మూడవ అధ్యాయం

హిజ్రత్‌కు అనుమతి

మానవ మహోపకారి (స) · మౌలానా సయ్యిద్ అబుల్ హసన్ అలీ నద్వి

ఖురైషుల నిరంతర దౌర్జన్యాల మూలంగా మక్కాలోని ముస్లింలకు బ్రతుకు దుర్భరమైపోయింది. అంచేత రెండవ ఉఖబా ఒప్పందం జరిగిన తరువాత దైవప్రవక్త(సల్లం) బాధిత ముస్లింలకు యస్రిబ్ (నేటి మదీనా) నగరానికి వలస వెళ్ళేందుకు అనుమతినిచ్చారు. విశ్వాసులకు తమ ఇళ్ళను, ఆత్మీయుల్ని, బంధుమిత్రుల్ని, భార్యాపిల్లల్ని, అన్నదమ్ముల్ని వదలి వెళ్ళాల్సి వస్తున్నందుకు కొంచెమైనా బాధ అనిపించలేదు. పైగా యస్రిబ్ వెళితే పూర్తి స్వేచ్ఛతో ఏకేశ్వరుణ్ని ఆరాధించవచ్చనే సంతోషంతో వారి ముఖాలు ప్రకాశించాయి.1

ముస్లింల కష్టాలు అంతటితో ఆగలేదు. మక్కావదలి వెళ్లాలనుకున్న వారికి ఖురైషుల తరపు నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

హజ్రత్ సుహైబ్ రూమి (రజి) మక్కానుండి వలస వెళ్ళాలని బయలుదేరినప్పుడు అవిశ్వాసులు ఆయన్ని చుట్టుముట్టి, “సుహైబ్! నువ్వు మక్కాకు వచ్చినప్పుడు కటిక దరిద్రుడివి. ఇక్కడికి వచ్చిన తరువాత నువ్వు లక్షల ఆస్తి సంపాదించావు. ఈ రోజు ఇక్కడి నుండి వెళ్తూ ఈ సంపదనంతా మూటగట్టుకొని వెళ్దామనుకుంటున్నావా? అలా ఎన్నిటికీ కుదరదు” అన్నారు.

“అలాగయితే నా సంపద మొత్తం మీకే ఇచ్చేస్తాను. మరి నన్ను ఇక్కడినుండి వెళ్ళిపోనిస్తారా?” అని అడిగారు సుహైబ్ రూమి (రజి).

ఖురైషులు అందుకు ఒప్పుకున్నారు. సుహైబ్ (రజి) తన దగ్గరున్న ధనం మొత్తం ఖురైషులకు ఇచ్చి యస్రిబ్‌కు వెళ్ళిపోయారు. దైవప్రవక్త (సల్లం) ఈ సంగతి విన్నప్పుడు ‘సుహైబ్ తాను చేసిన బేరంలో లాభాన్ని గడించాడు’ అని వ్యాఖ్యానించారు.2

ఉమ్మె సలమా (రజి అన్‌హా) కథనం: నేనూ, నా భర్త అబూసలమా యస్రిబ్‌కు వలస వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. నేను మా చంటిపిల్లోడ్ని ఒళ్ళో పెట్టుకొని ఒంటెపై కూర్చున్నాను. మేము బయలుదేరుతుండగా బనూ ముగీరా తెగవారు అడ్డొచ్చారు. వాళ్ళు అబూసలమాను చుట్టుముట్టి, “నువ్వెళ్ళు, కాని మా అమ్మాయిని మాత్రం నీవెంట పంపించం” అన్నారు. అంతలో అబ్దుల్ అసద్ తెగవాళ్ళు కూడా అక్కడికి చేరుకొని, “కావాలంటే నువ్వెళ్ళిపో. కాని పిల్లవాడ్ని మాత్రం తీసుకొని వెళ్ళనివ్వం. అతను మా తెగ పిల్లవాడు” అన్నారు.

వాళ్ళందరూ కలిసి అబూసలమా చేతిలోనుండి ఒంటెపగ్గాలు లాక్కొని ఒంటెను కూర్చోబెట్టారు. అబ్దుల్ అసద్ తెగవాళ్ళు తల్లి ఒడిలోనున్న పిల్లవాడ్ని లాక్కొని వెళ్ళిపోయారు. ముగీరా తెగవాళ్ళు ఉమ్మె సలమాను బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. కాని ధర్మం కోసం వలసవెళ్ళటం విధిగా భావించిన అబూసలమా మాత్రం భార్యను, కన్న పిల్లవాడ్ని వదలిపెట్టి తానొక్కరే యస్రిబ్ దారిన పడ్డారు. ఉమ్మెసలమా సాయంత్రం పూట భర్త, పిల్లవాడు తన నుండి విడిపోయిన చోటుకి వెళ్ళి గంటల తరబడి ఏడ్చేవారు. ఆమె ఒక సంవత్సరం దాకా ఇలాగే ఏడుపు, పెడబొబ్బల్లోనే గడిపారు. చివరికి ఆమె బాబాయి కుమారుడు ఆమెపై జాలిపడి, ఇరుతెగలవారికీ నచ్చజెప్పి, వాళ్ళనుండి నానామాటలు భరించి, ఎలాగో ఆమెకు తన భర్త దగ్గరికి వెళ్ళటానికి అనుమతి ఇప్పించారు. అబ్దుల్ అసద్ తెగవాళ్ళు కూడా ఆమెకు పిల్లవాడ్ని తిరిగి ఇచ్చేశారు. అప్పుడు ఉమ్మె సలమా (రజి అన్‌హా) ఒంటరిగా ఒంటెపై ప్రయాణించి మదీనాకు వెళ్ళిపోయారు.

ఇలాంటి కష్టాలు ఒక్క అబూసలమా కుటుంబానికే కాదు, దాదాపు ముస్లింలందరికీ ఎదురయ్యాయి.3

హజ్రత్ ఉమర్ ఫారూఖ్(రజి) కథనం ప్రకారం ఆయన మదీనాకు బయలుదేరినప్పుడు అయ్యాష్ బిన్ రబీయా, హిషామ్‌లు ఇద్దరూ కూడా ఆయన వెంట మదీనాకు వలస వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ముగ్గురూ కలిసి ఒకేచోటునుండి బయలుదేరుదామని కూడబలుక్కున్నారు. అయ్యాష్ కూడబలుక్కున్న చోటుకి చేరుకోగలిగారు కాని హిషామ్ మాత్రం అవిశ్వాసుల చేతుల్లో చిక్కిపోయారు. మక్కావారు ఆయన్ని బంధించారు. మరోవైపు అయ్యాష్ మదీనాకు చేరుకున్నారు. ఆయన వెనుక అబూజహల్ కూడా తన సోదరుడు హారిస్‌తో పాటు మదీనా చేరుకున్నాడు. అయ్యాష్ అతని బాబాయి కుమారుడు. ముగ్గురూ ఒకే తల్లిబిడ్డలు. అబూజహల్, హారిస్‌లు అయ్యాష్‌తో, “సోదరా! నువ్వు వెళ్ళిపోయిన దగ్గర్నుంచి అమ్మ బెంగతో మంచం పట్టింది. తిరిగి నీ ముఖం చూడందే తలదువ్వుకోనని, నీడలో కూడా కూర్చోనని ఒట్టేసుకుంది. అందుకని అమ్మకోసమైనా ఇంటికి వెళ్ళిపోదాం పద” అంటూ మాయ మాటలు చెప్పసాగారు.

అప్పుడు ఉమర్(రజి), “అయ్యాష్! నాకు వీళ్ళు చెప్పేవన్నీ మాయమాటల్లా అనిపిస్తున్నాయి. మీ అమ్మ తలలో పేలు పడితే ఆమె తల దువ్వుకుంటుంది. మక్కా ఎండ చురక తగిలితే తనే స్వయంగా నీడలోకి వచ్చి కూర్చుంటుంది. కాని ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళకపోవటమే మంచిది” అన్నారు.

దానికి అయ్యాష్, “ఫర్వాలేదు, నేనెళ్ళి అమ్మ ప్రమాణం నెరవేర్చి వెంటనే తిరిగొచ్చేస్తాను” అన్నారు.

“సరే, నువ్వు వెళ్ళాలనే నిర్ణయించుకుంటే నా ఈ ఆడ ఒంటె ఎక్కి వెళ్ళు. ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. దారిలో నువ్వు వీళ్ళ నుండి ఏ మాత్రం కుట్రను శంకించినా ఈ ఆడ ఒంటె ద్వారా నువ్వు వారినుండి సులువుగా తప్పించుకొనిరావచ్చు” అని చెప్పారు హజ్రత్ ఉమర్ (రజి).

అయ్యాష్ ఉమర్ ఇచ్చిన ఆడ ఒంటెపై బయలు దేరారు. ఆయన వెంట అబూజహల్, హారిస్‌లు కూడా బయలు దేరారు. మక్కా సమీపానికి వచ్చిన తరువాత అబూజహల్, “సోదరా! మా ఒంటె ప్రయాణంలో బాగా అలసిపోయింది. మా ఒంటెకు ఆయాసం తగ్గేదాకా నేను నీ ఒంటెపై కూర్చోవచ్చా” అని కోరాడు. అయ్యాష్ సరేనని చెప్పి తన ఒంటెను కూర్చోబెట్టారు. అప్పటివరకూ అదనుకోసం ఎదురుచూస్తున్న అన్నదమ్ములిద్దరూ ఆయన ఒంటెను కూర్చోబెట్టగానే ఆయన్ని ఒడిసి పట్టుకున్నారు. పెడరెక్కలు విరిచి మక్కాకు తీసుకొని వచ్చారు. మూర్ఖుల్ని, వెర్రివాళ్ళని ఇలాగే పట్టుకోవాలి అంటూ ఆ ఇరువురు అన్నదమ్ములు ప్రజల ముందు గొప్పలు చెప్పుకున్నారు. మక్కా అవిశ్వాసులు హిషామ్ బిన్ ఆస్‌తోపాటు అయ్యాష్‌ను కూడా బంధించారు. దైవప్రవక్త (సల్లం) మదీనాకు వలసవెళ్ళిన చాలాకాలం తరువాత ఆయన(స) కోరిక మేరకు వలీద్ బిన్ ముగీరా మక్కా వెళ్ళి ఓ రోజు రాత్రి వారిద్దరినీ చెరసాల నుండి విడిపించుకొని వచ్చారు.4

దైవప్రవక్త (సల్లం) మదీనాకు హిజ్రత్ చేసిన సంఘటన

ముస్లింలు మదీనాలో క్రమక్రమంగా నిలదొక్కుకో సాగారు. అక్కడ ఇస్లాం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మక్కా అవిశ్వాసులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంచేత వాళ్ళు దారున్నద్వా (సమాలోచనలు జరుపుకునే గృహం)లో ఓ సార్వత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి అన్ని తెగల నాయకులు హాజరయ్యారు. పలువురు పలు అభిప్రాయాలు వెల్లడించారు. “ముహమ్మద్ కాళ్ళూ చేతులకు బేడీలు వేసి అతన్ని కొట్లో పడేద్దాం” అని ఒకడు అన్నాడు. “అతన్ని మన సంఘం నుండి బహిష్కరిద్దాం. తనే దారికొస్తాడు” అని ఇంకొకడు సలహా ఇచ్చాడు. ఆఖరికి అబూజహల్ మాట్లాడుతూ, “అలాకాదు, మన తెగల్లో ఒక్కో తెగ నుండి కనీసం ఒక్కో వ్యక్తి ముందుకు రావాలి. ఆ తరువాత అందరూ కలిసి ఒక్కసారిగా ఖడ్గాలతో దాడిచేసి ముహమ్మద్‌ను మట్టుబెట్టాలి. అప్పుడు అతణ్ణి అన్ని తెగలవారూ కలిసి చంపినట్టవుతుంది. హాషిం తెగవారు ఒంటరిగా మనందరితో పోరాడలేక ప్రతీకార చర్యల్ని మానుకుంటారు” అని సూచించాడు. ఈ ఆఖరి సలహా పట్ల అందరూ తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దైవప్రవక్త (సల్లం) ఇంటిని ముట్టడించారు. అరబ్బులు స్త్రీలు ఉండే ఇళ్ళల్లోకి ప్రవేశించటాన్ని తప్పుగా భావించేవారు. అందుకని దైవప్రవక్త (సల్లం) బయటికి వస్తే తమపని పూర్తిచేసుకొని వెళదామని ఇంటి బయటే నిలబడి ఆయన కోసం ఎదురుచూడసాగారు.5

ఖురైషులకు దైవప్రవక్త (సల్లం)తో ఇంత శత్రుత్వం ఉన్నప్పటికీ వారికి ఆయన నిజాయితీపై నమ్మకముండేది. ప్రజలు ధనం, సొమ్ములు ఏవైనా భద్రపరచుకోవాలనుకుంటే ఆయనకే అప్పగించేవారు. ఆ విధంగా అవిశ్వాసులు దైవప్రవక్త ఇంటిని ముట్టడించినప్పటికీ ఆయన దగ్గర ఎంతోమంది ప్రజల అప్పగింతలున్నాయి. ఖురైషుల దురుద్దేశం గురించి ఆయనకు ముందుగానే తెలిసిపోయింది. అంచేత ఆయన హజ్రత్ అలీని పిలిచి, “నాకు హిజ్రత్ ఆజ్ఞ అయ్యింది. నేను ఈ రోజే మదీనాకు బయలుదేరుతున్నాను.6 నువ్వు నా మంచంపై నా దుప్పటి కప్పుకొని పడుకో. తెల్లారిన తరువాత ఎవరి అప్పగింతలు వారికి ఇచ్చేసిరా” అని పురమాయించారు. హజ్రత్ అలీ (రజి) ఖురైషుల ఖడ్గాల నీడలో హాయిగా, కమ్మగా నిద్రపోయారు. మరోవైపు దైవప్రవక్త దేవుని రక్షణలో బయలుదేరారు. అంధమనస్కులైన మక్కా అవిశ్వాసుల కళ్ళల్లో మన్ను కొడుతూ, ‘యాసీన్’ సూరా పఠిస్తూ నెమ్మదిగా అక్కడి నుండి బయట పడ్డారు. ‘దేవుడు ఏడి?’ అని ప్రశ్నించే అవిశ్వాసులు దైవప్రవక్త (సల్లం) కళ్ళ ముందు నుంచి పోతున్నా చూడలేక పోయారు.7 ఈ సంఘటన దైవదౌత్యపు పదమూడవ యేట సఫర్ మాసం 27వ తేదీన గురువారం నాడు (క్రీ.శ. 621 సంవత్సరం సెప్టెంబర్ పన్నెండో తేదీన) జరిగింది.8

హిజ్రత్‌కు రెండ్రోజుల ముందు దైవప్రవక్త (సల్లం) ఒకనాటి మధ్యాహ్నం పూట అబూబక్ర్(రజి) ఇంటికి వెళ్ళి, నియమానుసారం తలుపుతట్టారు. అనుమతి తీసుకున్న తరువాత ఇంట్లోకి ప్రవేశించారు. అబూబక్ర్ (రజి)తో, “కొంచెం మీతో మాట్లాడాలి. మీ ఇంట్లో వాళ్ళందరినీ ప్రక్కకు తప్పుకోమనండి” అన్నారు. “దైవప్రవక్తా! ఇక్కడ తమరి భార్యామణి తప్ప మరెవ్వరూ లేరు (అప్పటికే దైవప్రవక్త (సల్లం)తో హజ్రత్ ఆయిషా వివాహం జరిగివుంది.)” అని అన్నారు.

“నాకు మక్కానుండి వలస వెళ్ళేందుకు అనుమతి లభించింది”

“నా తల్లిదండ్రుల్ని మీకు అర్పింతు. దైవప్రవక్తా! నాకు మీ వెంటవచ్చే భాగ్యం లభిస్తుందా?”

“తప్పకుండా…”

అబూబక్ర్ (రజి) నాలుగుమాసాల నుండి హిజ్రత్ కోసం రెండు ఒంటెల్ని తుమ్మ ఆకులు మేపుతూ సిద్ధం చేసి ఉంచారు. ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోమని దైవప్రవక్త (సల్లం)ను కోరారు. ఆ మానవ మహోపకారి ఎన్నడూ ఎవరి ఉపకారభారమూ మోయదలచుకోలేదు. అందుకే, “ఎంపిక చేసుకుంటాను, కాని మూల్యం చెల్లించి మరీ తీసుకుంటాను” అన్నారు. అబూబక్ర్ అయిష్టంగానే అందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. హజ్రత్ ఆయిషా (రజి అన్‌హా) అప్పటికి చిన్నపిల్లే. ఆమె అక్క అస్మా వారికి ప్రయాణ ఏర్పాట్లు చేసింది. రెండు మూడు రోజులకు సరిపోయే ఆహారాన్ని ఓ గుడ్డలో ఉంచి, తన నడుం కట్టుని చించి దాంతో ఆ అన్నాన్ని మూటకట్టింది. దాంతో ఆ రోజు నుంచి ఆమెకు ‘జాతున్నితాఖైన్’ అనే పేరు పడిపోయింది.9

ఆయన (సల్లం) కాబావైపు ఆఖరిసారి చూస్తూ, “ఓ మక్కా! నువ్వు నాకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన భూమివి. కాని నీ పుత్రులు నన్ను ఇక్కడ ఉండనివ్వటం లేదు” అన్నారు.10 ఆ రోజు రేజీకటిలోనే ఆ ఇద్దరు త్యాగధనులూ మదీనాకు బయలుదేరారు. మక్కా వెలుపల నాలుగైదు మైళ్ళదూరాన ‘సూర్’ అనే కొండగుహ ఉంది. అది చాలా ఎత్తులో ఉంది. అక్కడికి చేరుకోవాలంటే రాళ్ళూ, రప్పల గుండా వెళ్ళాలి. దైవప్రవక్త(సల్లం) పాదాలకు రాళ్ళు గుచ్చుకోసాగాయి. రాళ్ళదెబ్బలకు ఆయన కాళ్ళు విపరీతంగా నొప్పి పెట్టసాగాయి. అబూబక్ర్ దైవప్రవక్తను తన భుజాన్నెత్తుకొని గుహదాకా తీసుకొని వెళ్ళారు. ఆ తరువాత దైవప్రవక్తను బయట కూర్చోబెట్టి తాను గుహలోకి ప్రవేశించి లోపల అంతా శుభ్రం చేశారు. తన ఒంటిమీదున్న బట్టల్ని చించి గుడ్డపీలికలతో గుహలోని రంధ్రాలన్నీ మూసివేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం)ను లోనికి తీసుకువెళ్ళారు.11

తెల్లవారింది. హజ్రత్ అలీ మాములుగానే నిద్రలేచారు. ఖురైషులు దగ్గరికి వెళ్ళి ఆయన్ని గుర్తుపట్టి ‘ముహమ్మద్ ఏడి?’ అని అడిగారు. దానికి హజ్రత్ అలీ, ‘నాకేం తెలుసు. నేనేమైనా ఆయనకు కాపలా ఉన్నానా? మీరే ఆయన్ని వెళ్ళనిచ్చారు. ఆయన హాయిగా వెళ్ళిపోయారు’ అన్నారు వారిని పరిహసిస్తూ. ఖురైషులు క్రోధంతో పశ్చాత్తాపంతో ఏమీ పాలుపోక హజ్రత్ అలీని పట్టుకొని చితకబాదారు. కాబా దగ్గరికి లాక్కొని వెళ్ళి కాసేపు బంధించి ఉంచి, ఆ తరువాత వదిలేశారు.12

హజ్రత్ అస్మా బిన్తె అబూబక్ర్ ఇలా తెలియజేస్తున్నారు. మా నాన్నగారు మదీనాకు వలసవెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఆరువేల రూపాయల నగదు మొత్తం పైసామిగల్చకుండా తీసుకొనివెళ్ళారు. నాన్న వెళ్ళిపోయిన తరువాత మా తాతయ్య అబూ ఖహాఫా నా దగ్గరికొచ్చి, “అమ్మాయి! మీ నాన్న నిన్ను రెండింతలు కష్టానికి గురిచేసి ఉంటాడు. తాను వెళ్ళిపోవటమే గాకుండా ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళి ఉంటాడమ్మా!” అన్నాడు.

“లేదు, తాతయ్యా! నాన్న మా కోసం చాలా డబ్బులు వదలిపెట్టి వెళ్ళారు” అన్నాను నేను.

ఆ తరువాత నేను ఓ రాయిని గుడ్డతో చుట్టి మేము డబ్బులు ఉంచే బిందెలో దాన్ని పెట్టాను. తాతయ్య చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి చూపించాను. మా తాతయ్య గ్రుడ్డివారు. అంచేత ఆ మూటను చేత్తో తాకి, “సర్లే, డబ్బు చాలానే వదలిపెట్టి పోయాడు. ఇక నువ్వు మీ నాన్న గురించి బెంగపడకు. అతను మీకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళుంటాడు” అన్నాడు. మా ముసలి తాతయ్య ఆత్మ తృప్తికోసమే నేనలా చేశాను. నిజానికి మా నాన్నగారు ఇంట్లో ఉన్న ధనమంతా దైవప్రవక్త సేవ కోసం వెంటతీసుకొని వెళ్ళారు.13

మరోవైపు దైవప్రవక్త, అబూబక్ర్‌లిరువురూ మూడురోజుల వరకూ సూర్ కొండగుహలోనే తలదాచుకున్నారు. అబూబక్ర్ కుమారుడు అబ్దుల్లాహ్ రాత్రిపూట గుహలో వారితోపాటే నిద్రపోయేవారు. పగలంతా మక్కాలో తిరిగి ఖురైషుల ప్రయత్నాలను గురించి తెలుసుకొని సాయంత్రానికి ఆ విషయాలన్నీ దైవప్రవక్త (సల్లం)కు తెలియజేసేవారు. కాస్త పొద్దుపోయిన తరువాత అబూబక్ర్ బానిస గుహవైపు గొర్రెల్ని తోలుకొని వచ్చేవాడు. దైవప్రవక్త (సల్లం) అబూబక్ర్‌లు ఆ గొర్రెల పాలు త్రాగి కడుపు నింపుకునేవారు. మూడ్రోజుల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది.14

అటు ఖురైషులు దైవప్రవక్త అన్వేషణలో బయలుదేరారు. ఆయన్ని వెతుక్కుంటూ గుహదాకా చేరుకున్నారు. అబూబక్ర్ వారి అలికిడి విని భయపడుతూ “దైవప్రవక్తా! శత్రువులు మనకు చాలా దగ్గరికి వచ్చేశారు. వాళ్ళల్లో ఎవరైనా మన కాళ్ళవైపు దృష్టిమరల్చితే మనం వాళ్ళ కంట బడటం ఖాయం” అన్నారు. అప్పుడు, దైవప్రవక్త (సల్లం) “దిగులు పడకు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు” అంటూ అబూబక్ర్‌కు ధైర్యం చెప్పారు.15

నాల్గోరోజు దైవప్రవక్త (సల్లం) గుహ నుండి బయలుదేరారు. మదీనా (గతంలోని యస్రిబ్) కు వెళ్ళేదారి చూపించటానికి అబ్దుల్లాహ్ బిన్ ఉరైఖిత్ అనే వ్యక్తికి, కూలి ఇచ్చి తమ వెంట తీసుకొని వెళ్ళారు. అబ్దుల్లాహ్ అవిశ్వాసి అయినప్పటికీ నమ్మకస్థుడు. తాను ముందు నడుస్తూ వారికి దారి చూపించేవాడు. ఆ రాత్రంతా అలాగే ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు. మరునాడు మిట్టమధ్యాహ్నానికి ఎండ బాగా వేడెక్కింది. అబూబక్ర్ మనసులో దైవప్రవక్త(సల్లం) ఇక్కడ ఆగి ఏ నీడలోనయినా కాసేపు సేదతీర్చుకుంటే బాగుంటుందనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒకసారి నలువైపులా కలియజూశారు. ఒక పెద్ద చట్టు బండ ప్రక్కన నీడ ఉన్నట్లు కనిపించింది. వాహనం దిగి నీడున్న చోటుకి వెళ్ళారు. ఆ చోటంతా ఊడ్చి శుభ్రంచేసి తనదగ్గరున్న దుప్పటిని పరచారు. దైవప్రవక్త (సల్లం) దానిపై పడుకున్న తరువాత తాను ఆహార అన్వేషణలో బయలుదేరారు. ఒకచోట ఆయనకు ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని కాస్తూ కనిపించాడు. అతనితో ఏదైనా ఒక గొర్రె పొదుగు శుభ్రపరచమని చెప్పారు. అతను ఒక గొర్రెను తెచ్చి దాని పొదుగును తనచేత్తోనే శుభ్రపరచి ఇచ్చాడు. అబూబక్ర్ ఒక పాత్రలో గొర్రెపాలు పితికి పాత్రలో దుమ్ము, ధూళి పడకుండా ఉండటానికి దానిమూతిని గుడ్డతో కట్టారు. తరువాత దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి పాలలో కాసిన్ని నీళ్ళు కలిపి ఆయనకు సమర్పించారు. దైవప్రవక్త ఆ పాలు సేవించిన తరువాత, “పొద్దుగ్రూకింది. ఒక బయల్దేరుదామా?” అన్నారు. సరేనని ఇద్దరూ అక్కడినుండి ప్రయాణం సాగించారు.16

దైవప్రవక్త (సల్లం) కోసం సురాఖా వేట

మక్కాలో ఖురైషులు ముహమ్మద్(సల్లం)ను గాని లేదా అబూబక్ర్‌ను గాని పట్టితెచ్చినవారికి నూరు ఒంటెల బహుమతి ఇస్తామని చాటింపు వేయించారు. సురాఖా అనేవాడు ఆ నూరు ఒంటెల బహుమతికి ఆశపడి దైవప్రవక్తను వెతికి పట్టుకోవాలని బయలుదేరాడు. దైవప్రవక్త(సల్లం) కూడా సరిగ్గా అప్పుడే ప్రయాణం మొదలుపెట్టిన కారణంగా వాళ్ళు సురాఖా కంటబడ్డారు. సురాఖా వారిని చూడగానే రెట్టింపు ఉత్సాహంతో గుర్రాన్ని పరుగెత్తించి దగ్గరికి చేరుకున్నాడు. కాని అంతలోనే అతని గుర్రం ఎదురుదెబ్బ తగిలి బోల్తా పడిపోయింది. అతను ఒక్క ఉదుటున పైకిలేచి, అంబులపొదినుండి పాచికల్లాంటి బాణాలు తీసి వారిపై దాడి చేయాలా వద్దా అని జోస్యం చూశాడు. ‘వద్ద’ని జవాబొచ్చింది. కాని నూరు ఒంటెల ఆశ అతని ప్రయత్నాన్ని మానుకోనివ్వలేదు. మళ్ళీ గుర్రం మీదకు లంఘించి వారి వెంటపడ్డాడు. దైవప్రవక్త (సల్లం) మాత్రం దివ్యఖురాన్ వాక్యాలు పఠిస్తూ, దైవధ్యానంలో నిమగ్నులై నిక్షేపంగా ముందుకు సాగిపోతున్నారు. ఈసారి సురాఖా గుర్రం మోకాళ్ళ దాకా భూమిలో దిగబడింది. అతను వెంటనే గుర్రం దిగి ఇంకోసారి జోస్యం చూశాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది. రెండుసార్లూ అదే అనుభవం ఎదురవడంతో అతని ధైర్యం సడలింది. ఇవేవో దైవిక సూచనల్లా ఉన్నాయని అతనికి అర్థమయిపోయింది. దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి ఖురైషులు చాటింపు వేయించిన సంగతి వారికి తెలియజేశాడు. తన దగ్గరున్న ధనమంతా దైవప్రవక్త (సల్లం)కు ఇవ్వబోయాడు. కాని దైవప్రవక్త (సల్లం) దాన్ని స్వీకరించటానికి నిరాకరించారు. తమ గురించి ఎవరికీ చెప్పవద్దని మాత్రం కోరారు. ఆ తరువాత సురాఖా దైవప్రవక్తను తనకు శాంతి సందేశం రాసి ఇవ్వమని కోరాడు. హజ్రత్ అబూబక్ర్ బానిస అయిన ఆమిర్ బిన్ ఫుహైరా దైవప్రవక్త అనుజ్ఞతో ఒక తోలుపత్రంపై అతనికి శాంతి సందేశాన్ని వ్రాసి ఇచ్చాడు.17

భాగ్యవంతుడు

గుహనుండి బయలుదేరిన తొలిరోజే దైవప్రవక్త బృందం ఉమ్మెమాబద్ అనే ఓ వృద్ధురాలి గుడారం సమీపం నుండి వెళ్ళింది. ఈ వృద్ధురాలు ఖుజాఆ తెగకు చెందినది. బాటసారులకు సపర్యలు చేసేది. దాహార్తుల దాహం తీర్చేది. బాటసారులు ఆమె గుడారం దగ్గర ఆగి ప్రయాణ బడలిక తీర్చుకొని తిరిగి ప్రయాణం కొనసాగించేవారు. దైవప్రవక్త (సల్లం) కూడా అక్కడ ఆగి “నీ దగ్గర తినే వస్తువులు ఏమైనా ఉన్నాయా?” అని ఆమెను అడిగారు. “ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు. ఒకవేళ ఉండి వుంటే మీరడగక ముందే పెట్టి ఉండేదాన్ని” అని అందామె.

దైవప్రవక్త (సల్లం) గుడారం మూలన ఉన్న గొర్రెను చూచి, “ఈ గొర్రె ఇవ్వాళ మేతకోసం వెళ్ళలేదా?” అని అడిగారు. “ఇది చాలా బలహీనంగా ఉంది, మందతోపాటు నడవలేకపోతోంది” అని చెప్పిందామె.

“మీరు అనుమతిస్తే దీని పాలు పితుక్కుంటాం”

“ఈ గొర్రె పాలివ్వదు. కావాలంటే పితికి చూసుకోండి”

దైవప్రవక్త (సల్లం) ‘బిస్మిల్లాహ్’ అంటూ దాని పొదుగుకు చేతులు తాకారు. ఆమె దగ్గర్నుంచి ఒక పాత్ర తీసుకొని స్వయంగా పాలు పితకసాగారు. పాల పాత్ర నిండిపోవటమేగాక కాసిన్ని పాలు క్రిందికి పొర్లిపోయాయి కూడా. ఆ పాలు దైవప్రవక్త, ఆయన అనుచరులు త్రాగారు. రెండోసారి పాత్రనిండా పాలు పితికారు. ఇవి కూడా ఆయన అనుచరులే త్రాగారు. మూడోసారి మళ్ళీ పాత్రనిండా పితికారు. ఆ పాలు ఉమ్మెమాబద్‌కు ఇచ్చి అక్కడి నుండి ప్రయాణం సాగించారు.

తరువాత ఆమె భర్త వచ్చాడు. గుడారంలో పాలపాత్ర చూసి ఆశ్చర్యపోయి, “ఈ పాలెక్కడివి?” అని అడిగాడు.

“ఇందాక ఇక్కడికి ఓ భాగ్యవంతుడు వచ్చాడు. ఆయన రాక ఫలితమే ఈ పాలు.”

“బహుశా ఆయన నేను వెతుకుతున్న ఖురైష్ వ్యక్తేనేమో! ఆయన ఎలాగుంటాడో కాస్త నాకు చెబుతావా?”

“ఆయన ఎంతో నీటుగా ఉన్నారు. ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. బలిష్టమైన శరీరాకృతి, తేనెలొలికే మాటలు, సంస్కారం ఉట్టిపడుతోంది. మనిషి మరీ అంత లావుగా, మరీ అంత సన్నగా గాకుండా మధ్యరకంగా ఉన్నాడు. పొట్ట బయటకు వచ్చి, తల వెంట్రుకలు చిందరవొందరగా లేవు. నల్లని పద్మాల్లాంటి కళ్ళు. మొహంలో హుందాతనం ఉట్టిపడుతుంది. ఆయన మాట్లాడుతుంటే ముత్యాలు రాలుతున్నట్లుంది. ఆయనతోపాటు ఇంకోవ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ రెండు లేత కొమ్మల్లాగున్నారు. ఆ రెండు లేత కొమ్మల్లో ఒక కొమ్మ తాజాగా ఉండి చూసేవారి కళ్ళను కట్టిపడేస్తున్నది. ఆయన చుట్టూ అనుచరులు ఆయన ఆదేశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞాపించిందే తడవుగా దాన్ని పాలించటానికి పరుగులు తీస్తారు. ఆయన తన అనుచరులకు ఆరాధ్యుడిలా ఉన్నాడు. ఆయన వదరుబోతు కాదు, అలా అని మరీ మితభాషీ కాదు.”

ఈ వర్ణన అంతా విని ఆమెభర్త “ఆయన తప్పకుండా ఖురైష్ మనిషే అయి ఉంటాడు. నేనాయన్ని తప్పకుండా కలుసుకుంటాను” అని అన్నాడు.18

దైవప్రవక్త (సల్లం) యస్రిబ్ వెళుతుండగా దారిలో ఆయనకు బురైదా అస్లమీ కలిశాడు. ఇతను తన తెగకు నాయకుడు. దైవప్రవక్తను పట్టితెచ్చినవారికి నూరు ఒంటెల పారితోషికం ఇస్తామని ఖురైషులు ప్రకటించగా బురైదా ఆ పారితోషికానికి లాలూచీపడి దైవప్రవక్త అన్వేషణలో బయలుదేరాడు. కాని అతను దైవప్రవక్త (సల్లం)కు తారసపడి ఆయనతో సంభాషించిన తరువాత అతను తన డెబ్భైమంది సహచరుల సమేతంగా ఇస్లాం స్వీకరించాడు. తన తలపాగా తీసి ఈటెకు కట్టాడు. అది గాలిలో రెపరెపలాడుతూ శాంతి ప్రదాత, న్యాయ విధాత వస్తున్నాడనే శుభవార్తను అందజేయసాగింది.19

ఆ తరువాత ఆయనకు జుబైర్ బిన్ అవ్వామ్ కలిశారు. ఆయన సిరియా నుండి వస్తున్నారు. ఆయనతో పాటు ముస్లింల వర్తక బిడారు కూడా ఉంది. ఆయన దైవప్రవక్త(సల్లం), అబూబక్ర్‌లకు కానుకగా తెల్లని వస్త్రాలు సమర్పించుకున్నారు.20

మదీనాలో దైవప్రవక్త (సల్లం)కు స్వాగతం

దైవప్రవక్త (సల్లం) వస్తున్నారని మదీనా వాసులకు ముందే తెలిసింది. నగరమంతా కళ్ళు కాయలు చేసుకొని ఆయన రాకకోసం ఎదురుచూడసాగింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో గర్వంతో, ఉత్సాహంతో దైవప్రవక్త (సల్లం) వస్తున్నారని చెప్పుకుంటూ తిరిగేవారు. ప్రజలు పెందలాడే నగరం వెలుపలికి వెళ్ళి దైవప్రవక్త రాకకోసం ఎదురుచూసేవారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసి నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. ఒకరోజు అలాగే మధ్యాహ్నం దాకా ఎదురుచూసి తిరిగి వెళుతుండగా కోటపై నుంచొని ఉన్న ఓ యూదుడు దూరం నుండి ఓ సమూహం రాకను గమనించి అది దైవప్రవక్త బృందమేనని గ్రహించి, గట్టిగా కేకపెట్టి పిలుస్తూ, “… అరబ్బులారా! అదిగో మీరు ఎదురుచూస్తున్న వ్యక్తి వస్తున్నాడు” అని అన్నాడు. ఆ మాట వినగానే నగరమంతా ఒక్కసారిగా ‘అల్లాహు అక్బర్’ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. అన్సార్లు ఆయుధాలు ధరించి ఇండ్లనుండి బయటికి వచ్చారు. అప్పటి వరకూ మదీనాలోని ముస్లింలలో చాలామంది దైవప్రవక్త (సల్లం)ను చూడలేదు. దైవప్రవక్త (సల్లం) అబూబక్ర్(రజి) తో పాటు కలిసి వస్తుండటంతో వాళ్ళిద్దరిలో దైవప్రవక్త ఎవరో మదీనావాళ్ళు పోల్చుకోలేకపోతున్నారు. అబూబక్ర్ (రజి) వారి సందిగ్ధ పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఆయన దైవప్రవక్త (సల్లం)కు గొడుగుపట్టారు. మదీనాకు మూడు మైళ్ళదూరంలో ఎత్తుగానున్న ప్రాంతాన్ని ‘ఆలియా’, ‘ఖుబా’ అని పిలిచేవారు. అక్కడ అన్సార్లకు చెందిన అనేక తెగలుండేవి. వాటిలో అత్యంత ప్రముఖమైన తెగ అమ్ర్ బిన్ ఔఫ్ తెగ. కుల్సూమ్‌బిన్ హదమ్ ఈ తెగకు నాయకులు. దైవప్రవక్త(సల్లం) వారి దగ్గరికి వెళ్ళగానే వారు మితిమీరిన ఆనందంతో ‘అల్లాహు అక్బర్’ అంటూ నినదించారు. దైవప్రవక్త (సల్లం)కు తొలుత అతిథిమర్యాదలు చేసే భాగ్యం ఆ తెగవారికే దక్కింది. ఆయన వారి దగ్గర బసచేశారు. అన్సార్లు తండోపతండాలుగా అక్కడికి వచ్చి గౌరవంతో, వినమ్రతతో ఆయనకు సలాములు చేయసాగారు.21

ఖుబా మస్జిద్ నిర్మాణం

దైవప్రవక్త (సల్లం) ఖుబా ప్రాంతంలో బసచేసిన తరువాత ఆయన మొట్టమొదటగా ఓ మస్జిద్ నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. కుల్సూమ్ దగ్గర కొంత బంజరు భూమి ఉంది. అందులో కుల్సూమ్ తెగవారు ఖర్జూరాలు ఎండబెట్టేవారు. దైవప్రవక్త (సల్లం) ఆ స్థలంలోనే తన పుణ్యహస్తాలతో మస్జిద్ నిర్మాణానికి పునాదివేశారు. ఆ మస్జిద్ గొప్పదనం గురించి దివ్యఖురాన్‌లో ఇలా చెప్పబడింది.

మస్జిద్ నిర్మాణంలో తన అనుచరులతో పాటు దైవప్రవక్త(సల్లం) కూడా పనిచేశారు. పెద్ద పెద్ద బండరాళ్ళను మోసి ఆయన బాగా అలసిపోయేవారు. అప్పుడు అనుంగు అనుచరులు ఆయన దగ్గరికొచ్చి “దైవప్రవక్తా! మా తల్లిదండ్రుల్ని మీకోసం అర్పింతు! మీరు కూర్చోండి ఆ పని మేము చేసుకుంటాం” అనేవారు. ఆయన వాళ్ళ విన్నపాన్ని మన్నించేవారు. కాని కాసేపయిన తరువాత మళ్ళీ రాళ్ళుమోయటం ప్రారంభించేవారు.22 పనిచేస్తున్న వారిలో అబ్దుల్లాహ్ బిన్ రవాహా కూడా ఉన్నారు. ఆయన మంచి కవి. సహచరుల్లో అలసటను తగ్గించటానికి ఆయన పనిచేస్తున్నప్పుడు ‘మస్జిద్ నిర్మించేవాడు, నిత్యం ఖురాన్ పారాయణం చేసేవాడు, రాత్రిళ్ళు జాగారం చేసేవాడు ముక్తి పొందాడు’ అంటూ గీతాలాపన చేసేవారు. దైవప్రవక్త (సల్లం) కూడా ఆయనతో స్వరం కలిపి ఆలాపించేవారు.23

మదీనాలో మొట్టమొదటి జుమా నమాజు

మదీనాకు వలసవచ్చిన తరువాత రబీవుల్ అవ్వల్ పన్నెండో తేదీ శుక్రవారం నాడు దైవప్రవక్త (సల్లం) ఖుబా ప్రాంతం నుండి బయలుదేరి బనూసాలిమ్ తెగవారి ఇండ్ల దగ్గరికి వచ్చేసరికి జుమా ఆరాధనకు సమయమయింది. ఆయన (సల్లం) అక్కడే వందమంది అనుచరులతో పాటు జుమా (శుక్రవారం) నమాజ్ చేశారు. ఇది ఇస్లామీయ చరిత్రలో తొట్ట తొలి జుమా నమాజు.24 ఆ సందర్భంగా దైవప్రవక్త (సల్లం) ప్రజలనుద్దేశించి ఈ విధంగా ఉపన్యసించారు:

“ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. నేను ఆయన్నే స్తుతిస్తున్నాను. సహాయాన్ని, మన్నింపును, సన్మార్గాన్ని ప్రసాదించమని ఆయన్నే వేడుకుంటున్నాను. నేను ఆయన్నే విశ్వసిస్తున్నాను. నేనెన్నటికీ ఆయన పట్ల అవిధేయతకు పాల్పడను. పైగా ఆయన అవిధేయులపట్ల శత్రుత్వానికి పూనుకుంటున్నాను. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ఆయనకు సాటిరాగల వారెవ్వరూ లేరని, ముహమ్మద్ ఆయన దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ముహమ్మద్‌కు సన్మార్గాన్ని, జ్యోతిని, హితబోధను ప్రసాదించి ఎన్నో తరాల తరువాత జ్ఞానం క్షీణించి, మార్గభ్రష్టత్వం పెచ్చరిల్లిన తరుణంలో, ప్రళయం సమీపిస్తున్న కాలంలో పంపాడు. దేవునికి, దైవప్రవక్తకు విధేయత చూపినవాడే సన్మార్గం పొందుతాడు. వారి ఆజ్ఞల్ని ధిక్కరించినవాడు భ్రష్టుపట్టిపోతాడు, అధోగతి పాలౌతాడు, అపమార్గానికి లోనవుతాడు.

“ముస్లింలారా! నేను మిమ్మల్ని దైవానికి భయపడుతూ ఉండమని ఆదేశిస్తున్నాను. ప్రతి ముస్లిం తోటి ముస్లింకు పరలోక జీవితం గురించి ప్రేరేపించాలి. దైవభీతిని అలవరచుకోమని చెప్పాలి. ఒక ముస్లిం సాటి ముస్లింకు చెయ్యగల గొప్పహితబోధ ఇదే! ప్రజలారా! దేవుడు మీకు దూరంగా ఉండమని ఆదేశించిన విషయాలకు దూరంగా ఉండండి. దాన్ని మించిన గొప్పహితవుగాని, దైవధ్యానంగాని మరొకటి లేదు. ఒక విషయం గుర్తుంచుకోండి! దైవానికి భయపడి పనిచేసేవాడికి పరలోక జీవితంలో అతను పాటించిన ‘దైవభీతి’ అతనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆంతరంగికంగాను, బాహ్యపరంగానూ దేవునితో తన వ్యవహారాన్ని చిత్తశుద్ధితో సజావుగా ఉంచుకున్న వాడికోసం ఇహలోకంలో అది ఆరాధనగా పరిణమిస్తుంది. మరణానంతరం దాని పుణ్యం నిక్షేపంగా ఉంచబడుతుంది. కాని అలా చెయ్యనివాడు మరణానంతరం తన ఆచరణలు తనకు దూరంగా ఉండటమే మంచిదనుకుంటాడు. దేవుడు మిమ్మల్ని తన గురించి భయపెడుతున్నాడు. ఆయన తన దాసులపట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు కల్గివున్నవాడు. దైవాజ్ఞల్ని నిజమని ధృవీకరించి, ఆయన వాగ్దానాలను నెరవేర్చేవాడి గురించి చెబుతూ దేవుడు, “మేము ఆడిన మాట తప్పము. మేము మా దాసులకు అన్యాయం చేసేవాళ్ళం కాము” అని అంటున్నాడు.

“ముస్లింలారా! మీరు చేసిన, చేయబోయే పనుల్లో, ఆంతరంగిక, బాహ్యకార్యకలాపాలన్నిటిలో దైవభీతిని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దైవానికి భయపడేవారి పాపాలను మన్నించటం జరుగుతుంది. వారి ప్రతిఫలం వృద్ధి చెందుతుంది. వారు ఉన్నతాశయాలను పొందుతారు. ఈ దైవభీతే మనిషి నుండి దైవవిరక్తిని, దైవశిక్షను, దైవాగ్రహాన్ని దూరం చేస్తుంది. ముఖాన్ని జ్యోతిర్మయం చేస్తుంది. దేవుడు ప్రసన్నుడయ్యేలా చేసి పదోన్నతిని కల్పిస్తుంది. ముస్లింలారా! ధనం సంపాదించండి. కాని దేవుని హక్కుల్ని మాత్రం విస్మరించకండి. దానికోసమే దేవుడు మీకు గ్రంథాన్ని బోధించాడు, సన్మార్గాన్ని చూపించాడు. ఆ విధంగా నిజాయితీపరుల్ని, అసత్యవాదుల్ని వేరుపరచాడు. ప్రజలారా! దేవుడు మీపట్ల ఉత్తమంగా వ్యవహరించాడు. కాబట్టి మీరు కూడా ప్రజలతో అలాగే వ్యవహరించండి. దైవవిరోధుల్ని తమ విరోధులుగా భావించండి. దైవమార్గంలో పూర్తి ఏకాగ్రతతో, ధైర్యంతో పాటుపడండి. ఆ దేవుడే మిమ్మల్ని పుణ్యాత్ములుగా పుట్టించి మీకు ‘ముస్లింలు’ అనే పేరు పెట్టాడు. దానివల్ల చనిపోయేవాడు స్పష్టమైన నిదర్శనాలను చూసి చనిపోతున్నాడు. బ్రతికున్నవాడు కూడా ఆ స్పష్టమైన నిదర్శనాలకు అనుగుణంగానే జీవితం గడుపుతున్నాడు. సత్కార్యాలన్నీ దైవసహాయంతోనే ఉనికిలోకి వస్తాయి. ప్రజలారా! దైవధ్యానం చెయ్యండి. రాబోయే పరలోక జీవితం కోసం మంచిపనులు చేసుకోండి. ఎవరయినా దేవునితో తన వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటే దేవుడు అతనికి-ప్రజలకూ మధ్య జరిగే వ్యవహారాలను చక్కబెడతాడు. జాగ్రత్త! దేవుడు తన దాసులపై అధికారం చెలాయిస్తాడు. కాని దాసులు మాత్రం ఆయనపై ఎలాంటి అధికారాన్ని చెలాయించలేరు. దేవుడు దాసులందరికీ యజమాని. కాని దాసులకు ఆయనపై ఎలాంటి ఆధిక్యం లేదు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. పుణ్యకార్యాలు చేసుకునే శక్తి మనకు ఆ మహోన్నతుని ద్వారానే లభిస్తుంది.25

అబూ అయ్యూబ్ అన్సారీ (రజి) ఇంట్లో బస

దైవప్రవక్త (సల్లం) మదీనా నగరానికి వస్తున్నారని తెలియగానే ప్రజలు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలకటానికి సంతోషంతో పరుగెత్తుకొచ్చారు. ఖుబా నుండి మదీనా వరకు తోవకిరుప్రక్కలా ఆయన ప్రాణానికి ప్రాణం ఇచ్చే అనుచరులు బారులు తీరి నించొని ఉన్నారు. దారిలో ఎన్నో అన్సార్ తెగలు ఎదురయ్యాయి. ప్రతి తెగవారూ ఆయన ముందుకు వచ్చి, “దైవప్రవక్తా! ఈ ఇల్లు, ఈ ధనం, ఈ ప్రాణాలు మీ సేవకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు మా దగ్గరే ఉండిపోండి” అని అభ్యర్థించసాగారు. దైవప్రవక్త (సల్లం) వారి అభ్యర్థనను నగుమోముతో నిరాకరించేవారు. వారికి మేలు జరగాలని ప్రార్థిస్తూ తన ఒంటె ఎక్కడ ఆగితే అక్కడే దిగుతానని, తన ఒంటెకు దేవుని తరపు నుండి ఆదేశం అయ్యిందని చెప్పేవారు. ఆ విధంగా మదీనాలోని ఐదు ప్రముఖ తెగల నాయకులు ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. కాని వారందరికీ ఆయన (సల్లం) అదే సమాధానమిచ్చారు.26 నగర సమీపానికి చేరుకోగానే అమ్మాయిలు ఇండ్ల కప్పుల పైకెక్కి ఆనంద పరవశంతో పాటలు పాడసాగారు.

“పూర్ణచంద్రుడు ఉదయించాడు
వీడ్కోలు కనుమల నుండి
ప్రార్థించేవారు ప్రార్థిస్తున్నంత వరకు
కృతజ్ఞత పాటించటం మనపై విధి”27…

నజ్జార్ తెగ అమ్మాయిలు డప్పు వాయిస్తూ,

“మేము నజ్జార్ తెగ బాలికలం
ముహమ్మద్ ఎంతో మంచి మిత్రులు!”

-అని ఆలాపించసాగారు.

దైవప్రవక్త (సల్లం) ఆ అమ్మాయిలనుద్దేశించి “మీరు నన్ను అభిమానిస్తున్నారా?” అని అడిగారు. వారు ‘అవున’న్నారు. అయితే నేను కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నాను” అని ఆయన(స) అన్నారు.28

ఇప్పటి మస్జిదె నబవీకి ఆనుకొని అబూ అయ్యూబ్ అన్సారీ (రజి) ఇల్లు ఉండేది. దైవప్రవక్త గారి ఒంటె ఆయన ఇంటి ముందే ఆగింది. ఆయన ఇల్లు రెండంతస్థుల కట్టడమవటం చేత పై అంతస్థును ఆయన దైవప్రవక్త (సల్లం)కు సమర్పించుకున్నారు. కాని దైవప్రవక్త (సల్లం) మాత్రం సందర్శకుల సౌలభ్యం కోసం క్రింది అంతస్థులో ఉండటానికే యిష్టపడ్డారు.29

అబూ అయ్యూబ్(రజి) దైవప్రవక్త (సల్లం)కు రెండుపూటలా భోజనం పంపించేవారు. దైవప్రవక్త (సల్లం) తిని వదలిన భోజనాన్ని తను, తన భార్య కలిసి తినేవారు. శుభం కలుగుతుందన్న ఆశతో దైవ ప్రవక్త వ్రేళ్ళ ముద్రలు పడిన చోటే తానూ వ్రేళ్ళు ఉంచి తినేవారు.30

ఒకరోజు అనుకోకుండా పై అంతస్థులో ఓ నీళ్ళపాత్ర పగిలిపోయింది. నీళ్ళు క్రింది అంతస్థులోకి కారి దైవప్రవక్త (సల్లం)కు ఇబ్బంది కలిగే సూచనలు కనిపించాయి. అప్పుడు అబూ అయ్యూబ్ దగ్గర కప్పుకోవటానికి ఉపయోగించే ఒకే ఒక దుప్పటి ఉంది. ఆయన ఆ దుప్పటితోనే నీళ్ళు క్రిందికి జారిపోకుండా తుడిచేశారు.31

మస్జిదె నబవీ ఇంకా ఇతర ఇండ్ల నిర్మాణం

మదీనాకు వచ్చిన తరువాత దైవప్రవక్త (సల్లం)కు అన్నిటికన్నా ముందు ఒక దైవగృహాన్ని నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటి వరకు ఆయన పశువుల కొట్టంలో నమాజ్ చేసేవారు. ధాన్యాగారానికి సమీపంలో నజ్జార్ తెగవారికి చెందిన కొంతభూమి ఉండేది. ఆ స్థలంలో సమాధులు, ఖర్జూర చెట్లుండేవి. దైవప్రవక్త (సల్లం) ఆ తెగ వారిని పిలిచి, “నేనీ భూమిని ధర చెల్లించి తీసుకోవాలనుకుంటున్నాను” అని అన్నారు. దానికి వారు, “మేము దీని ధర తీసుకోవటానికి సిద్ధమే.కాని మీ నుండి కాదు, దేవుని నుండి తీసుకుంటాము” అన్నారు. అసలు ఆ భూమి ఇద్దరు అనాథ పిల్లలది. అంచేత దైవప్రవక్త (సల్లం) ఆ ఇద్దరు పిల్లల్ని పిలిపించారు. ఆ పిల్లలు కూడా తమకున్న ఆ కొంత ఆస్తిని దైవం కోసం విరాళంగా ఇస్తామన్నారు. అనాధ పిల్లల ఆస్తిని విరాళంగా స్వీకరించడానికి దైవప్రవక్త(సల్లం)కు మనసొప్పలేదు. అంచేత అబూ అయ్యూబ్ చేత వారికి దాని పైకం ఇప్పించారు. ఆ స్థలంలో ఉన్న సమాధుల్ని కూల్చి నేలను చదును చేయటం జరిగింది. ఆ తరువాత మస్జిద్ నిర్మాణం మొదలయ్యింది. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) కూడా ఒక కార్మికుడిలా పనిచేశారు. ఆయన అనుచరులు మస్జిద్ కోసం రాళ్ళు మోస్తూ కవితలు పాడేవారు. ఆయన కూడా వారితోపాటు స్వరం కలుపుతూ ఇలా అనేవారు:

“దేవా! పరలోక విజయమే సిసలైన విజయం.
దేవా! ముహాజిర్లపై, అన్సార్లపై దయజూపు32

ఈ మస్జిద్ ఇస్లామీయ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. అందులో ఎలాంటి కృత్రిమ వైభవం గోచరించదు. పచ్చి ఇటుకలతో కట్టిన గోడలు, ఖర్జూర ఆకులతో వేసిన కప్పు, ఖర్జూర చెట్టుమ్రానులే నిట్టరాళ్ళు. అప్పుడు ‘ఖిబ్లా’ బైతుల్ మఖ్దిస్ వైపు ఉండేది.33 ఆ తరువాత కొంతకాలానికి ‘ఖిబ్లా’ కాబావైపుకు మరలించబడినప్పుడు మస్జిదె నబవీకి ఉత్తర దిక్కున ఓ క్రొత్త వాకిలిని నిర్మించడం జరిగింది. మస్జిద్‌లోపల మట్టినేల అవటం చేత వర్షం కురిసినప్పుడు బురద అయ్యేది. ఒకసారి సహచరులు నమాజ్‌కు వచ్చినప్పుడు కంకరమట్టి వెంటతీసుకొచ్చుకొని నేలపై పోసుకొని దానిపై కూర్చొన్నారు. దైవప్రవక్త (సల్లం)కు మట్టినేల కన్నా కంకరనేల నయంగా ఉంటుందనిపించింది. దాంతో ఆయన మస్జిద్‌లోపల అంతా కంకరమట్టి పోయించారు. మస్జిద్ వెలుపల ఒక మూలన పైన పాకవేయబడిన ఒక అరుగుని నిర్మించారు. దాన్ని ‘సుఫ్ఫా’ అనేవారు. నిరాశ్రయులైన ముస్లింలు సుఫ్ఫా నీడలో తలదాచుకునేవారు. మస్జిదె నబవీ నిర్మాణం పూర్తయిన తరువాత ఆయన దాని ప్రక్కనే తన సతీమణులకోసం చిన్న చిన్న కుటీరాలు కట్టించారు. ఆ సమయంలో ఆయన వివాహబంధంలో హజ్రత్ సౌదా (రజి అన్‌హా), హజ్రత్ ఆయిషా (రజి అన్‌హా) మాత్రమే ఉన్నారు. అంచేత రెండు ఇళ్ళే కట్టించారు. ఆ తరువాత సతీమణుల సంఖ్య పెరిగిన కొద్దీ వారికోసం వేర్వేరుగా కుటీరాలు కట్టించేవారు. ఆ కుటీరాలు కూడా పచ్చి ఇటుకలతో చేసినవే. వాటిలో ఐదు కుటీరాలు ఖర్జూర తడికలతో చేసినవి. ఇటుక ఇండ్లలో కూడా గోడలకు బదులు తడికలే ఉండేవి. ఉమ్మె సలమా, ఉమ్మె హబీబా, జైనబ్, జువైరియా, మైమూనా, జైనబ్ బిన్తె జహష్‌ల కుటీరాలు సిరియా దిక్కున ఉండేవి. ఆయిషా, సఫియా, సౌదా (రజి అన్‌హా)ల ఇండ్లు వాటికి వ్యతిరేక దిశలో ఉండేవి. ఈ కుటీరాలు మస్జిదె నబవీకు ఆనుకునే ఉండేవి. దైవప్రవక్త (సల్లం) మస్జిద్‌లో ఏతెకాఫ్ పాటించినప్పుడు ఆయన తన తల (మస్జిద్‌లోనుండి) బయటికి వంచితే సతీమణులు తమ ఇంట్లో కూర్చునే ఆయన తల దువ్వగలిగేవారు. ఈ కుటీరాలు దాదాపు ఆరేడు గజాల వెడల్పు, పది గజాల పొడవు ఉండేవి. మనిషి నిలబడి చేత్తో అందుకోగల అంత ఎత్తులో పై కప్పు ఉండేది. గుమ్మాలకు గొంగళ్ళు వ్రేలాడబడి ఉండేవి.34

దైవప్రవక్త (సల్లం) ఇళ్ళల్లో రాత్రిపూట దీపాలు వెలిగేవి కావు.35 ఆయనకు పొరుగున ఉండే అన్సార్లలో సాద్ బిన్ ఉబాదా. సాద్ బిన్ ముఆజ్, ఉమారా బిన్ హరమ్, అబూ అయ్యూబ్(రజి)లు బాగా ధనవంతులు. వీళ్ళు దైవప్రవక్త(సల్లం)కు పాలు పంపేవారు. ఆయన (సల్లం) ఆ పాలతోనే రోజులు వెళ్ళబుచ్చేవారు. సాద్‌బిన్ ఉబాదా దైవప్రవక్త (సల్లం)కు రాత్రి భోజనం కోసం రోజూ ఓ పెద్ద పాత్ర నిండా ఆహార పదార్థాలు పంపాలని నియమం పెట్టుకున్నారు. దాని ప్రకారం ఆయన అందులో కూరలు, పాలు, నెయ్యి మొదలగు తినే వస్తువులు పంపేవారు.36 అనస్ (రజి) గారి తల్లి అయిన ఉమ్మెసులైమ్ తన ఆస్తిపాస్తులన్నీ దైవప్రవక్త(సల్లం)కు సమర్పించుకుంది. ఆయన వాటిని స్వీకరించి తన దాది అయిన ఉమ్మె ఐమన్‌కు ఇచ్చేసి తాను మాత్రం నిరుపేదగా ఉండటానికే ఇష్టపడ్డారు.37

అజాన్ ఆదేశం

ఇస్లామీయ ఆరాధనలన్నీ ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని బోధిస్తాయి. కాని దైవప్రవక్త (సల్లం) మదీనాకు వచ్చిన తరువాత కూడా ముస్లింలందర్నీ ఏకకాలంలో మస్జిద్‌లో సమీకరించటానికి ఓ నియమిత పద్ధతంటూ లేని కారణంగా అప్పటి వరకు సామూహిక నమాజ్‌కు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. ప్రజలు తమకు తోచినప్పుడు మస్జిద్‌కు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోయేవారు. కాని అందరూ కలిసి సామూహికంగా నమాజ్ చేసేవారు కాదు. దైవప్రవక్త(సల్లం)కు ఈ పద్ధతి నచ్చలేదు. నమాజ్ వేళ అవగానే ప్రజలందరినీ పిలుచుకురావటానికి కొంతమందిని ఆ పనికోసం నియమించాలనుకున్నారు. కాని అది చాలా కష్టమైన పని. అంచేత ఆయన తన అనుచరులందరినీ పిలిచి ఈ విషయంలో తనకు సలహా ఇవ్వమని కోరారు. ఆ సందర్భంగా పలువురు పలువిధాలుగా ఆయనకు సలహాలిచ్చారు. ఒకాయన నమాజ్ వేళ అవగానే మస్జిద్‌పైన ఓ ఎత్తైన జెండా ఎగరేస్తే, ప్రజలు దాన్ని చూసి నమాజ్‌కు వస్తారని తన అభిప్రాయం వెలిబుచ్చాడు. ఆయన(సల్లం)కు ఈ సలహా నచ్చలేదు. యూదులు, క్రైస్తవులు తమ ఆరాధనల కోసం చేసే ప్రకటనల గురించి కూడా ఆ సమావేశంలో చర్చించటం జరిగింది. చివరికి ఆయనకు హజ్రత్ ఉమర్ (రజి) ఇచ్చిన సలహా నచ్చింది. దాని ప్రకారం ఆయన బిలాల్ (రజి)ని ‘అజాన్’ ఇవ్వమని ఆదేశించారు.38 ఈ అజాన్ ద్వారా ప్రజలకు నమాజ్ వేళ అయిందని తెలియపరచటంతో పాటు మరోవైపు రోజుకు ఐదుసార్లు ఇస్లాం ధర్మంవైపుకు పిలుపునిచ్చినట్లవుతుంది.

ముహాజిర్, అన్సార్ల మధ్య సోదర బంధం

మక్కానుంచి మదీనాకు వలస వచ్చిన ముస్లింలు ఖాళీ చేతులతోనే వచ్చారు. అలా వలసవచ్చిన వారిలో ధనికులు కూడా లేకపోలేదు. అయితే అవిశ్వాసులకు కనపడకుండా రహస్యంగా బయలుదేరినందువల్ల తమవెంట ఏమీ తీసుకురాలేకపోయారు. మదీనాలోని అన్సార్లు మక్కానుండి వలసవచ్చిన ముస్లింలందరినీ తమ అతిథులుగా భావించేవారు. అయితే ముహాజిర్ల బ్రతుకుతెరవుకోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరగవలసిన అవసరం ఏర్పడింది. మరోవైపు ముహాజిర్లు అన్సార్ల కానుకలు, దానధర్మాలపై ఆధారపడదలచుకోలేదు. వారు కాయకష్టం చేసి డబ్బు సంపాదించుకోవాలని అభిలషించేవారు. అయితే ప్రస్తుతం వారి దగ్గర ఏమీలేదు. కనీసం తొడుక్కోవటానికి సరిగ్గా ఒక జత బట్టలు కూడా లేవు. అంచేత దైవప్రవక్త(సల్లం) ముహాజిర్లకు, అన్సార్లకు మధ్య సోదరభావాన్ని నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. మస్జిదెనబవీ నిర్మాణం పూర్తవుతున్నప్పుడు ఆయన (సల్లం) అన్సార్లందరినీ పిలిచారు. అప్పటికి హజ్రత్ అనస్(రజి) వయసు పదేండ్లు. ప్రజలంతా వారి ఇంట్లోనే సమావేశమయ్యారు.39 ముహాజిర్లు మొత్తం నలభై ఐదు మంది ఉన్నారు. దైవప్రవక్త(సల్లం) అన్సార్లను సంబోధిస్తూ. “వీళ్ళు మీ సోదరులు” అన్నారు. ముహాజిర్ల నుండి ఒక వ్యక్తి, అన్సార్ల నుండి ఒక వ్యక్తిని పిలిచి “మీరిద్దరూ అన్నదమ్ములు” అని చెప్పేవారు. ఇక ఆపై వాళ్ళిద్దరూ పరస్పరం సొంత అన్నదమ్ముల్లాగానే వ్యవహరించుకునేవారు. అన్సార్లు ముహాజిర్లను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి తమదగ్గరున్న ప్రతివస్తువులో వారికి సగం పంచి ఇచ్చారు.40 అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్‌తో సోదరబంధం ఏర్పడిన సాద్ బిన్ రబీకు ఇద్దరు భార్యలుండేవారు. అబ్దుర్రహ్మాన్‌తో ఆయన “నేను నా ఇద్దరు భార్యల్లో నువ్వు కోరుకున్న ఆమెకు విడాకులిస్తాను. ఆమెను నువ్వు వివాహం చేసుకో” అని అన్నారు. కాని అబ్దుర్రహ్మాన్ పెద్ద మనసుతో దాన్ని నిరాకరించారు.41

అన్సార్ల సంపద అంతా ఖర్జూర తోటల రూపంలోనే ఉండేది. వారిదగ్గర డబ్బులు ఉండేవి కావు. అంచేత వారు తమ ఖర్జూర తోటలను తమ సోదరులకు సమానంగా పంచిపెట్టమని దైవప్రవక్త (సల్లం)ను కోరారు. ముహాజిర్లు వ్యాపారస్తులు. వారికి వ్యవసాయం చేయటం రాదు. అంచేత దైవప్రవక్త (సల్లం) ముహాజిర్ల తరపు నుండి అన్సార్ల విన్నపాన్ని నిరాకరించారు. అప్పుడు అన్సార్లు వ్యవసాయపు పనంతా తామే చేసుకొని, పండిన పంటలో ముహాజిర్లకు సగం ఇస్తామన్నారు. ముహాజిర్లు దానికి ఒప్పుకున్నారు.42 ఆ విధంగా దైవప్రవక్త (సల్లం) వారిమధ్య ఏర్పరచిన సోదరత్వం నిజమైన సోదరత్వంగా విరాజిల్లింది. ఏ అన్సార్ ముస్లిం అయినా చనిపోతే అతని ఆస్తులన్నీ ముహాజిర్ సోదరునికి లభించేవి. అతని సొంత అన్నదమ్ములకు కూడా అతని ఆస్తిలో ఏమీ లభించేది కాదు. ఈ క్రింది దివ్యఖురాన్ సూక్తికి ఆచరణరూపమే అన్సార్-ముహాజిర్ల సహోదరీకరణ:

“విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయినవారూ, అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలనూ, తమ సంపదలనూ ఒడ్డి పోరాడిన వారూ, వలసవచ్చిన వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసినవారూ-వారే అసలు పరస్పరం స్నేహితులు, సంరక్షకులూను.” బద్ర్ యుద్ధం తరువాత ముహాజిర్లు ఆర్థికంగా కాస్త కోలుకున్నారు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది:

అన్సార్లు ప్రదర్శించిన త్యాగాన్ని, ఔదార్యాన్ని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోలేదు. అదిసరే; కాని మరోవైపు ముహాజిర్ల ఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో చూడండి. సాద్ బిన్ రబీ, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్‌తో తన సంపదలో ప్రతి వస్తువు నుండి సగం ఆయనకు తీసుకోమన్నారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఆయన సమర్పణను సున్నితంగా త్రోసిపుచ్చుతూ, “దేవుడు మీ సంపదలో శుభాన్ని ప్రసాదించుగాక! నాకు దాని అవసరం లేదు. మీరు నాకు కాస్త సంతకు వెళ్ళే దారి చూపించండి” అన్నారు. సాద్ బిన్ రబీ ఆయనకు పేరెన్నికగన్న ఖైనుఖా సంతకువెళ్ళేదారి చూపించారు. ఆయన కొంత నెయ్యి, కొంత జున్ను తీసుకొని వెళ్ళి ఆ సంతలో అమ్ముకోవటం ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత బాగా డబ్బు సంపాదించి పెళ్ళికూడా చేసుకున్నారు.44 అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. “ఆ కాలంలో నేను మట్టి పట్టుకున్నా అది బంగారమయ్యేది. నా వ్యాపారంలో అంతటి శుభాన్ని ప్రసాదించాడు దేవుడు” అని ఆయన స్వయంగా చెప్పుకునేవారు. ఆయన వ్యాపార సామగ్రిని ఏడొందల ఒంటెలు మోయవలసి వచ్చేది. ఆయన వ్యాపార సామగ్రి మదీనాకు వచ్చేరోజు నగరమంతా సందడిగా ఉండేది.45 కొంతమంది ముహాజిర్ ముస్లింలు దుకాణాలు పెట్టుకున్నారు.

సునుహ్ ప్రాంతంలో అబూబక్ర్(రజి)గారి పరిశ్రమ ఉండేది. అక్కడ ఆయన బట్టల వ్యాపారం చేసేవారు.46 హజ్రత్ ఉస్మాన్ బనూ ఖైనుఖా సంతలో ఖర్జూరాలు కొని అమ్ముతుండేవారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వ్యాపారం మొదలెట్టారు. ఆయన వ్యాపారం దాదాపు ఈరాన్ దాకా విస్తరించింది.47 ఇతర ముహాజిర్లు కూడా ఇలాగే చిన్నాచితకా వ్యాపారాలు మొదలెట్టారు. సహీహ్ బుఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: అబూహురైరా అతి ఎక్కువగా హదీసులు ఉల్లేఖించటంపై ప్రజలు అభ్యంతరం లేవనెత్తగా అందుకాయన. “ఇందులో నా తప్పేముంది. ఇతర అనుచరులు పొలంపనుల్లో, వ్యాపారాల్లో నిమగ్నులై ఉండేవాళ్లు. నేను మాత్రం దైవప్రవక్త(సల్లం)నే అంటిపెట్టుకొని ఉండి ఆయన హదీసుల్ని వింటుండేవాణ్ణి. అందుకే నాకు అందరికన్నా ఎక్కువగా హదీసులు గుర్తున్నాయి” అని అన్నారు.48

ఖైబర్ విజయం తరువాత ముహాజిర్లు అన్సార్ల ఖర్జూరతోటలను వారికి వాపసు చేసేశారు. సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణంలో ఇలా ఉంది: దైవప్రవక్త(సల్లం) ఖైబర్ యుద్ధం విజయవంతంగా ఎదుర్కొని మదీనాకు తిరిగి వెళుతున్నప్పుడు ముహాజిర్లు, అన్సార్లు తమకు కానుకగా ఇచ్చిన ఖర్జూర తోటలను వారికి తిరిగి ఇచ్చేశారు. అన్సార్లు తమ ఇండ్ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్ని ముహాజిర్లకు ఇళ్ళు కట్టుకోమని ఇచ్చారు. ఖాళీ స్థలాలు లేనివారు తాము నివసించే ఇళ్ళే ఇచ్చేశారు.49 అన్సార్లు ముహాజిర్ల పట్ల మానవ చరిత్రలోనే అరుదైన, అనన్య సామాన్యమైన సానుభూతిని, త్యాగభావాన్ని ప్రదర్శించారు. ముస్లింలు బహ్రైన్‌ను జయించినప్పుడు దైవప్రవక్త (సల్లం) అన్సార్లందరినీ పిలిచి, “నేను ఈ విజయప్రాప్తిని అన్సార్లకు పంచిపెట్టాలని అనుకుంటున్నాను” అని అన్నారు. దానికి వారు, “దైవప్రవక్తా! ముందు మన ముహాజిర్ భాయీలకు కూడా మా దగ్గరున్నంత భూమి ఇవ్వండి. ఆ తరువాతే మేము ఈ విజయప్రాప్తిని తీసుకుంటాం” అని విన్నవించుకున్నారు.50

ఒకసారి ఓ ఆకలిగొన్న వ్యక్తి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి ‘బాగా ఆకలితో ఉన్నాను. అన్నం పెట్టండి’ అని అర్థించాడు. దైవప్రవక్త (సల్లం) ముందుగా తన ఇంట్లో ఏమైనా ఆహారపదార్థాలున్నాయేమోనని అడిగి చూశారు. మంచినీళ్ళు తప్ప మరేమీ లేదని జవాబు లభించింది. అప్పుడాయన తన సహచరులనుద్దేశించి, “ఇతనికి ఈరోజు ఆతిథ్యమిచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు. అబూతల్హా (రజి) లేచి ‘నేనిస్తాను దైవప్రవక్తా’ అని అన్నారు. ఆయన ఆ అతిథిని తన ఇంటికి వెంటబెట్టుకొని వెళ్ళారు. భార్యనడిగితే పిల్లల అన్నం మాత్రం ఉందని చెప్పింది. అప్పుడాయన తన భార్యతో, “ఈ రాత్రికి పిల్లలు అన్నం అడిగితే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నిద్రపుచ్చు. అతిథికి అన్నం వడ్డించిన తరువాత దీపం ఆర్పెయ్యి. మేము కూడా ఆయనతోపాటు అన్నం తింటున్నట్టు నటిద్దాం” అని అన్నారు. ఆయన భార్య అలాగే చేసింది. ముగ్గురూ అన్నానికి కూర్చున్నారు. అతిథికి కడుపునిండా అన్నంపెట్టి ఆ పుణ్యదంపతులు మాత్రం పస్తులుండిపోయారు. వారి ఔదార్యాన్ని కొనియాడుతూ దేవుడు దివ్యఖురాన్‌లో ఈ సూక్తిని అవతరింపజేశాడు:

అరుగు వాసులు

మస్జిదె నబవీ వెలుపల ఓ మూలన ఒక అరుగు ఉంది.52 దైవప్రవక్త సహచరుల్లో చాలామంది ధార్మిక కార్యకలాపాలతో పాటు వ్యాపారం, వ్యవసాయం కూడా చేసేవారు. అయితే కొంతమంది అనుచరులు మాత్రం దైవారాధన, దైవప్రవక్త శిక్షణల కోసం తమ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. వారికి భార్యాబిడ్డలు ఉండేవారు కారు. ఒకవేళ వారిలో ఎవరికయినా వివాహమయితే వారు అక్కడినుండి వేరే చోటుకి వెళ్ళి కాపురం పెట్టుకునేవారు. ఈ అరుగువాసుల్లోనే కొంతమంది పగలు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్ముకునేవారు. వచ్చిన డబ్బుతో భోజన వసతులు సమకూర్చుకునేవారు. వీరు పగటిపూట దైవప్రవక్త సన్నిధిలో ఉండి ఆయన హితోక్తుల్ని వింటుండేవారు. రాత్రిపూట ఆ అరుగుమీదే పడుకునేవారు.53

హజ్రత్ అబూహురైరా (రజి) కూడా ఆ అరుగు వాసుల్లోనివారే. కప్పుకునే దుప్పటి, కట్టుకునే లుంగీ. ఈ రెండు వస్త్రాలు ఉన్నవారు వాళ్ళల్లో ఒక్కడు కూడా ఉండడు. ఓ చిన్న దుప్పటిని మెడలో చుట్టికట్టుకునేవారు. అది తొడలదాకా వ్రేలాడుతూ ఉండేది.54 అన్సార్లు తమ తోటల్లో కాసిన ఖర్జూర గెలలు తెచ్చి అరుగు కప్పుకు తగిలించేవారు. అవి పండి క్రిందపడితే అరుగువాళ్ళు వాటిని ఏరుకొని తినేవాళ్ళు. ఒక్కోసారి రెండేసి రోజుల వరకూ తినడానికి ఏమీ దొరికేది కాదు. దైవప్రవక్త (సల్లం) నమాజ్ చేయిస్తున్నప్పుడు వీళ్లు వెనుక పంక్తుల్లో నించొని ఉండి ఆకలివల్ల, బలహీనతవల్ల నమాజులోనే కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. ప్రజలు వాళ్ళను అలా పడిపోవటం చూసి పిచ్చోళ్ళనుకునేవారు.55 దైవప్రవక్త (సల్లం) దగ్గరికి ఎవరైనా ఏదయినా సదఖా (దానం చేసిన) ఆహారం పంపిస్తే ఆయన ఆ ఆహారమంతా అరుగువాళ్ళకే ఇచ్చేవారు. అదే ఏమైనా కానుకలు వస్తే వారిని తన దగ్గరికి పిలిపించుకొని తాను కూడా వారితోపాటు కలిసి తినేవారు.56 సాధారణంగా దైవప్రవక్త (సల్లం) అరుగువాళ్ళను రాత్రిపూట భోజనానికి ముహాజిర్ల, అన్సార్ల వెంట పంపించేవారు. ప్రజలు తమ తాహతును బట్టి వాళ్ళల్లో ఒక్కర్నిగాని, ఇద్దర్నిగాని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించేవారు.57 హజ్రత్ సాద్‌బిన్ ఉబాదా పెద్ద ధనికులే కాదు, గొప్ప దాత కూడాను. ఒక్కోసారి ఆయన ఎనభై ఇంకా అంతకన్నా ఎక్కువ మంది నిరుపేదల్ని కూడా తన ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేయించేవారు.

దైవప్రవక్త (సల్లం) ఏ సందర్భంలోనూ అరుగువాళ్ళను విస్మరించేవారు కారు. ఒకసారి ఆయన కూతురు ఫాతిమా (రజి అన్‌హా) ఆయన దగ్గరికొచ్చి, “పనిచేసి చేసి నా చేతులు కాయలు కాశాయి. దయచేసి ఒక సేవకురాలు ఇప్పించండి నాన్నా!” అని కోరారు. దానికాయన “ఉన్న కాస్త సొమ్ము నీకిచ్చేస్తే పాపం అరుగువాళ్ళు ఏమైపోవాలి”?! అని అన్నారు.58 సాధారణంగా అరుగువాళ్ళు రాత్రిళ్ళు ఆరాధనలోనే గడిపేవారు. ఖురాన్ పారాయణం చేసేవారు. వారికి ఓ గురువు ఉండేవాడు. వారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ధార్మిక పాఠాలు నేర్చుకునేవారు. అందుకే వీరిలో చాలామందిని ‘ఖారీ’ లని పిలుస్తారు. ఇస్లాం ధర్మ ప్రచారం నిమిత్తం ఎవరినన్నా పంపాలనుకున్నప్పుడు వీరినే పంపడం జరిగేది. మవూనా యుద్ధ సందర్భంలో అరుగువాళ్ళల్లో నుంచే డెబ్భైమందిని ప్రజలకు ఇస్లాం ధర్మం బోధించే నిమిత్తం పంపటం జరిగింది.59

ఫుట్‌నోట్‌లు

  1. 1జాదుల్ మఆద్ మూడవ సంపుటి 49వ పుట. రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 82వ పుట.
  2. 2సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 477వ పుట. బైహఖీగారి దలాయిలున్నుబువ్వా గ్రంథం రెండవ సంపుటి 522వ పుట.
  3. 3సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 467, 468 పుటలు.
  4. 4ముస్తద్రక్ హాకిమ్ రెండవ సంపుటి 435వ పుట. ఇమామ్ జహబీ ఈ ఉల్లేఖనాన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.
  5. 5సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 480వ పుట.
  6. 6హిజ్రత్ ఆదేశం దైవప్రవక్త (సల్లం)కు దేవుని తరపు నుండి ఇవ్వబడింది. సహీహ్ బుఖారీలో దీని ప్రస్తావన ఉంది. అందులో మహిమోన్నతల ప్రకరణం చూడండి.
  7. 7ముస్నదె అహ్మద్ మొదటి సంపుటి 348వ పుట. ముసన్నఫ్ అబ్దుర్రజ్జాఖ్ ఐదవ సంపుటి 389వ పుట.
  8. 8సీరతున్నబీ మొదటి సంపుటి 270వ పుట. రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 85వ పుట
  9. 9సహీహ్ బుఖారీ, అన్సార్ల మహిమోన్నతల ప్రకరణం
  10. 10ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ దారిమి, ఇబ్నెమాజాలు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’ ‘గరీబ్’ కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.
  11. 11ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 6వ పుట. దలాయిలున్నుబువ్వా రెండవ సంపుటి 477వ పుట. జహబీగారి అస్సీరతున్నబవియ్యా గ్రంథంలో 221వ పుట. రహ్మతుల్లిల్ ఆలమీన్ మొదటి సంపుటి 85వ పుట.
  12. 12తారీఖె తబ్రీ మొదటి సంపుటి 568వ పుట.
  13. 13సీరత్ ఇబ్నె హిషామ్ మొదటి సంపుటి 488వ పుట.
  14. 14సహీహ్ బుఖారీ: అన్సార్ల మహిమోన్నతల ప్రకరణం.
  15. 15సహీహ్ బుఖారీ: ప్రవక్త సహచరుల మహిమోన్నతల ప్రకరణం
  16. 16సహీహ్ బుఖారీ: ప్రవక్త సహచరుల మహిమోన్నతల ప్రకరణం
  17. 17సహీహ్ బుఖారీలోని మహిమోన్నతల ప్రకరణం
  18. 18ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి తొమ్మిదోపుట. తబఖాత్ ఇబ్నె సాద్ మొదటి సంపుటి 230వ పుట. జాదుల్ మఆద్ మూడవ సంపుటి 56వ పుట.
  19. 19జహబీగారి అస్సీరతున్నబవియ్యా 228వ పుట.
  20. 20సహీహ్ బుఖారీలోని మహిమోన్నతల ప్రకరణం.
  21. 21సహీహ్ బుఖారీ మహిమోన్నతల ప్రకరణం. తబఖాత్ ఇబ్నెసాద్ మొదటి సంపుటి 233వ పుట.
  22. 22వఫావుల్ వఫా – తబ్రానీ సౌజన్యంతో – మొదటి సంపుటి 180వ పుట.
  23. 23వఫావుల్ వఫా మొదటి సంపుటి 181 వ పుట. ఇబ్నె అబీషైబా సౌజన్యంతో
  24. 24బైహఖీగారి దలాయిలున్ను బువ్వా రెండవ సంపుటి 500వ పుట. జాదుల్ మఆద్ మూడవ సంపుటి 59వ పుట.
  25. 25తారీఖె తబ్రీ రెండవ సంపుటి 807వ పుట.
  26. 26దలాయిలున్నుబువ్వా రెండవ సంపుటి 503, 504వ పుట.
  27. 27దలాయిలున్న బువ్వా రెండవ సంపుటి 506, 507వ పుట
  28. 28దలాయిలున్న బువ్వా రెండవ సంపుటి 508వ పుట; ఫత్‌హుల్ బారీ ఏడవ సంపుటి 261వ పుట.
  29. 29ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 460వ పుట. ఇమామ్ జహబీ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 498 వ పుట.
  30. 30సీరత్ ఇబ్నెహిషామ్ మొదటి సంపుటి 499వ పుట.
  31. 31ముస్తద్రక్ హాకిమ్ మూడవ సంపుటి 460వ పుట.
  32. 32సీరతున్నబీ మొదటి సంపుటి 280, 281వ పుటలు. సహీహ్ బుఖారీ, అబూదావూద్ సౌజన్యంతో.
  33. 33జాదుల్ మఆద్ మూడవ సంపుటి 63వ పుట.
  34. 34అల్లామా షిబ్లీ నూమానీగారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 281, 282 పుటలు. తబఖాత్ ఇబ్నెసాద్ మరియు వఫావుల్ వఫా సౌజన్యంతో
  35. 35సహీహ్ బుఖారీ నమాజ్ ప్రకరణం
  36. 36తబఖాత్ ఇబ్నెసాద్ మహిళల ప్రకరణం 112వ పుట
  37. 37సహీహ్ బుఖారీలోని స్వయం సమర్పణ ప్రకరణం
  38. 38సహీహ్ బుఖారీ అజాన్ ప్రకరణం. సహీహ్ ముస్లిం ఇంకా ఇతర ప్రామాణిక గ్రంధాలలో కూడా ఈ సంఘటన ప్రస్తావనకు వచ్చింది.
  39. 39జాదుల్ మఆద్ మూడవ సంపుటి 63వ పుట.
  40. 40షిబ్లీ గారి సీరతున్నబీ గ్రంథం మొదటి సంపుటి 245వ పుట. ఇబ్నె హిషామ్ గారి సీరత్ గ్రంథం మొదటి సంపుటిలో 504 నుండి 507 పుటల వరకు.
  41. 41సహీహ్ బుఖారీ మహిమోన్నతల ప్రకరణం
  42. 42సహీహ్ బుఖారీ, మహిమోన్నతల ప్రకరణం
  43. 43సహీహ్ బుఖారీ వ్యాఖ్యానాల ప్రకరణం
  44. 44సహీహ్ బుఖారీ మహిమోన్నతల ప్రకరణం
  45. 45అసదుల్ గాబా మూడవ సంపుటి 314, 315వ పుటలు
  46. 46తబఖాత్ ఇబ్నెసాద్ రెండవ సంపుటి 120వ పుట.
  47. 47ముస్నదె అహ్మద్‌లో వీటి ప్రస్తావన ఉంది.
  48. 48సహీహ్ బుఖారీ, విద్యా ప్రకరణం
  49. 49సహీహ్ ముస్లిం: జిహాద్ ప్రకరణం
  50. 50సహీహ్ బుఖారీ అన్సార్ల మహిమోన్నతల ప్రకరణం
  51. 51సహీహ్ బుఖారీ అన్సార్ల మహిమోన్నతల ప్రకరణం
  52. 52వఫావుల్ వఫా మొదటి సంపుటి 321వ పుట
  53. 53సహీహ్ బుఖారీ నాయకత్వ ప్రకరణం
  54. 54సహీహ్ బుఖారీ మొదటి సంపుటి 114వ పుట. హుల్‌యతుల్ ఔలియా మొదటి సంపుటి 341వ పుట.
  55. 55సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం
  56. 56సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం
  57. 57సహీహ్ బుఖారీలోని వ్యవధుల ప్రకరణం
  58. 58సుననె బైహఖీ తొమ్మిదో సంపుటి 304వ పుట. ముస్నదె అహ్మద్ మొదటి సంపుటి 79, 106 పుటలు
  59. 59సహీహ్ ముస్లిం: నాయకత్వ ప్రకరణం