మానవ మహోపకారి (స)
తొలి పలుకులు
ముహమ్మద్ రాబే హసనీ నద్వి
అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ సల్లల్లాహు తఆలా అలా రసూలిహీ ముహమ్మదిన్ వ ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్.
అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకతలను గురించి దివ్య ఖుర్ఆన్ పలు చోట్ల పలు విధాలుగా అభివర్ణించింది. ఉదాహరణకు :
“ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు.”
ఖుర్ఆన్ – జుముఅహ్ : 2
మరొక చోట ఇలా అనబడింది :
“(ఓ ముహమ్మద్!) నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీలం కలవాడవు.”
ఖుర్ఆన్ – ఖలమ్ : 4
ఇంకో చోట ఇలా సెలవీయబడింది :
“వాస్తవంగానే దేవుని ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది.”
ఖుర్ఆన్ – అహ్జాబ్ : 21
చెప్పవచ్చిందేమిటంటే ఒక విశ్వాసి కోసం దేవుని అంతిమ ప్రవక్త (సఅసం) మార్గ దర్శకులు. వెలుగు స్తంభం వంటి వారు. తన జీవన సాఫల్యం కోసం ఆయన్నుంచి వెలుగు పొందటం, ఆయన (స) అడుగు జాడలలో నడవటం, గుణగణాలలో, నీతి నడవడికలలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవటం ప్రతి ముస్లిం విద్యుక్త ధర్మం. ఈ అనుసరణలోనే అతని శ్రేయో సాఫల్యాలు ఇమిడి ఉన్నాయి. దైవప్రవక్త (సఅసం) అనుసరణలోనే విశ్వాసి విజయ రహస్యం అంతర్లీనమై ఉంది. దైవప్రవక్త (సఅసం) విధేయత పట్ల వైముఖ్యం కనబరచినవాడు లేక నిర్లక్ష్యం వహించిన వాడు సన్మార్గానికి దూరమై పోతాడు. నెలవు దప్పి మార్గ భ్రష్టతకు లోనైపోతాడు.
దైవప్రవక్త (స) పవిత్ర జీవితాన్ని ఆకళింపు చేసుకోవటానికి, ఆయన పాద చిహ్నాలలో నడచుకోవటానికి మనిషి రెండు నియమాలకు కట్టుబడి ఉండాలి. అవేమంటే (1) ఆయన (స) యెడల అచంచలమైన ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ఆయన కోసం తన సర్వస్వాన్నీ అర్పించడానికి మనిషి సిద్ధమై ఉండాలి. కేవలం నోటితో పలికి సరిపుచ్చకుండా ఆచరణలో చిత్తశుద్ధిని కనబరచాలి. ప్రవక్తగారి ప్రత్యక్ష సహచరులు తమ ప్రేమాభిమానాలను క్రియాత్మకంగా రుజువు చేశారు. ఇస్లాం కోసం వారు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టారు. కాలపు కాళ నాగులు వారిని ఉరికంభం మీదికి ఎక్కించి, “నీవు నిలబడి ఉన్నచోట ముహమ్మద్ నిలబడాలని నీవు అభిలషిస్తే నీకు ప్రాణ భిక్ష పెట్టబడుతుంది” అని ఆశ చూపారు. దానికి సమాధానంగా ఆ త్యాగధనులు, “ఆయన (స) కాలిలో ముల్లు గుచ్చుకునే షరతుపై మాకు ప్రాణ భిక్ష లభించినా అది మాకు సహించదు గాక సహించదు” అని తెగేసి చెప్పారు. హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ అన్సారీ (రజి) తమ నాయక శిఖామణి (స) కోసం చెప్పిన ఒక కవిత సారాంశం ఇది :
“నా పితామహుల, తాత ముత్తాతల మాన మర్యాదలను,
ఆఖరికి నా మాన మర్యాదలను సయితం
మహనీయ ముహమ్మద్ (స) మాన మర్యాదల
రక్షణ కోసం డాలుగా సమర్పిస్తాను.”
హోరాహోరీగా జరిగిన ఒక యుద్ధం నుంచి తిరిగి వస్తున్న సైనికుల నుద్దేశించి ఒక త్యాగమయి, “మన ప్రవక్త (సఅసం) కుశలమే కదా!” అని ప్రశ్నించింది. “అది సరే గాని నీ తండ్రి అమరగతి నొందాడు తెలుసా!” అని ఒకరు సమాధానమిచ్చారు. “మన ప్రవక్త (స) క్షేమమే కదా!” అని ఆమె రెండవసారి దర్యాప్తు చేసింది. “నీ భర్త కూడా వీర మరణం పొందాడమ్మా!” అని జవాబు వచ్చింది. “ప్రవక్త (స) గారెలా ఉన్నారో ముందు నాకు చెప్పండి” అని ఆ మహిళామణి మూడవసారి నిలదీసింది. “ఆయన (సఅసం) క్షేమంగానే ఉన్నారు” అని జవాబివ్వబడింది. దానికామె, “ఆయన (సఅసం) క్షేమంగా ఉంటే చాలు. ఆయనుంటే ఏ బాధనయినా సులభంగా జీర్ణించుకోవచ్చు” అని చెప్పింది. దైవప్రవక్త (సఅసం) యెడల ఇటువంటి నిష్కల్మషమైన అభిమానం, గౌరవశ్రద్ధలు కలిగి ఉన్న అనుయాయి మాత్రమే ఆయన (స)కు నిజమైన విధేయుడుగా రాణించగలుగుతాడు.
(2) విశ్వాసి అయినవాడు అంతిమ దైవప్రవక్త (స) గారి జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన గుణగణాలు, దైవదాసుల పట్ల ఆయనకు గల సానుభూతి, ఆయన సద్వ్యవహారం, అపకారులకు సయితం ఉపకారం చేయాలన్న ఆయన ఆరాటం, దైవప్రసన్నత కోసం ఆయన పడే తపన, మానవుల ఇహపర లోకాల సాఫల్యం కోసం ఆయన కనబరచే ఆత్రుత, నరకాగ్ని నుంచి ప్రజల్ని కాపాడటానికి ఆయన చేసే చింతన ఎటువంటివో శ్రద్ధగా పరిశీలించాలి. తోటి మానవులతో ఆయన ఎలా మెలిగేవారు, ఆలుబిడ్డల యెడల ఆయన ఎలా ప్రేమానురాగాలతో మసలుకునేవారు, అపరిచిత వ్యక్తుల పట్ల సయితం ఆయన ఎలా వ్యవహరించేవారన్న విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ప్రజలను సంస్కరించడానికి, వారి జీవితాలను తీర్చిదిద్దడానికి ఆయన అవలంబించిన విధానం ఎటువంటిది, దైవ భీతి, పరలోక భీతి ద్వారా ఆయన నైతిక విప్లవాన్ని ఎలా తీసుకు వచ్చారు, దైవాగ్రహం నుంచి మానవులను కాపాడటానికి ఆయన ఇచ్చిన ఉపమానాలేవి? ఇత్యాది విషయాలను కూడా తెలుసుకోవాలి.
ఈ రెండు సూత్రాల ద్వారానే ఒక విశ్వాసి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని, తన ‘విశ్వాసాన్ని’ నిష్కల్మషంగా ఉంచుకోగలుగుతాడు. ఈ రెండు షరతులకు కట్టుబడి ఉన్నంత కాలం అతను తన లక్ష్య సాధనలో కృతకృత్యుడై ఉంటాడు. ఈ రెండు షరతులకు కట్టుబడనివాడు గమ్యం తప్పిపోతాడు. దైవప్రవక్త (స) పవిత్ర జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట కూడా, ఆయన్ని అనుసరించకుండా ఉండటం, వట్టి మాటలతో ప్రేమాభిమానాలను వ్యక్తపరచటం ‘నిజమైన ప్రేమ’ అనిపించుకోదు.
అయితే దైవప్రవక్త (స) వారి పవిత్ర జీవితాన్ని గ్రంథాలలో వెతకటం ప్రతి ఒక్కరికీ సాధ్యమవదు. దీని కోసం వారు విద్వాంసుల ఉపన్యాసాలను వినాలి. విద్వాంసులు సంకలనం చేసిన సీరత్ పుస్తకాలను చదవాలి. ఇలాంటి పుస్తకాలలో కొన్ని చాలా లోతుగా, క్లిష్టంగా ఉంటాయి. మరికొన్ని సులభంగా, స్థూలంగా ఉంటాయి.
హజ్రత్ మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి (రహ్మలై) గారు వారం వారం జరిగే తబ్లీగీ సమావేశాలలో చదివి వినిపించే నిమిత్తం పెద్ద పెద్ద సీరతు గ్రంథాల నుంచి ప్రవక్త (స) వారి గుణగణాలను, సందేశాన్ని, సంస్కరణా పద్ధతులను, ముఖ్యమైన జీవిత ఘట్టాలను వ్యాసాల రూపంలో సంకలనం చేశారు. ఆ సంక్షిప్త భాగాల ద్వారా శ్రోతలకు ఎంతో మేలు చేకూరేది. శ్రోతల జీవితాలలో ఆశించిన పరివర్తనను తీసుకు రావటంలో, వారి విశ్వాసాన్ని ఇనుమడింప జేయటంలో ఈ భాగాలు ఎంతగానో దోహద పడ్డాయి. హజ్రత్ మౌలానా అబుల్ హసన్ అలీ నద్వి (రహ్మలై) గారు సంకలనం చేసిన ఈ సీరత్ ముసాయిదాల గురించి సయ్యిద్ బిలాల్ అబ్దుల్ హై హసనీ నద్వి గార్కి ముందు నుంచీ తెలుసు. ఆ ముసాయిదాలను ఆయన వెలికి తీసి, వాటిని కూర్చి, ప్రచురణకు తోడ్పడ్డారు. ఈ గ్రంథం మరీ లావు గానూ, మరీ చిరు పుస్తకం గానూ కాకుండా ఓ మోస్తరు గ్రంథంగా రూపుదిద్దుకుంది. సంఘటనలన్నింటి ఆధారాలివ్వబడ్డాయి. చారిత్రక ఆధారాలతో ప్రమాణబద్ధంగా తీర్చిదిద్దబడిన కృతి ఇది. ఇందులో విశ్వాస శిక్షణ, నైతిక సంస్కరణలతో పాటు దైవ భీతి, పరోపకారం, దైవ దాస్యం, మానవ సేవ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ఈ గ్రంథాన్ని ప్రజా బాహుళ్యంలోకి విస్తృత స్థాయిలో తీసుకు పోవలసిన ఆవశ్యకత ఉంది. మా వాడు (మౌల్వీ బిలాల్ హసనీ నద్వి) ఈ పుస్తకానికి తొలి పలుకులు వ్రాసే బాధ్యతను నాకప్పగించాడు. నా పరిమిత జ్ఞానంతో ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఉపక్రమించాను. కారుణ్య ప్రభువైన అల్లాహ్ ఈ కృషిని స్వీకరించు గాక! (ఆమీన్)
– ముహమ్మద్ రాబే హసనీ నద్వి(ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు)లక్నో