పదమూడవ అధ్యాయం
మహా ప్రస్థానం
“ఇన్నక మయ్యితున్ వ ఇన్నహుమ్ మయ్యితూన్”.
దేవుడు ఆయన(స) ద్వారా ప్రవేశపెట్టగోరిన సంస్కరణా కార్యం అయిపోవచ్చింది. షరీయతు (ధర్మశాస్త్రం) పరిపూర్ణమయింది. ఆత్మశుద్ధికి సంబంధించిన ప్రక్రియ పూర్తికా వచ్చింది. తన పనిపూర్తయ్యేవరకే పవిత్రాత్మ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. లక్ష్యం నెరవేరగానే అది ఊర్ధ్వలోకాలకు సాగిపోతుంది. అంతిమ హజ్ యాత్రతో అంతిమ దైవప్రవక్త(స) వారి సంస్కరణాసరణి పూర్తయింది. ఏకేశ్వరోపాసనా సిద్ధాంతం ఓ తిరుగులేని శక్తిగా అవతరించింది. నైతిక సూత్రాలు క్రియాత్మకంగా సమాజంలో వ్రేళ్లూనుకున్నాయి.
అన్న ప్రకటన వేలాదిమంది నికార్సయిన ఏకేశ్వరోపాసకుల సమక్షంలో వెలువడింది.
అదీగాక, నస్ర్ సూరా అవతరణతోనే ప్రవక్త(స)కు సన్నిహితులుగా ఉండే కొంతమంది సహాబీలకు అర్ధమైపోయింది -తమ ప్రియతమ నాయకుడు తమ నుండి సెలవు తీసుకునే గడియలు దగ్గరపడ్డాయని! “నీ ప్రభువును స్తుతించటంతో పాటు, మన్నింపుకై ఆయన్ని వేడుకో (నస్ర్)” అన్న దైవాజ్ఞననుసరించి ఆయన(స) ఎక్కువ సమయం దైవారాధనలో, దైవధ్యానంలో గడిపేవారు.2 సాధారణంగా ఆయన ప్రతి యేటా రమజాన్ నెలలో 10 రోజులపాటు ‘ఏతెకాఫ్’ వ్రతం బూనేవారు. కాని ఆయన హిజ్రీ 10వ యేట రమజాన్ మాసంలో 20 రోజులపాటు ‘ఏతెకాఫ్’లో కూర్చున్నారు. ఏటేటా ఆయన రమజాన్ మాసంలో ఒకసారి ఖుర్ఆన్ వినేవారు. అయితే ఈసారి ఆయన రెండుసార్లు దివ్యఖుర్ఆన్ను విన్నారు.3 హజ్‌యాత్ర సందర్భంగా ఆయన తన సహచరులకు హజ్ క్రియలను క్షుణ్ణంగా తెలియజేయటంతో పాటు, బహుశా తనకు హజ్ చేసే అవకాశం ఇకమీదట లభించక పోవచ్చునని సూచనాప్రాయంగా చెప్పేశారు. “బహుశా నేను ఇక మీదట హజ్ చేయలేను” అని చెప్పేసినట్లు కొన్ని ఉల్లేఖనాలలో ఉంది.4 తన అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఆయన(స) ముస్లింలందరికీ తనను దర్శించుకునే భాగ్యం కల్పించారు. ఉహుద్ యుద్ధంలో అమరగతి నొందిన త్యాగధనుల సమాధులను కూడా ఆయన ఈ మధ్యనే సందర్శించి వారి కోసం ప్రార్థించారు. మరణ ఘడియలు ఆసన్నమైన వ్యక్తి తన వారసులకు వీడ్కోలు చెప్పినట్లే వారి నుండి సెలవు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన(స) ప్రసంగించారు.
“నేను మీ కన్నా ముందే (కౌసర్) సరస్సు వద్దకు వెళుతున్నాను. అబ్లా నుండి హుజ్ఫావరకు ఎంత వెడల్పు ఉంటుందో దాని వెడల్పు కూడా అంతే ఉంటుంది. నాకు ప్రపంచ ఖజానాల తాళం చెవి ఇవ్వబడింది. నా తరువాత మీరు బహుదైవారాధనకు పాల్పడతారని నేను భయపడటం లేదు. కాని మీరెక్కడ ప్రాపంచిక లాలసలో పడి పరస్పరం రక్తపాతం సృష్టించి మీ పూర్వీకుల వలె నాశనమవుతారోనని నేను భయపడుతున్నాను.”
దైవప్రవక్త (సఅసం) ఇలా ప్రసంగిస్తుండగా తాను చివరిసారి విన్నానని ఉల్లేఖకుడు తెలిపారు.5
హజ్రత్ జైద్ బిన్ హారిసాను సిరియా సరిహద్దుల్లో అరబ్బులు హతమార్చారన్న సంగతి యుద్ధాల సందర్భంగా వచ్చింది. దైవప్రవక్త(స) అందుకు పరిహారం తీసుకోవాలనుకున్నారు. తాను అస్వస్థతకు గురికాక ఒక రోజుముందే ఆయన(స) ఉసామా బిన్ జైద్(రజి)ను సేనాధిపతిగా నియమిస్తూ, ఒక సైనిక దళాన్ని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళమనీ, తన తండ్రి రక్తానికి ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించారు.6
హిజ్రీ 11వ సంవత్సరం సఫర్ నెల 18 లేక 19వ తేదీన ఆయన (సఅసం) ముస్లింల ఖననవాటిక అయిన ‘జన్నతుల్ బఖీ’కి వచ్చారు. అక్కడే ఆయన(స) అస్వస్థతకు గురయ్యారు.7 అది హజ్రత్ మైమూనా (ర. అన్హా)కి కేటాయించబడినరోజు. ఆ స్థితిలో కూడా ఆయన(స) ప్రతిరోజూ-న్యాయసమ్మతంగా తాను నిర్ధారించిన వంతుల ప్రకారం-ఒక్కో భార్య కుటీరానికి వెళుతుండేవారు. సోమవారం నాడు వ్యాధి తీవ్రత పెరిగింది. అప్పుడాయన సతీమణులందరి సమ్మతితో హజ్రత్ ఆయిషా (ర.అన్హా) కుటీరంలోనే ఉండసాగారు. ఆయన(స) ఆ మేరకు అనుమతి కూడా స్పష్టంగా అడగలేదు. ‘రేపు నేను ఉండవలసింది ఎవరి కుటీరంలో?!’ అని ప్రశ్నించారు. అది (సోమవారం) హజ్రత్ ఆయిషా (ర. అన్హా) వంతు. సతీమణులు ఆయన (స) అభిలాషను గ్రహించి “తమరు ఇక నుంచి ఎక్కడుండదలిస్తే అక్కడే ఉండవచ్చు” అని చెప్పారు. బాగా నీరసించిపోవటం వల్ల నడవలేని స్థితి ఏర్పడింది. హజ్రత్ అలీ (రజి), హజ్రత్ అబ్బాస్ (రజి) లిరువురూ ఆయన భుజాలు పట్టుకుని అతి కష్టమ్మీద హజ్రత్ ఆయిషా (ర.అన్హా) కుటీరంలోకి తెచ్చారు.8
మస్జిద్కు వచ్చే శక్తి ఉన్నంత వరకూ ఆయన (స) నమాజ్ చేయించడానికి వస్తూ ఉండేవారు. ఆయన (స) చేయించిన ఆఖరి నమాజు మగ్రిబ్ నమాజు. తలనొప్పి ఉండటం వల్ల తలకు గట్టిగా రుమాలు చుట్టుకుని వచ్చారు. నమాజులో ‘వల్ ముర్సలాత్’ సూరా పఠించారు.9 ఇషా నమాజుకు వేళ అయింది. నమాజు అయిపోయిందా? అని అడిగారు. ‘లేదు, అందరూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నార’ని సమాధానం వచ్చింది. బానలో నీళ్లు పోయించి స్నానం చేశారు. లేవబోయి స్పృహ తప్పిపోయారు. స్పృహ వచ్చిన తరువాత నమాజు చేయటం అయిపోయిందా? అని మళ్లీ ప్రశ్నించారు. ప్రజలు మొదటిసారి లాగే సమాధానం ఇచ్చారు. ఆయన (స) మళ్లీ స్నానం చేసి నమాజు కోసం లేవబోయారు. మళ్లీ స్పృహ కోల్పోయారు. స్పృహలోకి రాగానే మళ్లీ అదే ప్రశ్న. ప్రజల నుంచి మళ్లీ అదే జవాబు. మూడోసారి శరీరంపై నీళ్లు పోసుకుని లేవబోగా ఈసారి కూడా స్పృహ తప్పారు. స్పృహలోకి వచ్చాక, “నమాజుకు సారథ్యం వహించమని అబూబక్ర్ (రజి)కు చెప్పండి” అని పురమాయించారు. హజ్రత్ ఆయిషా (ర.అన్హా) ఆయన(స)కు నచ్చజెప్పారు – “దైవప్రవక్తా (స)! అబూబక్ర్ ఎంతో మృదుస్వభావులు. మీరు నిలబడే స్థానంలో ఆయన నించోలేరు” అని సలహా యిచ్చారు. కాని ఆయన (స) ఆమె మాటల్ని పట్టించుకోకుండా “అబూబక్ర్‌కు నమాజ్ చేయించమనండి” అని చెప్పి పంపించారు. ఆ రోజు నుంచీ కొన్నాళ్ళ పాటు హజ్రత్ అబూబకర్ నమాజుకు సారథ్యం వహించేవారు.
మరణానికి నాలుగు రోజుల ముందు జుహ్ర్ నమాజ్ వేళ ఆయన (సఅసం) ఆరోగ్యం కాస్త కుదుటపడింది. ఏడు చెంబుల నీళ్లు తనపై పోయమని సూచించారు. ఆ విధంగా ఆయన (స) స్నానం చేసి హజ్రత్ అలీ (రజి) హజ్రత్ అబ్బాస్ (రజి)ల సాయంతో మస్జిద్కు వచ్చారు. అప్పటికే సామూహిక నమాజ్ జరుగుతోంది. ఈ నమాజుకు హజ్రత్ అబూబక్ర్ (రజి) నాయకత్వం వహిస్తున్నారు. దైవప్రవక్త (స) అలికిడిని పసిగట్టిన అబూబక్ర్ (రజి) వెనక్కి వచ్చారు. అయితే దైవప్రవక్త (స) ఆయన్ని ఆపుతూ, ఆయన ప్రక్కనే కూర్చుని నమాజు చేయించారు. నమాజులో ఆయన్ని (స) హజ్రత్ అబూబక్ర్ అనుసరించగా, హజ్రత్ అబూబక్ర్‌ని మిగతా వారంతా అనుసరించారు.10
నమాజు అనంతరం విశ్వనాయకుడు (సఅసం) ప్రసంగించారు. ఆయన(స) తన జీవితంలో చేసిన తుది ప్రసంగమది!
ఆయన (స) ఇలా అన్నారు:
“దేవుడు తన దాసుల్లో ఒకరికి ప్రపంచానుగ్రహాలు కావాలో దైవం వద్ద (పరలోకంలో) ప్రాప్తించే అనుగ్రహాలు కావాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వగా అతను దైవసమక్షంలో లభించే అనుగ్రహాలనే ఎంపిక చేసుకున్నాడు”. ఈ పలుకులు వెలువడగానే హజ్రత్ అబూబక్ర్ (రజి) విలపించసాగారు. దైవప్రవక్త (స) ఎవరో ఒక వ్యక్తి గురించి చెబుతుండగా ఈయన అలా ఏడుస్తాడేమిటీ? అని సభికులు ఆశ్చర్యపోయారు. కాని ‘ఆ దాసుడు’ ఎవరో దైవప్రవక్త (సఅసం) ఆంతరంగికునికి అర్ధమైపోయింది. ఆయన (స) తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఇలా పలికారు: “నాకు లభించిన సహచర్య భాగ్యాలలో కెల్లా ఉత్తమమైనది అబూబక్ర్ (రజి) సహచర్యం. అందుకు గాను నేనాయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకవేళ నేను ప్రపంచంలో ఎవరినయినా నా అనుచర సమాజంలో ‘నేస్తం’ గా చేసుకోదలిస్తే అబూబక్ర్ (రజి)ను నా ప్రియ నేస్తంగా చేసుకునేవాణ్ణి. కాని ఇస్లాం బాంధవ్యం ఒక్కటి చాలు – స్నేహ బంధానికి! మస్జిదు దిశలో అబూబక్ర్ (రజి) కిటికీ తప్ప మరొకరి కిటికీని ఉండనివ్వకండి.11 మీకు పూర్వం గతించిన జాతులు ప్రవక్తల, మహనీయుల సమాధులను ప్రార్థనాలయాలుగా చేసుకున్నారు. మీరు మాత్రం అలా చేయకండి.12
నాయక శిఖామణి (సఅసం) అస్వస్థతకు లోనై ఉండగా అన్సార్లు ఆయన (స) ఉపకారాలను, దయాదాక్షిణ్యాలను తలచుకుని దుఃఖంతో విలపించేవారు. వారొకచోట ఇలా విలపిస్తుండగా హజ్రత్ అబూబక్ర్ (రజి), హజ్రత్ అబ్బాస్ (రజి) లు అటువైపు నుంచి వెళుతున్నారు. దుఃఖానికి కారణమేమిటని దర్యాప్తు చేయగా, దైవప్రవక్త(స) వారి సహచర్యం తమకు జ్ఞాపకం వస్తోందని చెప్పారు అన్సార్లు. అన్సార్ల వ్యాకులత గురించి వారిద్దరిలో ఒకరు దైవప్రవక్త (స)కు వివరించగా, అన్సార్ల గురించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పటం అవసరమని ఆయన (స) భావించారు. ఆయన (స) జనులనుద్దేశించి ఇలా ఉద్బోధించారు:
“ప్రజలారా! అన్సార్ల గురించి నేను మీకు కొన్ని విషయాలు తాకీదు చేయదలిచాను. ఒకవైపు జన సంఖ్య పెరుగుతుంటే మరోవైపు అన్సార్లు అరుదైపోతుంటారు. వారు అన్నంలో ఉప్పు మాదిరిగా ఉంటారు. వారు తమ కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించారు. ఇప్పుడు వారి పట్ల మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నా శరీరంలో జీర్ణ కోశానికి ఎంత ప్రాముఖ్యం ఉందో వారికంత ప్రాముఖ్యం ఉంది. మీ మంచీచెబ్బరల పర్యవేక్షకునిగా నియమితుడైనవాడు (ఖలీఫా) అన్సార్లలోని సద్వర్తనులను ఆదరించాలి. వారిలో ఎవరయినా తప్పు చేస్తే మన్నింపుల వైఖరిని అవలంబించాలి”.13
రోమనుల మెడలు వంచడానికి పంపబడిన సైనికదళానికి ఉసామా బిన్ జైద్ (రజి)ను సారధిగా దైవప్రవక్త (స) నియమించిన సంగతి ఇంతకు ముందే వచ్చింది. దీనిపై కొంతమంది అభ్యంతరం వెలిబుచ్చారు (అలా అభ్యంతరం వెలిబుచ్చినవారు కపటులని ఇబ్నెసాద్ వివరించారు). పెద్దవారు ఉండగా ఒక కుర్రవానికి ఈ పదవి కట్టబెట్టడమెందుకు? అన్నది వాళ్ల మనోరథం. ఈ విషయంపై అగ్రజులు (సఅసం) ఇలా సెలవిచ్చారు:
“ఉసామా నేతృత్వంపై మీకు అభ్యంతరం ఉంటే, ఇలాంటి అభ్యంతరమే మీరు ఇతని తండ్రి నేతృత్వంపై కూడా వ్యక్తపరిచారు. దైవసాక్షి! అతను ఈ పదవికి అన్ని విధాలా తగినవాడు. అతను నాకు అందరికన్నా ప్రియమైనవాడు. అతని తరువాత ఇప్పుడు ఇతను అందరికన్నా ప్రియమైన వాడు”.14
ఇస్లాంకు – ఇతర మత ధర్మాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏమిటంటే షరీయతుకు సంబంధించిన సమస్త ఆదేశాలను ఇస్లాం దైవాజ్ఞలుగా ఖరారు చేస్తోంది. కాకపోతే ప్రవక్త ఆ ఆదేశాలను తన పలుకుల ద్వారా, ఆచరణల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి తీసుకుపోతాడు. ఇతర మత ధర్మాలు ఈ విషయంలోనే అపార్థాలకు గురయ్యాయి. అందుకే ఈ మానవ మహోపకారి (సఅసం) ఈ విధంగా స్పష్టపరిచారు:
“ధర్మాధర్మాల (హలాల్ – హరామ్‌ల) నిర్ధారణను నాకు అంటగట్టకండి. అల్లాహ్ ధర్మసమ్మతం చేసిన దానినే నేను ధర్మసమ్మతంగా ప్రకటించాను. అల్లాహ్ నిషేధించిన విషయాన్ని నేనూ నిషేధించాను.”
మనిషికి బహుమానం లభించినా, శిక్షపడినా అదంతా అతను చేసుకున్న కర్మలను బట్టే ఉంటుంది. అందుకే ఆయన (స) ఈ అంశాన్ని ముందుగానే చెప్పేయాలనుకున్నారు-
“ఓ దైవ సందేశహరుని పుత్రిక ఫాతిమా! ఓ దైవ సందేశహరుని అత్త సఫియ్యా!! దైవ సమక్షంలో పనికి వచ్చే సామగ్రిని సమకూర్చుకోండి. దేవుని పట్టు నుండి నేను మిమ్మల్ని కాపాడలేను.”
ప్రసంగం పూర్తయిన తరువాత ఆయన (స) ఆయిషా (ర.అన్హా) కుటీరంలోనికెళ్ళారు. తన ప్రియపుత్రిక హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) అంటే ఆయనకు అమితమైన వాత్సల్యం. వ్యాధిగ్రస్తస్థితిలోనే ఆయన (స) తన పుత్రికను పిలిపించారు. ఆమె వచ్చినపుడు ఆమె చెవిలో ఏదో చెప్పారు. ఆ మాట విన్నంతనే ఆమె ఏడ్వటం మొదలెట్టారు. మళ్లీ ఆమెను దగ్గరకు పిలిచి ఆమె చెవిలో ఏదో చెప్పగా ఆమె మోముపై ఆనందం తొణికిసలాడింది. ఇంతకీ ఆయన (స) ఏం చెప్పారు? అని హజ్రత్ ఆయిషా (ర.అన్హా) అడగ్గా, ఈ వ్యాధి తన మరణానికి సూచిక అని అన్నారని ఆమె తెలిపారు. అది విని నేను ఏడుస్తుండగా మళ్లీ పిలిచి, నాకుటుంబీకుల్లో అందరికన్నా ముందు నువ్వే వచ్చి నన్ను కలుసుకుంటావు అని చెప్పారు. ఇది వినగానే నాకు సంతోషం కలిగింది.15
యూదులు క్రైస్తవులు తమ ప్రవక్తల గోరీల పట్ల కనబరచిన మితిమీరిన భక్తీ శ్రద్ధలు విగ్రహారాధనగా పరిణమించాయి. కాగా; విగ్రహారాధనను నిర్మూలించటం ఇస్లాం ప్రథమకర్తవ్యం. అందుకే మరణానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై ఉన్న సమయంలో కూడా ఈయన్ని (స) ఇదే విషయం వేధిస్తూ ఉండేది. కొంతమంది సతీమణులు క్రైస్తవమతంలోని ఆరాధ్యదైవాల, విగ్రహాల ప్రస్తావనను తీసుకురాగా, ఆయన (స) ఇలా వివరించారు: “జనుల్లో ఎవరయినా పుణ్య పురుషుడు మరణించినప్పుడు అతని పట్ల గల గౌరవం కొద్దీ వారు అతని సమాధికి ప్రత్యేకతను కల్పిస్తారు. అదే రాను రాను ఆరాధనగా పరిణమిస్తుంది. ఆ సమాధి వద్ద అతని విగ్రహాన్ని కూడా వారు ప్రతిష్ఠిస్తారు.”16 వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ఒక్కోసారి దుప్పటిని ముఖంపై కప్పుకునేవారు. ఊపిరాడక మళ్లీ దుప్పటిని తీసేసేవారు. ఆయన (స) నోట హజ్రత్ ఆయిషా (ర.అన్హా) విన్న పలుకులివి!
“యూదుల, క్రైస్తవులపై దేవుని శాపం పడుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా మందిరాలుగా చేసుకున్నారు.”17
ఈ బాధాతప్త స్థితిలోనే, హజ్రత్ ఆయిషా (ర.అన్హా) దగ్గర తాను పెట్టిన కొన్ని నాణేల సంగతి గుర్తుకు వచ్చింది. “ఆ నాణేలు ఎక్కడున్నాయి? ముహమ్మద్ (స) తన నేస్తాన్ని అనుమానాస్పదస్థితిలో కలుసుకునే అవస్థ ఏర్పడకూడదు. వెళ్ళి ఆ నాణేలను దైవమార్గంలో ఖర్చు చేసిరా!” అని పురమాయించారు.18
మరణించే రోజు (అంటే సోమవారంనాడు) ఆరోగ్యం కాస్తంత కుదుటపడింది. ఆయన (స) కుటీరం మస్జిద్కు ఆనుకునే ఉండేది. తెల్లవారుతుండగా కిటికీ తెరెత్తి మస్జిద్లోకి చూశారు. ప్రజలు (ఫజ్ర్) నమాజులో నిమగ్నులై ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి ఆయన (స) తృప్తిగా, సంతోషంగా నిట్టూర్చారు. ఈ నిట్టూర్పును గ్రహించిన జనులు, బహుశా ఆయన (స) నమాజుకు రాదలుస్తున్నారేమోనని అనుకున్నారు. సంతోష సూచకమైన ఈ నిట్టూర్పును విని ప్రజలు తమ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయారు. వాళ్ల పరిస్థితిని చూస్తుంటే నమాజును భంగపరచేలా ఉన్నారు. ఆ సామూహిక నమాజును సారథ్యం వహిస్తున్న హజ్రత్ అబూబక్ర్ (రజి) గారైతే తాను నించుని ఉన్న స్థానంలో నుంచి వెనక్కి జరగబోయారు. అయితే దైవప్రవక్త (స) అలా చేయవద్దంటూ సంజ్ఞ చేసి కుటీరం లోపలికి వెళ్ళిపోయారు.19
ప్రియ సహచరులు దైవప్రవక్త (సఅసం) ముఖారవిందాన్ని ఆ స్థితిలో తిలకించటం అదే ఆఖరుసారి. ఆయన (స) ముఖారవిందం అప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోయిందని హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) తెలిపారు.20
పొద్దెక్కే కొద్దీ ఆయన (స) వేదన పెరిగేది. కాని అంతలోనే శాంతించే వారు కూడా. ఈ పరిస్థితిని గమనించిన హజ్రత్ ఫాతిమా (ర.అన్హా) “అయ్యో! నా తండ్రి వ్యాకులత గురించి ఏం చెప్పేది?” అంటూ విలపించారు. “నీ తండ్రి ఈ రోజు తరువాత మరెన్నడూ కలత చెందడమ్మా!”21 అని ఆయన (స) సముదాయించారు. బాధ తగ్గినప్పుడల్లా ఆయన (స), “మరణం కావాలో ప్రాపంచిక జీవితం కావాలో (దేన్నయినా) కోరుకోవచ్చు అని ప్రవక్త (స)కు అధికారం ఇవ్వబడుతోంది” అని అనేవారు. ఆ స్థితిలో ఆయన (స) నోట ఈ పలుకులు వెలువడేవి “అల్లాహ్ అనుగ్రహించిన వారి వెంటనే…”22
మరణానికి కొన్ని ఘడియల ముందు హజ్రత్ అబూబక్ర్ (రజి) కుమారుడగు హజ్రత్ అబ్దుర్రహ్మాన్ (రజి) ఆయన అన్న సన్నిధికి వచ్చారు. ఆ సమయంలో ఆయన (స) హజ్రత్ ఆయిషా (రజి అన్హా) గుండెపై తల ఆనించి పండుకుని ఉన్నారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ (రజి) చేతిలో ఉన్న ‘మిస్వాక్’ (పను దోముపుల్ల)ను తదేకంగా చూడసాగారు. హజ్రత్ ఆయిషా (ర.అన్హా)కు విషయం అర్థమయింది. ఆమె గారు ఆ మిస్వాక్‌ను తీసుకుని తన దంతాలతోనే నమలి మెత్తగా చేసి యిచ్చారు. ఆయన (స) మామూలు మనిషి లాగానే ‘మిస్వాక్’ చేశారు (పల్లు తోముకున్నారు).23 ఆయన (స) మహాప్రస్థానంచేసే గడియ చాలా దగ్గరపడింది. మధ్యాహ్నం పొద్దువాలింది. సాయంత్రం కావస్తోంది. ఉచ్వాసనిశ్వాసల్లో తేడా వచ్చేసింది. రొప్పుతున్నారు. ఆ స్థితిలో ఆయన (స) అధరాలు కదలుతున్నాయి. “నమాజ్, బానిసలు” అన్న మాటలు నెమ్మదిగా వెలువడుతున్నాయి.24
దగ్గరలోనే నీళ్ళతొట్టె ఉంది. పదేపదే అందులో చేతులు ముంచి ముఖానికి తుడుచుకునేవారు. మాటిమాటికీ ముఖంపై దుప్పటి కప్పుకుంటూ మళ్లీ దాన్ని తొలగించేవారు. అంతలోనే చేతులెత్తి “ఇప్పుడు నాకు కావలసినవాడు ఆ పరమోన్నతుడే” అని అనేవారు. అలా అంటుండగానే పవిత్రాత్మ పరలోకానికి సాగి పోయింది.25
అల్లాహుమ్మ సల్లూ అలైహి వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ సలవాతన్ కసీరన్ కసీరా.
అంత్యక్రియలు
మహాప్రవక్త (సఅసం) ఇహలోకానికి వీడ్కోలు చెప్పి వెళ్ళి పోయారన్న విషయం ప్రియ సహచరులకు జీర్ణం కావటంలేదు. హజ్రత్ ఉమర్ (రజి) కరవాలం పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ, “దైవప్రవక్త (సఅసం) చనిపోయారని చెప్పిన వాడి తల నరికేస్తాన”ంటూ వీధుల్లో సంచరించసాగారు.26
అయితే హజ్రత్ అబూబక్ర్ (రజి) వచ్చి, సహచరులందరినీ ఉద్దేశించి ఉపన్యసించారు. దైవప్రవక్త (సఅసం) ఏదో ఒకనాడు ఈ లోకాన్ని వీడిపోవటం సహజ పరిణామమని అందరినీ సముదాయించారు. ఈ సందర్భంగా ఆయన (స) దివ్యఖుర్‌ఆన్‌లోని ఆయతును చదివి వినిపించగా ఈ అనివార్య పరిణామాన్ని అందరూ అర్థం చేసుకున్నారు.27 అంత్యక్రియల సన్నాహాలు మంగళవారం నాడు మొదలయ్యాయి. ఆత్మీయులు, బంధుమిత్రులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. హజ్రత్ ఫజల్ బిన్ అబ్బాస్ (రజి), హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి)లు తెరపట్టుకొగా, హజ్రత్ అలీ (రజి) గుసుల్ (స్నానం) చేయించారు. ఈ సందర్భంగా హజ్రత్ అబ్బాస్ (రజి) కూడా అక్కడున్నారు.28
ఖననం ఎక్కడ చేయాలన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమయింది. దైవప్రవక్త పరమపదించిన చోటే ఖననం చేయబడతారని హజ్రత్ అబూబక్ర్ (రజి) అన్నారు. అందువల్ల భౌతిక కాయాన్ని లేపి, పడకను చుట్టేసి హజ్రత్ ఆయిషా (ర.అన్హా) కుటీరంలోనే ఆయన సమాధిని త్రవ్వటం జరిగింది.29
బహిరంగ ప్రదేశంలో తన సమాధి ఉంటే ప్రజల భక్తీ శ్రద్ధలు మితిమీరి తన సమాధిని పూజాస్థలంగా ప్రజలు చేసుకుంటారేమోనన్న అనుమానం ఆయన (స)కు చివరి కాలంలో కలిగింది. అందుకే బహిరంగ స్థలంలో అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయానికి స్వస్తీ చెప్పటం జరిగిందని హజ్రత్ ఆయిషా (ర.అన్హా) అనేవారు.30
మదీనా వాసుల సంప్రదాయం ప్రకారం హజ్రత్ అబూతల్హా (రజి) సమాధి త్రవ్వారు.31 అంత్య క్రియల సమయం దగ్గర పడేసరికి జనాజానమాజు కోసం జనం పోటెత్తింది. శవ పేటిక కుటీరం లోపలే ఉంది. పురుషులు స్త్రీలు వంతుల వారీగా లోపలికి వెళ్లి కడసారి దర్శనం చేసుకుని నమాజు చేశారు. మొదట పురుషులు, తరువాత స్త్రీలు, ఆ తరువాత బాలలు జనాజా నమాజు చేశారు. ఈ నమాజుకు ఎవరూ ‘ఇమామ్’గా లేరు.32
ఆయన (స) భౌతిక కాయాన్ని హజ్రత్ అలీ (రజి), హజ్రత్ ఫజల్ (రజి) బిన్ అబ్బాస్, హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)లు సమాధిలోనికి దించారు.33
సల్లల్లాహు తాలా అలైహి సలాతన్ వ సలామన్ దాయిమైని
ముతలాజిమైని ఇలా యౌమిద్దీని వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్.
ఫుట్నోట్లు
- 1సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 2సహీహ్ బుఖారీ: కితాబుత్తఫ్‌సీర్
- 3సహీహ్ బుఖారీ: కితాబుల్ ఫజాయెల్
- 4సహీహ్ బుఖారీ: కితాబుల్ హజ్
- 5సహీహ్ బుఖారీ: కితాబుల్ జనాయెజ్, సహీహ్ ముస్లిం: కితాబుల్ ఫజాయెల్
- 6సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 7ముస్తద్రక్ హాకిమ్ – 3: 57
- 8సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 9సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 10సహీహ్ ముస్లిం: కితాబుస్సలాత్; సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ.
- 11సహీహ్ బుఖారీ: కితాబుల్ మనాఖిబ్
- 12సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ సహీహ్ ముస్లిం: కితాబుల్ మసాజిద్
- 13సహీహ్ బుఖారీ: కితాబుల్ మనాఖిబ్. అన్సార్ల గొప్పదనానికి సంబంధించిన అధ్యాయం
- 14సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 15సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 16సహీహ్ ముస్లిం: కితాబుల్ మసాజిద్
- 17సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 18ముస్నదె అహ్మద్ – 6: 49.
- 19సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 20సహీహ్ ముస్లిం: కితాబుస్సలాత్
- 21సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 22సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 23సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ
- 24ముస్తద్రక్ హాకిమ్ – 3: 59
- 25సహీహ్ బుఖారీ: కితాబుల్ మగాజీ – బాబు మరజున్నబీ…
- 26సీరత్ ఇబ్నె హిషామ్ – 2: 655.
- 27సీరత్ ఇబ్నె హిషామ్ – 2: 662.
- 28సీరత్ ఇబ్నె హిషామ్ – 2: 662
- 29సుననె ఇబ్నె మాజ – కితాబుల్ జనాయెజ్ – బాబు వఫాతున్నబీ (స)
- 30సహీహ్ బుఖారీ: కితాబుల్ జనాయెజ్
- 31సీరత్ ఇబ్నె హిషామ్ – 2: 663
- 32సీరత్ ఇబ్నె హిషామ్ – 2: 664
- 33అబూదావూద్ – కితాబుల్ జనాయెజ్