పదకొండవ అధ్యాయం
తబూక్ ప్రతిఘటన
ఒకరోజు ఒక వర్తక బృందం సిరియా నుంచి వచ్చి, రోము సైన్యాలు మదీనాపై దండెత్తి రావటానికి సన్నాహాలు సాగిస్తున్నట్లు చెప్పింది. అరేబియా ప్రాంతంలోని క్రైస్తవ తెగలు కూడా ఈ సమర సన్నాహాల్లో పాల్గొంటున్నట్లు మరో సమాచారం అందింది.1
దండెత్తి వస్తున్న సైన్యాన్ని అరేబియా ప్రాంతంలో అడుగుపెట్టకముందే -సరిహద్దుల్లోనే-నిలువరించటం అవసరమనీ, ఆ సైన్యాలు గనక తమ భూభాగంలోకి చొచ్చుకుని వస్తే దేశంలో అశాంతి అలజడులు చెలరేగే ప్రమాదం ఉందని దైవప్రవక్త (స) భావించారు.
రోము సామ్రాజ్యాన్ని ఢీ కొనటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దాదాపు ప్రపంచ భూభాగంలో సగం దాని ఆధీనంలోనే ఉంది. ఈ మధ్యనే రోము సైన్యాలు ఈరాన్ సామ్రాజ్యానికి తమ తడాఖా చూపించి ఉన్నాయి.2
మరోవైపు ముస్లింల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగాలేదు. వారిదగ్గర ఒనరులు లేవు. ఆయుధ సామగ్రి లేదు. అందునా వేసవికాలం. అరేబియా వేసవి ఎలా ఉంటుందో జగద్విదితమే. మదీనా నగరంలో పంటలు కోత కొచ్చాయి. ఖర్జూరపండ్లు ఆరగిస్తూ నీడలో సేదతీరవలసిన తరుణమది.3
ఒనరుల సమీకరణ నిమిత్తం దైవప్రవక్త సర్వసామాన్యమైన విరాళాల ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడగానే హజ్రత్ ఉస్మాన్ (రజి) మూడు వందల ఒంటెల్ని, యాభై గుర్రాలను, వెయ్యిదీనార్ల నగదును విరాళంగా సమర్పించారు. ఈ విరాళం ఇచ్చినందుకు ఆయనకు “ముజహ్హిజు జైషిల్ ఉస్రతి” అని బిరుదు లభించింది.4
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) గారు 40 వేల దిర్హములు సమర్పించారు.5
హజ్రత్ ఉమర్ (రజి) తన ఇంట్లో ఉన్న సంపత్తిలో సగభాగం తెచ్చి ఇచ్చారు. అది కూడా కొన్నివేలల్లోనే ఉంది.
హజ్రత్ అబూబక్ర్ (రజి) తెచ్చిన సంపత్తి మూల్యం రీత్యాకొంచెం తక్కువే అయినప్పటికీ ఆయన ఇంట్లో ఉన్నదంతా తీసుకువచ్చారు. మరి ఇంటివాళ్ల కోసం ఏం వదిలావని అంటే “దైవాన్ని, దైవప్రవక్త (స)ను వదలివచ్చాన”ని ఆయన బదులిచ్చారు.6
ఈ విధంగా తమ స్థోమతనుబట్టి అందరూ విరాళాలు ఇవ్వసాగారు. అటువంటి వారిలో అబూ అఖీల్ అన్సారీ (రజి) ఒకరు. ఆయన రెండుసేర్ల ఖర్జూరాలు విరాళంగా తెచ్చారు. ఈ అల్ప విరాళాన్ని తెచ్చినందుకు ఆయన సంజాయిషీ యిస్తూ ఇలా అన్నారు. “రాత్రంతా నీళ్లుతోడి చేను తడిపితే నాల్గుసేర్ల ఖర్జూరపండ్లు కూలిగా లభించాయి. వాటిలో రెండుసేర్ల ఖర్జూరాలను ఇంటివారలకు ఇచ్చి, మిగతా రెండుసేర్లను విరాళంగా తెచ్చాను” అన్నారు.
ఈ రెండుసేర్ల ఖర్జూరాలు మొత్తం విరాళాల ధనరాశిపై విస్తరించేలా కుమ్మరించండి అని దైవప్రవక్త (సఅసం) ఆదేశించారు.7
చెప్పవచ్చిందేమంటే ప్రవక్త ప్రియసహచరుల్లో ప్రతి ఒక్కరూ తమ ఔదార్యాన్ని, చిత్తశుద్ధినీ ఈ సందర్భంగా ప్రదర్శించారు. అయితే 82 మంది ప్రదర్శనా బుద్ధికోసం ప్రాకులాడే వారు (కపటులు) తమ ఇండ్లలోనే ఉండిపోయారు.8
అబ్దుల్లా బిన్ఉబై అనే కపటాగ్రేసరుడు తన అనుంగు అనుచరులకు అండగా నిలిచాడు. ముహమ్మద్ (స) గానీ ముహమ్మద్ అనుచరులుగానీ ఇక మదీనా నగరానికి తిరిగిరారనీ, ఇంతటితో వారికథ ముగుస్తుందని కపటులకు నూరిపోశాడు. రోము చక్రవర్తి అందరినీ బందీలుగా పట్టుకుని వివిధ రాజ్యాలకు తరలిస్తాడని కూడా అన్నాడు.9
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముప్పై వేలమంది సమూహంతో తబూక్ వైపుకు పయనమయ్యారు.10
మదీనాలో సిబా బిన్ ఉర్ఫుతాను తన ప్రతినిధిగా నియమించారు. తమ వారల మంచీ చెబ్బరలను పర్యవేక్షించే బాధ్యతను హజ్రత్ అలీ ముర్తుజా (రజి)కు అప్పగించారు.11
సైనిక సమూహంలో వాహనాల కొరత తీవ్రంగాఉంది. సగటున 18 మంది వ్యక్తులకుగాను ఒక ఒంటె చొప్పున ఉంది. ఆహార పదార్థాలు చాలినన్ని లేకపోవటం వల్ల ఎన్నో చోట్ల ఆకులలములు తిని ఉండిపోవలసి వచ్చింది. అందువల్ల పెదాలు వాచిపోయాయి. కొన్ని సందర్భాల్లో తాగటానికి మంచి నీరు కూడా లభించలేదు. అసలే ఒంటెల కొరత. అందునా దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. గత్యంతరంలేక కొన్ని ఒంటెలను కోసి వాటి గర్భంలో నిలువగా ఉండే నీటిని త్రాగాల్సిన అగత్యం ఏర్పడింది.12
ఈ విధంగా అడుగడుగునా బాధలను భరిస్తూ, ప్రయాసకు ఓర్చుకుంటూ తబూక్ చేరుకున్నారు ఈ త్యాగధనులు.
తబూక్ పొలిమేరల్లో ఉండగానే వెనుక నుంచి హజ్రత్ అలీ (రజి) కూడా వచ్చి వారితో కలిశారు. మదీనాలో దైవప్రవక్త సూచనానుసారం ఉండిపోయిన అలీ (రజి)ని కపటులు నానావిధాలుగా వేధించారని తరువాత తెలిసింది. పనికిరాని చవట కనుకనే కదనరంగానికి వెళ్ళలేదని కొందరంటే, ఇతని స్థితిపై జాలిపడి బహుశా వదిలేసి ఉంటారని మరికొంతమంది గేలిచేసేవారు. కపటుల మాటలు ఈ అభిమానధనుని పౌరుషాన్ని జాగృతం చేశాయి. అందుకే ఆయన మదీనాలో ఆగలేక తబూక్‌కు పయనమయ్యారు. నిరంతరం ప్రయాణం చేసి దైవప్రవక్త (సఅసం) సన్నిధికి చేరుకున్నారు. అవిశ్రాంత ప్రయాణం మూలంగానూ, ఎండ తీవ్రత మూలంగానూ బాగా అలసిపోయారు. కాళ్ళపై వాపు వచ్చేసింది. పాదాలకు కాయలు కాశాయి. ఈ పరిస్థితిని చూసి దైవప్రవక్త (సఅసం) ఇలా అన్నారు: “అలీ! నా తరువాత ఎలాగూ ప్రవక్త రాడు. అయితే నువ్వు మూసా తమ్ముడైన హారూన్లా మసలుకుని ఉంటే నీకది మరింత సంతోషదాయకమయ్యేది కదూ!” ఈ మాట విన్నంతనే హజ్రత్ అలీ మహదానందంతో మదీనాకు తిరుగు ప్రయాణమయ్యారు.13
తబూక్లో మహాప్రవక్త(సఅసం) నెలరోజులపాటు విడిది చేశారు. ఆయన (స) తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి సిరియావాసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆయన(స) జీవించి ఉన్నంతకాలం అరేబియాపై దండెత్తడం ఎంతమాత్రం సమంజసం కాదనీ, ఆయన(స) తదనంతరమే సమర సన్నాహాలు మొదలెడదామని నిర్ణయించుకున్నారు.14
తబూక్లో ఉండగా దైవప్రవక్త (స) ఒక నమాజు అనంతరం తన సహచరులనుద్దేశించి ఎంతో సమగ్రమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఇలా సాగింది-
దైవ స్తోత్రానంతరం…
ప్రతి విషయంలోనూ సత్యబద్ధత దృష్ట్యా దైవగ్రంథమే గొప్పది. అన్నింటికన్నా ఎక్కువగా నమ్మశక్యమైన విషయం ఏదన్నా ఉంటే అది దైవభక్తితో కూడుకున్న విషయమే. అన్ని సమాజాలలోకీ ఉత్తమమైన సమాజం ఇబ్రాహీం (అలైహిస్సలాం) సమాజం. అన్ని విధానాలలోకీ ఉత్తమమైన విధానం ముహమ్మద్ (సఅసం) విధానమే. సమస్త విషయాలలోకీ శ్రేష్ఠమైనది దైవనామస్మరణ. బోధనలన్నింటిలోకెల్లా గొప్పది ఈ ఖుర్ఆనే. స్థిరచిత్తంతో, వజ్రసంకల్పంతో కూడుకున్న పనే అన్నింటికన్నా గొప్పది. వ్యవహారాలలో కెల్లా అత్యంత నీచమైనది సరికొత్తగా కల్పించ బడిన లేనిపోని వ్యవహారం. దైవప్రవక్తల విధానం విధానాలన్నింటిలోకెల్లా ఉత్తమమైనది. మరణాలలో కెల్లా గొప్పది వీరమరణం. అన్నింటికన్నా గుడ్డిది సన్మార్గం పొందిన మీదట కూడా లోనయ్యే మార్గ భ్రష్టత. ప్రయోజనకరమైన ఆచరణే శ్రేష్టమైన ఆచరణ. ప్రజలందరికీ అనుసరణీయమైన వైఖరే మేలైన వైఖరి. అత్యంత నికృష్టమైన అంధత్వం మనోనేత్రపు అంధత్వం. పై చేయి క్రింది చేయికన్నా ఉత్తమమైనది. పరధ్యానానికి లోనుచేసే పుష్కలమైన సంపద కన్నా పరిమితమైన సంపదే మేలైనది. ప్రాణంపోయే ఘడియలో వేడుకునే క్షమాపణ అత్యంత హీనమైనది. ప్రళయదినాన చెందే పశ్చాత్తాపం పరమ దరిద్రంతో కూడుకున్నది.
కొంతమంది జుమా నమాజుకు వస్తారుగాని వారి మనసులు వెనక్కి లాగుతుంటాయి. వారిలో కొంతమంది అప్పుడప్పుడూ దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పాపాలన్నింటిలోకెల్లా భీకరమైనది అసత్యవాక్కు. అన్నిటికన్నా గొప్పది మానసిక కలిమి. అన్నింటికన్నా ఉత్తమమైన సామగ్రి భయభక్తుల సామగ్రి. మనసులో దైవభీతిని కలిగి ఉండటం అన్నింటికన్నా గొప్ప విజ్ఞత. దృఢనమ్మకమే మనసును కుదుటపరుస్తుంది. అనుమానం అవిశ్వాసానికి సోపానం. బిగ్గరగా రోదించటం అజ్ఞానానికి ఆనవాలు. నమ్మకద్రోహం నరకలోకపు సామగ్రి. సిరిసంపదలు నరకాగ్ని మచ్చలాంటివి, కవిత ఇబ్లీసు భాగం. మద్యం సమస్త పాపాలకు మూలం. అత్యంత నీచమైన భృతి అనాథల సొమ్మును కబళించగా ప్రాప్తించిన భృతి. ఇతరులను చూచి గుణపాఠం నేర్చుకున్నవాడే ధన్యుడు. పుట్టుకనాటి నుంచే దౌర్భాగ్యుడుగా ఉన్నవాడే సిసలయిన దౌర్భాగ్యుడు. ఆచరణాసామగ్రే మనిషి సాఫల్యానికి అసలు సాధనం. అబద్దాలతో కూడుకున్న విషయమే అత్యంత అధమమైనది. సంభవించబోయేది సమీపంలోనే ఉంది. విశ్వాసి (ముస్లిం)ని తిట్టడం అవిధేయతకు ప్రతిరూపం. విశ్వాసిని హతమార్చటం కుఫ్ర్ (అవిశ్వాసం). విశ్వాసి మాంసం తినటం (అంటే వీపు వెనుక చాడీలు చెప్పటం) దైవాజ్ఞల ఉల్లంఘనే. సాటి విశ్వాసి సొమ్మును స్వాహాచేయటం అతని రక్తాన్ని పీల్చటం వంటిదే. దైవం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవాణ్ణి దేవుడు ధూత్కరిస్తాడు. సాటి జనుల లోపాలను మరుగుపరచిన వాని లోపాలను అల్లాహ్ మరుగుపరుస్తాడు. క్షమించేవాడే క్షమాభిక్షకు నోచుకుంటాడు. కోపాన్ని దిగమ్రింగినవానికి అల్లాహ్ అత్యుత్తమ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. నష్టం వాటిల్లినప్పుడు ఓర్చుకున్నవాడికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఒసగుతాడు. చాడీలను సర్వవ్యాప్తం చేసేవాణ్ణి అల్లాహ్ పరాభవం పాల్జేస్తాడు. సంయమనం పాటించిన వాని అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు. దేవుని అవిధేయతకు ఒడిగట్టినవాణ్ణి దేవుడు యాతనకు గురిచేస్తాడు. ఆ తరువాత మూడుమార్లు క్షమాపణ వచనాలు పలికి ఆయన (సఅసం) తన ప్రసంగాన్ని ముగించారు.
తబూక్లో ఉండగానే జుల్బజాదైన్ చనిపోయాడు. ఈ వ్యక్తి మరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి మహాప్రవక్త (సఅసం) పేదల పట్ల ఎలా పెన్నిధిగా, ప్రేమమూర్తిగా వ్యవహరించేవారో అర్థమవుతోంది. ఈ సహచరుని అసలుపేరు అబ్దుల్లాహ్. పిన్న వయస్కుడుగా ఉండగానే ఇతని తండ్రి చనిపోయాడు. ఇతని సంరక్షణా బాధ్యతల్ని పినతండ్రి తీసుకున్నాడు. యుక్తవయస్సుకు చేరగానే కొన్ని మేకల్ని, ఒంటెల్ని, బానిసల్ని ఇచ్చి పినతండ్రి ఇతన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. ఆ రోజుల్లోనే అబ్దుల్లాహ్ ఇస్లాం గురించి విన్నాడు. ఇస్లాం పట్ల అతని మదిలో ఆసక్తి పెరిగింది. కాని పినతండ్రికి భయపడి బహిరంగంగా ఇస్లాం స్వీకారాన్ని ప్రకటించలేకపోయాడు. ఎట్టకేలకు దైవప్రవక్త (స) మక్కాను జయించి, తిరిగివచ్చాక పినతండ్రి వద్దకు వెళ్ళి “బాబాయి! ఏదో ఒకరోజు మీరు ఇస్లాం ధర్మం స్వీకరించకపోతారా! అన్న ఉద్దేశ్యంతో కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూశాను. కాని మీ ధోరణిలో ఎలాంటి మార్పురాలేదు. ఇకనేను నా జీవితంపట్ల ఎలాంటి ఆశలుపెంచుకోలేదు. ఏరోజు చావువస్తుందో తెలీదు. నేను ముస్లింగా మారదలచాను. దయచేసి ఈ విషయంలో మీరు అభ్యంతరం చెప్పకండి” అని అన్నాడు.
“అబ్బాయి! నువ్వు గనక ముహమ్మద్ (స) మతం వైపుకు మొగ్గావంటే నీకిచ్చిన ఆస్తిపాస్తులన్నింటినీ స్వాధీనపరచుకుంటాను. నీ ఒంటిపై దుప్పటిని, లుంగీని కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త!” అని హెచ్చరించాడు అతని బాబాయి.
‘బాబాయి! నేను ఇస్లాం స్వీకరించాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. విధేయత గనక చూపితే ముహమ్మద్(స)కే విధేయత చూపుతాను. బహుదైవోపాసనపట్ల, విగ్రహారాధనపట్ల నాకెలాంటి ఆసక్తి లేదు. నేను దీనిపట్ల విసుగెత్తిపోయాను. ఇప్పుడు తమరేం చేసుకుంటారో చేసుకోండి. ఈ రోజు నా అధీనంలో ఉన్న ఆస్తినంతటినీ మీ కిష్టమొచ్చిన విధంగా జప్తు చేసుకోండి. మనం ఏదో ఒకనాడు వీటన్నింటినీ వీడిపోవలసిందే కదా! ఈ ఆస్తిపాస్తులకోసమని నేను సత్యధర్మాన్ని వీడలేను.’
ఈ మాటలంటూనే అబ్దుల్లాహ్ తాను తొడిగివున్న దుస్తుల్ని విడిచేశారు. ఆ స్థితిలోనే కన్నతల్లి దగ్గరకు వెళ్లారు. ఆయన స్థితిని చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. “ఈ క్షణం నుంచీ నేను విశ్వాసినయ్యాను. ఏకేశ్వరోపాసకుడనయ్యాను. దైవప్రవక్త (సఅసం) దగ్గరకు వెళ్ళదలచాను. నడుముకు చుట్టుకోవడానికి ఏదన్నా వస్త్రం ఇస్తావా అమ్మా!” అన్నారు. పుత్ర వాత్సల్యం పొంగిపొరలగా లోపలినుంచి ఓ కంబలిని తెచ్చి ఇచ్చింది ఆ తల్లి. సగం కంబలిని చించి నడుముకు లుంగీగా చుట్టుకుని, మిగిలినదాన్ని దుప్పటిగా కప్పుకున్నారు అబ్దుల్లాహ్. ఆ మరుక్షణమే మదీనాకు బయలుదేరారు. తెలతెలవారుతుండగా మస్జిదెనబవీకి చేరుకున్నారు. మస్జిద్ గోడకు ఆనుకుని దైవప్రవక్త (సఅసం) రాక కోసం ఎదురు చూడసాగారు. దైవప్రవక్త (స) వచ్చీరాగానే, ఈ అపరిచితవ్యక్తిని చూసి “ఎవరు?” అని అడిగారు. “నా పేరు అబ్దుల్ఉజ్జా. బీదవాణ్ణి. బాటసారిని, దైవప్రవక్త అభిమానిని. సన్మార్గభాగ్యం కోసం తహతహలాడుతూ వచ్చినవాణ్ణి” అని సూటిగా సమాధానమిచ్చారు.
ఈ సమాధానం వినగానే దైవప్రవక్త (స) మోము వికసించింది.
“ఇక నుంచి నువ్వు అబ్దుల్లాహ్వి. ‘జుల్ బజాదైన్’ అనే బిరుదు నీకివ్వబడింది. నువ్వు మాకు చేదోడువాదోడుగా ఉండవచ్చు. మస్జిద్‌లోనే ఉండు” అని చెప్పారాయన(స).
ఆ రోజు నుంచీ ‘అస్హాబె సుప్ప’ (అరుగు వాసులు) లో చేరిపోయారు హజ్రత్ అబ్దుల్లాహ్! దైవప్రవక్త (స) నోట ఖుర్ఆన్ విని పగలల్లా ఎంతో దీక్షతో భక్తీ పారవశ్యాలతో పారాయణం చేసేవారు.
ఒకసారి ఉమర్ ఫారూఖ్ (రజి) జోక్యం చేసుకుని “ప్రజలు నమాజు చేస్తుండగా ఈ పల్లెటూరి వ్యక్తి ఇంత బిగ్గరగా చదువుతున్నాడేమిటి? అందరికీ ఇబ్బంది కలుగదా?” అని అన్నారు. దైవప్రవక్త(స) వెంటనే వారిస్తూ, “ఉమర్! ఇతన్నేమీ అనకండి. దైవం మరియు దైవప్రవక్త (స) కోసం ఇతను సర్వం వదులుకుని వచ్చాడు” అని అన్నారు.
తబూక్ ప్రయాణ సందడిని అబ్దుల్లాహ్ గమనించారు. దైవప్రవక్త (స) సమక్షంలోకి వచ్చి, “దైవప్రవక్తా! దైవమార్గంలో అమరగతినొందే భాగ్యం నాకు లభింపజేయమని దైవాన్ని ప్రార్థించండి” అని విన్నవించుకున్నారు. “అయితే వెళ్ళి చెట్టు బెరడు తీసుకురా!” అని ఆయన(స) చెప్పారు. వెంటనే బెరడు తెచ్చారు అబ్దుల్లాహ్. దైవప్రవక్త (స) ఆ బెరడు ముక్కను ఆయన చేతికి కట్టి “దేవా! నేను ఇతని రక్తాన్ని అవిశ్వాసుల కొరకు నిషేధించాను” అని అన్నారు. “అదేమిటి? నేను వీరమరణాన్ని కోరుకుంటూ ఉండగా తమరు ఈ విధంగా దీవించారేమిటి దైవప్రవక్తా!” అని అబ్దుల్లాహ్ సందేహపడగా, “నీవు ధర్మయుద్ధం చేసే సంకల్పంతో బయలుదేరి, సొమ్మసిల్లి మరణించినా సరే అమరగతి నొందినట్లే” అని ఆయన (స) స్పష్టపరిచారు.
తబూక్ చేరిన తరువాత జరిగింది కూడా అదే. వడ దెబ్బతగిలి ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. అబ్దుల్లాహ్ అంత్యక్రియల స్థితిగతులను వివరిస్తూ బిలాల్ బిన్ హారిస్ మదనీ ఇలా అన్నారు: అది రాత్రి వేళ. హజ్రత్ బిలాల్ (రజి) చేతిలో లాంతరు ఉంది. అబూబక్ర్ (రజి) ఉమర్ (రజి)లు ఆయన భౌతికకాయాన్ని గోరీలోకి దించారు. దైవప్రవక్త (స) సయితం గోరీలోనికి దిగారు. “మీ సోదరుణ్ణి నాకు దగ్గరగా చేర్చండి” అని ఆయన (స) ఆ క్షణంలో అబూబక్ర్, ఉమర్లనుద్దేశించి చెప్పారు. దైవప్రవక్త (స) తన స్వహస్తాలతో సమాధిలో ఇటుకలను పేర్చారు. ఆ తరువాత ఇలా వేడుకున్నారు. “దేవా! ఇతని పట్ల నేను ప్రసన్నుడయ్యాను. నువ్వు కూడా ఇతని పట్ల ప్రసన్నుడవుకమ్ము”. ఈ దృశ్యాన్ని తదేకంగా తిలకించిన ఇబ్నె మసూద్(రజి), “ఈ సమాధిలో తాను ఖననమై ఉంటే ఎంత బాగుండేది!” అంటూ కించిత్ ఈర్ష్య చెందారు.
ఆ తరువాత ముస్లింలు తబూక్ నుంచి మదీనాకు తిరిగివచ్చారు. మదీనా పొలిమేరల్లో ఉండగానే నగరవాసులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలకడానికి ఎదురు వెళ్ళారు. పరదా పాటించే మహిళలు సయితం ఇళ్ళనుంచి బయటికి వచ్చేశారు.
కాని కపటుల మొహాలు మాడిపోయాయి. ముహమ్మద్ (స) తో సహా ముస్లింలంతా ఎవరికీ తెలియని దీవులకు తరలించబడతారని కాకిలెక్కలు వేసుకున్న వంచనా శిల్ప నిష్ణాతులకు ఈ వార్త మింగుడు పడలేదు. మదీనాకు రాగానే దైవప్రవక్త అందరినీ సమావేశపరచి, తబూక్‌కు రాని వారిని సంజాయిషీ అడిగారు. వంచకులు ఏవో కుంటిసాకులు చూపి, అబద్ధాలు పలికారు. దైవప్రవక్త(స) వారి వ్యవహారాన్ని దైవానికే అప్పజెప్పి, సర్వసాధారణమైన మన్నింపును ప్రకటించారు. కాని ముగ్గురు నిజాయితీపరులైన ముస్లింలు మాత్రం ఉన్నదున్నట్టు తమ మనసులోని మాటను బహిర్గతం చేశారు. తాము తబూక్‌కు రాలేకపోవడానికి బలమైన కారణమేదీలేదనీ, కేవలం బద్ధకం, అశ్రద్ధ మూలంగానే వెనుకబడిపోయామని వారు చెప్పారు. వారు నిజం చెప్పినందుకు కఠినమైన పరీక్షను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ ముగ్గురిలో ఒక గొప్ప సహాబీ (రజి) తాను స్వయంగా చెప్పిన వృత్తాంతం. ఇలా ఉంది:-
ఈయన పేరు హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ అన్సారీ (రజి). రెండవ ఉఖబా ప్రమాణంలో పాల్గొన్న 73 మంది ప్రముఖులలో ఈయన ఒకరు. ఎన్నదగ్గ కవి కూడాను.15 ఆయనిలా అన్నారు: పరీక్షించబడటానికే నేను బహుశా ఇంటిపట్టున ఉండిపోయానేమో! ఉద్దేశ్యపూర్వకంగా నేను అశ్రద్ధ చేయలేదు. వెళ్ళకపోవటానికి బలమైన కారణం కూడా ఏదీ లేదు. ప్రయాణ సామగ్రి కూడా నా దగ్గర ఉంది. మేలుజాతి ఒంటెలున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా ముందెన్నడూ లేనంత మెరుగ్గా ఉంది. అయితే జనులంతా ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ ఉండగా నేను బొత్తిగా శ్రద్ధ చూపలేదు. అందరూ బయలుదేరిన రోజే నేను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చులే అని అనుకున్నాను. కాని సైనికులు తీరా ప్రయాణమైన రోజున కాకతాళీయంగా నాకొక పని వచ్చి పడింది. ఆ పని చేసుకుని మరునాడే గబగబా వెళ్ళి సైనికుల్ని కలుసుకోవచ్చని భావించాను. రెండుమూడురోజులు ఇలాగే గడచి పోయాయి. కించిత్ బద్ధకం ఆవహించింది. వెళ్ళాలా వద్దా అనే తటపటాయింపు కూడా చోటుచేసుకుంది. ఇలా తాత్సారం చేసేలోపే ముస్లిం సైన్యం బహుదూరం వెళ్ళిపోయింది. ఇక ఆ సైన్యాన్ని అందుకోవటం కష్టమే. కనుక ప్రయాణ సంకల్పాన్ని విరమించుకున్నాను. వెళ్ళలేకపోయినందుకు మనస్సాక్షి లోపలినుంచి గట్టిగా హెచ్చరించ సాగింది.
ఒకరోజు నేను ఇంటినుంచి బయటికెళ్ళాను. వీధుల్లో కపటులు, వికలాంగులు, అబద్ధాల కోరులు తప్ప నికార్సయిన ముస్లింలెవరూ కనిపించలేదు. ఈ పరిస్థితి నన్ను మరింతగా కృంగ దీసింది. సిగ్గుతో కుమిలిపోతూ రోజులు వెళ్ళదీస్తూ ఉండగానే దైవప్రవక్త (సఅసం) సహచరుల సమేతంగా మదీనాకు తిరిగి వచ్చారు. ఏ మొహం పెట్టుకుని దైవప్రవక్త (స) ఎదుట వెళ్లాలి? ఏమని చెప్పాలి? ఆయన(స) ఆగ్రహం నుండి ఎలా తప్పించుకోవాలి? పరిపరివిధాలా ఆలోచించాను. కొంతమంది నాకు కుంటి సాకులు చెప్పమని కూడా సలహాలు ఇచ్చారు. కాని నా అంతరాత్మ అందుకు అంగీకరించలేదు. ఏమైనాసరే నిజమే చెప్పాలి. నా మోక్షం ఎట్టి పరిస్థితిలోనూ సత్యవాక్కులోనే ఇమిడి ఉందన్న నిర్ధారణకు వచ్చాను. ఎట్టకేలకు దైవప్రవక్త (సఅసం) సమక్షంలో హాజరయ్యాను. ఆయన(స) నన్ను చూచి చిరునవ్వు చిందించారు. “నీకేమయ్యింది నాయనా?!” అన్నట్టుంది ఆ చిరునవ్వు. ఆ మందహాసానికే నా నవనాడులు స్థంభించి పోయాయి.
“చెప్పు కాబ్! నువ్వు రాకపోవడానికి కారణమేమిటి? నీ దగ్గర కూడా ప్రయాణ సామగ్రి లేదా?”-ప్రశ్నించారు నాయక శిఖామణి (సఅసం).
“దైవప్రవక్తా (సఅసం)! నా వద్ద సామగ్రికేమీ లోటులేదు. అన్నీ ఉన్నాయి. కాని నా మనోవాంఛే నన్ను పరధ్యానంలో పడవేసింది. బద్ధకం నన్ను లొంగదీసుకుంది. పిశాచం నన్ను ఆవహించి ప్రమత్తతకు, అలసత్వానికి లోను చేసింది” సమాధానమిచ్చాను.
“అయితే నువ్వు నీ ఇంటిపట్టునే ఉండి, దైవ నిర్ణయం కోసం నిరీక్షించు”-తీర్పు చెప్పారు దైవప్రవక్త (స).
(కపటుల మాదిరిగా) నువ్వు కూడా ఏదో ఒక్కసాకు చూపి ఉంటే ఈ శిక్షపడేది కాదుకదా! అని కొంతమంది అన్నారు. “నేను అబద్ధం చెప్పినా దైవప్రవక్త (స)కు నిజం తెలియకుండా ఉండదు. దైవ సందేశం ద్వారా నా బండారం ఎలాగూ బయటపడి పోతుంది. నేను చేసే వ్యవహారం సామాన్యులతో కాదు, దైవప్రవక్త (స)తో! ఈనాడు నేను కుంటిసాకులు చెప్పి శిక్ష నుండి తప్పించుకున్నా రేపటి రోజున దైవసమక్షంలో అవమానం పాలు కాక తప్పదు” అని జవాబిచ్చాను. “నాలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారు?” అని అడిగాను.
“హిలాల్ బిన్ ఉమయ్య, మురారా బిన్ రబీ కూడా నీలాగే శిక్ష అనుభవిస్తున్నార”ని సమాధానం ఇచ్చారు మిత్రులు. ఈ సంగతి తెలుసుకుని నాకు కాస్త ఊరట కలిగింది. నిజం చెప్పిన సజ్జనులు మరో ఇద్దరు కూడా ఉన్నారన్నమాట! అనుకున్నాను. మాతో ఎవరూ మాట్లాడవద్దనీ, కలసి కూర్చోరాదని దైవప్రవక్త (స) ఆజ్ఞాపించారు. దీంతో మా బ్రతుకు దుర్భరమై పోయింది. ఈ ప్రపంచమే నరకతుల్యం అనిపించింది. ఆ రోజుల్లో హిలాల్గానీ, మురారాగానీ ఇంటి గడపదాటి బయటికి రాలేదు. ఎందుకంటే వారిద్దరూ ముసలివారు. కాని నేను యువకుణ్ణి. పౌరుషం గలవాణ్ణి. ఇల్లువిడిచి బయటికి వచ్చేవాణ్ణి. మస్జిద్కు వెళ్ళేవాణ్ణి. నమాజు చేసి మస్జిద్ మూల కూర్చునేవాణ్ణి.
నేను తలదించుకుని కూర్చుని ఉన్నప్పుడు దైవప్రవక్త (స) నన్ను ప్రేమతో చూసేవారు. నా దీనస్థితిపై జాలిచూపేవారు. కాని నేనాయన్ని కన్నెత్తిచూసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం తన చూపుల్ని మరల్చుకునేవారు.
ఇక సాటి ముస్లింలెవరూ నాతో మాట్లాడేవారు కాదు. నేను సలాం చేసినా బదులు పలికేవారు కారు. ఆ గడ్డు కాలంలోనే నేను ఒకరోజు దుఃఖిస్తూ మదీనా నగరం వెలుపలకు వచ్చాను. నా బాబాయి కుమారుడైన అబూ ఖతాదా(రజి) కనిపించాడు. మేమిద్దరం ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం. అతను తన తోటలో పనిచేసుకుంటున్నాడు. అతని దగ్గరకెళ్ళి ‘సలాం’ చేశాను. కాని అతను కనీసం ప్రతి సలాం కూడా చేయలేదు. ముఖం త్రిప్పుకున్నాడు. అతని వైముఖ్యాన్ని భరించలేక, “అబూఖతాదా! నేను దైవాన్ని, దైవప్రవక్త (సఅసం)ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నా ఆంతర్యంలో కాపట్యం ఏ కోశానా లేదన్న సంగతి కూడా నీకు తెలుసు. మరలాంటప్పుడు నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు?” అబూఖతాదా నుంచి సమాధానం రాలేదు. మూడుసార్లు ఇదే ప్రశ్నవేసినా మౌనమే అతని సమాధానం అయింది. “నాతో ఎందుకు మాట్లాడటం లేదు?” దాదాపు విలపిస్తూ అడిగితే “ఎందుకో దైవానికి, దైవప్రవక్తే బాగా తెలుసు” అని అన్నాడు. నా దుఃఖం కట్టలు త్రెంచుకుంది. పెద్దగా ఏడ్చేశాను. నగరానికి తిరిగివస్తుండగా నాకొక క్రైస్తవుడు ఎదురుపడ్డాడు. అప్పటికే అతను మదీనాలో నన్ను చాలాసేపు వెతికాడు. గస్సాన్ చక్రవర్తి నా పేరున రాసిన ఒక ఉత్తరాన్ని అతను తెచ్చాడు. ఆ ఉత్తరంలో ఇలా వుంది-
“మీ నాయకుడు మీపై కినుక వహించాడని మాకు తెలిసింది. మిమ్మల్ని వెలివేశారని, అందరూ మిమ్మల్ని దూరం చేశారని విన్నాము. మీరు ఏ స్థాయికి చెందినవారో మాకు బాగా తెలుసు. మీరు అవమానాల పాలు కావలసిన వారు కారు. మీ అంతస్థుకు తగ్గరీతిలో మీరు సత్కరించబడాలి. ఈ ఉత్తరం చదవగానే మీరు మా దగ్గరకు వచ్చేయండి-మేము మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తామో, ఎంత మర్యాద చేస్తామో మీరే చూద్దురుగాని!”
ఈ ఉత్తరం చదవటం పూర్తవగానే నాకు మతిపోయినంత పనయింది. ‘ఇది మరో కఠిన పరీక్ష కాబోలు!’ అనుకున్నాను. ఈ రోజు ఒక క్రైస్తవ వ్యక్తి వచ్చి నన్ను, నా జీవనవిధానాన్ని శాసించగోర్తున్నాడు. ఇంతకన్నా అగ్నిపరీక్ష ఇంకేముంటుంది? నా ఆవేదన అంతకంతకూ పెరిగిపోతోంది. గస్సాన్ చక్రవర్తి పంపిన దూత సమక్షంలోనే ఆ ఉత్తరాన్ని చింపి అగ్నిలో పడవేశాను. “వెళ్ళు, మీ రాజు చేసే మర్యాదలు ఘన సత్కారాలకంటే మా ప్రవక్త (సఅసం) విధించిన శిక్ష లక్ష రెట్లు నయం అని మీరాజుకు చెప్పు” అన్నాను.
నేను ఇంటికి వెళ్ళే సరికి దైవప్రవక్త (సఅసం) తరపున ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. “నువ్వు నీ భార్యకు దూరంగా ఉండవలసిందిగా దైవప్రవక్త (స) ఆదేశించారు” అన్నాడతను. “విడాకులు ఇవ్వమన్నారా”? అని అడిగాను. “అక్కరలేదు. కేవలం ఆమెకు దూరంగా ఉండమన్నారు” అని సమాధానం వచ్చింది. ఆ రోజే నేను మా ఆవిడను ఆమె పుట్టింటికి పంపించేశాను. హిలాల్, మురారాలకు కూడా ఈ విధంగానే ఆజ్ఞాపించబడిందని తెలిసింది. అప్పుడు హిలాల్ సతీమణి దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా (స)! హిలాల్ మరీ వృద్ధులు, నీరసించిపోయారు. ఆయనకెలాంటి కోర్కెలు లేవు. అదీగాక ఆయన సేవచేసేవారు కూడా ఎవరూ లేరు. తమరు గనక అనుమతిస్తే నేను ఆయన సేవచేసుకుంటూ ఉంటాను” అని విన్నవించుకుంది. “సరే, నువ్వు ఆయన సేవ చేసుకో. కాని ఆయన పడక పైకి మాత్రం పోవద్దు” అని దైవప్రవక్త (స) చెప్పారు. దానికామె, “దైవప్రవక్తా (స), హిలాల్ వేదనాస్థితిని చూస్తుంటే ఆయనకు ఈ సంక్షోభం నుంచి బయటపడే కోరిక తప్ప మరో ధ్యాసలేదు” అని వివరించింది.
నువ్వు కూడా అలాగే అనుమతి తీసుకోరాదూ! కనీసం నీ ఇల్లాలు నీకు చేదోడువాదోడుగా ఉంటుంది కదా! అని నాకు కొంత మంది సలహా యిచ్చారు. “నేను ధైర్యం చేయలేను. అదీగాక దైవప్రవక్త ఆ మేరకు అనుమతిస్తారో లేదో తెలీదు-ఎందుకంటే హిలాల్ లాగా నేను ముసలివాణ్ణికాను. నా పనులు నేను స్వయంగా చేసుకోగలను. నాకు ఒకరి సపర్యల అవసరం లేదు” అని అన్నాను.
అప్పటికే 50 రోజులు గడచిపోయాయి. ఒకరోజు రాత్రి నేను ఇంటికప్పుపైకెక్కి నా స్వయంకృతాన్ని నెమరువేసుకుంటూ పడుకున్నాను. అంతలోనే మా యింటికి సమీపంలో నున్న సులా కొండశిఖరంపైకెక్కి హజ్రత్ అబూబక్ర్(రజి) నన్ను కేకేస్తున్నారు-“కాబ్‌కు శుభాకాంక్షలు! అతని పశ్చాత్తాపం స్వీకరించబడింది”. ఈ పిలుపు విన్నంతనే నా మిత్రులంతా పరుగులు తీస్తూవచ్చారు. నిజాయితీపరుని ప్రాయశ్చిత్తం స్వీకారయోగ్యమైనందుకు శుభాభివందనలు అంటూ అందరూ నన్ను పలకరించసాగారు సంతోషాతిశయంతో. ఈ శుభవార్త అందగానే నేను నేలపై మోకరిల్లి దైవానికి మనసారా కృతజ్ఞతలర్పించారు. ఆ తరువాత దైవప్రవక్త (స) సన్నిధికి పరుగెత్తాను.
ఆ సమయంలో దైవప్రవక్త (స) ముహాజిర్ల, అన్సార్ల మధ్య కూర్చుని ఉన్నారు. నన్ను చూసి ముహాజిర్లు శుభాకాంక్షలు తెలిపారు. అన్సార్ సోదరులు మౌనంగా ఉన్నారు. నేను మరికాస్త ముందుకువెళ్ళి ‘సలాం’ చేశాను. దైవప్రవక్త (స) వారి ముఖారవిందం పున్నమి చంద్రునివలే దేదీప్యమానంగా ఉంది. ఆయన (స) సంతోషంగా ఉన్నప్పుడల్లా ఆయన(స) మోము ఇలాగే మెరిసిపోతూ ఉంటుంది. ‘కాబ్! నీకు శుభం. నీవు నీతల్లి కడుపున పుట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ నీ కొరకు ఇంతటి శుభకరమైన రోజు రాలేదు. నీవు అదృష్టవంతుడివి. సర్వలోకప్రభువు నీ పశ్చాత్తాపాన్ని సమ్మతించి ఆమోద ముద్ర వేశాడు’ అని అగ్రజులు (సఅసం) శుభవార్త వినిపించారు.
“దైవప్రవక్తా (స)! ఈ స్వీకృతికి కృతజ్ఞతగా నేను ఆస్తిపాస్తులన్నింటిని దైవమార్గంలో దానం చేయదలిచాను” అన్నాను. “అంతా వద్దు” అని ఆయన(స)అన్నారు. “పోనీ సగభాగం ఇస్తాను” అన్నాను. “వద్దు. మూడోవంతు చాలు. అవును మూడవ వంతు సమంజసంగా ఉంటుంది. ఆ మాటకొస్తే మూడో వంతు కూడా ఎక్కువే” అని దైవప్రవక్త (స) వ్యాఖ్యానించారు.16
ఏ విధంగానయినాసరే ముస్లింల మధ్య మనస్పర్థల్ని సృష్టించి వారిలో చీలిక తీసుకురావాలన్నది కపటుల ఎత్తుగడ. మస్జిదె ఖుబాకు విరుగుడుగా మరో మస్జిదును నిర్మించాలనీ, వయోవృద్ధులు మస్జిదె నబవీ వరకూ నడచి రావటం కష్టమవుతోందని కపటులు ప్రతిపాదించారు. కపటుల ఆగడాలకు అండగా నిలిచాడు అబూ ఆమిర్. అబూఆమిర్ అన్సార్ వర్గీయుడు. క్రైస్తవుడుగా మారాడు. “మీ ప్రయత్నాలు మొదలెట్టండి. నేను రోము చక్రవర్తి వద్దకు వెళ్ళి సైన్యం తీసుకు వస్తాను. ఈ రాజ్యంలో ఇస్లాంను నామరూపాల్లేకుండా చేద్దాం” అని కపటులను ఉసిగొల్పాడు అబూఆమిర్.
తీరా దైవప్రవక్త తబూక్‌కు ప్రయాణమవుతుండగా కొంతమంది కపటులు వచ్చి, “మేము వ్యాధిగ్రస్తుల, వృద్ధుల సౌకర్యార్థం ఒక మస్జిద్ను నిర్మించాము. మీరొకసారి వచ్చి, అందులో నమాజుచేస్తే దానికి ప్రారంభోత్సవం చేసి నట్టుంటుంది” అని సూచించారు. దానికాయన(స) “నేను ఇప్పుడు తబూక్‌కు బయలుదేరుతున్నాను” అని చెప్పారు. అయితే తబూక్ ప్రయాణం నుంచి తిరిగివచ్చాక ఆయన(స), ఆ మస్జిద్ను కాల్చివేయమని హజ్రత్ మాలిక్‌ను, హజ్రత్ మాన్ బిన్ అదీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి.17
దౌస్ ప్రతినిధి బృందం
తుఫైల్ బిన్ అమ్ర్ (రజి) దౌసీ ఇస్లాం స్వీకరించిన సంగతి ఇంతకు ముందే ప్రస్తావించబడింది. ఇస్లాం స్వీకరించిన తరువాత ఈయన దైవప్రవక్త (స) దగ్గర సెలవు తీసుకుంటూ, “దైవప్రవక్తా(స)! నా జాతి ప్రజలు సన్మార్గం పొందేలా ప్రార్థించండి” అని కోరారు. దైవప్రవక్త (స) ప్రార్థించారు. ‘దేవా! తుఫైల్ను ఒక సూచనగా చెయ్యి’ అని వేడుకున్నారు. హజ్రత్ తుఫైల్ ఇంటికెళ్ళగానే, ఆయన్ని పలకరించటానికి ముసలితండ్రి ఎదురుగా వచ్చారు. “నాన్నా! ఇప్పుడు నేను మీవాణ్ణి కాను. మీరు నా వారు కారు” అని తుఫైల్ అన్నారు. “ఎందుకనీ?” ప్రశ్నించాడు తండ్రి, “ఎందుకంటే నేను ముహమ్మద్ (సఅసం) ధర్మాన్ని స్వీకరించి ముస్లింనయ్యాను” అన్నారు తుఫైల్. “ఒరేయ్ కన్నా! ఇక నుంచి నీ ధర్మమే నా ధర్మంరా!” అన్నాడా ముసలి తండ్రి. అయితే మీకు శుభం. మీరు స్నానం చేసి, పరిశుభ్రమైన బట్టలు తొడుక్కురండి. నేను మీకు ఇస్లాం ఉపదేశం చేస్తాను” అన్నాడు కొడుకు. తరువాత ఆయనగారి శ్రీమతి వచ్చింది. ఆమెతోనూ అదే ధోరణి. ఆమె కూడా ఇస్లాం స్వీకరించింది. ఆనాటి నుంచీ హజ్రత్ తుఫైల్ (రజి) తమ వర్గ ప్రజలలో ఇస్లాం సందేశ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. కాని జనులు పెద్దగా ఇస్లాం పట్ల ప్రభావితులు కాలేదు.18
హజ్రత్ తుఫైల్ మళ్ళీ దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నాజాతివారిలో వ్యభిచారం బాగా ప్రబలిపోయింది. ఈ (వ్యభిచారాన్ని ఇస్లాం నిషేధించిన) కారణంగా జనులు ఇస్లాంకు చేరువ కావటం లేదు” అని విన్నవించుకున్నారు. “దేవా! దౌస్ తెగవారికి సన్మార్గం చూపు” అని దైవప్రవక్త (సఅసం) ప్రార్థించారు. ఆ తరువాత తుఫైల్నుద్దేశించి, “ఇప్పుడు వెళ్ళి జనులను దైవధర్మం వైపుకు ఆహ్వానించు” అని ఆజ్ఞాపించారు. ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించమనీ, ప్రేమతో పలకరించమని కూడా సూచించారు.
ఈసారి హజ్రత్ తుఫైల్ సందేశ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. హిజ్రీ 5వ యేట ఆయన ఇస్లాం స్వీకరించిన 80 మంది దౌస్ తెగవారిని వెంటబెట్టుకుని మదీనా వచ్చారు. దైవప్రవక్త (సఅసం) ఖైబర్ వెళ్ళి ఉన్నారని తెలీటంతో ఈ బృందం సరాసరి ఖైబర్‌కు వెళ్ళి దైవప్రవక్తను కలుసుకుంది. వారంతా ఖైబర్లోనే దైవప్రవక్త (స)ను చూచే భాగ్యం పొందారు.19 దైవప్రవక్త (స) పినతండ్రి కొడుకు కూడా అదే సమయంలో అబిసీనియాలో ఇస్లాం స్వీకరించిన తెగలను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నారు.
ఒకవైపు నుంచి జాఫర్(రజి) అబిసీనియా నుంచి అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన నీగ్రో ముస్లింలను తీసుకురావటం, మరోవైపు నుంచి తుఫైల్ బిన్ అమ్ర్ యమన్ నుంచి దౌస్ తెగవారిని నవముస్లింలుగా వెంటబెట్టుకు రావటం-ఒకేసారి వారంతా ఖైబర్‌కు చేరుకోవటం యూదులకు శరాఘాతం లాంటిది. ఇందులో దేవుని తరపున యూదులకు ఓ సూచన ఉంది. హెచ్చరిక కూడా ఉంది. ఇస్లాం కిరణాలు దూర ప్రదేశాలలో నివసించే నిరక్షరాస్యుల హృదయాలలోకి దూసుకుపోతుండగా, మీరు రాళ్లు ఇటుకలతో కట్టుకున్న కోటలపై ఇంకెంత కాలం ఆధారపడి ఉంటారు? ఇకనయినా ఆత్మావలోకనం చేసుకోండి అని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.20
సఖీఫ్ ప్రతినిధి వర్గం
సఖీఫ్ తెగవారిలో అందరికన్నా ముందు ఇస్లాం శిక్షణ పొందటానికి మదీనా నగరానికి వచ్చిన వ్యక్తి ఉర్వ బిన్ మస్‌వూద్ (రజి). ఈయన తన తెగకు నాయకుడు. హుదైబియా ఒప్పందం సందర్భంగా మక్కా అవిశ్వాసుల తరపున వకాల్తా పుచ్చుకున్నారు. హవాజిన్ల యుద్ధం తరువాత ఈయన ఆలోచనలో మార్పు వచ్చింది. మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. హజ్రత్ ఉర్వకు 10 మంది భార్యలుండేవారు. నలుగురిని మాత్రం ఉంచుకుని మిగిలిన వారందరికీ విడాకులివ్వమని దైవప్రవక్త (స) సూచించారు. దైవప్రవక్త (స) చెప్పినట్లే చేశారాయన.21
హజ్రత్ ఉర్వ (రజి) ఇస్లాం శిక్షణ పొందిన తరువాత దైవప్రవక్త(స) సన్నిధికి వచ్చి, ‘నా తెగవారిలో ఈ సత్యధర్మాన్ని పరిచయం చేసేందుకు అనుమతించండి’ అని విన్నవించుకున్నారు. “అలా చేస్తే నీ జాతివారు నిన్ను బ్రతకనివ్వరేమో!” అన్నారు దైవప్రవక్త. “ఒక ప్రియుడు తన ప్రియనేస్తాన్ని ప్రేమించినంతగా నా తెగవారు నన్ను ప్రేమిస్తారు. దాన్ని గురించి తమరు చింతించకండి” అంటూ తన తెగవారిలో ఇస్లాం ప్రచారాన్ని మొదలెట్టారు ఈ పెద్దమనిషి. ఒక రోజు ఆయన తన ఇంటిపైన నమాజు చేస్తుండగా ఎవరో ఆయనపై బాణం ప్రయోగించారు. ఆ విధంగా ఆయన అమరగతి నొందారు.22
హజ్రత్ ఉర్వ (రజి) సఖీఫ్ తెగవారి మధ్యలేకపోయినప్పటికీ ఆయన చేసిన త్యాగం వృధా కాలేదు. ఆయన చనిపోయిన కొన్నాళ్ళకే తెగవారు కొంతమంది ప్రముఖుల్ని ప్రతినిధులుగా ఎన్నుకుని ఇస్లాం గురించి క్షుణ్ణంగా తెలుసుకు రమ్మని మదీనా పంపించారు.
ఈ ప్రతినిధి బృందం హిజ్రీ 9వ యేట దైవప్రవక్త (సఅసం) దగ్గరకు వచ్చింది. అబ్దె యాలైల్ ఈ బృందానికి నాయకుడు. అతన్ని బోధపరచేందుకు దైవప్రవక్త(స) ఒకప్పుడు తాయఫ్ కొండపైకి వెళ్ళి ఉన్నారు. కాని అతడు దైవప్రవక్త(స) సందేశాన్ని వినలేదు సరికదా, పట్టణంలోని అలగా జనులకు, ఆకతాయి కుర్రాళ్లను ఉసిగొల్పి దైవప్రవక్త (స)ను అవమానపరచాడు. ఇతని ఆదేశానుసారమే జనులు ఆయన (స)పై రాళ్లు రువ్వారు. బురద చల్లారు.
సఖీఫ్ తెగవారిని శపించే అవకాశం దైవ ప్రవక్త (స)కు లభించింది. కాని ఆయన (స) వారి వినాశాన్ని కోరుకోలేదు. వాళ్ళు ఇస్లాం స్వీకరించకపోయినా, భవిష్యత్తులో దైవాజ్ఞలను పాలించేవారు వారిలో పుట్టకపోతారా?! అన్న ఉద్దేశ్యంతో ఆయన వారిని క్షమించి వదలిపెట్టారు. ఆయన(స) ఆశించిందే నిజమయింది. క్రమంగా సఖీఫ్ తెగవారి కరకు గుండెలు కరిగాయి. వారి హృదయ కవాటాలు ఇస్లాం కొరకు తెరచుకునే సమయం వచ్చేసింది. వారంతట వారుగా ఇస్లాం గురించి వాకబుచేస్తూ మహాప్రవక్త (స) సమక్షంలో హాజరయ్యారు.
హజ్రత్ ముగీరా బిన్ షూబా (రజి) దైవప్రవక్త (స) వద్దకు వచ్చి, “వీళ్లు (సఖీఫ్ తెగవారు) నా జాతి ప్రజలు. తమరికేమీ అభ్యంతరం లేదంటే నేను వీళ్ల ఆతిథ్యాన్ని స్వీకరించి, తగు విధంగా సత్కరించగోర్తున్నాను” అన్నారు. “నీ జాతివారికి నీవు స్వాగతం పలికి, అతిథి మర్యాద చేయదలిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే వారి చెవుల్లో దివ్యవచనాలు పడే స్థలాన్ని ఎంపికచెయ్యి” అని చెప్పారాయన(స).
ఆఖరికి మస్జిద్ ప్రాంగణంలోనే వారికోసం శిబిరాలు వేయబడ్డాయి. అక్కడ కూర్చొని వారు దివ్యఖుర్ఆన్ పారాయణాన్ని వినేవారు. ప్రజలు నమాజ్ చేస్తుండగా ఆసక్తిగా చూసేవారు తద్వారా వారిలో ఆశించిన పరివర్తన వచ్చింది. కడకు వారంతా మహాప్రవక్త (స) చేతిపై ప్రమాణం చేస్తూ ఇస్లాం స్వీకరించారు. ప్రతిజ్ఞ చేసే ముందు, తమకు నమాజ్ బాధ్యతనుంచి మినహాయింపు ఇస్తే బావుంటుందని వాళ్లు కోరారు. “నమాజు లేని మత ధర్మంలో శుభశ్రేయాలుండవు” అంటూ మహాప్రవక్త (స) వాళ్ల ప్రతిపాదనను తిరస్కరించారు. “సరే. అలా అయితే మమ్మల్ని జిహాద్ (ధర్మయుద్ధం) చేసే విధి నుంచి జకాత్ నుంచి రాయితీ ఇప్పించండి” అని కోరారు. మహాప్రవక్త (స) ఈ కోర్కెను తాత్కాలికంగా ఆమోదించారు. ఇస్లాం గనక వారి హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోతే వారంతట వారే ఈ రెండు విద్యుక్త ధర్మాల్ని కూడా పాటిస్తారని దైవప్రవక్త (స) ఆశించారు.23
సజీఫ్ తెగనాయకుడైన అబ్దె యాలైల్ దైవప్రవక్త (స)తో మరి కొన్ని విడతల చర్చలు జరిపి క్రింది విషయాలపై కూడా సందేహాలను లేవనెత్తాడు.
- 1) మా జాతివారు తరచూ ఇళ్లు విడిచి ప్రయాణాలు చేస్తుంటారు. కాబట్టి వారు అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవటం మినహా మరో మార్గం లేదు. మరెలా?
దీనికి సమాధానమిస్తూ దైవప్రవక్త (స), “వ్యభిచారం నిషేధించబడింది. వ్యభిచారం దరిదాపులకు కూడా పోరాదనీ, అదొక నీతిమాలిన చేష్ట అనీ, చెడ్డమార్గమనీ ఖుర్ఆన్ అంటోంది” (బనీ ఇస్రాయీల్-4వ రుకూ) అన్నారు.
- 2) “దైవప్రవక్తా! వడ్డీ విషయంలో మీ అభిప్రాయం ఏమిటీ? అది మాకు రావలసిన సొమ్ముకదా?!” అని సందేహపడగా,
“మీకు రావలసిన అసలు సొమ్మును మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వడ్డీని అల్లాహ్ నిషేధించాడు. ‘విశ్వసించిన ఓ ప్రజలారా! దైవానికి భయపడండి. వడ్డీగా మీకు రావలసి ఉన్న దాన్ని వదలిపెట్టండి’ అని అల్లాహ్ ఆజ్ఞాపించాడు” అని ఆయన(స) సమాధానమిచ్చారు.
- 3) “దైవప్రవక్తా! మద్యం గురించి మీరేమంటారు? ఇదైతే దేశవాళీ అరకు. దీన్ని సేవించకపోతే మేము ఉండలేం కదా!” అని ఇంకో ప్రశ్న వేశాడు.
“మద్యాన్ని దేవుడు నిషేధించాడు. అల్లాహ్ ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా?-విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం-ఇవన్నీ అసహ్యకరమైన షైతాను పనులు. వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది అని అల్లాహ్ సెలవిచ్చాడు” అని దైవప్రవక్త (స) సమాధానమిచ్చారు.
మరునాడు అతను మరోసారి వచ్చి, సరే. మీరు చెప్పేవన్నీ మేము ఒప్పుకుంటున్నాం. కాని ‘రబ్బ’ వ్యవహారం ఏం చేద్దాం? అని సందేహపడ్డాడు. తాము పూజించే ‘దేవీ’ని వారు ‘రబ్బ’గా పిలిచేవారు. ‘దాన్ని పడగొట్టండి’ అని దైవప్రవక్త (స) సూచించారు. ప్రతినిధి మండలి సభ్యులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విగ్రహాన్ని పడగొట్టబోతున్నామన్న సంగతి గనక తెలిస్తే దేవి మనందరినీ సర్వనాశనం చేసేస్తుంది అని వారంతా ముక్త కంఠంతో పలికారు.
వారి పరిస్థితిని అప్పటివరకూ ప్రశాంతంగా గమనిస్తున్న హజ్రత్ ఉమర్ (రజి) ఈ మాట వినగానే పెదవి విప్పారు. “ఇబ్నె అబ్దె యాలైల్! మీవాళ్ల తీరు కడుశోచనీయం! అది కేవలం ఒక రాతి విగ్రహం తప్ప మరేమీకాదన్న సంగతి మీకు తెలీదా?” అన్నారు. ఇబ్నె అబ్దె యాలైల్కు కోపం వచ్చింది. ఉమర్ (రజి) వైపు తీక్షణంగా చూస్తూ, “మేము వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు” అన్నాడు.
తరువాత అతను దైవప్రవక్త (స) నుద్దేశించి, “ఆ విగ్రహాన్ని పడగొట్టే బాధ్యతను దైవప్రవక్తకే వదలిపెడదాం. ఎందుకంటే చేతులారా మేము దాన్ని పడగొట్టలేము” అన్నాడు. “సరే. దాన్ని పడగొట్టే వ్యక్తిని నేను పంపిస్తానులెండి” అన్నారు దైవప్రవక్త (స). “ఇప్పుడేవద్దు. మేము వెళ్ళిపోయిన తరువాత పంపండి” అని వారంతా అభ్యర్థించారు.
మొత్తానికి ప్రతినిధులుగా వచ్చిన వారంతా ఇస్లాం స్వీకరించి మరీ వెళ్ళారు. వెళ్ళే సమయంలో తమపై ఎవరినయినా ఇమాముగా నియమించమని విజ్ఞప్తి చేశారు. వారిలో అందరికన్నా పిన్న వయస్కులైన హజ్రత్ ఉస్మాన్ బిన్ అబుల్ఆస్ను వారి ఇమాము (సారథి)గా నియమించారు దైవప్రవక్త (స). ఎందుకంటే ఉస్మాన్ అప్పటికే రహస్యంగా ఖుర్ఆన్ అధ్యయనం చేశారు. షరీయత్ ఆజ్ఞలు తెలుసుకున్నారు.
తమ స్వస్థలానికి తిరిగివస్తూ, మార్గమధ్యంలో వాళ్ళంతా ఒక అవగాహనకు వచ్చారు. తాము ఇస్లాం పుచ్చుకున్న సంగతిని రహస్యంగా ఉంచుదాం. కీడెంచిన తరువాతే మేలెంచుదాం అని అందరూ కూడబలుక్కున్నారు. తాయఫ్కు తిరిగి రాగానే తెగవారంతా వచ్చి, “ఏమయింది?” అని ఆత్రుతతో అడిగారు.
“ఆః ఏం చెప్పమంటారు? ఏ మాత్రం పట్టువిడుపులు లేని కరకు మనిషితో మేము మాట్లాడాల్సి వచ్చింది. మా వల్ల సాధ్యంకాని ఆదేశాలు జారీచేస్తున్నాడు. మా ఆరాధ్య దైవాలైన లాత్ ఉజ్జాలను పడగొట్టాలట! వడ్డీ సొమ్మునంతటినీ వదలుకోవాలట!! సారాయి త్రాగకూడదంట!!! వ్యభిచారం చేయరాదట!!!!”.
“ఇది ముమ్మాటికీ అసంభవం” అని జాతి ప్రజలంతా చెప్పారు.
“మరయితే ఆయుధాలకు పదునుపెట్టండి, సమరసన్నాహాలు మొదలెట్టండి. కోటలకు మరమ్మత్తు చేయండి” అని ప్రతినిధి మండలి సభ్యులు రెచ్చగొట్టారు.
రెండు రోజుల వరకూ సఖీఫ్ తెగవారంతా అదే మాటపై స్థిరంగా ఉన్నారు. మూడో రోజు మెత్తబడి పోయారు.
“ఇంక మేము ముహమ్మద్ (సఅసం)తో పోరాడగలమా? యావత్తు అరేబియా వాసులు ఈ రోజు ముహమ్మద్ (స)ను అనుసరిస్తున్నారు. అలాంటప్పుడు కయ్యానికి కాలుదువ్వి ప్రయోజనమేమిటి? వెళ్ళి ముహమ్మద్ (స) పెట్టే షరతులన్నింటినీ ఒప్పేసుకోండి” అన్నారంతా.
అప్పుడుగాని ప్రతినిధి మండలి అసలు విషయాన్ని బయటపెట్టలేదు.
“ఇప్పుడు నిజం చెబుతున్నాం వినండి! భయభక్తులలో, సత్యసంధతలో, నిజాయితీలో మేము ముహమ్మద్ (సఅసం) కన్నా మిన్న అయిన వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. ఈ ప్రయాణం వల్ల మాకు అనిర్వచనీయమైన శుభాలు ప్రాప్తించాయి” అన్నారు.
మరయితే మీరు ఎందుకు ఈ విషయాన్ని దాచి పెట్టారు? మమ్మల్ని ఆందోళనకు ఎందుకు లోనుచేశారు? అని తాయఫ్వాసులు ఆగ్రహాన్ని వెళ్ళగ్రక్కారు.
“మీ ఆంతర్యాల్లో తిష్ఠవేసి ఉన్న పైశాచిక అహంభావాలను తీసిపారెయ్యడానికే మేమీ ఎత్తువేశాము” అని ప్రతినిధి బృందం చెప్పింది.
ఆ తరువాత అందరూ మూకుమ్మడిగా ఇస్లాం స్వీకరించారు.
కొన్నాళ్లు గడిచాయి. దైవప్రవక్త (స) నియమించిన ఓ పయనబృందం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) నేతృత్వంలో తాయఫ్ చేరుకుంది. లాత్ విగ్రహాన్ని కూల్చివేద్దామని వారంతా నిర్ణయించుకున్నారు. సఖీఫ్ తెగలోని మగవారు, ఆడవారు, వృద్ధులు, పిల్లలు-అందరూ ఇది ఎవరి వల్లా కాని పని అని అనుకునేవారు. పరదాలో ఉండే స్త్రీలు కూడా ఈ తమాషాను చూడటానికి ఇళ్లనుంచి బయటికొచ్చారు. విగ్రహాన్ని కూల్చడానికి హజ్రత్ ముగీరా బిన్ షూబ (రజి) తొలుత బాణం ప్రయోగించారు. కాని మితిమీరిన ఆవేశంలో ఆయన స్వయంగా క్రిందపడి పోయారు. ఈ దృశ్యాన్ని చూసిన సఖీఫ్ తెగ వారికి పూనకం వచ్చినంత పనయింది. “చూశారా! దేవుడు ముగీరాను ధూత్కరించాడు. రబ్బాదేవీ ఇతని పనిపట్టేసింది. ఇక ఈ విగ్రహాలను పడగొట్టడం ఎవరితరమూ కాదు” అంటూ గంతులు వేయసాగారు.
“సఖీఫ్ తెగవారలారా! మీరు వట్టి మూర్ఖులు. ఈ రాతి ముక్క ఏం చేయగలదు? అందుకే ఒక్కడైన దైవాన్ని నమ్మి ఆయన్నే సేవించండి” అని ముగీరా బదులిచ్చారు. మరుక్షణమే ఆయన విగ్రహం ప్రతిష్ఠించబడివున్న ఆలయం తలుపులు మూసేసి విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. తరువాత గోడల్ని పడగొట్టారు. మిగిలినవారు కూడా గోడలన్నింటినీ నేలమట్టం చేశారు.
గర్భగుడిదాకా వెళ్ళమనండి, అది వీళ్ళని నేలలో కూర్చివేస్తుందని విగ్రహ పూజారి చెప్పాడు. ఈ మాటను విన్నంతనే హజ్రత్ ముగీరా గర్భగుడి పునాదుల్ని సయితం పెకలించి వేశారు. ఈ దృశ్యాన్నంతటినీ తదేకంగా తిలకించిన స్థానికుల హృదయాలపై ఇస్లాం చెరగని ముద్రవేసింది.24
అబ్దుల్ ఖైస్ ప్రతినిధి వర్గం
అబ్దుల్ ఖైస్ తెగ తరపున కూడా ఓ ప్రతినిధి వర్గం దైవ ప్రవక్త (స) సన్నిధికి వచ్చింది. “మీరే జాతికి చెందినవారు?” అని దైవప్రవక్త (స) ప్రశ్నించగా, “రబీయా జాతివారమ”ని వారు బదులిచ్చారు. దైవప్రవక్త (స) ఈ బృందానికి స్వాగతం పలికారు. “దైవప్రవక్తా! మీకు – మాకు మధ్య ముజర్ తెగవారు (అవిశ్వాసులు) అవరోధంగా ఉన్నారు. అందుచేత మేము కేవలం పవిత్ర నగరానికి మాత్రమే రాగలము. కనుక మేము, మా జాతివారు ఆచరించవలసిన విద్యుక్త ధర్మాలను స్పష్టపరిస్తే మేము వాటికి కట్టుబడి ఉంటాము” అని వారంతా విన్నవించుకున్నారు.
వారికి దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:
నాలుగు విషయాలను పాటించవలసిందిగా, నాల్గు విషయాలను విడనాడవలసిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. పాటించవలసిన ఆజ్ఞలు ఇవి: 1) ఒకే దైవాన్ని ఆరాధించాలి (‘లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్’ అనే కలిమాకు కట్టుబడి ఉండాలి).
2) నమాజు చేయాలి. 3) జకాతు చెల్లించాలి. 4) రమజాన్ మాసంలో ఉపవాసాలుండాలి. యుద్ధప్రాప్తిగా లభించే సొమ్ములో నుంచి 5వ భాగం (ఖుముస్) ఇవ్వాలి.
మరో నాల్గో విషయాలకు దూరంగా ఉండాలి. 1) దుబ్బా25 2) హంతుమ్, 3) నఖీర్, 4)ముజప్ఫత్-ఈ నాల్గు విషయాలను మీరు స్వయంగా జ్ఞాపకముంచుకోవటమేగాక, మీ భావితరాలకు కూడా జ్ఞాపకం చేయాలి.26
“దైవప్రవక్తా (సఅసం)! నఖీర్ అంటే ఏమిటో తమరికి తెలుసా?” అని వారు ఆశ్చర్యంగా ప్రశ్నించగా, “తెలుసు. ఖర్జూర చెట్టును తొలచి అందులో ఖర్జూరాలు వేస్తారు. దానిపై నీళ్ళు వేస్తారు. అందులో పొంగువస్తుంది. పొంగు తగ్గిన తరువాత దాన్ని సేవిస్తారు. ఆ మత్తులో మీరు మీ బాబాయి కొడుకునే చంపుతారేమో!” అన్నారు దైవప్రవక్త (స). (ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ ప్రతినిధి వర్గంలోకి ఒక వ్యక్తి ఈ సారా మత్తులో మునిగి తన బాబాయి కొడుకునే హతమార్చాడు.)
“దైవప్రవక్తా (స)! మరి మేము మంచి నీరు ఎలా త్రాగాలి?” అని వారు ప్రశ్నించగా, “మూతి కట్టుడు ఉన్న తోలు సంచుల్లో నీరు నిలువ చేసుకోండి” అని దైవప్రవక్త (స) సలహా యిచ్చారు. “దైవప్రవక్తా! మా ప్రాంతంలో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఈ రకమయిన నీటితిత్తులు సురక్షితం కావేమో!” అని వారు సందేహపడగా, “అయినా సరే! మీరు వాటినే ఉపయోగించండి” అని ఆయన (స) చెప్పారు.27
ఈ ప్రతినిధి వర్గంలో జారూద్ బిన్ ముఅల్లా కూడా ఉన్నాడు. అతడు క్రైస్తవ మతస్తుడు. “దైవప్రవక్తా! నాకంటూ ప్రస్తుతం ఒక మతం ఉంది. నేను గనక దాన్ని విడిచిపెట్టి మీ మతం పుచ్చుకుంటే మీరు నా మోక్షానికి హామీగా ఉంటారా?” అని అడిగాడు. “ఉంటాను. ఎందుకంటే నేను బోధించే జీవన విధానం నువ్వు అవలంబించే మతం కన్నా శ్రేష్టమైంది” అన్నారాయన(స). జారూద్తో పాటు మరికొంతమంది క్రైస్తవులు కూడా ఇస్లాం స్వీకరించారు.28
హునైఫ ప్రతినిధి వర్గం
బనూ హునైఫ బృందం కూడా దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చింది. హజ్రత్ సుమామ బిన్ ఉసాల్ (రజి) కృషివల్ల ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ఈ బృందం మదీనా వచ్చి ఇస్లాం స్వీకరించింది. ఈ బృందంలో అబద్ధాగ్రేసరుడైన ముసైలిమా కూడా ఉన్నాడు. వాడు మదీనా నగరానికి వచ్చి, ముహమ్మద్ (స) తదనంతరం తనను ఉత్తరాధికారిగా నియమించడానికి ఒప్పుకుంటే తాను బైత్ (ప్రమాణ స్వీకారం) చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజలకు చెప్పుకున్నాడు. ఈ సంగతి దైవప్రవక్త (స)కు తెలిసింది. ఆ సమయంలో ఆయన(స) చేతిలో ఖర్జూరపు బెత్తం ఉంది. “ఉత్తరాధికారిగా కాదు కదా, కనీసం ఈ బెత్తం ఇచ్చే షరతుపై కూడా నేనతని చేత ప్రమాణస్వీకారం చేయించను” అని దైవప్రవక్త (స) నిర్ద్వంద్వంగా చెప్పారు. “వాడు గనక బైత్ చేయకపోతే దేవుడు వాణ్ణి నాశనం చేస్తాడు. అతని పర్యవసానాన్ని అల్లాహ్ నాకు చూపెట్టాడు. నాకు కల వచ్చింది. నా చేతిలో బంగారు కడియాలున్నాయి. అవి నాకు ఇబ్బందికరంగా తోచాయి. నోటితో ఊదివేయమని నాకు కలలోనే ‘వహీ’ వచ్చింది. నోటితో ఊదగా అవి ఎగిరిపోయాయి. బహుశా వారిద్దరూ ముసైలిమా మరియు అన్సా అని నేను భావిస్తున్నాను” అని ఆయన (సఅసం) వివరించారు.29
‘తై’ తెగ
జైదుల్ ఖీల్ సారథ్యంలో ‘తై’ తెగవారు దైవప్రవక్త (స) వద్దకు వచ్చారు. తెగనాయకుడు ఆయన్ని (స) ఉద్దేశ్యించి “అరేబియాలోని ఏ వ్యక్తి గొప్పదనం గురించి నేను విన్నానో అతన్ని చూచే అవకాశం అనతి కాలంలోనే దక్కింది” అన్నాడు. ఆనాటి నుంచి అతను జైదుల్ ఖైర్‌గా పిలువబడ్డాడు. వీళ్ళంతా కాస్సేపు సంప్రతించిన మీదట ముస్లింలై పోయారు.30
యమన్‌కు చెందిన అష్అరియా తెగవారు కూడా వచ్చారు. వారి రాకను గురించి తెలుసుకున్న దైవప్రవక్త (స) ఇలా అన్నారు:
“యమన్ వాసులు వచ్చారు. వారి హృదయాలు మృదువైనవి, సున్నితమైనవి. విజ్ఞత, విశ్వాసనీయతలు యమన్ వాసులలో ఉన్నాయి. సంయమనం మేకల వారిలో ఉంది. గర్వం అహంకారం తూర్పు ప్రాంతంలో ఉండే ఒంటెల వారిలో ఉన్నాయి.”31
మదీనా నగరంలో ప్రవేశించినపుడు వారి నోట ఈ కవితలు వెలువడ్డాయి.
“రేపు మేము మా మిత్రులను కలుసుకుంటాము. ముహమ్మద్ (స) మరియు ఆయన సహచరులే మా మిత్రులు”.32
అజ్ద్ బృందం
ఈ బృందంలో ఏడుగురు సభ్యులున్నారు. దైవప్రవక్త (స) సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన(స) వారి సంస్కారాన్ని చూసి మెచ్చుకున్నారు. “ఎవరు మీరు?” అనడిగారు. “మేము విశ్వాసులం” అన్నారు. “అది సరే. ప్రతివాక్కు వెనుక ఓ వాస్తవికత ఉంటుంది. మీ విశ్వాసంలోని విశిష్టత, వాస్తవికత ఏమిటో చెప్పండి?” అన్నారు దైవప్రవక్త (స). అప్పుడు వారిలా అన్నారు. “మాలో 15 గుణాలున్నాయి. వాటిలో ఐదింటిని విశ్వసించమని మీ ప్రతినిధులు మాకు ఆదేశించి ఉన్నారు. మరో ఐదింటిని పాటించవలసినదిగా తమరు మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఇంకో ఐదు నియమాలకు మేము మునుపటి నుంచే కట్టుబడి ఉన్నాము.
దైవప్రవక్త (స) నియమించి పంపిన ప్రతినిధులు జారీ చేసిన 5 ఆదేశాలు ఇవి: దైవాన్ని, దైవదూతల్ని, దైవగ్రంథాలను, దైవప్రవక్తలను, మరణానంతరం తిరిగిలేపబడే విషయాన్ని విశ్వసించాలి.
5 విషయాలను ఖచ్చితంగా ఆచరించవలసిందిగా మాకు ఆజ్ఞాపించబడింది.-1) ‘లా యిలాహ ఇల్లల్లాహ్’ అనే వచనాన్ని పలకాలి. 2) 5 పూటల నమాజులను నెలకొల్పాలి 3) జకాత్‌ను చెల్లించాలి 4) రమజాన్ ఉపవాసాలను పాటించాలి. 5) స్థోమత ఉంటే హజ్‌యాత్ర చేయాలి.
ముందు నుంచే మేము కట్టుబడి ఉన్న 5 సూత్రాలు: 1) కలిమిలో కృతజ్ఞతలు చెల్లించటం. 2) లేమిలో ఓర్పు వహించటం. 3) దైవేచ్ఛపై రాజీపడిపోవటం. 4) పరీక్షా ఘడియల్లో స్థయిర్యం కనబరచటం 5) శత్రువును సయితం దుర్భాషలాడకుండా ఉండటం.
వారి ఈ మాటల్ని విన్న దైవప్రవక్త (స) మెచ్చుకోలుగా చూశారు. ఈ సూత్రాలను బోధించిన వారు వివేకవంతులనీ, మహాజ్ఞానులనీ కొనియాడారు. బహుశా ఈ ఉపదేశం చేసిన వారు దైవప్రవక్తలై ఉండవచ్చని కూడా అన్నారు. మరో ఐదు విషయాలు మీకు చెబుతాను. వాటిని కూడా మీరు పాటిస్తే 20 సూత్రాలకు కట్టుబడిన వారవుతారు. అవేమంటే-
- 1) మీరు తినలేని వస్తువులను సమకూర్చుకోకండి.
- 2) మీరు నివసించని ఇళ్లను నిర్మించకండి.
- 3) రేపటి రోజున మీరు విడిచి పోవలసిన విషయాలలో పరస్పరం పోటీ పడకండి.
- 4) మీరు ఏ ప్రభువు సమక్షంలో హాజరు కానున్నారో ఆయనకు భయపడండి.
- 5) శాశ్వత నివాస స్థలమైన పరలోకంలో మీకు పనికి వచ్చే వాటికోసం ప్రయత్నిస్తూ ఉండండి.
దైవప్రవక్త (సఅసం) ఉపదేశాన్ని వారు ఖచ్చితంగా పాటించారు.33
ఆనాడు అరేబియా ఉత్తరాది ప్రాంతం కానిస్టాంటినోపుల్ అధీనంలో ఉండేది. ఈ ప్రాంతానికి ఫరోహ్ బిన్ అమ్ర్ గవర్నరుగా ఉండేవాడు. మఆన్ అతని రాజధాని నగరం. పాలస్తీనా సరిహద్దు భూభాగం కూడా ఇతని అధీనంలోనే ఉండేది.
దైవప్రవక్త (సఅసం) ఇతనికి ఇస్లాం సందేశం పంపించారు. ఫరోహ్ ఇస్లాం స్వీకరించాడు. దైవప్రవక్త (స) దగ్గరకు తన దూతను పంపిస్తూ, కానుకగా ఒక తెల్లని కంచెరగాడిదను కూడా సమర్పించుకున్నాడు.
ఈయన ఇస్లాం స్వీకరించారన్న సంగతి కానిస్టాంటినోపుల్ చక్రవర్తికి తెలియగానే, గవర్నర్ పదవి నుంచి ఉద్వాసన పలికి, ఈయన్ని వెనక్కి పిలిపించాడు. ఇస్లాం ధర్మం నుండి మరలిపొమ్మని ముందు నచ్చజెప్పాడు. హజ్రత్ ఫరోహ్ (రజి) చక్రవర్తి సలహాను త్రోసిపుచ్చటంతో ఆయన్ని కారాగారంలో పెట్టారు. అప్పటికీ ఆయన ఇస్లాం ధర్మానికే కట్టుబడి ఉండటంతో ఉరితీయమని ఆజ్ఞాపించాడు. పాలస్తీనా పట్టణంలోని అఫ్రా చెరువు దగ్గర ఆయన ఉరితీయబడ్డారు.
హమ్దాన్ బృందం
ఈ తెగవారు యమన్దేశంలో నివసించేవారు. ఇస్లాం ధర్మ పరిచయం నిమిత్తం ఖాలిద్ బిన్ వలీద్ (రజి) అక్కడికి పంపబడ్డారు. చాలాకాలం అక్కడే ఉన్నారు. కాని అక్కడ ఇస్లాం వ్యాప్తి చెందలేదు. ఆఖరికి హజ్రత్ అలీ (రజి)కి దైవప్రవక్త (స) ఈ బాధ్యతను అప్పగించారు. ఆయన కృషివల్ల ఒక్క రోజులోనే తెగవారంతా ముస్లింలైపోయారు.
హజ్రత్ అలీ (రజి) ఈ సంగతిని వివరిస్తూ దైవప్రవక్త (స)కు ఉత్తరం వ్రాశారు. ఈ సంగతి తెలుసుకున్న దైవప్రవక్త (స) దైవసన్నిధిలో కృతజ్ఞతా పూర్వకంగా ప్రణామం చేశారు. “హమదాన్ వారలకు శాంతి చేకూరు గాక” అన్న వచనం ఆ శుభ సమయంలో ఆయన (స) నోట వెలువడింది. హజ్రత్ అలీ (రజి) చేతులమీదుగా ఇస్లాం స్వీకరించినవారే ఇప్పుడు దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చారు.
తారిఖ్ బిన్ అబ్దుల్లా ఇలా అంటున్నారు.
నేను మక్కాలో మజాజ్ అంగడిలో నిలబడి ఉన్నాను. అంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఎలుగెత్తి ప్రకటించసాగాడు.
“ప్రజలారా! లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకండి ముక్తి పొందుతారు”.
అంతలోనే మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. అతను మొదటి వ్యక్తిపై కంకరరాళ్లు రువ్వుతూ, “ప్రజలారా! వీడి మాటల్ని నమ్మకండి. వీడు అబద్ధాలకోరు” అని అంటున్నాడు. “ఎవరితను?” అని నేను వాకబు చేశాను.
ఇతను బనూ హాషిమ్కు చెందిన వ్యక్తి. తాను దైవప్రవక్త (స)నని అంటున్నాడు. రెండవ వ్యక్తి అతని పినతండ్రి అబ్దుల్ ఉజ్జా (అబూ లహబ్ అసలు పేరు అబ్దుల్ ఉజ్జా) అని జనులు చెప్పారు. ఈ సంఘటన జరిగి అనేక సంవత్సరాలు గడిచాయని తారిఖ్ చెప్పారు. మా తెగకు చెందిన కొంతమంది ఖర్జూర పండ్లు కొనే ఉద్దేశంతో మదీనాకు ప్రయాణం కట్టారు. ఆ వర్తక బృందంలో నేనూ ఉన్నాను. నగర పొలిమేరల్లో ఆగి బట్టలు మార్చుకున్నాము. అంతలో ఒక వ్యక్తి అటువైపు వస్తూ కనిపించాడు. అతని ఒంటిపై రెండు పాత దుప్పట్లు మాత్రం ఉన్నాయి. మాకు సలాం చేసిన తరువాత “ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి కెళుతున్నారు?” అని ప్రశ్నించాడు. ‘రబ్జా’ నుంచి వచ్చామనీ, మదీనా నగరానికి వెళ్ళే ఉద్దేశ్యంతోనే వచ్చామనీ అతనికి చెప్పాము. “ఏమిటీ విశేషం?” -మళ్ళీ ప్రశ్నించాడావ్యక్తి.
“ఖర్జూరపండ్లు కొనేందుకు వచ్చాం” అన్నాము. మా దగ్గర ఓ అందమైన ఎర్రని ఒంటె ఉండేది.
“ఈ ఒంటెను అమ్ముతారా?”
“అమ్ముతాము. కాని దాని మూల్యానికి సరిపడా ఖర్జూరపండ్లు ఇస్తేనే అమ్ముతాం” అని చెప్పాం. అంతే, ఆ వ్యక్తి బేరసారాలేమీ చేయకుండానే ఒంటె పగ్గాలు పట్టుకుని నగరం వైపుకు సాగిపోయాడు. మేమలా చూస్తూ నిలబడి పోయాము. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తరువాత గాని మేము చేసిన వ్యవహారం ఎలాంటిదో అర్థం కాలేదు. అదేమిటీ? ముక్కూ మొహం తెలియని వ్యక్తికి ఒంటెను ఇచ్చేసి దిక్కులు చూస్తున్నాం. దాని మూల్యం అసలు మనకు లభిస్తుందా?! అని కొందరు సందేహపడ్డారు.
మా బిడారులో ఓ కులీన స్త్రీ ఉంది. ఆమె దూరదృష్టి గల మహిళ. మా సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఆమె ఇలా అంది: మీరేమీ బెంగపడకండి. నేనతని ముఖారవిందాన్ని పరికించాను. పూర్ణచంద్రునిలా ఆ మోము ప్రకాశిస్తోంది. ఆ వ్యక్తి ముమ్మాటికీ మిమ్మల్ని మోసగించడు. ఒకవేళ ఆ మూల్యం మీకు ఇవ్వకపోతే నేను చెల్లిస్తాను.”
మేము ఈ విషయాన్ని చర్చించుకుంటూ ఉండగానే ఒక వ్యక్తి వచ్చి, “దైవప్రవక్త (స) నన్ను మీ వద్దకు పంపించారు. ఒంటె వెలకు సమానంగా ఖర్జూరపండ్లు ఇచ్చి రమ్మన్నారు. మీకు అతిథి మర్యాదగా మరికొన్ని ఖర్జూరపండ్లు కూడా ఇచ్చారు. ముందు భోజనం చేసి, ఆ తరువాత మీకు రావలసిన ఖర్జూరాలను కొలిచి తీసుకోండి” అన్నాడు. మేము భోజనాదుల్ని ముగించుకుని నగరంలోకి ప్రవేశించాము. మా దగ్గర ఒంటెను కొన్న వ్యక్తే మస్జిద్ వేదికపై నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఆయన చెప్పే ఈ మాటలు మా చెవినపడ్డాయి.
‘ప్రజలారా! దానధర్మాలు చేయండి. మీరిచ్చే దానాలు మీ పాలిట శ్రేయస్కరం అవుతాయి. ఇచ్చే చేయి పుచ్చుకునే చేయికన్నా ఉత్తమమైనది. (కాబట్టి ఇవ్వటం అలవరచుకోండి) మీ తల్లికి ఇవ్వండి, తండ్రికివ్వండి, చెల్లెలికివ్వండి, సోదరునికివ్వండి, ఆ తరువాత సమీప బంధువులకివ్వండి, ఆపైన ఇతర బంధువుల కివ్వండి…’34
నజీబ్ బృందం
నజీబ్ తెగకు చెందిన 13 మంది వచ్చారు. వీళ్లు తమ తెగవారి జకాత్ ధనాన్ని తీసుకువచ్చారు. ఈ సొమ్మును వాపసు తీసుకువెళ్ళి అక్కడి పేదలకు పంచిపెట్టుమని దైవప్రవక్త (స) సూచించారు.
“దైవప్రవక్తా (స)! పేదలకు ఇవ్వగా మిగిలిన ధనాన్నే మేము యిక్కడికి తెచ్చాము” అని వాళ్ళన్నారు.
“దైవప్రవక్తా (స)! ఇప్పటి వరకూ యిక్కడి కొచ్చిన బృందాలన్నింటిలోకీ ఉత్తమ బృందం యిది” అని హజ్రత్ అబూబక్ర్ (రజి) అభిప్రాయపడ్డారు.
“సన్మార్గం, సద్బుద్ధి సర్వోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉంది. ఆయన తాను తలచిన వారికి ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. తాను కోరిన వారి హృదయాన్ని ఈ భాగ్యం కోసం తెరుస్తాడు” అని కారుణ్యమూర్తి (సఅసం) చెప్పారు.
వాళ్లు దైవప్రవక్త (సఅసం) సమక్షంలో కొన్ని ధర్మ సందేహాలు వెలిబుచ్చారు. దైవప్రవక్త (స) వారి సందేహాలన్నింటికీ జవాబు వ్రాయించారు.
వీళ్లు ఖుర్ఆన్ హదీసుల పట్ల ఎక్కువ శ్రద్ధాసక్తులను కనబరిచారు. అందువల్ల వారికి తగు సౌకర్యాలు కల్పించే నిమిత్తం దైవప్రవక్త (స) హజ్రత్ బిలాల్ (రజి)ను నియమించారు.
కాని వారు మదీనాలో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారు. వారి మనసంతా తమ స్వస్థలం మీదే ఉంది. పైకి మాత్రం చెప్పలేకపోతున్నారు. మీ వ్యాకులతకు కారణం ఏమిటి? అని కొంతమంది అనుచరులు దర్యాప్తు చేయగా వాళ్ళిలా అన్నారు: “దైవప్రవక్త (స) సహచర్యభాగ్యం వల్ల మాకు లభించిన కాంతి కిరణాలను, ఆయన (స) ఉపదేశాల వల్ల మాకు కలిగిన ప్రయోజనాన్ని, ఇక్కడికొచ్చాక మాకు చేకూరిన శుభాలను మా తెగ వారందరికీ ఎప్పుడు తెలియజేయాలా అని మేము ఆరాటపడుతున్నాము.”
దైవప్రవక్త (స) వీళ్ళందరికీ కానుకలు ఇచ్చారు. మీలో ఎవరయినా ఇంకా మిగిలి ఉన్నారా? అని కూడా అడిగారు. ‘అవును ఒక అబ్బాయి మా సామానునకు కాపలాగా ఉన్నాడు’ అని వారు బదులిచ్చారు. ‘అయితే అతన్ని కూడా పంపించండి’ అని దైవప్రవక్త (స) చెప్పారు. ఆ అబ్బాయి వచ్చి, “దైవప్రవక్తా (స)! తమరు మా తెగవారిపై ఎంతగానో దయ చూపారు. నాక్కూడా ఏదైనా ప్రసాదించండి” అన్నాడు.
“నీకేం కావాలి?” ప్రశ్నించారు దైవప్రవక్త (స).
“దైవప్రవక్తా(స)! నా వ్యవహారం మా తెగవారి వ్యవహారంకన్నా కొంచెం విలక్షణమైంది. వారంతా ఇస్లాం పట్ల గల అభిమానంతో యిక్కడి కొచ్చారన్న సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు సదఖా సొమ్మును కూడా మీ వద్దకు తెచ్చారు” అన్నాడా యువకుడు.
“మరయితే నీకేం కావాలో చెప్పావు కాదు” అడిగారు దైవప్రవక్త.
“తమరు నా మన్నింపు కోసం ప్రార్థిస్తారనీ, నాపై దయజూపమని దైవాన్ని వేడుకుంటారనీ, నాకు ఆత్మ తృప్తిని ప్రసాదించమని ప్రభువును అభ్యర్థిస్తారన్న ఆశతో యిక్కడికి వచ్చాను”- చెప్పాడా నవయువకుడు.
దైవప్రవక్త (స) అతని కోసం అలాగే ప్రార్థించారు. హిజ్రీ 10వ యేట దైవప్రవక్త (స) హజ్‌యాత్ర చేసినపుడు కూడా ఈ తెగవారు అక్కడికి వచ్చి ఆయన్ని (స) కలుసుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (స) ఆ అబ్బాయి ధార్మిక స్థితిని గురించి వాకబు చేశారు. దానికి వారు, “ఆ అబ్బాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. నెమ్మదస్తుడు, నిస్వార్థపరుడు, నిరపేక్షాపరుడు. తన ముందు ప్రపంచ సిరిసంపదలు పంపిణీ అవుతున్నాసరే తనకేమీ అక్కరలేదన్నట్లుగా ప్రవర్తిస్తాడు. కనీసం వాటి వంక కన్నెత్తి కూడా చూడడు.”35
బనీ సాద్ హుజైమ్ బృందం
ఈ బృందం మదీనాకు వచ్చిన సమయంలో దైవప్రవక్త (సఅసం) అంత్యక్రియల నమాజుకు సారథ్యం వహించి ఉన్నారు.
దైవప్రవక్త (స)ను కలుసుకునే దాకా తాము ఏ పనీ చేయరాదని వారంతా కూడబలుక్కున్నారు. అందుకే వారంతా ఒక ప్రక్కకు జరిగి కూర్చున్నారు. దైవప్రవక్త (స) నమాజు పూర్తయ్యాక వారిని పిలిపించారు. “మీరు ముస్లిములేనా?” అని అడిగారు. “అవును” అన్నారు వారంతా.
“మరి మీరు మీ సోదరుని కోసం జరిగే ప్రార్థన (దుఆ) లో ఎందుకు పాల్గొనలేదు?”
“దైవప్రవక్త (స) చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసేదాకా బహుశా ఏ పనీ చేయరాదుగామోలు! అనుకున్నాం.”
“అది సరైన పద్ధతి కాదు. మీరు ఇస్లాం స్వీకరించిన మరు క్షణం నుంచే ముస్లింలుగా మీ బాధ్యతల్ని నెరవేర్చాలి” అన్నారు దైవప్రవక్త (స)
అంతలోనే మరో ముస్లిం వ్యక్తి కూడా వచ్చి వారితో చేరాడు. వాళ్లతన్ని తమ వాహనాల దగ్గర వదలి వచ్చారు.
“దైవప్రవక్తా(స)! ఇతను మాకన్నా చిన్నవాడు. అందుకే మా సేవలో నిమగ్నుడై ఉన్నాడు” అని వాళ్ళు చెప్పారు.
“చిన్నవాడు తమ పెద్దల సేవకుడై ఉంటాడు. దేవుడితనికి శుభం చేకూర్చుగాక!” అని దైవప్రవక్త (స) దీవించారు. ఈ దీవెనలను అందుకున్న ఆ వ్యక్తి తన జాతికి నాయకుడయ్యాడు. దివ్యఖుర్ఆన్ అవగాహనలో తమ వారందరికన్నా మేటిగా రాణించాడు.
ఈ ప్రతినిధి బృందం మదీనా నుండి తమ నివాసానికి తిరిగి వెళ్ళాక ఆ తెగ వారంతా ముస్లింలైపోయారు.36
బనీ అసద్ బృందం
వీళ్లు పది మంది వరకూ ఉన్నారు. వారిలో వాబిస బిన్ మాబద్, ఖువైలిద్లు కూడా ఉన్నారు. దైవప్రవక్త (సఅసం) తన సహచరులతో మస్జిద్ లోపల కూర్చొని ఉండగా వారు వచ్చారు. “దైవప్రవక్తా! దేవుడు ఒక్కడేననీ, ఆయనకు సహవర్తులెవరూ లేరనీ, తమరు ఆ దేవుని దాసులు మరియు ప్రవక్తయనీ మేము సాక్ష్యమిస్తున్నాము. చూడండి దైవప్రవక్తా (స)! మా అంతట మేముగా వచ్చి ఇస్లాం స్వీకరిస్తున్నాం. మీరు మీ తరపున ఎవరినీ మా వద్దకు పంపించలేదు” అని వారిలో ఒకతను చెప్పాడు. అతని ధోరణి అల్లాహ్‌కు నచ్చలేదు. అప్పుడు దివ్య ఖురాన్‌లోని ఈ వాక్యం అవతరించింది:
పశుపక్ష్యాదుల ద్వారా జోస్యం చూడటం, శకునాలు చూడటం గురించి వారు ప్రశ్నించగా, అలాంటి వాటన్నింటికీ దూరంగా ఉండాలని ఆయన (స) బోధించారు.
“దైవప్రవక్తా (స)! ఇంకొక్క సందేహం తీర్చండి” అన్నారు వారు. “ఏమిటదీ!?” అని అడగ్గా, “రేఖలు గీయటం గురించి చెబుతారా?” అని సందేహపడ్డారు. దానికి ఆయన(స) పూర్వకాలంలో దైవప్రవక్త ఒకరు ఆ విద్యను నేర్పి ఉన్నారు. ఆ విద్య ప్రామాణిక ఆధారాలతో గనక మీకు అందితే అప్పుడు దాన్ని అభ్యసించవచ్చు” అని వివరించారు.37
బహ్రా బృందం
వీళ్లు మదీనా వచ్చి హజ్రత్ మిఖ్దాద్ (రజి) ఇంటి ముందర తమ ఒంటెల్ని కూర్చోబెట్టారు. వీళ్లకోసం వంట చేయమని ఆయన తన ఇంటి ఆడవాళ్ళకు చెప్పి, వారికెదురుగా వెళ్ళారు. వారికి స్వాగతం పలికి తన ఇంటికి పిలుచుకు వచ్చారు. వారికి ‘హైస్’ అనే పదార్థాన్ని వడ్డించారు. ఇది అరేబియా ప్రాంతపు రుచికరమైన, స్వాదిష్టమైన వంటకం. ఖర్జూరపండ్లు, పిండి, నెయ్యి కలిపి వండుతారు. తినేవారి అభిరుచిని బట్టి కొంత కొవ్వును కూడా వేస్తారు. ఆ వంటలో కొంత భాగం దైవప్రవక్త (స)కు పంపటం జరిగింది. దైవప్రవక్త (స) కొద్దిగా తిని మిగిలిన దాన్ని తిప్పి పంపించారు. ఆ రోజు నుంచీ హజ్రత్ మిఖ్దాద్ ఆ వంటపాత్రను అతిథుల ముందు సమర్పించేవారు. అతిథులు సుష్టుగా ఆరగించేవారు. అయినాసరే అన్నం తరిగేదికాదు. ఈ విషయం వారి కాశ్చర్యం కలిగించేది. ఆ విషయమే ఒకనాడు అడిగేశారు.
“మిఖ్దాద్! మదీనా వాసులు రాగి, గోధుమలను తింటారని మేము విన్నాం. కాని మీరు మాత్రం మా అభిరుచికి తగ్గట్టుగా మేము తినే స్వాదిష్టమైన ఆహారపదార్థాన్ని ప్రతిరోజూ తినిపిస్తున్నారు. మా వాళ్లు ప్రతిరోజూ దీన్ని తినలేరు. అందులోనూ ఇంత రుచికరమైన భోజనం అసలే లభ్యంకాదు.
“అసలు విషయం చెబుతాను వినండి! ఇదంతా దైవప్రవక్త(స) వారి చలువ. ఎందుకంటే దైవప్రవక్త (సఅసం) వారి చేతివేళ్లు ఈ ఆహారపదార్థానికి తగిలాయి. అందువల్ల ఇందులో శుభం, సమృద్ధి జరిగాయి” అని మిఖ్దాద్ (రజి) చెప్పారు.
ఈ సంగతి విన్నంతనే వారి విశ్వాసం మరింతగా ఇనుమడించింది. “నిస్సందేహంగా ఆయన(స) దైవప్రవక్తే” అన్న మాటలు వారి నోట వెలువడ్డాయి. వాళ్లు కొంత కాలం మదీనాలో ఉండి ఖుర్ఆన్ ఆదేశాలను నేర్చుకుని తిరిగి వెళ్ళారు.38
హౌలాన్ బృందం
ఈ బృందంలో పదిమంది ఉన్నారు. హిజ్రీ 10వ సంవత్సరం వీళ్లు దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చారు. “దైవప్రవక్తా (స)! మేము మా జాతివారి బడుగుజనుల తరపున ప్రతినిధులుగా వచ్చాము. మేము దైవాన్ని, దైవప్రవక్తను విశ్వసించాము. సుదీర్ఘ ప్రయాణం చేసి మీ వద్దకు వచ్చాము. దైవం మరియు దైవప్రవక్త (స) మాకు చేసిన ఉపకారం మహోన్నతం. కేవలం మిమ్మల్ని దర్శించుకునే ఉద్దేశ్యంతో వచ్చాము” అని వారు విన్నవించుకున్నారు.
“మదీనా వచ్చి నన్ను సందర్శించిన వారు ప్రళయదినాన నా పొరుగు వారుగా ఉంటారు” అని ఆయన (స) చెప్పారు.
“అవునూ, ఉమ్మె అనస్ సంగతులేమిటీ?” (అదొక విగ్రహం పేరు. ఆ తెగవారంతా ఆ విగ్రహాన్ని పూజించేవారు) అని దైవప్రవక్త (స) అడిగారు. “తమరి ప్రబోధనల మూలంగా మేము ఈ విగ్రహారాధనను మానుకున్నాము. కాకపోతే ఇప్పటికీ కొద్దిమంది వృద్ధులు ఈ విగ్రహ పూజను మానుకోలేకుండా ఉన్నారు. మొత్తానికి మేము అల్లాహ్‌కు కృతజ్ఞులమై ఉన్నాము” అన్నారు.
మేము తరతరాలుగా మోసానికి గురై ఉన్నాము. ఇక మీదట ఈ మోసాన్ని సాగనివ్వం. అక్కడికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని కూడా నామరూపాల్లేకుండా చేసేస్తాం అని వారు హామీ యిచ్చారు. ఆ మేరకు ఏదైనా ఒక సంఘటనను వినిపిస్తారా? అని మహాప్రవక్త(స) అడగ్గా వారిలా వివరించారు: “దైవప్రవక్తా (స)! ఒకరోజు మేము అందరం కలసి బలి జంతువులను సేకరించాం. జంతువులన్నింటినీ ఒకే రోజు ఉమ్మె అనస్ పేర బలి యిచ్చాం. ఆ మాంసాన్ని క్రూరమృగాలకోసం వదలిపెట్టేశాం. మాకు పశువుల అవసరం ఉన్నప్పటికీ బలి ఇవ్వాల్సి వచ్చింది. తినడానికి మాంసం లేకపోయినప్పటికీ ఆ మాంసాన్ని అడవి మృగాల కోసం, కాకులు గద్దలకోసం అర్పించుకోవలసి వచ్చింది. – అలాగే ఎవరయినా వ్యవసాయం చేస్తే పంట చేనులోనూ ఉమ్మెఅనస్ కోసం భాగం కేటాయించవలసి వచ్చేది. గట్టు ప్రక్కన ఉన్న భాగాన్ని మాత్రం దేవుని కోసం నిర్ధారించేవారు. పంటకు ఏదన్నా తెగులు వచ్చి దిగుబడి తగ్గితే అప్పుడు దేవుని భాగం ఉమ్మె అనస్‌కు ఇచ్చేవారుగాని. ఉమ్మెఅనస్ భాగం మాత్రం దేవునికి ఇచ్చేవారు కాదు”.
దైవప్రవక్త (సఅసం) ఈ ప్రతినిధి మండలికి ధార్మిక విధులు నేర్పారు. కొన్ని విషయాలను గురించి వారికి గట్టిగా తాకీదు చేశారు. అవేమంటే.
- 1. వాగ్దానాన్ని నెరవేర్చాలి.
- 2. అప్పగింతలను వాటి సంబంధీకులకు అప్పగించాలి.
- 3. ఇరుగు పొరుగు వారితో ఉత్తమంగా మసలుకోవాలి.
- 4. ఎవరిపైనా దౌర్జన్యానికి దిగకూడదు. అన్యాయం, అక్రమం ప్రళయ దినాన అంధకారంగా పరిణమిస్తుంది.39
ముఖారిబ్ ప్రతినిధి వర్గం
వీళ్లు కూడా 10 మంది వరకూ ఉన్నారు. తమ జాతివారికి ప్రాతినిధ్యం వహిస్తూ హిజ్రీ 10వ యేట మదీనా వచ్చారు. వీళ్లకు అతిథి మర్యాద చేసే బాధ్యత హజ్రత్ బిలాల్ (రజి) కు అప్పగించబడింది. ఉదయం, సాయంత్రం కూడా ఆయనే (రజి) వారికి భోజనాదులు తెచ్చేవారు. ఒకరోజు మధ్యాహ్నం (జుహ్ర్) నుంచి సాయంత్రం (అస్ర్) వేళ వరకూ దైవప్రవక్త (స) ఈ ప్రతినిధి వర్గానికి సమయం కేటాయించారు.
వారిలో ఒక వ్యక్తి మహాప్రవక్త (స)ను అదే పనిగా చూడసాగాడు. ‘తమర్ని నేనెక్కడో చూసినట్లు గుర్తు’ అన్నాడు.
మళ్ళీ అతనే, “అవును. తమరు కూడా నన్ను చూశారు. నాతో మాట్లాడారు. కాని నేను మీకు దురుసుగా జవాబిచ్చాను. మిమ్మల్ని తిట్టాను. అది అకాజ్ బజారులో జరిగిన సంఘటన. ఆ సమయంలో దైవప్రవక్త (స) జనులకు ఇస్లాం సందేశం ఇస్తూ తిరుగుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది…” అని చెప్పుకు పోతున్నాడా వ్యక్తి.
దానికి దైవప్రవక్త(స) “సరే ఇక ఆ సంగతిని మరచిపో” అన్నారు.
దైవప్రవక్తా(స)! ఆ రోజు నా మిత్రుల్లో అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని వ్యతిరేకించిన వాణ్ణి నేనే. ఇస్లాం పట్ల అందరి కన్నా బద్ధవిరోధిగా ఉన్నదీ నేనే. కాని నా మిత్రులంతా తమ పూర్వీకుల ధర్మంపైనే చనిపోయారు. ఈ రోజు వరకూ నన్ను బ్రతికించి, తమరి దైవదౌత్యాన్ని విశ్వసించే భాగ్యం కలుగజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నాడా వ్యక్తి.
“అందరి హృదయాలు దేవుని అధీనంలో ఉన్నాయి” -అన్నారు దైవప్రవక్త (స).
“దైవప్రవక్త (స)! నా పూర్వాశ్రమ స్థితిని మన్నించమని దైవాన్ని ప్రార్థించండి” అని విన్నవించుకున్నాడా వ్యక్తి.
“అవిశ్వాస స్థితిలో జరిగిన దురాగతాలన్నింటినీ ఇస్లాం నిర్మూలిస్తుంది” అని దైవప్రవక్త (స) ఓదార్చారు.40
బనీ అబస్ బృందం
దైవప్రవక్త (సఅసం) పరమపదించక నాలుగు మాసాల ముందు ఈ బృందం నజరాన్ ప్రాంతం నుంచి వచ్చింది. వారు ఆయన్ని (సఅసం) ఉద్దేశించి, “దైవప్రవక్తా(స)! “హిజ్రత్ (వలస) చేయని వారి ఇస్లాం ఇస్లామే కాదు” అని మీరు చెప్పినట్లు ఉపన్యాసకులు అంటున్నారు. మా దగ్గర సిరిసంపదలున్నాయి. పొలాలు, పశువులున్నాయి. వాటిపై ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. వలసపోనంత వరకూ ఇస్లాం ధర్మం మా యెడల శ్రేయోదాయకం కాదంటే మేము వాటన్నింటినీ వదలుకుని మీ వద్దకు వచ్చేస్తాం. మాకు మేలుచేకూర్చని ఆస్తిపాస్తులు మాకెందుకు?” అని విన్నవించుకున్నారు.
“అక్కరలేదు. మీరు మీ ప్రాంతంలోనే ఉండి భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీ ఆచరణల్లో రవ్వంత లోటు కూడా ఏర్పడదు” అని మహాప్రవక్త (స) హామీ యిచ్చారు.41
ఘామిద్ బృందం
ఈ బృందం హిజ్రీ 10వ యేట వచ్చింది. వారు 10 మంది ఉన్నారు. నగర పొలిమేరల్లో ఆగి, అక్కడ ఒక కుర్రాడిని కూర్చోబెట్టి దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చారు.
“మీ సామాను వద్ద ఎవరున్నార”ని ప్రశ్నించారాయన(స).
“ఒక అబ్బాయిని కాపలాగా పెట్టి వచ్చాము.”
“ఆ అబ్బాయి నిద్రపోయాడు కదా! అంతలో ఒక వ్యక్తి వచ్చి గడియారం దొంగిలించాడు.”
“దైవప్రవక్తా! ఆ గడియారం నాది” అన్నాడు అందులోని ఒక వ్యక్తి.
“కంగారు పడకండి. ఆ అబ్బాయి మేల్కొని దొంగను వెంబడించాడు. అతన్ని పట్టుకుని, తస్కరించబడిన వస్తువును తిరిగి రాబట్టుకున్నాడు” అని చెప్పారు ఆయన (స).
ఆ సభ్యులు తమ సామానున్న చోటికి పోయి విచారిస్తే, మహాప్రవక్త(స) చెప్పిందంతా అక్షరసత్యమని తెలిసింది. మరుక్షణమే వారంతా ఇస్లాం స్వీకరించారు. దైవప్రవక్త (స) ఉబై బిన్ కాబ్ (రజి)ను వారికి గురువుగా నియమించారు. ఆయన వారికి ఖుర్ఆన్ సూరాలు కంఠస్థం చేయించారు. షరీయతు ఆదేశాలను విశదీకరించారు. వారు తమ ప్రాంతానికి తిరిగి వెళుతున్నప్పుడు ఒక కాగితంపై షరీయతు ఆజ్ఞలు లిఖించి వారికివ్వటం జరిగింది.42
బనీ ఫజారా బృందం
దైవప్రవక్త (స) తబూక్ నుండి తిరిగి వచ్చే సమయానికి ఆయన(స) వద్దకు ఫజారా తెగకు చెందిన ఒక ప్రతినిధి వర్గం వచ్చింది. అందులో 15 మంది సభ్యులున్నారు. అప్పటికే వారు ఇస్లాం స్వీకరించారు. వారి వాహనాలు మరీ బలహీనంగా, బక్క చిక్కి ఉన్నాయి. “మీ ప్రాంతం వారంతా కుశలమేనా?” అని దైవప్రవక్త (స) ప్రశ్నించారు.
“దైవప్రవక్తా (స)! మా ప్రాంతంలో దుర్భిక్షం ఏర్పడింది. పశువులు చనిపోతున్నాయి. తోటలు ఎండిపోయాయి. నేల బీటలు వారింది. మా ఆలుబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. మా మొరలను ఆలకించమని తమరు కాస్త దైవానికి విజ్ఞప్తి చేయండి. మా తరపున దైవానికి సిఫారసు చేయండి దేవుడు మీ తరపున సిఫారసు చేయాలి”. అని వారంతా ప్రాధేయపడ్డారు.
“ఇలాంటి విషయాలన్నింటికీ దేవుడు అతీతుడు. మీ కోసం నేను దైవసన్నిధిలో సిఫారసు చేస్తాను. కాని దేవుడు సిఫారసు చేయడమేమిటీ? ఎవరి కోసం సిఫారసు చేస్తాడు? ఆయన ఆరాధ్యదైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన చాలా గొప్పవాడు. భూమ్యాకాశాలన్నింటిపై ఆయన సార్వభౌమత్వమే నడుస్తుంది” అని ఆయన (సఅసం) వారికి విడమరిచి చెప్పారు.
ఆ తరువాత ఆయన(స) వారి ప్రాంతంలో వర్షం కురిపించమని దైవాన్ని ప్రార్థించారు. ఆ ప్రార్థనా పలుకులివి:
“ఓ దేవా! నీ దాసుల, పశువుల దాహం తీర్చు. నీ కారుణ్యాన్ని విస్తరింపజెయ్యి. నీ మృత బస్తీలకు తిరిగి జీవం పోయి. స్వామీ! మేము నీ సన్నిధిలో దీనాతిదీనంగా మొరపెట్టుకుంటున్నాము. ఇబ్బందిని దూరం చేసే, సౌఖ్యమొసగే వర్షాన్నీ, తొందరగాపడే వర్షాన్ని, ఆలస్యం చేయని వర్షాన్ని, ప్రయోజనం కలిగించే వర్షాన్ని, నష్టం వాటిల్లని వర్షాన్ని, కష్టాలు తీర్చే వర్షాన్ని కురిపించు. దేవా! మమ్మల్ని నీ కారుణ్యంలో ముంచెత్తు. యాతనకు, ముంపుకు గురిచెయ్యకు. ప్రభూ! ఫలవంతమైన వర్షం ద్వారా మా కడగండ్లను తొలగించు. శత్రువులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”43
సలామాన్ బృందం
వీళ్లు మొత్తం 17 మంది. దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. వారిలో హబీబ్ బిన్ అమ్ర్ అనే వాడొకడున్నాడు. “ఆచరణలన్నింటిలోకెల్లా ఉత్తమమైనదేది?” అని అతడు అడిగాడు. “వేళ కాగానే నమాజు చేయటం” అని దైవప్రవక్త (స) చెప్పారు. “మా ప్రాంతంలో వర్షాలు పడటం లేదు. తమరు దుఆ చేయండి” అని వాళ్ళంతా కోరారు.
దైవప్రవక్త (స) ప్రార్థించారు.
“దైవప్రవక్తా (స)! మీ శుభప్రదమైన చేతుల్ని ఎత్తి మరీ ప్రార్థించండి” అని హబీబ్ ప్రాధేయపడ్డాడు.
దైవప్రవక్త (స) మోముపై మందహాసం తొణకిసలాడింది. ఆయన(స) చేతులెత్తి, వారి ప్రాంతంలో వర్షం కురిపించమని దైవాన్ని ప్రార్థించారు.
ఆ బృందం తమ ప్రదేశానికి తిరుగు ప్రయాణమయింది. తీరా వారక్కడికి చేరుకున్నాక తెలిసింది. దైవప్రవక్త (స) ప్రార్థించిననాడే అక్కడ వర్షం పుష్కలంగా పడిందని!44
నజరాన్ బృందం45
నజరాన్ బృందానికి సంబంధించిన సంఘటన రెండు మూడు హదీసులలో కూడా వచ్చింది. వాటి ప్రకారం నజరాన్ ప్రాంతానికి చెందిన క్రైస్తవ ప్రతినిధులు రెండుసార్లు దైవప్రవక్త (స) దగ్గరకు వచ్చి చర్చలు జరిపారు. ఆ క్రమంలోనే ఈ సంఘటన పొందుపరచబడింది.
అబూ అబ్దుల్లా హకీమ్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) నజరాన్ వాసులకు ఇస్లాం సందేశం ఇస్తూ లేఖ వ్రాశారు. నజరాన్ మతాధిపతి అయిన ఉస్ఖఫ్ ఆ ఉత్తరాన్ని చదివినప్పుడు అతని ఒల్లు జలదరించింది. కాళ్ల క్రింద నేల కదలినట్లనిపించింది. వెంటనే అతను సర్ హుబైల్ బిన్ విదాయాను పిలిపించాడు. ఇతను హమదాన్ తెగకు చెందిన వ్యక్తి. పాలకుడైనా, క్రైస్తవ మతాధిపతి అయినా ఇతన్ని సంప్రదించనంత వరకూ ముఖ్యమైన పని ఏదీ చేసేవారు కారు.
ఉస్ఖఫ్ ఇచ్చిన ఉత్తరాన్ని అతను పూర్తిగా చదివాడు. “ఏమంటావ్?” అన్నట్టు చూశాడు ఉస్ఖఫ్.
“అయ్యా! ఇస్మాయీల్ (అలై) సంతతిలో కూడా దైవ ప్రవక్త ప్రభవిస్తాడని దేవుడు ఇబ్రాహీం (అలై)కి వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ సంగతి మీక్కూడా తెలిసిందే. బహుశా ఈ ప్రవక్త ఆ ప్రవక్తేనేమో! కాని దైవప్రవక్త విషయమై నేనేం చెప్పగలను? ప్రాపంచిక వ్యవహారం ఏదన్నా ఉంటే నేను తప్పకుండా నా అభిప్రాయం తెలిపేవాణ్ణి” అన్నాడు సర్ హుబైల్.
“సరే నువ్వు కూర్చో” అన్నాడు ఉస్ఖఫ్.
మరో వ్యక్తిని పిలిపించి అతని సలహా కోరాడు ఉస్ఖఫ్. అతను కూడా మొదటి వ్యక్తి లాగానే స్పందించాడు. మూడోవ్యక్తి (జబ్బార్ బిన్ ఖైస్)ను పిలిపించాడు. ఇతను బనూ హారిస్ బిన్ కాబ్ వంశస్తుడు. అతను కూడా ఉత్తరం చదివి మొదటి ఇద్దరు వ్యక్తులు వ్యక్తపరచిన అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు.
తన సమస్యకు సమాధానం దొరక్కపోవటంతో ఉస్ఖఫ్ ఆందోళన చెందాడు. గంటలు మ్రోగించి, చర్చీ గోడలకు తెరలు వ్రేలాడదీయమని ఆదేశించాడు. ఏదైనా గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు పగటి పూట ఈ విధంగా ప్రకటన గావించటం అక్కడి ఆచారం. రాత్రివేళ అయితే పర్వతంపై మంటలు వేస్తారు. ఆ చర్చీ క్రింద 73 గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో లక్షమంది పోరాట పటిమగల పురుషులుండేవారు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలంతా క్రైస్తవులే. అందరూ సమీకరించబడిన తరువాత వారి నాయకుడు దైవప్రవక్త (స) లేఖను చదివి వినిపించాడు. వారి సలహా కోరాడు. తర్జన భర్జనల అనంతరం ముగ్గురు వ్యక్తులతో కూడిన ఒక బృందాన్ని మహాప్రవక్త (సఅసం) వద్దకు పంపాలని తీర్మానించటం జరిగింది. ఆ బృందం సభ్యులుగా సర్హుబైల్, అబ్దుల్లాహ్, జబ్బార్‌లు నియమించబడ్డారు.
ఈ ముగ్గురు సభ్యులూ మదీనాకు చేరుకుని కొన్నాళ్ళపాటు దైవప్రవక్త (స) దగ్గర ఉన్నారు. దైవప్రవక్త ఈసా (ఏసుక్రీస్తు అలైహిస్సలాం) వ్యక్తిత్వం గురించి కూడా వారు ప్రశ్నలు వేశారు. వారి ప్రశ్నల నేపథ్యంలో ఈ ఆయతులు అవతరించాయి.
ఈ ఆయతులు అవతరించిన తరువాత దైవప్రవక్త (స) ప్రమాణం (ముబాహిలా) చేసే నిమిత్తం తన మనుమలైన హసన్ హుసైన్లను పిలిపించారు. ఆయన ప్రియపుత్రిక అయిన హజ్రత్ ఫాతిమా (ర. అన్హా) కూడా ఆయన(స) వెనుకవచ్చి నిలబడ్డారు.
అప్పుడు ఈ క్రైస్తవ నాయకులు పరస్పరం సంప్రతించుకున్నారు. “ఈయన గురించి మేము ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రావటం కష్టం. ఎందుకంటే మా లోయలోని జనులంతా కలసి మమ్మల్ని పంపించారు. ఒకవేళ ఈయన ఒక రాజే అనుకుందాం. అయినాసరే మనం ఈయన ముందు ప్రమాణం చేయటం సమంజసం కాదు. ఒకవేళ మేమలా చేస్తే యావత్తు అరబ్బుల దృష్టిలోకి వచ్చేస్తాం. ఒకవేళ ఈయన నిజంగా ప్రవక్త అయివుంటే, ఈ ప్రమాణం తరువాత మనం ఈ భూభాగంలో నామరూపాల్లేకుండా పోతాం. కాబట్టి మనం ఈయనకు లోబడి ఉండటానికి ఒప్పుకోవటమే మేలని నా అభిప్రాయం. జిజ్యా మొత్తాన్ని నిర్ధారించే అధికారం ఆయనకే వదలిపెడదాం. నాకు తెలిసినంత వరకూ ఈయన కఠిన మనస్కుడు కాదు” అని సర్ హుబైల్ చెప్పాడు. మిగిలిన ఇద్దరు కూడా అతని వాదనతో ఏకీభవించారు. అనంతరం ఆ ముగ్గురూ వచ్చి, “ఇప్పుడు మనం ‘ముబాహిలా’ చేసుకోవటం కన్నా, మా విషయంలో సముచితమైన నిర్ణయం గైకొనే అధికారం మీకు వొసగటమే శ్రేయస్కరం. రేపుదయం దాకా మీరే ఏదో ఒక నిర్ణయానికి రండి” అని చెప్పారు.
మరునాడు దైవప్రవక్త (స) వాళ్లపై ‘జిజ్యా’ ను విధించారు. ఒప్పంద పత్రాన్ని లిఖించటం జరిగింది. ఆ ఒప్పందాన్ని ముగీరా (రజి) లిఖించగా అబూసుఫ్యాన్ బిన్ హరబ్, గీలాన్ బిన్ అమ్ర్, మాలిక్ బిన్ ఔఫ్, ఉఖ్ర బిన్ హాబిస్ సహచరులు దానికి సాక్షులుగా ఉన్నారు. ఆ లిఖితపూర్వక పత్రం వారికివ్వబడింది. మొత్తమ్మీద మహాప్రవక్త(స) ఆ పత్రంలో క్రైస్తవుల యెడల సడలింపుల వైఖరిని అవలంబించారు. సాధ్యమైనన్ని రాయితీలు కల్పించారు.
ఉత్తర్వును తీసుకుని ముగ్గురూ నజరాన్‌కు సాగిపోయారు. మతాధిపతి (ఉస్ఖఫ్) తదితర ప్రముఖులు ఉత్సుకతతో ముందుకు వచ్చి వారిని కలుసుకున్నారు. ప్రతినిధి బృందం ఆ పత్రాన్ని ఉస్ఖఫ్కు అందజేసింది. నడుస్తూనే అతను ఆ ఒప్పంద పత్రాన్ని చదువుకున్నాడు. అతని పినతండ్రి కుమారుడైన అబూ అల్ఖమ కడు ఆసక్తితో అందలి సారాంశాన్ని గ్రహించి, ఆలోచనా సముద్రంలో మునిగిపోయాడు. అంతలోనే అతని ఒంటె అతన్ని క్రిందపడేసింది. క్రిందపడగానే, “మాకీ దురవస్థను కల్పించిన వాడు పాడైపోను!” అని అన్నాడు.
దైవప్రవక్త (సఅసం) నుద్దేశించి అతనిలా అన్నాడు.
“నువ్వేమంటున్నావో తెలుసా! దైవసాక్షి! ఆయన ఒక దైవప్రవక్త సుమా!” అన్నాడు ఉస్ఖఫ్.
“అలాగా! అయితే నేను తిన్నగా అక్కడికే వెళతాను” అంటూ మదీనావైపుకు పయనమయ్యాడు.
ఉస్ఖఫ్ వెనుకనుంచి కేకలు వేస్తున్నాడు. అల్ఖమా! నా మాట పూర్తిగా విను. అసలు నేను ఏం చెప్పదలిచానో నీకు తెలుసా?! మనం అలవోకగా లొంగిపోయామని మా తెగవారు ఎక్కడ ఆడిపోసుకుంటారోనని శంకించి నేను అలా అన్నాను. నిజానికి మనం ఇప్పటికీ ఆయన ఉదార వైఖరి ముందు లొంగిపోలేదు. మాలో పోరాడేవారు చాలామంది ఉన్నారు. మా శక్తి అన్యుల కన్నా చాలా గొప్పది. నువ్వు తిరిగి రా! అని బిగ్గరగా అరుస్తున్నాడు.
అల్ఖమా మరేమీ వినదలచుకోలేదు. దైవసాక్షి! ఇక నన్ను ఎవరూ అడ్డుకోలేరు. నీ మాటల్లో చిత్తశుద్ధి లేదు అంటూ మదీనా వైపుకు దూసుకుపోయారు.
అల్ఖమ దైవప్రవక్త (స)ను చేరుకున్నారు. అక్కడే నివసించసాగారు. కడకు ఈయన అమరగతి నొందారు. ఇక నజరాన్ లోయలో వచ్చిన పరిణామాలేమిటో చూడండి. మదీనాలో జరిగినదంతా అక్కడి ఒక క్రైస్తవ సన్యాసికి తెలిసింది. అతనిలో అనిర్వచనీయమైన పరివర్తన వచ్చింది. ఆ సన్యాసి అనేక సంవత్సరాలుగా చర్చీ బురుజుపైనే ఉండేవాడు. ఉన్నట్టుండి అతను జనులనుద్దేశించి ప్రకటించసాగాడు- “నన్ను క్రిందికి దించితేసరి. లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. నా ప్రాణం పోయినా లెక్కచేయను” అని అరుస్తున్నాడు. ఆఖరికి ఈ మతాచార్యుడు కూడా కొన్ని కానుకలు తీసుకుని దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చాడు. ఒక పాత్రను, ఒక కర్రను, దుప్పటిని కానుకగా సమర్పించుకున్నాడు. ఈ దుప్పటి అబ్బాసీ ఖలీఫాల హయాం వరకూ సురక్షితంగా ఉంది. మదీనాలోనే కొంతకాలం ఉండి ఇస్లాం ప్రబోధనలను అభ్యసించాడు ఆ క్రైస్తవ మతాచార్యుడు. కడకు దైవప్రవక్త (స) అనుమతి తీసుకుని, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ల తర్వాత రెండవ బృందం వచ్చింది. ఈ బృందంలో ఉస్ఖఫ్ అబుల్ హారిస్ (ఇతను చర్చీ అధిపతి. కానిస్టాంటినోపుల్ చక్రవర్తులు ఇతన్ని ఎంతగానో ఆదరించేవారు. సాధారణ ప్రజలు ఇతన్ని అసాధారణమైన వ్యక్తిగా తలపోయటవేంగాక, ఇతని వద్ద దివ్యశక్తులున్నాయని నమ్మేవారు. క్రైస్తవ జగతిలోని వైతాళికులలో ఒకడుగా ఈయన పరిగణించబడేవాడు) కూడా ఉండటం విశేషం! ఈయన దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చాడు. ఇతని వెంట ఏహమ్ అనే క్రైస్తవ న్యాయమూర్తి, స్థానిక పరిపాలకుడు కూడా ఉన్నాడు. అక్కడి వారంతా అతన్ని ‘సయ్యిద్’ అని పిలిచేవారు. ఆఖిబ్ బిరుదాంకితుడైన అబ్దుల్ మసీహ్ కూడా వచ్చాడు. అతను నజరాన్ ప్రాంతానికి గవర్నరు. మరో 24 మంది సర్దారులు వచ్చారు. ఈ ప్రతినిధి మండలిలో మొత్తం 60 మంది సభ్యులున్నారు. ఈ పయనబృందం అస్ర్ నమాజువేళ మస్జిదె నబవీ వద్దకు చేరింది. అది బహుశా ఆదివారం. ప్రార్థనా సమయం. దైవప్రవక్త (స) వారికి తమ మస్జిదులో ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వారు తూర్పు దిక్కుకు తిరిగి ప్రార్థన చేసుకున్నారు. కొంతమంది స్థానికులు ప్రార్థన చేయకుండా ఆపాలని చూశారు. అయితే మహాప్రవక్త (స) వాళ్లను వారించారు.
ఈ క్రైస్తవ వర్గాన్ని చూడటానికి యూదులు కూడా వచ్చేవారు. ఒక్కోసారి ఏదైనా ఒక విషయంపై క్రైస్తవులతో సంభాషించే వారు కూడా. ఒకసారి యూదులు కొందరు దైవప్రవక్త (సఅసం) ముందు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రస్తావన తెచ్చి, “ఆయన యూదుడు” అని అన్నారు. “కాదు, ఆయన క్రైస్తవుడు” అని క్రైస్తవులన్నారు. ఈ సందర్భంగా దివ్య ఖుర్ఆన్లోని ఈ ఆయతులు అవతరించాయి.
ఒకసారి కొంతమంది యూదులు (ముస్లింలను, క్రైస్తవులను ఇరకాటంలో పెట్టే ఉద్దేశ్యంతో), “ముహమ్మద్ (స)గారూ! క్రైస్తవులు ఏసుక్రీస్తును పూజించినట్లుగానే మేము కూడా తమరిని పూజించాలని తమరు కోరుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
నజరాన్‌కు చెందిన క్రైస్తవుడు వెంటనే స్పందిస్తూ,
“అవునా ముహమ్మద్ (స)గారూ! ఒకవేళ అదే మీ ఉద్దేశ్యమై ఉంటే మీరు బాహాటంగా చెప్పండి. ఏ మాత్రం మొహమాట పడకండి” అని అన్నాడు.
“అల్లాహ్ తప్ప మరొకరిని ఆరాధించే విషయం నుండి నేను అల్లాహ్ శరణువేడుతున్నాను. నేను ఎన్నటికీ అలా అనను. అల్లాహ్ నన్ను పంపించినది దైవేతరుల దాస్యం నుండి ప్రజలకు విముక్తి కల్పించడానికే గాని, దైవేతరుల దాస్యం చెయ్యండి అని చెప్పడానికి కాదు” అని మహాప్రవక్త (స) నిర్ద్వంద్వంగా చెప్పేశారు.
ఈ నేపథ్యంలో క్రిందివచనాలు అవతరించాయి.
ముహమ్మద్ బిన్ సుహైల్ కథనం ప్రకారం అలి ఇమ్రాన్ సూరాలోని మొదటి 80 ఆయతులు ఈ బృందం వచ్చి ఉన్నప్పుడే అవతరించాయి. వీళ్లు తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళే ముందు మరోసారి దైవప్రవక్త (స) వద్దకు వచ్చి మరో హామీ పత్రం పొందారు. చర్చీలకు, క్రైస్తవ మతాధికారులకు సంబంధించి ఆ పత్రంలో మరిన్ని మార్గదర్శక సూత్రాలున్నాయి.46
ఒక విశ్వసనీయుడైన, నిజాయితీపరుడైన వ్యక్తికి తమ వెంట పంపిస్తే తాము అతనికి జిజ్యాను చెల్లిస్తామని కూడా వాళ్లు చెప్పారు. దైవప్రవక్త (స) హజ్రత్ అబూ ఉబైదా బిన్ జరాహ్ను వారి వెంట పంపిస్తూ, ఈ వ్యక్తి నా అనుచర సమాజపు విశ్వసనీయుడు అని అన్నారు.47
హజ్రత్ అబూ ఉబైదా (రజి) గారి సహచర్యం అక్కడి ప్రజలకు కారుణ్యప్రదంగా పరిణమించింది. ఆయన మంచితనాన్ని, నిజాయితీని చూసి జనులు ఇస్లాం స్వీకరించసాగారు. ఆ విధంగా నజరాన్ లోయలో ఇస్లాం వ్యాపించింది.
నఖా బృందం
ఈ బృందం హిజ్రీ శకం 11వ యేట ముహర్రం నెలలో వచ్చింది. ఇది మదీనాకు వచ్చిన చివరి ప్రతినిధి బృందం. దీని తరువాత మరో ప్రతినిధి వర్గమేదీ దూరప్రాంతాల నుంచి రాలేదు. వీళ్లు సుమారు 200 మంది వరకూ ఉంటారు. వీళ్ళంతా హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రజి) చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించి వచ్చినవారు. వారందరికీ దారుజ్జియాఫ (అతిథి నిలయం)లో వసతి కల్పించబడింది.
వారిలో ఒక వ్యక్తి పేరు జురారా బిన్ అమ్ర్. అతను దైవప్రవక్తనుద్దేశించి, “నేను దారిలో చిత్ర విచిత్రమైన కలలుగన్నాను” అన్నాడు.
“ఏమిటా కలలు?” అడిగారు దైవప్రవక్త (సఅసం)
“కలలో ఒక మేక ఈనింది. ఆ మేకపిల్లపై తెల్లని, నల్లని చారలున్నాయి”
“మీ ఆవిడ గర్భవతిగా ఉందా?” అని ఆయన (స) అడిగారు.
“అవును” అన్నాడతను.
“ఆమె నీ కొడుకును ప్రసవించింది.
“మరి ఈ తెల్లని, నల్లని చారలేమిటి?” అని అతను ప్రశ్నించాడు.
“దగ్గరకు రా” అంటూ దైవప్రవక్త (స) అతన్ని తన దగ్గరకు పిలిచి “నీ శరీరంపై తెల్లమచ్చలున్నాయా? వాటిని ఎవరికీ కనబడకుండా దాచిపెట్టావా?” అని అడిగారు ఎవరికీ వినిపించకుండా.
“మిమ్మల్ని దైవప్రవక్తగా నియుక్తం చేసిన ఆ శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను. ఈ రహస్యాన్ని నేనింతవరకెవరికీ తెలుపలేదు” అన్నాడు జురారా.
“పిల్లవాడిపై ఉన్న ఆ మచ్చల ప్రభావం అదే” అన్నారు దైవప్రవక్త (సఅసం).
జురారా తన రెండవ కలను గురించి చెబుతూ, “నేను నూమాన్ బిన్ ముంజిర్ను కలలో చూశాను ఆయన ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నారు” అని చెప్పాడు.
దైవప్రవక్త (స) ఈ కలలోని మర్మాన్ని వివరిస్తూ అది సిరిసంపదలతో తులతూగే అరబ్బు దేశమని చెప్పారు.
“ఒక వృద్ధ మహిళ నేలలో నుంచి పైకి వస్తోంది. ఆమె శిరోజాలు సగం తెల్లగానూ, సగం నల్లగానూ ఉన్నాయి” అని జురారా చెప్పారు.
“అది మిగిలి ఉన్న ప్రపంచం” అని మహాప్రవక్త (స) బోధపరచారు.
“నేను చూసిన ఇంకొక కలలో భూమి లోపలి నుంచి అగ్ని పుట్టుకు వచ్చింది. అది నాకూ-నా కుమారుడైన అమ్ర్కు మధ్య దాకా వచ్చేసింది. కాలండి కాలండి. కళ్ళున్నవారూ, కళ్ళులేని వారూ అందరూ అనుభవించండి. మీ ఆహారాన్ని, మీ వంశాన్ని, మీ ఐశ్వర్యాన్నీ నాకివ్వండి. నేను హరిస్తాను అని అన సాగింది.” అని జురారా చెప్పగా,
“అదొక ఉపద్రవం. చివరి కాలంలో అది పొడసూపుతుంది” అని దైవప్రవక్త (స) వివరించారు.
“ఏమిటా ఉపద్రవం?” అని జురారా సందేహపడగా
“జనులు తమ నాయకుణ్ణే చంపేస్తారు. వారిమధ్య చీలిక వస్తుంది. ఒండొకరిపై విరుచుకు పడతారు. దుర్మార్గుడు ఆనాడు తానెంతో సజ్జనుడినని తలపోస్తాడు. విశ్వాసి రక్తం మంచి నీరుకన్నా ఎక్కువ తృప్తి నిచ్చేదిగా భావించబడుతుంది. నీ కొడుకు గనక చచ్చిపోతే నువ్వు ఈ ఉపద్రవాన్ని చవిచూస్తావు. నువ్వు గనక చచ్చిపోతే నీ కొడుకు దీన్ని చవిచూస్తాడు” అని ఆయన (సఅసం) విడమరచి చెప్పారు.
“దైవప్రవక్తా (స)! ఆ దురవస్థను చూచే స్థితి నాకు రాకూడదని ప్రార్థించండి” అన్నాడు జురారా.
“దేవా! ఈ ఉపద్రవం నుంచి ఇతన్ని కాపాడు” అని దైవప్రవక్త (స) ప్రార్థించారు.
జురారా చనిపోయారు. ఆయన కుమారుడు మాత్రం మిగిలాడు. అతడు హజ్రత్ ఉస్మాన్ (రజి) చేతిపై చేసిన ప్రమాణాన్ని భంగపరిచాడు.48
ఫుట్నోట్లు
- 1తబఖాత్ ఇబ్నెసాద్-2:165.
- 2రహ్మతుల్ లిల్ ఆలమీన్-1:136.
- 3సీరత్ ఇబ్నె హిషామ్-2:516.
- 4సుననె తిర్మీజీ-అంతస్తుల అధ్యాయం, ముస్నదె అహ్మద్-5:63
- 5తఫ్సీరెతబ్రీలో 20 వేలు అని ఉంది.
- 6తఫ్సీరె తబ్రీ:10-197.
- 7తఫ్సీరె తబ్రీ-10:197
- 8జాదుల్ మఆద్ -3:529, ఇబ్నెసాద్-2:165.
- 9రహ్మతుల్లిల్ ఆలమీన్-1:136.
- 10తబఖాత్ ఇబ్నె సాద్: యుద్ధాల ప్రకరణం-పేజీ:119
- 11ఇబ్నె హిషామ్-2:519.
- 12మదారిజిన్నబువ్వ-2:577, 580
- 13ఇబ్నె హిషామ్-2: 519, 520; సహీహ్బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు గజ్వయె తబూక్.
- 14రహ్మతుల్ లిల్ ఆలమీన్-1:137.
- 15రహ్మతుల్ లిల్ ఆలమీన్-1: 142.
- 16సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-కాబ్ బిన్ మాలిక్ హదీసు
- 17సీరత్ ఇబ్నె హిషామ్-2: 529, 530, జాదుల్ మఆద్-3:549
- 18జాదుల్ మ ఆద్-3:625.
- 19జాదుల్ మఆద్-3:625, 626.
- 20రహ్మతుల్ లిల్ ఆలమీన్-1:163.
- 21దలాయిలున్నుబువ్వా-5:299, జాదుల్ మఆద్-3:498
- 22ముస్తద్రక్ హాకిమ్-3:713
- 23సుననె అబూదావూద్: కితాబుల్ ఖిరాజ్.
- 24జాదుల్మఆద్ – 3:596-599, దలాయలున్నబువ్వ లిల్ బైహఖి-5:299-304.
- 25దుబ్బా: ఇది సొరకాయ బుర్ర. దీన్ని వారు ఎండబెట్టేవారు. హంతుమ్: పచ్చనిబాన. నఖీర్: చెట్టువేరును త్రవ్వితీసేవారు. దాన్ని చెక్కి పాత్రగా తయారు చేసేవారు. ముజప్ఫత్: ఒకరకమైన జిగటు పదార్థాన్ని పాత్రకు అతికించేవారు. ఈ పాత్రలన్నింటినీ వారు మద్యం తదితర మత్తు పదార్థాల కోసం ఉపయోగించేవారు. అందుచేత దైవప్రవక్త (సఅసం) వీటి వాడకాన్ని వారించారు.
- 26సహీహ్ బుఖారీ: కితాబుల్ ఈమాన్. ఇమామ్ ముస్లిం (రహ్మలై) కూడా సహీహ్ ముస్లింలో ఈ హదీసును పొందుపరచారు.
- 27దలాయిలున్నుబువ్వా-5:366.
- 28దలాయలున్నబువ్వ-5:328, ఇబ్నె హిషామ్-2:575.
- 29సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ-బాబు వప్దె బనీహునైఫ.
- 30ఇబ్నె హిషామ్-2:577.
- 31సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 32ముస్నదె అహ్మద్-3:105, 150
- 33జాదుల్ మఆద్-3:272, 273, అల్ అసాబ-3:151.
- 34జాదుల్ మఆద్-3:646, 647. ఇమామ్ హాకిమ్ ముస్తద్రక్లో ఈ ఉల్లేఖనాన్ని పొందుపరచారు. ఇమామ్ జహబీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.
- 35జాదుల్ మఆద్ – 3:250,251, ఇబ్నె సాద్-1:323.
- 36జాదుల్ మఆద్-3:252, ఇబ్నెసాద్-1:329.
- 37జాదుల్ మఆద్ – 3:654, ఇబ్నె సాద్ -1:292
- 38జాదుల్ మఆద్-3: 655, 656, ఇబ్నె సాద్-1:331.
- 39జాదుల్ మఆద్ – 3: 662, ఇబ్నె సాద్-1: 324.
- 40జాదుల్ మఆద్-3:663, 664, ఇబ్నె సాద్ -1:299.
- 41జాదుల్ మఆద్-3:670, ఇబ్నె సాద్-1:295.
- 42జాదుల్ మఆద్-3:671, ఇబ్నె సాద్-1:345.
- 43జాదుల్ మఆద్-3:653, 654, ఇబ్నె సాద్-1:297.
- 44రహ్మతుల్ లిల్ ఆలమీన్-1:183 (జాదుల్ మఆద్ సౌజన్యతో)
- 45ఈ వృత్తాంతమంతా జాదుల్ మఆద్లో, దలాయిలున్నుబువ్వాలో ఉంది.
- 46జాదుల్ మఆద్-3:629-637. దలాయిలున్నుబువ్వా-5:382-393. ఇబ్నె హిషామ్-1:573-584. ఇబ్నె సాద్-1:357. సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ.
- 47సహీహ్ బుఖారీ: కితాబుల్ మనాఖిబ్
- 48జాదుల్ మఆద్-3: 686, 687, ఇబ్నెసాద్ 1: 346