ఎనిమిదవ అధ్యాయం

ఖైబర్ ప్రతిఘటన

మానవ మహోపకారి (స) · మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి

మదీనా నుండి సిరియా వెళ్ళే దారిలో మూడు మజిలీల దూరాన ఉన్న ప్రాంతమే ఖైబర్. ఇది ప్రత్యేకంగా యూదుల నివాస ప్రాంతం. అక్కడ జనవాసాల చుట్టూ పటిష్టమైన కోటలు నిర్మించబడి ఉండేవి.1

దైవప్రవక్త (సల్లం) మదీనా ప్రయాణం నుండి తిరిగొచ్చిన తర్వాత కొద్దిరోజులకే ఖైబర్ యూదులు తిరిగి మదీనాపై దాడి చేయటానికి కుట్రలు పన్నుతున్నారని తెలిసింది. దానికోసం వారు బనూ గిత్‌ఫాన్ తెగకు చెందిన నాలుగువేల మంది సైనికుల్ని కూడా కలుపుకున్నారు. మదీనాపై విజయం సాధిస్తే పండిన పంటలో సగభాగం ఎల్లకాలం గిత్‌ఫాన్ తెగ వారికి ఇచ్చే షరతుపై ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది.2

ఈ యుద్ధం కోసం దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్లో “విశ్వాసులు వృక్షం క్రింద నీతో విధేయతా ప్రమాణం చేస్తున్నప్పుడు, అల్లాహ్ వారిని చూసి ఆనందించాడు.” “అల్లాహ్ మీకు అమితమైన విజయధనాల వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరు పొందుతారు” అన్న దివ్యఖురాన్ శుభవార్తను అందుకున్నవారినే ఎన్నుకున్నారు. వీళ్ళు మొత్తం పదహారు వందలమంది సైనికులు. వారిలో రెండొందలమంది రౌతులున్నారు.3

ముస్లింల సైన్యం ఖైబర్ ప్రాంతం సమీపానికి చేరుకునేసరికి చీకటిపడింది. దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట యుద్ధం ప్రారంభించేవారు కారు. చీకట్లో శత్రువులపై దాడిచేసేవారు కారు. అందుకే ముస్లిం సైన్యాలు ఖైబర్ ప్రాంతానికి వెలుపల మైదానంలోనే తమ గుడారాలు వేసుకున్నాయి.4 ఆ మైదానం ఖైబర్‌కు, బనూ గిత్‌ఫాన్ ప్రాంతానికి మధ్యలో ఉంది. ముస్లింలు అక్కడ ఆగటం ఒక విధంగా వారి మంచికే అయింది. ఎందుకంటే ఖైబర్ యూదులకు సహాయం చేద్దామని బయలుదేరిన గిత్‌ఫాన్ తెగ సైనికులకు ముస్లిం సైన్యాలు అడ్డు తగిలాయి. దాంతో వారు తోక ముడుచుకొని ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.5

దైవప్రవక్త (సల్లం) అన్నిటికన్నా ముందు ఖైబర్ కోటల వైపు దృష్టి సారించారు. ఒక్కొక్క కోటను జయిస్తూ పోయారు. ఒక కోటలో ప్రఖ్యాత యూద రౌతు అయిన మర్‌హబ్ సింహాసనం ఉండేది. ఆ కోటను హజ్రత్ అలీ (రజి) నేలమట్టం చేశారు. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్లింలు యూదుల కోటల్లోని ఒక కోటను జయించలేకపోతున్నారు. ఆ కోటపై వారికి పట్టు లభించటం లేదు. ఆ సమయంలో హజ్రత్ అలీ కళ్ళు నలతగా ఉన్నాయి. ఆ సందర్భంలోనే దైవప్రవక్త (సల్లం) “రేపు నేను యుద్ధపతాకం దేవునికి, దైవప్రవక్తకు అభిమానపాత్రుడైన వ్యక్తికి ఇస్తాను. అతని చేతుల మీదుగానే దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు” అని ప్రకటించారు. దైవప్రవక్త (సల్లం) నోట ఆ ప్రశంస వినగానే సైన్యంలోని గొప్పగొప్ప యోధులందరూ ఆ అదృష్టం తమకే దక్కాలని ఉవ్విళ్ళూరారు.

తెల్లవారిన తరువాత దైవప్రవక్త (సల్లం) “అలీ ఏడి?” అని అడిగారు. ప్రజలు ఆయన కండ్ల కలకతో బాధపడుతున్నారని చెప్పారు. అలీ ఆ కండ్ల కలకతోనే దైవప్రవక్త (సల్లం) దగ్గరకి వచ్చారు. దైవప్రవక్త (సల్లం) ఆయన కళ్ళకు తన లాలాజలాన్ని పూశారు. ఆశ్చర్యంగా ఆయన కళ్ళు నయమయిపోయాయి. కళ్ళల్లోని ఎరుపుదనం పోయింది. నొప్పి కూడా తగ్గింది. ఆ తర్వాత అలీని ఉద్దేశించి ఆయన, “అలీ! వెళ్ళు. దైవమార్గంలో పోరాడు. ముందు వారికి ఇస్లాం సందేశం వినిపించు, ఆ తర్వాతే యుద్ధం చెయ్యి, అలీ! నీ చేతుల మీదుగా ఒక్కడు ఇస్లాం స్వీకరించినా అది భారీఎత్తున లభించే విజయ ధనాల కన్నా చాలా గొప్ప భాగ్యంతో సమానం” అన్నారు.6

హజ్రత్ అలీ ముందుగా నాయిం కోటపై దాడిచేసేందుకు వ్యూహరచన చేశారు. ఆ కోటలోని ప్రముఖ నాయకుడయిన మర్‌హబ్ ఆయన్ని మార్కొనడానికి వచ్చాడు. తాను వెయ్యిమంది వీరులకు సమానుడనని అతను గొప్పలు చెప్పుకునేవాడు. అతను యుద్ధ మైదానంలోకి దిగగానే కవితాధోరణిలో ఈ విధంగా పొలికేక వేశాడు.

“నేను ఆయుధ ధారినని, వీర, శూర అనుభవశాలి
అయిన మర్‌హబ్‌నని ఖైబర్‌కు తెలుసు. నా
శౌర్యాన్ని చూస్తే ప్రజలు సొమ్మసిల్లిపోతారు.”

అతణ్ణి మార్కొనడానికి ముస్లింల తరపు నుండి ఆమిర్ బిన్ అక్వా ఇలా అంటూ బయలుదేరారు.

“ఖైబర్‌కు నా గురించి కూడా తెలుసు. నేను
ఆయుధాలు త్రిప్పటంలో ఉస్తాదును, ఘటికుడను,
అరివీర భయంకరుణ్ణి.”

మర్‌హబ్ ఖడ్గంతో ఆయన మీద దాడిచేశాడు. ఆమిర్ డాలుతో అతని దెబ్బను నిలువరించారు. ఆ తర్వాత తనే అతని క్రిందిభాగాలపై ఖడ్గం ఝుళిపించబోయారు. కాని ఆయన ఖడ్గం పొడవు తక్కువగా ఉండటం చేత అది తిరిగొచ్చి ఆయన మోకాలికే తగిలింది. ఆ నొప్పితోనే ఆయన చివరికి అమరగతి నొందారు. ఆ తర్వాత హజ్రత్ అలీ అతన్ని ఎదుర్కోవటానికి యుద్ధభూమిలోకి వచ్చారు. ఆ అరివీరభయంకరుని కేకలతో యుద్ధభూమి దద్దరిల్లింది.

“మా అమ్మ నాకు భయంకరమైన సింహం అని పేరు పెట్టింది.
నేను అడవి సింహాలకన్నా భయంకరుణ్ణి.
దాతృత్వంలో నాది ఎముకలేని చెయ్యి.

హజ్రత్ అలీ తన ఖడ్గంతో ఒకే ఒక్క వేటు వేశారు. అంతే మర్‌హబ్ నేలకొరిగి గిలగిల తన్నుకుంటూ ప్రాణం విడిచాడు. దాంతో ఖైబర్ ప్రాంతమంతా ముస్లింల వశమయింది.7

ఖైబర్ యుద్ధంలోనే జరిగిన సంఘటన. ఒక నీగ్రో జాతి బానిస తన యూద యజమాని దగ్గర మేకలు కాసేవాడు. ఒకరోజు అతను యూదులు యుద్ధ సన్నాహాలు చేసుకోవటం చూసి తనకు తెలిసిన కొందరు యూదుల్ని విషయమేమిటని అడిగాడు. దైవప్రవక్త అని చెప్పుకుంటున్న వ్యక్తిపై యుద్ధం చేయటానికి వెళుతున్నామని చెప్పారు వారు. అప్పట్నుంచి అతనిలో దైవప్రవక్త (సల్లం)ను కలవాలన్న ఆసక్తి మొదలయింది. ఒకరోజు మేకల మందను తోలుకొని దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళాడు. దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడుతూ, “తమరిచ్చే సందేశం ఏమిటి?” అని అడిగాడు.

“నేను ప్రజల్ని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నాను. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, నేను దైవప్రవక్తనని సాక్ష్యం ఇవ్వు. దేవుణ్ణి తప్ప ఇతరులనెవ్వరినీ ఆరాధించకు” అని దైవప్రవక్త (సల్లం) ఆ వ్యక్తికి బోధించారు.

“ఆ విధంగా సాక్ష్యం చెప్పి దైవాన్ని విశ్వసిస్తే నాకేం దొరుకుతుంది?” ఎంతో ఆత్రుతగా అడిగాడావ్యక్తి. “నువ్వు జీవితాంతం దానికి కట్టుబడి ఉంటే నీకు స్వర్గం దొరుకుతుంది” అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ మాట విని ఆ బానిస ఇస్లాం స్వీకరించాడు. కాని తన దగ్గర మేకల మంద ఉంది. అది తన యజమాని అయిన ఓ యూదుని అప్పగింత. ఇస్లాం ధర్మం ప్రకారం ఎవరి అప్పగింత అయినా సరే అందులో నమ్మకద్రోహానికి పాల్పడకూడదు. అంచేత అతను ఆ మేకల్ని ఏం చేయాలని దైవప్రవక్త (సల్లం)ను అడిగాడు. “వాటిని యజమాని ఇంటికి తోలి వాటి వెనుక కంకర్రాళ్ళు విసురు. అల్లాహ్ వాటిని నీ యజమానికి అప్పజెబుతాడు” అన్నారు దైవప్రవక్త.

అతను దైవప్రవక్త (సల్లం) చెప్పినట్లే చేశాడు. మేకలు యజమాని దగ్గరికి చేరుకున్నాయి. మేకల వెంట బానిస లేకపోవటం చూసి అతను ఇస్లాం స్వీకరించి ఉంటాడని యజమానికి అర్థమయిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు దైవప్రవక్త (సల్లం) తన అనుచరులకు హితబోధ చేస్తూ యుద్ధసన్నాహాలు మొదలెట్టమని ఆదేశించారు. ముస్లింలకు, అవిశ్వాసులకు మధ్య యుద్ధం జరిగింది. యుద్ధానంతరం చూస్తే అమరగతుల్లో ఆ బానిస కూడా కనిపించాడు. ప్రజలు అతని శవాన్ని ఓ గుడారంలోకి తీసుకొని వెళ్ళారు. అతని శవాన్ని చూసి దైవప్రవక్త (సల్లం), “దేవుడు ఈ బానిసను కరుణించాడు, ఇతనిపై మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. నేను ఇతని తల దగ్గర ఇద్దరు స్వర్గకన్యల్ని చూశాను. మరి చూడబోతే ఇతనికి ఒక్క సారన్నా నమాజ్ చేసి దైవ సన్నిధిలో మోకరిల్లే అవకాశం రాలేదు” అన్నారు.8

అలాంటిదే ఇంకొక సంఘటన.

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి, “దైవప్రవక్తా! నేను నల్లగా, అందవికారంగా ఉన్నాను. శరీరం కంపుకొడుతోంది. నా దగ్గర ధనం కూడా లేదు. ఈ స్థితిలో నేను యూదులతో పోరాడి చనిపోతే నాకు స్వర్గం లభిస్తుందా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లం) “లభిస్తుంద”ని సమాధానం చెప్పారు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి శత్రు సేనల్లోకి దూసుకువెళ్ళి వీరోచితంగా పోరాడుతూ అమరగతినొందాడు. దైవప్రవక్త (సల్లం) అతని శవం దగ్గరికి వెళ్ళి, “దేవుడు నీ ముఖారవిందాన్ని తేజోమయం చేశాడు. నీ శరీరం నుండి సుగంధాల్ని గుభాళింపజేశాడు. నీకు ఎంతో సంపద ఇచ్చాడు” అంటూ తన అనుచరుల్ని ఉద్దేశించి, ‘స్వర్గ కన్యల్లో ఇతనికి ఇద్దరు భార్యలున్నారని చెప్పారు.9

ఖైబర్ యుద్ధానికి ముందు ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, ఇస్లాం స్వీకరించి ఆయన అనుచరుల్లో కలిసిపోయాడు. ఆయన అతన్ని ఒక అనుచరునికి అప్పగించి అతనికి విద్యాశిక్షణలు గరపమని ఆదేశించారు. ఆ సమయంలోనే ఖైబర్ యుద్ధం జరిగింది. యుద్ధంలో ముస్లింలకు యూదుల కోటల నుండి కొంత ధనం హస్తగతమయింది. దైవప్రవక్త (సల్లం) యుద్ధప్రాప్తిలో ఆ పల్లెవాసికి కూడా వాటాను కేటాయించారు. ఆ సమయంలో ఆ పల్లెటూరి వ్యక్తి తన మిత్రుల ఒంటెల్ని కాయటానికి పొలం వెళ్ళి ఉన్నాడు. తిరిగొచ్చిన తరువాత ప్రజలు అతనికి తన వాటా ధనం అప్పగించారు. అతను ఆ ధనం తీసుకుని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! ఏమిటది?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

“ఇది నీ వాటాలో వచ్చిన ధనం” అని చెప్పారు దైవప్రవక్త (సల్లం) “దైవప్రవక్తా! నేను దీనికోసం ఇస్లాం స్వీకరించలేదు. (తన గొంతు వైపు చూపెడుతూ) నేను ఇస్లాం స్వీకరించింది ఇక్కడ శత్రువుల బాణాలు గుచ్చుకొని ప్రాణాలు విడిచి స్వర్గం పొందటానికి” పల్లెటూరి వ్యక్తి ఆ ధనం పట్ల నిరాసక్తతను వెలిబుచ్చుతూ అన్నాడు.

“నీ కోరికే నిజమయితే దేవుడు నీ కలను సాకారం చేసి చూపిస్తాడు” అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఖైబర్ యుద్ధంలో ఆ పల్లెటూరి వ్యక్తి శత్రువులతో పోరాడుతూ మరణించాడు. ప్రజలు అతని శవాన్ని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని వచ్చారు. దైవప్రవక్త (సల్లం) అతని శవం వంక చూసి,

“ఇతను ఆ పల్లెటూరి వ్యక్తేనా?” అన్నారు.

“ఔను, దైవప్రవక్తా!” అని ప్రజలు సమాధానమిచ్చారు.

“ఇతను మనస్ఫూర్తిగానే అమరత్వాన్ని కోరుకున్నాడు. అందుకే దేవుడు అతని కోరికను నెరవేర్చాడు” అని చెప్పారు దైవప్రవక్త (సల్లం).

దైవప్రవక్త (సల్లం) అతని శవానికి అతను తొడుక్కొని ఉన్న చొక్కాతోనే ఖనన సంస్కారాలు చేశారు. ఆ తర్వాత అతని శవాన్ని అందరికన్నా ముందు ఉంచి నమాజ్ చేయించారు. అతని కోసం ప్రార్థిస్తూ “దేవా! ఈ నీ దాసుడు నీ మార్గంలో బయలుదేరి అమరగతినొందాడు. దానికి నేను సాక్షిని” అన్నారు.10

యుద్ధం తర్వాత ముస్లింలు ఖైబర్ ప్రాంతంలోని సేద్యపు భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. కాని యూదులు ఆ సేద్యపు భూముల్ని తమ అధీనంలోనే ఉంచుకొని, పండిన పంటలో సగభాగం ముస్లింలకు ఇస్తామని విన్నవించుకోగా దైవప్రవక్త (సల్లం) వారి విన్నపాన్ని అంగీకరించారు.11

పంట చేతికొచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లం) అబ్దుల్లాహ్ బిన్‌రవాహాను యూదుల దగ్గరికి పంపేవారు. ఆయన పండిన పంటను రెండు భాగాలుగా చేసి యూదులతో తాము కోరుకున్న భాగం తీసుకోమని చెప్పేవారు. యూదులు ఆ ఉదారవైఖరికి, న్యాయశీలతకు అమితంగా ప్రభావితులయ్యేవారు. ఇలాంటి న్యాయం వల్లనే భూమ్యాకాశాలు నిలిచి ఉన్నాయంటూ ఇస్లామీయ న్యాయ వ్యవస్థను కొనియాడేవారు.12 ఖైబర్ ప్రాంతం ఆ యుద్ధంలో పాల్గొన్న యోధులకు పంచిపెట్టడం జరిగింది.13

ఆ కాలంలోనే ఎమన్ దేశానికి చెందిన అష్‌అరీ తెగవారు సుమారు యాభై అరవై మంది ఒక పడవ ద్వారా ప్రయాణించి అబిసీనియా వెళ్ళారు. అక్కడ వారికి జాఫర్ బిన్ అబూతాలిబ్, ఆయన మిత్రులు కలిశారు.

హజ్రత్ జాఫర్ వారితో, “దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడే ఉండమని ఆదేశించారు. మీరు కూడా మాతో పాటే ఉండండి” అన్నారు. జాఫర్ విన్నపం మేరకు ఆ అష్‌అరీలు కూడా అబిసీనియాలో ఉండటానికి అంగీకరించారు. ఆ తర్వాత కొంత కాలానికి వాళ్ళంతా కలిసి తిరిగి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళారు. జాఫర్ గొంతు వినగానే దైవప్రవక్త (సల్లం) స్వయంగా ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన నుదుటిపై ముద్దుపెట్టుకొని “దైవసాక్షి! నాకు ఇంత ఆనందం ఖైబర్ విజయం వల్ల కలుగుతున్నదో లేక జాఫర్ వచ్చినందుకు కలుగుతున్నదో అర్థం కావటం లేదు” అన్నారు. ఆ తర్వాత ఖైబర్ యుద్ధప్రాప్తిలో ఆ వచ్చినవారికి కూడా భాగాలు కేటాయించారు.14

ఖైబర్ యుద్ధం జరిగిన రోజుల్లోనే ఒక యూద స్త్రీ దైవ ప్రవక్త (సల్లం) కు విషం పెట్టి చంపాలని ప్రయత్నించింది. సల్లాం బిన్ ముష్కమ్ అనే యూదుని భార్య జైనబ్. ఆమె దైవప్రవక్త (సల్లం) ను గురించి తెలిసిన వారి ద్వారా ఆయన మేక భుజానికుండే మాంసాన్ని ఎక్కువ యిష్టంగా తింటారని తెలుసుకుంది. దాని ప్రకారం దైవప్రవక్త (సల్లం)ను హత్యచేయటానికి వ్యూహం పన్నింది. ఒక మేకను సాంతం వేయించి దాని భుజానికున్న మాంసంలో విషం కలిపి పెట్టింది. యూదులు దైవప్రవక్త (సల్లం)ను విందుకు ఆహ్వానించి ఆయన ముందు ఆ మేక మాంసం ఉంచారు. దైవప్రవక్త (సల్లం) ఆ మాంసం తీసుకొని తినాలని చెయ్యి పెట్టగానే దేవుడు ఆ చెయ్యిద్వారానే ఆయనకు అందులో విషం కలిపి వున్న సంగతి తెలియపరచాడు. ఆయన యూదుల్ని పిలిచి మాంసంలో విషం పెట్టిన సంగతి అడిగారు. తామే పెట్టామని ఒప్పుకున్నారు యూదులు. ఎందుకు పెట్టారని అడిగితే, దానికి సమాధానంగా వారు, మీరు దైవప్రవక్త కాకపోతే ఈ విషం తిని మరణిస్తారు. దాంతో మాకు విముక్తి లభిస్తుంది. ఒకవేళ మీరు నిజంగానే దైవప్రవక్త అయితే ఆ విషం వల్ల మీకు ఏ హానీ జరగదు. అలా ఆలోచించుకునే మాంసంలో విషం కలిపాం” అన్నారు. ఆ తర్వాత ఈ పథకానికి అసలు సూత్రధారి అయిన స్త్రీని ఆయన దగ్గర హాజరుపరచటం జరిగింది. ఆమె మాత్రం తాను దైవప్రవక్తను చంపే ఉద్దేశ్యంతోనే విషం కలిపానని మొండిగా సమాధానమిచ్చింది. ఆమె సమాధానం విని దైవప్రవక్త (సల్లం) ‘దేవుడు ఎన్నటికీ నీకు అలాంటి అవకాశం కల్పించడు’ అన్నారు. ఆయన అనుచరులు ఆ స్త్రీని హతమారుస్తామన్నారు. కాని దైవప్రవక్త (సల్లం) స్వయంగా వారిని వారించారు.15

అంతకు ముందు ముస్లింలు ఖురైషులతో హుదైబియా ప్రాంతంలో మరు సంవత్సరం దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల సమేతంగా మక్కా వచ్చి ఉమ్రా యాత్ర చేస్తారని మూడ్రోజుల వరకు అక్కడే విడిది చేస్తారని ఒప్పందం చేసుకొని ఉన్నారు.16 అంచేత దైవప్రవక్త (సల్లం) ఆ యేడు ఉమ్రా చేయాలని నిశ్చయించుకొని గత సంవత్సరం హుదైబియా ఒప్పందంలో పాల్గొన్న వారందరూ ఈ యేడు తప్పకుండా ఉమ్రా చేయాలని ప్రకటించారు. దాంతో ఆ మధ్యకాలంలో చనిపోయిన వారు మినహా మిగతా వారందరూ ఉమ్రాయాత్ర చేసే భాగ్యానికి నోచుకున్నారు.17

హుదైబియా ఒప్పందంలో ముస్లింలు మక్కా వచ్చినప్పుడు ఆయుధాలు ధరించి రాకూడదనే షరతు ఉంది. అందుకని ముస్లింలు తమ ఆయుధాలన్నీ మక్కాకు ఎనిమిది మైళ్ల దూరంలోనే యాజుహ్ అనే లోయలో ఉంచి వెళ్ళారు. రెండొందల రౌతులతో కూడిన ఒక సైనిక పటాలాన్ని ఆయుధాల రక్షణ కోసం నియమించారు.18 దైవప్రవక్త (సల్లం) ‘లబ్బైక్’ అని నినదిస్తూ బయలుదేరారు. అబ్దుల్లాహ్ బిన్ రవాహా ఆయన ఒంటె ముకుతాడు పట్టుకొని ఈ గేయం పాడుతూ ముందుకు నడవసాగారు:

“అవిశ్వాసులారా! అడ్డం తొలగిపోండి
ఈ రోజు గనక మమ్మల్ని అడ్డుకుంటే
మీ తలలు పిట్టల్లా ఎగిరిపోతాయి.
చెట్టకొకరు, పుట్టకొకరు అయిపోతారు జాగ్రత్త!19

దైవప్రవక్త (సల్లం) వెంట అనుచరవాహిని మక్కా పురవీధుల గుండా నడుస్తూ కాబా గృహానికి చేరుకుంటోంది. ముస్లింల చిరకాల వాంఛ నెరవేరుతోంది. వారు ఆనందోత్సాహాలతో ఉమ్రా విధులు నిర్వర్తించసాగారు. ఖురైషులు మక్కానుండి వలసపోయిన ముస్లింలు మదీనా వాతావరణం అచ్చిరాక బలహీనులైపోయారని అనుకునేవారు. అందుకని దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని కాబాగృహ ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటి మూడు చుట్లలో నిక్కుతూ నడవమని ఆదేశించారు. ఇలా నడవటాన్ని అరబీ భాషలో ‘రమల్’ అంటారు.20 నేటికీ ఈ సంప్రదాయం అమల్లో ఉంది.

మక్కావాసులు ఇష్టపూర్వకంగానో, అయిష్టంగానో ముస్లింలకు ఉమ్రా చేసుకునే అనుమతి ఇచ్చినప్పటికీ వారు ఆ దృశ్యాన్ని చూసి సహించే స్థితిలో లేరు. అందుకని చాలామంది ఖురైషులు పట్టణం వదలి కొండలపైకి మకాం మార్చుకున్నారు. మూడ్రోజుల తర్వాత అలీ దగ్గరికి వెళ్ళి, “మనమనుకున్న ప్రకారం మూడ్రోజులు పూర్తయిపోయాయి. ఇక ముహమ్మద్‌ను ఇక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని చెప్పు” అన్నారు. హజ్రత్ అలీ ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియజేశారు. ఆ సంగతి విన్న వెంటనే దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని తీసుకొని మదీనాకు బయలుదేరారు.21

మక్కానుండి బయలుదేరుతున్నప్పుడు హజ్రత్ హమ్జాగారి చిన్న కూతురు ఉమామా “బాబాయ్, బాబాయ్” అంటూ దైవప్రవక్త (సల్లం) వెంట పడింది. అలీ ఆ పాపను ఒళ్ళోకెత్తుకున్నారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు జాఫర్, ఇంకా జైద్ బిన్ హారిస్‌లు కూడా పాపను తాను పోషిస్తానంటే తాను పోషిస్తానని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. ధర్మం దృష్ట్యా హమ్జా తనకు సోదరులు అవుతారని, ఆ విధంగా ఆ పాప తన సోదరకుమార్తె అవుతుందని జైద్ చెప్పుకుంటే, ఆ పాప తనకు పాలవరస చెల్లెలు అవుతుందని, ముందు తన ఒళ్ళోకి వచ్చింది కాబట్టి తనే ఆ పాపను పోషించటానికి ఎక్కువ అర్హుణ్ణని హజ్రత్ అలీ వాదించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) వారి వాదప్రతివాదాలను పరిశీలించిన మీదట పాపను ఆమె పిన్ని అయిన అస్మాకు అప్పజెబుతూ ‘పిన్ని తల్లితో సమానం’ అని అన్నారు.22

మౌతా యుద్ధం

దైవప్రవక్త రాజులు, చక్రవర్తులను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తూ వారి దగ్గరికి రాయబారాలు పంపిన కాలంలోనే, దైవప్రవక్త (సల్లం) బస్రా (హౌరాన్) రాజయిన షురహ్‌బీల్ బిన్ అమ్ర్ దగ్గరికి ఒక లేఖ వ్రాసి పంపారు. అతను కైసర్ చక్రవర్తికి సామంతరాజు. అరబ్బులైన అతని వంశస్థులు అనాది నుంచి క్రైస్తవమతాన్ని అవలంబిస్తూ వస్తున్నారు. సిరియా శివారు ప్రాంతాలు వీళ్ళ అధీనంలోనే ఉండేవి. ఆ రాజు దగ్గరికి హారిస్ బిన్ ఉమైర్ రాయబారిగా వెళ్ళారు. కాని ఆ దుర్మార్గుడు దైవప్రవక్త రాయబారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయించాడు. దాని ప్రతీకారం తీర్చుకోవటం కోసం దైవప్రవక్త (సల్లం) మూడువేలమంది సైన్యాన్ని సిద్ధం చేసి సిరియా వైపుకు పంపారు. జైద్ బిన్ హారిసాను సేనాపతిగా నియమించారు. ఒకవేళ ఆయన చనిపోతే జాఫర్ తయ్యార్, ఆయన కూడా చనిపోయిన పక్షంలో అబ్దుల్లాహ్ బిన్ రవాహా సైన్యాధ్యక్ష పదవిని కొనసాగించాలని చెప్పి పంపించారు.23

ఈ సైనికచర్య ప్రతీకార భావంతో జరుగుతున్నప్పటికీ ఇస్లాం జరిపే అన్ని రకాల చర్యల ముఖ్య ధ్యేయం ధర్మ ప్రచారమే కాబట్టి దైవప్రవక్త (సల్లం) సైన్యానికి హితోపదేశం చేస్తూ శత్రువులకు ముందు ఇస్లాం గురించి వివరించాలనీ, ఒకవేళ వారు ఇస్లాం స్వీకరిస్తే ఇక యుద్ధం చేయవలసిన అవసరం లేదనీ చెప్పారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన హారిస్ బిన్ ఉమైర్ మరణించిన చోటుకెళ్ళి సానుభూతి ప్రకటించాలని కూడా దైవప్రవక్త (సల్లం) సైనికులను ఆదేశించారు. సనియ్యతుల్ వదా ప్రాంతం దాకా వెళ్ళి సైన్యాన్ని సాగనంపి వచ్చారు. క్షేమంగా, విజయపతాకం ఎగురవేస్తూ తిరిగి రావాలని సహచరులు బిగ్గరగా దేవుణ్ణి ప్రార్థించారు.24

ముస్లిం సైన్యం మదీనా నుండి బయలుదేరగానే గూఢచారులు ఈ విషయం షురహ్‌బీల్‌కు తెలియజేశారు. అతను కూడా ముస్లిం సైన్యాన్ని ఎదుర్కొనటానికి సుమారు లక్షమంది సైనికుల్ని సమకూర్చుకున్నాడు. అటు రోమ్ చక్రవర్తి హెరక్లియస్ అసంఖ్యాక అరబ్బు సైనికులతో వచ్చి బల్‌ఖా జిల్లా ప్రాంతాలలో మఆబ్ అనే చోట గుడారమేసుకొని కూర్చున్నాడు. ఈ పరిస్థితుల్ని చూసి జైద్ (రజి) దైవప్రవక్త (సల్లం)కు కబురుచేసి ఆయన ఆజ్ఞ వచ్చే వరకు వేచి చూద్దామని అనుకున్నారు. కాని అబ్దుల్లాహ్ బిన్ రవాహా మాత్రం తమ ఉద్దేశ్యం విజయం కాదని, దైవమార్గంలో ప్రాణాలర్పించటమని, అది ఎట్టి పరిస్థితుల్లోనయినా సాధించవచ్చని ముస్లిం సైనికులకు ధైర్యం చెప్పారు.25 మొత్తానికి ఆ చిన్నపాటి సైనికదళం లక్షమంది సైనికులతో ఢీకొంటానికి సిద్ధమయింది. యుద్ధారంభంలోనే జైద్ బిన్ హారిసా వీర మరణం పొందారు. ఆయన తర్వాత జాఫర్ తయ్యార్ యుద్ధ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నారు. గుర్రం దిగి ఖడ్గంతో గుర్రం కాళ్ళపై విసురుగా కొట్టారు. దాంతో గుర్రం గిట్టెలు తెగి కిందపడిపోయింది. ఆ తర్వాత ఆయన నేలపై నించొనే యుద్ధం చేశారు. ఆ విధంగా పోరాడటం వల్ల ఒళ్ళంతా ఖడ్గ ఘాతాలతో నుజ్జునుజ్జయిపోయి ఆయన క్రిందపడిపోయారు.26 అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఆయన గురించి ఇలా అంటున్నారు. “యుద్ధం తర్వాత నేను జాఫర్ శవాన్ని చూశాను. ఆయన ఒంటిమీద తొంబై గాయాలు కనిపించాయి నాకు. విశేషమేమిటంటే ఆ గాయాలన్నీ ఉదరభాగంవైపే ఉన్నాయి గాని వీపుమీద చిన్న గాయమయినా కనిపించలేదు.27

జాఫర్ తర్వాత అబ్దుల్లాహ్ బిన్ రవాహా యుద్ధపతాకం పట్టుకున్నారు. చివరికి ఆయన కూడా అమరగతి నొందారు. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ సైన్యాధిపతి అయి వీరోచితంగా పోరాడారు. సహీహ్ బుఖారీ గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారం ఈ యుద్ధంలో ఆయన చేతిలో ఎనిమిది ఖడ్గాలు విరిగిపోయాయి.28 మూడువేలమంది సైనికులు లక్షమంది సైన్యంతో యుద్ధం చేయటమంటే మాటలా?! అయినప్పటికీ ఖాలిద్ ఎంతో చాకచక్యంతో తన సైన్యం శత్రువులకు పట్టుబడకుండా తప్పించుకొని తీసుకొచ్చారు.

ఈ సంఘటన వల్ల దైవప్రవక్త (సల్లం)కు ఎంతో దుఃఖం కలిగింది. జాఫర్ పట్ల ఆయనకు అమితమైన ప్రేమాభిమానాలుండేవి. అంచేత జాఫర్ మరణవార్త ఆయన హృదయాన్ని కలచివేసింది. ఆయన మస్జిద్‌లో కూర్చొని దుఃఖించసాగారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి వచ్చి జాఫర్ ఇంటి ఆడవాళ్ళు రోదిస్తున్నారని చెప్పాడు. ఆయన వాళ్ళను వారించమని ఆ వ్యక్తితో చెప్పి పంపించారు. ఆ వ్యక్తి తిరిగొచ్చి తను ఎంత వారించినా వారు వినటం లేదని చెప్పాడు. ఆయన మళ్ళీ చెప్పి పంపించారు. ఆ వ్యక్తి ఇంకోసారి వెళ్ళొచ్చి వాళ్ళను ఆపటం తమ వల్ల కాదని చెప్పాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం), “వాళ్ళ నోళ్ళల్లో మన్ను కొట్టండి” అని విసుక్కున్నారు. ఈ సంఘటన సహీహ్ బుఖారీ గ్రంథంలో ఆయిషా (రజి అన్‌హా) చే ఉల్లేఖించ బడింది. బుఖారీలో అదనంగా ఈ వాక్యం ఉంది: ఆయిషా (రజి అన్‌హా) ఆ వ్యక్తిని ఉద్దేశించి, “దైవసాక్షి! నువ్వా పని చేయకపోతే దైవప్రవక్త (సల్లం) బాధ తగ్గదు” అని అన్నారు.29

ఫుట్‌నోట్‌లు

  1. 1సీరత్ హుల్‌బియా రెండో సంపుటి 726వ పుట.
  2. 2సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 478వ పుట.
  3. 3సీరత్ హుల్‌బియా రెండో సంపుటి 726వ పుట.
  4. 4సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  5. 5సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 330వ పుట.
  6. 6సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
  7. 7సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
  8. 8దలాయిలున్నుబువ్వా నాల్గో సంపుటి 219వ పుట. జాదుల్ మఆద్ మూడో సంపుటి 323వ పుట.
  9. 9దలాయిలున్నుబువ్వా నాల్గో సంపుటి 221వ పుట. జాదుల్ మఆద్ మూడో సంపుటి 324వ పుట.
  10. 10సుననె నసాయి నాల్గో సంపుటి 60వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడో సంపుటి 495వ పుట. దలాయిలున్నుబువ్వా నాల్గో సంపుటి 221వ పుట.
  11. 11సుననె అబూదావూద్‌లోని పన్నులు, పదవుల ప్రకరణం.
  12. 12పుతూహుల్ బుల్‌దాన్ గ్రంథం 34వ పుట.
  13. 13అబూదావూద్‌లోని పన్నులు, పదవుల ప్రకరణం.
  14. 14సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని మహిమోన్నతల ప్రకరణం.
  15. 15సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  16. 16సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  17. 17సీరత్ ఇబ్నె కసీర్ మూడో సంపుటి 429వ పుట.
  18. 18జాదుల్ మఆద్ మూడవ సంపుటి 370వ పుట.
  19. 19సుననెతిర్మిజీలోని ఉపమానాల ప్రకరణం, సుననె నసాయిలోని హజ్ ప్రకరణం.
  20. 20సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  21. 21సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  22. 22సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  23. 23సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
  24. 24సీరతున్నబీ మొదటి సంపుటి 506వ పుట
  25. 25సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 375వ పుట.
  26. 26సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 378వ పుట.
  27. 27సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
  28. 28సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 379, 380 పుటలు.
  29. 29సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.