ఆరవ అధ్యాయం
కందక ప్రతిఘటన
బనూ నజీర్ తెగవారు మదీనా వదలి వెళ్ళిపోయిన తరువాత ముస్లింలపై కక్షసాధింపు కోసం కుట్రలు పన్నసాగారు. బనూనజీర్ తెగ నాయకులైన సలాం బిన్ అబుల్ హుఖైఖ్, హుయ్ బిన్ అఖ్తబ్, కినానా బిన్ రబీ తదితరులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని, ఖురైషులు గనక తమతో చేయికలిపితే తాము ఇస్లాం ధర్మాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని చెప్పారు. ఆ మాట వినగానే ఖురైషులకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లనిపించింది. దాన్ని వారు సంతోషంతో అంగీకరించారు. ఖురైషుల్ని ఒప్పించిన తరువాత బనూ నజీర్ నాయకులు గిత్ఫాన్ తెగవారి దగ్గరికి వెళ్ళి తాము ఈ పనికి ఒప్పుకుంటే ఖైబర్ ప్రాంతంలోని సగం పంట తమకు ఇచ్చేస్తామని మభ్యపెట్టారు. దాంతో గిత్ఫాన్ తెగవారు కూడా ఒప్పుకున్నారు. బనూ అసద్ తెగవారు బనూ గిత్ఫాన్ తెగవారికి మద్దతుదారులు. అంచేత తాము కూడా సైన్యాన్ని తీసుకొని రావాలని గిత్ఫాన్ తెగవారు వారికి లేఖవ్రాసి పంపారు. బనూ సులైమ్ తెగవారికి ఖురైషులతో సత్సంబంధాలుండేవి. దాంతో సులైమ్ తెగ కూడా ఖురైషుల పక్షం వహించటానికి సిద్ధమయింది. బనూ సాద్ తెగవారు యూదులకు మద్దతుదారులైనందున యూదులు వారిని కూడా యుద్ధానికి ప్రేరేపించారు. మొత్తానికి అరబ్బు తెగలన్నీ ఏకమై భారీ ఎత్తున సైన్యాన్ని కూడదీసుకొని మదీనాపై దండయాత్రకు బయలుదేరాయి. ఆ సైన్యం మొత్తం దాదాపు పదివేలకు పైనే ఉంటుంది.1
దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియగానే ఆయన అనుచరుల సలహా కోరారు. అప్పుడు ఈరాన్‌కు చెందిన సల్మాన్ ఫార్సీ (రజి) తమ దేశంలో జరిగే కందక యుద్ధాల గురించి వివరించారు. అలాగే ప్రస్తుతం ముస్లింలు శత్రువులకు ఎదురెళ్ళి పోరాడటం విజ్ఞతతో కూడుకున్న పని కాదనీ, సైన్యాన్నంతటినీ ఒకేచోట మోహరించి చుట్టూ కందకాలు త్రవ్వుకోవాలని సూచించారు. ఆయన ఇచ్చిన సలహాను ప్రజలందరూ అంగీకరించారు. వెంటనే కందకాలు త్రవ్వటానికి సాధనాలను సమకూర్చుకున్నారు.
మదీనా నగరానికి మూడు వైపులా ఇండ్లు, ఖర్జూరపు తోటలుండి నగరానికి రక్షణ కల్పిస్తుండేవి. ఒక్క సిరియా దిక్కు మాత్రం ఖాళీ మైదానం ఉండేది. దైవప్రవక్త (సల్లం) మూడు వేల అనుచరులతో పాటు వెళ్ళి ఆ ప్రాంతంలోనే కందకాలు త్రవ్వటం ప్రారంభించారు. ఇది హి.శ. ఐదవ సంవత్సరం ఎనిమిదో తేదీ నాటి సంఘటన.
కందకాలు త్రవ్వవలసిన చోట్లను దైవప్రవక్త (సల్లం) స్వయంగా నిర్ణయించారు. నేలమీద గుర్తులు వేసి పదిమంది పదిగజాల భూమి చొప్పున త్రవ్వాలని ఆదేశించారు. కందకం లోతు ఐదు గజాలు ఉండాలని నిర్ధారించారు. మూడువేల మంది అనుచరులు ఆరుదినాల్లో ఈ కందకాల పని పూర్తిచేశారు.2
మస్జిదె నబవీ నిర్మాణం జరుగుతున్నప్పుడు దైవప్రవక్త (సల్లం) అనుచరులతోపాటు తానూ ఓ కార్మికుడిలా పరిశ్రమించారు. ఈ రోజు కందకాలు త్రవ్వినప్పుడు కూడా అలాగే ప్రత్యక్షమయ్యారు. వణుకు పుట్టించే చలిరాత్రులు. మూడ్రోజుల దాకా తినడానికి ఏమీ దొరికేది కాదు. ముహాజిర్లు, అన్సార్లు కందకాల నుండి మట్టి మోసుకెళ్ళి పారబోస్తూ ఉత్సాహంతో ఈ విధంగా గీతాలాపన చేసేవారు.
“మేము ముహమ్మద్‌తో బాస చేసుకున్నాము జీవితాంతం ఆయన్ని అనుసరిస్తాం”.3
దైవప్రవక్త (సల్లం) కూడా మన్ను ఎత్తిపోసేవారు. ఆయన ఉదరంపై పడిన మన్నును దులుపుకుంటూ ఇలా అనేవారు:
“దైవసాక్షి! దేవుడే లేకుంటే మనకు సన్మార్గం లభించేది కాదు. మనం దానధర్మాలు చేసేవాళ్ళం కాము. దేవా! మా హృదయాలను నెమ్మదించేలా చెయ్యి, మాకు స్థయిర్యాన్ని ప్రసాదించు. ముందుగా వాళ్ళే మాపై తిరుగుబాటు చేస్తున్నారు. మేము సాధ్యమైనంతవరకు అలజడులు తలెత్తకుండా ఉండాలనే కృషి చేస్తున్నాం.”
ఆ సందర్భంగా ఆయన నోటి నుండి తన అనుచరులైన అన్సార్లు, ముహాజిర్ల కోసం ఈ ఆశీర్వచనాలు వెలువడ్డాయి-
“దేవా! పరలోక సౌఖ్యమే అసలు సౌఖ్యం, ముహాజిర్లకు, అన్సార్లకు శుభాన్ని ప్రసాదించు.”4
అనుచరులు కందకాలు త్రవ్వుతుండగా ఒక చోట ఓ రాయి అడ్డొచ్చింది. ఎవరు ఎంత ప్రయత్నించినా అది పగల్లేదు. అనుచరులు ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియపరచారు. ఆయన మూడ్రోజుల నుండి పస్తులతో గడుపుతున్నారు. ఆ స్థితిలోనే వచ్చి ఆయన పారతో ఆ రాయి మీద ఒక్క దెబ్బవేశారు. దాంతో ఆ రాయి తుత్తునియలయి పోయింది.5
ముస్లిం సేనలు సిలా కొండలు వీపు వెనుక భాగంలో ఉండేటట్లు బారులు తీరారు. స్త్రీలను నగరంలోని కోటల్లో ఉంచి కట్టుదిట్టం చేయటం జరిగింది. బనూ ఖురైజా తెగవారు దాడిచేసే అవకాశాలుండటం వల్ల రెండొందలమంది సైనికుల్ని ఆ కోటల దగ్గర కాపలాగా ఉంచారు. వీళ్ళకు నాయకునిగా సలమా బిన్ అస్లమ్ నియమితులయ్యారు.6
బనూ ఖురైజా యూదులు అప్పటివరకు ఎవరితోనూ చేతులు కలపకుండా తటస్థంగానే ఉన్నారు. కాని ఇప్పుడు బనూ నజీర్ తెగవారు వాళ్ళను తమలో కలుపుకోవాలని ఉవ్విళ్ళూరసాగారు. హుయ్ బిన్ అఖ్తబ్ (హజ్రత్ సఫియ్యా (రజి అన్హా) తండ్రి) ఖురైజా నాయకుడయిన కాబ్ బిన్ అసద్ దగ్గరికి వెళ్ళాడు. కాని అతను బనూ నజీర్‌తో చేతులు కలపటానికి నిరాకరించాడు. అప్పుడు హుయ్ అతన్ని మెల్లగా దువ్వసాగాడు.
“నేను అంతులేని సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాను. ఖురైషులు, అరబ్బులంతా ఏకమయ్యారు. అందరిదీ ఒకే లక్ష్యం. ఎలాగైనా సరే ముహమ్మద్‌ను కడతేర్చటం. ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదు. ఈ దెబ్బతో ఇస్లాం ధర్మం నామరూపాల్లేకుండా పోతుంది” -హుయ్ కాబ్‌ను పురికొల్పాడు.
అయినాగాని కాబ్ ఇస్లాంకు వ్యతిరేకంగా అరబ్బులతో చేతులు కలపటానికి సుముఖుడు కాలేదు.
“ముహమ్మద్ ఎంతో సత్యబద్ధుడు. ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని నేను భగ్నం చేయలేను”-పుల్ల విరిచినట్లుగా సమాధానమిచ్చాడు. అయినా హుయ్ శ్రమ వృధా కాలేదు. ఎట్టకేలకు తన మాయమాటలతో కాబ్‌ను తనవైపుకు లాక్కున్నాడు.
ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియగానే నిజం ఏమిటో కనుక్కొని రమ్మని ఆయన సాద్ బిన్ ముఆజ్, సాద్‌బిన్ ఉబాదాలకు పురమాయించారు. ఒకవేళ బనూ ఖురైజా తెగవారు తమ ఒప్పందాన్ని భగ్నం చేసిన మాట నిజమే అయితే ఆ విషయాన్ని చూచాయగా తనకు తెలియపరచమనీ, ప్రజలకు ఆ విషయం తెలిస్తే వారు ధైర్యం కోల్పోయే ప్రమాదముందని చెప్పి పంపించారు. ఆ ఇరువురు అనుచరులు బనూ ఖురైజా వారి దగ్గరికి వెళ్ళి వారికి తమ ఒప్పందం సంగతి గుర్తు చేశారు. దానికి వాళ్ళు, “ముహమ్మద్ ఎవరో ఆయన ఒప్పందం ఏమిటో మాకు తెలియద”ని సమాధానమిచ్చారు.7
ఆ విధంగా బనూ ఖురైజా తెగవారు కూడా ఖురైషులతో చేతులు కలపటం వల్ల శత్రుసైన్యం ఇంకా అధికమయింది. ఖురైషులు యూదులు, అరబ్బు తెగల పదివేలమంది సైన్యం మూడు దళాలుగా విడిపోయి మదీనా నగరంపై ముప్పేట దాడులు ప్రారంభించటంతో మదీనా నేల అదిరిపోయింది.8
దీని గురించే దివ్యఖురాన్లో ఇలా చెప్పబడింది:
ముస్లిం సైన్యంతోపాటు కొంతమంది కపటులు కూడా యుద్ధానికొచ్చారు. వాళ్ళు కేవలం ప్రదర్శనా బుద్ధితోనే వారివెంట బయలుదేరారు. తీరా యుద్ధ మైదానానికి వచ్చాక వారికి ప్రతికూల వాతావరణం ఎదురయింది. ముస్లింల దగ్గర ఆహార సామగ్రి తక్కువగా ఉంది. అంచేత కొన్ని దినాలపాటు నిరంతరంగా పస్తులుండాల్సి వచ్చేది. రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. దీనికి తోడు ఇసుకేస్తే రాలనట్లుగా ఉన్న సైన్యాలతో యుద్ధం చేయాలి. ఈ ఇబ్బందుల్ని చూసిన తరువాత ఆ కపటుల బండారం బయట పడింది. వాళ్ళు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి ఏవో సాకులు చూపెట్టి తమకు ఇండ్లకెళ్ళిపోవటానికి అనుమతినివ్వమని బ్రతిమాలసాగారు.10
అప్పుడు వారిలోని ఒక వర్గం “మా గృహాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి” అని దైవప్రవక్తకు చెప్పి సెలవుకోరింది. వాస్తవానికి వాటికి ఏ ప్రమాదమూ లేదు. అసలు వారు (యుద్ధమైదానం నుండి) పారిపోదలిచారు.” (అల్ అహ్జాబ్)
కాని వాస్తవానికి ఈ యుద్ధం ఇస్లాం కోసం ప్రాణాలర్పించే త్యాగధనుల సహనానికి పెట్టబడిన పరీక్ష.11
భయంకరమైన ముట్టడి
దాదాపు ఓ నెల రోజులపాటు శత్రు సైన్యాలు ముస్లింలను ముట్టడించి కూర్చున్నాయి. దైవప్రవక్త (సల్లం)కు, ఆయన అనుచరులకు మూడేసి రోజుల వరకు తినడానికి ఏమీ లభించేది కాదు. కొంతమంది అనుచరులు ఆకలికి తాళలేక దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి తమ కడుపులకు కట్టుకొని ఉన్న రాళ్ళు చూపించారు. దైవప్రవక్త (సల్లం) తన చొక్కా ఎత్తిచూపితే ఆయన కడుపుకు ఒకటికి బదులు రెండు రాళ్ళు కట్టబడి ఉన్నాయి.12 శత్రువుల ముట్టడింపు రానురాను తీవ్రరూపం దాల్చసాగింది. ఒకసందర్భంగా దైవప్రవక్త (సల్లం) ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “నగరం వెలుపలకెళ్ళి శత్రువులను గురించి సమాచారం తీసుకొని రాగలిగేవాడెవడైనా ఉన్నాడా?” అన్నారు. దానికి హజ్రత్ జుబైర్ (రజి) తప్ప ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ సందర్భంగానే దైవప్రవక్త (సల్లం) హజ్రత్ జుబైర్‌ను ‘హవారీ’ అనే బిరుదుతో సత్కరించారు.13
శత్రువులు కందకాలు దాటి మదీనా వైపుకు రాగలిగేవారు కారు. అందుకని దూరం నుండే రాళ్ళు, బాణాలు విసిరేవారు. దైవప్రవక్త (సల్లం) అనేక చోట్ల కందకాల వద్ద సైన్యాన్ని నిలబెట్టారు. వారు శత్రువుల దాడుల్ని త్రిప్పికొట్టేవారు. ఒకానొక కందకం వద్ద స్వయంగా దైవప్రవక్త (సల్లం) కాపలాగా నించున్నారు.14
ఈ భయంకరమైన ముట్టడిని చూసి అన్సార్లు ధైర్యం కోల్పోతారేమోనని దైవప్రవక్త (సల్లం)కు అనుమానం కలిగింది. అందుచేత ఆయన గిత్ఫాన్ తెగవారితో మదీనా పంటలోని మూడోవంతు వారికి ఇచ్చే షరతుపై ఒప్పందం చేసుకుందామని తలంచారు. అన్సార్ నాయకులు సాద్ బిన్ ఉబాదా, సాద్ బిన్ ముఆజ్లను పిలిచి ఈ విషయమై సలహా కోరారు. దానికి వారు “ఒకవేళ ఇది దైవాజ్ఞ అయితే ఇక దాన్ని నిరాకరించటమన్న మాటే ఉండదు, కాని ఇది కేవలం దైవప్రవక్త (సల్లం) అభిప్రాయమైతే మాదో విన్నపం. మేము అవిశ్వాసులుగా ఉన్నప్పుడే మా నుండి కప్పం వసూలు చేయటానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు. ఇప్పుడు ఇస్లాం స్వీకరించిన తరువాత మా పలుకుబడి మరింత పెరిగింది. అలాంటి స్థితిలో మేము ఇతరులకు కప్పం చెల్లించటం సిగ్గుచేటు” అని అన్నారు. వారి ఆత్మవిశ్వాసం చూసి దైవప్రవక్త (సల్లం) మనసు కుదుట పడింది. సాద్ ఒప్పంద పత్రాన్ని తనచేతిలోకి తీసుకొని అందులో వ్రాసివున్న మాటలు చెరిపేస్తూ ‘వీళ్ళకు ఎంత దమ్ముందో మనమూ చూద్దాం’ అన్నారు.15
బహు దైవారాధకులు ముస్లింలపై వంతులవారీగా దాడి జరపాలని పథకం వేసుకున్నారు. ప్రముఖ ఖురైష్ సైన్యాధిపతులైన అబూ సుఫ్యాన్, ఖాలిద్ బిన్ వలీద్, అమ్ర్ బిన్ ఆస్, జిరార్ బిన్ ఖత్తాబ్, హుబైరాలలో ఒక్కొక్కరు ఒక్కోరోజు సైన్యానికి సారథ్యం వహించేవారు. ప్రతి సైన్యాధిపతీ తన వంతు వచ్చినప్పుడు సైన్యాన్నంతటినీ వెంటబెట్టుకొని వెళ్ళి యుద్ధం చేసేవాడు. శత్రువులు కందకాలను దాటలేకపోయేవారు. అయినాగాని కందకాల వెడల్పు మరీ అంత ఎక్కువగా లేకపోవటం వల్ల ఆవలివైపు నుంచి ముస్లింలపై రాళ్ళు, బాణాలు విసిరేవారు.16 ఆఖరికి ఇలా రాళ్ళు రువ్వటం వల్ల లాభం లేదనుకొని ఒకేసారి మెరుపుదాడి చేయాలని నిశ్చయించుకున్నారు. శత్రుసేనలన్నీ ఒకచోట చేరాయి. తెగలనాయకులు ముందుండి సైన్యాన్ని నడిపిస్తుండగా, ఒకచోట కందకం వెడల్పు చాలా తక్కువగా ఉన్నట్లు కన్పించింది. ఇక అక్కడి నుంచే దాడి చేయటం ప్రారంభించారు. ప్రముఖ అరబ్బు వీరులైన జిరార్, హుబైరా, నౌఫిల్, అమ్ర్ బిన్ అబ్దెవుద్లు తమ గుర్రాల సాయంతో ఒక్క గంతులో ఆవలి వైపుకు చేరుకున్నారు. వారిలో అందరికన్నా గొప్పవీరుడు అమ్ర్ బిన్ అబ్దె వుద్. ప్రజలు అతన్ని వెయ్యి రౌతులకు సమానమైన బలవంతుడిగా చెప్పుకునేవారు. బద్ర్ యుద్ధంలో క్షతగాత్రుడై తప్పించుకొని పారిపోయాడు. ముస్లింలపై ప్రతీకారం తీర్చుకునేదాకా తైల సంస్కారం చేసుకోనని ప్రతినబూనాడు. అప్పటికి అతని వయస్సు తొంబై సంవత్సరాలు. అయినా అందరికన్నా ముందుగా అతనే దాడికి దిగాడు. అరబ్బు ఆచారం ప్రకారం నడి యుద్ధ భూమిలోకి వెళ్ళి, ‘తనతో పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?’ అని రంకెలు వేశాడు. హజ్రత్ అలీ “నేను సిద్ధమే” అంటూ అతని మీదకు పోబోతుండగా అమ్ర్ బిన్ అబ్దె వుద్ సామాన్యుడు కాడంటూ దైవప్రవక్త(సల్లం) ఆయన్ని ఆపారు. హజ్రత్ అలీ సరేనని కూర్చున్నారు. కాని అమ్ర్కు పోటీగా ఎవరూ నిలబడటం లేదు. అతను రెండోసారి సవాలు చేశాడు. అప్పుడు కూడా హజ్రత్ అలీయే అతణ్ణి ఎదుర్కొనటానికి సిద్ధమయ్యారు. కాని దైవప్రవక్త (సల్లం) ఆదేశం మేరకు వెనక్కి తగ్గారు. మూడోసారి కూడా అలాగే జరిగింది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) “ఇతను అమ్ర్, వీడు సామాన్యుడు కాడు” అని హెచ్చరించారు.
కాని హజ్రత్ అలీ ఏ మాత్రం భయపడకుండా, “అవును, ఇతను అమ్ర్ అని నాకూ తెలుసు” అన్నారు. చివరికి దైవప్రవక్త (సల్లం) ఆయనకు అమ్ర్తో పోరాడటానికి అనుమతి నిచ్చారు. తన శుభ హస్తాలతో ఖడ్గ ప్రదానం చేసి తలపాగా కట్టారు.
అమ్ర్ లోకంలో ఎవరయినా తనతో మూడు విన్నపాలు చేసుకుంటే ఏదో ఒక విన్నపాన్ని తప్పకుండా అంగీకరిస్తాడని ప్రతీతి. హజ్రత్ అలీ అతని దగ్గరికెళ్ళి ముందుగా ఈ విషయం గురించే అడిగారు. ఆ సంగతి నిజమని రుజువయ్యాక అతనితో ఈ విధంగా సంభాషించారు.
అలీ: నేను నిన్ను ఇస్లాం స్వీకరించమని విన్నవించుకుంటున్నాను.
అమ్ర్: అది అసంభవం.
అలీ: లేదంటే యుద్ధం మానుకొని తిరిగివెళ్ళిపో.
అమ్ర్: అలా చేస్తే అరబ్బు మహిళలు నన్ను ‘చవట’ అని ముద్రవేస్తారు. అది నేను భరించలేను.
అలీ: మరయితే నాతో యుద్ధానికి సిద్ధమవ్వు.
ఆ మాట వినగానే అమ్ర్ దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు. ఈ భూమ్మీద తనతో ఛాలెంజీ చేసే మగాడు కూడా ఉన్నాడా! అని ఆశ్చర్యపోయాడు. హజ్రత్ అలీ నేల మీద నించొని ఉండగా తాను గుర్రంపై నుండి యుద్ధం చేయటం తనకు అవమానకరంగా భావించి గుర్రం దిగాడు. ఖడ్గంతో గుర్రం కాళ్ళ మీద ఒక్కవేటు వేశాడు. దాంతో గుర్రం కాళ్ళ గిట్టెలు తెగిపోయాయి. కాస్త ముందుకు వచ్చి-
“నీ పేరేంటి?” అని అడిగాడు.
‘అలీ’ – నిర్భయంగా సమాధానమిచ్చారు.
‘నేను నీతో యుద్ధం చేయాలనుకోవటం లేదు’. హజ్రత్ అలీ లాంటి బలహీనులతో పోరాడటం అవమానకరంగా అనిపించిందతనికి.
“కాని నేను చేయాలనుకుంటున్నాను” -హజ్రత్ అలీ అతన్ని రెచ్చగొడుతూ మాట్లాడారు.
ఆ మాట వినగానే అమ్ర్ ఆగ్రహంతో పల్లు పటపటా కొరికాడు. ఒర నుండి ఖడ్గం తీసి అలీ శిరస్త్రాణంపై ఝుళిపించాడు. కత్తి శిరస్త్రాణంలో దిగబడి నుదుటికి గాయమయింది. ఆ మచ్చ ఆయన నుదుటిపై జీవితాంతం ఉండి పోయింది. ఖామూస్ గ్రంథంలో ఇలా పేర్కొనబడింది: హజ్రత్ అలీ నుదుటిపై రెండు గాయాల మచ్చలుండేవి. ఒకటి అమ్ర్ వల్ల కలిగింది. రెండోది ఇబ్నె ముల్జిమ్తో పోరాడినప్పుడు కలిగింది. అందుకే ప్రజలు ఆయన్ని ‘జుల్ ఖర్నైన్’ అని పిలిచేవారు.
అమ్ర్ దాడి తరువాత హజ్రత్ అలీ అతనిపై ఎదురుదాడి చేశారు. ఖడ్గంతో ఒక్క వేటు వేయగానే అది అమ్ర్ భుజాన్ని తెగ్గొడుతూ బాగా లోతుగా దిగబడింది. వెంటనే ఆయన “అల్లాహు అక్బర్” అని నినదించారు. అమ్ర్ వధించబడగానే ముస్లింలు విజయోత్సాహంతో ఉరకలు వేశారు.17 అమ్ర్ తరువాత జిరార్, హుబైరాలు దాడికి దిగివచ్చారు. కాని అలీని చూడగానే వారు సయితం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. హజ్రత్ ఉమర్ జిరార్ను వెంబడించారు. జిరార్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి బరిసెతో ఎదురు దాడి చేయాలనుకున్నాడు, కాని తన్నుతాను తమాయించుకొని, “ఉమర్, ఈ ఉపకారాన్ని గుర్తుంచుకో” అన్నాడు.18
నౌఫిల్ పరుగెత్తుకుంటూ వచ్చి కందకంలో పడిపోయాడు. అదే అదనుగా ముస్లింలు అతనిపై బాణాల వర్షం కురిపించసాగారు. అతను కందకంలో నుండి, “ముస్లింలారా! నేను ఒక వీరునిలా చావాలనుకుంటున్నాను” అని గట్టిగా కేకవేశాడు. హజ్రత్ అలీ అతని కోరికను మన్నించి తానూ కందకంలోకి దిగారు. ఒక్క ఖడ్గపు వేటుతోనే అతన్ని పైలోకానికి పంపించారు.19 ఆ రోజు యుద్ధం చాలా కఠినంగా సాగింది. పగలంతా ఇరుపక్షాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. అవిశ్వాసులు ముస్లింలపై అన్నివైపుల నుంచి ఎడతెగకుండా రాళ్ళు, బాణాల వర్షం కురిపించారు. ఆ రోజు దైవప్రవక్త (సల్లం)కు వరుసగా నాలుగు నమాజులు వేళ తప్పించి చేయవలసి వచ్చింది. ఎడతెరిపి లేకుండా బాణాలు, రాళ్ళు వచ్చిపడుతుండటంతో నించున్న చోటు నుండి కదలటం కూడా కష్టమయిపోయింది.20
సఫియా (రజి అన్హా) సాహసం
ముస్లిం స్త్రీలు ఉన్న కోట యూదుల నివాస ప్రాంతాలకు దగ్గర్లో ఉంది. పురుషులందరూ దైవప్రవక్త (సల్లం) వెంట యుద్ధానికి వెళ్ళి ఉన్నారు. యూదులు అదే అదనుగా తలపోసి కోటపై దాడిచేయటానికి వచ్చారు. ఒక యూదుడు కోట సింహద్వారం దగ్గరికి వెళ్ళి దాడికి అనుకూలమైన మార్గాలు వెతకసాగాడు. దైవ ప్రవక్త (సల్లం) మేనత్త అయిన హజ్రత్ సఫియా (రజి అన్హా) అతన్ని చూసి కోటలో స్త్రీలకు రక్షణకర్తగా నియమితులై ఉన్న హస్సాన్ బిన్ సాబిత్ను పిలిచారు.
“అదిగో… అటు చూడండి. ఎవడో యూదుడొచ్చి సింహద్వారం దగ్గర ఏదో పరిశీలిస్తున్నాడు. మీరు కోట దిగి వెళ్ళి వెంటనే అతన్ని చంపేయండి. లేకపోతే అతనెళ్ళి కోటలో పురుషులెవరూ లేరని శత్రువులతో చెప్పేస్తాడు” అన్నారు అతనివైపు చూపెడుతూ.
కాని హస్సాన్ బిన్ సాబిత్కు పిరికితనం వ్యాధి ఉండేది. ఆయన ముందు ఎవరైనా కోట్లాడుకుంటుంటే అది చూసి ఆయనలో తత్తరపాటు మొదలయ్యేది. అంచేత ఆయన తన దౌర్బల్యాన్ని వ్యక్తం చేశారు. “నాలో అంతశక్తి ఉంటే నేను ఇక్కడెందుకు ఉండేవాణ్ణి” అన్నారు.
అప్పుడు హజ్రత్ సఫియా తనే ఆ పనికి ఉపక్రమించారు. గుడారం కోసం పాతి ఉంచిన ఓ దుడ్డు కర్రను పీకి, మెల్లగా కోటదిగి వెళ్ళి అతని తలపై గట్టిగా ఒక్క దెబ్బ వేశారు. దాంతో అతని తల పుచ్చకాయలా పగిలిపోయింది. ఇక ఆమె తిరిగొచ్చి హస్సాన్తో ఆ యూదుని ఒంటిపైనున్న ఆయుధాలు, బట్టలు లాక్కుని రమ్మని చెప్పారు. హజ్రత్ హస్సాన్ దానికి కూడా నిరాకరిస్తూ తనకు అవేమీ అవసరం లేదని చెప్పారు. అప్పుడామె అదీ చేయలేకపోతే కనీసం అతని శవాన్నయినా మెడ వరకు నరికి తలను కోట బయటికి విసిరేస్తే యూదులు భయపడతారని చెప్పారు. కాని చివరకు ఆ పని కూడా ఆమే చేయాల్సి వచ్చింది. ఆమె ఆ యూదుడి తల నరికి కోట వెలుపలికి విసిరేశారు. అది చూసి యూదులు కోటలో కూడా సైన్యం ఉన్నారన్న భయంతో పారిపోయారు.21
దైవ సహాయం వచ్చింది
రోజులు గడిచే కొద్దీ ముస్లింలను ముట్టడించి వున్న శత్రుసైన్యాల ధైర్యం సన్నగిల్లసాగింది. పదివేల మంది సైనికుల ఆహార అవసరాలు తీర్చటమంటే మామూలు విషయం కాదు. కాకతాళీయంగా అది చలికాలమయినప్పటికీ ఒక్కసారిగా తుఫాను గాలులు చెలరేగాయి. తీవ్రమైన గాలి తాకిడికి శత్రువుల గుడారాలు ఎగిరిపోయాయి. పొయ్యిల పైనున్న కుండలు నేలపాలయ్యాయి. ఒక విధంగా ఈ సంఘటన ముస్లిం సైన్యాలకు ఎంతగానో తోడ్పడింది. అందుకే ఈ తుఫాను గాలుల్నీ దివ్యఖురాన్ దైవిక సైన్యాలుగా చిత్రించటం జరిగింది.22
నుఐమ్ బిన్ మస్‌వూద్ సఖఫీ అనే ఆయన ఒకానొక గిత్ఫాన్ తెగ నాయకులు. ఖురైషులు, యూదులు ఇరుపక్షాల వారూ ఆయన్ని గౌరవించేవారు. ఆయన ఇస్లాం స్వీకరించిన సంగతి అవిశ్వాసులకు తెలియదు. ఆయన యూదులతోనూ, ఖురైషులతోనూ వేర్వేరుగా మాట్లాడి వారు పరస్పరం అసహ్యించుకునేలా చేశారు. దాంతో వారిమధ్య చీలిక వచ్చేసింది.23
ఒకవైపు విపరీతమైన చలి, మరోవైపు ఎన్నిరోజుల నుండి ముట్టడించి కూర్చున్నా ఏమీ లాభం లేకపోవటం, తుఫాను గాలులు, ఆహారపదార్థాల కొరత, యూదుల సహాయ ఉపసంహరణ-ఇవన్నీ ఖురైషుల నిలకడను పెకిలించి పారేశాయి. అబూసుఫ్యాన్ తన సైన్యంతో, “ఆహార కొరత ఏర్పడింది. చలి తీవ్రంగా ఉంది, దానికితోడు యూదులు కూడా తమ సహాయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక ఇక్కణ్ణుంచి తిరిగి వెళ్ళిపోవడమే అన్ని విధాలా మంచిది” అంటూ సైన్యాన్ని వెనక్కి మరల్చాడు.24 గిత్ఫాన్ తెగవారు కూడా ఖురైషుల వెంట బయలుదేరారు. బనూఖురైజా వాళ్ళు ముట్టడిని ఆపి తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ సైన్యాల మూలంగా చెలరేగిన దుమ్ముతో మదీనా నగర దిశలు ఇరవై రోజులదాకా మసకమసకగానే ఉన్నాయి.
ఈ యుద్ధంలో ముస్లిం సైన్యానికి ప్రాణనష్టం చాలా తక్కువగానే జరిగింది. కాని ఈ యుద్ధంలోనే ఔస్ తెగనాయకులు, అన్సార్లకు కుడిభుజంలా ఉండే హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ తిరిగి కోలుకోలేని విధంగా క్షతగాత్రులయ్యారు. ఈయన క్షతగాత్రులైన సంఘటన నుండి నేర్చుకోదగిన గుణపాఠం చాలా ఉంది.
కన్నతల్లి తన తనయుణ్ణి యుద్ధానికి వెళ్ళమని ప్రేరేపించింది
హజ్రత్ ఆయిషా (రజి అన్హా) ఉన్న కోటలోనే సాద్‌బిన్ ముఆజ్ (రజి) తల్లి కూడా ఉన్నది. ఒకరోజు హజ్రత్ ఆయిషా కోటనుండి బయటికి వచ్చి పచార్లు చేస్తుండగా వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు ఆమెకు శబ్దం వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే హజ్రత్ సాద్ కనిపించారు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఈ పద్యం చదువుతూ యుద్ధభూమి వైపుకు పరుగెడుతున్నారు.
“క్షణం ఆగితే శత్రుసైన్యంలో ఇంకొకడు వచ్చి చేరవచ్చు
మరణం ఆసన్నమయినప్పుడు ఇక మరణం పట్ల భయమెందుకు?”
ఆయన గొంతు విని ఆయన తల్లి లోపల్నుంచి, “త్వరగా వెళ్ళు నాయనా! ఇప్పటికే చాలా ఆలస్యమయింది” అని అన్నది. సాద్ తొడుక్కున్న కవచం చాలా చిన్నదవటంతో ఆయన చేతులు కూడా బయటికి కనిపించేవి. అది చూసి హజ్రత్ ఆయిషా సాద్ తల్లితో, “సాద్ తొడుక్కున్న కవచం ఇంకాస్త పొడువుగా ఉంటే బావుండేది” అన్నారు.
ఆయన యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతున్నప్పుడు ఇబ్నుల్ అరఖా అనేవాడు గురిచూసి ఆయన చేతులమీద బాణం విసిరాడు. దాంతో ఆయన మణికట్టు నరం తెగిపోయింది.25 యుద్ధం ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లం) మస్జిదె నబవీ ప్రాంగణంలో ఆయనకోసం ఒక గుడారాన్ని నిర్మించి ప్రజలు ఆయన్ని పరామర్శించే ఏర్పాట్లు చేశారు. ఈ యుద్ధంలో రుఫైదా అనే మహిళ కూడా పాల్గొన్నది. ఆమె దగ్గర మందులు, మూలికలు ఉండేవి. వాటి సాయంతో ఆమె యుద్ధంలో క్షతగాత్రులైన ముస్లింల గాయాలకు కట్టుకట్టేది. సాద్‌బిన్ ముఆజ్ చికిత్సకోసం ఆమెనే నియమించటం జరిగింది. దైవప్రవక్త (సల్లం) తన స్వహస్తాలతో ఆయన గాయానికి వాతపెట్టారు. కాని గాయం మానలేదు సరికదా విపరీతమైన వాపు వచ్చింది. దైవప్రవక్త (సల్లం) కొన్ని రోజుల తరువాత మళ్ళీ వాతపెట్టారు. అయినా లాభం లేకపోయింది. ఆ తరువాత చాలా రోజులకు బనూఖురైజా తెగ నాశనమయిపోయిన తరువాత ఆ గాయం తగ్గింది కాని ఆయన మాత్రం పరమపదించారు.26
జాతుర్రిఖా యుద్ధం
కందక యుద్ధం ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లం) నాలుగొందల మంది అనుచరుల్ని వెంటబెట్టుకొని గిత్ఫాన్ తెగవారితో యుద్ధం చేయటానికి నజద్ వైపు ప్రయాణమయ్యారు. ఈ యుద్ధం వేసవి కాలంలో జరిగింది. అనుచరుల కాళ్ళకు చెప్పులు కూడా లేవు. బోసి కాళ్ళతో నడవటం మూలంగా బొబ్బలు వచ్చి కాళ్ళు విపరీతంగా నొప్పి పెట్టసాగాయి. అప్పుడు ముస్లింలు ఆ బాధను భరించలేక కాళ్ళకు గుడ్డలు చింపి చుట్టుకున్నారు. అందుకే ఈ యుద్ధాన్ని ‘జాతుర్రిఖా’ (చింపిరిగుడ్డల యుద్ధం) అని పిలిచారు.27
జాతుర్రిఖా యుద్ధం తరువాత జరిగిన సంఘటన-అబ్బాద్ బిన్ బిష్ర్, అమ్మార్ బిన్ యాసిర్ అనే ఇద్దరు సహచరులు ఒకచోట కాపలా కాయటానికి నియమితులయ్యారు. అబ్బాద్ నిలబడి నమాజ్ చేస్తుండగా అమ్మార్ పడుకొని ఉన్నారు. అప్పుడే ఒక శత్రువు అక్కడికి వచ్చి అబ్బాద్పైకి బాణం విసిరాడు. అది ఆయన శరీరంలో గ్రుచ్చుకుంది. ఆయన ఆ బాణాన్ని చేత్తో తీసిపారేసి నమాజును కొనసాగించారు. ఒకటి తరువాత ఒకటి ఆయన శరీరానికి మూడు బాణాలు గ్రుచ్చుకున్నాయి. అయినాసరే ఆయన నమాజ్ వదలిపెట్టలేదు. సలాంతో నమాజ్ ముగించుకున్నాక మిత్రుణ్ణి లేపారు. ఆయన మిత్రుడు ఆయన శరీరానికి గాయాలుండటం చూసి, “శత్రువు వచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు లేపలేదు?” అన్నారు. దానికి సమాధానమిస్తూ, “నేనప్పుడు నమాజులో ఒక సూరా చదువుతున్నాను. దాన్ని అసంపూర్తిగా వదలి వెళ్ళబుద్ధికాలేదు” అన్నారు హజ్రత్ అబ్బాద్ బిన్ బిష్ర్ (రజి).28
బనూ ఖురైజా యుద్ధం
దైవప్రవక్త (సల్లం) మదీనాలో స్థిరపడినప్పుడే అక్కడ ఉన్న యూదులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి ధనమానప్రాణాలకుగాని, వారి మతస్వేచ్ఛకుగాని ఎలాంటి భంగం వాటిల్లదని హామీనిచ్చారు. కాని ఆ తరువాత కాలంలో ఖురైషులు వారికి ధనం ఎరజూపెడుతూ, భయపెట్టిస్తూ ఉత్తరం రాయగానే వారు ముస్లింలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లం) యూదులతో సత్సంబంధాలు పెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ఒప్పంద పునర్నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్నారు. కాని బనూ నజీర్ తెగ యూదులు దానికి నిరాకరించి మదీనా నుండి బహిష్కృతులయ్యారు. బనూ ఖురైజా తెగవారు మాత్రం ముస్లింలతో తిరిగి శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమే సహీహ్ ముస్లిం గ్రంథం లో క్లుప్తంగా ఈ విధంగా వివరించబడింది.29
“హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) కథనం: బనూ నజీర్, బనూ ఖురైజా తెగల యూదులు దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) బనూ నజీర్ తెగవారిని (మదీనా నుండి) బహిష్కరించారు. బనూ ఖురైజా తెగవారిని మాత్రం (మదీనాలోనే) ఉండనిచ్చి ఉపకారం చేశారు.30
బనూ నజీర్ మదీనా నుండి బహిష్కరించబడిన తరువాత ఆ తెగనాయకులైన హుయ్ బిన్ అఖ్తబ్, అబూ రాఫె, సలాం బిన్ అబుల్ హుఖైఖ్ ఖైబర్ వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రయత్నాలు కొనసాగించారు. కందక యుద్ధం వీరి ప్రయత్నాల ఫలితమే. వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా అరబ్బు తెగల నాయకులందరికీ నూరిపోశారు. మొత్తం దేశాన్నే ముస్లింలపైకి ఉసిగొల్పారు. ఫలితంగా యూదులు, అరబ్బు తెగలవారందరూ ఖురైషులతో కలసి మదీనాపైకి దండెత్తి వచ్చారు. అప్పటి వరకు బనూఖురైజా తెగవారు మాత్రం ముస్లింలతో తాము చేసుకున్న శాంతి ఒప్పందానికి బద్ధులైఉన్నారు. కాని హుయ్ బిన్ అఖ్తబ్ వారిని మభ్యపెట్టి ఒప్పందాన్ని భగ్నం చేయించాడు. ఒకవేళ ఖురైషులు మధ్యలో తమ సహాయాన్ని ఉపసంహరించుకున్నా తాను మాత్రం ఖైబర్ను వదలిపెట్టి బనూ ఖురైజావారితో ఉంటానని ప్రమాణం చేశాడు. ఆ తరువాత తను అన్న మాటను నిలబెట్టుకున్నాడు కూడా.
బనూ ఖురైజా తెగవారు తమ ఒప్పందాన్ని భగ్నంచేసి కందక యుద్ధంలో బహిరంగంగానే పాల్గొన్నారు. చివరికి అరబ్బు తెగలన్నీ ఓడిపోయి పలాయనం చిత్తగించగానే ఇస్లాంకు బద్ధవిరోధి అయిన హుయ్ బిన్ అఖ్తబ్ను తమ వెంట తెచ్చుకున్నారు.31 ఇక ముస్లింలకు బనూ ఖురైజా పై చర్య గైనక తప్పలేదు. దైవప్రవక్త (సల్లం) కందక యుద్ధం తరువాత ముస్లింలెవరూ ఆయుధాలు దించకుండా బనూ ఖురైజా ప్రాంతంవైపు వెళ్ళాలని ఆదేశించారు.32 ఖురైజా తెగవారు పొరపాటు వల్ల ఆ పని చేసి ఉంటే దైవప్రవక్త (సల్లం) వారికి ఏదో విధంగా బుద్ధిచెప్పి సమస్యను అంతటితో పరిష్కరించి ఉండేవారు. కాని వారు తిరుగుబాటు ధోరణిని అనుసరించి యుద్ధానికి సిద్ధం కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారితో యుద్ధానికి దిగవలసి వచ్చింది. ముస్లిం సైన్యాలు ఖైబర్ చేరుకున్నాయి. హజ్రత్ అలీ వారి కోటల దగ్గరికి వెళ్ళగానే వారు బాహాటంగానే దైవప్రవక్త (సల్లం)ను దూషించటం మొదలుపెట్టారు. ముస్లింలు వారి కోటల్ని ముట్టడించారు. ఈ ముట్టడింపు సుమారు ఒక నెల రోజులపాటు కొనసాగింది. చివరికి వారు హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ మధ్యవర్తిగా ఉండి తీర్పు ఇస్తే తాము ఆయన తీర్పుని శిరసావహిస్తామన్నారు.
హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రజి) ఔస్ తెగవారు. ఈ తెగ ఖురైజా తెగకు రక్షణకర్తగా ఉండేది. ఇరుతెగల మధ్య మైత్రీ సంబంధాలుండేవి. అరబ్బు దేశంలో ఆ కాలంలో ఇటువంటి సంబంధాలు రక్తసంబంధాల కన్నా గొప్పవిగా భావించబడేవి. అంచేత దైవప్రవక్త (సల్లం) వారి విన్నపాన్ని అంగీకరించారు.33
ఏదయినా విషయానికి సంబంధించి స్పష్టమైన దైవాజ్ఞ అవతరించనంతవరకు దైవప్రవక్త (సల్లం) తౌరాత్ గ్రంథం ఆదేశాలనే అనుసరించేవారు. ఖిబ్లా, నమాజ్, శిలాశిక్ష, ప్రతీకార హత్యలు మొదలగు విషయాల్లో నూతన దైవాజ్ఞలు అవతరించక మునుపు ఆయన తౌరాత్ గ్రంథాన్నే అనుసరించేవారు. హజ్రత్ సాద్ ఖురైజా తెగవారిలో యుద్ధం చేయగల శక్తి ఉన్నవారిని వధించాలని, స్త్రీలను పిల్లల్ని బందీలుగా చేసి వారి సిరిసంపదలను యుద్ధప్రాప్తిగా భావించాలని తీర్పునిచ్చారు.34 ఆయన ఇచ్చిన ఈ తీర్పు కూడా యూదుల మతగ్రంథమైన తౌరాత్ ఆదేశాలకు అనుగుణమైనదే. తౌరాత్ గ్రంథంలో ఒకచోట ఇలా ఉంది.
“నువ్వు ఏ నగరంపైనయినా దండెత్తినప్పుడు ముందుగా వారితో సంధి చేసుకోవటానికి వారికి సందేశమివ్వు. ఒకవేళ వారు దానికి ఒప్పుకొని నీకోసం ద్వారాలు తెరిచి ఉంచితే ఆ నగరంలో ఉన్నవాళ్ళందరూ నీకు బానిసలయిపోతారు. కాని వారు గనక సంధికి అంగీకరించకపోతే నువ్వు వారిని ముట్టడించు. దేవుడు నీకు వారిపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తే అప్పుడు నువ్వు ఆ నగరంలో ఉన్న పురుషులందరినీ వధించు. ఇక మిగిలిన స్త్రీలు, పిల్లలు, పశువులు, ఇతర వస్తువులన్నీ నీ కొరకు విజయప్రాప్తిగా పరిగణించబడతాయి.35
హజ్రత్ సాద్ (రజి) పై విధంగా తీర్పుఇచ్చినప్పుడు ఆయన దైవిక తీర్పు ఇచ్చారని దైవ ప్రవక్త (సల్లం) ప్రశంసించారు.36 ఆ ప్రశంసాత్మక పలుకులు ఆ తౌరాత్ గ్రంథ ఆదేశాన్నే సూచిస్తున్నాయి. యూదులకు ఈ తీర్పు గురించి తెలిసినప్పుడు వారి నోటి నుండి వెలువడ్డ పలుకులు కూడా అది దైవిక నిర్ణయమేనన్న విషయాన్ని సమర్థించాయి.
అసలు ఈ కల్లోలాలన్నిటికీ సూత్రధారి అయిన హుయ్ బిన్ అఖ్తబ్ను శిక్షాస్థలిలో నించోబెట్టినప్పుడు అతను ఒకసారి దైవప్రవక్త (సల్లం) వైపు చూసి ఇలా అన్నాడు:
“దైవసాక్షి! నేను నీతో శత్రుత్వానికి పూనుకున్నందుకు బాధపడటం లేదు. వాస్తవం ఏమిటంటే దేవుణ్ణి వదలిపెట్టినవాణ్ణి దేవుడు కూడా వదలిపెడతాడు.”
– ఆ తరువాత ప్రజలవైపు తిరిగి,
“ప్రజలారా! దైవాజ్ఞను అమలుపరచటంలో ఎలాంటి మీమాంసకు ఆస్కారం లేదు. ఇది ముందుగానే వ్రాసిపెట్టబడిన ఒక దైవాజ్ఞ. ఇస్రాయీల్ జాతివారిపై విధించబడిన ఒక శిక్ష.37
ఇక్కడ హుయ్బిన్ అఖతబ్ అన్న మాటలు గమనార్హమైనవి. వాస్తవం ఏమిటంటే అతను మదీనా నుండి బహిష్కృతుడై ఖైబర్ వెళుతున్నప్పుడు తాను ఇంకెప్పుడూ ముహమ్మద్ (సల్లం)కు వ్యతిరేకంగా ఇతరులకు సహాయం చెయ్యనని దైవసాక్షిగా ప్రమాణం చేసుకున్నాడు. కాని తానన్న మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కందక యుద్ధంలో శత్రుసైన్యాలతో చేతులు కలిపి మదీనాపైకి దండెత్తి వచ్చాడు.
నజద్ యుద్ధం – సుమామా (రజి) ఇస్లాం స్వీకరణ
దైవప్రవక్త (సల్లం) కొంతమంది రౌతుల్ని నజద్ ప్రాంతం వైపుకు పంపారు. వారు అక్కడికి వెళ్ళి తిరిగొచ్చినప్పుడు సుమామా బిన్ అసాల్ను బంధించి తీసుకొచ్చారు. ముస్లింలు అతన్ని మస్జిదె నబవీలోని ఒక స్తంభానికి కట్టేశారు. దైవప్రవక్త (సల్లం) అక్కడికి వచ్చి సుమామా క్షేమం గురించి అడిగారు. దానికి సుమామా స్వయంగా సమాధానమిస్తూ…-
‘ముహమ్మద్! నేను క్షేమంగానే ఉన్నాను. మీరు నన్ను వధించమని ఆజ్ఞాపిస్తే ఒక హంతకునికి శిక్ష విధించినట్లవుతుంది. కాని ఒకవేళ నాపై దయదలిస్తే మేలు ఎన్నటికీ మరువని వ్యక్తిపై దయదలచినట్లు భావించండి. మీకు ధనం అవసరమనుకుంటే ఎంత కావాలో చెప్పండి’ అని విన్నవించుకున్నాడు.
మరునాడు దైవప్రవక్త (సల్లం) సుమామాకు అదే ప్రశ్న వేశారు. దానికతను, ‘నేను ముందే చెప్పేశాను. మీరు నాపై దయదలిస్తే మీ మేలు ఎన్నటికీ మరువలేని వ్యక్తిపై దయదలుస్తున్నారని తెలుసుకోండి’ అన్నాడు.
మూడోరోజు కూడా దైవప్రవక్త (సల్లం) మళ్ళీ అదే మాట అడిగారు. ఈసారి కూడా అతను, “నేను చెప్పదలచుకున్నదల్లా చెప్పేశాను. ఇక మీ యిష్టం” అన్నాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) సుమామాను విడిచిపెట్టమని ఆదేశించారు. సుమామా ఖైదు నుండి విడుదలై మస్జిదె నబవీకి దగ్గరలో ఉన్న ఒక ఖర్జూర తోటలోకి వెళ్ళారు. అక్కడ స్నానం చేసి మళ్ళీ మస్జిదె నబవీకి తిరిగి వచ్చారు. మస్జిద్లోకి అడుగుపెట్టగానే ఇస్లాం స్వీకార వచనాలను పఠించారు.
ఆ సందర్భంగా హజ్రత్ సుమామా దైవప్రవక్త (సల్లం)ను కొనియాడుతూ అన్న మాటలివి.
“దైవప్రవక్తా! దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ద్వేషించేవాణ్ణి. కాని ఇప్పుడు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అభిమానపాత్రులు నాకు మీరేననిపిస్తున్నారు.”
“దైవసాక్షి! ఒకప్పుడు మీ నగరం పేరు వింటేనే నాకు మండిపోయేది. కాని ఈ రోజు నా దృష్టిలో మీ నగరం కన్నా ప్రియమైన పుణ్యక్షేత్రం మరొకటి లేదు. ఒకప్పుడు మీ ధర్మంపట్ల నాకు విపరీతమైన వైరభావం ఉండేది. కాని ఈ రోజు మీ ధర్మమే నాకు అత్యంత ప్రీతికరమైన ధర్మంగా మారిపోయింది”. సుమామా ఇంకా చెప్పుకుంటూ పోతున్నారు.
“దైవప్రవక్తా! నేను మా దేశం నుండి ఉమ్రా యాత్ర చేసే ఉద్దేశ్యంతో మక్కాకు బయలుదేరాను. మార్గమధ్యంలో మీ అనుచరులు నన్ను బంధించి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను. మరి ఉమ్రా చేయాలా వద్దా!” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆయన ఇస్లాం స్వీకరణను అభినందిస్తూ ఉమ్రా యాత్ర చేయటానికి అనుమతి నిచ్చారు.
హజ్రత్ సుమామా మక్కా చేరుకోగానే ఒకతను ఆయన్ని పట్టుకొని “నువ్వు సాబీ అయిపోయావా?” అని అడిగాడు. సుమామా అతనికి పుల్లవిరుపు సమాధానమిచ్చారు.
“లేదు, నేను దైవప్రవక్తే అయిన ముహమ్మద్‌ను విశ్వసించాను. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను. ఇక మీ మక్కావాసులు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ముహమ్మద్ (సల్లం) అనుమతి లేనిదే ఇక మీదట మీకు యమామా దేశం నుండి ఒక్క గోధుమ గింజయినా సరఫరా అవదు.”38 సుమామా సమాధానం విని ఆ వ్యక్తి కొయ్యబారిపోయాడు.
సుమామా తనదేశం వెళ్ళగానే మక్కాకు సరఫరా అయ్యే ధాన్యాన్ని నిలిపివేశారు. ధాన్యం సరఫరా ఆగిపోవడంతో మక్కావాసులు కలవరపడ్డారు. చివరికి దైవప్రవక్త (సల్లం)కు అప్పీలు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) సుమామాకు లేఖ వ్రాసి మక్కావాసులకు మునుపటిలాగే ధాన్యం సరఫరా చేస్తుండాలని ఆదేశించారు.39 మరి చూడబోతే మక్కా అవిశ్వాసులు దైవప్రవక్త (సల్లం)ను పట్టుకొని పచ్చి నెత్తురు తాగాలని ఎదురుచూస్తున్న రోజులవి. ఈ సంఘటన ద్వారా తన్ను తాను శిక్షార్హునిగా భావిస్తున్న ఓ హంతకునికి దైవప్రవక్త (సల్లం) క్షమాభిక్ష పెట్టడంలోని ఆంతర్యం ఏమిటో అర్థమవుతోంది! దైవప్రవక్త (సల్లం)లోని సదాచార సంపన్నతను చూసి ప్రజలు ఎంతగా ప్రభావితులయ్యే వారో అవగతమవుతోంది!! ఇస్లాం పట్ల, ముస్లింల నగరం పట్ల, దైవప్రవక్త పట్ల విపరీతమైన వైరభావం కలిగివున్న వ్యక్తి మూడ్రోజుల్లోనే సంతోషంగా ఇస్లాం స్వీకరించి ముస్లిం అయిపోయాడు. మక్కా అవిశ్వాసులు దైవప్రవక్త (సల్లం)ను వెలివేశారు. బద్ర్, ఉహుద్, ఖందఖ్, ఆ తరువాత కూడా అనేక యుద్ధాల్లో దైవప్రవక్త(స)ను, ముస్లింలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టటానికి విశ్వప్రయత్నాలు చేశారు. అలాంటి శత్రువుల విషయంలో కూడా దైవప్రవక్త (సల్లం) ఎంతో ఉదారంగా వ్యవహరించారు. వారికి ధాన్యం సరఫరాను నిలిపివేయటాన్ని గర్హించారు. ఈ సంఘటన ఆయన ఉత్తమ నైతికతకు, అసామాన్య ఔదార్యానికి ప్రబల నిదర్శనం.
ఫుట్నోట్లు
- 1ఫత్హుల్ బారీ ఏడవ సంపుటి 393వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 214, 215 పుటలు.
- 2ఫత్హుల్ బారీ ఏడో సంపుటి 393,394 పుటలు. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 216, 217 పుటలు.
- 3సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 4సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 5సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం.
- 6షిబ్లీ నూమానీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 422వ పుట.
- 7సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 220 నుండి 224 పుటలు
- 8షిబ్లీ నూమానీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 423 వ పుట.
- 9సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 10జాదుల్ మఆద్ మూడో సంపుటి 272వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 222వ పుట.
- 11తఫ్సీరె ఖుర్తుబీ 14వ సంపుటి 157వ పుట
- 12షిమాయిలె తిర్మిజీ
- 13సహీహ్ బుఖారీ యుద్ధాల ప్రకరణం
- 14సీరతున్నబీ మొదటి సంపుటి 425వ పుట
- 15బజ్జార్గారి కష్ఫుల్ అస్తార్ గ్రంథం మొదటి సంపుటి 332వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 223వ పుట.
- 16సీరత్ హుల్బియ్యా రెండో సంపుటి 636వ పుట
- 17ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 34వ పుట. సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 224, 225 పుటలు. బైహఖీగారి దలాయిలున్నుబువ్వా గ్రంథం మూడో సంపుటి 436 నుండి 439 పుటలు. సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 427, 428 పుటలు.
- 18సీరత్ హుల్బియ్యా రెండో సంపుటి 644వ పుట.
- 19దలాయిలున్నుబువ్వా మూడో సంపుటి 438వ పుట. సీరత్ హుల్బియ్యా రెండో సంపుటి 637వ పుట.
- 20సుననె నసాయి నమాజ్ ప్రకరణం
- 21సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 228వ పుట
- 22బైహఖీగారి దలాయిలున్నుబువ్వా గ్రంథం మూడో సంపుటి 448వ పుట
- 23సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 129వ పుట.
- 24సీరత్ ఇబ్నె హిషామ్ రెండో సంపుటి 232వ పుట.
- 25సహీహ్ బుఖారీ: వివరాలు సీరత్ ఇబ్నెహిషామ్ రెండో సంపుటి 226, 227 పుటలు, దలాయిలున్నుబువ్వా గ్రంథం మూడో సంపుటి 440, 441 పుటల్లో ఉన్నాయి.
- 26సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 27సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం
- 28ముస్నదె అహ్మద్ మూడో సంపుటి 344వ పుట. సుననె అబూదావూద్‌లోని శుచీశుభ్రతల ప్రకరణం.
- 29సీరతున్నబీ మొదటి సంపుటి 433వ పుట.
- 30సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం
- 31సీరతున్నబీ మొదటి సంపుటి 434 వ పుట. సీరత్ ఇబ్నెహిషామ్ సౌజన్యంతో
- 32సహీహ్ బుఖారీ యుద్ధాల ప్రకరణం.
- 33సహీహ్ బుఖారీ యుద్ధాల ప్రకరణం.
- 34సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
- 35షిబ్లీ నూమానీగారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 435వ పుట. తౌరాత్ గ్రంథ సౌజన్యంతో.
- 36సహీహ్ బుఖారీ, యుద్ధాల ప్రకరణం.
- 37సీరత్ ఇబ్నె హిషామ్ రెండవ సంపుటి 241వ పుట.
- 38సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం.
- 39బైహఖీ గారి దలాయిలున్నుబువ్వా గ్రంథం నాల్గో సంపుటి 80వ పుట.