మొదటి అధ్యాయం
శుభోదయం
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మన ప్రవక్త (ఆయనపై దేవుని శాంతి, కారుణ్యాలు వర్షించుగాక!) ఏనుగుల వారి సంఘటన జరిగిన సంవత్సరం1 వసంతకాలంలో రబీవుల్ అవ్వల్ మాసం తొమ్మిదో తేది2 సోమవారంనాడు అంటే క్రీ.శ. 571 ఏప్రిల్ 22వ తేదీన ఉషోదయం అయిన తరువాత సూర్యోదయానికి ముందు జన్మించారు. ఆయన(స) తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం.3 ఆయన(స) పుట్టకముందే ఆయన తండ్రి చనిపోయారు.4
ఆయన(స) తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ కూడా అనాథాశ్రమ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి. నలభై నాలుగు సంవత్సరాలకే నూరేళ్ళు నిండిపోయిన తన కుమారుడు అబ్దుల్లాహ్‌కు జ్ఞాపికగా బాలుడు జన్మించాడన్న శుభవార్త వినగానే ఆయన ఇంట్లోకి విచ్చేశారు. అప్పుడే పుట్టిన పసికందుని ఎత్తుకొని పవిత్ర కాబా గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి పిల్లవాడిని ఇంటికి తీసుకొనివచ్చారు.5 ఏడవరోజున ఖుర్బానీ చేసి ఖురైష్ తెగవారందరినీ విందుభోజనానికి ఆహ్వానించారు. భోజనాదులు ముగిశాక విందుకు వచ్చిన జనం పిల్లవాడికి ఏంపేరు పెట్టారని అడిగారు. “ముహమ్మద్” అని అబ్దుల్ ముత్తలిబ్ చెప్పారు. ఆ పేరు వినగానే జనమంతా ఆశ్చర్యపోతూ “వంశపరంపరలో ఉన్న పేర్లన్నింటినీ వదలి ఈ క్రొత్త పేరు పెట్టారేమిటి?” అని ప్రశ్నించారు. “ముహమ్మద్ అంటే ప్రశంసించదగినవాడు. నా మనుమడు లోకం ప్రశంసలు, మన్ననలు పొందుతాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు6 అబ్దుల్ ముత్తలిబ్.
పాల గడువు
అందరికన్నా ముందు ఆయన తల్లి ఆయన(స)కు పాలు పట్టింది. రెండు మూడు రోజుల తరువాత అబూలహబ్ దాసి అయిన ‘సౌబియ్యా’ ఆయనకు పాలు త్రాపించటం మొదలుపెట్టింది.7 అప్పటి ఆచారం ప్రకారం అరబ్బుదేశంలో నగరాల్లో నివసించే సర్దారులు, ఉన్నత వర్గాలవారు పాలుత్రాగే తమ పసిపిల్లలను చుట్టుప్రక్కల గ్రామాలకు పంపించేవారు. పిల్లలు పల్లె వాతావరణంలో పెరిగి స్వచ్ఛమైన అరబీ భాషను నేర్చుకుంటారనీ, స్వచ్ఛమైన అరబ్బు లక్షణాలను పుణికి పుచ్చుకుంటారన్న ఉద్దేశ్యంతో వారలా చేసేవారు. ఆయన(స) జన్మించిన కొంతకాలానికి హవాజిన్ తెగకు చెందిన కొంతమంది మహిళలు పాలుపట్టాల్సిన పసిపిల్లల్ని వెతుక్కుంటూ మక్కానగరానికి వచ్చారు. వారిలో హలీమా సాదియా ఆయా కూడా ఉన్నారు. కాకతాళీయంగా ఆమెకు ఏ పసిపిల్లవాడూ దొరకలేదు. ఆయన(స) తల్లి తన పిల్లవాడి ఆలనాపాలనా కోసం ఆమెను నియమించాలనుకున్నారు. కాని హలీమా సాదియా “తండ్రిలేని పిల్లవాడ్ని తీసుకున్నా ప్రయోజనమేముంటుంది?” అని ముందు కాస్త తటపటాయించారు. అయితే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటం ఎందుకులే అని తల్లి ఆమినా విజ్ఞప్తిని అన్యమనస్కంగానే అంగీకరించారు. ఆయన్ను తన ఇంటికి తీసుకెళ్ళారు. రెండు సంవత్సరాల తరువాత పిల్లవాడ్ని తిరిగి మక్కాకు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కాని అదే సమయంలో మక్కానగరంలో అంటువ్యాధి ప్రబలి వుండటం మూలంగా పిల్లవాడిని ఇంకొంత కాలం ఆమె దగ్గరే ఉంచుకోమని ఆయన (స) తల్లి చెప్పి పంపించారు. అంటువ్యాధి తగ్గిపోయిన తరువాత హలీమా పిల్లవాడిని తిరిగి మక్కాకు తీసుకువచ్చారు.8
ఆయన(స) తనకు పాలు తాపిన తల్లి హలీమా సాదియాను ఎంతగానో ప్రేమించేవారు. హలీమా సాదియా భర్త, అంటే ఆయన(స)కు పాలవరస తండ్రిపేరు హారిస్ బిన్ అబ్దుల్ ఉజ్జా. ఆయన(స) దైవప్రవక్త అయిన తరువాత హారిస్ ఒకసారి మక్కా వచ్చారు. ఆయన(స)ను కలుసుకొని “నువ్విచ్చే సందేశమేమిటి?” అని అడిగారు. దానికి సమాధానమిస్తూ ఆయన(స) “నేను చెప్పే మాటలు నిజమని మీకు రుజువు చేసి చూపిస్తాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది” అని అన్నారు. అది విన్నవెంటనే హారిస్ ఇస్లాం స్వీకరించారు.9
పినతండ్రి సంరక్షణలో
ఆరవ ఏట ఆయన(స) తల్లి ఆయన్ను మదీనా తీసుకొని వెళ్ళారు. ఆయన(స) తాతగారి అమ్మమ్మ తరపు బంధువులు మదీనాలోని నజ్జార్ తెగకు చెందినవారు. ఆయన(స) తల్లి కొంతకాలం ఆ బంధువుల దగ్గరే ఉన్నారు. ఈ ప్రయాణంలో ఆయన(స) దాది అయిన ఉమ్మె ఐమన్ కూడా వారికి తోడుగా వెళ్ళింది. మదీనాలో ఒక నెలరోజులపాటు ఉండి వారు ముగ్గురూ మక్కాకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ‘అబ్వా’ ప్రాంతానికొచ్చేసరికి ఆయన(స) తల్లి మరణించారు. ఆమె ఖనన సంస్కారాలు కూడా అక్కడే జరిగాయి. ఉమ్మె ఐమన్ ఆయన్ని తన వెంట మక్కా తీసుకొని వచ్చింది.10
తల్లి మరణించిన తరువాత తాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన్ని(స) తన సంరక్షణలోకి తీసుకున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ మనుమడిని ఎప్పుడూ తనవెంటే ఉంచుకునేవారు.11 కొంతకాలానికి తన ఎనభై రెండవ యేట అబ్దుల్ ముత్తలిబ్ కూడా మరణించారు. అప్పటికి ఆయన(స) వయస్సు ఎనిమిదేళ్ళు.12 జనం అబ్దుల్ ముత్తలిబ్ శవాన్ని మోసుకెళ్తుంటే తాతమీద ప్రేమకొద్దీ ఆయన(స) ఏడ్వటం మొదలుపెట్టారు. అబ్దుల్ ముత్తలిబ్ తాను మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన(స) సంరక్షణా బాధ్యతలు తన కొడుకు అబూతాలిబ్‌కు అప్పగించారు. అబూతాలిబ్ ఆయన్ని ఎంతగానో ప్రేమించేవారు. తన కన్నకొడుకులకన్నా బాగా చూసుకునేవారు. పడుకున్నప్పుడు ఆయన్ని తనప్రక్కనే పడుకోబెట్టుకునేవారు. ఎక్కడికన్నా బయలుదేరితే ఆయన్ని కూడా తన వెంట తీసుకొని వెళ్ళేవారు.13
బహుశా పది సంవత్సరాల వయసప్పుడు ఆయన(స) కాపరిగా పనిచేశారు.14 తాను దైవప్రవక్త అయిన తరువాత కూడా ఆయన(స) ఆ మధురమైన జ్ఞాపకాలను నెమరు వేసుకునేవారు. అప్పుడప్పుడూ తన సహచరుల ముందు దాని గురించి ప్రస్తావించేవారు కూడా. ఒకసారి ఆయన(స) తన సహచరులతో కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ ఆయన(స) సహచరులు రేగిపండ్లు కోసుకొని తినసాగారు. అది చూసి ఆయన(స), “బాగా నల్లగా ఉండే పండ్లు చాలా మధురంగా ఉంటాయి. నా బాల్యంలో నేను ఇక్కడ మేకలు కాసినప్పుడు అలాంటి పండ్లు తిని ఉన్నాను” అని అన్నారు.15
అబూ తాలిబ్ వ్యాపారం చేసేవారు. ఆ కాలంలో ఖురైష్ తెగకు చెందిన వర్తకులు సంవత్సరానికొకసారి వ్యాపార నిమిత్తం సిరియా దేశానికి వెళ్ళేవారు. అంచేత అబూతాలిబ్ కూడా ప్రతియేడు మాదిరిగానే ఆ యేడు కూడా సిరియాకు బయలుదేరారు. అప్పటికి ఆయన(స)కు పన్నెండేళ్ళు ఉంటాయేమో! ప్రయాణం కష్టంగా ఉంటుందనో లేక మరే కారణం వల్లనో ఆయన(స)ను తన వెంట తీసుకెళ్ళటానికి అబూతాలిబ్ యిష్టపడలేదు. కాని ఆయన(స)కు బాబాయి అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకపోయేవారు. అబూతాలిబ్ బయలుదేరుతుంటే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని వాటేసుకున్నారు. అబూతాలిబ్ ఆ లేత మనసును కష్టపెట్టడం యిష్టం లేక ప్రయాణంలో ఆయన్ని కూడా తన వెంట తీసుకొని వెళ్ళారు.16
సంక్షేమ కార్యక్రమాల్లో ఆసక్తి
ఇస్లాంకు పూర్వం అజ్ఞానకాలంలో అరబ్బుల్లో ఎడతెగకుండా యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. అటువంటి యుద్ధాల్లో అత్యంత ప్రసిద్ధమైనది, భయంకరమైనది ఫిజ్జార్ యుద్ధం. ఇది ఖురైష్కు – ఖైస్ తెగవారికి మధ్య జరిగింది. ఈ యుద్ధానికి ఖురైష్ తెగ నాయకత్వం వహించటం వల్ల ఆయన(స) కూడా అందులో పాల్గొనాల్సి వచ్చింది. కాని ఆయన(స) ఎన్నడూ ఎవరిపైనా చెయ్యెత్తలేదు.17
ఈ యుద్ధాలు తరం తరం… నిరంతరం కొనసాగటం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యేవి. హత్యలు, వధింపులు వారసత్వనీతిగా పరిగణించబడేవి. కక్షలు కార్పణ్యాలు వారి జీవితాల్లో అంతర్లీనం అయిపోయి ఉండేవి. తమ పెద్దల పగ, ప్రతీకారాలను తీర్చుకోవటాన్ని ప్రజలు తమ విద్యుక్తధర్మంగా భావించేవారు. ఈ దారుణ మారణ హోమాలకు కొన్ని హృదయాలు చలించిపోయాయి. వాటిలో సంస్కరణా భావం జనించింది. అప్పుడు దైవప్రవక్త(స) బాబాయి, తన వంశానికి పెద్ద దిక్కు అయిన జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఒక ప్రతిపాదన చేశారు. దాని ప్రకారం హాషిం, జుహ్రా, తైమ్ వంశాలకు చెందినవారంతా అబ్దుల్లాహ్ బిన్ జద్ఆన్ ఇంట్లో సమావేశమై తమలోని ప్రతి ఒక్కరూ బాధితుడికి సహాయం చెయ్యాలనీ, మక్కా నగరంలో దౌర్జన్యకారుల ఆటకట్టించాలని ప్రతినబూనారు.18 ఈ సమావేశంలో ఆయన(స) కూడా పాల్గొన్నారు. తాను దైవప్రవక్త అయిన తరువాత కూడా తరచూ దాని గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. “ఎవరైనా నాకు ఆ ప్రతిజ్ఞకు బదులుగా ఎర్ర ఒంటెలను ఇచ్చినాసరే నేను దానిని ఉపసంహరించుకొని ఉండేవాణ్ణి కాను. ఈ రోజు కూడా ఎవరైనా అలాంటి ఒప్పందాల కోసం పిలిస్తే అందులో పాల్గొనటానికి నేను సిద్ధంగా ఉంటాను”19 అని చెప్పేవారు.
ఆయన(స) తన చిన్నతనంలోనే అబూతాలిబ్తో కలసి కొన్ని వ్యాపారసంబంధమైన ప్రయాణాలు చేసి అన్ని విషయాల్లో అనుభవాన్ని గడించారు. ఆయన నిజాయితీ, సద్వ్యవహారం గురించిన వార్తలు నలువైపులా వ్యాపించాయి. ఆయన(స) సహచరులైన అబ్దుల్లాహ్ బిన్ అబుల్ హమ్సా(రజి) ఇలా అంటున్నారు:
“ఆయన(స) దైవప్రవక్త కాకమునుపు ఒకసారి మా ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించిన ఒక వ్యవహారం కుదిరింది. వ్యవహారం పూర్తికాకముందే నేనాయనతో ‘మీరిక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాననీ’ వాగ్దానం చేసి వెళ్ళిపోయాను. కాని మూడురోజుల దాకా నాకు ఆ వాగ్దానం సంగతి గుర్తుకు రాలేదు. మూడోరోజు వెళ్ళి చూస్తే ఆయన(స) అక్కడే నా కోసం నిరీక్షిస్తున్నారు. కాని నేను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయినందుకు ఆయన(స) కొంచెమయినా నాపై కినుక వహించలేదు.” “మీరు నన్ను ఇబ్బందిలో పడేశారండీ, నేను ఈ ప్రదేశంలోనే మీకోసం మూడు రోజుల నుండి ఎదురుచూస్తున్నాను” అని మాత్రం అన్నారు.20
హజ్రత్ ఖదీజా (రజి అన్హా)తో వివాహం
ఖదీజా అనే ఆమె మక్కా నగరంలో ఓ గౌరవప్రద కుటుంబానికి చెందిన వితంతు మహిళ. గొప్ప ధనికురాలు. తన ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ఇతరుల చేత వ్యాపారం చేయించేది. ఆమె ఆయన(స) మంచితనాన్ని గురించి విని, ఆయన సత్యసంధతను, నిజాయితీని, వ్యవహారశైలిని గురించి ప్రజల్ని అడిగి తెలుసుకుంది. ఆ తరువాత తన పెట్టుబడితో వ్యాపారం చేయమని తనే స్వయంగా ఆయన్ని కోరింది. ఆయన(స) ఆమె పెట్టుబడితో వ్యాపారం చేశారు. అందులో విపరీతమైన లాభం వచ్చింది. ఈ వ్యాపార ప్రయాణంలో ఖదీజాగారి బానిస మైసరా కూడా ఆయన(స)కు తోడుగా వెళ్ళాడు. ప్రయాణం నుండి తిరిగొచ్చిన తరువాత అతను ఆయన(స) మంచితనాన్ని గురించి, ఆయన(స) గుణగణాల గురించి ఖదీజాకు వివరించాడు. ఆయన(స) గుణగణాలకు ప్రభావితురాలై ఖదీజా (రజి అన్హా) తనే స్వయంగా వివాహ సందేశం పంపింది. సంప్రతింపుల తరువాత ఆయన(స) వివాహం ఖదీజాతో జరిగిపోయింది. విశేషమేమిటంటే ఆయన(స) కంటే ముందు ఆమె గొప్ప గొప్ప సర్దారుల వివాహ సందేశాలను త్రోసిపుచ్చారు.21
కాబాగృహ పునర్నిర్మాణ వివాదం సద్దుమణిగేందుకు ఆయన చేసిన కృషి
ఆయన(స) మంచితనానికి ప్రభావితులైన ప్రజలందరూ ఆయన్ని పేరుపెట్టి పిలిచేబదులు ‘సాదిఖ్’ (సత్యసంధుడు), ‘అమీన్’ (నిజాయితీపరుడు) అని పిలిచేవారు. అప్పటికి ఆయన(స) వయస్సు పాతికేళ్ళు. ఆ కాలంలో ఒక వరదతాకిడికి కాబా గృహ గోడలు పడిపోయాయి. అంచేత ఖురైషులు దాని పునర్నిర్మాణానికి ఉపక్రమించారు.22 గృహనిర్మాణం పూర్తయ్యేవరకు అందరూ కలిసి పనిచేశారు. కాని ‘హజ్రె అస్వద్’ (నల్లరాయి)ని ప్రతిష్ఠించే విషయానికి వచ్చేసరికి పెద్ద గొడవే జరిగింది. వారిలోని ప్రతి తెగా ఆ కీర్తి తమకే దక్కాలని పట్టుబట్టింది. మాటా మాటా పెరిగింది. పరస్పరం కత్తులు దూసుకునే దాకా వెళ్ళింది. ఆ కాలంలో అరబ్బు దేశంలో ఎవరయినా ప్రాణార్పణం చేస్తానని ప్రతినబూనితే దానికి సూచనగా ఒక పాత్రనిండా రక్తం తీసి దాంట్లో తన వ్రేళ్ళు ముంచేవాడు. ఈ వివాదం జరిగినప్పుడు కూడా కొంతమంది ఆ విధంగా ప్రతినబూని రక్తతర్పణం చేశారు. నాలుగురోజుల వరకు ఈ గొడవ భయంకరంగా కొనసాగింది. ఐదోరోజు ఖురైష్ తెగకు చెందిన వారిలో అందరికన్నా వయోవృద్ధుడు అబూ ఉమయ్యా బిన్ ముగీరా ఒక సలహా ఇచ్చాడు. రేపు ఉదయం అందరికన్నా ముందు కాబా గృహ ప్రాంగణంలోకి వచ్చిన వ్యక్తిని మధ్యవర్తిగా నిర్ణయించుకుందామన్నాడు. అందరూ అతని సలహాను అంగీకరించారు. అదృష్టవశాత్తూ మరునాడు ఉదయం అందరికన్నా ముందు ఆయన(స) కాబా గృహానికి వచ్చారు. ఆయన్ని చూడగానే ప్రజలంతా “‘అమీన్’ (నిజాయితీపరుడు) వచ్చాడు. అతనిచ్చే తీర్పుని మేము సంతోషంగా ఒప్పుకుంటాం” అని నినదించటం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ఆయన(స) తన బుద్ధి కౌశలంతో, విషయావగాహనతో ఒక ఉపాయం చెప్పారు. ఉభయతారకమైన దానిపట్ల అందరూ తమ హర్షం వెలిబుచ్చారు. ఆయన(స) నేలపై ఒక దుప్పటిని పరచి తన చేతులతోనే హజ్రె అస్వద్‌ను దానిపై ఉంచారు. ఆ తరువాత వివిధ తెగల నాయకులందరినీ పిలిచి ఆ దుప్పటిని పట్టుకొని పైకెత్తమని ఆజ్ఞాపించారు. అలా అందరూ కలిసి దుప్పటి సాయంతో రాయిని పైకెత్తగానే ఆయన(స) తన స్వహస్తాలతో గోడమూలన, కాబా ప్రదక్షిణ మొదలెట్టే చోట దాన్ని ప్రతిష్ఠించారు.23 ఈ చిన్న ఉపాయంతో హజ్రె అస్వద్ వివాదం సద్దుమణిగింది. లేకపోతే ఈ మామూలు వివాదమే మున్ముందు భీకరపోరాటానికి తెరతీసేది. ఆ కాలంలో అరబ్బులు పశువులకు నీళ్ళు త్రాపించటం, గుర్రాలను పరుగెత్తించటం, కవితలు అల్లి ఒకరినొకరు తూలనాడటం లాంటి చిన్న చిన్న విషయాలపై ఒకసారి గొడవపడి యుద్ధానికి దిగారంటే ఇరవై, ముప్పై సంవత్సరాలైనా ఆ యుద్ధం అంతమయ్యేది కాదు.
దైవిక శిక్షణ
ఆయన(స) తన బాల్యంలోగాని, యుక్తవయస్సులోగాని ఎన్నడూ బహుదైవారాధన ఆచారాలను పాటించలేదు. దైవప్రవక్త కాకమునుపు కూడా నిత్యం ఆయన(స) వాటికి దూరంగానే ఉన్నారు. ఒకసారి ఖురైషులు విగ్రహాలకు నైవేద్యంగా పెట్టిన ఆహారం తినమని ఆయనకు తెచ్చిచ్చారు. అందులో ఒక విగ్రహం పేరుమీద బలిఇచ్చిన జంతువు మాంసం ఉంది. ఆయన(స) దాన్ని తినటానికి నిరాకరించారు.24 దైవప్రవక్త కాక ముందు నుంచే ఆయన(స) విగ్రహారాధనను ఖండించేవారు. తనకు బాగా తెలిసిన మిత్రులను దాన్నుండి వారించేవారు కూడా.25
దైవప్రవక్త(స) పుట్టిన కాలంలో మక్కా నగరం బహుదైవారాధనకు నిలయంగా విరాజిల్లుతోంది. ఒక్క పవిత్ర కాబాగృహంలోనే మూడొందల అరవై విగ్రహాలుండేవి. ఆ విగ్రహాలయ సంచాలకులు, సంరక్షకులు దైవప్రవక్త(స) కుటుంబీకులే. ఆ విధంగా వారి కుటుంబం మక్కాలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అయినప్పటికీ ఆయన(స) ఎన్నడూ ఏ విగ్రహం ముందూ తలవంచలేదు. ఇతర అజ్ఞాన కాలపు ఆచారాలలోనూ పాల్గొనలేదు. ఖురైషులు ప్రతి విషయంలోనూ తాము ఇతరులకన్నా ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండాలని కోరుకునేవారు. స్వయంగా ఎన్నో ఆచారాలను కల్పించుకున్నారు. హజ్‌యాత్ర కాలంలో ఖురైషులు అరఫాత్ మైదానానికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పేవారు. బయటినుంచి యాత్రకోసం వచ్చేవారు ఖురైషుల వస్త్రధారణను అనుకరించాలి. లేదా నగ్నంగానే కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ఈ కారణంగానే ఆ కాలంలో నగ్నంగా కాబా ప్రదక్షిణాలు చేసే ఆచారం ఏర్పడింది. అయితే ఆయన(స) ఈ విషయాల్లో ఎన్నడూ తన వంశం వారితో సహకరించలేదు.26
ఫుట్నోట్లు
- 1సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటిలో 171వ పుట. ఏనుగులవారి సంఘటన జరిగిన సంవత్సరానికి సంబంధించిన ఉల్లేఖనాన్ని ఇమామ్ తిర్మిజీ మహిమోన్నతల ప్రకరణంలో ఉల్లేఖించి దాని ప్రామాణికతను బలపరిచారు.
- 2ఇబ్నె ఇస్హాఖ్ రబీవుల్ అవ్వల్ పన్నెండో తేది అని ఉల్లేఖించారు. ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 171వ పుటలో సోమవారం నాడు జన్మించారని ప్రామాణికమైన ఉల్లేఖనాలు తెలుపుతున్నాయి. సహీహ్ ముస్లిం గ్రంథంలోని ఉపవాసాల ప్రకరణంలో ‘ఇస్తిహ్బాబు సియామి సలాసతి అయ్యామిన్ మిన్కుల్లి షహ్రిన్’ అనే అధ్యాయం.
- 3ఖాజీ సులైమాన్ మన్సూర్పూరీ (రహ్మలై)గారి ‘రహ్మతుల్లిల్ ఆలమీన్’ అనే గ్రంథం ఆధారంగా.
- 4ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్ ఐదవ సంపుటిలో 317వ పుట. ముస్తద్రక్ హాకిం రెండు, ఐదు, ఆరు సంపుటాలు. హాకిం ఈ ఉల్లేఖనాన్ని ఇమామ్ ముస్లిం నియమాలననుసరించి వెలికితీశారు. ఇమామ్ జహబీ (రహ్మలై) కూడా దాన్ని సమర్థించారు.
- 5సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 160వ పుట. తబఖాత్ ఇబ్నె సాద్ మొదటి సంపుటి 103వ పుట. తహ్జీబ్ తారీఖె దమిష్క్ మొదటి సంపుటి 284వ పుట.
- 6తహ్జీబ్ తారీఖె దమిష్క్ మొదటి సంపుటి 282వ పుట. అల్బిదాయా వన్నిహాయా రెండవ సంపుటిలో 264వ పుట.
- 7సహీహ్ బుఖారీలో నికాహ్ ప్రకరణంలో “లాయతజవ్వజు అక్సర మిన్ అర్బయిన్” తరువాతి అధ్యాయం.
- 8సీరతున్నబీ మొదటి సంపుటిలో 172-173 పుటలు. హలీమా సాదియా ఆయన(స)కు పాలు త్రాపించిన సంఘటన అందరికీ తెలిసిందే. ఎంతోమంది చరిత్రకారులు ఈ విషయాన్ని గురించి వివరించారు. అంతేగాకుండా హదీసువేత్తల్లో ఇమామ్ హాకిమ్ తన గ్రంథమైన ముస్తద్రక్ రెండో సంపుటి 216వ పుటలో, ఇమామ్ అహ్మద్ తన గ్రంథమైన ముస్నద్ నాల్గో సంపుటి 184వ పుటలో, దారిమి తన సునన్ గ్రంథం మొదటి సంపుటి 8వ పుటలో, తబ్రానీ తన ‘మోజమ్’లో, ఇబ్నెహిబ్బాన్ తన ‘మవారిదుజ్జమ్ఆన్’ గ్రంథంలో హలీమా సాదియా పాలు త్రాపించిన సంఘటన గురించి ప్రస్తావించారు. బాల్యంలో బనూసాద్ తెగలో ఉంటున్నప్పుడు ఆయన(స) ఉరం చీల్చబడిందన్న సంఘటనను ఇమామ్ ముస్లిం (రహ్మలై) తన సహీహ్ గ్రంథంలో పేర్కొన్నారు. విశ్వాసప్రకరణంలో అల్ ఇస్రా బి రసూలిల్లాహ్ అనే అధ్యాయం.
- 9హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ గ్రంథం అల్ఇసాబా మొదటి సంపుటి 283వ పుట.
- 10సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 155వ పుట. తబఖాత్ ఇబ్నెసాద్ మొదటి సంపుటి 116వ పుట. బైహఖీ గ్రంథం దలాయిలున్నుబువ్వా మొదటి సంపుటి 188వ పుట.
- 11ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్ ఐదవ సంపుటి 318వ పుట.
- 12బైహఖీ గ్రంథం దలాయిలున్నుబువ్వా రెండో సంపుటి 22వ పుట. జహబీ గారి అస్సీరతున్నబవియ్యాలోని 25వ పుట.
- 13సీరతున్నబీ మొదటి సంపుటిలో 177వ పుట.
- 14సహీహ్ బుఖారీలోని బాడుగల ప్రకరణం, రాయుల్ గనమి అలా ఖరారీత్ అధ్యాయం.
- 15తబఖాత్ ఇబ్నెసాద్ మొదటి సంపుటిలో 80వ పుట.
- 16సుననె తిర్మిజీలోని మహిమోన్నతల ప్రకరణం ‘మాజాఅ ఫీ బద్యిన్నబువ్వహ్’ అనే అధ్యాయం.
- 17సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 195వ పుట. అర్రౌజుల్ అనిఫ్ సుహైలీ మొదటి సంపుటి 120వ పుట.
- 18తబఖాత్ ఇబ్నెసాద్ మొదటి సంపుటి 82వ పుట.
- 19ముస్తద్రక్ హాకిమ్ రెండవ సంపుటి 219 మరియు 220 పుటలు. ఇమామ్ జహబీ ఈ ఉల్లేఖనాన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఇమామ్ బుఖారీ అల్ అదబుల్ ముఫ్రద్లో, బైహఖీ తన ‘సునన్’ గ్రంథంలో దీనిని పొందుపరిచారు.
- 20సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణంలో వాగ్దానాల అధ్యాయం.
- 21ఖదీజా (రజి అన్హా) పెట్టుబడితో వ్యాపారం చేయడానికి ఆయన(స) సిరియా వెళ్ళారని హాకిమ్ తన గ్రంథం ‘ముస్తద్రక్’లో ప్రస్తావించారు (మూడవ సంపుటి 182వ పుట). ఇమామ్ జహబీ దీనిని సమర్థించారు. హాకిమ్ వివాహ సంఘటనను గురించి కూడా ప్రస్తావించారు. జుర్ఖానీ ఈ విషయాలన్నింటినీ ఎంతో వివరంగా చర్చించారు. సహీహ్ బుఖారీలో దైవప్రవక్త(స) స్వయంగా ఆమె సుగుణాలను కొనియాడిన ప్రస్తావన ఉంది.
- 22ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్ ఐదవ సంపుటి 102వ పుట. ఇమామ్ జహబీ ఈ ఆధారాన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.
- 23ముస్నదె అహ్మద్ మూడవ సంపుటిలో 425వ పుట. మొదటి సంపుటిలో 458వ పుట. ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటిలో 458వ పుట.
- 24సహీహ్ బుఖారీలో ఇలాంటివి పలు సంఘటనలు ప్రస్తావించబడి ఉన్నాయి. సహీహ్ బుఖారీలోని మహిమోన్నతల ప్రకరణం.
- 25ముస్తద్రక్ హాకిం మూడవ సంపుటి 216వ పుట. మోజమ్ కబీర్ తబ్రానీ ఐదవ సంపుటిలో 88వ పుట.
- 26సహీహ్ బుఖారీ.