాసి ఉంచాడని చెప్పారు. ఆ మాటవిని ఉమైర్ బిన్ హుమామ్.

“దైవప్రవక్తా! భూమ్యాకాశాల అంత వెడల్పుగల స్వర్గమా?”

అని అడిగారు.

దైవప్రవక్త (సల్లం) ‘ఔన’న్నారు.

“నిజంగానా దైవప్రవక్తా?” అని ఆయన మళ్ళీ అడిగారు.

ఆ మాటకు దైవప్రవక్త (సల్లం) “అలా అడుగుతున్నావేమిటి?” అన్నారు.

దానికి సమాధానమిస్తూ ఉమైర్ (రజి), “అది నాక్కూడా లభిస్తుందేమోనన్న ఆశతో అడుగుతున్నాను దైవప్రవక్తా!” అన్నారు.

“నీకు అది తప్పకుండా లభిస్తుంది” అంటూ శుభవార్తను అందజేశారు దైవప్రవక్త(సల్లం).

తరువాత ఉమైర్ తన డాలులోనుండి ఖర్జూర పండ్లు బయటికి తీసి తినడం మొదలుపెట్టారు. కాసేపటికి ఇలా ఖర్జూరాలు తింటూ కూర్చుంటే సమయం వృధా అవుతుందని చెప్పి, చేతిలో ఉన్న ఖర్జూరాలు క్రిందపడేసి యుద్ధభూమిలోకి దూసుకుపోయి వీరోచితంగా పోరాడుతూ అమరగతినొందారు.17

ఇరుపక్షాల మధ్య భీకర పోరు మొదలయ్యింది. ఈ యుద్ధం ఇరుపక్షాలలోని సైనికుల స్థయిర్యానికి త్యాగభావాలకు పరీక్షలా జరిగింది. తమ ఖడ్గాలతోనే తమ ఆత్మీయుల్ని మట్టుబెట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. శత్రువుల తరపునుంచి అబూబక్ర్ కుమారుడు యుద్ధ భూమిలోకి రాగానే అతన్ని ఎదిరించటానికి అబూబక్ర్ స్వయంగా ఖడ్గం తీసుకొని ముందుకు వెళ్ళారు.18 ఉత్బా మైదానంలోకి రాగానే అతని కుమారుడు హుజైఫా (రజి) అతన్ని మట్టుబెట్టటానికి బయలుదేరారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖడ్గం తన మేనమామ రక్తంతో తడిసిపోయింది.19

తొలిదశ యుద్ధం

యుద్ధం మొదలవగానే ముందుగా శత్రువులవైపు నుండి తన సోదరుని హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉడికిపోతున్న ఆమిర్ హజ్రమీ మైదానంలోకి వచ్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) గారి బానిస మహ్‌జా అతన్ని ఎదుర్కోబోయి అతని చేతిలోనే వధించబడ్డాడు. సైన్యాధిపతి అయిన ఉత్బా అబూజహల్ దెప్పి పొడుపుకు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అతనే అందరి కన్నా ముందు తన సోదరుణ్ణి, కొడుకుని వెంటబెట్టుకొని యుద్ధమైదానంలోకి వచ్చి ముస్లింలకు సవాలు విసిరాడు. అరబ్ దేశంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేక చిహ్నాలు ధరించి వెళ్ళేవారు. ఉత్బా తన ఉదరభాగానికి నిప్పుకోడి ఈకలు తగిలించుకున్నాడు. అతణ్ణి మార్కొనటానికి ముస్లింల వైపు నుండి ఔఫ్, ముఆజ్, అబ్దుల్లాహ్ బిన్ రవాహా బయలుదేరారు. ఉత్బా వారి పేర్లు, వంశాల గురించి అడిగాడు. వాళ్ళు అన్సార్లు అని తెలుసుకొని మీతో మాకు పని లేదని అన్నాడు. తరువాత దైవప్రవక్త (సల్లం)ను పిలిచి, “ముహమ్మద్! వీళ్ళు మాకు సమవుజ్జీలు కారు” అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) అనుజ్ఞ మేరకు ఆ అన్సార్ సహచరులు తిరిగొచ్చేశారు. వారికి బదులు హమ్జా, అలీ, అబూ ఉబైదాలు ఉత్బాను ఎదుర్కోవటానికి వెళ్ళారు. వీళ్ళు ముఖాలకు ముసుగులు ధరించి ఉండటం వల్ల ఉత్బా వాళ్ళను గుర్తుపట్టలేకపోయాడు.

‘మీరెవరు?’ అని అడిగాడు ఉత్బా.

ముగ్గురూ తమపేర్లు, వంశాలను గురించి తెలియజేశారు.

“ఆఁ వీళ్ళు మాకు సరిజోడి అవుతారు’ అన్నాడు ఉత్బా.

ఉత్బా హమ్జాతోనూ, వలీద్ హజ్రత్ అలీతోనూ తలపడి ఇద్దరూ నేలకొరిగారు. ఉత్బా సోదరుడు షైబా అబూ ఉబైదా (రజి)ని గాయపరిచాడు. వెంటనే అలీ (రజి) లంఫించి షైబాను మట్టి కరిపించారు. అబూ ఉబైదాను భుజంపై మోసుకొని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు అబూ ఉబైదా దైవప్రవక్త (సల్లం)ను, “నేను వీరమరణం పొందే భాగ్యాన్ని కోల్పోయానా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లం), “లేదు, నీకా భాగ్యం లభించింది” అన్నారు. అప్పుడు అబూ ఉబైదా “ఈ రోజు గనక అబూతాలిబ్ బ్రతికి ఉండినట్లయితే తాను చెప్పిన ఈ కవిత నాకు వర్తించిందని ఒప్పుకొని ఉండేవారు” అని అన్నారు.20

‘మేము ముహమ్మద్‌ను నలువైపుల నుండి కాపాడుతాం.
మా ప్రాణాలుపోయినాసరే ఆయన్ని శత్రువులకు అప్పజెప్పం.
ఆయన కోసం మేము మా ఆలుబిడ్డల్ని కూడా మర్చిపోతాం’

సాద్ బిన్ ఆస్ కుమారుడు ఉబైదా ఆపాదమస్తకం ఇనుప కవచం తొడుక్కొని మైదానంలోకి వచ్చి ‘నేను అబూ కిర్ష్‌ను. నాతో యుద్ధం చేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?’ అంటూ సవాలు చేశాడు. జుబైర్ (రజి) అతన్ని మార్కొనటానికి వెళ్ళారు. అతని శరీరం మొత్తంలో కేవలం కళ్ళు మాత్రమే కానవస్తున్నాయి. జుబైర్ గురిపెట్టి బరిసె విసిరారు. అది సరాసరి అతని కంట్లో గుచ్చుకోవడంతో క్రిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ బరిసె అతని కంట్లో ఎంత లోతుకి దిగబడిందంటే జుబైర్(రజి) అతని శవంపై కాలుపెట్టి గట్టిగా లాగితేగాని అది బయటికి రాలేదు. అప్పటి నుండి ఆ బరిసె ఒక చరిత్రాత్మక వస్తువు అయిపోయింది. జుబైర్ నుండి దాన్ని దైవప్రవక్త (సల్లం) తీసుకున్నారు. ఆ తరువాత నలుగురు ఖలీఫాల చేతుల్లోకి మారింది.21 ఆఖరికి అది అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ దగ్గరికొచ్చింది.

జుబైర్ (రజి)కు ఈ యుద్ధంలో ఎన్నో గాయాలయ్యాయి. ఆయన జబ్బలో ఎంతపెద్ద గాయమయిందంటే అది నయమైన తరువాత కూడా అక్కడ వ్రేలు లోపలికి వెళ్ళగలిగేంత గుంట ఏర్పడింది. ఆయన కుమారుడు ఉర్వా పసితనంలో ఆ గాయాలతో ఆడుకునేవాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన కరవాలం జారి క్రిందపడిపోయింది. దాంతో ఆయన శత్రువుల ఖడ్గాలకు చిక్కి వీరమరణం పొందారు.

ఒకసారి అబ్దుల్ మలిక్ ఉర్వాతో మాట్లాడుతూ, “నువ్వు నీ తండ్రి కరవాలాన్ని గుర్తుపట్టగలవా?” అని అడిగాడు. గుర్తుపడతానన్నారు ఉర్వా. ఎలా గుర్తుపడతావని అడిగితే దానికి ఉర్వా “బద్ర్ యుద్ధం జరిగిన రోజు మా నాన్న చేతుల్లో ఆ ఖడ్గం పదను అరిగి రంపపు దంతాల్లా మారిపోయింది” అన్నారు. అబ్దుల్ మలిక్ ఆయన మాటల్ని ధృవీకరించి ఆయన తండ్రి ఖడ్గాన్ని ఆయనకు ఇచ్చివేశాడు. ఆయన దాన్ని వేలం వేయిస్తే అది మూడువేల రూపాయల ధర పలికింది. దాని పిడికి వెండిపూత పూయబడి ఉండేది.22

ఇక తుది దశ యుద్ధం ప్రారంభమయింది. ఒకవైపు మక్కా బహుదైవారాధకులు తమ భౌతిక శక్తి సామర్థ్యాలపై ఆధారపడి యుద్ధం చేస్తుంటే మరోవైపు దైవప్రవక్త (సల్లం) సాష్టాంగ ప్రణామంలో లీనమై దైవ సహాయాన్ని అర్థించసాగారు.23

పేరు మోసిన అవిశ్వాస సర్దారుల వధ

అబూజహల్ ఆగడాల గురించి, ఇస్లాంతో అతనికున్న విరోధం గురించి ప్రజలందరికీ తెలుసు. అన్సార్‌కు చెందిన ముఅవ్విజ్, ముఆజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ దైవద్రోహి ఎక్కడ కనిపించినా అతణ్ణి మట్టుబెడతామని లేదా తామైనా ప్రాణాలర్పిస్తామని ప్రతిన బూనారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) కథనం:

‘నేనొక పంక్తిలో నించొని ఉండగా ఇద్దరు యువకులు నా కుడిఎడమలకు వచ్చి నించున్నారు. వారిలో ఒకడు నా చెవిదగ్గరికి వచ్చి మెల్లిగా ‘అబూజహల్ ఎవరు?’ అని అడిగాడు.

“నాయనా! అబూజహల్ ఎవరో తెలుసుకొని ఏం చేస్తావ్?” అన్నాను నేను.

‘ఆ దైవద్రోహి ఎక్కడ కనిపించినా ప్రాణాలతో వదలనని, దానికోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని నేను దేవునిపై ప్రమాణం చేశాను’ అన్నాడా బాలుడు.

నేనతనికి జవాబు చెప్పబోయేంతలో అతని సోదరుడు కూడా దగ్గరికొచ్చి నా చెవిలో అవే మాటలన్నాడు. నేను వాళ్ళిద్దరికీ అబూజహల్ వైపు సైగచేసి చూపించాను. వెంటనే ఆ ఇరువురు సోదరులు కొదమ సింహాల్లా, అతనిమీదపడి అతను నేలకొరిగేలా చేశారు. వీళ్ళిద్దరూ (ముఅవ్విజ్, ముఆజ్) ఉఫ్రా కుమారులు.24 అబూజహల్ కొడుకు ఇక్రిమా వెనుక నుండి వచ్చి ముఆజ్ ఎడమ భుజంపై ఖడ్గంతో ఒక వేటు వేశాడు. దాంతో ఆయన చెయ్యి తెగి కాస్తంత చర్మం ఆధారంతో వ్రేలాడసాగింది. ముఆజ్ ఇక్రిమాను వెంబడించారు. కాని అతను పారిపోయాడు. ముఆజ్ ఆ స్థితిలోనే శత్రువులతో తలపడసాగారు. ఆ సమయంలో వ్రేలాడుతున్న చెయ్యి అడ్డం తగులుతుండటంతో ఆయనకు యుద్ధం చేయటంలో ఇబ్బందిగా ఉండేది. అంచేత చేతిని కాలుక్రింద పెట్టిలాగి భుజం నుండి వేరుచేసుకొని ఒంటి చేత్తోనే స్వేచ్ఛగా పోరాడసాగారు.25

అవిశ్వాసుల సైన్యం వెంట వచ్చిన వారిలో కొంతమంది అన్యమనస్కంగానే -ఖురైషుల బలవంతం మీద-వచ్చి ఉంటారని, దైవప్రవక్త(సల్లం) ముస్లింలకు యుద్ధానికి ముందే చెప్పారు. వారి పేర్లు కూడా తెలియజేశారు. వారిలో అబుల్ బుఖ్‌తరీ కూడా ఉన్నాడు. ముజజ్జర్ అన్సారీ అతన్ని చూడగానే అతని దగ్గరికెళ్ళి, ‘దైవప్రవక్త (సల్లం) నిన్ను వధించవద్దని చెప్పారు. అందుకే నిన్ను వదలిపెడుతున్నాను’ అన్నారు. ఆ సమయంలో అబుల్ బుఖ్‌తరీతోపాటు అతని మిత్రుడు కూడా ఉన్నాడు. అతను తన మిత్రుణ్ణి కూడా వదలిపెట్టమని అడిగాడు. ముజజ్జర్ దానికి నిరాకరించారు. అప్పుడు అబుల్ బుఖ్‌తరీ, “నా మిత్రుడు నాకళ్ళ ముందే వధించబడితే నాకు ‘అబుల్ బుఖ్‌తరీ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తన మిత్రుణ్ణి వదలిపెట్టాడు’ అనే అపకీర్తి వస్తుంది. అరబ్బు మహిళలకు నేను లోకువ అయిపోతాను. వారి నిందల్ని నేను భరించలేను” అంటూ ముజజ్జర్‌తో పోరాడి మరణించాడు.26

ఉత్బా, అబూజహల్‌లు వధించబడగానే యుద్ధభూమిలో ఖురైషులు నిలదొక్కుకోలేకపోయారు. సైనికుల హృదయాలపై భీతావహస్థితి ఆవరించింది.

దైవప్రవక్త (సల్లం) గారి పరమ శత్రువైన ఉమయ్యా బిన్ ఖల్ఫ్ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఎప్పుడో ఒకప్పుడు అతనితో అతను మదీనా వచ్చినట్లయితే తాను అతని ప్రాణానికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. బద్ర్ యుద్ధంలో ఆ దైవద్రోహిని చంపటానికి ముస్లింలకు మంచి అవకాశం లభించింది. కాని మరోవైపు ఇస్లాం ధర్మం వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా చెబుతోంది. కాబట్టి అబ్దుర్రహ్మాన్ అతను బ్రతికిపోతే బాగుంటుందనుకున్నారు. అతణ్ణి తీసుకొని కొండపైకెక్కారు. అయితే బిలాల్ (రజి) వారిని చూసి ఈ విషయం అన్సార్లకు తెలియజేశారు. ఉమయ్యా కొండపై ఉన్నాడని తెలియగానే ముస్లింలందరూ పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని మీద విరుచుకుపడ్డారు. అబ్దుర్రహ్మాన్ ఉమయ్యా కొడుకుని ముందుకు పంపారు. ప్రజలు అతని కొడుకుని వధించారు. అంతటితో ఆగక ఉమయ్యా మీదికి ఎగబడ్డారు. అబ్దుర్రహ్మాన్ ఉమయ్యాను నేలపై పడుకోబెట్టి అతన్ని కాపాడటానికి తను అతనిపై పడుకున్నారు. కాని ప్రజలు ఏ మాత్రం ఊరుకోకుండా ఆయన కాళ్ళక్రింద నుంచి చేతులు పోనిచ్చి అతణ్ణి చంపేశారు. ఈ హత్యాయత్నంలో అబ్దుర్రహ్మాన్ కాలికి కూడా గాయమయింది. గాయం మానిపోయినా చాలాకాలం వరకు దాని మచ్చ అలాగే ఉండిపోయింది.27

అబూజహల్, ఉత్బా లాంటి హేమాహేమీలు వధించబడిన తరువాత ఖురైషులు ఆయుధాలను క్రిందపడేశారు. ముస్లింలు వారి వెంటపడి వారిని బంధించడం మొదలుపెట్టారు. అబ్బాస్, ఉఖైల్ (అలీ సోదరుడు) నౌఫిల్, అస్వద్ బిన్ ఆమిర్, అబ్ద్ బిన్ జమఆ తదితర ప్రముఖులు ఖైదీలుగా పట్టుబడ్డారు.

ఎవరైనా వెళ్ళి అబూజహల్ ఏమయ్యాడో కనుక్కొని రమ్మని దైవప్రవక్త (సల్లం) ఆదేశించారు. అబ్దుల్లాహ్ బిన్ మస్‌ఊద్ వెళ్ళి శవాల్లో వెతుకుతుంటే ఒకచోట అతను క్షతగాత్రుడై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. అబ్దుల్లాహ్ అతని దగ్గరికెళ్ళి, “నువ్వు అబూజహల్‌వేనా?” అని అడిగారు. దానికతను, “ఒక వ్యక్తిని అతని తెగవారే చంపేస్తే అందులో గొప్పేముంది” అన్నాడు. అబ్దుల్లాహ్ క్షణం ఆలస్యం చెయ్యకుండా అతని తల నరుక్కుని తెచ్చి దైవప్రవక్త (సల్లం) పాదాలదగ్గర పడేశారు.28

ఘన విజయం

యుద్ధం ముగిసిన తరువాత ముస్లింలలో కేవలం పధ్నాలుగు మంది మాత్రమే అమరగతినొందారని తెలిసింది. వారిలో ఆరుగురు ముహాజిర్లు కాగా మిగిలినవారందరూ అన్సారీలే.29 కాని మరోవైపు ఖురైషుల వెన్నుముక విరిగిపోయింది. గొప్పవీరులుగా పేరుమోసిన ఖురైష్ సర్దారులు, సైన్యాధిపతులందరూ ఈ యుద్ధంలో మరణించారు. వారిలో ఉత్బా, షైబా, అబూజహల్, అబుల్ బుఖ్‌తరీ, జమ్‌ఆ బిన్ అస్వద్, ఆస్‌బిన్ హిషామ్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్, మునబ్బా బిన్ హజ్జాజ్ లాంటి అతిరథ, మహారథులున్నారు. సుమారు డెబ్బైమంది మరణించటంతో పాటు, అంతేమంది ఖైదీలుగానూ పట్టుబడ్డారు.30 యుద్ధఖైదీల్లో ఉఖబా, నజర్ బిన్ హారిస్‌లు మాత్రం విడుదలయ్యారు. మిగిలిన వారిని ఖైదు చేసి మదీనాకు తీసుకురావటం జరిగింది. వీరిలో అబ్బాస్, ఉఖైల్, అబుల్ ఆస్ (దైవప్రవక్తగారి అల్లుడు) కూడా ఉన్నారు.31

సాధారణంగా దైవప్రవక్త (సల్లం) యుద్ధాల తరువాత ఎక్కడయినా శవం కనపడితే దాన్ని అక్కడే సమాధి చేయించేవారు. కాని ఈ సందర్భంలో శవాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో వాటిని వేర్వేరుగా పూడ్చిపెట్టడం కష్టమయిపోయింది. అంచేత ఆయన ఆ శవాలన్నింటినీ అక్కడే ఉన్న ఒక పెద్ద బావిలో వేయించారు.32 కాని ఉమయ్యా శవం మాత్రం బాగా ఉబ్బి బావిలో పడేయటానికి అనువుగా లేకపోవటంతో దాన్ని అక్కడికక్కడే మట్టితో కప్పేయమని ఆదేశించారు.33

యుద్ధఖైదీల పట్ల ముస్లింల వ్యవహారం

దైవప్రవక్త(సల్లం) యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలందరినీ నలుగురైదుగురు అనుచరులకు అప్పగించి వారిపట్ల మర్యాదగా మెలగమని ఆదేశించారు. దైవప్రవక్త అనుచరులు ఆ యుద్ధఖైదీలకు అన్నం పెట్టి తాము మాత్రం ఖర్జూరపండ్లు తిని కడుపునింపుకునేవారు. ఆ ఖైదీల్లో ముస్‌అబ్ బిన్ ఉమైర్ సోదరుడైన అబూ అజీజ్ కూడా ఉన్నారు. ఆయన ఇలా తెలియజేస్తున్నారు:

నేనొక అన్సార్ ఇంట్లో ఖైదీగా ఉంచబడ్డాను. ఆ ఇంటివాళ్ళు ఉదయం, సాయంత్రం నాకు రొట్టెలిచ్చి తాము మాత్రం ఖర్జూర పండ్లతో సరిపెట్టుకునేవారు. ఆ రొట్టెలు తినడానికి నా మనసొప్పేది కాదు. నేను ఆ రొట్టెలు వారి చేతికిచ్చేవాణ్ణి, వారు వాటిని తాకనయినా తాకకుండా తిరిగి నాకే వాపసు చేసేవాళ్ళు. దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని ఖైదీలపట్ల ఉత్తమంగా వ్యవహరించమని ఆదేశించారు. అందుకే వారు మాపట్ల ఆ విధంగా ప్రవర్తించేవారు.34

ఖైదీల్లో సుహైల్ బిన్ అమ్ర్ అనే వాడొకడు ఉండేవాడు. అతను మంచి వక్త. బహిరంగ సభల్లో దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ఉపన్యాసాలు చేసేవాడు. హజ్రత్ ఉమర్ ‘అతని క్రింది రెండు పళ్ళు ఊడబీకితే మరోమారు ఉపన్యాసాల జోలికి పోకుండా ఉంటాడన్నారు’ ఆవేశపడిపోతూ.

ఆ మాటకు దైవప్రవక్త(సల్లం), “నేనితని శరీరావయవాలను పాడుచేస్తే దేవుడు నేను దైవప్రవక్తనని కూడా చూడకుండా నా అవయవాల్ని పాడుచేస్తాడు” అన్నారు.35 ఖైదీల దగ్గర బట్టలు లేకపోతే దైవప్రవక్త (సల్లం) వారికి బట్టలు ఇప్పించారు. అబ్బాస్ చాలా ఎత్తుగా ఉండటం మూలాన ఆయనకు ఎవరి బట్టలూ సరిపోలేదు. అప్పుడు కపటుల నాయకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉబై అబ్బాస్‌కు తన చొక్కా తెప్పించి ఇచ్చాడు. అతను అబ్బాస్ అంత ఎత్తు ఉండేవాడు. అతను చనిపోయినప్పుడు దైవప్రవక్త (సల్లం) అతని శవానికి తొడిగించటానికి తన చొక్కా ఇచ్చారు. తన బాబాయి అబ్బాస్‌కు ఇంతకుముందు అతను చేసిన ఉపకారానికి బదులుగానే ఆయన అతని శవానికి తన చొక్కా తొడిగించారని బుఖారీలో ఉంది.36

ఒక్కొక్క యుద్ధ ఖైదీ నుండి నాల్గువేల దిర్హముల నష్టపరిహారం వసూలు చేయటం జరిగింది. పరిహారం చెల్లించలేని నిరుపేదల్ని వదలివేయటం జరిగింది. వారిలో చదువొచ్చిన వారు పదిమంది ముస్లిం పిల్లలకు చదువు చెప్పి విడుదల కావచ్చునని కూడా సూచించటం జరిగింది.37 హజ్రత్ జైద్ బిన్ సాబిత్ అలా చదువుకున్నవారే!38

అన్సార్లు హజ్రత్ అబ్బాస్ తమకు మేనల్లుడౌతారని, అంచేత ఆయన్నుండి నష్టపరిహారం వసూలు చేయకుండానే ఆయన్ని విడుదల చెయ్యాలని దైవప్రవక్త సన్నిధిలో విన్నవించుకున్నారు. కాని దైవప్రవక్త (సల్లం) చట్ట సమానత దృష్ట్యా అన్సార్ల విన్నపాన్ని త్రోసిపుచ్చారు. ఆ విధంగా అబ్బాస్‌కు కూడా నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది.39 నష్టపరిహారం నాల్గువేలే అయినప్పటికీ నాయకుల నుండి ఇంకా ఎక్కువ వసూలు చేయటం జరిగింది. అబ్బాస్ ధనికులవటం చేత ఆయన దగ్గరి నుండి కూడా ఎక్కువ నష్టపరిహారం వసూలు చేశారు. ఆయన దీని గురించి దైవప్రవక్త (సల్లం)కు ఫిర్యాదు చేశారు. ఇస్లాం నెలకొల్పగోరుతున్న సామాజిక న్యాయభావనలో అయినవారు, కానివారు, సామాన్యులు, ప్రముఖులన్న భేదభావం లేదన్న సంగతి ఆయనకేం తెలుసు?! సామాజిక న్యాయ నియమం ప్రకారం దైవప్రవక్త (సల్లం) అబ్బాస్ ఫిర్యాదును కొట్టిపారేసినా, ఆయనతో తనకున్న ఆత్మీయతా భావం వల్ల దైవప్రవక్త (సల్లం)కు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ప్రజలు అబ్బాస్‌ను విడుదల చేసిన తరువాత గాని ఆయన మనసు కుదుటపడలేదు.40

అబుల్ ఆస్ (రజి) ఇస్లాం స్వీకరణ

యుద్ధ ఖైదీల్లో దైవప్రవక్త (సల్లం) అల్లుడు అబుల్ ఆస్ కూడా ఉన్నారు. ఆయన దగ్గర నష్టపరిహారం చెల్లించేందుకు పైకం లేకపోవటంతో మక్కాలో ఉన్న తన భార్య (దైవప్రవక్త(సల్లం)కూతురు) హజ్రత్ జైనబ్‌కు డబ్బులు పంపమని కబురంపారు. జైనబ్ వివాహం జరిగినప్పుడు ఆమె తల్లి హజ్రత్ ఖదీజా (రజి అన్‌హా) ఆమెకు ఒక ఖరీదైన హారం కానుకగా ఇచ్చారు. హజ్రత్ జైనబ్ ఆ హారమే మెళ్ళోనుండి తీసి భర్తకు పంపారు. ఆ హారాన్ని చూడగానే దైవప్రవక్త (సల్లం)కు పాతికేళ్ళనాటి సంఘటన గుర్తొచ్చింది. అప్రయత్నంగానే ఆయన విలపించటం మొదలుపెట్టారు. తన అనుచరులతో ‘మీకిష్టమయితే నా కూతురికి తన తల్లి ఇచ్చిన జ్ఞాపికను ఆమెకు ఇచ్చివేయండి’ అన్నారు. సహచరులందరూ ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆ హారాన్ని జైనబ్ (రజి అన్‌హా)కు త్రిప్పిపంపారు.

అబుల్ ఆస్ విడుదలై మక్కావచ్చి హజ్రత్ జైనబ్‌ను మదీనాకు పంపేశారు. అబుల్ ఆస్ చాలాపెద్ద వ్యాపారి. ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ఆయన భారీ ఎత్తున వ్యాపార సామగ్రిని వెంటబెట్టుకొని సిరియాకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ముస్లింలు ఆయన్ని మొత్తం వర్తక సామగ్రితో సహా పట్టుకున్నారు. ఆయన వ్యాపార సామగ్రినంతా ముస్లిం సిపాయిలు పంచుకున్నారు. ఈయన రహస్యంగా వెళ్ళి జైనబ్ (రజి అన్‌హా) ఇంట్లో తలదాచుకున్నారు. జైనబ్ కూడా ఆయనకు రక్షణ కల్పించారు. ఈ విషయం దైవప్రవక్తకు తెలిసింది. ఆయన ప్రజలనుద్దేశించి, “మీరు సముచితమని భావిస్తే వెంటనే అబుల్ ఆస్ సామగ్రి అంతా అతనికి వాపసు చెయ్యండి” అన్నారు.

ప్రజలు దైవప్రవక్త ఆజ్ఞను శిరసావహించారు. ఒక్క దారమయినా తమ దగ్గర ఉంచుకోకుండా సిపాయిలు వ్యాపార సామగ్రినంతా అబుల్‌ఆస్‌కు వాపసు చేసేశారు. దైవప్రవక్త (సల్లం) తన పట్ల కనబరచిన ఈ ఉదారవైఖరికి అబుల్ ఆస్ హృదయం చలించింది. ఆయన మక్కావెళ్ళి తనకు భాగస్వాములైన వ్యాపారులందరికీ వ్యాపార లెక్కలు చూపించి తాను ఇస్లాం స్వీకరించి మదీనాకు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ తన భాగస్వాములతో, “అబుల్ ఆస్ మా సొమ్ము కాజేశాడు. మక్కాకు వస్తే మేము నిలదీస్తామన్న భయంతో ఇస్లాం స్వీకరించి మదీనాలో ఉండిపోయాడని మీరు అనుకుంటారేమోనని నేను మీకు వ్యాపార లెక్కలు చూపించి మరీ వెళ్తున్నాను” అన్నారు.41

ఉమైర్ బిన్ వహబ్ (రజి) ఇస్లాం స్వీకరణ

ఖురైష్‌కు చెందిన ఉమైర్ బిన్ వహబ్ ఒకప్పుడు ఇస్లాంకు బద్ధ విరోధి. అతను మరియు సఫ్‌వాన్ బిన్ ఉమయ్యా ఇద్దరూ ఒక రాయి మీద కూర్చొని బద్ర్‌యుద్ధంలో చనిపోయిన తమవారిని తలచుకుంటూ ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నారు. సఫ్‌వాన్ దుఃఖసాగరంలో మునకలు వేస్తూ, “దైవసాక్షి! ఇక మా బ్రతుకులకు అర్థం లేదు” అన్నాడు. దానికి ఉమైర్ “నువ్వు నిజం చెబుతున్నావు సోదరా! నాకే గనక అప్పుల బాధ లేకపోయినట్లయితే, నా పసిపిల్లల చింత లేకపోయినట్లయితే నేను ఇప్పుడే వెళ్ళి ముహమ్మద్ అంతు చూసేవాణ్ణి. నా కొడుకు కూడా అక్కడ బందీ అయి ఉన్నాడు” అన్నాడు సఫ్‌వాన్‌కు వంతపాడుతూ.

“నీకు ఆ బెంగ అక్కర్లేదు. నీ అప్పుల, నీ పిల్లల బాగోగుల సంగతి నాకు వదిలెయ్యి. నువ్వెళ్ళి ముహమ్మద్ అంతు చూడు”-సఫ్‌వాన్ ఉమైర్‌ను ఉసిగొల్పాడు.

అసలే ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న ఉమైర్ సఫ్‌వాన్ కవ్వింపుతో మరింత ఉగ్రుడైపోయాడు. బరబరా ఇంటికివెళ్ళి ఖడ్గాన్ని విషంలో ముంచి తీశాడు. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మదీనా చేరుకున్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతని ఆవేశపూరిత వదనాన్ని చూసి కీడు శంకించారు: మెడ పట్టుకొని దైవప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చారు. ముందు అతన్ని వదలిపెట్టమని దైవప్రవక్త(సల్లం) ఉమర్‌ను ముందు ఆదేశించారు. తరువాత అతన్ని తన దగ్గరికి పిలిచి, “ఉమైర్ ఏ ఉద్దేశ్యంతో వచ్చావ్” అని అడిగారు.

“నా కొడుకుని విడిపించుకొని వెళ్దామని వచ్చాను”- ఏ మాత్రం భయపడకుండా జవాబు చెప్పాడతను.

“మరి చేతిలో ఈ ఖడ్గమెందుకు?”-మళ్ళీ మృదువుగానే అడిగారు దైవప్రవక్త (సల్లం).

“మా చేతుల్లో ఖడ్గాలున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. బద్ర్ యుద్ధంలో మేము ఈ ఖడ్గాలతో ఏం ఒరగబెట్టామని?”- ఉమైర్ కాస్త తడుముకుంటూనే సమాధానం చెప్పాడు.

“భయపడకుండా ఎలా ఉంటాం. నువ్వూ, సఫ్‌వాన్ మక్కాలో ఫలానా రాళ్ళగుట్ట దగ్గర కూర్చొని నన్ను చంపటానికి కుట్ర పన్నిన సంగతి నిజం కాదా?” అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ మాటవినగానే ఉమైర్ నిర్ఘాంతపోయాడు. “ముహమ్మద్! నిస్సందేహంగా మీరు దైవప్రవక్తే. దైవసాక్షి! ఈ విషయం నాకూ సఫ్‌వాన్‌కు తప్ప మూడోవ్యక్తికి తెలియనే తెలియదు” అప్రయత్నంగానే అతని నోటి నుండి దేవుడు, దైవప్రవక్తల స్తోత్రం మొదలయ్యింది. అటు దైవప్రవక్త మరణవార్త కోసం వేచిచూస్తున్న మక్కా అవిశ్వాసుల చెవులకు ఉమైర్ ఇస్లాం స్వీకరించారన్న వార్త వినపడింది.

దైవప్రవక్త(సల్లం) తన అనుచరుల్ని ఉద్దేశించి, “క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన ఈ మీ సోదరునికి ధర్మం గురించి బోధించండి. ఖురాన్ నేర్పించండి. ఇతని కుమారుణ్ణి విడిచిపెట్టండి” అని ఆదేశించారు.

ఉమైర్ (రజి) దైవప్రవక్తతో, “దైవప్రవక్తా! మీరు అనుమతిస్తే నేను మక్కాకు తిరిగి వెళ్ళి అక్కడి ప్రజలకు ఇస్లాం ధర్మం గురించి బోధిస్తాను. నేను ఇప్పటి వరకూ ముస్లింలను చాలా బాధపెట్టాను. దానికి నా మనసు పరిపరివిధాలా చింతిస్తోంది. ఇప్పుడు మక్కావెళ్ళి బహుదైవారాధకుల భరతం పట్టాలనిపిస్తోంది నాకు” అన్నారు.

ఇటు సఫ్‌వాన్ ఉమైర్‌ను దైవప్రవక్త(సల్లం) మీదకు ఉసిగొల్పి మదీనాకు పంపిన తరువాత ఖురైష్ సర్దారుల ముందు గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించాడు. “అతి త్వరలోనే పరిస్థితులు ఎలా మారిపోతాయో చూడండి! బద్ర్ యుద్ధ ఓటమి వల్ల మీ గుండెల్లో రగిలిన మంటలు ఆరిపోనున్నాయి. అతిత్వరలోనే ముహమ్మద్ మరణవార్త వింటారు మీరు” అనేవాడు.

కాని ఉమైర్ మదీనావెళ్ళిన తరువాత ఇస్లాం స్వీకరించారని తెలియగానే సఫ్‌వాన్ కొయ్యబారిపోయాడు. ఇక తాను జీవితాంతం ఉమైర్‌తో మాట్లాడననీ, అతనికి మంచి చెయ్యనని ఒట్టేసుకున్నాడు. కాని సఫ్‌వాన్ తనతో మాట్లాడనంతమాత్రాన ఉమైర్‌కు కలిగే నష్టమేమిటి? ఆయన మాత్రం మక్కాకు తిరిగొచ్చి నిక్షేపంగా ఇస్లాం ప్రచారం మొదలుపెట్టారు. సఫ్‌వాన్ కళ్ళముందే ఎంతోమంది ఆయన చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు.42

హజ్రత్ ఫాతిమా (రజి అన్‌హా) వివాహం

హజ్రత్ ఫాతిమా (రజి అన్‌హా) దైవప్రవక్త (సల్లం)గారి కనిష్ట పుత్రిక. పద్దెనిమిదో యేట ఆమెకు వివాహ సందేశాలు రావటం మొదలయ్యాయి. ఆ సమయంలో హజ్రత్ అలీ (రజి) కూడా వివాహ సందేశం పంపగా దైవప్రవక్త(సల్లం) కూతురి అభిప్రాయం అడిగారు. అందుకామె మౌనం వహించారు. ఒక విధంగా ఆ మౌనమే ఆమె అంగీకారం. అప్పుడు దైవప్రవక్త (సల్లం) అలీని “నీ దగ్గర మహర్‌గా ఇవ్వటానికి ఏమయినా ఉందా?” అని అడిగారు.

హజ్రత్ అలీ ప్రస్తుతం తన దగ్గరేమీ లేదన్నారు.

దైవప్రవక్త (సల్లం) బద్ర్ యుద్ధంలో లభించిన హుతియ్యా కవచం ఏమయిందని అడిగారు. అదయితే ఉందన్నారు అలీ (రజి). దైవప్రవక్త (సల్లం) “అది చాలు” అన్నారు.

కవచమనగానే అదేదో చాలా విలువైన వస్తువే అయివుంటుందనిపించవచ్చు వినేవారికి. కాని దాని అసలు ఖరీదు విన్న తరువాత తెలుస్తుంది దాని విలువేమిటో! దాని ఖరీదు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే! హజ్రత్ అలీ (రజి) దగ్గర ఆ కవచంగాక ఒక గొర్రెతోలు, ఓ పాత దుప్పటి మాత్రమే ఉండేవి. ఆయన ఇవన్నీ ఫాతిమా (రజి అన్‌హా)కు సమర్పించుకున్నారు. హజ్రత్ అలీ అప్పటి వరకు దైవప్రవక్త (సల్లం) దగ్గరే ఉండేవారు. వివాహం తరువాత వధూవరులిద్దరికీ ప్రత్యేకంగా ఇల్లు కావలసి వచ్చింది. హారిసా బిన్ నూమాన్ అన్సారీ దగ్గర చాలా ఇళ్లు ఉండేవి. వాటిలో కొన్ని అప్పటికే ఆయన దైవప్రవక్త(సల్లం)కు సమర్పించుకొని ఉన్నారు. హజ్రత్ ఫాతిమా తండ్రితో ఆయన ఇళ్ళల్లో నుంచి ఒక ఇల్లు తనకు కూడా ఇప్పియ్యమని అడిగారు. దైవప్రవక్త (సల్లం), “ఎందరికని ఇప్పించను? ఆయన్ను అడిగి అడిగి నాకు సిగ్గేస్తోంది” అన్నారు.

దైవప్రవక్త (సల్లం) ఆ మాట అన్నారని తెలియగానే హారిసా పరుగెత్తుకుంటూ వచ్చి, “దైవప్రవక్తా! నా దగ్గరున్న ధనమంతా మీదే. దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు నా ఇల్లు తీసుకుంటే నాకెంతో సంతోషం కలుగుతుంది” అని చెప్పి ఒక ఇల్లు ఖాళీ చేసి ఇచ్చారు. హజ్రత్ అలీ దంపతులు ఆ ఇంట్లోకి మారారు.

జగత్ ప్రవక్త తన కూతురికి వివాహ సందర్భంలో ఇచ్చిన కానుకలు, ఒక నులక మంచం, ఒక తోలు దిండు-అందులో దూదికి బదులు ఖర్జూర ఆకులు ఉండేవి. ఇంకా ఓ మట్టి డేగిశ, ఓ తోలు సంచి, రెండు తిరుగుడు రాళ్ళు, రెండు మట్టి బిందెలు.

హజ్రత్ ఫాతిమా క్రొత్త ఇంట్లోకి ప్రవేశించిన తరువాత దైవప్రవక్త (సల్లం) నూతన దంపతుల్ని చూడటానికి వెళ్ళారు. గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావటానికి అనుమతి అడిగారు. అనుమతి గ్రహించిన తరువాత లోపలికి వెళ్ళారు. ఒక పాత్రలో నీళ్ళు తెప్పించి తన రెండు చేతులూ అందులో ముంచారు. ఆ నీటిని హజ్రత్ అలీ ఉదరంపై, భుజాలపై చల్లారు. తరువాత ఫాతిమా (రజి అన్‌హా)ను పిలిచారు. ఆమె సిగ్గుపడుతూ తండ్రిదగ్గరికి వచ్చింది. ఆమెపై కూడా ఆ నీళ్ళు చల్లి, “నేను నీ వివాహం మా వంశంలోని అందరికన్నా ఉత్తమునితో చేశానమ్మా!” అన్నారు.43

ప్రతీకార వాంఛ పెల్లుబికింది

అరబ్బు దేశంలో ఒకసారి యుద్ధం మొదలయ్యింది అంటే ఇక అది కొన్ని వందల సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉండేది. ప్రత్యర్థుల్లో ఓడిపోయినవారు ప్రతీకారం తీర్చుకోవటాన్ని తమ జీవిత లక్ష్యంగా భావించేవారు. బద్ర్ యుద్ధంలో ఖురైష్‌కు చెందిన డెబ్బైమంది వధించబడ్డారు. వారిలో అనేకులు ఖురైష్ తెగనాయకులు, మక్కాలో బాగా పేరుమోసినవారు. అంచేత మక్కా అవిశ్వాసులందరూ ముస్లింలపై ప్రతీకారేచ్ఛతో ఉడికిపోసాగారు.44

బద్ర్ యుద్ధ కాలంలో ఖురైష్ వర్తక బృందాలు భారీ ఎత్తున లాభాలు గడించి సిరియానుండి తిరిగొచ్చాయి. పెట్టుబడిదారులకు పెట్టుబడి డబ్బులు ఇచ్చివేసిన తరువాత మిగిలిన ధనాన్ని ఖురైషులు భద్రపరచి ఉంచారు.

చాలాకాలం వరకు ఖురైషులు బద్ర్‌యుద్ధంలో చనిపోయిన తమ పెద్దల గురించి దుఃఖిస్తూనే కూర్చున్నారు. కాని కొన్నాళ్ళ తరువాత ఆ దుఃఖం నుండి తేరుకోగానే వారికి తమ ప్రతీకార బాధ్యత గుర్తొచ్చింది. అబూజహల్ కొడుకు ఇక్రిమాతో సహా కొంతమంది ఖురైష్ సర్దారులు, బద్ర్‌యుద్ధంలో మరణించినవారి బంధుమిత్రుల్ని వెంటబెట్టుకొని అబూసుఫ్యాన్ దగ్గరికి వెళ్ళి, ‘ముహమ్మద్ మా జాతిని నాశనం చేశాడు. ఇప్పుడు మేమతనిపై పగతీర్చుకుంటాం. ఇప్పటివరకు వ్యాపారంలో మాకొచ్చిన లాభాలన్నిటినీ ఈ పని కోసమే ఖర్చుపెట్టాలనుకుంటున్నాం’ అన్నారు. అందరి హృదయాలూ పగ, ప్రతీకారాలతో మండిపోతున్నాయి కాబట్టి ఎవరూ ఈ ప్రతిపాదనకు ఎదురు చెప్పలేదు.

కాని ఖురైషులు అంతకుముందే ముస్లింల శక్తిసామర్థ్యాలను అంచనావేసి ఉన్నారు. బద్ర్ యుద్ధంలో తాము తీసుకువెళ్ళిన సామగ్రి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువ సామగ్రి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అరబ్బు దేశంలో సైనికుల్ని ఉత్తేజితుల్ని చేయటానికి, యుద్ధం వైపు ప్రజల దృష్టిని మళ్ళించటానికి ఎక్కువగా ఉపయోగపడే సాధనం కవిత్వం. ఖురైషుల దగ్గర ఇద్దరు గొప్ప కవులుండేవారు. వారిలో ఒకడు అమ్ర్ జుమ్‌హీ. రెండవవాడు ముసాఫిహ్. అమ్ర్ జుమ్‌హీ బద్ర్‌యుద్ధంలో ముస్లింల చేతికి బందీగా చిక్కాడు. కాని ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) అతనిపై దయతలచి అతణ్ణి విడుదల చేశారు. అతను తిరిగి అవిశ్వాసుల్లోనే చేరిపోయాడు. ఖురైషుల విజ్ఞప్తి మేరకు అమ్ర్ జుమ్‌హీ మరియు ముసాఫిహ్ ఇద్దరూ మక్కానుండి బయలుదేరి అనన్యసామాన్యమైన తమ వాక్చాతుర్యంతో ఖురైష్ ప్రజల హృదయాల్లో పగ ప్రతీకారాల మంటల్ని రగుల్గొల్పారు.

యుద్ధాల్లో సైనికులు సహనస్థయిర్యాలతో, ఉత్సాహం ఉద్రేకాలతో పోరాడాలని అరబ్బులు తమవెంట స్త్రీలను కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళేవారు. యుద్ధానికి స్త్రీలు కూడా వచ్చినప్పుడు సైనికులు ఓడిపోతే తమజాతి మహిళలు అగౌరవం పాలౌతారన్న భయంతో, పౌరుషంతో వారు ప్రాణాలకు తెగించి మరీ పోరాడేవారు. ఖురైష్ మహిళల్లోని చాలామంది బద్ర్‌యుద్ధంలో తమ కొడుకుల్ని పోగొట్టుకొని దెబ్బతిన్న ఆడపులుల్లా ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో కొంతమంది తమ కొడుకుల్ని చంపిన వారి పచ్చి నెత్తురు త్రాగుతామని ప్రతినబూనారు. ఏది ఏమైనా యుద్ధానికి సైన్యం సిద్ధమయినప్పుడు ఉన్నతకుటుంబాల స్త్రీలు కూడా సైనికుల వెంట యుద్ధానికి బయలుదేరారు.45

హజ్రత్ హమ్జా బద్ర్ యుద్ధంలో హింద్ అనే మహిళ తండ్రి అయిన ఉత్బాను వధించారు. జుబైర్ బిన్ ముత్‌యిమ్ బాబాయి కూడా హమ్జా చేత వధించబడ్డాడు. అంచేత హింద్ జుబైర్ బానిస అయిన ఒక నీగ్రోవాణ్ణి హమ్జాను చంపమని పురమాయించింది. హమ్జాను చంపితే అతణ్ణి బానిసత్వం నుండి స్వేచ్ఛ కల్పిస్తానని మాటిచ్చింది.46

దైవప్రవక్త (సల్లం)గారి బాబాయి అయిన అబ్బాస్ ఇస్లాం స్వీకరించినా అప్పటికింకా మక్కాలోనే ఉన్నారు. ఆయన అతివేగంగా ప్రయాణించే ఒక వార్తాహరుని ద్వారా దైవప్రవక్త (సల్లం)కు మక్కాలోని పరిస్థితుల గురించి ఒక లేఖ వ్రాసి పంపారు. మూడ్రోజుల్లోగా మదీనా చేరుకోవాలని ఆ వార్తాహరునికి తాకీదు చేశారు. దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియగానే ఆయన హి.శ. మూడవ యేట షవ్వాల్ మాసం ఐదవ తేదీన అనస్, మూనిస్ అనే ఇద్దరు గూఢచారుల్ని ఖురైషుల గురించి మరింత సమాచారం తెలుసుకొని రమ్మని పంపించారు. వారు తిరిగొచ్చి ఖురైషుల సైన్యం మదీనా నగర సమీపానికి చేరుకుందనీ, వారి గుర్రాలు మదీనా పచ్చికబయళ్ళని మేసి నాశనం చేశాయని తెలియజేశారు.47

ఆ తరువాత దైవప్రవక్త(సల్లం) ఖురైషుల సైన్యం సంఖ్య ఎంతో కనుక్కొని రమ్మని హుబాబ్ బిన్ ముంజిర్‌ను పంపారు. ఆయన వెళ్ళి సైన్యాన్ని సరిగ్గా అంచనా వేసుకొని వచ్చి దైవప్రవక్త (సల్లం)కు తెలియపరచారు. శత్రువులు మదీనా నగరంపై దాడిచేసే అవకాశాలుండటంతో నగరం చుట్టుప్రక్కలా కాపలాదారుల్ని నియమించడం జరిగింది. హజ్రత్ సాద్ బిన్ ఉబాదా, సాద్ బిన్ ముఆజ్‌లు ఆయుధాలు ధరించి ఆ రాత్రంతా మస్జిదె నబవీ ద్వారం వద్ద కాపలా ఉన్నారు.48

తెల్లారినాక దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో యుద్ధం గురించి చర్చించారు. చాలా మంది ముహాజిర్లు, అన్సార్లలోని పెద్దలు స్త్రీలను నగరం వెలుపల ఉన్న కోటల్లోకి పంపించి, పురుషులు నగరంలోనే ఉండి శత్రువుల దాడుల్ని తిప్పికొడదామని సలహా ఇచ్చారు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై బిన్ సలూల్ అంతకుముందెన్నడూ ముస్లింల సలహా సమావేశాలకు హాజరు కాలేదు. తొలిసారిగా ఈ సమావేశానికి హాజరై అతను కూడా అదే సలహా ఇచ్చాడు. కాని బద్ర్ యుద్ధంలో పాల్గొనలేకపోయిన యువత మాత్రం నగరం నుంచి బయటికివెళ్ళి యుద్ధం చెయ్యాలని పట్టుబట్టింది. దైవప్రవక్త (సల్లం) ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంట్లోకి వెళ్ళి కవచం ధరించి బయటికొచ్చారు. ప్రజలు తాము దైవప్రవక్త (సల్లం) అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన్ని యుద్ధానికి బయలుదేరేలా చేసినందుకు బాధపడ్డారు. తాము తమ అభిప్రాయాల్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామని దైవప్రవక్తతో చెప్పారు. కాని “ఒకసారి ఆయుధాలు ధరించిన తరువాత తిరిగి వాటిని విప్పేయటమనేది ఒక ప్రవక్తకు శోభించదు” అన్నారాయన (సల్లం).49

ఫుట్‌నోట్‌లు

  1. 1సుననె అబూదావూద్‌లోని రెండవ సంపుటి 67వ పుట.
  2. 2షిబ్లీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 315వ పుట. కుర్జ్ ఫహ్‌రీ సంఘటన తబఖాత్ ఇబ్నెసాద్ రెండవ సంపుటి 9వ పుటలో, హజ్రమీ హత్య సంఘటన సుననె బైహఖీ తొమ్మిదో సంపుటి 11వ పుటలో ఉంది.
  3. 3సీరత్ ఇబ్నెహిషాం మొదటి సంపుటి 625వ పుట. ఫత్‌హుల్ బారీ ఏడవ సంపుటి 287, 288 పుటలు. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
  4. 4సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  5. 5తబఖాత్ ఇబ్నెసాద్
  6. 6సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 613వ పుట. జాదుల్ మఆద్ రెండవ సంపుటి 171వ పుట. ముస్నదె అహ్మద్, ముస్తద్రక్ హాకిమ్‌ల ప్రామాణికమైన ఉల్లేఖనాల్లో ముర్సద్ గన్‌వీకు బదులు అబూలుబాబా ప్రస్తావన ఉంది.
  7. 7సీరత్ ఇబ్నె హిషామ్‌లో బద్ర్ యుద్ధ సంఘటన. అల్ బిదాయా వన్నిహాయా మూడవ సంపుటి 360వ పుట. ముస్నదె అహ్మద్ రెండవ సంపుటి 193వ పుట.
  8. 8ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 426 వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 619వ పుట.
  9. 9సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 620, 621 పుటలు. దలాయిలున్నుబువ్వా మూడవ సంపుటి 35వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటిలో 326 వ పుట.
  10. 10జాదుల్ మఆద్ మూడవ సంపుటి 179వ పుట. దలాయిలున్నుబువ్వా మూడవ సంపుటి 39వ పుట. నసాయిగారి సుననె కుబ్రా గ్రంథం.
  11. 11సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 622, 623 పుటలు. జాదుల్ మఆద్ మూడవ సంపుటి 779వ పుట.
  12. 12జాదుల్ మఆద్ మూడవ సంపుటి 620వ పుట.
  13. 13షిబ్లీ నూమానీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 320వ పుట.
  14. 14సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
  15. 15సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
  16. 16సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  17. 17సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం
  18. 18సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 238వ పుట
  19. 19షిబ్లీ నోమానీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 322వ పుట.
  20. 20సుననె అబూదావూద్‌లోని జిహాద్ ప్రకరణం, ముస్నదె అహ్మద్ మొదటి సంపుటిలో 117వ పుట. సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  21. 21సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  22. 22సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  23. 23షిబ్లీ నూమానీ గారి సీరతున్నబీ గ్రంథం: మొదటి సంపుటి 324వ పుట.
  24. 24సహీహ్ బుఖారీ – ఖుముస్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
  25. 25సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 635వ పుట. ముస్నదె అహ్మద్ మొదటి సంపుటి 444వ పుట.
  26. 26అసదుల్‌గాబ: నాల్గో సంపుటి 288వ పుట. అల్‌బిదాయా వన్నిహాయా మూడవ సంపుటి 285వ పుట.
  27. 27సహీహ్ బుఖారీలోని వకాలా ప్రకరణం.
  28. 28సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  29. 29సీరత్ ఇబ్నె కసీర్ రెండవ సంపుటి 463వ పుట.
  30. 30సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  31. 31తారీఖె తబ్రీ మూడవ సంపుటి 38వ పుట. అల్‌బిదాయా వన్నిహాయా మూడవ సంపుటి 297వపుట.
  32. 32సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  33. 33తారీఖె తబ్రీ రెండవ సంపుటి 37వ పుట.
  34. 34తారీఖె తబ్రీ రెండవ సంపుటి 39వ పుట. తబఖాత్ ఇబ్నెసాద్ రెండవ సంపుటి 14వ పుట
  35. 35సీరతున్నబీ మొదటి సంపుటి 330వ పుట. తారీఖె తబ్రీ సౌజన్యంతో
  36. 36సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం
  37. 37ముస్నదె అహ్మద్ మొదటి సంపుటి 247వ పుట.
  38. 38సీరతున్నబీ, తబఖాత్ ఇబ్నెసాద్ సౌజన్యంతో.
  39. 39సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  40. 40అల్ బిదాయా వన్నిహాయా రెండవ సంపుటి 300వ పుట.
  41. 41సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 657వ పుట; బైహఖీగారి దలాయిలున్నుబువ్వా గ్రంథం మూడవ సంపుటి 154 నుండి 157 పుటలు, తారీఖె తబ్రీ మూడవ సంపుటి 43, 44 పుటలు
  42. 42బైహఖీ గారి దలాయిలున్నుబువ్వా గ్రంథం మూడవ సంపుటి 147 నుండి 149 పుటలు. సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 661వ పుట.
  43. 43సుననె అబూదావూద్‌లోని నికాహ్ ప్రకరణం, షిబ్లీ నూమానీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 366వ పుట.
  44. 44సీరతున్నబీ మొదటి సంపుటి 369వ పుట.
  45. 45తారీఖె తబ్రీ మూడవ సంపుటి 58,59 పుటలు; సీరత్ ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 20, 21వ పుటలు.
  46. 46సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  47. 47సీరత్ హల్బియ్యా రెండవ సంపుటి 490 వ పుట.
  48. 48సీరత్ హల్బియ్యా రెండవ సంపుటి 490 వ పుట.
  49. 49సహీహ్ బుఖారీలోని ఏతెసామ్ ప్రకరణం, ముస్నదె అహ్మద్ మొదటి సంపుటి 351వ పుట. సుననె దారిమి రెండవ సంపుటి 129వ పుట.