పదవ అధ్యాయం
హునైన్ పోరాటం
మక్కా విజయం తరువాత అరబ్బు తెగలన్నీ తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించసాగాయి.1 కాని హవాజిన్, సఖీఫ్ తెగలపై ఏ మాత్రం ప్రభావం పడలేదు. ఈ తెగలవారు యుద్ధాలలో ఆరితేరినవారు. పోరాటపటిమ చూపగలవారు. ఇస్లాం ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఈ రెండు తెగలవారిలో అసహనం పెరిగి పోతుండేది. ఎందుకంటే నానాటికీ అరేబియాలో వాటికున్న వైశిష్ట్యం కాస్తా క్షీణించసాగింది. అందుకే మక్కా విజయానికి పూర్వమే హవాజిన్ తెగనాయకులు ఓ మారు అరేబియా ప్రాంతమంతా సందర్శించి ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రజలకు నూరిపోశారు. సర్వత్రా విద్వేష బీజాలు నాటారు. దాదాపు ఓ ఏడాదికాలం వారి ఈ నకారాత్మక జన జాగరణ ఉద్యమం నడిచింది. అరబ్బులంతా కలసి ఒక్కుమ్మడిగా ముస్లింలపై దండెత్తాలని అప్పటికే వారంతా ఒక అవగాహనకు వచ్చారు. కాని మక్కా విజయం తరువాత వారంతా దిక్కుతోచని స్థితికి లోనయ్యారు. ముస్లింలను గనక ఈ తరుణంలో అణచి వేయకపోతే, ఇక ఎన్నడూ వారిని ఎదిరించలేమని సఖీఫ్ సర్దారులకు అర్ధమై పోయింది.2
మహాప్రవక్త (సఅసం) మక్కా నుంచి పయనమవుతుండగా, ఆయన సరాసరి వారిపైకే దండెత్తి వస్తున్నట్లు పుకార్లు పుట్టాయి. ఇక ఆలస్యం చేయటం లేదని వారంతా కూడబలుక్కుని సకల సన్నాహాలతో తామే ముందుగా దాడి చేయటానికి నిశ్చయించుకున్నారు. వారి ఆవేశం పరాకాష్టకు చేరింది. వారి తెగలు, ఉపతెగలన్నీ కదలివచ్చాయి. పిల్లాజల్లా అంతా కదన రంగానికి కాలు దువ్వుతూ ముందుకు సాగారు.3 రణరంగంలో ఆలుబిడ్డలుంటే వారి ప్రాణాలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలొడ్డి పోరాడతారన్నది వారి రణనీతి.4
ఈ యుద్ధంలో సఖీఫ్ హవాజిన్ తెగలన్నీ పాల్గొన్నప్పటికీ కాబ్, కలాబ్ అనే తెగలవారు మాత్రం తటస్థంగా ఉండి పోయారు. సైనిక సారథ్యం కోసం ఇరువురు వ్యక్తుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. వారిలో మాలిక్ బిన్ ఔఫ్ హవాజిన్ తెగలో సుప్రసిద్ధ సర్దారు. రెండవ వ్యక్తి దురైద్ బిన్ సిమ్మ. ఇతను అరేబియాలోని అగ్రశ్రేణి కవులలో ఒకడు. జషమ్ అనే తెగకు సర్దారు. అతని కవితల్ని, సాహసోపేతమైన గాథల్ని గురించి ఇప్పటికీ అరబ్బులు చెప్పుకుంటూ ఉంటారు. కాని అతను సేనానిగా ఎన్నికయ్యేనాటికి నూరేళ్ళు దాటాయి. శారీరక సత్తువ పూర్తిగా క్షీణించింది. అయితే అరబ్బులకు అతనంటే అపారమైన గౌరవాభిమానాలుండటం వల్లనూ, అతని రణనీతిపై అందరికీ చెక్కుచెదరని విశ్వాసం ఉండటం వల్లనూ సారథ్య బాధ్యతలు అతనికే కట్టబెట్టారు. మాలిక్ బిన్ఔఫ్ సయితం అతన్ని ప్రాధేయపడ్డాడు. అతను విశ్రమించే మంచాన్ని ఎత్తుకుని యుద్ధరంగానికి వచ్చారు. “మనం ఇప్పుడు ఏ ప్రాంతానికి వచ్చాము?” అని అతనడిగాడు. “ఔతాస్” అని అందరూ బదులిచ్చారు. “ఇక్కడే ఆగిపోండి. ఈ ప్రదేశం ప్రతిఘటనకు సర్వవిధాలా అనువైనది. ఇక్కడి నేల మరీ గట్టిగానూ ఉండదు. కాళ్లు దిగబడేలా మరీ మెత్తగానూ ఉండదు” అని తన అనుభవాన్నంతా రంగరించి చెప్పాడు ఆ వృద్ధనాయకుడు. “ఇక్కడ చిన్న పిల్లల ఏడ్పులు వినిపిస్తున్నాయేమిటీ?” మళ్ళీ ప్రశ్నించాడు. “పసిపిల్లల్ని, స్త్రీలను కూడా వెంటబెట్టుకొచ్చాం. నిలకడగా పోరాడాలన్న ఉద్దేశ్యంతోనే ఆలుబిడ్డల్ని తీసుకువచ్చాము” -అన్నారంతా. “రణరంగంలో నిలకడకు తోడ్పడేవి ఖడ్గాలు, ఆయుధాలే సుమా! మిగతావేమీ మీ పాదాలను నిలదొక్కుకోనివ్వవు. దురదృష్టవశాత్తూ ఓడిపోతే అది మన మహిళల, పసివాళ్ళ పాలిట అత్యంత అవమానకరంగా పరిణమిస్తుంది. ఆ సంగతిని బాగా అర్థం చేసుకోండి” అంటూ తన వారిని అప్రమత్తం చేశాడు ఆ ముదుసలి నాయకుడు.
“కాబ్, కలాబ్లు కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారా?” తీవ్రంగా ఆలోచించుకుంటూ అడిగాడు మళ్ళీ. పాల్గొనటంలేదని తెలిసింది. ఈ దినం మన కోసం సుదినమే అయి ఉంటే ఆ తెగల వారు పాల్గొనకుండా ఉండేవారు కారు అన్నాడు. బహిరంగప్రదేశంలో ఉండి పోరాడటం కన్నా ఏదైనా సురక్షిత స్థావరాన్ని ఎన్నుకుని గెరిల్లా తరహా యుద్ధం చేయాలన్నది ఆ వృద్ధుని అభిప్రాయం. కాని మాలిక్ బిన్ ఔఫ్ యువకుడు. అతనిలో ఉత్సాహం, పరువం ఉరకలు వేస్తోంది. గెరిల్లా తరహా పోరాటానికి అతను సుముఖంగా లేడు. పైగా, వేధ ముకుళించుకు పోయిన ముసలివాళ్ళ మాట వింటే తమ సంగతి యిక అంతేనని హెచ్చరించాడు.5
హవాజిన్, బనీసఖీఫ్, యుద్ధ సన్నాహాల గురించి దైవప్రవక్త (సఅసం)కు చూచాయగా తెలిసింది. నిజానిజాలను తెలుసుకోవడానికి ఆయన (స) అబ్దుల్లా బిన్ ఉబై హద్రద్ని పంపించారు. ఆయన గూఢచారిగా హునైన్కు వచ్చి, సైనికరంగంలో జొరబడి పరిస్థితులన్నీ బేరీజు వేశారు.6 తప్పనిసరి పరిస్థితుల్లో మహాప్రవక్త (స) యుద్ధానికి సిద్ధం కావలసి వచ్చింది. ఆయుధ సామగ్రి కోసం రుణం తీసుకోవలసి వచ్చింది. అబ్దుల్లా బిన్ రబీయ అప్పట్లో అతిపెద్ద ధనికులు. ఆయన ఈ యుద్ధం కోసం 30 వేల దిర్హములు అప్పుగా ఇచ్చారు.7 సుఫ్వాన్ బిన్ ఉమయ్యా మక్కాలో మరో ముఖ్య నాయకుడు. అతిథి మర్యాదలో అగ్రజుడు. కాని అప్పటి వరకూ అతనింకా ఇస్లాం స్వీకరించలేదు. ఆయుధ సామగ్రి ఇవ్వమని మహాప్రవక్త (సఅసం) అతన్ని కోరారు. అతడు పెద్ద మనసుతో వంద యుద్ధ కవచాలతో పాటు మరికొంత సామగ్రిని కూడా సమకూర్చాడు.8 ఎట్టకేలకు హిజ్రీ 8 యేట షవ్వాల్ మాసంలో (క్రీ.శ. 630 జనవరిలో) 12 వేల మంది ముస్లిం సైనికులు సమరోత్సాహంతో హునైన్ వైపుకు సాగిపోయారు. అందరినోటా ఒక్కటే మాట “ఈ రోజు మనల్ని ఎదుర్కొనే మొనగాడు ఎవడో చూద్దాం” అని! అయితే వారి ఈ ధోరణి దైవానికి ఏ మాత్రం నచ్చలేదు.9
మొదట్లో ముస్లింలదే పైచేయి అయింది. దాంతో వారు యుద్ధప్రాప్తి వైపుకు ఎగబడ్డారు. ఈ అవకాశం కోసమే పొంచి ఉన్న శత్రుసైనికులు ఎడతెగకుండా బాణాల వర్షం కురిపించారు. అనూహ్యమైన ఈ పరిణామానికి ముస్లిం సైనిక పంక్తుల్లో గందరగోళం ఏర్పడింది. కలకలం రేగింది.10
ఆ యుద్ధంలో పాల్గొన్న సహాబీలలో హజ్రత్ అబూ ఖాతాదా ఒకరు. పరిస్థితుల తీవ్ర స్వరూపాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు: సైనికులు దిక్కుతోచక అటూ యిటూ పరుగెత్త సాగారు. ఆ సమయంలో ఒక అవిశ్వాసి ఒక ముస్లిం ఛాతీపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు నేను విసిరిన ఆయుధం అతని కవచాన్ని ఛేదించుకుంటూ వీపులో దిగబడింది. అయినాసరే అతడు వెను తిరిగి నన్ను గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఆ సమయంలో నా ప్రాణం పోయినంత పనయింది. కాని దైవవశాత్తు అంతలోనే అతను కుప్పకూలిపోయాడు. ఆ సమయంలోనే హజ్రత్ ఉమర్ (రజి) కనిపించారు. మనవాళ్ల పరిస్థితి ఎలా ఉంది? అని అడిగాను. “దైవేచ్ఛ ఇదే కాబోలు” అని ఆయన బదులిచ్చారు.11
ఓటమికి కారణాలు
ఈ యుద్ధంలో ముస్లింల ఓటమికి పెక్కు కారణాలున్నాయి. హజ్రత్ ఖాలిద్(రజి) సారథ్యంలో వచ్చిన సైనికుల్లో చాలామంది మక్కా యువకులు. వారు అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించి ఉన్నారు. తాము నవయువకులమన్న మితిమీరిన విశ్వాసం వల్ల చాలామంది ఆయుధాల్లేకుండానే వచ్చారు. సైనికుల్లో అప్పటికీ ఇస్లాం స్వీకరించని వారు రెండు వేల మంది వరకూ ఉన్నారు.
అదే సమయంలో హవాజిన్ తెగవారు యుద్ధ కాముకులు. వారు ప్రదర్శించే విలువిద్య ముందు అరబ్బులెవరూ నిలదొక్కుకోలేరు. రణరంగంలో వారు ప్రయోగించే ఒక్క బాణం కూడా వృథాపోదు. అదీగాక అవిశ్వాసులు చాలా ముందుగా రణరంగానికి వచ్చి తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకున్నారు. విలుకాండ్రు పర్వత కనుమల్లోనూ, గుట్టల మాటున మొహరించి గెరిల్లా యుద్ధం చేశారు.12
వారు కురిపించే బాణాల వర్షం ముందు 12 వేలమంది సైన్యం వెలవలబోయింది. కాని అత్యంత క్లిష్టమైన ఆ తరుణంలో ఒక మూర్తిమంతుడు కదలని కొండలా కదన రంగంలో నిలబడి ఉన్నాడు. అతను స్వయాన ఒక సైనిక పటాలంలా, మొక్కవోని వీరునిలా, ఒక సామ్రాజ్యంలా, ఒక మహాజ్ఞానిలా, బహుముఖ ప్రజ్ఞాశాలిలా, విశ్వనాయకునిలా కానవస్తున్నాడు.13
దైవప్రవక్త (స) కుడివైపుకు తిరిగి పలాయనం చిత్తగిస్తున్న వారి నుద్దేశ్యించి, “ఓ అన్సార్ వర్గీయులారా!” అని ఎలుగెత్తి పిలిచారు. “మేము హాజరయ్యాము” అన్న జవాబు ప్రతిధ్వనించింది. ఎడమవైపుకు తిరిగి మళ్ళీ పిలిచారు. ఈసారి కూడా అదే సమాధానం! వెంటనే ఆయన (సఅసం) వాహనం నుంచి దిగి ఒక దైవప్రవక్తగా తన సహజశైలిలో నినదించారు. “నేను దేవుని దాసుడను. దైవప్రవక్తను.”14
బుఖారీలోని మరో ఉల్లేఖనం ప్రకారం ఆయన(స) నోట ఈ పలుకులు పదే పదే వెలువడ్డాయి.
“నేను దైవప్రవక్తను. నేను చెబుతున్నది అబద్ధం కాదు.
నేను అబ్దుల్ ముత్తలిబ్ బిడ్డను”.15
హజ్రత్ అబ్బాస్ (రజి) ది కంచుకంఠం. ముహాజిర్, అన్సార్ వర్గీయులను కేకేసి పిలువవలసిందిగా ఆయన (స) అబ్బాస్‌ను పురమాయించారు. అప్పుడు హజ్రత్ అబ్బాస్, వాళ్ళనుద్దేశించి,
ఓ అన్సార్ వర్గీయులారా!
ఓ బైతె రిజ్వాన్ వారలారా!!
అంటూ బిగ్గరగా కేకేశారు. ఈ పిలుపు వినబడగానే తిరోన్ముఖులై వెళ్ళిపోతున్న సైనికులంతా మరలివచ్చారు. అనూహ్యమైన ఈ పరిణామానికి కొన్ని గుఱ్ఱాలు బెదిరిపోయినాయి. కాని సైనికులు ప్రవక్త పిలుపును అందుకుని గుర్రాలను దూకి వచ్చేశారు. దాంతో రణరంగ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.16 అవిశ్వాసులు పలాయనం చిత్తగించసాగారు. మరికొంతమంది బందీలయ్యారు. సఖీఫ్ తెగకు చెందిన ఒక ఉపతెగ బనూ మాలిక్. ఈ తెగవారు కడదాకా పోరాడారు. కాని 70 మంది సైనికుల్ని కోల్పోయారు. తమ నాయకుడైన ఉస్మాన్ బిన్ అబ్దుల్లాహ్ మరణించటంతో బనూ మాలిక్ సయితం యుద్ధరంగంలో నిలదొక్కుకోలేకపోయింది.17
పరాజయం పాలైన సైన్యం చెల్లాచెదురైపోయింది. కొంతమంది ఔతాస్లో పోగయ్యారు. మరి కొంతమంది తాయఫ్ పట్టణానికి వెళ్ళి శరణు పొందారు. సైన్యాధిపతి అయిన మాలిక్ బిన్ ఔఫ్ కూడా ఈ బృందంలో ఉన్నాడు.
దురైద్ బిన్ సిమ్మ కొన్ని వేల మందిని వెంటబెట్టుకుని ఔతాస్కు వచ్చాడు. వారిని ప్రతిఘటించడానికి దైవప్రవక్త (స) ఒక సైనిక దళాన్ని అబూఆమిర్ అష్అరీ నేతృత్వంలో అక్కడికి పంపించారు. కాని దురైద్ కొడుకు చేతిలో అబూఆమిర్ అమరగతి నొందారు. దాంతో ఇస్లాం ధ్వజం అతని చేతికి చిక్కింది. ఈ పరిస్థితిని చూచిన హజ్రత్ అబూమూసా అష్అరీ (రజి) ఓర్చుకోలేక ఒక్క ఉదుటున శత్రువుపై లంఘించి, అతన్ని తుదముట్టించారు. ఆ విధంగా ఇస్లాం ధ్వజాన్ని తన హస్తగతం చేసుకున్నారు.18
యుద్ధఖైదీలుగా పట్టుబడిన వారు వేలసంఖ్యలో ఉన్నారు. వారిలో షీమా అనే మహిళ కూడా ఉంది. ఆమె దైవప్రవక్త (స)కు పాలవరుస సోదరి అవుతుంది. సైనికులు ఆమెను నిర్బంధించినప్పుడు “ఏమిటీ, మీరు పైగాంబరు సోదరిని బంధిస్తున్నారా?” అని ఆమె ప్రశ్నించింది. నిజనిర్ధారణ కోసం సైనికులు ఆమెను దైవప్రవక్త (స) సమక్షంలో హాజరుపరచారు. అప్పుడామె తన వీపును చూపిస్తూ, చిన్నప్పుడు దైవప్రవక్త (స) తనను కొరికిన సంఘటనను గుర్తు చేసింది. అనురాగంతోనూ, ఆనందంతోనూ దైవప్రవక్త (సఅసం) కళ్లు చెమ్మగిల్లాయి. ఆమెను కూర్చోబెట్టడానికి తాను స్వయంగా చాపవరచారు. ప్రేమతో పలకరించారు. ఆమెకు కుశల ప్రశ్నలు వేశారు. కొన్ని మేకలను, నిప్పు కోళ్ళను ఆమెకు కానుకగా యిచ్చారు. ఆమె తలచుకుంటే తమతో ఉండవచ్చనీ, లేదంటే ఆమెను స్వస్థలానికి పంపిస్తానని చెప్పారు. తన వాళ్లపట్ల గల ప్రేమతో ఆమె తన స్వస్థలానికి వెళ్ళడానికే సుముఖత వ్యక్తం చేసింది. అప్పుడామెను గౌరవ మర్యాదలతో ఆమె ఇంటికి పంపించారు దైవప్రవక్త (సఅసం).19
హునైన్లో చావుతప్పి కన్నులొట్టపోయిన మిగతా శత్రుసైన్యం తాయఫ్ నగరానికి వెళ్ళి తలదాచుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ప్రతీకార భావంతో వారు మళ్లీ యుద్ధసన్నాహాలు మొదలెట్టారు. తాయఫ్ సర్వవిధాలా సురక్షిత స్థానం. ఆ నగరానికి నలువైపులనుంచీ రక్షణ నిమిత్తం ప్రహరీ గోడలుండటం వల్ల కూడా దానిని ‘తాయఫ్’ అనే పేరు వచ్చింది. అక్కడ నివసించే సఖీఫ్ తెగ అరేబియాలోకెల్లా గొప్ప శూరుల తెగగా -వినుతి కెక్కింది. ఖురైషులతో సమ ఉజ్జీ అనదగ్గ అర్హతలు ఈ తెగవారిలో ఉన్నాయి. సఖీఫ్ తెగ నాయకుడైన ఉర్వ బిన్ మసూద్ అబూసుఫ్యాన్కి అల్లుడవుతాడు. దివ్యఖుర్ఆనే గనక ఆకాశం నుంచి అవతరించే పక్షంలో మక్కా సర్దారులపైననో, తాయఫ్ సర్దారులపైననో అవతరించేది అని మక్కా అవిశ్వాసులు వ్యాఖ్యానించేవారు. యుద్ధతంత్రాల్లో కూడా బనూసఖీఫ్ది అందెవేసిన చేయి.20 ఉర్వబిన్ మసూద్, గీలాన్ బిన్ సలమ వంటి నాయకులు యమన్లోని ‘జర్ష్’ జిల్లాకు వెళ్ళి కోటలను కూల్చే, క్షిపణుల్లాంటి ఆయుధాలను ప్రయోగించే ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారని తబ్రీ, ఇబ్నె ఇస్హాఖ్లు పేర్కొన్నారు.21
అక్కడ ఒక సురక్షితమైన కోట ఉండేది. తాయఫ్వాసులు, ఓటమి పొందిన సైనికులు కలసి ఆ కోటను మరమ్మత్తు చేశారు. ఒక ఏడాది కాలానికి సరిపడా ఆహార పదార్థాలను, ఇతరత్రా వనరులను సమకూర్చుకున్నారు. కోటకు నలువైపులా అగ్ని గోళాలతో కూడుకున్న అస్త్రాలను, విలుకాండ్రను మోహరించారు.22
హునైన్లో లభించిన విజయసొత్తును, యుద్ధఖైదీలను సురక్షితంగా ఉంచమని దైవప్రవక్త (స) ఆదేశించి, తాయఫ్ వైపుకు పురోగమించాలని నిశ్చయించుకున్నారు. సేనాధిపతిగా హజ్రత్ ఖాలిద్ (రజి) ముందుగానే అక్కడికి పంపబడ్డారు. కోట ముట్టడించబడింది. ఈ రకమయిన ముట్టడి జరగటం ఇస్లామీయ చరిత్రలో అదే మొట్టమొదటిసారి. కోటలో తలదాచుకున్న నగరవాసులు కొలిమిలో కాల్చబడిన ఇనుప చువ్వలను సైనికులపై విసిరారు. ఎడతెగకుండా కోటపైనుంచి వారు కురిపించిన బాణవర్షానికి ముస్లిం సైనికులు నిలదొక్కుకోలేకపోయారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఈ ముట్టడి 20 రోజులదాకా సాగింది. అయినప్పటికీ కోట వారి వశం కాలేకపోయింది.23 దైవప్రవక్త (సఅసం) నౌఫిల్ బిన్ ము ఆవియాను పిలిచి, “ఏం చేద్దాం?” అని అడిగారు. “నక్క గుహలోకి దూరింది. ప్రయత్నిస్తే ఆలస్యంగానయినా చేజిక్కుతుంది. వదలివేసినా వచ్చే నష్టం ఏమీలేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే. ముట్టడిని ఉపసంహరించుకోమని దైవప్రవక్త (స) ఆజ్ఞాపించారు. “దైవప్రవక్తా! వీళ్లను శపించండి” అని సహచరులు ఆగ్రహంతో కోరారు.
“దేవా! సఖీఫ్ తెగవారికి సన్మార్గం చూపు. వారు నాకు దగ్గరయ్యే సద్బుద్ధిని వొసగు”
అని దైవప్రవక్త (సఅసం) ఎంతో ఆర్ద్రతతో ప్రార్థించారు.
కోట ముట్టడిని ఉపసంహరించుకున్న తరువాత ఆయన(స) ‘యుద్ధప్రాప్తి’ని నిలువ ఉంచిన “జియ్యిర్రాన” స్థలానికి వచ్చారు. యుద్ధప్రాప్తి కుప్పతెప్పలుగా పడి ఉంది. 6 వేల మంది యుద్ధఖైదీలు, 24 వేల ఒంటెలు, 40 వేల గొఱ్ఱెలు, 4 వేల ఊఖియాల వెండి ఆ యుద్ధ ప్రాప్తిలో ఉన్నాయి. యుద్ధఖైదీల విషయంలో ఆయన (స) వెంటనే ఒక నిర్ణయానికి రాలేదు. ఖైదీల సంబంధీకులు ఎవరయినావస్తే, వారితో చర్చించి తదనుగుణంగా వ్యవహారం చేయాలన్నది ఆయన (స) అభిమతం. కాని ఎన్నో రోజులు ఎదురు చూసినా ఎవరూ రాలేదు. యుద్ధప్రాప్తి 5 భాగాలుగా విభజించబడింది. అందులో 4 భాగాలను నియమానుసారం సైనికుల మధ్య పంచిపెట్టారు. 5వ భాగం బైతుల్మాల్ కోసం, అగత్యపరులకోసం నిలువ ఉంచబడింది.
అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన మక్కా సర్దారులు కొంతమంది ఉన్నారు. ధర్మావలంబన విషయంలో వారింకా పరిపక్వతను పొందలేదు. విశ్వాస(ఈమాన్) బీజం వారి మనోక్షేత్రంలో యింకా బలంగా నాటుకోలేదు. దివ్యఖుర్ఆన్ అటువంటి వారిని “ముఅల్లఫతుల్ ఖులూబ్” (మనసులు జయించబడినవారు)గా అభివర్ణించింది. ఖుర్ఆన్లో ‘మాలె గనీమత్’ (యుద్ధప్రాప్తి) ప్రస్తావన వచ్చిన చోటల్లా సాధారణంగా ఈ వర్గం ప్రస్తావన కూడా వస్తుంది. దైవప్రవక్త (సఅసం) వారు పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నవ ముస్లింలకు ఉదారంగా కానుకలు ఇచ్చారు.24
ఈ విధంగా కానుకలు అధికంగా పొందిన వారిలో మక్కావాసులు, కొత్తగా ఇస్లాం స్వీకరించినవారూ ఉన్నారు. దీంతో అన్సారుల మనసు నొచ్చుకుంది. “దైవప్రవక్త (స) ఖురైషులపై కానుకల వర్షం కురిపించి, మాకేమో శూన్యహస్తం చూపించారు” అని కొంతమంది చెప్పుకున్నారు కూడా. “కష్టకాలంలోనయితే మేము గుర్తుకు వస్తాం. కష్టాలు తీరాక కానుకలు మాత్రం మరొకరికి ముడుతాయి” అని మరికొంతమంది వాపోయారు.
ఈ మాటలు దైవప్రవక్త (స) దాకా వెళ్ళాయి. ఆయన ఎంతో వ్యాకులతకు లోనయ్యారు. అన్సారులను పిలిపించారు. జనులు కూర్చోవడానికి ఒక పందిరి వేయించారు.
దైవప్రవక్త (స) అన్సారులను ఉద్దేశ్యించి, “ఏమిటీ? మీరు నా గురించి చెప్పుకుంటున్న ఈ మాటలు నిజమేనా?” అని అడిగారు.
“దైవప్రవక్తా! మాలోని పెద్దలు, అనుభవజ్ఞులు ఎవరూ అలా అనలేదు. యువకులు కొందరు ఈ మేరకు వ్యాఖ్యానించారు” అని బదులిచ్చారు.
సహీహ్ బుఖారీలో అన్సారుల గొప్పదనాన్ని గురించి వివరించే అధ్యాయంలో హజ్రత్ అనస్ ఉల్లేఖనం ఇలా ఉంది: దైవప్రవక్త (సఅసం) అన్సారు సోదరులను పిలిపించి, “మీ గురించి ఏమేమో వింటున్నాను. అసలు సంగతేమిటి?” అని విచారించారు. అన్సారులు సత్యసంధులు. వారెన్నడూ అబద్ధం చెప్పలేదు. అందుకే ముక్తసరిగా, “తమరు వినేది నిజమే” అని సమాధానమిచ్చారు.25
అప్పుడాయన (సఅసం) అన్సారు సోదరులనుద్దేశించి ప్రసంగించారు. మానవ చరిత్రలోనే ఎంతో అపురూపమైన, అనుపమమైన ప్రసంగం అది!
ఆయన అన్సారుల వైపు తిరిగి, “ఒకప్పుడు మీరు మార్గవిహీనతకు లోనై ఉండేవారు. దేవుడు నా ద్వారా మీకు రుజుమార్గం చూపిన విషయం నిజం కాదా? మీరు చెల్లాచెదురై ఉండేవారు. ఒండొకరి పట్ల శత్రువులుగా మసలుకునేవారు. దేవుడు నా ద్వారా మీ మధ్య ఐకమత్యాన్ని, సుహృద్భావాన్నీ సృజించిన సంగతి సత్యం కాదా? మీరు దుర్భర దారిద్ర్యానికి లేమికి లోనై ఉండేవారు. దేవుడు నా ద్వారా మీకు సిరిసంపదలను, కలిమిని ప్రసాదించలేదా?”
ఈ విధంగా దైవప్రవక్త (స) వేసిన ప్రతి ప్రశ్నకూ అన్సారులు “ఔననీ, నిజమనీ” జవాబు ఇస్తూ పోయారు. “దేవుడు మరియు దైవప్రవక్త (స) తమకు చేసిన ఉపకారం అన్నింటికన్నా గొప్పది” అని ఒప్పుకున్నారు.
ఉన్నట్టుండి సీను అకస్మాత్తుగా మారిపోయింది.
“లేదు. మీరు చెప్పేది నిజం కాదు”- అన్నారు దైవప్రవక్త (స) అందరూ అవాక్కయి ఆయన(స) వంక చూడసాగారు.
“మీరు ఇవ్వవలసిన సమాధానం ఇది కాదు. నిజానికి మీరు ఇలా అనాల్సింది. ‘ఓ ముహమ్మద్(స)! జనులు మిమ్మల్ని ధిక్కరించినపుడు మేము మిమ్మల్ని నిజప్రవక్తగా ధృవీకరించాము. మీవాళ్లు మిమ్మల్ని దూరం చేసినప్పుడు మేము మీకు ఆశ్రయమిచ్చాము. మీరు కడు నిస్సహాయ స్థితిలో మా దగ్గరకు వచ్చారు. మేము మీకు ఆదరువుగా నిలిచాము. మీ సందేశ కార్యక్రమానికి తోడ్పాటునందించాము…” అని మీరు చెబుతూపోండి. ‘అవును,నిజమే’ అని నేను ధృవీకరిస్తూ పోతాను.
అప్పటికే అన్సారుల గుండెలు కరిగి ప్రవహించ సాగాయి. దైవప్రవక్త (సఅసం)గారి కరుణా రసం పొంగిపొరలుతూనే ఉంది.
“కాని అన్సారు సోదరులారా! మీరే చెప్పండి. జనులు ఒంటెల్ని, గొఱ్ఱెల్ని వెంటబెట్టుకుని తమ ఇళ్ళకు సాగిపోగా, మీరు దైవప్రవక్త (స)ను మీ ఇళ్ళకు గొనిపోవటం మీకు సమ్మతం కాదా?!”
అంతే! అన్సారులు ఇక తమ భావోద్రేకాలను అదుపు చేసుకోలేకపోయారు. “మాకు ముహమ్మద్ (సఅసం) చాలు. మరేమీ అక్కరలేదు” అంటూ ముక్తకంఠంతో నినదించారు అన్సారులు. ఎంతోమంది బోరున విలపించారు. వారి గడ్డాలు కన్నీటితో తడిసి పోయాయి.
ఇప్పుడు వారిని సముదాయించటం దైవప్రవక్త (స) పనయింది. “మక్కా వాసులు ఇప్పుడిప్పుడే ఇస్లాం స్వీకరించారు. నేను వారికి వారి హక్కును ఇవ్వలేదు. వారి మనసులను జయించే వ్యవహారం మాత్రమే వారితో జరిపాను”26 అని అన్సారులను ఓదార్చారు.
హునైన్లో పట్టుబడిన యుద్ధఖైదీలు ‘జయ్యిర్రాన’లో ఉన్నారు. ఖైదీలను విడుదల చేయాలంటూ ఓ ప్రముఖుల దౌత్యబృందం దైవప్రవక్త (స) వద్దకు వచ్చింది. వారెవరోకాదు, దైవప్రవక్త (స)కు బాల్యంలో పాలుత్రాపిన హజ్రత్ హలీమా తెగవారే. తెగనాయకుడు ఈ సందర్భంగా ఉపన్యసించాడు. అతను దైవప్రవక్తనుద్దేశించి, “ఇప్పుడు మీ వద్ద బందీలుగా ఉన్న మహిళలలో మీ మేనత్తలు, మీ పినతల్లులు కూడా ఉన్నారు. దైవసాక్షి! అరబ్బు పరిపాలకులలో ఎవరు మా మహిళల పాలు త్రాగి ఉన్నా వారిపట్ల మేము ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాం. ఇక తమరి విషయంలోనయితే మాకు మరిన్ని ఆశలు ఉన్నాయి” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సఅసం) ఇలా స్పందించారు: “అబ్దుల్ ముత్తలిబ్ కుటుంబానికి ఎంత భాగం వస్తుందో అదంతా మీదేననుకోండి. అయితే యుద్ధఖైదీల విడుదల కోసం కొన్ని నిబంధనలను పాటించటం అవసరం కదా! అందుకే నమాజు అనంతరం, అక్కడ సమావేశమై ఉన్న జనులందరి సమక్షంలో విజ్ఞప్తి చేసుకోండి.”
జుహ్ర్ నమాజు అనంతరం ఆ దౌత్యబృందం ముస్లింలందరినీ ఉద్దేశించి అభ్యర్థన చేసుకుంది. దానికి సమాధానంగా దైవప్రవక్త (సఅసం), “నాకు నా కుటుంబీకులపై మాత్రమే అధికారం ఉంది. అయితే ముస్లిములందరినీ నేను సిఫారసు మాత్రం చేయగలను” అన్నారు. ‘అయితే మా భాగం కూడా మేము సమర్పించుకుంటున్నాం’ అని అన్సారులు, ముహాజీర్లు ముందుకొచ్చారు. ఈ విధంగా 6 వేలమంది యుద్ధఖైదీలు ఒక్కసారిగా విడుదల అయ్యారు.27
ఫుట్నోట్లు
- 1సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజి
- 2సీరతున్నబీ – అల్లామా షిబ్లీనూమానీ-మొదటి సంపుటి, పేజీ 530, 531.
- 3ముస్తద్రక్ హాకిమ్-3:51
- 4సీరతున్నబీ – 1: 531
- 5జాదుల్ మఆద్ – 3:466, సీరత్ ఇబ్నె హిషామ్-2:338, 339
- 6ముస్తద్రక్ హాకిమ్-3:51, ఇబ్నెహిషామ్-2:440.
- 7సీరతున్నబీ-1:533.
- 8సుననె బైహఖీ-6:89. సుననె అబూ దావూద్-కితాబుల్ బుయూ.
- 9సీరత్ ఇబ్నె హిషామ్-2:444.
- 10సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుల్ హునైన్.
- 11సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుల్ హునైన్.
- 12సీరతున్నబీ – 1: 535.
- 13సీరతున్నబీ – 1: 535, 538. ఇమామ్ నవవీగారు ముస్లిం వ్యాఖ్యానంలో ఓటమి వెనుక కారణాలు కొన్నింటికి విశదీకరించారు.
- 14సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుత్తాయఫ్.
- 15సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుత్తాయఫ్.
- 16సహీహ్ ముస్లిం: కితాబుల్ జిహాద్.
- 17ఇబ్నె హిషామ్-2:449, 450.
- 18ఇబ్నె హిషామ్-2:453, సహీహ్ బుఖారీ:బాబు గజ్వతుల్ ఔతాస్.
- 19ఇబ్నె హిషామ్-2:458, తబ్రీ-2:171.
- 20సీరతున్నబీ-1:541, తారీఖె తబ్రీ-2:171
- 21ఇబ్నె హిషామ్-2:478
- 22తబఖాత్ ఇబ్నెసాద్-2:158.
- 23సీరత్ ఇబ్నె హిషామ్-2:482, 483, తబఖాత్ ఇబ్నె సాద్-2:158.
- 24దలాయలున్నబవ-5:171, ఇబ్నెహిషామ్-2: 489, సీరతున్నబీ-1:542, 543. సహీహైన్‌లో కూడా ఈ ప్రస్తావన ఉంది.
- 25సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుత్తాయఫ్
- 26సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వతుత్తాయఫ్…
- 27తారీఖె తబ్రీ-2:173, ఇబ్నె హిషామ్-2:488, 489