మానవ మహోపకారి (స)

రచయిత గురించి

మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మలై) · 1914–1999

మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మలై) 20వ శతాబ్దపు ఇస్లామీయ విద్వాంసుల్లో ప్రముఖులు. గొప్ప తత్త్వవేత్త. అరబీ, ఉర్దూ భాషల్లో అసామాన్య పాండిత్యం కలిగిన రచయిత. మౌలానాగారు 1914వ సంవత్సరం రాయ్‌బరేలీలోని ఓ ధార్మిక కుటుంబంలో జన్మించారు. ఈయన పూర్వీకులు 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నవారు. బ్రిటిషు సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన, యావత్తు భారతజాతి గర్వించదగ్గ ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడు సయ్యిద్ అహ్మద్ షహీద్ (రహ్మలై) ఈయన వంశంవారే.

మౌలానా అబుల్ హసన్‌గారికి చిన్నప్పటి నుంచే అరబీభాష మీద, సాహిత్యం మీద వల్లమాలిన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే ఆయన్ని ఇస్లామీయ పరిజ్ఞానం పట్ల ఆకర్షితుణ్ణి చేసింది. 1934వ సంవత్సరంలో ఆయన తన 20వ యేట నద్వతుల్ ఉలమా కళాశాలలో ఖురాన్ వ్యాఖ్యాన (తఫ్‌సీర్) ఉపాధ్యాయుడిగా ఇస్లాం ధర్మ సేవా కార్యక్రమానికి నడుం బిగించారు. ఎన్నో గ్రంథాలు రాశారు. లెక్కకు మించి ఉపన్యాసాలు ఇచ్చారు.

1966-1983 మధ్య కాలంలో ఆయన ముస్లిం దేశాలలో ఇస్లాం విద్య పరిస్థితి, ముస్లిం దేశాలమీద పాశ్చాత్య సంస్కృతి ప్రభావం గురించి వివరిస్తూ, ముస్లిం దేశాలలో ఇస్లామీయ విద్యా జాగృతిని, ఆధునిక విద్యా ప్రాముఖ్యతను నొక్కి వక్కాణిస్తూ అరబీ భాషలో అనేక పుస్తకాలు రచించారు. అదే సమయంలో భారతదేశ ముస్లిం ప్రజానీకానికి ప్రతినిధిగా, ప్రభుత్వానికి-ముస్లిం ప్రజానీకానికి మధ్య వారధిగా ఉండి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ముస్లిం-ముస్లిమేతరుల మధ్య అంతరాల అగాధాలను పూడ్చటానికి, భారతదేశ సంస్కృతిమీద ఇస్లాం మరియు ముస్లింల ప్రభావాన్ని చాటి చెప్పటానికి, ఇస్లాం మతగురువులు, రాజులు, విజేతలు భారతజాతికి ఏక దైవారాధన, సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, స్త్రీల పట్ల గౌరవం, సమన్యాయ పాలన లాంటి ఎన్నో అపురూపమైన కానుకలు ఇవ్వటమేగాకుండా వారు భారతదేశాన్ని తమ స్వంత దేశంగా భావించారనే విషయం ప్రతి భారతీయుడికీ తెలియపరచటం కోసం ఆయన తన వ్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా ఎంతగానో కృషి చేశారు.

ఇస్లాం కోసం ఏడు దశాబ్దాల పాటు నిర్విరామంగా కృషి చేసిన ఆ మహానుభావుడు 1999 డిసెంబరు 31వ తేది, హి.శ. 1421 రమజాన్ మాసం 25వ తేది శుక్రవారం నాడు జుమా నమాజుకు ముందు ఆనవాయితీ ప్రకారం దివ్యఖురాన్ పారాయణం చేస్తూ ఇహలోకం వీడిపోయారు. దేవుడు ఆయన మీద శాంతికారుణ్యాలు కురిపించుగాక! ఆమీన్.