ఐదవ అధ్యాయం
ఉహుద్ ప్రతిఘటన
అటు ఖురైషులు బుధవారం నాడు మదీనా నగర సమీపానికి చేరుకొని ఉహుద్ పర్వత లోయలో ఆగారు. దైవప్రవక్త(సల్లం) శుక్రవారం నాడు జుమా నమాజ్ చేసుకున్న తరువాత వెయ్యి మంది అనుచరులతో నగరం నుండి బయలుదేరారు. వారిలో మూడొందల మంది అబ్దుల్లాహ్ బిన్ ఉబై సంఘానికి చెందినవారున్నారు. కాని మార్గమధ్యంలోనే అతను, ముహమ్మద్ (సల్లం) తన సలహాను అంగీకరించలేదన్న వంక చూపెట్టి తన మూడొందల మంది అనుచరుల్నీ వెంటబెట్టుకొని మదీనాకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇక దైవప్రవక్త (సల్లం) వెంట మిగిలింది ఏడొందల మంది అనుచరులు మాత్రమే.1 వారిలో వందమంది దగ్గర కవచాలున్నాయి. మదీనా వెలుపలికి వచ్చాక సైన్యాన్ని పరిశీలించటం జరిగింది. చిన్నపిల్లల్ని వెనక్కి త్రిప్పి పంపించటం జరిగింది. ఆ విధంగా పంపబడిన వారిలో జైద్ బిన్ సాబిత్, బరా బిన్ ఆజిబ్, అబూసయీద్ ఖుద్రీ, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్, ఇరాబా అవేశీ కూడా ఉన్నారు. యువకుల్లో ఇస్లాం కోసం ప్రాణత్యాగం చెయ్యాలని ఎంత తపన ఉండేదంటే-రాఫె బిన్ ఖదీజ్తో, “నువ్వు చిన్న పిల్లాడివి. మదీనాకు తిరిగి వెళ్లిపోమ”ని అంటే ఆయన తాను పెద్దవాడిలా కనిపించాలని కాలివ్రేళ్ళపై లేచి నించునేవారు. ఎట్టకేలకు ఆయన పథకం పారి యుద్ధంలో పాల్గొనటానికి ఆయనకు అనుమతి లభించింది. అది చూసి రాఫేకు సమవయస్కుడైన సమురా అనే యువకుడు తాను మల్లయుద్ధంలో రాఫేను చిత్తుచేయగలననీ, అతనికి అనుమతి లభించినప్పుడు తనక్కూడా లభించాలని మారాం చేశాడు. ఇద్దరికీ పోటీ పెడితే నిజంగానే సమురా రాఫేను చిత్తుగా ఓడించాడు. దాంతో అతనికి కూడా యుద్ధంలో పాల్గొనటానికి అనుమతి లభించింది.2
దైవప్రవక్త (సల్లం) ఉహుద్ పర్వతం వీపు వెనుక భాగంలో ఉండేటట్లు బారులు తీర్చారు. యుద్ధపతాకాన్ని ముస్‌అబ్ బిన్ ఉమైర్ చేతికిచ్చారు. జుబైర్ బిన్ అవ్వామ్ సైన్యానికి దళపతి అయ్యారు. కవచాలు లేని సైనికపటాలాల సారథ్యం హమ్జా (రజి)కు లభించింది.3 శత్రువులు వెనుక వైపు నుంచి దాడిచేసే అవకాశాలుండటంతో యాభై మంది విలుకాళ్ళను పర్వత కనుమ దగ్గర నియమించి యుద్ధంలో ముస్లింలు గెలుపొందినా సరే అక్కణ్ణుంచి కదలకూడదని తాకీదు చేయటం జరిగింది. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ ఆ విలుకాళ్ళకు నాయకునిగా నియమితులయ్యారు.4
ఖురైషులు బద్ర్ యుద్ధంలో కలిగిన అనుభవం వల్ల ఈసారి కడు జాగ్రత్తగా సైనికుల పంక్తులు సక్రమంగా ఉండేటట్లు చూసుకున్నారు. సైన్యంలోని కుడిపక్షానికి పర్యవేక్షకునిగా ఖాలీద్ బిన్ వలీద్‌ను, ఎడమ పక్షానికి అబూజహల్ కొడుకు ఇక్రిమాను నియమించారు. రౌతుదళానికి అధిపతిగా సఫ్వాన్ బిన్ ఉమయ్యా నియమించబడ్డాడు. ఇవికాక విలుకాళ్ళ విభాగం ఒకటి వేరుగా ఉండింది. దానికి అబ్దుల్లాహ్ బిన్ రబీయా సారథి అయ్యాడు. యుద్ధపతాకం తల్హా చేతికి చిక్కింది. అవసరానికి పనికొస్తాయని ఖురైషులు ముందుగానే రెండొందల గుర్రాలు అదనంగా కొనుక్కొని ఉంచుకున్నారు.5
సైన్యానికి ముందు ఖురైష్ స్త్రీలు డప్పు వాయించుకుంటూ ఉద్రేక పూర్వకమైన గేయాలు పాడుతూ బయలుదేరారు. ఆ గేయాల్లో బద్ర్ యుద్ధంలో చనిపోయిన ఖురైషుల పట్ల సంతాపం, ముస్లింల పట్ల పగ, ప్రతీకార భావాలు ప్రకటితమయ్యేవి. ఆ గేయాలు విని సైనికుల రక్తం ఉడికిపోయేది. అబూ సుఫ్యాన్ భార్య హింద్ ముందుగా, ఆమె వెనుక పధ్నాలుగు మంది స్త్రీలు ఈ విధంగా గీతాలాపన చేస్తూ నడవసాగారు.
“మేము దివి తారల ముద్దు బిడ్డలం
పట్టు తివాచీలపై నడిచే పడతులం
మీరు ఎదురొడ్డి పోరాడితే అక్కున చేర్చుకుంటాం
వెన్ను చూపితే మేమూ మిమ్మల్ని వీడిపోతాం”6
యుద్ధారంభం
ముందుగా అవిశ్వాసుల తరపు నుండి, మదీనా నగరంలో ఒకప్పుడు ‘ప్రజల మనిషి’ అనిపించుకున్న అబూఆమిర్ అనేవాడు నూట యాభై మందితోపాటు రంగంలోకి దిగాడు. ఇస్లాం రాకకు మునుపు తన సాత్వికత, నిరాడంబరతల మూలంగా మదీనాలో ప్రజలందరూ అతణ్ణి గౌరవించేవారు. ఇప్పుడు కూడా అన్సార్లు తనను చూస్తే దైవప్రవక్త (సల్లం)కు సహాయం చేయటాన్ని మానుకుంటారని అతను తలపోశాడు. యుద్ధభూమిలోకి వచ్చి, “నన్ను గుర్తుపట్టారా? నేను అబూ ఆమిర్‌ని” అని గట్టిగా కేకపెట్టి అన్నాడు. కాని అక్కడ అతను అనుకున్నట్టు జరగలేదు. పైగా అన్సార్లు అతనికి సమాధానంగా, “ఒరేయ్ నీచుడా! మేము నిన్ను గుర్తుపట్టాం. దేవుడు నీ కోరికను మన్నించకుండుగాక”! అన్నారు.7
ఖురైష్ యుద్ధపతాకం పట్టుకుని ఉన్న తల్హా ముందుకు వచ్చి, “ముస్లింలలో నన్ను అతి త్వరగా నరకానికి పంపగలిగేవాడు లేదా నా చేత స్వర్గాన్ని పొందేవాడు ఎవడైనా ఉన్నాడా?” అంటూ సవాలు చేశాడు.
‘నేనున్నా’నంటూ హజ్రత్ అలీ ఒక్క ఉదుటున అతని మీదికి దూకి కరవాలం ఝుళిపించారు. రెప్పపాటులోనే తల్హా శవం నేలమీద కనిపించింది.8
తల్హా తరువాత అతని కొడుకు ఉస్మాన్ పతాకాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని వెనుక స్త్రీలు గేయాలు పాడుతూ బయలుదేరారు. అతను కూడా.
“బరిసెనెత్తినవాడు దాన్ని శత్రువుల రక్తంతో తడపాలి లేదా అది విరిగి ముక్కలయ్యేదాకా పోరాడాలి” అంటూ ముందుకొచ్చాడు. వెంటనే హమ్జా(రజి) అతన్ని మార్కొని తన ఖడ్గంతో అతని భుజంపై ఒక్క వేటు వేస్తే అది నడుందాకా దిగబడింది. వెంటనే ఆయన నోటినుండి, “నేను హజ్ యాత్రీకులకు నీళ్లు త్రాపించేవారి కుమారుణ్ణి” అనే పౌరుషం నిండిన పలుకులు వెలువడ్డాయి.
ఇక ఆ తరువాత అసలు యుద్ధం ప్రారంభమయింది.9 హజ్రత్ హమ్జా, అలీ, అబూ దుజానా శత్రుసేనల్లోకి చొచ్చుకొనిపోయి పంక్తులకు పంక్తుల్నే మట్టి కరిపించసాగారు.10 అబూ దుజానా అరబ్ దేశంలోనే పేరెన్నికగన్న పహిల్వాను. దైవప్రవక్త (సల్లం) తన చేతిలో ఓ ఖడ్గం తీసుకొని, “దీని హక్కు నెరవేర్చగల వాడెవడు?” అన్నప్పుడు దానికోసం ఎంతోమంది అనుచరులు ఎగబడ్డారు. కాని చివరికి ఆ అదృష్టం అబూ దుజానాకే దక్కింది. తనకు ఆ అదృష్టం లభించగానే ఆయన మనసు కించిత్ గర్వానికి లోనయింది. ఎర్రటి తలపాగా కట్టుకొని సైన్యం నుండి బయలుదేరి నిక్కుతూ నడవసాగారు. అది చూసి దైవప్రవక్త (సల్లం) ఈ నడక దైవానికి అత్యంత అయిష్టకరమైనది, కాని ఈ యుద్ధ సమయంలో మాత్రం యిష్టమైనదే!” అని అన్నారు.
అబూ దుజానా సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోసాగారు. అడ్డొచ్చిన వాళ్ళనందరినీ తెగనరుకుతూ వీరోచితంగా పోరాడసాగారు. అలా వెళ్తుండగా ఆయనకు ‘హింద్’ ఎదురొచ్చింది. ఆయన ఆమె తల నరకబోయి దైవప్రవక్త కరవాల ప్రతాపాన్ని ఒక మహిళపై చూపించటం తగదనుకొని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.11
హజ్రత్ హమ్జా రెండు చేతుల్లో రెండు ఖడ్గాలు తీసుకొని ఎటువెళితే అటు శవాల గుట్టలు పేర్చసాగారు. అంతలో ఆయనకు నిబా గబ్షానీ అనేవాడు ఎదురొచ్చాడు. అతన్ని చూడగానే “ఒరేయ్! వొడుగులు చేసేవాడా! ఎక్కడికి వెళతావురా?” అని అరుస్తూ ఖడ్గంతో ఒక్కవేటు వేశారు. అంతే, క్షణాల్లో అతను నేలకొరిగాడు. జుబైర్ బిన్ ముత్యిమ్ తన బానిస అయిన ఓ నీగ్రోతో, “నువ్వు గనక హమ్జాను వధిస్తే నేను నీకు స్వేచ్చనిస్తాను” అని మాటిచ్చాడు. దాంతో ఆ నీగ్రో బానిస హమ్జాను చంపటానికి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. నీగ్రోల దగ్గర ‘హిర్బా’ అనే ఒక రకమైన ఆయుధం ఉండేది. సాధారణంగా నీగ్రోలు ఆ ఆయుధాన్ని విసరడంలో ఆరితేరి ఉంటారు. హమ్జా (రజి) తనకు ఎదురుగా రాగానే ఆ నీగ్రో గురిచూసి ఆయన మీదకు ‘హిర్బా’ ఆయుధం విసిరాడు. అది ఆయన బొడ్డులో గ్రుచ్చుకొని ఇవతలకి వచ్చింది.12 హమ్జా అతని మీద ఎదురుదాడి చెయ్యాలని ప్రయత్నించారు కాని అంతలోనే దభాలున క్రిందపడి ప్రాణం వదిలారు.13
గెలుపు ఓటమిగా పరిణమించింది
ఖురైషుల్లో యుద్ధ పతాకాన్ని పట్టుకొని ఉన్నవారు ప్రాణాలు పోయినా దాన్ని క్రింద పడనివ్వటం లేదు. ఒకడు మరణించగానే ఇంకో వీరుడు వచ్చి పతాకాన్ని ఎత్తుకునేవాడు. ‘సవాబ్’ అనేవాడు యుద్ధ పతాకాన్ని తన చేతుల్లోకి తీసుకోగానే ముస్లింలలో ఒకడు ఖడ్గంతో గట్టిగా అతనిమీద ఒక వేటు వేశాడు. దాంతో అతని రెండు చేతులూ తెగిపోయాయి. కాని తన జాతీయ పతాకం తన కళ్ళ ముందే నేల మీద పడిపోవటాన్ని చూడలేక పతాకంతోపాటు తనూ క్రింద పడిపోయి దాన్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ స్థితిలోనే అతను “నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను” అంటూ ప్రాణాలు వదిలాడు. ఖురైషుల యుద్ధ పతాకం చాలా సేపటివరకు అలాగే క్రిందపడి ఉంది. చివరికి అమ్రా బిన్తె అల్ఖమా అనే ఓ ధైర్యస్తురాలు పతాకాన్ని ఎత్తిపట్టుకుంది. యుద్ధ పతాకాన్ని చూడగానే ఖురైషులందరూ మళ్ళీ ఒకచోట కూడారు. వారిలో ఉత్తేజం పొంగిపొర్లింది.14
అబూఆమిర్ అవిశ్వాసుల తరపునుండి యుద్ధం చేస్తున్నాడు. కాని అతని కుమారుడు హంజలా ఇస్లాం స్వీకరించి ఉండటంచేత తన తండ్రితో పోరాడటానికి తనకు అనుమతినివ్వమని ఆయన దైవప్రవక్త (సల్లం)ను కోరారు. కాని ఒక కొడుకు తన తండ్రిపైకి ఖడ్గమెత్తటాన్ని కారుణ్యమూర్తి (సల్లం) సుతరామూ యిష్టపడలేదు. దాంతో హంజలా అవిశ్వాసుల సైన్యాధిపతి అయిన అబూ సుఫ్యాన్పై దాడిచేశారు. ఇంకొద్ది సేపట్లో అబూ సుఫ్యాన్ నేలకొరుగుతాడనగా, అంతలోనే షద్దాద్ బిన్ అస్వద్ ప్రక్కనుండి అడ్డుకొని ఆయన్ని హతమార్చాడు. ఇంత జరిగినప్పటికీ యుద్ధంలో ముస్లింలే పైచేయిగా ఉన్నారు.15 గేయాలు పాడుతూ యోధుల రక్తాన్ని ఉడికిస్తున్న మహిళలు భయంతో వెనక్కి తగ్గారు. శత్రుసేనలు చెల్లాచెదరయిపోయాయి. దాంతో ముస్లింలు యుద్ధం ముగిసిపోయిందని భావించి యుద్ధప్రాప్తి కోసం ఎగబడ్డారు. అది చూసి వెనుక పర్వత కనుమ దగ్గర నియమించబడిన విలుకాళ్ళు కూడా విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ వారిని ఎంత వారించినా వారు వినకుండా తమస్థానం వదలి వెళ్ళిపోయారు.16 అవకాశం కోసం ఎదురుచూస్తున్న అవిశ్వాసుల సైన్యాధిపతి ఖాలిద్ వెనుక వైపు నుండి దాడిచేశాడు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ ఇంకా కొందరు వారితో ప్రాణాలొడ్డి పోరాడారు. కాని చివరకు అందరూ వీరమరణం పొందారు. ఇక శత్రు సేనలకు ముస్లింలపై దాడి చేయటానికి మార్గం సుగమం అయిపోయింది. ముస్లింలు విజయ సొత్తును సమీకరించటంలో నిమగ్నులై ఉన్నారు. వెనక్కి తిరిగి చూస్తే కరవాలాల వర్షం కురుస్తున్నట్లు కనిపించింది. ఇరుసైన్యాలు కలగాపులగం అయిపోయాయి. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు దిమ్మదిరిగిపోయి తత్తరపాటుతో తమమనుషుల్ని తామే చంపుకున్నారు.17 ముస్లింలలో ముస్‌అబ్ బిన్ ఉమైర్‌కు దైవప్రవక్త (సల్లం) పోలికలు ఉండేవి. ఆయన్ని ఇబ్నె ఖుమయ్యా అనేవాడు వధించాడు.18 శత్రువులు ప్రవాహంలా వచ్చి ముస్లింలను తోసుకుంటూ దైవప్రవక్త (సల్లం) దగ్గరికి చేరుకొని ఆయన మొహాన్ని గాయపరిచారు. శిరస్త్రాణం లోని రెండు కొక్కాలు ముఖానికి గ్రుచ్చుకున్నాయి. ఎడమ వైపు క్రిందిభాగంలో ఉన్న పన్ను ఒకటి ఊడిపోయింది.19 నలువైపుల నుంచి ఖడ్గాలు, బాణాలు కురవసాగాయి. దైవప్రవక్త (సల్లం) ప్రక్కకు తూలిపడిపోబోయారు. అంతలో హజ్రత్ అలీ (రజి) ఆయన చెయ్యి పట్టుకున్నారు. హజ్రత్ తల్హా (రజి) ఆయన్ని తన ఒళ్ళోకెత్తుకున్నారు.20
ముస్లింలు గందరగోళ స్థితిలో ఉండగానే దైవప్రవక్త (సల్లం) అమరగతి నొందారన్న వదంతి వ్యాపించింది. ఆ తప్పుడు వార్త విని ముస్లింల హృదయాలు కకావికలమయ్యాయి. చాలామంది ధైర్యాన్ని కోల్పోయారు. బెల్లం కొట్టిన రాళ్ళల్లా ఎక్కడివారక్కడే నించుండిపోయారు.21 హజ్రత్ అనస్ బిన్ నజర్ కొందరు ముస్లింలు ఆయుధాలు క్రిందపడేసి దిగులుతో కూర్చొని ఉండటం చూసి మీరిక్కడ కూర్చొని ఏం చేస్తున్నారని అడిగారు.
“దైవప్రవక్తే (సల్లం) మరణించారు. ఇక మనం ఎవరి కోసం బ్రతకాలి?” దిగులుపడుతూనే సమాధానమిచ్చారు వాళ్ళు.
హజ్రత్ అనస్ వారిని ఊరిస్తూ “మీరు గోళ్ళు గిల్లుకుంటూ, దిగులుపడుతూ కూర్చొనే సమయం కాదిది. లేండి, లేచి దైవప్రవక్త (సల్లం) దేనికోసం తమ ప్రాణాలర్పించారో మీరూ దానికోసం ప్రాణాలొడ్డి పోరాడండి” అన్నారు. ఆ తరువాత స్వగతంలోనే, “దేవా! నేను వీరి అలసత్వానికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. బహుదైవారాధకుల దుష్కార్యాలకు నేను అతీతుణ్ణి” అంటూ కాస్త ముందుకెళ్ళగానే ఆయనకు సాద్ బిన్ ముఆజ్ ఎదురయ్యారు. అనస్ ఆయనతో తనకు ఉహుద్ కొండ ప్రక్కనుంచి స్వర్గవాసన వస్తోందంటూ శత్రువులపై మెరుపుదాడి చేసి వీరోచితంగా పోరాడుతూ అమరగతి నొందారు. మరణించిన తరువాత చూస్తే ఆయన శరీరంపై ఎనభై కన్నా ఎక్కువ గాయాలు కనిపించాయి. మొదట్లో ఆయన శవాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆఖరికి ఆయన సోదరి ఆయన మునివ్రేళ్ళ సాయంతో శవాన్ని గుర్తుపట్టగలిగింది.22 ఒక ముహాజిర్ వ్యక్తి ఓ అన్సార్ ముస్లిం సమీపం నుంచి వెళ్ళాడు. అప్పుడు ఆ అన్సార్ ముస్లిం రక్తంతో తడిసి ముద్దయి ఉన్నాడు. ముహాజిర్ వ్యక్తి అతనితో ‘ముహమ్మద్ (సల్లం) మరణించారన్న సంగతి నీకు తెలుసా?’ అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ ఆ అన్సార్ వ్యక్తి ‘ముహమ్మద్ (సల్లం) మరణిస్తే ఆయన తన లక్ష్యానికి చేరుకున్నారు, నువ్వు కూడా నీ ధర్మం కోసం ప్రాణాలర్పించు’అన్నాడు.23
నిరుపమాన త్యాగభావం
ప్రముఖ ముస్లిం వీరులు ఏ మాత్రం నిరాశానిస్పృహలకు లోను కాకుండా పోరాడుతున్నారు. వారు శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పటికీ వారి చూపులు మాత్రం దైవప్రవక్తనే గాలిస్తున్నాయి. అందరికన్నా ముందు దైవప్రవక్త (సల్లం)పై కాబ్ బిన్ మాలిక్ దృష్టి పడింది. ఆయన మొహంపై కవచం ధరించి ఉన్నప్పటికీ కళ్ళు మాత్రం స్పష్టంగా కన్పిస్తున్నాయి. కాబ్ దైవప్రవక్త (సల్లం)ను గుర్తుపట్టి గట్టిగా కేకవేస్తూ, “ముస్లింలారా! అదిగో దైవప్రవక్త(సల్లం) బ్రతికే ఉన్నారు” అన్నారు. ఆ మాట వినగానే దైవప్రవక్త ప్రాణస్నేహితులందరూ ఆయన చుట్టూ గుమిగూడారు.24 అవిశ్వాసులు కూడా ఆ గుంపువైపుకు దృష్టి మరల్చి దైవప్రవక్త (సల్లం)ను చంపటానికి విరుచుకు పడ్డారు. కాని అంతలో తల్హా(రజి) మెరుపుదాడిచేసి వారిని వెనక్కి తరిమేశారు. నలువైపుల నుంచి బాణాలు కురవసాగాయి. దైవప్రవక్త (సల్లం)కు బాణాలు తగలకుండా అబూ దుజానా తన వీపుని ‘డాలు’గా అడ్డం పెట్టారు.25 బాణాలు ఆయన వీపుమీద గ్రుచ్చుకునేవి. అయినా ఆయన మాత్రం అలాగే కదలకుండా నించున్నారు.26 ఒకానొక సందర్భంలో శత్రువులు దైవప్రవక్త (సల్లం)కు చాలా సమీపానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన ఎలుగెత్తి, “వీళ్లను వెనక్కి తరిమి స్వర్గాన్ని పొందేవారెవరు?” అన్నారు. అక్కడే నించొని ఉన్న ఏడుగురు అన్సార్లు ముందుకు వచ్చారు. ఒక్కొక్కరే వెళ్ళి శత్రువుల్ని వెనక్కి తరమసాగారు. దైవప్రవక్త (సల్లం) పలుమార్లు అదేమాట అన్నారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లం)ను కాపాడుతూ ఆ ఏడుగురు అన్సార్లు తమ ప్రాణాలర్పించారు.27 దైవప్రవక్త (సల్లం) పైకి వచ్చే బాణాలను తల్హా(రజి) తన చేతులతో ఆపేవారు. ఆ శరాఘాతాలతో ఆయన చెయ్యి శాశ్వతంగా చచ్చుబడిపోయింది.28 దుర్మార్గులు దైవప్రవక్త (సల్లం)పైకి బాణాలు విసురుతూనే ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయన నోటినుండి, “ప్రభూ! నా జాతిప్రజలను మన్నించు. వారు అమాయకులు” అనే మాటలే వెలువడేవి.29 తల్హా శరీరమంతా గాయాలతో నుజ్జునుజ్జయిపోయింది. తన దగ్గరికి సహచరులు వచ్చినప్పుడల్లా దైవప్రవక్త (సల్లం) తల్హా క్షేమం గురించి కనుక్కోమని చెప్పేవారు. ప్రజలు వెళ్ళి క్రిందపడిపోయి ఉన్న తల్హాను పైకిలేపారు. అప్పుడు ఆయన ఒంటిపై పదిగాయాలు కనిపించాయి. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్కు కూడా ఇరవైకన్నా ఎక్కువచోట్ల గాయాలయ్యాయి.30 బాణాలు విసరడంలో అబూతల్హాది అందెవేసిన చెయ్యి. ఆయన విపరీతంగా బాణాల వర్షం కురిపిస్తుండగా ఆయన చేతుల్లోనే రెండుమూడు ధనస్సులు విరిగిపోయాయి. శత్రువుల దాడుల నుండి కాపాడటానికి దైవప్రవక్త ముఖానికి ఆయన తన డాలును అడ్డంగా ఉంచారు. దైవప్రవక్త శత్రుసైన్యాలను చూడటానికి తలపైకెత్తినప్పుడు శత్రువుల బాణాలు తగిలే ప్రమాదముంటుందని, అందుకని తల పైకెత్తవద్దని వారించేవారు. చివరికి దైవప్రవక్తను కాపాడటానికి తన శరీరాన్నే డాలుగా ఉపయోగించారు.31
సాద్ బిన్ వఖ్ఖాస్ కూడా బాణాలు విసరడంలో మంచి నేర్పరి. ఆ సమయంలో ఆయన కూడా దైవప్రవక్త (సల్లం) దగ్గరే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) తన అంబుల పొదిని ఆయన చేతికిచ్చి “నా తల్లిదండ్రుల్ని నీకోసం అర్పింతు. నువ్వు కూడా బాణాలు విసురు” అని అన్నారు.32 ఒకానొక సందర్భంలో శత్రువులు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి గుంపుగా వచ్చి దాడిచెయ్యాలని ప్రయత్నించారు. అప్పుడాయన నా కోసం ప్రాణాలిచ్చేవాడెవడయినా ఉన్నాడా?” అన్నారు.
ఆ మాట వినగానే జియాద్ బిన్ సకన్ తన ఐదుగురు మిత్రులతోపాటు ఎదురుదాడి చేశారు. ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఒకరి తరువాత ఒకరు అందరూ మరణించారు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) జియాద్ శవాన్ని తన దగ్గరికి తీసుకొనిరమ్మని అనుచరుల్ని ఆదేశించారు. ఆయన కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. అనుచరులు ఆయన శవాన్ని మోసుకొచ్చి దైవప్రవక్త (సల్లం) పాదాల దగ్గర ఉంచారు. అదే స్థితిలో ఆయన తుదిశ్వాస విడిచారు.33
ఒక ముస్లిం వీరుడు అలాంటి భీతావహ పరిస్థితిలో కూడా ఒకచోట నించొని నిక్షేపంగా ఖర్జూర పండ్లు తినసాగాడు. కాసేపటికి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నేనొక వేళ ఈ యుద్ధంలో మరణిస్తే ఆ తరువాత ఎక్కడుంటాను”? అని అడిగాడు. “స్వర్గంలో ఉంటావ”ని చెప్పారు దైవప్రవక్త (సల్లం). ఆ శుభవార్త వినగానే అతను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శత్రువులపై విజృంభించి వీరమరణం పొందాడు.34 అదే సమయంలో శత్రువులందరూ కలిసి దైవప్రవక్త మీద ఒక్కసారిగా దాడిచేశారు. అప్పుడు ఆయన వెంట కొంతమంది అనుచరులు మాత్రమే ఉన్నారు. అంతలో ఉమ్మె అమ్మారా అక్కడికి చేరుకొని ఆయనకు అడ్డంగా నించుంది. అవిశ్వాసులు ముందుకు రావటానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారిని ఖడ్గంతో, బాణాలతో ఎదుర్కొనేది. ఇబ్నె ఖుమయ్యా దైవప్రవక్త వైపుకు దూసుకురావటాన్ని చూసి ఆమె ముందుకు వెళ్ళి అతన్ని అడ్డుకుంది. అతను చాలా వేగంగా పరుగెత్తుకొని రావటంతో అతని ఆయుధం తగిలి ఆమె భుజానికి పెద్ద గాయమయింది. ఆమె కూడా తన ఖడ్గంతో ఒక వేటు వేసింది కాని అతను రెండు కవచాలు ధరించి ఉన్నందున ఆ దెబ్బ నుండి తప్పించుకోగలిగాడు.35
ఉబై బిన్ ఖలఫ్ ఈ యుద్ధానికి ఆపాదమస్తకం లోహం ధరించి వచ్చాడు. ముహమ్మద్ (సల్లం) గనక బ్రతికి ఉంటే తను క్షేమంగా ఉండలేనని అతను తరచూ అనేవాడు. అతను మక్కాలో దైవప్రవక్త (సల్లం)ను కడతేరుస్తానని ప్రతినబూనాడు. అన్నమాటను నిలబెట్టుకునే ఉద్ద్యేశంతో దైవప్రవక్త (సల్లం)ను చంపటానికి ముందుకొచ్చాడు. అతని మొత్తం శరీరంలో ఒక్క కంఠనాళం మాత్రమే కనబడుతోంది. దైవప్రవక్త (సల్లం) గురిచూసి అతని మీదకు ఈటె విసిరారు. అది కంఠంలో గుచ్చుకోవడంతో అతను గుర్రంనుండి జారిపడ్డాడు. అతని మిత్రులు అతణ్ణి పైకిలేపుతుంటే ఎద్దులా అరవటం మొదలుపెట్టాడు. అతని చుట్టూ ఉన్న ప్రజలు అతనితో, “అంత చిన్న గాయానికే అలా ఎద్దులా అరుస్తావెందుకు?” అంటూ అతన్ని హేళన చేశారు.
నా బాధ మీకేం తెలుసు. ముహమ్మద్ నన్ను చంపుతానని ముందే చెప్పాడు. ఇప్పుడు నాకు కలుగుతున్న బాధను గనక జుల్మజాజ్ నగరం వాళ్ళకు పంచితే వాళ్ళందరూ చనిపోతారు. …అమ్మో”అంటూ అతను మెలికలు తిరిగిపోసాగాడు. ‘రాబిగ్’ అనే ప్రాంతానికి చేరుకునేటప్పటికి అతను ప్రాణాలు వదిలేశాడు.36
ముస్లింలందరూ దైవప్రవక్త (సల్లం) దగ్గరికి చేరుకున్నారు. ఆయన ధరించివున్న శిరస్త్రాణంలోని ఒక కొండి ఆయన మొహంలో దిగబడింది. హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఇలా తెలియజేస్తున్నారు. నేనా కొండీని బయటికి లాగుదామనుకున్నాను. కాని అంతలో అబూ ఉబైదా దేవుని మీద ప్రమాణం చేస్తూ ఆ కొండీని తీయటానికి తనకు అవకాశం కల్పించమని కోరారు. ఆయన తన మునిపళ్ళతో ఆ కొండీని మెల్లగా దైవప్రవక్త (సల్లం)కు ఏ మాత్రం నొప్పి కలగకుండా బయటికి తీశారు. కొండీ బయటికి వచ్చింది కాని దాంతోపాటు అబూ ఉబైదా గారి ఒక పన్ను ఊడిపోయింది. రెండో కొండీ నేను తీయబోయాను. కాని అప్పుడు కూడా అబూ ఉబైదా నన్ను ఆపి తనే మెల్లిగా దాన్ని బయటకు తీశారు. దాంతో ఆయన రెండోపన్ను కూడ ఊడిపోయింది.37 మాలిక్ బిన్ సినాన్ అన్సారీ దైవప్రవక్త చెక్కిలి నుండి కారుతున్న రక్తాన్ని జుర్రుకున్నారు. దైవప్రవక్త (సల్లం) ఆయనతో ఆ రక్తాన్ని ఊసెయ్యమని చెప్పారు. కాని ఆయన మాత్రం ఆ రక్తాన్ని ఊసెయ్యటానికి సుతరామూ యిష్టపడలేదు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో, “మీలో ఎవరికయినా స్వర్గవాసిని చూడాలని ఉంటే ఇతణ్ణి చూడండి” అన్నారు.38
దైవప్రవక్త మరణించారన్న వార్త మదీనాలో వ్యాపించగానే ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతితో ఉహుద్ కొండల వైపు పరుగెత్తారు. ఫాతిమా (రజి అన్హా) వచ్చినప్పుడు కూడా దైవప్రవక్త (సల్లం) మొహం నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది. హజ్రత్ అలీ ఓ తోలు సంచిలో నీళ్ళు పట్టుకొచ్చారు. ఫాతిమా తండ్రి మొహంపైనున్న రక్తాన్ని కడగసాగారు. కాని ఎంత కడిగినా రక్తం ఆగకపోవటంతో ఒక చాపముక్కను కాల్చి గాయంపై ఒత్తిపెట్టారు. దాంతో రక్తస్రావం ఆగిపోయింది.39 ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఒక చట్టుబడంపై ఎక్కాలనుకున్నారు. కాని సత్తువ చాలకపోవటంతో ఎక్కలేకపోయారు. హజ్రత్ తల్హా వంగి నిలబడగా ఆయన వీపుసాయంతో పైకెక్కారు.40 నమాజు వేళకాగానే కూర్చొనే ప్రజలకు నమాజ్ చేయించారు.41
యుద్ధానంతరం కొంతమంది అనుచరులు దైవప్రవక్త (సల్లం)కు గాయాలవటం చూసి అవిశ్వాసుల్ని శపించమని ఆయన్ని కోరారు. దానికి సమాధానమిస్తూ ఆయన (సల్లం)-
“నేను ఈ లోకానికి ప్రజల్ని శపించటానికి రాలేదు. పైగా వారిని దేవుని వైపుకు పిలచేవానిగా, కారుణ్యమూర్తిగా పంపబడ్డాను. దేవా! నా జాతి జనులకు సన్మార్గం చూపు. వారు అమాయకులు” అని అన్నారు.42
దైవప్రవక్త(సల్లం) కొంతమంది సహచరుల్ని వెంటబెట్టుకొని కొండ శిఖరం పైకెక్కారు. అబూ సుఫ్యాన్ వారిని చూసి తాను కూడా కొంతమంది సైనికుల్ని తీసుకొని కొండపైకెక్కటానికి ప్రయత్నించాడు. కాని హజ్రత్ ఉమర్ ఇంకా ఇతర అనుచరులు రాళ్ళు విసిరి అతణ్ణి పైకెక్కనీయకుండా చేశారు.43 అబూ సుఫ్యాన్ వేరొక కొండపైకెక్కి “ఇక్కడ ముహమ్మద్ ఉన్నాడా?” అని కేకపెట్టాడు.
అటు దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని ఏమీ జవాబు చెప్పవద్దని ఆదేశించారు. ఆ తరువాత అబూ సుఫ్యాన్ అబూబక్ర్, ఉమర్‌ల పేర్లు తీసుకొని పిలిచాడు. జవాబు రాకపోవటంతో అందరూ చనిపోయారంటూ ఎగిరి గంతులేయసాగాడు. అది చూసి హజ్రత్ ఉమర్ ఉండబట్టలేక, “ఓరీ దైవద్రోహి! మేమంతా బ్రతికేఉన్నాం” అన్నారు.
ఆ మాటకు అబూ సుఫ్యాన్,
“హుబల్ దేవునికే జేయ్” అన్నాడు.
అనుచరులు దైవప్రవక్త అనుజ్ఞతో
“అల్లాహ్‌కే జేయ్. ఆయన అందరికన్నా గొప్పవాడు” అన్నారు.
అబూ సుఫ్యాన్ పరిహసిస్తూ…
“మాకు ఉజ్జా దేవుడున్నాడు, మీకు లేడు” అన్నాడు.
దానికి జవాబుగా ముస్లింలు.
“అల్లాహ్ మాకు సంరక్షకుడు. మీకు ఏ సంరక్షకుడూ లేడు” అన్నారు.
చివరగా అబూ సుఫ్యాన్ ఎలుగెత్తి, “ఈ యుద్ధం బద్ర్ యుద్ధానికి ప్రతీకారం. మా సైన్యాలు ముస్లింల శవాల ముక్కులు, చెవులు కోసి చీల్చి చెండాడారు. నేనలా చెయ్యమని చెప్పలేదు. కాని వారలా చేశారని తెలిసినా నాకు బాధ అనిపించలేదు” అన్నాడు.44
అమర వీరుల పరిస్థితి
హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రజి) ఇలా వివరించారు: సాద్ బిన్ రబీ ఎక్కడున్నారో చూచిరమ్మని దైవప్రవక్త (సల్లం)నన్ను పంపారు. తను ఎక్కడైనా కనిపిస్తే దైవప్రవక్త (సల్లం) తనకు సలాం చెబుతున్నారని, తను ఏ స్థితిలో ఉన్నారో అడిగిరమ్మని నన్ను పంపారని చెప్పమన్నారు. నేను శవాల్లో సాద్ బిన్ రబీను వెతుక్కుంటూ వెళుతుండగా ఒకచోట నాకాయన శరీరం కనిపించింది. ఆయన కొనఊపిరితో ఉన్నారు. ఆయన ఒళ్లంతా బాణాలు, ఖడ్గాల గాయాలే. నేను త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి, “సాద్! దైవప్రవక్త మీకు సలాం చెబుతున్నారు. మీరే స్థితిలో ఉన్నారో అడిగిరమ్మని నన్ను పంపారు” అన్నాను.
దానికాయన అతికష్టంమీద పెదవి విప్పి పలుకుతూ, “దైవ ప్రవక్త (సల్లం)కు కూడా నా సలాం తెలియ జేయండి. ఇప్పుడు నాకు స్వర్గ సువాసన వస్తోందని చెప్పండి. నా జాతివారయిన అన్సార్లకు నా సందేశం వినిపించండి. ‘మీలో ఏ ఒక్కడయినా ప్రాణాలతో బ్రతికి ఉండి శత్రువులు దైవప్రవక్తను సమీపించి ఆయనకు హాని తలపెట్టగలిగితే… మీరు… దైవసన్నిధిలో ఏ సంజాయిషీ… ఇచ్చుకోలేరని గ్రహిం…చం…డి’ అంటుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.45
కుప్పలు తెప్పలుగా పడివున్న ఆ శవాల్లో అమ్ర్ బిన్ సాబిత్ శవం కూడా ఉంది. ఆయన బిరుదు ‘ఉసైరమ్’. ఆయన బనూ అబ్దుల్ అష్‌హల్ తెగకు చెందినవారు. ఉహుద్ యుద్ధానికి ముందు వరకు ఆయన ఎల్లప్పుడూ ఇస్లాంను తిరస్కరిస్తూనే ఉండేవారు. కాని ఉహుద్ యుద్ధం జరిగినరోజు ఆయన మనసులో ఒక్కసారిగా ఇస్లాం పట్ల విశ్వాసం పొంగిపొర్లింది. ఆ రోజే ఆయన ఇస్లాం స్వీకరించి యుద్ధంలో పాల్గొన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. యుద్ధం ముగిసిన తరువాత బనూ అబ్దుల్ అష్‌హల్ తెగవారు తమ తెగవారి శవాలను వెతుకుతుండగా వారికి ఒకచోట ఉసైరమ్ కనిపించారు. ఆయన దారుణంగా క్షతగాత్రులై చావుబతుకుల మధ్య ఉన్నారు.
తెగవారు ఆయన్ని చూడగానే, “అరే, ఉసైరమ్ ఇక్కడికెలా వచ్చాడు. ఇతను ఇస్లాంకు వ్యతిరేకి కదా!” అనుకున్నారు విపరీతంగా ఆశ్చర్యపడిపోతూ. తరువాత దగ్గరికి వెళ్ళి ఆయన్నే అడిగారు.
“నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నీ తెగవారికి సహాయం చెయ్యటానికా లేక ఇస్లాం పట్ల విశ్వాసంతోనా?” అని.
దానికి ఆయన ఊపిరి బిగబట్టి, “లేదు, ఇస్లాం పట్ల విశ్వాసంతోనే వచ్చాను. నేను దేవుణ్ని, దైవప్రవక్తను విశ్వసించాను. దైవప్రవక్తతో పాటు జిహాద్లో పాల్గొని ఈ అదృష్టానికి నోచుకున్నాను” అనేంతలోనే మృత్యువు ఆయన్ని కబళించింది. ప్రజలు ఈ విషయాన్ని దైవప్రవక్త (సల్లం)కు తెలియజేయగా, ఆయన “సాద్ బిన్ రబీ స్వర్గవాసి అయిపోయాడు” అన్నారు. మరి చూడబోతే, ఆయనకు ఒక్కపూట కూడా నమాజ్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదని హజ్రత్ అబూహురైరా (రజి) తెలియజేశారు.46 (అంటే ఆయన ఇస్లాం స్వీకరించిన వెంటనే అమరగతి నొందారు.)
ఆ అమర వీరుల్లో జాబిర్ తండ్రి అబ్దుల్లాహ్ అమ్ర్ కూడా ఉన్నారు. ఆయన ఉహుద్ యుద్ధానికి ముందు కలలో ముబష్షిర్ బిన్ అబ్దుల్ ముంజిర్ను చూశారు. ముబష్షిర్ అంతకుముందే బద్ర్యుద్ధంలో అమరగతి నొందారు. ఆయన కలలోనే అబ్దుల్లాహ్‌తో మాట్లాడుతూ, “త్వరలోనే మీరు కూడా మా వద్దకు రానున్నారు” అని చెప్పారు. దానికి అబ్దుల్లాహ్ ఆశ్చర్యపోతూ “అసలు మీరు ఎక్కడున్నారు?” అని అడిగారు.
‘స్వర్గంలో… ఇక్కడ మేము హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతున్నాం’ – ముబష్షిర్ సమాధానమిచ్చారు.
“మీరు బద్ర్ యుద్ధంలో చనిపోలేదా?” ఆత్రుతతో అడిగారు హజ్రత్ అబ్దుల్లాహ్ (రజి).
“చనిపోయాం… కాని మమ్మల్ని తిరిగి బ్రతికించటం జరిగింది. మేమిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం” అని చెప్పారు ముబష్షిర్ (రజి).
తెల్లవారాక అబ్దుల్లాహ్ అమ్ర్ తన కల గురించి దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావించగా దైవప్రవక్త (సల్లం) తను ఉహుద్ యుద్ధంలో అమరగతి నొందుతాడని సూచించారు.47
హజ్రత్ జాబిర్ (రజి) ఇలా తెలియజేశారు. మానాన్నగారి శవాన్ని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని రావటం జరిగింది. శత్రువులు ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ప్రజలు ఆయన శవాన్ని ఓ వస్త్రంలో చుట్టి దైవప్రవక్త (సల్లం) ముందు ఉంచారు. నేను ఆయన మొహం మీద ఉన్న ఆచ్ఛాదనను తొలగించబోగా, ప్రజలు నన్ను వారించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) అక్కడున్న ప్రజలను ఉద్ద్యేశించి మాట్లాడుతూ, “దైవదూతలు ఈయనకు నీడకల్పిస్తూ ఉన్నార”ని చెప్పారు.48
ఆ అమర వీరుల్లోనే ఖైసమా కూడా ఉన్నారు. ఆయన కొడుకు బద్ర్ యుద్ధంలోనే అమరగతి నొందాడు. ఉహుద్ యుద్ధానికి ముందు ఆయన దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి-
“దైవప్రవక్తా! నేను బద్ర్ యుద్ధంలో పాల్గొనలేక పోయాను. అప్పుడే నాకు యుద్ధంలో పాల్గొనాలని విపరీతమైన కోరిక ఉండేది. కాని చీటీవేస్తే అందులో నా కొడుకు పేరు వచ్చింది. అదృష్టం కొద్ది అతను బద్ర్ యుద్ధంలోనే అమరగతి నొందాడు. దైవప్రవక్తా! నేను రాత్రి కలలో మా అబ్బాయిని చూశాను. అతను మునుపటి కన్నా చాలా అందంగా కనిపించాడు. స్వర్గంలోని వృక్షాల పండ్లు తింటూ సెలయేళ్ళ ఒడ్డున తిరుగుతూ ఉన్నాడు. నాతో మాట్లాడాడు కూడా… “నాన్నా! నువ్వు కూడా రా. ఇద్దరం కలిసి ఉందాం. నా ప్రభువు నాతో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపించాడు అంటున్నాడు. దైవసాక్షి! ఇప్పుడు నాక్కూడా స్వర్గంలో అతనితోపాటు ఉండాలనిపిస్తోంది. నేను ముసలివాణ్ణయి పోయాను. ఇప్పుడు నాకు నా ప్రభువుని కలుసుకోవాలని ఉంది. కనుక స్వర్గంలో నాకు నా కొడుకు తోడు లభించాలని మీరు నా కోసం ప్రార్థించండి” అని విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లం) ఆయన కోరిక మేరకు ఆయన కోసం దేవుణ్ని ప్రార్థించగా ఆయన ఉహుద్ యుద్ధంలో వీర మరణం పొంది స్వర్గాన్నలంకరించారు.49
ఆ అమర వీరుల్లోనే అబ్దుర్రహ్మాన్ బిన్ జహష్ కూడా ఉన్నారు. యుద్ధానికి ముందు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ, “దేవా! రేపు యుద్ధభూమిలో నాకు శత్రువు ఎదురై నన్ను వధించాలి. నా పొట్ట చీల్చి ప్రేగులు బయటికి తీయాలి. ముక్కు చెవులు కోయాలి. ఆ తరువాత నేను నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు జరిగిందని అడిగితే నీ కోసమే జరిగిందని నేను చెప్పుకోగలగాలి” అన్నారు.50
ఆ అమరవీరుల్లో అమ్ర్ బిన్ జుమూహ్ కూడా ఉన్నారు. ఆయన కుంటివారు. ఆయనకు యువకులైన నలుగురు కుమారులు ఉండేవారు. వాళ్ళు ఎల్లప్పుడూ దైవప్రవక్త(సల్లం) వెంట జిహాద్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు. ఉహుద్ యుద్ధం నాడు అమ్ర్ కూడా యుద్ధానికి బయలుదేరారు. కొడుకులు ఆయన్ని వారించారు. తను యుద్ధంలో పాల్గొనకపోయినా దేవుడు మన్నిస్తాడనీ, తను ఇంట్లో కూర్చొని ఉంటే తాము యుద్ధానికి వెళ్ళివస్తామని చెప్పారు. అయినా ఆయన వినలేదు. నేరుగా దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి తన కొడుకులు తనను యుద్ధానికి రాకుండా ఆపుతున్నారని ఫిర్యాదు చేశారు. తనకు ఈ యుద్ధంలో అమరగతి నొంది తన కుంటి కాళ్ళతో స్వర్గంలో నడవాలన్న విపరీతమైన కోరిక ఉన్నదని విన్నవించుకున్నారు. ఆయన విన్నపాన్ని విని దైవప్రవక్త (సల్లం) “మీరు యుద్ధంలో పాల్గొనకపోయినా ఫర్వాలేదు. దేవుడు మీకు మినహాయింపును ప్రసాదించాడు.” అన్నారు. ఆ తరువాత ఆయన కొడుకుల వైపు తిరిగి, “ఆయన వస్తానంటే మీకు ఇబ్బంది దేనికి? బహుశా దేవుడు ఆయనకు ఈ యుద్ధంలో అమరగతి నొందే భాగ్యాన్ని వ్రాసిపెట్టాడేమో!” అని చెప్పి వారిని ఒప్పించారు.51
ఆ అమర వీరుల్లో ముస్‌అబ్ బిన్ ఉమైర్ కూడా ఉన్నారు. ఆయన ఇస్లాం స్వీకరించక ముందు రెండొందల కన్నా తక్కువ ఖరీదైన బట్టలు ఎన్నడూ తొడగలేదు. కాని ఉహుద్ యుద్ధంలో ఆయన అమరగతి నొందిన నాటికి ఆయన దగ్గర ఒక్క గొంగళి మాత్రమే ఉంది. అది ఆయన శవం మీద కప్పటానికి కూడా సరిపోలేదు. ఆ గొంగళిని ఆయన శవం తల మీద నుంచి కప్పితే కాళ్ళు బయటపడేవి. కాళ్ళ మీద నుంచి కప్పితే తల బయటపడేది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆ గొంగళిని ఆయన తల మీద నుంచి కప్పి కాళ్ళు కనపడకుండా ఇజ్ఖిర్ గడ్డితో కప్పేయమని ఆదేశించారు.52
దైవప్రవక్త (సల్లం) గారి ప్రియమైన బాబాయి పులిబిడ్డ అయిన హజ్రత్ హమ్జా (రజి) కూడా ఈ యుద్ధంలోనే అమరగతి నొందారు. శత్రువులు ఆయన్ని అతిదారుణంగా హతమార్చారు. ఆయన శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, అమానుషంగా ప్రవర్తించారు. అబూ సుఫ్యాన్ భార్య హింద్ వాటిని ఒక మాలగా కూర్చి తన మెళ్ళో వేసుకుంది. ఆయన శవం ఉదరాన్ని చీల్చి అందులో నుండి కాలేయాన్ని బయటికి తీసి నమిలింది. మింగాలనుకుంది కాని గొంతు నుండి దిగకపోవటంతో బయటికి ఊసేసింది.53
హజ్రత్ హమ్జా సోదరి సఫియ్యా ముస్లింల ఓటమి గురించి విని మదీనా నుండి యుద్ధభూమి వైపుకు బయలుదేరింది. దైవప్రవక్త (సల్లం) ఆమె కుమారుడైన జుబైర్‌ను పిలిచి తనను హమ్జా శవాన్ని చూడకుండా ఆపమని చెప్పారు. జుబైర్ ఆమెకు దైవప్రవక్త ఆదేశాన్ని వినిపించారు. దానికామె ఏ మాత్రం దిగ్భ్రాంతికి లోనుకాకుండా తనకు తన సోదరుని పరిస్థితి గురించి ముందే తెలిసిపోయిందని, కాని అది దైవమార్గంలో ఏమంత గొప్ప త్యాగం కాదని చెప్పింది. అప్పుడు దైవప్రవక్త(సల్లం) ఆమెకు తన సోదరుని శవాన్ని చూసేందుకు అనుమతినిచ్చారు. ఆమె శవం దగ్గరికి వెళ్ళి చూస్తే సోదరుడు రక్తపుమడుగులో ముక్కలు ముక్కలుగా పడివున్నాడు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమ్రింగి “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” అని చెప్పి సోదరుని మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థించింది.54
యుద్ధంలో ముస్లిం మహిళల పాత్ర
ఈ యుద్ధంలో చాలామంది ముస్లిం మహిళలు కూడా పాల్గొన్నారు. హజ్రత్ ఆయిషా మరియు అనస్ (రజి) తల్లి అయిన ఉమ్మె సులైమ్ క్షతగాత్రులకు నీళ్ళు త్రాపించేవారు. సహీహ్ బుఖారీలో హజ్రత్ అనస్ (రజి) ఇలా తెలియజేశారు. ఉహుద్ యుద్ధం నాడు ఆయిషా మరియు ఉమ్మె సులైమ్లు నీళ్ళ తిత్తుల్లో నీళ్ళు నింపుకొని తెచ్చి క్షతగాత్రులకు త్రాపించేవారు. ఆ నీళ్ళు అయిపోగానే మళ్ళీ నింపుకొని తెచ్చేవారు.55 వేరొక ఉల్లేఖనంలో హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ తల్లి ఉమ్మె సులైత్ కూడా ఇదే సేవ చేశారని ఉంది.56
అన్సార్లలో ఓ గుణమంతురాలి తండ్రి, సోదరుడు, భర్త ముగ్గురూ ఈ యుద్ధంలో మరణించారు. ఈ మరణ వార్తలు ఒకటి తరువాత ఒకటి ఆమె చెవులకు వినపడుతూ ఉన్నాయి. అయినా ఆమె ప్రతీసారి “దైవప్రవక్త (సల్లం) ఎలా ఉన్నార?”నే అడిగేది. ప్రజలు ఆమెతో దైవప్రవక్త (సల్లం) క్షేమంగానే ఉన్నారని చెప్పారు. అప్పుడు ఆమె స్వయంగా వచ్చి దైవప్రవక్త (సల్లం) ముఖారవిందాన్ని చూసి ఆయనతో, “మీరు బ్రతికి ఉంటే చాలు. మాకెన్ని కష్టాలెదురయినా ఫర్వాలేదు” అని అంది.57
ముస్లింల వైపు డెబ్భైమంది మరణించారు. వారిలో చాలావరకు అన్సార్లే. ఆ సమయంలో ముస్లింలు చాలా నిరుపేదలు. వారిదగ్గర ఆ అమరవీరుల అంత్యక్రియలు చేయటానికి చాలినంత వస్త్రం కూడా లేదు. వారి శవాలు నెత్తుటి మడుగుల్లో ముద్దలై ఉన్నాయి. అంచేత వారికి స్నానం చేయించకుండా అలాగే ఒక్కొక్క సమాధిలో ఇద్దరేసి చొప్పున ఉంచి ఖననం చేశారు. శవాన్ని సమాధిలో ఉంచేటప్పుడు వారిరువురిలో ఎక్కువగా ఖురాన్‌ను కంఠస్తం చేసివున్నవాడికి ప్రాధాన్యతనిచ్చేవారు.58 ఎనిమిది సంవత్సరాల తరువాత దైవప్రవక్త (సల్లం) ఓసారి ఆ సమాధులు ఉన్నచోటు గుండా వెళుతుండగా ఒక్కసారిగా ఆయన ఒళ్ళు జలదరించింది. ఆ సమయంలో అప్రయత్నంగానే ఆయన నోటినుండి బాధాతప్తమైన పలుకులు వెలువడ్డాయి. ఆ తరువాత ఆయన ప్రజలనుద్ద్యేశించి ఉపన్యసిస్తూ, “ముస్లింలారా! నా తదనంతరం మీరు తిరిగి బహు దైవారాధకులుగా మారిపోతారన్న భయం నాకు లేదు. కాని మీరు రాబోవు కాలంలో ప్రాపంచిక సిరిసంపదలకు దాసోహమయి పోతారని నాకు భయంగా ఉంది” అన్నారు.59
హమ్రావుల్ అసద్ వరకు శత్రువుల్ని తరిమికొట్టడం
ఇరుపక్షాలూ యుద్ధ మైదానం నుండి వెనక్కు మరలాయి. ముస్లింలు గాయాలతో నుజ్జునుజ్జయివున్నారు. కాని వారికి అబూ సుఫ్యాన్ తమల్ని ఓడిపోయినట్లుగా భావించి తిరిగి దాడిచేస్తాడేమోనని అనుమానంగా ఉంది. అందుకని దైవప్రవక్త(సల్లం) అనుచరుల్ని ఉద్ద్యేశించి, “మీలో ఎవరైనా శత్రువుల్ని వెంటాడతారా?” అని అడిగారు. ఆ మాట అన్నదే తడవుగా డెబ్బై మంది అనుచరులు దానికోసం సిద్ధమయ్యారు. వారిలో హజ్రత్ అబూబక్ర్, జుబైర్ (రజి)లు కూడా ఉన్నారు.60
శత్రువులు ఉహుద్ నుండి బయలుదేరి ‘రౌహా’ ప్రాంతానికి చేరుకున్నాక అబూ సుఫ్యాన్కు తాము తలపెట్టిన కార్యం అసంపూర్ణంగా మిగిలి పోయిందనుకొని ముస్లింలపై మళ్ళీ దాడిచేయాలనే కుట్రలు పన్నసాగాడు. కాని ఇలా జరుగుతుందని దైవప్రవక్త (సల్లం) ముందే ఊహించారు. మరుసటి దినం ఆయన ముస్లింలెవరూ అప్పుడే ఇండ్లకు తిరిగి వెళ్ళవద్దని ప్రకటించారు. ఆ తరువాత అనుచరులందరినీ వెంటబెట్టుకొని మదీనాకు ఎనిమిది మైళ్ళ దూరంలోనున్న హమ్రావుల్ అసద్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఖుజాఆ తెగ అప్పటికింకా ఇస్లాం స్వీకరించక పోయినప్పటికీ లోపాయికారీగా మాత్రం ఇస్లాం పక్షం వహిస్తూ ఉండేది. ఆ తెగ నాయకుడు మాబద్ ఖుజాయి ఓటమి వార్త విని వెంటనే దైవప్రవక్త సన్నిధికి వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి అబూ సుఫ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. అబూ సుఫ్యాన్ తాను ముస్లింలపై మళ్ళీ దాడి చేయాలను కుంటున్నానని మాబద్కు తన నిర్ణయం తెలిపాడు. అప్పుడు మాబద్ సమయస్ఫూర్తితో, దైవప్రవక్త(సల్లం) భారీ ఎత్తున యుద్ధ సామాగ్రితో ఇటువైపే వస్తున్నారని, ప్రస్తుతం ఆయన్ని ఎదుర్కోవటం తమవల్ల కాదని చెప్పాడు. దాంతో అబూ సుఫ్యాన్ భయపడి మక్కాకు పలాయనం చిత్తగించాడు.61
దైవప్రవక్త(సల్లం) మదీనాకు తిరిగి వచ్చినప్పుడు నగరమంతా శోక సముద్రంలో మునిగి ఉంది. ఆయన ఎటువైపు వెళ్ళినా ఇండ్లల్లో నుండి శోకనాదాలు వినిపిస్తున్నాయి. అందరూ తమ తమ బంధుమిత్రుల పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు, కాని హజ్రత్ హమ్జా గురించి ఎవ్వరూ ఏడ్వటం లేదు. ఇది గమనించి ఆయన బాధాతప్త హృదయంతో, “అయ్యో హమ్జా పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసేవాడే లేడా?!” అన్నారు.
ఆ మాట వినగానే అన్సార్లు ఒక్కసారిగా బావురుమన్నారు. అందరూ తమ భార్యలతో దైవప్రవక్త (సల్లం) ఇంటికి వెళ్ళి హమ్జా పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయండని చెప్పారు. వాళ్ళంతా దైవప్రవక్త (సల్లం) గృహానికి వెళ్ళి హజ్రత్ హమ్జా గురించి విలపించటం మొదలు పెట్టారు. దైవప్రవక్త (సల్లం) ఇంటికి చేరుకోగానే ఆయనకు అక్కడ ముసుగులు ధరించి ఉన్న కొంతమంది స్త్రీలు కనిపించారు. వాళ్ళంతా హజ్రత్ హమ్జా పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ విలపిస్తున్నారు. దైవప్రవక్త (సల్లం) వారికి మేలు జరగాలని దేవుణ్ణి ప్రార్థించి, ఆ తరువాత వారితో, “మీ సానుభూతికి నా ధన్యవాదాలు. మరణించిన వారి గురించి ఇలా ఏడ్వటం ధర్మసమ్మతంకాద”ని చెప్పారు.62
ముస్లింలపై దారుణ మారణకాండ
ఉహుద్ యుద్ధం తరువాత శత్రువులు ముస్లింలకు ఏ విధంగానయినా హాని తలపెట్టాలని ఎన్నో కుట్రలు పన్నారు. హి.శ. నాల్గవ యేట ఒక్కసారి ఖురైషులు అజ్ల్, ఖారా అనే తెగలకు చెందిన ఏడుగురిని మచ్చిక చేసుకొని మదీనాలో ఉన్న దైవప్రవక్త (సల్లం) దగ్గరికి పంపారు. వాళ్ళు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి తమ తెగవారు ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారని, కనుక తమకు ధర్మాన్ని బోధించటానికి కొంతమంది బోధకులు కావాలని విన్నవించుకున్నారు.63 దైవప్రవక్త (సల్లం) వాళ్ళను నమ్మి పదిమంది అనుచరుల్ని వాళ్ళవెంట పంపారు. ఆసిమ్ బిన్ సాబిత్ను వాళ్ళకు నాయకునిగా నియమించారు. మదీనా వెలుపలికి రాగానే వాళ్ళ తెగకే చెందిన రెండొందల మంది యువకులు ఆ ముస్లింలను బంధించి తీసుకెళ్ళాలని వారిని చుట్టుముట్టారు. దైవప్రవక్త అనుచరులు ఎలాగో తప్పించుకొని ఓ ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. నలువైపులా కాచుకొని నించున్న శత్రువులు క్రిందికి దిగివస్తే తమకు రక్షణ కల్పిస్తామని నమ్మబలికారు. కాని ఆసిమ్ తాను ఎన్నటికీ దైవద్రోహుల రక్షణను అంగీకరించనని తెగేసి చెప్పారు. ఆ తరువాత ఆకాశం వైపు తలెత్తి, “దేవా! ఈ వార్త దైవప్రవక్త (సల్లం)కు తెలియపరచు” అంటూ ఆ పదిమందిలో ఏడుగురు వారితో పోరాడి అక్కడికక్కడే మరణించారు.64 ఖురైషులు ఆసిమ్ శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అతని శరీరం నుండి ఏదయినా మాంసపు ముక్కను కోసుకొని రమ్మని కొంతమందిని పంపించారు. ఒక అమరగతుని శవం పట్ల దైవద్రోహులు నీచాతి నీచంగా ప్రవర్తించ బోతుంటే దేవుడు కూడా ఊరుకోలేదు. తేనెటీగలు ఆయన శవంపై తట్టెను నిర్మించుకున్నాయి. వచ్చిన వాళ్ళు అదిచూసి భయపడి పారిపోయారు.65 వారిలో ఖుబైబ్, జైద్ అనే ఇద్దరు అనుచరులు మాత్రం అవిశ్వాసుల వాగ్దానాలను నమ్మి గట్టు దిగివచ్చారు. సుఫ్యాన్ హుజలీ వాళ్ళిద్దర్నీ మక్కాకు తీసుకెళ్ళి ఖురైషులకు అమ్మేశాడు. ఖురైషులు వారిని హారిస్ బిన్ ఆమిర్ ఇంట్లో కొన్ని రోజులపాటు తిండి, నీళ్ళు ఇవ్వకుండా ఖైదు చేశారు. ఒకరోజు హారిస్ పిల్లవాడు ఆడుకుంటూ ఖుబైబ్ దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఆయన దగ్గర కత్తి ఉంది. ఆయన ఆ చంటోణ్ణి ఆప్యాయంగా తన తొడలపై కూర్చోబెట్టుకున్నారు. ఆ పిల్లవాడి తల్లి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా భయపడిపోయింది. తన పిల్లవాడు, తాము కొన్నిరోజుల నుండి తిండి నీళ్ళు ఇవ్వకుండా బంధించి ఉంచిన ఖైదీ దగ్గర ఉన్నాడు. అదీగాక ఆ ఖైదీ దగ్గర కత్తి కూడా ఉంది. అది చూసి ఆమె భయంతో గట్టిగా కేకవేసింది. అప్పుడు ఖుబైబ్ (రజి) ఆమెను సముదాయిస్తూ, “నేను నీ పిల్లవాణ్ణి చంపుతాననుకున్నావా? ముస్లింలు ఎవరికీ ద్రోహం తలపెట్టే వారుకారని నీకు తెలియదా?” అని అన్నారు.
దుర్మార్గులైన ఖురైషులు కొన్ని రోజుల తరువాత హజ్రత్ ఖుబైబ్‌ను శిలువ వేయటానికి తీసుకెళ్ళారు. శిలువ దగ్గర నించోబెట్టి ఇస్లాం ధర్మాన్ని వదలిపెడితేనే తనను ప్రాణాలతో వదలిపెడతామని హెచ్చరించారు. కాని దానికి వారిరువురు అనుచరులు ఇస్లామే లేకపోతే ఇక తాము బ్రతికి ఉండి ఏం లాభమని సమాధానమిచ్చారు.
ఖురైషులు వారిని తమ చివరి కోరిక ఏమిటని అడిగారు. ఖుబైబ్ తమకు రెండు రకాతుల నమాజ్ చేసుకునే అవకాశం కల్పించమన్నారు. ఖురైషులు దానికి సమ్మతించారు. ఖుబైబ్ నమాజ్ ముగించుకున్న తరువాత ఖురైషులను ఉద్ద్యేశించి, “నేను సాధారణంగా సుదీర్ఘంగా నమాజ్ చేస్తాను. కాని ఖుబైబ్ ప్రాణభయంతో ఎక్కువసేపు నమాజ్ చేస్తున్నాడని మీరంటారనే నమాజ్ తొందరగా ముగించాను” అన్నారు. చివరికి ఆ నిర్దయులు వారిరువుర్నీ శిలువనెక్కించారు. ఆ తరువాత కొంతమంది బరిసెలు తీసుకొని వాటి మొనలతో వారి శరీరాలను పొడవసాగారు.66
కాని అల్లాహు అక్బర్! ఏమి సహనం! ఏమి స్థయిర్యం!! పరలోక ముక్తిపట్ల వారికి ఎంత విశ్వాసం!!! అన్ని చిత్రహింసలు పెట్టినా వారి నోటినుండి చిన్న మూలుగు కూడా వినపడలేదు.
ఓ పాషాణ హృదయుడు ఖుబైబ్ గుండెను గాయపరుస్తూ, “ఇప్పుడు చెప్పు. నీకు ఈ బాధ తప్పిపోయి, ముహమ్మద్ ఇందులో చిక్కుకుంటే బావుంటుంది కదూ!” అన్నాడు. ఆ మాట వినగానే ఖుబైబ్ ఉద్రేకం కట్టలు త్రెంచుకుంది.
“నేను బ్రతికి బయటపడటానికి ముహమ్మద్ (సల్లం) కాలిలో ముల్లు గ్రుచ్చుకున్నా దాన్ని నేను సహించలేను” అన్నారు.67
జనం చుట్టూతా నించొని ఏదో తమాషా జరుగుతున్నట్లు ఆత్రంగా చూస్తున్నారు. కరగని కసాయి గుండెల ఖురైషులు ఆయన్ని శిలువనెక్కించబోతుండగా ఆయన ఆ సమయంలో హృదయాన్ని ద్రవింపజేసేటటువంటి గేయం పాడారు. ఆ గేయంలో ఆయన ఆ హృదయవిదారక సన్నివేశాన్ని చిత్రిస్తూ, ఇస్లాం పట్ల తనకున్న విశ్వాసాన్ని, ప్రగాఢ అభిమానాన్ని వెలిబుచ్చారు.
“జనం తండోపతండాలుగా వచ్చి నా చుట్టూ చేరుతున్నారు. ఖురైషులు తమ వాళ్ళందర్నీ పిలుచుకున్నారు. వీళ్ళందరూ తమ క్రోధాన్ని వెళ్ళగ్రక్కుతున్నారు. నామీద ఆగ్రహావేశాలు కురిపిస్తున్నారు. నేను ఈ మరణాస్పదంలో బంధింపబడి ఉన్నాను. తెగలవాళ్ళు తమ స్త్రీలను, పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చారు. నన్ను గట్టి ఎత్తైన ఓ కొయ్యదగ్గరికి తీసుకొచ్చారు. దైవవిరోధాన్ని అవలంబిస్తే నన్ను విడిచి పెడతారట! కాని దాని కంటే నాకు చావే సులువు. నా కళ్ళనుండి కన్నీళ్లు సెలయేళ్ళై ప్రవహిస్తున్నాయి. అయినా నేను సహనాన్ని కోల్పోలేదు. నేను శత్రువుల్ని ప్రాధేయపడను, ఏడ్చిగగ్గోలూ పెట్టను. చావు గురించి నేను భయపడటం లేదు. దొంతరలు, దొంతరలుగా వచ్చి రక్తం పీల్చే నరకాగ్నికి నేను భయపడుతున్నాను. మహోన్నత పీఠాధిపతి అయిన ఆ ప్రభువు నన్ను తన కార్యం కోసం ఎన్నుకొని సహనం వహించమని పురమాయించాడు. ఈ దుర్మార్గులు నా మాంసం నుజ్జు నుజ్జయ్యేలా చితకబాదారు. ఇక నాకు బ్రతుకుతానన్న నమ్మకమూ లేదు. నేను నా దైన్యాన్ని, నిస్సహాయతను గురించి, వీళ్ళ దుష్ట ఆలోచనల గురించి దైవానికి ఫిర్యాదు చేసుకుంటున్నాను. దైవసాక్షి! నేను ఇస్లాం కోసం ప్రాణాలర్పిస్తున్నప్పుడు ఎటువైపు తూలినా, ఎలా చంపబడినా నాకు ఫర్వాలేదు. దేవుడు తలిస్తే ఈ మాంసంలోని ప్రతి ముక్కకూ శుభం ప్రసాదిస్తాడని నాకు దృఢ నమ్మకముంది.68
చివరగా ఆయన ఈ విధంగా ప్రార్థించారు.
“దేవా! మేము నీ ప్రవక్త ఆదేశాల్ని వీళ్ళకు చేరవేశాము. ఇక నీవు మా పరిస్థితిని గురించి నీ ప్రవక్తకు తెలియజేయి”69
హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా ఉన్నప్పుడు సాద్ బిన్ ఆమిర్ ఆయన దగ్గర గవర్నరుగా పనిచేశారు. ఆయన ఒక్కోసారి అనుకోకుండా స్పృహతప్పి పడిపోయేవారు. తమరు ఇలా పడిపోవటానికి కారణమేమిటని హజ్రత్ ఉమర్ (రజి) ఆయన్ని అడిగారు. దానికాయన సమాధానమిస్తూ…
“దైవసాక్షి! నాకెలాంటి రోగం లేదు. ఇది నాకు పుట్టుకతో వచ్చిన వ్యాధికూడా కాదు. నిజం ఏమిటంటే ఖుబైబ్‌ను శిలువ నెక్కిస్తున్నప్పుడు ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. ఆ సమయంలో ఆయన అన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా స్పృహ తప్పి పడిపోతుంటాను” అన్నారు.70
అబూ బరా ఆమిర్ కూడా ముస్లింలను ఇలాగే మోసం చేశాడు. అతడు దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి నజద్ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు సత్యాన్ని, ధర్మాన్ని బోధించటానికి కొంతమంది బోధకులు కావాలని అడిగాడు. అతని భ్రాతృజుడు నజద్ ప్రాంతానికి నాయకుడు. ఆమిర్ ఇస్లాం బోధకులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశాడు. దైవప్రవక్త (సల్లం) అతని మాటల్ని నమ్మి ముంజిర్ బిన్ అమ్ర్ అన్సారీతోపాటు డెబ్భైమంది పేరెన్నికగన్న ఖురాన్ పండితుల్ని అతని వెంట పంపారు. వాళ్ళందరూ బనూ ఆమిర్ ప్రాంతంలోని మవూనా అనే బావి దగ్గరికి చేరుకున్నాక అక్కడినుంచి హరామ్ బిన్ మిల్హాన్ అనే ఆయనకు దైవప్రవక్త ఉత్తరమిచ్చి తుఫైల్ అనే రాజు దగ్గరికి రాయబారం పంపారు. కాని రాజు ఆ రాయబారిని చంపించాడు. జబ్బార్ బిన్ సలమా అనేవాడు రాజు అనుజ్ఞ మేరకు ఆయన్ని వెనుక నుండి బరిసెతో పొడవగా అది గుండె బయటికొచ్చింది. దాంతో ఆయన “కాబా గృహదైవం సాక్షి! నా జీవితం ధన్యమయింద”ంటూ అక్కడికక్కడే నేల కొరిగి ప్రాణాలు విడిచారు.
ఆయన అన్న మాటకు ఆ హంతకుడు ఎంతగానో ప్రభావితుడయ్యాడు. దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించి ముస్లిం అయిపోయాడు. అక్కడి రాజు మిగిలిన ముస్లింలందర్నీ కూడా చంపించాడు. ఒక్క కాబ్ బిన్ జైద్ మాత్రం మరణించిన వారి ఆయుధాల చాటున దాక్కొని ఎలాగో బ్రతికి బయటపడ్డారు. తరువాత ఆయనే దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి ఆయనకు ఈ సంఘటన గురించి తెలియజేశారు.71
బనూ నజీర్ తెగ బహిష్కరణ
పూర్వకాలంలో ఇస్రాయీల్ సంతతివారైన యూదులు గొప్ప పవిత్రమైన, పునీతమైన జాతిగా పరిగణించబడేవారు. కాని రానురాను ధర్మానికి, సన్మార్గానికి దూరమై దైవాగ్రహానికి పాత్రులయ్యారు.
హజ్రత్ ఈసా లాంటి దయార్ద్రహృదయులు కూడా వారి ఆగడాలకు, దుశ్చేష్టలకు విసిగిపోయి వారిని సర్పము (షైతాన్) సంతానముగా అభివర్ణించారు. అంతేకాదు… రానున్న కాలంలో ప్రపంచ ఆధిపత్యం యూదుల చేతులనుండి జారి వేరొక జాతికి సంక్రమిస్తుందనీ, వాళ్ళు ఆ ఆధిపత్యం సాయంతో గొప్ప ప్రయోజనాలను సాధిస్తారని కూడా చెప్పారు.
హజ్రత్ ఈసా ప్రవక్త చెప్పిన భవిష్యవాణి సాకారమయ్యే సమయం ఆసన్నమయి అన్నిచోట్లా ముహమ్మద్ (సల్లం)గారి దివ్య సందేశం ప్రతిధ్వనిస్తుండటంతో యూదులు కలవరపడ్డారు. ఆఖరికి వారు ఇంతకుముందు ఈసా ప్రవక్తపై అత్యాచారం చేసినట్లుగానే ముహమ్మద్ (సల్లం)కు కూడా ముప్పుతిప్పలు పెట్టాలని నిశ్చయించుకున్నారు.72
దైవప్రవక్త (సల్లం) మదీనాకు వలసవచ్చిన తొలియేటనే యూదులు ముస్లింలతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాని అనతికాలంలోనే వారి నీచబుద్ధి బయటపడింది. ఒప్పందం కుదిరి ఒకటిన్నర సంవత్సరం గడిచిందో లేదో అప్పుడే సంఘ విద్రోహక చర్యలకు పాల్పడసాగారు. దైవప్రవక్త (సల్లం), ముస్లింలు బద్ర్ యుద్ధానికి వెళ్ళివున్న రోజుల్లో జరిగిన సంఘటన- ఒక ముస్లిం స్త్రీ బనూఖైనుఖా వీధికి పాలు అమ్ముకోవటానికి వెళ్ళింది. కొంతమంది ఆకతాయి యూదులు ఆమెను నడివీధిలోనే వివస్త్రను చేశారు. ఆమె బిగ్గరగా కేకలు పెట్టి అరవడంతో ఒక ముస్లిం అక్కడికి పరుగెత్తుకొనివచ్చి ఆ పాడుపనికి ఒడిగట్టిన యూదుణ్ణి ఆవేశంలో హత్యచేశాడు. అప్పుడు యూదులందరూ ఏకమై ఆ ముస్లింను హత్యచేయటమే గాకుండా పెద్ద విధ్వంసాన్ని సృష్టించారు. దైవప్రవక్త (సల్లం) బద్ర్ యుద్ధం నుండి తిరిగొచ్చిన తరువాత ఆ విధ్వంసాన్ని గురించి యూదుల్ని సంజాయిషీ అడగటానికి పిలిచారు. వాళ్ళు దైవప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి నిరాకరించటమేగాకుండా ఒప్పంద పత్రాన్ని త్రిప్పి పంపి యుద్ధానికి సిద్ధమయ్యారు.73
ఈ విధంగా వారు తిరుగుబాటు ధోరణులను అనుసరించటంతో దైవప్రవక్త (సల్లం) వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించారు. అంతకుముందే ఒకసారి మక్కా ఖురైషులు దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యమని మదీనాలోని బహుదైవారాధకులకు ఉత్తరం వ్రాసిపంపారు. కాని దైవప్రవక్త (సల్లం) అప్పుడే యుక్తితో వారి పథకాల్ని నీరుగార్చారు. ఇప్పుడు బద్ర్యుద్ధంలో ఓటమికి గురయ్యాక మళ్ళీ, ‘మీ దగ్గరకోటలు, లెక్కలేనన్ని ఆస్తీ అంతస్తులున్నాయి. కనుక మీరు ముహమ్మద్‌కు వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి. మీరు గనక యుద్ధం చేయకపోతే మేము మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. మీ జాతి స్త్రీల కాళ్ళకుండే మువ్వల్ని కూడా వదలి పెట్టకుండా దోచుకుంటాం’ అని యూదుల్ని బెదిరిస్తూ ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం అందుకున్నాక బనూనజీర్ తెగవారు ముస్లింలతో తాము ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని భగ్నం చేసి దైవప్రవక్త (సల్లం)కు ద్రోహం చెయ్యాలని నిశ్చయించుకున్నారు.74
హి.శ. నాల్గో యేట జరిగిన సంఘటన
దైవప్రవక్త (సల్లం) కొన్ని జాతీయ ప్రయోజనాల నిమిత్తం విరాళాలు సేకరించే ఉద్దేశ్యంతో బనూనజీర్ వీధికి వెళ్ళారు. ఆ తెగవాళ్ళు దైవప్రవక్త (సల్లం)ను ఓ గోడ ప్రక్కన కూర్చోబెట్టారు. ఆ తరువాత ఇబ్నె జహాష్ అనేవాడ్ని గోడపైకెళ్ళి ఒక పెద్ద రాతిబండను దైవప్రవక్త (సల్లం) మీదకు దొర్లించమని పంపించారు.
దైవప్రవక్త (సల్లం)కు యూదులు పన్నిన కుట్ర గురించి ‘వహీ’ ద్వారా తెలిసిపోయింది. దైవకృపవల్ల వెంటనే ఆయన అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోయారు.75
ఆఖరికి బనూ నజీర్ తెగవారి చేష్టలతో విసుగెత్తి పోయి ముస్లింలు వారిని మదీనా నగరం నుండి బహిష్కరించారు. దాంతో వాళ్ళు తమ సామగ్రి అంతా ఆరొందల ఒంటెలపై మోపి తమ ఇండ్లను తమ చేతులతోనే ధ్వంసం చేసుకొని మేళతాళాలతో ఖైబర్ ప్రాంతానికి చేరుకొని అక్కడే స్థిరపడిపోయారు.76
ఫుట్నోట్లు
- 1జాదుల్ మఆద్ మూడవ సంపుటి 194వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 64వ పుట.
- 2తారీఖె తబ్రీ మూడవ సంపుటి 61వ పుట. సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 30వ పుట. సీరత్ ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 66వ పుట.
- 3తారీఖె తబ్రీ మూడవ సంపుటి 61, 62 వ పుటలు.
- 4సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 5తారీఖె తబ్రీ మూడవ సంపుటి 62, 63 వ పుటలు.
- 6సీరత్ ఇబ్నెకసీర్ మూడవ సంపుటి 31వ పుట. సీరత్ ఇబ్నెహిషామ్ 27, 28 పుటలు. హాకిమ్ ఈ కవితల్ని తన “ముస్తద్రక్” గ్రంథంలో పేర్కొన్నారు.
- 7ముస్నదె అహ్మద్ నాల్గో సంపుటి 46వ పుట. ముస్తద్రక్ హాకిమ్ రెండవ సంపుటి 107, 108 పుటలు.
- 8తారీఖె తబ్రీ మూడవ సంపుటి 63వ పుట.
- 9సీరత్ ఇబ్నెహిషామ్ మూడవ సంపుటి 34వ పుట. రెండవ సంపుటి 74వ పుట.
- 10తారీఖె తబ్రీ మూడవ సంపుటి 64వ పుట.
- 11ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 256వ పుట. తారీఖె తబ్రీ మూడవ సంపుటి 63వ పుట. సీరత్ ఇబ్నెకసీర్ మూడవ సంపుటి 30, 31 పుటలు
- 12సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 13సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 34వ పుట.
- 14సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 43వ పుట, తబ్రీ మూడవ సంపుటి 65వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 78వ పుట.
- 15ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 225వ పుట. తబ్రీ మూడవ సంపుటి 69వ పుట.
- 16సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 17తబ్రీ మూడవ సంపుటి 63వ పుట, సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 78వ పుట.
- 18తబ్రీ మూడవ సంపుటి 66వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 73వ పుట.
- 19సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 20జాదుల్ మఆద్ మూడవ సంపుటి 197వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 80వ పుట.
- 21తబ్రీ మూడవ సంపుటి 68వ పుట.
- 22సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 23సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 61వ పుట.
- 24తబ్రీ మూడవ సంపుటి 67వ పుట. సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 68వ పుట.
- 25ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 417వ పుట.
- 26తబ్రీ మూడవ సంపుటి 66వ పుట.
- 27సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
- 28సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 29సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
- 30ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 348వ పుట. సీరత్ ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 83వ పుట.
- 31సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 32సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 33తబ్రీ మూడవ సంపుటి 65, 66 పుటలు. సీరత్ ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 81వ పుట.
- 34సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 35సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 67వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 81, 82 పుటలు.
- 36తబ్రీ మూడవ సంపుటి 67వ పుట. సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 69వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 84వ పుట.
- 37ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 29వ పుట.
- 38ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 65వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 80వ పుట.
- 39సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
- 40ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 28వ పుట.
- 41జాదుల్ మఆద్ మూడవ సంపుటి 197వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ ఏడవ సంపుటి 86, 87 పుటలు.
- 42రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 111వ పుట. ఖాజీ అయాజ్ గారి షిఫా గ్రంథ సౌజన్యంతో 47వ పుట.
- 43సీరత్ ఇబ్నె కసీర్ మూడవ సంపుటి 45వ పుట.
- 44సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 45ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 221 వ పుట.
- 46ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 30వ పుట. ముస్నదె అహ్మద్ ఐదవ సంపుటి 428, 429 పుటలు.
- 47ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 225వ పుట.
- 48సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 49జాదుల్ మఆద్ మూడవ సంపుటి 208వ పుట.
- 50అసదుల్ గాబా మూడవ సంపుటి 91వ పుట. జాదుల్ మఆద్ మూడవ సంపుటి 208వ పుట.
- 51ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 226వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 90వ పుట.
- 52సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 53సీరత్ ఇబ్నె కసీర్ మూడో సంపుటి 74వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 91వ పుట.
- 54ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 218వ పుట. తారీఖె తబ్రీ మూడో సంపుటి 72వ పుట
- 55సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 56సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 57సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 99వ పుట. సీరత్ ఇబ్నె కసీర్ మూడో సంపుటి 93వ పుట. తబ్రీ మూడో సంపుటి 74వ పుట.
- 58సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 59సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 60సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 61ముస్నదె అహ్మద్ రెండవ సంపుటి 84వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 100నుండి 104 పుటలు.
- 62ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 215 వ పుట. ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 99వ పుట.
- 63తబఖాత్ ఇబ్నెసాద్ రెండో సంపుటి 50వ పుట.
- 64సహీహ్ బుఖారీలో యుద్ధాల ప్రకరణం.
- 65సీరత్ ఇబ్నెహిషామ్ రెండవ సంపుటి 171వ పుట.
- 66సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 67జాదుల్ మఆద్ మూడవ సంపుటి 245 పుట
- 68జాదుల్ మఆద్ మూడో సంపుటి 245 వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 176వ పుట
- 69సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 173వ పుట.
- 70సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 173వ పుట.
- 71సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సీరత్ ఇబ్నె హిషామ్ 184వ పుట రెండవ సంపుటి.
- 72రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 129, 130 పుట
- 73సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 74సుననె అబూదావూద్
- 75సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 190వ పుట
- 76ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్ ఐదో సంపుటి 358వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 191,192 పుటలు.