మానవ మహోపకారి (స)

ముందు మాట

ముస్లిహుద్దీన్ అహ్మద్ హైదరాబాదీ

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి వచ్చిన ముస్లిం, నవముస్లిం విద్యార్థులు ‘The True Message Centre’, Kakinada లో మతాల తులనాత్మక అధ్యయనం కోర్సు పూర్తి చేసుకొని ఆ తర్వాత ధర్మప్రచార కార్యంలో నిమగ్నులయ్యేందుకు గృహోన్ముఖులవబోతున్న రోజులవి. 2002వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన వారి స్నాతకోత్సవం జరగవలసి ఉంది. ఆ సందర్భంగా సదరు సంస్థ డైరెక్టర్ అహ్మద్‌అలీగారు, సెక్రటరీ ముష్తాక్ అహ్మద్‌గార్లు ఆ సభలో ప్రసంగించటానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. నిజానికి ఆ సభకు ముఖ్య అతిధి అయ్యేటంతటి యోగ్యతార్హతలు నాలో లేవు. కాని పెద్దలమాట కాదనలేక సంతోషంగానే ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను. పరిసరాల విషప్రభావాలకు గురికాకుండా ఇప్పటికీ స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉన్న ముస్లిం, నవముస్లిం విద్యార్థుల మనోఫలకాల మీద అంతిమదైవప్రవక్త బోధించిన నైతికవిలువల్ని, ఉత్తమ నడవడికనూ, మహోన్నతమైన సుగుణాలను లిఖించే భాగ్యం లభించటం ఒక సువర్ణావకాశంగా, దేవుడు ప్రసాదించిన ఒక వరంగా భావించిన నేను ఆ అవకాశాన్ని జారవిడుచుకోదలచుకోలేదు. దాని మూలంగా పరలోకం కోసం పుణ్యం సంపాదించుకోవాలనుకున్నాను. నాకు తెలుగుభాషలో ఏమంత పాండిత్యం లేదు. కాని మానవులందరిలోకెల్లా ప్రియతములు, మానవ మహోపకారి అయిన ముహమ్మద్(సల్లం) పిలుపును సర్వవ్యాప్తం చేయవలసిన బాధ్యతను, ఆయన అనుసరించిన ధర్మప్రచార రీతిని-నాకు తెలిసినంతవరకు ధర్మప్రచార కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న నేటి విద్యార్థులకు, అధ్యాపకులకు తెలియజేయాలన్న ఆతురతతో, ప్రవక్త పదవీ బాధ్యతల గురించి, ఆ మహోన్నతస్థానం గురించి మాట్లాడే భాగ్యాన్ని దక్కించుకోవాలన్న కాంక్షతో, ముఖ్యంగా నా పరలోక జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న ఆశతో ఆ సభకు వెళ్ళాలనుకున్నాను. ఆ ఆశే నన్ను అక్కడికి లాక్కెళ్ళింది.

ధర్మప్రచార కార్యాన్ని నిర్వర్తించటంలో వివిధ మతాల తులనాత్మక అధ్యయనం ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. ప్రస్తుత కాలంలో దాని అవసరం చాలా ఉంది. ఈ రోజుల్లో అనేక ధార్మిక బృందాలు ఈ పనిని నిర్వర్తించటం సంతోషకరమే. కాని దైవప్రవక్త (సల్లం) బోధించిన ధర్మప్రచార (దావత్) సూత్రాల గురించి, ఆయన శైలీవిధానాల గురించి తెలియనివారు కూడా కొందరు ఈ బృందాల్లో చేరిపోతుండటం మూలంగా వారి కార్యకలాపాల్లో ఆనాటి శుభాలుగాని, కళగాని కానరావటం లేదు.

దేశంలోని వివిధ భాషల్లోకి “దైవప్రవక్త (సల్లం) జీవిత చరిత్రను” అనువదింపజేయటం అవసరమనీ, ముఖ్యంగా నూతన తరానికి దీని అవసరం చాలా ఉందన్నది నా అభిప్రాయం. అంతేకాదు, ఆలోచనాపరంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా సమాజానికి నేతృత్వం వహిస్తున్న మన నాయకగణం గనక తలచుకుంటే ప్రజల్లో తిష్టవేసివున్న జడత్వాన్ని, అరాచకాన్ని, ఆధ్యాత్మిక నిర్లక్ష్యాన్ని, పదార్థ పూజనూ, భౌతిక బానిసత్వాన్ని, పాశ్చాత్య భావజాలం పట్ల మక్కువనీ దూరం చేసి వారిలో నవచైతన్యాన్ని, నూతనోత్తేజాన్ని నింపి సత్యధర్మ సంస్థాపనను, నవసమాజ నిర్మాణాన్ని సాధించి తీరుతుందని కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే దైవదౌత్య విధానం గురించి, దాని స్వరూపస్వభావాల గురించి మన నేతలకే తెలియదు. దాని విలువ, ప్రాముఖ్యతలు వారికే ఒంటబట్టవు. మానవ జీవితానికి, సంస్కృతీనాగరికతలకు దైవదౌత్యం చేసిన ఉపకారం ఎలాంటిదో, దానిమూలంగా లోకానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరాయో, నవతరం, నవనాగరికతలు ఈ దైవదౌత్యంతో తెగతెంపులు చేసుకోవటం మూలంగా మన నాగరిక సమాజం ఎలాంటి భ్రష్టత్వానికి గురయిందో, ఎంతటి లోతైన వినాశ కూపంలో అది పడిపోబోతుందో వారికి బోధపడటం లేదు.

“అల్ యౌమ అక్మల్తులకుమ్ దీనకుమ్ వ అత్‌మమ్‌తు అలైకుమ్
నీమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా”

పై సూక్తి ద్వారా కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే కాకుండా యావత్తు మానవాళికీ లభించిన సంపదను, వరాలను, ప్రత్యేకతను గురించి కూడా చాలా తక్కువమంది యోచించి ఉంటారు. మొదటగా ఈ సూక్తుల్లో ప్రవక్తల పరంపర ముగిసిపోయిందని ప్రకటించటం జరిగింది. ముహమ్మద్ (సల్లం) అంతిమ దైవప్రవక్త. ఆయన తర్వాత మరే ప్రవక్తా రాడు. ప్రపంచంలో ప్రవక్తలు నేర్పించవలసిన విద్యాసంస్కారాలు మిగిలి లేవు. కనుక ఇక ప్రపంచానికి మరే ప్రవక్తా రావలసిన అవసరం లేదు. దేవుడు ఈ ఇస్లాం ధర్మాన్ని, మరో మాటలో చెప్పాలంటే తన అనుగ్రహాన్ని పరిపూర్ణం చేశాడు. ఇకపోతే రెండో విషయం దైవధర్మాన్ని, దైవానుగ్రహాలను పరిపూర్ణం చేయటం జరిగిందనే ప్రకటన ద్వారా ధర్మంలో ఇక ఎలాంటి సవరణకుగాని హెచ్చుతగ్గులకుగాని అవకాశం లేదనీ మరే ప్రవక్తా రానవసరం లేదని తెలుస్తోంది.

మహాప్రవక్త (సల్లం) ఇహలోకం వీడి వెళ్ళిపోయేముందే ప్రవక్తల పరంపర ఆయనతో అంతమవుతుందనీ, తాను తన అనుగ్రహాన్ని పరిపూర్ణం చేశాననీ, ఆయన తర్వాత మరే ప్రవక్తా రాడనీ, మరే నూతన సమాజం ఆవిర్భవించబోదని ప్రకటించటం దేవుడు ముస్లిం సమాజానికి చేసిన మరో మహోపకారం. దివ్యఖుర్‌ఆన్‌లో ఎంతో వివరంగా చేయబడిన ఈ ప్రకటన ద్వారా మనకు గొప్ప గుణపాఠం, సందేశం లభిస్తున్నాయి. ఈ ప్రకటన మనల్ని విశ్వాసాల, ఆచరణల ప్రాదేశిక, కాలపరమైన ఏకత్వం వైపుకు పిలుపునిస్తోంది. ప్రళయం వరకూ ముస్లిం సమాజ విశ్వాసాలు, ఆచరణలు ఒకేవిధంగా ఉంటాయనీ, ప్రతియుగంలో ప్రతిచోటా ముస్లింలు ధర్మం, విశ్వాసం, ఆచరణల పరంగా ఐకమత్యంతో ఉంటారని కూడా దీని ద్వారా మనకు బోధపడుతోంది.

మా ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖ ఇస్లామీయ విద్వాంసులు హజ్రత్ మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మలై) గారితో నాకు సేవా సంబంధం ఏర్పరచిన మా నాన్న – శ్రీయుత గౌరవనీయులు బషీరుద్దీన్ అహ్మద్ (ఇంజనీర్) గారికి నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా భార్యకూ, నాకూ పవిత్ర మక్కానగరంలో ఆ మహానుభావుని చేతిపై ‘బైత్’ చేసే భాగ్యం లభించింది. అది నాకు గర్వకారణం.

హిజాజ్ వాస్తవ్యులైన ప్రియసోదరులు యూనుస్ మైమనీ గారి ముందు ఈ పుస్తకం అనువాదం చేయిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి ఈ శుభకార్యం త్వరగా నెరవేరటం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. నేనాయనకూ కృతజ్ఞుణ్ణి. ఆ తర్వాత ముఖ్యంగా దీనిని పునఃపరిశీలించి ఇచ్చిన ముహమ్మద్ ఆసిపుద్దీన్ (M.B.A., L.L.B) గారికి కూడా నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించటంలో నాకు తగిన విధంగా సూచనలిచ్చిన పెద్దలు జనాబ్ సయ్యిద్ గులామ్ మహమూద్ జీలానీగారికి, జనాబ్ ముహమ్మద్ ఉస్మాన్ హిజాజ్‌గారికి, ఈ పుస్తకాన్ని ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన అల్‌హఖ్ తెలుగు పబ్లికేషన్స్ డైరెక్టరు ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

చివరగా ఈ పుస్తకాన్ని ఉర్దూనుండి తెలుగులోకి అనువదించుకోవటానికి అనుమతినిచ్చిన మా ఆధ్యాత్మిక గురువులు-లక్నో పట్టణంలోని నద్వతుల్ ఉలమా కళాశాల ప్రిన్స్‌పాల్, ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా సయ్యిద్ రాబే హసనీ నద్వీగారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలనీ, మరింత ధర్మసేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను.

ఈ సత్కార్యాన్ని నా కొరకు, నా ఆలుబిడ్డలకొరకు క్షమాభిక్షాసాధనంగా, పరలోక సామాగ్రిగా భావిస్తూ ఈ అనువాద కృతిని దైవసన్నిధిలో సమర్పించుకుంటున్నాను. దేవుడు ఈ చిరుకృషిమీద ఆమోదముద్ర వేయాలనీ, మా ఆధ్యాత్మిక గురువులైన సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వీగారి సమాధిని వెలుగుతో నింపాలనీ, ఆయన పరలోక అంతస్తుల్ని పెంచాలనీ, ఆయనగారి ఈ పుస్తకం ద్వారా ముస్లింలకు ముఖ్యంగా ముస్లిమేతర సోదరులకు సన్మార్గం లభించాలని కోరుకుంటూ…

– ముస్లిహుద్దీన్ అహ్మద్ హైదరాబాదీఅబుల్ హసన్ అలీ నద్వీగారి శిష్యుడు
ప్రకాశకులు