మానవ మహోపకారి (స)

గ్రంథ పరిచయం

బిలాల్ అబ్దుల్ హై హసనీ నద్వీ

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, ముహమ్మదిన్ వ ఆలిహీ వసహ్‌బిహీ అజ్‌మయీన్ అమ్మా బాద్:

ఈ రోజు దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రకు సంబంధించిన ఒక గ్రంథాన్ని వెలువరించే మహాభాగ్యానికి నోచుకున్నందుకు నా శిరస్సు కృతజ్ఞతా పూర్వకంగా దైవ సన్నిధిలో మోకరిల్లుతున్నది. అధరాలు దైవ ప్రశంసా గీతాల్ని ఆలాపిస్తున్నాయి. ఆ పరమ ప్రభువును ఎంత స్తుతించినా తక్కువే. ఈ గ్రంథం దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఓ మహనీయునిచే విరచితమై ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు ధర్మప్రచార సమావేశాల్లో పఠించబడుతూ ఉండేది. కాని ఇటీవల వరకు ప్రచురణ భాగ్యానికి నోచుకోలేక పోయింది.

నేటికి పది సంవత్సరాల క్రితం గురువర్యులు హజ్రత్ మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మలై) గారు తనకు పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిన గ్రంథ సంపదను తరచి చూస్తున్నప్పుడు ఆయనకు ముసాయిదా రూపంలో ఉన్న ఈ పుస్తకం కనిపించింది. ఆ సందర్భంలో ఆయన మాకు ఈ గ్రంథ నేపథ్యం గురించి వివరించారు. లక్నోలోని ధర్మసందేశ ప్రచార కేంద్ర మస్జిద్‌లో ఉన్నప్పుడు ఆయనకు ధార్మిక సమావేశాల్లో చదివి వినిపించటానికి అనువైన గ్రంథ మొకటి రచించాలన్న ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఆయన షిబ్లీ నోమానీ గారి ‘సీరతున్నబీ’1 గ్రంథాన్ని, ఖాజీ సులైమాన్ గారి ‘రహ్మతుల్లిల్ ఆలమీన్’ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకాన్ని రచించారు. ధర్మసందేశ ప్రదాతలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వారి హృదయాలను భక్తి విశ్వాసాల్లో ఓలలాడించాలన్న ఉద్దేశంతో మహాప్రవక్త (సల్లం) జీవిత చరిత్రలోని ప్రభావవంతమైన సంఘటనలన్నీ ఏర్చి కూర్చి ఈ పుస్తకాన్ని రచించారాయన.

ఆయన ఈ పుస్తక నేపథ్యం గురించి చెప్పినప్పుడే అనిపించింది నాకు, దీన్ని ఎలాగైనా ప్రచురించాల్సిందేనని! కాని ఆయన ముందు ఆ కోరికను వెలిబుచ్చటానికి ధైర్యం చాల్లేదు నాకు. కాని దైవ నిర్ణయానికయితే తిరుగుండదు కదా!

మౌలానాగారు రమజాన్ మాసంలో షాహ్ అలముల్లాహ్ తకియా కలాన్ ప్రాంతంలో విడిది చేసేవారు. ఆయన ఆత్మీయులు, సన్నిహితులు కొందరు రమజాన్ మాసంలో ప్రశాంతంగా దైవారాధన చేసుకునే ఉద్దేశంతో ఆయన సాంగత్యంలో ఉండేవారు. వారి శిక్షణ నిమిత్తం బోధనా సమావేశాలు కూడా నిర్వహించబడేవి. ఆ సమావేశాల్లో పలు రకాల ధార్మిక గ్రంథాలు చదివి వినిపించబడేవి. రెండు సంవత్సరాల క్రితం పినతండ్రి తుల్యులు హజ్రత్ మౌలానా సయ్యిద్ రాబే నద్వీ గారు దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రకు సంబంధించిన క్లుప్తమైన పుస్తక మొకటి వెలువడాలని అభిప్రాయ పడ్డారు. వెంటనే నాకు ఈ పుస్తకం సంగతి గుర్తొచ్చింది. అప్పటి వరకు ఈ పుస్తకం ముసాయిదా రూపంలోనే ఉంది. సోదరులు మౌలానా అబ్దుల్లాహ్ హసనీ నద్వీ గారు కూడా ముసాయిదాను ఒకసారి స్థూలంగా పరిశీలించి ఈ పుస్తకం తప్పకుండా వెలువడాలన్నారు. ఆ తర్వాత పుస్తకంపై పరిశోధన మొదలయింది. కొంతకాలానికి ఈ పుస్తకాన్ని చదివిన వారందరూ దీన్ని ప్రచురించాలని కోరటం మొదలు పెట్టారు. గురువర్యుల్ని పుస్తక ప్రచురణ కోసం అనుమతి కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. పైగా దాని కూర్పు, పరిశోధనా బాధ్యతలు నా పైనే మోపారు.

ఈ పుస్తకం విషయంలో ఎదురైన ఇంకో సమస్య ఏమిటంటే, ఇందులో మధ్యలోని కొన్ని పుటలు లుప్తమయి ఉన్నాయి. ముఖ్యంగా దైవప్రవక్త (సల్లం) మరణ సంఘటన ఇందులో అసలు లేనే లేదు. కాని దైవకృప వల్ల ఎలాగో ఈ పుస్తకాన్ని ఆసాంతం పరిశోధించాను. ప్రామాణికమైన హదీసు గ్రంథాల ఆధారాలు దొరికితే వాటిని కూడా పొందుపరిచాను. షిబ్లీ గారి ‘సీరతున్నబీ’ గ్రంథాన్ని, గురువర్యుల విరచితమైన ‘నబీయె రహ్మత్’ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని లుప్తమయిన భాగాన్ని కూడా పూర్తి చేశాను. శీర్షికలు ‘నబీయె రహ్మత్’ను అనుసరించే పెట్టాను. దైవ కృప వల్ల ఇప్పుడు ఈ గ్రంథం సర్వాంగ సిద్ధమై పాఠకుల ముందుకు వచ్చేసింది. దేవుడు ఈ కృతిని స్వీకరించు గాక! దీనికి విస్తృత ప్రచారాన్ని కల్పించు గాక! ముక్తి, మన్నింపులకు సాధనంగా చేయు గాక!

ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరమనుకుంటున్నాను. ఇది దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రపై సంక్షిప్తంగా, ప్రభావవంతంగా రచించబడిన పుస్తకం. సామాన్య ప్రజానీకానికి ఈ గ్రంథం చాలా ఉపయోగ పడగలదని ఆశిస్తున్నాం. దీన్ని మస్జిదుల్లో, ధార్మిక సమావేశాల్లో జనసామాన్యానికి చదివి వినిపించటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రను విపులంగా అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులు, పరిశోధకుల కోసం స్వయంగా ఈ పుస్తక రచయిత గారే ‘అస్సీరతున్నబవియ్యా’ అనే పేరుతో ఓ ఉద్గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో ఆయన దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రకు సంబంధించి ఇతర రచయితలెవరూ స్పృశించ లేకపోయిన సరిక్రొత్త కోణాల్ని స్పృశించారు. పాశ్చాత్య మూల గ్రంథాల వెలుగులో అజ్ఞాన కాలపు ప్రపంచ పరిస్థితుల్ని కూలంకషంగా వివరించారు. పితృలు మౌలానా సయ్యిద్ ముహమ్మదుల్ హసనీ (రహ్మలై) గారు దాన్ని ఉర్దూ భాషలోకి తర్జుమా కూడా చేశారు. ‘నబీయె రహ్మత్’ అనే పేరుతో ఆ గ్రంథం పాఠక లోకంలో బహుళ ప్రచారం పొందింది. విభిన్న భాషల్లోకి అనువదించబడి ప్రచురణకు కూడా నోచుకుంది.

చివరగా నేను ఈ పుస్తకాన్ని వెలువరించటంలో సహాయ పడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పినతండ్రి సమానులు మౌలానా సయ్యిద్ ముహమ్మద్ రాబే హసనీ నద్వీగారు ఈ పుస్తకానికి పీఠిక వ్రాసి నన్ను ప్రోత్సహించారు.

ప్రియతములు మౌల్వీ ముఖ్తార్ అహ్మద్ నద్వీ గారు వ్రాతపనిలో, ఈ పుస్తకాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయటంలో నాకు ఎంతగానో సహకరించారు. మౌలానా ముహమ్మద్ రిజ్వాన్ నద్వీగారు పుస్తకం ప్రచురణ దశకు చేరుకున్నప్పుడు ఎనలేని తోడ్పాటు నందించారు. అల్లాహ్ వారందరికీ సత్ఫలితాన్ని ప్రసాదించు గాక! ఈ కృషిని అంగీకరించి పరలోకంలో మా కోసం దీని పుణ్యాన్ని నిక్షేపంగా ఉంచు గాక!

‘వమా తౌఫీఖీ ఇల్లా బిల్లాహ్, అలైహి తవక్కల్తు వ ఇలైహి ఉనీబ్ వలహుల్ హమ్దు వల్ మిన్నహ్, వ సల్లల్లాహు తఆలా అలా ఖైరి ఖల్ఖిహీ ముహమ్మదిన్ వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్.’

– బిలాల్ అబ్దుల్ హై హసనీ నద్వీదారె అర్ఫాత్ దాయ్‌రా షా అలముల్లాహ్
రాయ్‌బరేలి

ఫుట్‌నోట్‌లు

  1. 1ఈ పుస్తకంలోని చాలా భాగం ‘సీరతున్నబీ’ గ్రంథం నుండే సంగ్రహించబడింది.